Telugu short stories




మేడిపండు


         ''అబ్బాయి మహేష్‌ నుంచి వారమైంది ఫోన్‌ వచ్చి'' అనుకుంది సుజాత. తను మాత్రమే ఇలా ఉందా, లోకంలో తల్లులందరూ ఇంతేనా. సుజాత ఆలోచనలను భగంచేస్తూ వీధి తలుపు చప్పుడైంది. ఆమెలేచి తలుపు తీసి, ఎదురుగా నిల్చున్న భర్తతో ''ఆలస్యమైందేమిటి'' అంది. ''రామారావు స్కూలు మూసేశాక మన ప్రెసిడెంటుగారి దగ్గరకు వెళ్ళి వచ్చాను'' అన్నాడు.
సుజాత ప్రశ్నార్థకంగా చూసింది. రామారావు ''మహేష్‌ చేత చిన్న ఇండిస్టీ పెట్టిద్దామ నుకుంటున్నాం కదా. వివరాలు మాట్లాడదామని వెళ్ళాను'' అన్నాడు.
''ఇండిస్టీ పెట్టించాలని మీరనుకుంటున్నారు. పెట్టాలని వాడను కుంటున్నాడా?''
''అదేంమాట? ఆ ఉద్దేశంతోనే కదా ఇంజనీరింగ్‌లో మెకానికల్‌ బ్రాంచ్‌ తీసుకోమని చెప్పాను. అందరూ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ వైపు పరుగులు తీసేవారే. కాలేజి ఎలాంటిదైనా ఫర్వాలేదు. కంప్యూటర్సే చదవాలి. మనవాడలా కాకుండా మంచి కాలేజిలో చదువుతున్నాడు. మన ఊళ్ళోనే ఫ్యాక్టరీ పెడితే పదిమందికి పని కల్పించిన వాడవుతాడు''.
''అప్పుడప్పుడు అందరిలా కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదవడం లేదనుకుంటూ ఉంటాడు''
''చిన్నపిల్లాడు. వాడికేం తెలుస్తుంది. నాలుగేళ్ళయ్యాక వాడికే మంచీ చెడూ తెలిసి వస్తాయి. అన్నట్లు ఈ మధ్య ఫోనేమీ చెయ్యలేదెందుకో'' అంటూండగానే మహేష్‌ నుంచి ఫోను వచ్చింది. కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాడు. ''హలో మహేష్‌ ఏమిటి సంగతులు?''
''క్యాంపస్‌ ఇంటర్వ్యూలు అవుతున్నాయి. అందుకే చెయ్యలేకపోయాను. నాకు ఉద్యోగం వచ్చింది''.
''ఉద్యోగమా? ఎక్కడ వచ్చింది? వివరంగా చెప్పు''
''చాలామంచి ఉద్యోగం. నెలకు యాభైవేల జీతం. ఈ ఆదివారం ఇంటికొచ్చినప్పుడు అన్నీ చెప్తాను''. మహేష్‌ ఫోన్‌ పెట్టేశాడు. రామారావు మాట్లాడకుండా కూచున్నాడు. సుజాత భర్తను పలకరించే ధైర్యం చెయ్యలేకపోయింది.
***
మహేష్‌ ఆదివారం ప్రొద్దుటే వచ్చాడు. స్నానం చేసి టిఫిన్‌ తిన్నాక తండ్రి, కొడుకులిద్దరూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. సుజాత అక్కడే కూచుని కూరలు తరుగుతోంది.
''చెప్పు మహేష్‌ ఉద్యోగం వచ్చిందనీ, యాభైవేల జీతమనీ చెప్పావు. అంతకన్నా ఏం చెప్పలేదు. ఏమిటి జాబ్‌? ''
'' సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌''
''అదేమిటి, నువ్వు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నావు కదా''
''నిజమే. కానీ కొన్ని స్పెషల్‌ కోర్సులు కూడా చేశాను. అందుకే సెలక్షన్‌ వచ్చింది.''
''నువ్వు చేరడానికి ఒప్పేసుకోలేదు కదా''
మహేష్‌ ఆశ్చర్యంగా చూసి ''అదేమిటి అలా అంటున్నారు? ఇంతకన్నా మంచి ఉద్యోగం నాకు దొరుకుతుందా?'' అన్నాడు.
''ఉద్యోగం మంచిదా కాదా అని నేను ఆలోచించడం లేదు. నీ చదువయ్యాక నువ్వు మన ఊళ్ళోనే ఇండిస్టీ పెట్టాలనుకున్నాను. అందుకే మెకానికల్‌ బ్రాంచి చదవమన్నాను.''
''ఈ ఊళ్ళోనా? ఈ చిన్న చోట ఏ ఫ్యాక్టరీ పెడతాం? ఏం తయారుచేస్తాం? ఎక్కడకి పట్టికెళ్ళి అమ్ముతాం?''
''ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగావు. ఇక్కడ కష్టసుఖాలూ, లాభనష్టాలూ తెలియవా? మన
రైతులందరూ ఎక్కువగా టొమాటో పండిస్తున్నారు. ఒక్కొక్కసారి లాభం వస్తుంది. ఒక్కొక్కసారి టొమాటోలు రోడ్డు మీదనే పారపొయ్యాల్సి వస్తుంది. మనకున్న రెండెకరాలలోనూ అదే పండిస్తున్నాం. నాకు ఉద్యోగముంది కాబట్టి నెలకింత అని జీతమొస్తోంది కాబట్టి తిండికీ, బట్టకీ, నీ చదువుకీ ఇబ్బంది లేకుండా ఉంది''.
''ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నారో తెలియడంలేదు. మీరు రిటైర్‌ అయినా ఏ ఇబ్బందీ ఉండదు. నెలకి యాభైవేలు నాకు వస్తాయి. మిమ్మల్ని ఏ ఇబ్బందీ లేకుండా నేను చూసుకుంటాను''
''నా ఒక్కడి విషయం కాదు. మన ఊరి గురించి ఆలోచించు. నువ్విక్కడ టొమాటోలతో పల్ప్‌ కానీ సాస్‌ కానీ చేసే ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందని నాకుంది. రైతుకీ నష్ట భయముండదు. పదిమందికి ఉపాధి. నీకు సొంత ఇండిస్టీని పెంచి పెద్దదిగా చేసుకునే తృప్తి.''
''ఇక్కడా, ఈ ఊళ్ళోనా?''
''అవునిక్కడే, ఇది నీ సొంతూరు'' రామారావు గొంతుక పెద్దదయింది.
సుజాత కల్పించుకుని ''ఇప్పటికిప్పుడు వాడు మాత్రం ఏం చెప్తాడు? పరీక్షలయ్యేసరికి ఆలోచిం చుకోవచ్చు. ఇంకా మూడు నెలలుందిగా'' అంది.
ఆరోజు సాయంత్రం రామారావు బయటకు వెళ్ళిన సమయంలో మహేష్‌ తల్లితో అది కాదమ్మా. నాన్న ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ అంటారేమిటి? మనకే కరెంటు సరిగ్గా రావడం లేదు. ఒకవేళ సప్లై ఉన్నా మిషన్ల మధ్య పని. హాయిగా ఎ.సి. రూంలో కంప్యూటర్‌ ముందు కూచుంటే నెల తిరిగే సరికి యాభైవేల రూపాయలు చేతిలో పడతాయి. అందరం సుఖంగా బతకవచ్చు'' అన్నాడు.
సుజాత అటూ ఇటూ కాకుండా ''సరేలే, ఇంకా టైముందిగా ఆలోచించేందుకు'' అంది.
మహేష్‌ ఆలోచించుకోలేదు. తన ఫ్రెండ్స్‌ అందరిలాగానే తనూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరేందుకే నిర్ణయించుకున్నాడు.
***
ఏడాది గడిచింది. మహేష్‌ బలవంతపెట్టగా, పెట్టగా సుజాతా, రామారావులు అతను పనిచేసే సిటీకి వచ్చారు. వాళ్ళను రిసీవ్‌ చేసుకునేందుకు కారులో స్టేషనుకి వచ్చాడు మహేష్‌.
''కారెప్పుడు కొన్నావు?'' సంబరంగా అడిగింది సుజాత.
''రెండు నెలలయిందమ్మా. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేద్దామని ఇంతవరకూ చెప్పలేదు.''
లిఫ్టులో పైకి వెళ్ళాక ''ఇదే మనముండే ఫ్లాట్‌. నేనూ, నా కొలీగ్‌ కల్సి ఉంటున్నాం. డబుల్‌ బెడ్రూం, హాల్‌, కిచెన్‌. ఇద్దరమూ వంట చేసుకోం. కిచెన్‌ కాఫీ పెట్టుకుందుకే''. అంటూ తలుపు తీశాడు.
మార్బుల్‌ ఫ్లోర్‌తో, ట్రాన్స్పరెంట్‌ గాజు కిటికీలతో, సిఎఫ్‌ఎల్‌ లాంప్స్‌తో ఇల్లు అందంగా ఉంది.
''అద్దె ఎంత?'' అడిగాడు రామారావు
''ఇరవై వేలు''
''అమ్మ బాబోరు'' అంది సుజాత.
''ఇద్దరం చెరిసగం పెట్టుకుంటాంగా. యాభైవేలలో అయిదోవంతేకదా. మన ఊళ్ళో మాత్రం ఆ మాత్రం ఇవ్వకుండా ఇల్లొస్తుందా?''
