Wednesday 3 June 2015

ఈ నాలుగూ మిస్‌ అవ్వొద్దు.. (21-May-2015)

మండే ఎండలను తట్టుకోలేక రకరకాల పండ్లు, జ్యూస్‌లు తాగి ఉపశమనం పొందుతుంటాము. అయితే ఎన్ని పండ్లు తింటున్నా.. ఈ నాలుగు పండ్లను మాత్రం మిస్‌ అవ్వకండి. ఎందుకంటే వేసవిలో అత్యంత మేలు చేసే గుణాలు వీటిలో పుష్కలం...
 
పైనాపిల్‌: ‘బ్రొమిలైన్‌’ అనే ఎంజైమ్‌ కలిగిన పండ్లు తక్కువ. అది పైనాపిల్‌లో ఉంటుంది. శరీరంలోని కొవ్వుల్ని, ప్రొటీన్లను త్వరగా అరిగేందుకు సహాయపడుతుందీ ఎంజైమ్‌. ఇక, పైనాపిల్‌లో విటమిన్లు, ఖనిజాలకైతే కొదవ లేదు. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, కాల్షియం, పాస్పరస్‌, పొటాషియం వంటివీ అధికం. ఈ పండు జలుబుకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఎముకల పటిష్టానికీ తోడ్పడుతుంది. పళ్లు మరింత గట్టిపడేందుకు ఉపకరిస్తుంది.
 
పుచ్చకాయ: అత్యధిక పీచు, నీళ్లు కలిగిన పండ్లలో తిరుగులేనిది వాటర్‌మిలాన్‌. ఎండాకాలం వడదెబ్బ కొట్టకుండా కాపాడటంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. మరీ ముఖ్యమైన ప్రయోజనం ‘లైకోపిన్‌’ అనే ఔషధగుణం కలిగి ఉండటం. మండే ఎండలకు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది లైకోపిన్‌. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్‌, విటమిన్‌ ఎ, బి6, సి, కాల్షియం, పీచు ఒకే పండులో ఇన్నేసి పోషకాలు దొరకడం పుచ్చకాయతోనే సాధ్యం. జుట్టు రాలడం, అజీర్తి, కనుచూపు మందగింపు వంటి సమస్యలను తగ్గిస్తుందీ పండు. గుండె జబ్బులను అడ్డుకునే శక్తి కూడా దీనికుంది.
 
కొబ్బరి నీళ్లు తాగేందుకు రుచిగా అనిపించవు కాని.. ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. ఏ ఇతర పండ్లు అందించనన్ని మేళ్లు ఇది అందిస్తుంది. ఎండాకాలంలో దప్పిక తీరేందుకు ఆత్రంతో శీతలపానీయాల జోలికి వెళుతుంటారు కాని.. వాటికి బదులు కొబ్బరి నీళ్లు తాగితేనే దాహం తీరుతుంది. ఆ ప్రయోజనానికి తోడు వేడి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోటైట్లు సమకూరుతాయి. శరీరం కూడా వెంటనే చల్లబడుతుంది. తక్షణశక్తితో పుంజుకోగలం. మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి కొబ్బరి నీళ్లు. కిడ్నీలో రాళ్లను కూడా ఏర్పడనీయవు. యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ను రానివ్వవు. రక్తంలో ప్లాస్మా తగ్గకుండానూ చూస్తుంది కొబ్బరి. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గనివ్వదు.
 
మామిడి: తీయతీయటి మామిడి తినందే వేసవి మజా అనిపించదు. వేసవిలో మాత్రమే దొరికే ఈ పండ్లను మిస్‌ అవ్వకూడదు. పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ రారాజే! ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఈ రోజుల్లో ఎక్కువమందిని భయపెడుతున్న క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే గుణం మామిడికి ఉంది. కొలోన్‌, బ్రెస్ట్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్లను వీలైనంత వరకు రానివ్వదు మామిడి. వీటితోపాటు కొవ్వును తగ్గించగలిగే మరో మంచి గుణం ఈ పండు సొంతం. చర్మసౌందర్యానికి, కనుచూపు మెరుగుదలకు చక్కటి సహాయకారి.
సోపు గింజలతో షర్భత్‌ 

నోటిని శుభ్రం చేసుకోవటానికి సోపు గింజలను వాడుతూ ఉంటారు. దీని వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుందని ఆయిర్వేద నిపుణులు పేర్కొంటూ ఉంటారు.
జీర్ణశక్తిని పెంచటంతో పాటుగా, వేసవిలో వేడికి ఇది మందులా పనిచేస్తుందని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా గుజరాత్‌లో సొపుతో చేసి షర్భత్‌కు వేసవిలో చాలా డిమాండ్‌ ఉంటుంది. ఈ షర్భత్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు : సొపు గింజలు- పావుకప్పు, పటిక బెల్లం- రెండున్నర చెంచాలు, నీళ్లు- రెండున్నర కప్పులు, లవంగం- ఒకటి.
చేసే విధానం : సోపు గింజలను, లవంగాన్ని పొడి చేయాలి. ఈ పొడిని కనీసం రెండు గంటలు నీటిలో నానపెట్టాలి. ఆ మిశ్రమాన్ని వడబోసి, సోపుగింజల పొడి ముద్దను వేరు చేయాలి. మిశ్రమంలో పటిక బెల్లం పొడిని కలపాలి. దీనిని ఐస్‌ క్యూబ్స్‌తో కలిపి సర్వ్‌ చేయాలి. దీనిలో నిమ్మరసం వేసుకుంటే చాలా బావుంటుంది. కొందరు మిరియాల పొడిని కూడా ఈ మిశ్రమంలో కొద్దిగా కలుపుతారు.

No comments:

Post a Comment