Tuesday 12 May 2015

Sinus in summer

వేసవిలో సైనస్

కొన్ని రకాల వ్యాధులు కొన్ని కాలాలకే పరిమితమై ఉంటాయి. అలాంటి వాటిలో ‘సైనసైటిస్‌’ ఒకటి. 
అయితే కేవలం వానాకాలం,శీతాకాలాల్లోనే బాధించే ఈ రుగ్మతవేసవిలోనూ విజృంభిస్తోంది. ఇందుకు 
వాతావరణ మార్పులతోపాటు జీవనశైలికూడా కారణమంటున్నారు సీనియర్‌ ఈన్‌టి హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జన్‌ 
డా. కె.వి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.కె. శాస్ర్తి.
 
పుర్రెలో ఖాళీలెందుకు?
మన పుర్రెలో ముక్కు పక్కన, నుదురు దగ్గర ఉండే 4 జతల గాలి గదులే..‘సైనస్‌’. ఈ గాలి గదుల వల్ల మనకు 3 ఉపయోగాలున్నాయి. పుర్రె మొత్తం ఎముకలతో నిండి ఉంటే మెడ ఆ బరువును మోయటం కష్టం కాబట్టి పుర్రెను తేలికపరచటం కోసం సహజసిద్ధంగానే ఈ గాలి గదులు ఏర్పడ్డాయి. అలాగే ఈ సైనస్‌లలో నిండుకున్న గాలి వల్లే మన స్వరం శ్రావ్యంగా ధ్వనిస్తుంది. ఈ గాలి గదుల వల్ల ఉన్న మరో ముఖ్యమైన ప్రయోజనం ఎయిర్‌ కండిషనింగ్‌. అంటే మనం పీల్చే అతి చల్లని లేదా అతి వేడి గాలిని శరీరానికి అనుకూలమైన ఉష్ణోగ్రత దగ్గరకు ఈ గాలి గదులు మార్చేసి ఊపిరితిత్తుల్లోకి పంపిస్తాయి. పీల్చుకునే గాలి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు.
సైనసైటిస్‌ అంటే?
ముఖంలోని గాలి గదుల్లో వాపునే వైద్య పరిభాషలో ‘సైనసైటిస్‌’ అంటారు. ఈ వాపే కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌గా మారే అవకాశాలూ ఉంటాయి. ఈ ఇన్‌ఫెక్షన్లలో ‘ఎక్యూట్‌ సైనసైటిస్‌’, ‘క్రానిక్‌ సైనసైటిస్‌’ అనే రెండు రకాలుంటాయి. ఈ రెండిట్లో లక్షణాలు తలెత్తే కాలం, బాధించే వ్యవధి మారుతూ ఉంటుంది. అయితే ముఖంలో ముక్కుకి రెండు పక్కల, నుదుటి దగ్గర నొప్పి, ముక్కు బిగదీయటం, జలుబు, తల బరువుగా ఉండటం, జ్వరం వచ్చినట్టు అనిపించటంలాంటి లక్షణాలు రెండు రకాల సైనసైటిస్‌లలోనూ కనిపిస్తాయి. సాధారణంగా ఎవరికైనా జలుబు చేసినప్పుడు మందులు వాడి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు జలుబు ఆ మందులతో తగ్గిపోవచ్చు. లేదా తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టొచ్చు. ఇలా పదే పదే జలుబు వేధిస్తుందంటే సైనసైటిస్‌ ఉన్నట్టుగా భావించాలి.
పుష్కర స్నానంతో ‘సైనసైటిస్‌’
కలుషిత నీటి వల్ల కూడా సైనసైటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. నదుల్లో మునగటం, పుష్కర స్నానాలు చేయటం వల్ల ఈ కలుషిత నీరు ముక్కులోకి చేరి ఇన్‌ఫెక్షన్‌ సైనస్‌లలోకి చేరుతుంది. దాంతో సైనసైటిస్‌ విడవకుండా బాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో న్యుమోనియా కూడా తలెత్తే అవకాశాలుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే నదుల్లో మునగకుండా మగ్గుతో ఆ నీళ్లను తల మీద పోసుకోవటం మేలు. అలాగే ఎక్కువ మంది మునిగే స్నాన ఘాట్‌లకు దూరంగా నీళ్లు స్వచ్ఛంగా కనిపించే ప్రాంతంలో మునగాలి. 
 
