Wednesday, 20 August 2014


అనసూయ అసూయ (కథ)

    పెళ్లిమండపంలో అప్పటివరకూ మోగిన బాజాలు సేద తీరుతున్నాయి. ముహూర్తానికి ఇంకా టైముంది. పెళ్లికొచ్చిన చుట్టాలతో కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి. పట్టుచీరల గరగరలు, సిల్కు పంచెల చరచరలు, పట్టుపావడాల పరవళ్లు, సఫారీ డ్రెస్సుల ఏకీకృత రంగులు, కోట్లు వేసుకున్న కోటీశ్వరులతో... అంతా ఆనందమయంగా ఉంది.
‘‘బాబాయ్.. ఆ అమ్మాయి ఎవరు..? ఎక్కడో చూసినట్లుంది. గానీ ఎవరో గుర్తుకురావడం లేదు. సింపుల్‌గా, హుందాగా ఉంది. నీకు మన బంధువర్గంలో తెలియనివారుంటూ లేరు గదా..’’ అడిగింది అనసూయ తన పక్కనే కూర్చున్న బాబాయి సత్యనారాయణతో.
‘‘ఆ అమ్మాయి నీకు వరసకు చెల్లెలవుతుంది. తెనాలిలో పండ్ల వ్యాపారం చేసే మీ దూరపు బంధువు సుబ్బారావు బాబాయి రెండో కూతురు. మీ నాన్న సంబంధీకులకు, సుబ్బారావు సంబంధీకులకు ఉన్న వైరం కారణంగా మీమధ్య రాకపోకలు లేవులే. అయినా పిల్లలేం చేశారు? మీ హయాంలోనన్నా కలసి మెలసి ఉండండి’’ అని, ‘‘అమ్మాయ్.. సరోజా..’’ అంటూ పిలిచాడు.
పదేళ్ళ కూతురు చేయి పట్టుకుని నెమ్మదిగా నడచి వెళుతున్న సరోజ సత్యనారాయణ కేకకు పక్కకు తిరిగి చూసి ‘‘బాబాయ్.. పిలిచావా?’’ అంటూ దగ్గరకొచ్చింది.
‘‘రామ్మా.. ఈమె మీ గుంటూరు పెదనాన్న కూతురు అనసూయ. ఇప్పుడు ఈమె అక్కడ పెద్ద లీడింగు లాయరు. ఈమె భర్త మోహన్ కూడా పెద్ద లాయరేలే. మీ కుటుంబాల మధ్య సామరస్య లోపం కారణంగా సంబంధాలు లేవు. ఇప్పుడు పెద్దవాళ్ళు పోయారు. వాళ్ళతోపాటే పంతాలు, పట్టింపులూ పోయాయి. ఇక మీరన్నా బంధుత్వాలు కలుపుకోండి..’’ అన్నాడు.
‘‘నమస్కారం అక్కా..’’ అంటూ నమస్కరించింది సరోజ అనసూయకి.
సరోజను చూసి అనసూయ సంతోషంతో పొంగిపోయింది. ‘నమస్కారం, కూర్చో..’ ఖాళీగా ఉన్న పక్క సీటు చూపించింది. సరోజ కూర్చుని, కూతుర్ని తన ఒళ్లో కూర్చోబెట్టుకుంది.
సరోజ కూతురు స్వప్న గడ్డం పట్టుకుని నిమురుతూ, ‘‘ఏం చదువుతున్నావ్ పాపా?’’ అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది అనసూయ.
‘‘సెవెంత్ క్లాస్’’ ముద్దు ముద్దుగా చెప్పింది స్వప్న.
‘‘ఏ స్కూల్లో?’’
స్వప్న చెప్పిన ఆ ఇంటర్నేషనల్ స్కూలుపేరు విని అనసూయ అవాక్కయిపోయింది. అది సెంట్రల్ ఎ.సితో కూడిన- దక్షిణ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ స్కూలు. అక్కడ ఎల్‌కెజిలో చేర్చడానికే డొనేషన్ లక్షల్లో ఉంటుంది. తమలాంటి మధ్య తరగతివాళ్ళకు అది ఊహలకు మాత్రమే పరిమితం.
‘‘సరోజా.. మీ ఆయనేం చేస్తుంటాడు?’’ ఆతృతగా అడిగింది అనసూయ.
