Wednesday 20 August 2014


జీవితం - కథ

  • -పి.ఎల్.ఎన్.శేషారత్నం
సాయంసంధ్య..
సూర్యుడింకా మలిగిపోలేదు. బాగా వెలుతురుగానే ఉంది. వీధి మలుపులో ఉన్న పెంకుటింటి ముందు ఆటో ఆగింది. గేటు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది సుభద్ర. పిల్లలిద్దరు ఆమెను అనుసరించారు.
గేటు తీసిన చప్పుడవడంతో...వరండాలోకి వచ్చి చూసాడు పరంధామయ్య. తండ్రి కనపడగానే చెప్పలేని దుఃఖం ముంచుకు వచ్చింది సుభద్రకు. చేతిలోవున్న బేగులు కింద పడవేసి తండ్రి చేతులు పట్టుకుని ‘ఇక నేను ఆ ఇంటికి వెళ్లను నాన్నా’ కన్నీళ్లు పెట్టుకుంది.
సుభద్ర అలా రావడం అది మొదటిసారి కాదు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు అలవాటైపోయాయి ఆ ఇంటికి. వీధి గుమ్మంలో అలికిడికి వంట చేస్తున్న కామాక్షమ్మ బయటకు వచ్చింది. విషయం చెప్పకనే అర్ధమైంది. షరా మామూలే...ఆరు నెలలు కాలేదు కథ మొదటికే వచ్చింది అనుకుంది.
‘‘అన్ని సర్దుకుంటాయిలే...మేమున్నాము కదా!’’ నచ్చ చెప్పారు.
కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ‘‘మీరెన్ని చెప్పినా ఇంక నేను ఆ ఇంటికి వెళ్లను. ఆ మాటలు, ఆ హింస భరించగలిగే ఓపిక నాకు లేదు.’’ ఖరాఖండిగా చెప్పేసింది. ఇంతకు ముందెన్నడు ఇంత బేలగా లేదు. ఏం జరిగి ఉంటుందో!
‘‘్భరించకపోతే ఎలా? ఇదేం మేము ఇష్టపడి చేసిన పెళ్లా? కులం కాని వాడ్ని వద్దు వద్దంటుంటే..విన్నావా? ప్రేమ ప్రేమ అంటూ వెళ్లి రహస్యంగా చేసుకొచ్చావు.
ఇప్పుడు అవకాశం వాళ్లదైపోయింది. అయినా మీ ఆయన ఏమన్నాడు? మీ అత్తగారు కూడా ఏమైనా అన్నదా?’’ ఆరా తీసింది కామాక్షమ్మ.
‘‘అవును. అత్తగారు అస్తమానం అనేదే..ఇప్పుడు ఈయనా అంటున్నాడు. తనవలన వంశం నిలబడడం లేదట. అందుకు విడాకులు కావాలంట. లేకపోతే..లేకపోతే’‘ చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తుంది.
‘‘ఊ...లేకపోతే’’ రెట్టించింది కామాక్షమ్మ.
‘‘విడాకులకు వప్పుకోకపోతే..తను చచ్చైనా పోవాలంట...అప్పుడు మళ్లీ తను పెళ్లి చేసుకోవడానికి వీలౌతుందట. అప్పుడైనా మగపిల్లాడు పుడతాడంట’’
‘‘సరేలే! ఆపరేషను చేయించుకోలేదుగా మరొకటి చూస్తే సరి..ఈమాత్రం దానికి విడాకులు..చావులు ఏమిటి? విషయం పెద్దవాళ్లకు చెప్పేది లేదు, అన్నీ నీ స్వంత నిర్ణయాలే.’’
ఆ మాటకు తల్లి వంక చివాల్న తలెత్తి చూసింది సుభద్ర. ‘‘ఇక నావల్ల కాదమ్మా! ఆ ఆపరేషనులు.. కష్టం తట్టుకోవడం నా వల్ల కాదు. మరో కాన్పు వస్తే నాకే ప్రమాదం అని డాక్టరు చెప్పలేదా! వాళ్లకోసం..వాళ్ల వంశం కోసం నా ప్రాణాల్ని బలిపెట్టదలచుకోలేదు. అయినా నేను పోతే నా పిల్లలు దిక్కులేని వాళ్లైపోతారు. పిల్లలిద్దరినీ పొదవి పట్టుకుని ఏడ్చింది.