ఎక్యూట్‌ సైనసైటిస్‌: ఈ రకమైన సైనసైటిస్‌లో రాత్రికి రాత్రే లక్షణాలు కనిపిస్తాయి. ఈ రుగ్మత కనీసం 3 వారాలపాటు ఉంటుంది. ఎక్యూట్‌ సైనసైటిస్‌ ఎక్కువ సందర్భాల్లో వైరస్‌ వల్ల వస్తుంది. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా రావొచ్చు. అయితే వైరస్‌ వల్ల వచ్చే సైనసైటిస్‌ సాధారణంగా 3 లేదా 4 రోజుల్లో తగ్గిపోతుంది. దీన్నే మనం జలుబు అంటూ ఉంటాం. అయితే మనం జలుబు అనుకునే సాధారణ రుగ్మత కూడా సైనసైటిస్‌ అయిఉండే అవకాశాలుంటాయి. ఈ రుగ్మతలో ముక్కు నుంచి నీరును పోలిన లేదా పసుపుపచ్చని ద్రవం కారుతూ ఉంటుంది. ముక్కులు పట్టేస్తాయి. సైనస్‌లలో చేరిన ఇన్‌ఫెక్షన్‌నుబట్టి ముఖంలో నొప్పి ఉంటుంది. ముక్కు వెనక గొంతు భాగంలో ‘పోస్ట్‌ నాసల్‌ డిస్చార్జ్‌’ ఉండటం. ఈ డిస్చార్జ్‌ ఊపిరితిత్తుల్లోకి చేరి దగ్గు రావటంలాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
క్రానిక్‌ సైనసైటిస్‌: 3 వారాల నుంచి 3 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం విడవకుండా సైనస్‌ లక్షణాలు వేధిస్తుంటే దాన్ని క్రానిక్‌ సైనసైటిస్‌గా భావించాలి.
వేసవిలో సైనసైటిస్‌కి కారణాలు
ప్రస్తుతం వేసవిలో కూడా సైనసైటిస్‌ కనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా కొన్ని సామాజిక అంశాల గురించి చెప్పుకోవాలి.
అవేంటంటే...
  • క్రమేపీ పెరుగుతున్న జన సాంద్రత: పెద్ద జన సమూహాల్లో తిరగుతున్నప్పుడు క్రాస్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకరి నుంచి మరొకరికి తేలికగా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది.
  • పెళ్లిళ్లు, ఇతర వేడుకలు: ఈ సందర్భాల్లో తక్కువ ప్రదేశంలో ఎక్కువమంది పోగవటం మూలంగా ఇన్‌ఫెక్షన్లు తేలికగా ప్రబలుతాయి.
  • సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, కళ్యాణ మంటపాలు: ఇలాంటి జనసమ్మర్ధ ప్రదేశాలు కూడా సైనసైటిస్‌ వ్యాప్తికి కారణమే!
  • ఎయిర్‌ కూలర్స్‌: కూలర్స్‌లో నీటిని మార్చకపోవటం. నిల్వ నీటినే ఉపయోగిస్తూ ఉండటం వల్ల ఆ నీరు కలుషితమై ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలుంటాయి. అలాగే కూలర్‌లో ఉపయోగించే మ్యాట్స్‌లో ఫంగస్‌ చేరి ఫంగల్‌ సైనసైటిస్‌ వస్తుంది.
