Wednesday 20 August 2014


ఆఖరి కోరిక (కథ)

  • -డా అల్లంసెట్టి చంద్రశేఖర రావు
  •  

..............................................
భయం...
ఒకటే భయం...
మృత్యుభయం...
ఎనభై ఏళ్ళ ముసలాడికి మృత్యుభయం. తక్కువ వయసేం కాదు. తన తోటివాళ్ళంతా చనిపోయారు. కొందరు మంచం పట్టి కుటుంబాన్ని బాధించి మరీ చచ్చారు. అదృష్టవంతులు హార్టు ఎటాక్‌తో చనిపోయారు. చనిపోయేముందు వాళ్ళంతా ఇల్లు చక్కబెట్టుకొన్నారు. ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేశారు. ఎవరికి చెప్పవలసింది వాళ్ళకి చెప్పి మరీ చనిపోయారు. తాను కూడా ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇచ్చేశాడు. అన్నీ సెటిల్ చేసేశాడు, కానీ, ఒక విషయం చెప్పవలసింది వుంది. తన మనసులోని మాట చెప్పాలి. తన ఆఖరి కోర్కె తీర్చమని చెప్పాలి. తనకు ఇవి చివరి క్షణాలు... ఒకటే బాధ. తన బాధ ఎవరికి తెలుసు..? గుండెలో సూదులు గుచ్చుతున్నంత నొప్పి, ఆయాసం. ఊపిరి రావడం లేదు. ముక్కు మూసుకుపోయింది. గుండెలపై పెద్ద బరువున్నట్లు ఫీలింగ్. గుండెలు పిండేస్తున్నంత నొప్పి. కాళ్ళు లాగేస్తున్నాయి. తన గోడు ఎవరూ వినిపించుకోవడం లేదు. తాను చావుకు భయపడడం లేదు. కానీ, చనిపోయేముందు తాను చెప్పవలసినవి కొన్ని వున్నాయి. ఇంతకుముందే చెప్పాలనుకొన్నాడు. అపశకునం మాట్లాడకూడదని వూరుకొన్నాడు. ఎప్పుడో రాబోయే చావు గురించి- ఆరోగ్యంగా హాయిగా తిరుగుతున్నప్పుడు చెప్పి పిల్లల మనసులు బాధపెట్టడం ఎందుకని ఇన్నాళ్ళూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలని వున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు.
సాయంకాలం తన భార్య ఒకసారి పలకరించింది. తన నుంచి జవాబు లేదు. ‘నీరసమై వుంటుంది, పడుకున్నారు... భోజనానికి లేస్తారులే’ అని ఆమె ఆలయానికి వెళ్లిపోయింది. అక్కడ పూజలు. తరవాత గీతాపారాయణం, ధార్మికోపన్యాసాలూ అయిన తరవాత ఇంటికి వస్తుంది. అప్పటికి తొమ్మిది దాటిపోతుంది.
‘‘నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసినా...’’ అని తను చావుని ఆహ్వానిస్తున్నాడు. తన చావు గురించి ఆలోచిస్తుంటే కళ్ళంట నీళ్ళొస్తున్నాయి. అరవై ఏళ్ళుగా తనతో జీవితాన్ని పంచుకొన్న భార్య, కంటికి రెప్పలా చూసుకొనే కొడుకు, కోడలు, ‘‘తాతగారూ, తాతగారూ..’’ అంటూ చుట్టూ తిరిగే మనవలు. ఐనా ఏదో వెలితి. తను అందర్నీ వదిలి వెళ్లిపోతున్నాడు. ‘‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..’’ లేదు.. లేదు.. ఏనాడో తాను ఈ రాగబంధాలను తెంచుకొన్నాడు. భార్యాభర్తలమధ్య అనోన్యత పోయింది. ఆమె భక్తిమార్గం పట్టింది. తను ఒంటరివాడైపోయాడు. ఐనా ఏదో మమకారం.
తన మరణానంతరం- తను ఇక లేడని మిత్రులకు తెలియడం కోసం పేపర్లో ఒక యాడ్, ఫొటోతో సహా ఇస్తే చాలు. అది అవసరం. వాళ్ళు ఇకముందు ఫోన్లు చెయ్యరు, ఉత్తరాలు రాయరు. తన మరణానంతరం ఏ విధమైన శ్రాద్ధ కర్మలూ చెయ్యకూడదు. తద్దినాలు పెట్టకూడదు. తనను అందరూ మరచిపోవాలి. కాలప్రవాహంలో మంచివీ, చెడ్డవీ అన్నీ కరిగిపోతాయి. కనుమరుగైపోతాయి.