ఒకప్పుడు..కామాక్షమ్మ కూడా ఇలాంటి పరిస్థితిని అనుభవించింది. తనకీ ఇద్దరాడపిల్లలే. అత్తగారూ అలాగే బాధపడింది. అలా అని రాచి రంపాన పెట్టేయలేదు. దేవుడిచ్చిన ప్రాప్తం అంతే అని సరిపెట్టుకుంది.
ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించిన సుభద్రకు నిద్ర దూరమైంది. ఆలోచనలు. తల పగిలిపోయేటన్ని ఆలోచనలు ఎడతెరిపి లేకుండా..అలల ఉధ్రుతిలా ఒకదాని వెంట ఒకటి సినిమా రీలులా తిరుగుతున్నాయి.
నిజమే! అమ్మ అన్న దానిలో ఎంతో నిజముంది. పిక్నిక్ అని ఇంట్లో చెప్పి స్నేహితుని వెంటేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా సింహాచలంలో పెళ్లి చేసుకుంది మనోహర్‌ని. ఒకమాటలో చెప్పాలంటే మనోహర్ అంత అందమైన వాడేం కాదు. తినగా తినగా వేప తియ్యనైనట్టు..చూడగా చూడగ అతను నచ్చాడు.
వాళ్ల ఇంటికి నాలుగు లైన్ల అవతల మనోహర్ ఇల్లు. డిగ్రీలో ఉండగా ఒకే స్టేజిలో కాలేజీ బస్సు ఎక్కేవాళ్లు. అదేవాళ్ల స్నేహానికి పునాది అయింది. పైగా క్లాస్‌మేట్స్. ఇక వాళ్ల స్నేహానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. నల్లగా సన్నగా బక్కపలచగా వున్నా అతని ముఖంలో ఏదోకళ కనపడేది. ఆ కళ్లలో తనమీద ఆరాధన కనబడేది. అదే తన్ని ముంచేసింది.
ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్లు ఊరికే అనలేదు. అలా అని పెద్దలమాట వినాలనీ లేదు. అందుకే అటు పెద్దలు..ఇటు పెద్దలు..తమని వేరుచేస్తుంటే, అన్నిటికీ అతీతంగా, దేవుని గుళ్లో స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకుంది. ఆ నిముషంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత సంతోషంగా అనిపించింది.
పెళ్లి చేసుకుని మనోహర్ నేరుగా ఇంటికే తీసుకువెళ్లాడు స్నేహితులు వెంట రాగా..పెళ్లి బట్టలతో ఉన్న తమని చూసి శివాలు తొక్కింది అత్తగారు అనబడే సుందరమ్మ.
‘‘ఒక్కగానొక్క కొడుకువి..లక్షలకు లక్షలు కట్నాలు ఇస్తామని...అయినవాళ్లందరు ఇంటి చుట్టు తిరుగుతుంటే..ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బులొస్తాయట్రా. నీ తరువాత ఆడిపిల్లలకి ఏమిచ్చి పెళ్లి చేస్తానురా!’’ బాధపడింది. భర్త నచ్చచెప్పడంతో కాసేపటికి శాంతించి ఎర్ర నీళ్లు దిష్టి తీయించి ఇంట్లోకి రానిచ్చింది. అదే మహాభాగ్యం అనుకుంది తను.
తల్లయితే ముందే చెప్పింది. ‘‘నువ్వు వాడినే కట్టుకునేట్టయితే..ఇక నువ్వు మా గురించి మర్చిపో. నీ తరువాత దానికి పెళ్లవ్వాలనుకుంటే ఈ గడప తొక్కకు’’ అని.
పెద్దలు వద్దన్నారన్న పట్టుదల పట్టింది గానీ..తనెంత పొరపాటు చేసిందో ఇప్పుడర్ధమైంది. పెళ్లిళ్ల విషయంలో అటు ఏడు తరాలు..ఇటు ఏడు తరాలు చూడాలన్నది ఎంత ముఖ్యమైన విషయమో ఇప్పటికే తెలిసి వచ్చింది. తనిష్ట ప్రకారం తను నడుచుకున్నందుకు....చెల్లి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఈ జీవిత సత్యం తెలిసే నాటికి ఆరేళ్ల కాలం..సంతోషానికి..దుఃఖానికి తేడా తెలియకుండా గడిచిపోయింది.
