శరీర పోషణ , ఇతర ఆరోగ్య విషయాల్లో ఎన్ని జాగ్రత్తలైనా తీసుకోవచ్చు. కానీ, నిద్ర ఒకటి కరువైతే తీసుకున్న ఏ జాగ్రత్తలూ పెద్ద ప్రయోజనాన్నివ్వవు. అందుకే నిద్రలేమి సమస్య మీద దశాబ్దాల కాలంగా ఎంతో తీవ్రమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్కో పరిశోధన ఈ సమస్యనుంచి విముక్తి పొందడానికి ఎంతో కొంత ఉపయోగపడుతోంది. అదే క్రమంలో మన ముందుకొచ్చిన ఈ కొత్త పరిశోధనా ఫలితాల్ని ఒకసారి గమనించండి...
అసలే నిద్ర పట్టకపోవడం ఒక సమస్య అయితే, నిద్రపట్టినట్టే పట్టి పదే పదే మెలకువ రావడం మరో సమస్య. పదే పదే మెలకువ వచ్చే వాళ్లల్లో తామసలు నిద్రేపోలేదన్న భావనే ఉంటుంది. దీనికి మెదడులోని న్యూరాన్లు కొన్ని అదృఽశ్యమైపోవడమే కారణమని ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో బయటపడింది. ప్రత్యేకించి వయసు పైబడిన వారికి నిద్రపట్టకపోవడానికి లేదా పదేపదే మెలకువ రావడానికి గల కారణాల్లోకి వెళితే పలురకాల అంశాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా వయసు పైబడుతున్నప్పుడు శరీరమంతా సమాచారాన్ని చేరవేసే నరాల కణసంపత్తిని మెదడు కోల్పోతుంది. కొంత మంది శాస్త్రవేత్తల బృందం 1997 నుంచే ఒక సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నది. అందులో భాగంగా 65 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్న వారిని వారి మరణించే దాకా పరిశీలిస్తూ వచ్చారు. అదే క్రమంలో రోగగ్రస్తులైన వారి మెదడును కూడా అధ్యయనం చేశారు. అందులో వారు మెదడులోని కొన్ని విభాగాల్లో ఉండవలసిన న్యూరాన్లకన్నా తక్కువగా ఉండడం వారు గమనించారు. ప్రత్యేకించి, హైపోథలామిక్ వెంట్రోలేటరల్ ప్రియాప్టిక్ న్యూస్లస్‌లకు వీరి నిద్రా సమస్యలకు సంబంధం ఉన్నట్లు వీరు కనుగొన్నారు. ఈ వివరాలన్నింటినీ 7 నుంచి 10 రోజుల పాటు రిస్ట్‌బాండ్ పరికరం ద్వారా రికార్డు చేశారు. ఇదే విభాగంలో నిద్రాభంగం చేసే కొన్ని న్యూరాన్లను కూడా వారు కనుగొన్నారు. ఇలా న్యూరాన్లు తగ్గిపోవడం అన్నది అల్జీమర్ వ్యాధిలో కూడా కనిపిస్తుంది. అంతకు ముందు జరిగిన పరిశోధనల్లో కూడా మెదడులో సరిపడా న్యూరాన్లు లేని స్థితిలో నిద్ర స్థిరంగా ఉండడం సాధ్యం కాదని స్పష్టమయ్యింది. నిద్రలేమి సమస్యకు ఒకటిరెండు కాదు వందలాది కారణాలు బయటపడుతున్నాయి. ఇదే తరహా పరిశోధనల్లో ఇప్పుడు ఈ కొత్త విషయం వెలుగు చూసింది. ఏమైనా నిద్రను నిలకడగా ఉంచడంలో న్యూరాన్ల పాత్ర కీలమకమన్న విషయం స్పష్టమయ్యింది. ఈ పరిశోధనా ఫలితాల వ వల్ల నిద్రలేమి సమస్యను, ఆల్జీమర్ వ్యాధి చికి త్సలో వైద్య రంగం ఎంతో పురోగతి సాధించే అవకాశం మాత్రం కచ్ఛితంగా ఉంటుంది. వచ్చిన వైద్యఫలితాల్ని వచ్చినట్టే అంది పుచ్చుకుంటే గాఢమైన నిద్ర, నిండైన ఆరోగ్యం మన సొంతమవుతాయి
No comments:
Post a Comment