కోడలు టీవీలో సీరియల్ చూసుకొంటూ వుంది. కార్టూన్ ఛానల్ పెడతామంటూ తల్లి చేతి నుండి రిమోట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు.
‘‘హోమ్ వర్కు చేశారా? చదువుకోండమ్మా. ఈ టి.వి పిచ్చి మీకేమిటర్రా’’. అంది.
‘‘నువ్వు చూస్తే తప్పులేదు గానీ మేం చూస్తే తప్పా..?’’ పిల్లాడు అడిగాడు. వాడు యుకెజి చదువుతున్నాడు.
‘‘ఈ సీరియల్ అయిపోయిన తరవాత చూసుకోండి. అందాకా హోమ్‌వర్కు చెయ్యండి.
‘‘అప్పుడు ఈ ప్రోగ్రాం రాదు. ఈ ప్రోగ్రాం చూసి హోమ్‌వర్కు చేసుకొంటాం’’ అంది అమ్మాయి.
అమ్మాయ ఫిఫ్తు స్టాండర్డు చదువుతోంది. కొంతసేపు జరిగిన వాదనలో పిల్లలే నెగ్గినా, వయస్సు, అధికారంతో తల్లే గెల్చింది. పిల్లలు ఏడుపు ముఖం పెట్టారు.
సీరియల్‌లో ఎడ్వర్‌టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. ‘‘బాబూ... తాతగారిని భోజనానికి రమ్మనురా..’’ అంది తల్లి.
మనవడు మంచం దగ్గరకొచ్చి ‘‘తాతగారూ.. తాతగారూ.. అమ్మ భోజనానికి రమ్మంటోంది’’. అంటూ గట్టిగా పిలిచాడు.
తన వద్దకు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వారితో మాట్లాడాలి. తన అభిప్రాయాలు చెప్పాలి. ఎవరూ రాలేదు. ‘‘ఆకలిగా లేదురా తాతా, మీ అమ్మను ఒకసారి రమ్మను’’. అన్నాడు తను.
మనవడు మళ్లీ మళ్లీ పిలిచాడు. ‘‘తాతగారు లేవడం లేదమ్మా..’’.
‘‘సరే ఒక అరగంట తరవాత లేపుదాం...’’
కోడలు మళ్లీ సీరియల్ చూడడంలో మునిగిపోయింది. సీరియల్ అయిపోయిన తరవాత ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్లింది. కొంతసేయిన తరవాత సెల్‌లో మాట్లాడడం ప్రారంభించింది. ఎంతకీ ఆ మాటలు తరగవు. పిల్లలు టీవీ చూసుకొంటున్నారు. తను మనవరాలిని, మనమడిని,కోడల్ని పిలిచాడు. తను కేకలు వేసి పిలుస్తున్నా ఎవరూ పలకరు. ఏమిరా.. ఈ ఖర్మ...? ఎవరూ పలకరు. ఎంత పిలిచినా పలకరు. ఎంత నిరాదరణ. తనకు భయంగా వుంది.
‘‘సీ ఎన్ ఓల్డ్ అన్‌హేపీ బుల్
స్లౌచింగ్ ఇన్ ది అండర్ గ్రోత్
ఆఫ్ ది ఫారెస్ట్ బ్యూటిఫుల్’’
రాల్ఫ్ హూడ్జన్ ‘ది బుల్’ను డిగ్రీలో చదువుకొన్నాడు. తను అనువాదం చేశాడు కానీ- అప్పుడు దాని భావం ఇంతగా బోధపడలేదు.
‘‘అడవిలోపల చెట్టునీడన
ఆశలుడిగిన, సుఖము తరిగిన
వృషభమొక్కటి కూర్చొనున్నది కునికిపడుతూ,
సత్వముడిగీ బుద్ధి తరిగీ
మనోవికలత లోన పెరిగీ’’.