* * *
ఎంత కట్టడి పెట్టినా తల్లి...తల్లే.. అందునా కళ్లముందే ఉన్నారు కాబట్టి తను కడుపుతో ఉందని తెలిసి ఆ ఇంటికి వచ్చి, మిఠాయిలు ఇచ్చి, డెలివరీకి తీసుకువచ్చింది. అప్పుడే అంది అత్తగారు ‘మావాడు...మీ పిల్లని ఇష్టపడబట్టి గానీ లేకపోతే లక్షలుతెచ్చే పిల్ల నా కోడలు అయేది. చదువు ఒక్కటే సరిపోదు. మనిషి బతకడానికి డబ్బు కూడా ముఖ్యమే’’ అని.
మనోహర్ తండ్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో గుమాస్తా. ఎలాగో తంటాలు పడి..కొంత డబ్బు ఖర్చుపెట్టి కొడుక్కి చిన్న ఉద్యోగం వేయించగలిగాడు. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు అనుకుంటే కట్న కానుకలు ఎలానూ లేవు..ఉద్యోగానికి ఖర్చు పెట్టుకున్నదైనా తన నుంచి ‘కలసి’ వస్తే బాగుండునని ఆశించింది అత్తగారు.
ఆవిడ అలా అనుకోవడంలో తప్పులేదు. చదువుకుని కూడా తను వీళ్లకు ‘తిండి’ భారమైంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని..ఎక్కడైనా టీచర్‌గా వెడదామనుకుంటున్న తరుణంలోనే వేవిళ్లు మొదలయ్యాయి. దాంతో ఇంట్లోనే ఉండిపోయింది.
తొలిచూలు ఆడపిల్ల. మొదటిసారిగా పంపినపుడు చంటిపిల్లకు బంగారం పెట్టి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి పంపారు తల్లిదండ్రులు. దానికి సంతోషపడింది సుందరమ్మ.
చిట్టిపాపాయి..చిన్నారి చేష్టలతో..బుడిబుడి నడకలతో సంవత్సరం తిరిగిందో లేదో మళ్లీ నెల తప్పింది తను. చిట్టి పాపాయిని చూసి సంతోపడుతున్నా..మలి సంతానం అబ్బాయే కావాలని పట్టుపట్టింది అత్తగారు.
‘‘మన చేతుల్లో ఏముంది అత్తయ్యా!’’ అంది తను.
‘‘అది నాకు తెలీదు. నా వంశం నిలవాలి.. అలా అని ఇంకా ఇంకా అవకాశాలు చూడాలంటే..మన స్తోమతు సరిపోదు.’’ ఖచ్చితంగా చెప్పింది.
మొదటిసారే సిజేరియన్ జరిగింది. ఈసారీ ఆపరేషన్ తప్పకపోవచ్చు. అత్తగారి కోరిక తీర్చడం కోసం ఏదైనా టెస్ట్ చేయించుకుందాం అనుకున్నా. గవర్నమెంటు వాటిని నిలుపు చేసింది. మగపిల్లాడి కోసం ఎన్ని కష్టాలు పడగలదు తను. అంతా దేవుడిదే భారం అనుకుంది.
అయినా దేవుడు ఆ భారాన్ని తను తీసుకోలేదు. తనకే వదిలేసాడు. మళ్లీ అమ్మాయే. అత్తగార్ని సంతోషపెట్టేలా మరిన్ని కానుకలు ఇచ్చి పంపాడు పరంధామయ్య.
రెండవ డెలివరీకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తానంది డాక్టరు. తల్లికి భయపడి మనోహర్ వప్పుకోలేదు.
