Saturday 6 June 2015

Bones - Harmons

హార్మోన్లు తగ్గితే ఎముకలు బలహీనం

  • -
వయసు పైబడ్డాక కంటిచూపు మందగించడం, వినికిడి లోపం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఆడ,మగ ఎవరికైనా తప్పవు. అయితే, మహిళలకు ముఖ్యమైన శత్రువు ‘ఆస్టియోపోరోసిస్’ అని వ్యవహరించే గుల్ల ఎముకల వ్యాధి. ఈ జబ్బు కారణంగా ఎముకలు పలుచబడి లోపలికణాలు బలహీనమై, తేలికగా అవి దెబ్బతినే అవకాశం వుంటుంది. సాధారణంగా స్ర్తిలకు మెనోపాజ్ అనేది 45-50 ఏళ్ల వయసులో సహజం. మహిళల్లో రుతుక్రమం ఆగిపోవడం వల్ల అండాశయంలో అండాలు తగ్గిపోయి క్రమంగా మాయమైపోతాయి. ఈస్ట్రోజన్ అనే స్ర్తి హార్మోన్ విడుదల కావడం ఆగిపోతుంది. ఎముకల్లో ‘ఈస్ట్రోజన్ రిసెప్టార్లు’ అనే ప్రదేశాలుంటాయి. ఈస్ట్రోజను ఆగిపోగానే శరీరంలో కాల్షియం శాతం తగ్గిపోతుంది. రక్తంలో కాల్షియం పడిపోగానే ఎముకల్లోని కాల్షియం వేగంగా రక్తంలోనికి వెళ్లిపోతుంది. దాంతో ఎముకలు పటుత్వం కోల్పోయి గుల్లబారిపోతాయి. కాలి ఎముకలు, వెన్నుపూస వంటివి శరీర భారాన్ని మోస్తాయి గనుక అవి మెత్తబడి వంగడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. ఎవరికైనా తుంటి ఎముక విరిగితే మంచంలో నెలల తరబడి మగ్గిపోవాల్సి రావడం మనం చూస్తూంటాం. ఇలాంటి వారిలో కాల్షియం మరింతగా తగ్గిపోయి ఇతర అనారోగ్యాలు సైతం సంభవిస్తుంటాయి.
మెనోపాజు దశలోకి వచ్చినప్పటికీ కొంతమంది మహిళల్లో మాత్రమే ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంది. అలాంటి వారిని ‘హైరిస్క్’ కేటగిరీగా వైద్యులు పరిగణిస్తారు. ఎముకలు బలహీనపడడానికి ఎన్నో కారణాలున్నాయి.
పాలు, ఆకుకూరలు, ప్రొటీన్లు, ఇతర పోషకాలు లోపిస్తే ఎముకల వ్యవస్థ గట్టిగా తయారుకాదు. ఇలాంటి వారికి ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
వ్యాయామానికి దూరంగా ఉండేవారిలో, స్థూలకాయుల్లో ఎముకలు గట్టిగా వుండవు.
ఎండ తగలకుండా ఉండేవారిలో విటమిన్-డి, కాల్షియం తక్కువగా ఉంటూ ఎముకలు బలహీనంగా ఉంటాయి.
నలభై ఏళ్లు నిండకముందే మెనోపాజు వచ్చినవారికి ఈస్ట్రోజను తక్కువై, ఫలితంగా ఎముకలు దృఢంగా ఉండవు.
గర్భాశయం, ఓవరీలు తొలగించినవారికి, పిసిఓడి అనే జబ్బు వున్నవారికి, లివరు వ్యాధి, కిడ్నీ జబ్బులు వున్నవారికి ఎముకలు గుల్ల బారే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.
కొన్ని రకాల మందులు అంటే- స్టెరాయిడ్సు, థైరాయిడ్ మందు, మూర్ఛ నివారణ మాత్రలు చాలా కాలం వాడేవారికి ఆస్టియోపోరోసిస్, తద్వారా ఎముకలు విరగడం జరుగుతుంది. కాగా, యాంటీ కొయాగులెంట్సు- అంటే రక్తం గట్టకట్టకుండా వాడే మందులు, సుగరు వ్యాధికి వాడే మందులు, బిపికి వాడే మందుల వల్ల కూడా ఎముకలు బలహీన పడతాయని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది.
హార్మోన్లు, ఈస్ట్రోజను హార్మోనుకు విరోధంగా ప్రొజిస్టిరాన్ మందులు చాలాకాలం వాడకూడదు.
అధిక రక్తస్రావం అరికట్టడానికి స్ర్తిలు పిల్సు వాడడం మంచిది. ఒకవేళ ఆపరేషను అవసరమైనా కొద్దినెలలు పిల్సు (ఓ.సి. పిల్సు) వాడాక సర్జరీ చేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని నెలలు ఫామిలీ ప్లానింగు పిల్సు వాడి ఆపేసినా దాని లాభం రెండు రకాలు. మొదటిది ఎముకలు గట్టిపడటం, రెండవది ఓవరీ కాన్సరు రాకుండా రక్షణ కలగడం. ఈ రక్షణ 10-15 సంవత్సరాల వరకూ వుంటుందని శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు. ఎముకలు గుల్ల బారే వ్యాధి నుంచి తప్పించుకునేందుకు మహిళలు తరచూ ఆరోగ్య తనీఖీలు చేయించుకుని, కాల్షియం, విటమిన్ ‘డి’ పరిమాణం, బోన్ డెన్సిటీ గురించి తెలుసుకోవాలి. అనారోగ్య సమస్యలకు ఏయే రకాల మాత్రలు ఎంతకాలంగా వాడుతున్నారో వంటి విషయాలు వైద్యులకు చెప్పాలి. అన్ని వయసుల ఆడవారూ నిత్యం వ్యాయామం చేస్తుండాలి. వయసు పైబడిన మహిళలు కింద కూర్చొని లేచేటప్పుడు చేయి ఆనించి శరీర భారాన్ని దానిపై మోపరాదు. కుదుపుల ప్రయాణాలు చేయకూడదు. బరువులు ఎత్తకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వృద్ధాప్యంలో ఎముకలు విరగకుండా కాపాడుకోవచ్చు. *

No comments:

Post a Comment