తనలాగే-
‘‘ఓడిపోయెను జీవితమ్మున
నలిగిపోయెను కాలచక్రపు
కఠినతర చక్రాల కిందన’’
ఔను.... జీవితం అంతే... కళ్ళంట నీళ్ళు. తను చిన్నప్పుడు తప్ప పెద్దయ్యాక ఎప్పుడూ ఏడవలేదు. శరీరం కూడా వణుకుతోంది. మంచాన్ని చేతితో కొట్టి గట్టిగా శబ్దం చేస్తున్నాడు. ఎవరూ వినిపించు కోరు. చాలాకాలం నుండి తన ఆరోగ్యం క్షీణిస్తోంది. టెస్టులన్నీ చేశారు. అన్నీ నెగెటివ్. ఈమధ్య ఆయాసంగా వుంటోంది. ఐనా లేచి తిరుగుతున్నాడు. తింటున్నాడు.
‘‘ఒరే బాబూ... ఒకసారి డాక్టర్లుకు చూపించు. కొంచెం ఆయాసంగా వుందిరా..’’
‘‘సరే నాన్నా... ఈ రాత్రి బొంబాయి వెళ్తున్నాను. మూడు రోజులు పని వుంటుంది. పని అవకపోతే మరొక రోజు ఆలస్యం అవుతుంది. అటునుండి వచ్చాక డాక్టర్ దగ్గరకు వెళ్దాం’’.
వాడు సాఫ్టువేర్ ఇంజనీర్. ఉదయం తొమ్మిదికి ఆఫీసుకు వెళితే రాత్రి ఏ తొమ్మిదికో, పదికో వస్తాడు. రాత్రి పిల్లల హోమ్‌వర్క్ చూస్తాడు. పిల్లలకు పెన్సిల్స్ కొనాలన్నా, కలర్స్ బాక్స్‌లు కొనాలన్నా, వాళ్లు స్కూలులో తినడానికి బిస్కట్లు కొనాలన్నా ఆ రాత్రప్పుడే అవన్నీ కొనాలి. ఒక్కొప్పుడు షాపులు మూసేస్తారు. పిల్లలతో ఒకటే గొడవ. మర్నాడు డ్రాయింగు క్లాసు.. కలర్ బాక్సులు తెచ్చుకోకపోతే టీచరు తిడతారు, పనిష్‌మెంట్ ఇస్తారని పిల్లలు ఏడుస్తుంటారు. తండ్రి తిడతాడు. తల్లి ఓదారుస్తుంది. భోజనం చేసి అందరూ పడుకొన్న తరవాత పిల్లల షూస్ పాలిష్ చేస్తాడు. ఆఫీస్ పని వుంటే అదీ చేస్తాడు. మళ్లీ చీకటిన ఐదుకే లేస్తాడు. పాల ప్యాకెట్లు తేవాలి. కోడలు వంట పని ప్రారంభిస్తుంది. పిల్లలను నిద్ర లేపుతుంది. వాళ్ళు ఒకంతట లేవరు. లేచినా వెంటనే పళ్ళు తోమరు. వాళ్ళచేత బోర్నవిటా తాగిస్తుంది. తరవాత స్నానాలు చేయిస్తుంది. పిల్లల స్నానాలైన తరవాత తన స్నానం. స్నానం అయిన వెంటనే భర్తకు టిఫిన్ ఉండాలి. తాను టిఫిన్ చేస్తుంటాడు. కోడలు స్టౌమీద కాఫీ పెట్టి, పిల్లవాళ్లకు లంచ్ బాక్స్‌లు సర్ది టిఫిన్ పెడుతుంది. ఈమధ్యలో ఇంటి ఓనర్లు నీళ్ళు పట్టుకోమని పైపు ఇస్తారు. వాళ్ళు వరుసగా ఒక్కొక్కింటికీ నీళ్ళిస్తుంటారు. టైమయిపోతోంది... ఆటో అంకుల్ వచ్చేస్తాడని పిల్లలు గబగబా తినేసి, కొంత వదిలీసి భోజనం అయిందనిపిస్తారు. బట్టలు వేసుకుంటూ వుండగానే కిందనుండి ఆటో హార్న్. బయలుదేరే సమయానికి ఒకరి బ్యాగ్‌లో వాటర్ బాటిల్ కనిపించదు. ముందురోజు స్కూలునుండి తెచ్చిన వాటల్ బాటిల్ ఎక్కడుందో వెదుక్కోవడం.. మరొక రోజు డైరీ కనబడదు. వెదుక్కోవడం... కింద నుండి ఆటో హార్న్. రెడీ ఐన పిల్ల లు తొందరపడడం. అంతా బిజీ బిజీ. ఊపిరి సలపని పని. ఉరుకులూ పరుగులూ.