  • ఎసిలు: ఉష్ణోగ్రతను విపరీతంగా తగ్గించుకోవటం. 17 లేదా 18 డిగ్రీలకు తగ్గించుకుంటే వాతావరణం చల్లబడి ముక్కులు బిగదీసి జలుబు చేయటం. ఈ సాధారణ జలుబే కొద్ది రోజుల్లో సైనసైటిస్‌గా మారొచ్చు.
  • తరచుగా ఊర్లు తిరగటం: వృత్తిరీత్యా లేదా వేసవి సెలవల్లో ఊర్లు మారటం వల్ల కొత్త రకం బ్యాక్టీరియావల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురికావటం.
  • కూల్‌డ్రింక్స్‌, చల్లని నీరు తాగటం: ఎలర్జీ తత్వం ఉన్నవాళ్లు వేసవిలో ఈ పానీయాలు తాగటం వల్ల అలర్జిక్‌ రైనైటిస్‌, అలర్జిక్‌ సైనసైటిస్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
  • సముద్ర, నదీ తీర ప్రాంతాలు: ఈ ప్రాంతాల్లో తేమ ఎక్కువ. దాంతో అలర్జీలు కూడా ఎక్కువగా బాధిస్తాయి. పైగా ఈ ప్రాంతాల్లో ఇన్‌ఫెక్షన్లు తేలికగా ప్రబలుతాయి.
  • వేసవిలో వానలు: వేసవిలో వర్షాలు కురిసినప్పుడు ఉష్ణోగ్రతలో చోటుకోసుకునే విపరీతమైన మార్పుల వల్ల కూడా సైనస్‌లు ప్రభావితమవుతాయి.
సైనసైటిస్‌ ఎవరికెక్కువ?
సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే అలర్జీ తత్వం ఉన్నవాళ్లనే సైనసైటిస్‌ ఎక్కువగా బాధిస్తుంది. కాలుష్యం, దుమ్ము, పొగ, చల్లని వాతావరణం, చల్లని పదార్థాలు...వీటి వల్ల అలర్జీకి గురయ్యేవారు సైనసైటిస్‌కు కూడా తేలికగా గురవుతారు. తేమతో కూడిన ప్రాంతాలకు కూడా అలర్జీ తత్వం ఉన్న వ్యక్తులు దూరంగా ఉంటే మంచిది.
చికిత్సలు ముఖంలోని గాలి గదుల్లో ఉండే మ్యూకస్‌ లైనింగ్‌ సైనస్‌లు, ముక్కు రంథ్రాలను తేమగా ఉంచుతుంది. ఈ సైనస్‌ల దార్లన్నీ ముక్కుకి కనెక్ట్‌ అయి ఉంటాయి. దాంతో పీల్చుకునే గాలి వల్ల ఈ గదుల్లో చేరుకునే మ్యూకస్‌ ఎప్పటికప్పుడు ముక్కు ద్వారా బయటికి వెళ్లిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాపు లేదా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా సైనస్‌లు వ్యాధి బారిన పడతాయో అప్పుడు వీటి ద్వారాలు మూసుకుపోతాయి. దాంతో సైనస్‌లలో చేరుకున్న బ్యాక్టీరియా, వైరస్‌లు మరింత వృద్ధి చెంది సైనస్‌లు కఫంతో నిండిపోయి మొండి ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తాయి.
 