రానురాను అత్తగారి సాధింపులు ఎ క్కువయ్యాయి. పెద్దాడపడుచు పెళ్లి దగ్గర పడడంతో, ఇల్లు ఇరుకు అన్న నెపంతో వేరుకాపురం పెట్టించాడు పరంధామయ్య మనోహర్‌తో...అత్తారింటికి...పుట్టింటికి మధ్యస్తంగా ఉన్న అద్దె ఇంట్లోకి. దానికే కొడుకు దూరం అయిపోయాడని బాధపడింది సుందరమ్మ.
కొంతలో కొంత తెరిపిన పడ్డట్లయింది తనకు. చిన్న పిల్లకూ రెండేళ్లు గడిచింది. జీవితం నల్లేరు మీద నడకలా సాఫీగానే జరుగుతుందనుకున్న సమయంలో మళ్లీ అవాంతరం.
పెద్దాడపడుచుకు మగపిల్లాడు. ఎంకిపెళ్లి...సుబ్బి చావుకొచ్చినట్టయింది. కొడుక్కి వంశాంకురం లేడని..తప్పంతా కోడలిదేనని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది . వినగా..వినగా తల్లిమాటలు బుర్రకెక్కాయి మనోహర్‌కి. తల్లి మాటలకే వత్తాసు పలికాడు. అతను చివరగా పలికిన మాటలే...మళ్లీ పుట్టింటి పంచన చేరేలా చేసాయి.
* * *
రాత్రి కలత నిద్రయినా...ప్రశాంతంగా నిశ్చింతగా నిద్ర లేచింది సుభద్ర. ఇక్కడ తన మనసును కష్టపెట్టేవాళ్లు ఎవరూ లేరు. పిల్లలిద్దరూ అప్పటికే నిద్రలేచి గార్డెన్లో తాతయ్యతోపాటు కూర్చుని కబుర్లు చెబుతున్నారు.
లేచి ముఖం కడుక్కుని పిల్లల దగ్గరకు వెళ్లింది. నిన్నటినుంచి వాళ్ల ఆలనా పాలనా చూడలేదు. తల్లిని చూడగానే ముందుగా చిన్న పిల్ల దివ్య ఎదురొచ్చి గట్టిగా కావలించి పట్టుకుంది. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా ‘‘అమ్మా! నాన్నది ‘తీసి’ బయట పడెయ్యి’’ అంది కోపంగా..తల్లిమెడలో వున్న మంగళ సూత్రాలనుచూపిస్తూ. ఇంకా ముక్కుపచ్చలారలేదు దానికే ఎంత లోకజ్ఞానం తెలిసింది.
తనే ఎప్పుడోచెప్పింది...పిల్లలు తన ఒడిలో చేరి, మెడలో వున్న మంగళ సూత్రాలతో ఆడుతుంటే..‘ఇందులో ఒకటి మీ నాన్నది..ఒకటి నాది’ అని. ఆ మాట దానికి బాగా గుర్తున్నట్లుంది. నాన్నతో గొడవ జరిగి బయటికొచ్చేసినందుకు..దానికి ఈ విషయం ఇలా గుర్తుండిపోయింది. అందుకే ‘నాన్నది తీసి బయటపడెయ్యి’ అంది. ఒక సూత్రం తీసి బయటపడేసినంత మాత్రాన తెగిపోయే బంధమా ఇది.
దాని అమాయకత్వం చూస్తే..అంత బాధలోనూ మనసుకి ఊరట కలిగింది. అమాంతం దివ్యనెత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దు మాటలేమీ అర్ధం కాని పరంధామయ్య...‘ఏమిటమ్మా! ఏమంటుందీ గడుగ్గాయ్...దాని మాటలు నాకింకా అర్ధం కావడంలేదు. అయినా భలే స్పీడుగా మాట్లాడేస్తుందిలే’’ సుభద్రకు దగ్గరగా వచ్చి చిన్న పిల్ల భుజాన్ని ప్రేమగా తడుతూ...
తండ్రి అలా అడిగేసరికి దాని మాటల సారాంశం వివరించక తప్పింది కాదు సుభద్రకి.
‘‘ఔరా! ఎంత జ్ఞాపక శక్తి. వేలెడంత లేదు’’ ముక్కున వేలేసుకున్నాడు పరంధామయ్య. ‘‘ఎంతైనా పెద్దది అమాయకురాలు.’’ అన్నాడు.