అబ్బాయికి మధ్య మధ్యలో ఫోన్లు వస్తుంటాయి. మాట్లాడుతుంటాడు. పిల్లలు డాడీ.. డాడీ.. అని పిలుస్తుంటారు. వాళ్లకి స్కూలుటి టైమైపోతుంది. కిందనుండి ఆటో హార్న్. డాడీ స్కూలు ఫీజు ఇవ్వరు. ఫోనులో అవతలివాడు మాట్లాడుతూనే వుంటాడు. వదలడు. అతడు జవాబు చెప్తూనే వుంటాడు. ఏడూ నలభైలోపే అన్నీ అయిపోవాలి. పిల్లలు స్కూలుకి వెళ్లిపోయిన తరవాత ఇంట్లో కొంత ప్రశాంతత.
అబ్బాయికి మాత్రం తొందరే. బాత్‌రూమ్ ఖాళీ ఐతే స్నానం చేసి కావలసిన సామాన్లు తెచ్చి ఇంట్లో పడేసి ఆఫీసుకు వెళ్లాలి. బాత్‌రూమ్‌లో వాళ్ళమ్మ వుంటుంది. ఆవిడ నగర జీవనానికి అలవాటు పడలేదు. అంతా నెమ్మదే. బాత్‌రూమ్ ఖాళీ అయినంతవరకు ఏదో పనిచేస్తూనే వుంటాడు. స్నానం చేసి, టిఫిన్ చేసి బయలుదేరతాడు. తింటూనే అన్నీ అడగాలి, భార్య చెప్పినవి వినాలి. ఆఫీసు నుండి వచ్చేటప్పుడు ఏమేం తీసుకురావాలో లిస్టు రాసుకొంటాడు. భార్యకు కొన్ని ఆదేశాలిచ్చి ఆఫీసుకు వెళ్లిపోతాడు. తండ్రి గురించి ఆలోచించడానికి వాడికి టైమేది?
ఇంట్లో తన గురించి పట్టించుకొనేవారే లేరు. భార్య పూజలో వుంటుంది. కోడలు వంటపనిలో వుంటుంది. ఎవరి పని వారిది. ఏ పనీ లేనివాడు తనొక్కడే. ఇంట్లో పుస్తకాలు వుంటాయి. అబ్బాయి కొంటుంటాడు. చదవడానికి వాడికి టైం వుండదు. తాను కూడా ఈమధ్య చదవలేకపోతన్నాడు. ఒకటే నీరసం. హాయిగా మంచంమీద పడుకోవడమే.
ఎవర్నని ఏం లాభం..? వయసై పోయింది. ‘‘మీకు డబ్భై ఏళ్ళు వుంటాయా..?’’ అని అడుగుతుంటారు కొందరు. ‘‘ఎనభై దాటిపోయాయి...’’ అంటే ‘‘మీరు అలా కనబడరే..’’ అంటారు.
తాను పైకి బాగానే కనిపిస్తుంటాడు. కరి మింగిన వెలగపండు. ఇటీవలి వరకు బాగానే వున్నాడు. పాల ప్యాకెట్లు తెచ్చేవాడు, కూరగాయలు తెచ్చేవాడు. సాయంత్రం లైబ్రరీకి వెళ్ళేవాడు. ఆ మధ్య భార్యకు తోడుగా కాశీ వెళ్ళాడు. తిరిగొచ్చినప్పటి నుంచి ఆరోగ్యం సరిగా లేదు.
తొమ్మిది గంటలకు తన భార్య గుడి నుంచి ఇంటికి వచ్చింది. ‘‘మామయ్యగారూ భోంచేశారా..?’’ అని కోడలిని అడిగింది. సంవత్సరాలుగా దగ్గర కూర్చొని వడ్డించిన ఆమెకు ఇప్పుడు తీరిక లేదు. ‘‘లేదు అత్తమ్మా.. పడుకొన్నారు’’. అంది కోడలు.
