|
హర్యానాలో మహిళల సంఖ్య తక్కువ. అయితే లింగ వివక్ష ఎక్కువ. అలాంటి చోట మహిళలను ఎంతో ఉన్నతంగా చూసే సంస్కృతి ఒకటి ఉండేదని తెలిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. కానీ ఇది నిజం. హర్యానాలోని హిస్సార్‌లో ఉన్న అతి పెద్ద హరప్పా సైట్ అయిన రాఖిగర్హిలో జరిగిన తవ్వకాల్లో ఈ విషయం బయటపడింది. ఆనాటి సమాధుల్లో స్త్రీ, పురుష అస్థిపంజరాలను ఉంచిన తీరు, వాటి చుట్టూ అమర్చిన రకరకాల పరికరాలను పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడింది. ఈ తవ్వకాలను భారత పురావస్తుశాఖ అధికారులు చేపట్టారు. 5,500 ఏళ్ల కిందట మానవ జీవనశైలికి అద్దంపట్టే శిథిలాలు ఈ తవ్వకాల్లో దొరికాయి. వాటి ద్వారా ఆనాటి స్త్రీలు అందుకున్న గౌరవమర్యాదలు, అప్పటి సమాజంలో వారు పొందిన ఉన్నత స్థానం ఎంతటిదో తెలిసింది. 1997-2003 మధ్యకాలంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) ఇక్కడ తవ్వకాలను చేపట్టింది. ఆ తవ్వకాలలో దొరికిన శిథిలాల ఆధారంగా ఒక నివేదికను పురావస్తు విభాగం అధికారి తయారుచేశారు. అందులో పలు ఆశ్చర్యకరమైన విషయాలను పేర్కొన్నారు. రాఖిగర్హి తవ్వకాల్లో బయటపడ్డ సమాధుల్లో సీ్త్రపురుష అస్థిపంజరాలు దొరికాయి. ముఖ్యంగా ఆడవాళ్ల అస్థిపంజరం చుట్టూ మట్టితో చేసిన రకరకాల వస్తువులు ఉండడం గమనించారు. విశేషమేమిటంటే చనిపోయిన పురుషుల మృతదేహాల పక్కన పెట్టిన వస్తువుల కన్నా సీ్త్రల మృతదేహాల పక్కన పెట్టిన వస్తువులు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి. అంతేకాదు స్త్రీ పట్ల వారికున్న గౌరవానికి ప్రతీకగా మరణించిన స్త్రీల శరీరాల దగ్గర ఎత్తుపీటపై ఉంచిన పళ్లాల నుంచి రకరకాల పాత్రలు, బీకరు, మధ్యస్థంగా ఉన్న చిన్న కుండలు, కూజాలు వంటి వెన్నో ఉన్నాయి. ఈ వస్తువులన్నీ అప్పటి ఆడవారి ఆధిక్యాన్ని వెల్లడిస్తాయి. ఆడవాళ్ల సమాధుల్లో పెద్ద సైజులో ఉన్న గాజులు కూడా దొరికాయి. వాటిపై కనిపించిన కొన్ని గుర్తులను బట్టి ఆనాటి ఆడవాళ్లు భారీ పనులను సైతం చేసేవారని తెలుస్తోంది. ఇంటిపనులతోపాటు బయట పనులను కూడా చేసేవారట. పనిసామర్థ్యంలో మగవాళ్లకు ఏమాత్రం తీసిపోయేవారు కాదట. మంచి శారీరక దారుఢ్యంతో ఉండేవారట. మరొక ఆసక్తికరమైన విశేషమేమిటంటే చనిపోయిన తర్వాత ఆడవాళ్లకు అంతిమసంస్కారాలు నిర్వహించేటప్పుడు వారిపట్ల గౌరవసూచకంగా పాటించాల్సిన సంప్రదాయాలేవీ వితంతు స్త్రీలకు చేసేవారు కాదు. అంతిమ సంస్కారాలను వైదిక పద్ధతిలోనే చేసేవారు. అంతేకాదు చనిపోయిన వారి మృతదేహాల పక్కన జంతువులకు సంబంధించిన ఎముకలు కూడా ఉండడం చూస్తే చనిపోయినవారి గౌరవార్థం జంతువులను కూడా ఆనాటికాలంలో సమర్పించుకునేవారని తెలుస్తోంది. రిటైర్డ్ డిజి (ఆర్కియాలజీ) డాక్టర్ అమరేంద్రనాథ్ ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలపాటు పరిశోధనలు చేసి నివేదిక తయారుచేశారు. అందులో ఈ విషయాలను పేర్కొన్నారు. ఆయన పరిశోధనలు చేసేటప్పుడే 12 కు పైగా అస్థిపంజరాలు సైట్‌లో బయటపడ్డాయి
|
No comments:
Post a Comment