వ్యాధి నిర్థారణ
సైనసైటిస్‌ లక్షణాలతో రోగి వైద్యుల్ని సంప్రదించినప్పుడు సమస్య తీవ్రత, కాల వ్యవధి, జీవన శైలి గురించి వైద్యులు ఆరా తీస్తారు. అలాగే నొప్పి ప్రదేశం, తీవ్రతలనుబట్టి సైనస్‌ వ్యాప్తి, ఉధృతిని అంచనా వేస్తారు. కన్ను, చెవి నొప్పులను కూడా పరిగణలోకి తీసుకుని ఇన్‌ఫెక్షన్‌ ఎంత మేర వ్యాపించిందో లెక్క వేస్తారు. ముక్కు, గొంతు, చెవుల్ని పరీక్షించి అక్కడున్న వాపును వైద్యులు పరిశీలిస్తారు. సైనస్‌ల ద్వారాలు వాచి ఉన్నాయా? ఎర్రగా కందిపోయి ఉన్నాయా? ఎంత మేరకు మూసుకుపోయాయి? అనే విషయాలు కూడా ప్రత్యక్షంగా పరీక్షించటం ద్వారా వైద్యులు కనిపెడతారు.
సైనస్‌ ఎండోస్కోపీ: ఈ పరీక్ష ద్వారా సైనస్‌ల పరిస్థితిని వైద్యులు తెలుసుకోగులుగుతారు. ఎటువైపు సైనస్‌లు ఎంత మేరకు మూసుకుపోయాయి? వాటిలో ఎలాంటి డిస్చార్జ్‌ ఉంది? ముక్కు వెనక భాగంలో కఫం కారుతోందా?లాంటి విషయాలను ఈ పరీక్షతో తెలుసుకోవచ్చు.
నోటి పరీక్ష: అలాగే గొంతు, శ్వాసనాళం ఎలా ఉంది? టాన్సిల్‌ ఇన్‌ఫెక్ట్‌ అయ్యాయా లేదా అనే విషయాలను నోటిని పరీక్షించి తెలుసుకోవచ్చు.
ఊపిరితిత్తుల పరీక్ష: కొందరికి ఏ చిన్న ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. కాబట్టి సైనసైటిస్‌తో ఉన్న రోగి ఊపిరితిత్తులను కూడా వైద్యులు తప్పనిసరిగా పరీక్షిస్తారు.
ఎక్స్‌ రే: ఛాతీ, సైనస్‌ల ఎక్స్‌ రే ద్వారా కఫం పరిమాణం కచ్చితంగా తెలుస్తుంది. సైనస్‌లలో నిండుకున్న కఫం, చీము కొలతనుబట్టి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను వైద్యులు కచ్చితంగా అంచనా వేయగలుగుతారు.
సైనస్‌ కల్చర్‌: ఎండోస్కోపీ ద్వారా స్రావాన్ని సేకరించి కల్చర్‌ చేసి ఇన్‌ఫెక్షన్‌ కారకాన్ని గుర్తించి తదనుగుణ చికిత్సను అందిస్తారు.
సిటి స్కాన్‌: పదే పదే సైనసైటిస్‌ పునరావృతమవుతుంటే రుగ్మతను క్షుణ్ణంగా తెలుసుకోవటం కోసం ఈ పరీక్ష ఉపరిస్తుంది.
చికిత్స: సైనసైటిస్‌ చికిత్స ప్రధానంగా నోటి మందులతోనే సాగుతుంది. లక్షణాలు తక్కువగా ఉండి, పసుపు పచ్చని కఫం లేకుండా కేవలం ముఖంలో నొప్పి, ముక్కు దిబ్బెడ, జలుబు, కొద్ది జ్వరం ఉంటే నొప్పి తగ్గటానికి యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ మందులను వైద్యులు సూచిస్తారు. అలాగే ముక్కులో వాపు తగ్గించటం కోసం నాసల్‌ డీకంజెస్టెంట్స్‌ను కూడా వైద్యులు సూచిస్తారు. వీటిని వాడటం వల్ల మూసుకుపోయిన సైనస్‌ ద్వారాలు తెరుచుకుంటాయి. రోజులో వీలైనన్ని ఎక్కువసార్లు ఆవిరి పట్టమని కూడా చెబుతారు. ఎక్కువ సమయంపాటు తక్కువసార్లు ఆవిరి పట్టేకంటే తక్కువ సమయంపాటు రోజులో ఎక్కువసార్లు ఆవిరి పట్టడం మేలు. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్‌లు తెరుచుకుని వాటిలో చేరుకున్న కఫం కరిగి ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది. దాంతో వాపు, నొప్పి తగ్గుతాయి. కొందరిలో ముక్కు దూలం వంకరగా ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో డీవియేటెడ్‌ నాసల్‌ సెప్టమ్‌ అంటారు. ఇలా ఉంటే తరచుగా సైనస్‌లు ఇన్‌ఫెక్సన్‌కు గురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు సర్జరీతో ముక్కు దూలాన్ని సరిచేస్తారు. సాధారణంగా క్రమం తప్పక సూచించిన మోతాదులో యాంటీబయాటిక్స్‌ 5 రోజులపాటు వాడితే సైనసైటిస్‌ అదుపులోకొస్తుంది. తీవ్రతనుబట్టి ఈ మందులనే వారం నుంచి 3 వారాలపాటు వాడాల్సిన అవసరం కూడా రావొచ్చు. ఈ ముందులోపాటు వైద్యులు సూచించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే...