* * *
ఇక్కడకు వచ్చినప్పటినుంచి ఆలోచిస్తోంది, తన సమస్యకు...పరిష్కారం వెతుక్కోవాలి.స్నేహితురాలు ప్రసూనాంబ ధైర్యం చెప్పింది.
మంచి చీర కట్టుకుని ముస్తాబవుతున్న కూతుర్ని చూసి ఆశ్చర్యం కలిగింది కామాక్షమ్మకి.
‘‘పొద్దుటే ఎక్కడికి బయలుదేరావు. అపుడే ఇంటిమీద ధ్యాస మళ్లింది గానా’’ అడిగింది. ఈ వంకనైనా కాపురం చక్కబడితేచాలు అనుకుంటూ.
ఆ విషయం అమ్మకి, నాన్నకి ఎలా చెప్పాలో తెలియక అవస్థపడుతుంది. తల్లి మాటలకు జలజల కన్నీళ్లు ఉబికి వచ్చాయి.
‘‘్ఛ అలా ఏడవకు...ప్రొద్దుటే ఇంటికి మంచిది కాదు.’’ మందలించింది.
‘‘అవును. నా బతుక్కి మనసారా ఏడవడానికే కూడా స్వేచ్ఛలేదు. అందుకే నా సమస్యకు నేనే పరిష్కారం వెతుక్కున్నాను. ననె్నవ్వరూ ఆపేందుకు ప్రయత్నించకండి. నా ఫ్రెండ్ ప్రసూన తెలుసుకదా! తను పనిచేసే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీగా వుందని, జీతం పదివేలు వరకూ వుండొచ్చని చెప్పింది. జీతం ఎంతిచ్చినా సరే..నేను అక్కడ జాయిను అవ్వాలనుకుంటున్నాను. మీరు నాకు చెయ్యగలిగే సహాయం ఒక్కటే. కాస్త పిల్లల్ని చూడండి అంతేచాలు.’‘ కన్నీళ్లు తుడుచుకుంటు చెప్పింది దృఢ నిశ్చయంతో
కూతురి మాటలకు విస్తుపోయింది కామాక్షమ్మ.
వీళ్ల సంభాషణ అంతా తోటలో కూర్చుని గమనిస్తున్న పరంధామయ్య వరండాలోకి వస్తూ ‘‘అలా నీపాటికి నువ్వు నిర్ణయం తీసేసుకోవడమేనా? మనోహర్ వచ్చి అడిగితే నేనేం చెప్పాలి? సంసారం అన్నాక ఏవో గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి.’’ కూతురికి నచ్చచెప్పే ధోరణిలో.
‘‘అయినాసరే! నాకంటూ ఓ ఆర్థిక వెసులుబాటు లేకే...ఈ అవమానాలు పడుతున్నాను. ఏ కష్టం వచ్చినా...పరిగెత్తుకుంటూ వచ్చి మీ పంచన వాలిపోతున్నాను. ఆ దాష్టికం నేను చెయ్యలేను. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకండి.కొద్దిరోజులు పిల్లల్ని చూడండి చాలు’’ అంది వేడుకోలుగా.
‘‘సరే! నీ ఇష్టం. ఇదీ ఒకందుకు మంచిదే అనుకుందాం. నీవు చదువుకున్న చదువూ ఉపయోగపడుతుంది. మీ పరిస్థితులు చక్కబడతాయి. మీ ఆయన ఆలోచనలు మారవచ్చు.’’ వొప్పుకున్నాడు పరంధామయ్య.
ఆ మాటకి కొండంత ధైర్యం వచ్చింది సుభద్రకు
* * *
వారం రోజులుగా ఉద్యోగానికి వెడుతోంది సుభద్ర. పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల లాలనలో తల్లిని వదిలి వుండడానికి అలవాటుపడ్డారు. సుభద్ర చేదు జ్ఞాపకాల్ని మరిచిపోవాలనుకున్నా యదలో గాయం పచ్చిగానే ఉంది.
