Thursday 28 August 2014

సప్త వ్యసనాలు - కథ

‘నువ్వు ఉద్యోగం చేసైనా మరిదిని చదివించాలి’ అన్న మాటలు కటువుగా వినిపించాయి - పెళ్లిచూపుల్లో తల దించుకుని కూర్చున్న సీతకి. మామగారు పోయారని, ఆదాయం వచ్చే ఆస్తి కూడా లేదని తెలుసును గాని, వారి బంధువులు తనకి బాధ్యతలు తెలియజేసేందుకు అంతమంది పెళ్లిచూపులకు తరలి వస్తారని, తన సున్నితమైన మనసులో సూదులు గుచ్చేలా మాట్లాడగలరనీ తెలియని వయసులో తల్లి నిర్ణయానికి తల వంచింది సీత. అర్థంతరంగా భర్తని పోగొట్టుకున్న తల్లి దీనావస్థ సీత జీవిత గమ్యాన్ని మార్చి వేసింది. జానకిరామ్ మంచి ఉద్యోగంలో ఉన్నాడని తెలిసి పెళ్లికి ఒప్పుకున్నది. ఉమ్మడి కుటుంబంలోని బాధ్యతలను సంతోషంగా స్వీకరించింది.
పోటీ పరీక్షల్లో నెగ్గి మంచి ఉద్యోగం సంపాదించాలనే ఆశ అడియాసే అయింది. ఇంటి పనులతో, వెంటనే పుట్టిన పిల్లల పెంపకంతో సతమతమవుతున్న రోజుల్లో సీతకి చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో చేరమని పిలుపు వచ్చింది. పదిహేనేళ్ల మరిది శేఖర్ సూటిపోటి మాటలతో నలుగుతూ అత్తగారి సాయమైనా ఉంటుందనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరింది. కొడుకు ఇంట్లో చాకిరీ కంటే కూతురి సేవే నయమని అత్తగారు మకాం మార్చేశారు. పిల్లల కోసం సమయం కేటాయించలేని యాంత్రిక జీవన పోరాటంలో ఇరవై సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి.
* * *
‘అమ్మా! నాకు పెళ్లీ పిల్లలు, జంజాటాలు వద్దమ్మా!’ కూతురు స్నేహ మాటలకు ఉలిక్కిపడింది సీత. ఎందుకలా అంటున్నావని నిలేసింది. ‘నువ్వూ, నాన్న అవసరాలకంటూ ఉద్యోగాలు చేస్తూ మా కోసం టైం స్పేర్ చేయలేదు. నాన్న మాకంటే తన ఉద్యోగమే ముఖ్యమనుకున్నారు. మనం విలువైన ఫ్యామిలీ లైఫ్‌ని మిస్సయ్యాం. అందుకే నేను ఉద్యోగం చేస్తే పెళ్లి చేసుకోను... పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయను’ మొండిగా వాదించింది స్నేహ.
* * *
సీత మనసు గతంలోకి తొంగి చూసింది. పల్లెటూరు నుండి పట్నం చదువు కోసం అన్న ఇంటికి వచ్చిన మరిది శేఖర్ పదిహేనేళ్ల వయసులో తనకంటే పది సంవత్సరాలు పెద్దవాడని కూడా చూడకుండా అన్నతో ‘అన్నయ్యా! నువ్వు పెళ్లికి తొందర పడ్డావు’ అనేవాడు. వండి వారుస్తున్న వదిన స్థానం ఆ ఇంట్లో తన తర్వాతేనని పదేపదే గుర్తు చేసేవాడు. తమ పెళ్లి జరిగిన పనె్నండేళ్ల తరువాత మరిది పెళ్లైంది. వారూ అదే ఊళ్లో కాపురం పెట్టి బరువూ బాధ్యతలు లేని జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించే రోజుల్లో స్నేహ ఓసారి నాయనమ్మని బాబాయికి ఇంటికి తీసికెళ్లమన్నది. ‘వద్దులే బాబారుూ పిన్నీ ఉద్యోగాలు చేసి వచ్చి అలసిపోయి ఉంటారు. వాళ్లు బయటే ఎక్కువ తింటూ ఉంటారు. ఇంకోసారి చూద్దాంలే’ అన్న అత్తగారి మాటలు పిల్లల నోళ్లని నొక్కేశాయి. కలికాలమో, కాల మహిమో అర్థంకాని సీత కర్మ సిద్ధాంతాన్ని గుర్తు తెచ్చుకుంది. పిల్లలూ ఇక ఎప్పుడూ బాబాయి ఇంటికి వెళ్దామని అడగలేదు. భార్యాపిల్లలతో తనే ఎప్పుడైనా వచ్చి వెళ్తుండేవాడు. పదిహేనేళ్లలో అత్తింటి వాళ్ల ఆలోచనా విధానంలో వచ్చిన పెను మార్పు సీతని పరిస్థితులతో రాజీ పడమన్నది.