‘‘అమ్మాయ్ సరోజా. వాళ్ళాయన ప్రసాదరావని గొప్ప ఇంజనీరు. పెద్ద బిల్డరు. నీవు వినే వుంటావు. విజయవాడలో రోజా అండ్ సరోజ కన్‌స్ట్రక్షన్స్‌కు అధిపతి. వ్యాపారం కోట్లలో ఉంటుంది. ఆయన సొంతూరు బాపట్ల. ఈ సంబంధం ఒకప్పుడు నీకూ వచ్చి తప్పిపోయిందే..’’ చెప్పాడు సత్యనారాయణ.
అనసూయకు అంతా గుర్తొచ్చింది. అవును.. ఈ సంబంధం తనకూ వచ్చిందే. పెళ్లిచూపుల్లో తనకు సరిగా మర్యాద చేయలేదని అలిగి వెళ్లిన పెళ్లికొడుకు ప్రసాదరావు తనకు చూచాయగా గుర్తే. అంతేగాక తన తండ్రి తరువాత రోజుల్లో చెప్పాడు. ఆ బాపట్ల ప్రసాదరావు బిల్డరుగా కోట్లు సంపాదించాడని, దేనికైనా పెట్టి పుట్టి ఉండాలని అనేవాడు. అంతేగాక అతను మనవాళ్లలో- మనకంటే లేని అమ్మాయిని చేసుకున్నాడని చెబుతుండేవాడు. అయితే- ఆ ప్రసాదరావు ఈ సరోజను చేసుకున్నాడన్నమాట.
ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనసు ఈర్ష్య తో రగిలిపోయింది.
‘‘నువ్వెంతవరకు చదివావ్ సరోజా?’’
‘‘నేను బియస్సీ గ్రాడ్యుయేట్‌ని అక్కా’’
‘‘ఏం చేస్తుంటావ్, అంటే- ఏదైనా జాబ్ చేస్తున్నావా?’’
‘‘ఉద్యోగమా? పాడా? హౌస్‌వైఫ్‌ని. పాప చదువు, ఇంట్లో పని, గార్డెన్ పర్యవేక్షణ.. దీంతోనే సరిపోతుందక్కా. ఇంకా జాబ్ చేయడం కూడానా?’’.
‘‘తోటంత పెద్దదా? ఇంట్లో పనివాళ్లుంటారుగదా. చదువుకున్న దానివి. నీకు పొద్దుపోవడం కష్టమా?’’
‘‘ఇంట్లో పనివాళ్ళు లేకేం అక్కా. అరడజను మందిపైనే ఉన్నారు. ఒక తోటమాలి, వాడి భార్య ఇంట్లో పనిమనిషి. ఆమెగాక వంటమనిషి. పైపనులు చూడ్డానికి ఓ మనిషి. అంటే కుక్కలను రెండు పూటలా బయట తిప్పడం, వాటికి స్నానం చేయించడం, వాటికి తేదీలవారీగా డాక్టరు దగ్గరకు తీసుకెళ్లి ఇంజక్షన్లు వేయించడం, ఇంకా బజారుకు వెళ్లడం లాంటివి చేస్తాడు. ఇంకొకాయన కారు డ్రైవరు. ఉదయం పాపను స్కూల్లో వదలిరావడం, మళ్లీ తీసుకురావడం. ఎప్పుడైనా తెలిసిన స్నేహితురాళ్ల ఇంటికి తీసుకుపోవడానికి, ఇలా పెళ్లిళ్లకు తీసుకురావడానికి అతనుంటాడు. మావారు పూర్తిగా ఓ కారు మాకిచ్చేశాడు. ఆయన పనులకు ఆయన కారు వేరేగా ఉంది. పగలు డ్యూటీకి ఒక గూర్ఖా, రాత్రి డ్యూటీకి మరో గూర్ఖా. ఇంతమందిని పర్యవేక్షించడం కష్టమే గదా. ఇంకా నాకు ఉద్యోగం చేసే తీరికుందంటావా అక్కా?’’
‘‘ఇల్లెలా ఉంటుంది. తోట పెద్దదేనా?’’ ఏదో ఆలోచిస్తూ అడిగింది అనసూయ.
‘‘ఎకరం స్థలంలో తోట. తోట మధ్యలో కట్టిన డ్యూప్లెక్స్ హౌస్. నువ్వు మా ఇంటికొచ్చి నాలుగు రోజులుండక్కా... అన్నీ తీరిగ్గా చూపిస్తాను. బాగా ఎంజాయ్ చేద్దాం’’ ఆశగా అడిగింది సరోజ.
‘‘అలాగేలే సరోజా.. ఒక రోజు వస్తాను. అన్నీ చూపిద్దువు గాని’’
పెండ్లి మేళాలు మోగటంతో అందరూ తమ తమ మాటలు ఆపి పెండ్లి తంతు చూడసాగారు.