ఓ రోజు...ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డాడు మనోహర్. వరండాలో ఆడుకుంటున్న కావ్య కనిపించగానే రమ్మని చేతులు చాచి పిలిచాడు.ఒక్క నిముషం తండ్రినిచూసిన ఆనందంలో కావ్య పరిగెత్తుకుంటూ ఎదురెళ్లబోయి..ఆగిపోయింది ‘నేను రాను’...అన్నట్టు బుర్ర అడ్డంగా తిప్పింది.
‘‘రా! మనింటికి వెళ్లిపోదాం’’ చేతులు చాచి మళ్లీ పిలిచాడు.. రానని అమ్మమ్మ వెనక్కు వెళ్లిపోయింది
అక్కడే వున్న దివ్య తండ్రిని చూడగానే ...పట్టరాని కోపంతో కిందకి వంగి నేలమీద వున్న ఆటవస్తువు తీసి మనోహర్‌మీదకి బలంగా విసిరేసింది.
దెబ్బ తగలకుండా తప్పించుకున్నాడు. ఆ పిల్ల ఎదురుతిరగడంలోనే చూస్తే తెలుస్తుంది జరిగిన దానికి ఆ పసిమనసు ఎంత గాయపడిందో. మాటల్లో వ్యక్తం చేయలేని భావం చేతల్లో చూపింది.
ఆ ముద్దుగారే.. పసి మనసులో ఇంత కోపం వుందని అనుకోలేదు కామాక్షమ్మ. ‘తప్పు అలా చేయకూదు’ అంది దివ్యను వారిస్తూ.
‘‘ఏం నాయనా! ఇన్నాళ్లకు పిల్లలు గుర్తుకొచ్చారా? పెళ్లాం గుర్తుకొచ్చిందా? మగపిల్లాడు పుట్టలేదని, నా కూతుర్ని తన్ని తగలేసావు కదా! ఇప్పుడు దేనికొచ్చినట్లో. అసలు మగపిల్లాడు పుట్టకపోవడం అనేది మగవాడిలో లోపమే. ఆడదానిది కాదు. సైన్సు చదువుకున్నావు కదా! ఆ మాత్రం తెలీదా!’’ అడిగింది.
‘‘....’’ వౌనం సమాధానం లేదు.
‘‘ఎంతోమంది ఇళ్లలో.. ఇప్పుడు ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లాడు లేడని అనుకోవడం సహజమే అయినా.. ఎవ్వరూ మీలా వీధిన పడడంలేదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దేవుడిచ్చిన ప్రాప్తం అని సరిపెట్టుకుంటే అంతా ఆనందమే. మేము లేమూ! మగపిల్లాడు లేకుండా. మాకు అల్లుళ్లు అయినా మీరే కొడుకులు అయినా మీరే. చివరగా తల కొరివీ మీరే పెడతారు. ఎపుడో జరగబోయే దానికోసం ఇప్పటినుంచే జీవితాలు బుగ్గి చేసుకుంటామా’’
అత్తగారు అలా ఏకబిగిన మాట్లాడేస్తుందనుకోలేదు. ‘ఇకనుంచి బాగానే చూసుకుంటాను సుభద్రను పిలవండి.’
‘‘సుభద్ర రావడానికి ఇంకా గంట టైము కావాలి. ఇప్పుడు ఉద్యోగానికి వెడుతుంది.’’
‘‘ఉద్యోగమా!’’
‘‘అవును. నువ్వు మళ్లీ పెళ్లిచేసుకోవడం కోసం..నా కూతురు చచ్చిపోవాలనుకోవడం లేదు. తన పిల్లలు అనాధలు కాకూడదని ఇప్పటినుంచీ కష్టపడడం నేర్చుకుంటోంది. వస్తుంది కూర్చో.’’ కుర్చీ చూపించింది.
తీరిగ్గా కూర్చుంటే అత్తగారు ఇంకా ఏం క్లాసు పీకుతుందోనని బతుకుజీవుడా అనుకుంటూ మళ్లీ వస్తానని బయటపడ్డాడు.
* * *
మనోహర్ వచ్చి వెళ్లిన విషయం విని కూడా సుభద్ర పెద్దగా చలించిపోలేదు. ప్రతిసారిలా కన్నీరు పెట్టుకోలేదు. విని వూరుకుంది. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నందుకు సంతోషపడింది.