‘‘తాతగారు ఎంత లేపినా లేవడం లేదు నాన్నమ్మా..’’ అ న్నాడు మనవడు.
భార్య వచ్చి ‘‘ఏవండీ, ఏవండీ, భోజనానికి లేవండి. తొమ్మిది అయిపోయింది’’.
అతడి నుంచి ఎలాంటి జవాబు లేదు. ఒంటిమీద చెయ్యి వేసి తట్టి లేపింది. ‘‘ఒళ్లు వేడిగా వుంది. జ్వరం వుందేమో..’’.
కోడలు థర్మామీటరు పెట్టింది. నూట నాలుగు... నా మాట ఎవరూ వినడం లేదు. ఎవరి తొందర వాళ్ళది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలి. ఇంట్లో మగదిక్కు లేదు. పిల్లలా చిన్నవాళ్ళు. పిల్లల్ని ఎదురింటివాళ్ళకు వప్పజెప్పి ఇంటికి తాళం వేసుకొని వెళ్లాలి.
ఇరుగు పొరుగువాళ్ళు వచ్చారు. ఆటో వచ్చింది. వాళ్ళ సాయంతో ఆటోలో ఎక్కించారు. మనవడు తాను కూడా వస్తానని అల్లరి చేస్తున్నాడు.
‘‘వచ్చేటప్పుడు లేసూ, చాక్‌లెట్లూ తెస్తాను’’ అని చెప్పి కోడలు వాడిని సముదాయించింది. మా ఆవిడ కనకమహాలక్ష్మికి మొక్కుకుంది. కోడలు అబ్బాయికి ఫోన్ చేసింది. ఇవన్నీ నాకు తెలుస్తూనే వున్నాయి. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి. ఆటో బయలుదేరింది.
ఇతరులెలాగనుకున్నా- తన మనసులోని మాటను ఎప్పుడో చెప్పవలసింది. తను తప్పు చేశాడు. తన మరణానంతరం తన కళ్ళు దానం చేస్తున్నట్లు ప్లెడ్జ్ఫిరంలో సంతకం చేసి, ఆరోగ్యం బాగున్నప్పుడే రిజిస్టర్ చేయించవలసింది. కానీ, తాను ఆ పని చెయ్యలేదు. తన కళ్ళు ఐ బ్యాంకుకు దానం చెయ్యాలి. పనికొచ్చే కిడ్నీలు దానం చెయ్యాలి. తను ఎలాగూ చనిపోతాడు. ఈలోపుగా లివరు, గుండె ఎవరికైనా అమర్చితే బాగుంటుంది. తన రక్తం కూడా తీసుకోవచ్చు. తను బతకడు కదా... డాక్టర్లు డిక్లేర్ చేస్తేకానీ తాను చావడా..? తన శరీరాన్ని- మృతదేహం అన్నమాట వాడడం తనకు ఇష్టంలేదు. విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రికి దానం చెయ్యాలి. తాను చెప్తూనే వున్నాడు. తన మాట ఎవరూ వినడం లేదు. తన కళ్ళంట నీళ్లు, ధారాప్రవాహంగా. అదైనా వాళ్ళు చూస్తారా...?
మంచిపని చెయ్యడానికి వాయిదా వెయ్యకూడదు. కాలం మనది కాదు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, ఆటోలు బోల్తాపడడం, బైకులు ఢీకొనడం... అనుక్షణం మృత్యువు పొంచి ఉంటుంది.
ఆటో కేర్ హాస్పిటల్ ముందు ఆగింది. తనను ఐ.సి.యు.లో వుంచారు. వెంటిలేటర్స్ అమర్చారు. తన దగ్గరికి ఎవరినీ రానివ్వరు. మాట్లాడనివ్వరు. తన నోరు నొక్కేశారు. ఇంజక్షన్లు ఇస్తున్నారు. తనను బతికించడానికి వాళ్ల ప్రయత్నం వాళ్లు చేస్తూనే వున్నారు. తనకు తెలుసు, తాను బతకడని. ఏమో..? దేవుడి దయ వల్ల తాను బతికితే, లేచిన వెంటనే తన మనసులోని మాట చెప్పేయాలి. ఆహా..! తన నోటివెంట ‘దేవుడు’...! నాస్తికుడి నోటివెంట ‘దేవుడు’...! ఎంత విచిత్రం...! *

No comments:

Post a Comment