పెళ్లి కార్యక్రమం చూస్తున్నా అనసూయ హృదయమంతా ఆవేదనతో దహించుకుపోసాగింది. తన ఐశ్వర్యాన్ని, వైభవాన్ని సరోజ తన్నుకుపోయినట్లు భావించ
సాగింది. తమ డాబా ఇల్లు. తాము ఉపయోగించే స్కూటర్లు.. ఇలా పెళ్లిళ్లకు రావడానికి కూడా కారులో ఖర్చని ఆఖరుకు బస్సుల్లో రావడం.. అంతా ఆమెకు వేదనను కలిగించసాగింది. ఇక అక్కడ ఉండలేక ఏదో పని ఉన్నట్లు అక్కడనుంచి లేచి వడివడిగా నడిచి మూడు వరుసల వెనుకకు వచ్చి అక్కడున్న ఓ కుర్చీలో కూర్చుంది.
తలంబ్రాలు వేసేటప్పుడు- అంతవరకూ ఎక్కడున్నాడోగాని సరోజ భర్త కూడా పెళ్లిపీటల దగ్గరకు చేరుకున్నాడు. ఇద్దరూ పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడి ఎదుట నిలుచుని అక్షింతలు వేశారు.
సరోజ భర్తను చూసిన అనసూయకు ఇంకా తెలియకుండానే అసూయ ఎక్కువైంది. జంట ఎంతో అందంగా ‘ఒకరికోసం ఒకరిని దేవుడు సృ ష్టించి’నట్లుగా ఉన్నారు. ఆమె భర్త ప్రసాదరావు ఖరీదైన సూటులో మెరిసిపోతున్నాడు. అక్షింతలు వేసిన తరువాత నేరుగా భర్తను తీసుకుని అనసూయ వద్దకు వచ్చింది. భర్తను పరిచయం చేసింది.
‘‘ఈమె మా అక్క అనసూయ.. బంధువులమైనా అనేక కారణాల వల్ల మేము కలుసుకోలేకపోయాం. ఇపుడు మా సత్యనారాయణ బాబాయి ద్వారా ఒకరినొకరం తెలుసుకున్నాం..’’.
సరోజ మాటలు ఆమెకు కర్ణకఠోరంగా ఉన్నాయి. తన నోటికాడి ఆహారం లాక్కున్న రాక్షసిలా అనసూయ దృష్టిలో ఆమె ఉంది.
‘హాయ్..’ అన్నాడు ప్రసాద్.
అనసూయ సిగ్గుల మొగ్గవుతూ తిరిగి ‘హలో’ చెప్పింది.
ఇంతలో సరోజ కూతురు మంచినీళ్లు కావాలని అడగడంతో ‘‘అక్కా.. మీరు మాట్లాడుకొంటుండండి. నేను పాపకు మంచినీళ్లు తాగించి వస్తా’’ అంటూ ముందుకు నడిచింది.
‘‘మరోలా అనుకోకపోతే మిమ్మల్నొకటడగుతాను. మిమ్మల్ని ఎక్కడో చూసాను. కానీ- ఎక్కడ చూసానో జ్ఞాపకం రావడంలేదు. మీకేమయినా నన్ను చూసినట్లు గుర్తుందా?’’ స్టైల్‌గా అడిగాడు ప్రసాద్.
అనసూయకు రోషం ముంచుకొచ్చింది. సరోజ వచ్చేలోగా తన మనసులోని ఆవేదననంతా వెళ్లగక్కాలని ఉంది. ‘‘అవును.. మీరెందుకు తెలియదు. పనె్నండేళ్లనాడు మా ఇంటికి పెళ్లిచూపులకొచ్చారు. మీకు సరిగా మర్యాదలు చెయ్యలేదని అలిగిపోయారు. లేకపోతే నేను ఈరోజు సరోజ స్థానంలో ఉండాల్సినదాన్ని...’’ తొందరపడి అనేసింది.
ప్రసాద్ ఆవేశపడకుండా, ‘‘అవునండీ. ఇప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది. ఆ రోజు పెళ్లిచూపుల్లో నేను మిమ్మల్ని బాగా ఇష్టపడ్డాను. కట్నాలు కూడా ఆశించలేదు. మా మామయ్య తొందరపాటువల్ల మీ సంబంధం చెడిపోయింది. చాలాకాలం వరకూ మీరు నా మనసులో మెదులుతూనే ఉన్నారు. జరిగిందానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను’’ అన్నాడు బాధ వ్యక్తపరుస్తూ.