అంతకుముందు ఒకసారి పిల్లల్ని తనతో తీసుకుపోవడంతో..వాళ్లకోసం..తనూ వెళ్లాల్సి వచ్చింది దూడకోసం ఆవులా!
అత్తగారి మాటల తరువాత మనోహర్‌లో అలజడి మొదలైంది. తను చదువుకున్నదే సైన్సు. సంతానం విషయం అత్తగారు అంటేనే కానీ తనకి సెక్స్ డిటర్మినేషన్ గురించి ఆలోచనకి రాలేదు. సుందరమ్మ అస్తమానం వంశాంకురం కోసం తాపత్రయపడి బుర్ర తినడంతో తనకి వాస్తవం గ్రహించే కనీస జ్ఞానం లేకపోయింది.
మగవాడిలో వున్న ఎక్స్ వై క్రోమోజోములలో, వై క్రోమోజోము బలహీనంగా ఉన్నప్పుడు స్ర్తినుంచి వచ్చిన ఎక్స్ క్రోమోజోముతో.. మగవాడిలో ఉన్న ఎక్స్ క్రోమోజోము కలవడం వల్ల ఆడ సంతానం కలుగుతుంది.
విడాకులు... మళ్లీ పెళ్లి.. బోలెడు కట్నం..అనుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగి, కొత్త జీవితం ఏర్పడుతుందనుకున్నాడు. కొన్నాళ్లపాటు పాత జీవితపు జ్ఞాపకాలు బాధించినా..కాలగతిన కొట్టుకుపోతాయ్ అనుకున్నాడు.
ఇంటికి దీపమైన ఇల్లాలిని...వెళ్లగొట్టినందుకు పదిరోజులుగా ఇంట్లో దీపం పెట్టడానికి ఇల్లాలు లేదు. ఎదురొచ్చే పిల్లలు లేరు. ఏమైనా కొన్నా తినడానికి ఇంట్లో మనిషి లేదు. ఇక తన సంపాదన ఎవరికోసం. ఆకలైనప్పుడు తల్లిదగ్గరకు వెళ్లి అన్నం తిని వస్తున్నాడు. ఇదేనా జీవితం? ఎన్నాళ్లిలా?
రేపు వెళ్లి సుభద్రని, పిల్లల్ని ఇంటికి తీసుకురావాలి అనుకున్నాడు మనోహర్.
* * *
ఆ మరునాడు మనోహర్ ఎప్పటిలానే పిలిచాడు. ఆ మాటలన్నీ అలవాటైపోయాయి సుభద్రకి. తను తన పిల్లలతో వంటరిగా జీవించాలనుకున్నానని, తన గాలి సోకనంత దూరంగా..ఉద్యోగం దగ్గరే ఇల్లు తీసుకుని అక్కడే వుండాలనుకుంటున్నట్టు చెప్పింది.
పరంధామయ్య నచ్చచెప్పాలని చూసాడు. వినలేదు సుభద్ర. ఇదివరకటంతటి బేలతనం ఇప్పుడు లేదు. ఆర్థిక స్వతంత్రం. ‘‘నేనే కావాలనుకుంటే నాతోపాటు వచ్చి నా కంపెనీకి దగ్గరగా అద్దె ఇంట్లో ఉండమనండి లేకపోతే లేదు’’ అంది.
‘‘నా స్టీల్ సిటీకి దూరం’’ చెప్పాడు మనోహర్
‘‘నువ్వే కావాలని, నా వాళ్లని వదులుకున్నాను అప్పుడు. ఇప్పుడు నిన్ను వదులుకోవడం ఏమీ కష్టం కాదు నాకు. వదులుకోవడం నా జీవితానికి ఓ అలవాటని అనుకుంటాను’’ స్థిరంగా పలికింది.
జరిగినదంతా తల్లితో చెప్పాడు మనోహర్. ఆఫీసుకు శెలవు కావాలని ఫోనులో పర్మిషన్ అడిగాడు. స్కూటర్ తీసుకుని కోడలు ఇంటివైపుగా వెడుతున్న కొడుకుని చూసి స్థాణువులా నిలబడిపోయింది సుందరమ్మ. *

No comments:

Post a Comment