  • విశ్రాంతి తీసుకోవాలి. సూచించిన ముందుల మోతాదును సూచించిన కాలపరిమితిలోపు వాడాలి.
  • రోజులో ఎక్కువసార్లు ఆవిరి పట్టాలి. చల్లని పదార్థాలకు, వాతావరణానికి దూరంగా ఉండటం.
  • అలర్జీ తత్వం ఉన్న వాళ్లు దాన్ని తగ్గించే మందులను క్రమంతప్పక వాడాల్సి ఉంటుంది.
  • సైనసైటిస్‌ రాకుండా ముందు జాగ్రత్తలు
  • పీల్చే గాలి శుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇందుకోసం ఆస్పత్రులు మొదలుకుని జన సమ్మర్ధం ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
  • ఫిజికల్‌ ఫిటనెస్‌ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కాబట్టి క్రమంతప్పక వ్యాయామం చేయాలి.
  • చల్లని వాతావరణానికి, పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • కాలుష్యంతో, రసాయనాలతో నిండిన ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ
సైనసైటిస్‌ సమస్య సర్జరీకి దారితేసే పరస్థితులు ఎంతో అరుదు. సాధారణంగా సమర్ధమైన యాంటిబయాటిక్స్‌తో సైనసైటిస్‌ను నివారించవచ్చు. అయినా అతి కొద్దిమందిలో ఈ సమస్య వదలకుండా పీడిస్తూనే ఉంటుంది. ఎక్యూట్‌ సైనసైటిస్‌ నుంచి క్రానిక్‌ సైనసైటిస్‌కి మారి నెలలు గడుస్తున్నా తగ్గనప్పుడు తప్పనిసరి పరస్థితుల్లో సర్జరీ చేయవలసి ఉంటుంది. లేదా ఎక్యూట్‌ సైనసైటిస్‌లో కంటికి ఇన్‌ఫెక్షన్‌ చేరుకుని ఆర్బిటల్‌ సెల్యులైటిస్‌ అనే సమస్య తలెత్తినప్పుడు కూడా సర్జరీ చేయవలసిరావొచ్చు. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్‌ మెదడుకు కూడా పాకుతుంది. ఆ పరిస్థితిని మెనింగ్జైటిస్‌ లేదా బ్రెయిన్‌ యాప్సిస్‌ అంటారు. అలాంటప్పుడు ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ చేసి సైనస్‌లలో చేరుకున్న చీమును తొలగిస్తారు. ఈ సర్జరీ వల్ల ఒరిగే ఫలితం 40 శాతమే! మిగతా 60 శాతం ఫలితం సాధించాలంటే సర్జరీ తర్వాత వైద్యులు సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించాలి. మందులతోపాటు నాసల్‌ డూషింగ్‌ చేయాలి. కనీసం 3 నెలలపాటు క్రమంతప్పక ముక్కును నీటితో శుభ్రం చేసుకుంటూ ఉంటే అక్కడ చేరుకునే ఇన్‌ఫెక్షన్‌, సర్జరీ తాలూకు స్రావాలు పూర్తిగా తొలగిపోయి సైనసైటిస్‌ తిరగబెట్టే అవకాశాలు అడుగంటుతాయి.
 
జలుబు తగ్గించే మందుల వల్ల నష్టమే ఎక్కువ
సాధారణంగా జలుబు చేయగానే కోల్డ్‌యాక్ట్‌లాంటి జలుబు తగ్గించే మందులు వేసుకుంటూ ఉంటాం. ఈ మందుల వల్ల కఫం చిక్కబడుతుంది. గొంతు పొడిగా మారిపోతాయి. జలుబు చేసినప్పుడు కఫం పలుచబడి తేలికగా వెలుపలికి వచ్చేలా చేయాలేగానీ చిక్కబడి ఎండిపోయే మందులు వాడకూడదు. కఫం నిల్వ ఉండిపోతే ఇన్‌ఫెక్షన్‌ మరింత పెరిగిపోతుంది. కాబట్టి జలుబు చేసినప్పుడు సొంత వైద్యం మానుకోవాలి.

No comments:

Post a Comment