ప్రసాద్ గుండెల్లో తనకున్న స్థానానికి మురిసిపోయింది అనసూయ.
‘‘మీ ఆయన పెళ్లికొచ్చాడా? మీకు పిల్లలెందరు?’’ మళ్లీ అడిగాడు.
‘‘మా ఆయన అర్జంటు కోర్టు పనిమీద ఊళ్ళోనే ఉండిపోయారు. మాకు ఇద్దరబ్బాయిలు. వాళ్ళను కూడా పెళ్లికి తీసుకురాలేదు’’.
‘‘మీకు ఇద్దరు పిల్లలా? అదేదో టివి యాడ్‌లో చూసినట్టు ‘మమీ’ అంటూ కూతురొచ్చి తల్లిని కౌగిలించుకొనేదాకా ఆమె తల్లని ఎవరికీ తెలియదు. పెళ్లికాని ముగ్ధలాగే వయసు పైబడకుండా ఉంటుంది. అలా సౌందర్యాన్ని కాపాడుకొంటున్నారు మీరు..’’.
అనసూయ ఏం మాట్లాడకుండా సిగ్గుతో తలవంచుకుంది.
‘‘మీరు ఎప్పుడయినా ఫోను చేసి రండి. మి మ్మల్ని నా ఏ.సి. కారులో విజయవాడంతా తిప్పి చూపిస్తాను. దేవాలయాలు, సినిమాలు, పార్కులు అన్నిటికీ వెళ్దాం. మీరు కోరిన హోటల్లో మీకు ఇష్టమైనవి తినిపిస్తాను. ఇలాగయినా ఆనాడు మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాను’’ అంటూ జేబులోంచి తన ఖరీదైన విజిటింగు కార్డు ఇచ్చాడు. ఇంతలో ఎవరో బంధువులామె అనసూయని పిలుస్తూ వచ్చేసరికి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప్రసాద్ ఇచ్చిన విజిటింగు కార్డును పదిలంగా పర్సులో పెట్టుకుంది.
బఫేలో భోజనాలను ప్లేట్లలో పెట్టుకుని ఒక పక్కగా వచ్చి తినసాగారు అనసూయ, ఆమె స్నేహితురాలు. తన అదృష్టాన్ని సొంతం చేసుకుందని భావిస్తున్న సరోజ తనను పిలుస్తున్నా వినిపించుకోకుండా తప్పించుకుని తిరుగుతోంది అ నసూయ.
‘‘ఏమిటే వాడితో అంత క్లోజుగా మాట్లాడుతున్నావు’’ స్నేహితురాలి మాటలకు ఉలిక్కిపడింది.
‘‘ఆయనో పెద్ద బిల్డరు విజయవాడలో. కోటీశ్వరుడు. అలా అనకు’’ అంది అనసూయ.
‘‘అంతే నీకు తెలిసింది. అతను సరోజను పెళ్లిచేసుకోకముందే రోజా అనే తన కొలీగ్.. తమిళమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆమెకొక కొడుకు కూడా. ఆమెతో విజయవాడ పడమటలో కాపురం. ఎప్పటికో విషయం తెలిసిన సరోజ ఏమీ చేయలేక- అంతా తన ప్రారబ్దం అని సరిపెట్టుకుంది. అఫిషియల్ ప్రోగ్రామ్స్‌కు రోజాను భార్యగా తీసుకుపోతాడు. బంధువుల పెళ్లిళ్లకు సరోజకు భర్తగా వస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరోజ చాలా మంచిది. బాధను దిగమింగుకుని కూతురి కోసం బతుకుతోంది’’.
స్నేహితురాలి మాటలతో- అంతవరకూ ఈర్ష్యతో సరోజమీద పెంచుకున్న అసూయ అనసూయలో ఎగిరిపోయింది. తను చదువుకున్నదై కూడా పక్కవాళ్ల సుఖం చూసి ఓర్చుకోలేకపోయినందుకు బాధపడింది. ఇప్పుడు సరోజపై విపరీతమైన జాలి, అంతులేని ప్రేమ ఏర్పడింది.
భోజనం పూర్తయి చేయి కడుక్కున్న వెంటనే బ్యాగులోంచి ప్రసాదరావు విజిటింగు కార్డు క్రిందపడేసి కాలితో నలిపేసింది. ఊరికి వెళ్తున్నానని చెప్పడానికొచ్చిన సరోజను ప్రేమగా కౌగిలించుకుని నుదుట మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. *

No comments:

Post a Comment