* * *
స్నేహ మనసు మార్చాలనే ప్రయత్నంతో సీత.. ‘అమ్మా! స్నేహా! మనుషులందరూ ఒకేలా ఉండరమ్మా! నిన్నూ, నీ భావాలనూ అర్థం చేసుకొనే భర్త దొరికితే నీ సంసారం స్వర్గతుల్యం అవుతుంది. నీవు భయపడేలా సంసార సాగరంలో నీ ఉద్యోగ నౌక వొడిదుడుకులకు లోనవుతుందని నేననుకోను. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు పరస్పరావగాహనతో ఉద్యోగాలు చేసుకొంటూ పిల్లల కోసం కూడా సమయం కేటాయిస్తున్నారు. పెళ్లీ, ఉద్యోగం సమాంతర రేఖలని భ్రమ పడవద్దు. నీవూ ఓ ఇంటిదానివయి నీ సంపాదనంటూ వుంటే నీకు మనోధైర్యం ఉంటుంది’
‘నీవే చెప్పేదానివి గదమ్మా... ఆ మనోధైర్యమే అహంకారంగా మారి కొంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నదని’ అన్న స్నేహ ప్రశ్నకు సీత తడుముకోలేదు.
‘ఆర్థిక స్వాతంత్య్రం అత్యవసర పరిస్థితిని ఆదుకోవాలి గాని అనవసర కలహాలకు దారి తీయకూడదు. ఏ ఖర్చయినా భార్యాభర్తలు సంప్రదించుకుని చేయాలి. కుటుంబంలో అనుమానాలకు తావిస్తే, అవే పెనుభూతాల్లా విడాకులకి దారి తీస్తాయి. జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి గాని, డబ్బు కోసం అడ్డుగోడలు సృష్టించుకోకూడదు. ‘ఉమెన్ ఫ్రెండ్లీ’ చట్టాలు చాలానే వచ్చాయి. నీవు నిర్భయంగా నీ బంగారు భవిష్యత్తుకు ఒక చక్కని బాట వేసుకోవచ్చును’... నవ్వుతూ ధైర్యం చెప్పింది సీత.
‘సరేనమ్మా! ముందు ఉద్యోగ ప్రయత్నం చేస్తాను. ఆ తరువాత పెళ్లి గురించి ఆలోచిద్దాం’ స్నేహ మాటలతో సీత మనసు కుదుటపడింది.
స్నేహ ఉద్యోగం చేస్తుండగా ప్రకాష్‌తో పెళ్లైంది. ఓ సంవత్సరంపాటు ఉద్యోగం వదల్లేక, అతనితో మద్రాసు వెళ్లలేక పోయింది. ఆ తరువాత సన్నీ పుట్టుకతో, మద్రాసులో వెతుక్కోవచ్చనే ఆశతో ఉద్యోగానికి రాజీనామా చేసి భర్త దగ్గరికి వెళ్లింది. వాడి పెంపకంలో రెండేళ్లు మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తూ గడిపేసింది. ప్రకాష్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. డబ్బు విలువ బాగా తెలిసినవాడు కాబట్టి స్నేహ ఖర్చులకి పరిమితంగానే అందుబాటులో ఉంచేవాడు. మిగిలిన డబ్బు తన ఖాతాలో జమ చేసేవాడు. పుట్టింటిలో స్వేచ్ఛగా ఖర్చు చేయడం అలవాటైన స్నేహలో స్వంత ఆదాయం ఉండాలనే పాత ఆలోచనలు కొత్త చిగుళ్లు వేశాయి. మళ్లీ ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టింది. చిన్న వాటితో సరిపెట్టుకోలేక కొన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి.
* * *
‘స్నేహా! పది సంవత్సరాలు నాతో కాపురం చేసినా నన్నర్థం చేసుకోలేక పోయావు. సన్నీ పెద్దవాడవుతున్నాడు. వాడి ముందు మనం కీచులాడుకుంటే బాగుండదు. నా మాట విని డబ్బు సంపాదన గురించి ఆలోచించకు. నా సంపాదనతోనే తృప్తిగా బతగ్గలము...’ ప్రకాష్ బుజ్జగించాడు స్నేహని. ఎంతో ఓర్పుగా ఇచ్చిన ప్రకాష్ సలహా స్నేహ అహం మీద దెబ్బ కొట్టింది.
సప్త వ్యసనాలంటే తాగుడు, జూదమే గుర్తుకు వస్తాయి. మొదటి వ్యసనం ‘పరుషంగా పలుకుట’ రెండవది ‘దోషమునకు మించి దండించుట’.. ఈ రెండూ భర్తలో వున్నాయనిపించింది స్నేహకు. సన్నీ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేయడం తన దోషంగా భావించింది. మూడవది ‘్ధనమును వృథా చేయుట’. స్నేహని ఈ వ్యసనం పీడిస్తున్నట్టు ప్రకాష్ బాధపడుతూ తన పుట్టింటి నగలని కూడా స్నేహ కంట పడకుండా దాచేశాడు.
‘నీకు నా నగల మీద హక్కెవరిచ్చారు?’ ఎదిరించింది స్నేహ.
‘నీవేదో వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నావు కదా? ఈ నగలని కూడా మార్చేస్తావనే భయంతో దాచేశాను. వాటిని గురించి అడక్కు’ నిజం బయటపెట్టాడు ప్రకాష్.
‘నీవెన్ని రోజులు నాకు డబ్బు అందకుండా కట్టడి చేస్తావో చూస్తాను. నేనెక్కడికీ పోనని అనుకోకు. ఇలాగే చేస్తే విడాకులు తీసుకోవలసి వస్తుంది. జాగ్రత్త!’
రోజులో కనీసం ఓ అరగంట ఇలా వాదించుకునేవారు. ప్రకాష్‌కి మనశ్శాంతి కరువైంది. నాల్గవ వ్యసనమైన మద్యపానం అతన్ని కోరి వరించింది. అయిదవ వ్యసనం ‘స్ర్తి లౌల్యం’. ఆరవది ‘వేట’, ఏడవ వ్యసనం ‘జూదం’ అతన్ని వదిలేసినా తనకు కావలసిన శాంతిని, సౌఖ్యాన్ని రోజూ తాగి రావడంలోనే వెతుక్కున్నాడు. స్నేహ తన ఆర్థిక స్వాతంత్య్రం కోసం కోర్టుని ఆశ్రయించాలనుకుంది. పురుషాధిపత్యంతో పోరాడాలనుకున్న స్నేహకి పెద్దల హిత బోధ కంటే కొందరు స్నేహితుల సలహాలు బాగా రుచించాయి. అందుకే ‘గృహ హింస’ చట్టం తనకు దగ్గరి చుట్టంగా తోచింది. పుట్టింటికి సన్నీతో చేరిన స్నేహని అక్కున చేర్చుకోక తప్పలేదు సీతకి. చట్టంతో పని లేకుండా కూతురి కాపురం తనే చక్కదిద్దాలనే ఆలోచనలో పడిపోయింది.

No comments:

Post a Comment