సిటీలోని మాల్స్‌, థిóయేటర్స్‌, మ్యూజియమ్స్‌, పార్క్స్‌ అన్నీ చూపించి రైలెక్కిస్తూ మహేష్‌ ''చూశారా నాన్నా ఇక్కడ లైఫ్‌ ఎలా ఉందో. గ్లోబలైజేషన్‌ తర్వాత మన దేశంలోనూ అన్ని సౌకర్యాలూ అమర్చుకోవచ్చు. అన్ని వస్తువులూ కొనుక్కోవచ్చు. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయాక ఒక్క గ్రామం గురించి ఆలోచిస్తూండడం విశాల దృక్పథం కాదు'' అన్నాడు.
రామారావు ఏమీ మాట్లాడలేదు.
***
ఆరు నెలల తర్వాత మహేష్‌ తల్లితండ్రులను చూడ్డానికి స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చాడు.
''ఓసారి సురేష్‌ మాస్టార్ని చూసిరా, నీ చదువు విషయంలో ఆయనెంతో శ్రద్ధ తీసుకున్నారు. మ్యాథమాటిక్స్‌కి ట్యూషన్‌ పెట్టించడం నా జీతంలో అయ్యే పనికాదు''. అన్నాడు రామారావు.
మహేష్‌ తన లెక్కల మాష్టారింటికి వెళ్ళి, పళ్ళ బుట్టను ఆయన దగ్గరపెట్టి నమస్కరించాడు.
''రావోరు మహేష్‌రా, ఎలా ఉంది ఉద్యోగం, ఏమిటి విశేషాలు?''
మహేష్‌ తన ఉద్యోగ వివరాలు చెప్పి ''అంతా మీ చలవే సార్‌'' అన్నాడు.
''నేను చేసిందేముంది? నువ్వు తెలివైన కుర్రాడివి. బాగా చదువుకున్నావు. సిటీలో ఉన్నన్ని సదుపాయాలూ, అవకాశాలూ పల్లెటూళ్ళలో లేవు. అందుకే స్టూడెంట్స్‌కి నా వీలైన సాయం చేస్తానంతే''
''సిటీలో కార్పొరేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండుంటే లక్షలు గడించే వారు సార్‌''
''డబ్బే సర్వస్వంకాదు. నలుగురికి ఉపయోగ పడాలన్నదే నా ఆశ. అమ్మారు రేఖా! కొంచెం కాఫీ తేమ్మా''
''అబ్బే ఎందుకు సార్‌'' అని మహేష్‌ అంటూం డగానే రేఖ లోపల నుంచి కాఫీ తెచ్చి ఇచ్చింది.
''మా అమ్మాయి రేఖ గుర్తుందిగా. రేఖా ఇతను మహేష్‌. రామారావు మాస్టారి అబ్బాయి. మర్చి పోయావా'' లేదన్నట్లు తల ఊపి రేఖ లోపలకు వెళ్ళిపోయింది.
***
రాత్రి భోజనాల దగ్గర రామారావు కొడుకు పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. సుజాత కూడా ''అవున్రా అబ్బారు. చదువు పూర్తయింది. మంచి ఉద్యోగ మొచ్చింది. నువ్వో ఇంటివాడివయితే మాకు నిశ్చింత''. అంది.
''ఇప్పుడే పెళ్ళికి తొందరేముందమ్మా''.
''అది కాదు మహేష్‌. ఈ రోజు వెళ్ళినప్పుడు సురేష్‌ మాస్టారింట్లో వాళ్ళమ్మాయి రేఖను చూశావుగా. ఆ పిల్లయితే బాగుంటుందను కుంటున్నాం'' అన్నాడు రామారావు.
''కృతజ్ఞతా భావమా?'' ఎన్నడూ లేనిది మహేష్‌ కొంత కటువుగా అడిగినట్లనిపించింది అతని తల్లితండ్రులకి.
''అదేం మాట మహేష్‌ అలా అంటున్నావు? ఆ కుటుంబం చాలా మంచిది. రేఖ వినయం, వందనం ఉన్న పిల్ల. బాగా చదువుకున్న అమ్మాయి. అంతేకానీ నీకు చదువు చెప్పడానికీ, ఈనాడు సంబంధం కలుపుకోడానికీ లింకు లేదు.''
''ఇప్పుడే పెళ్ళి గురించి నేనేం అనుకోడం లేదు. కొంచెం ఆలోచించుకోనివ్వండి'' అన్న మహేష్‌ కొంతసేపయ్యాక తల్లి దగ్గర గునిగాడు.'' సిటీలో ఒక్క జీతం మీద బతకడం కష్టమమ్మా. రేఖ ఉద్యోగం చెయ్యడం లేదు. ఒకవేళ చేద్దామనుకున్నా పెద్ద జీతం రాదు. కనీసం ముప్ఫై, నలభై వేలయినా అమ్మాయి సంపాదించకపోతే బతకడం కష్టమైపోతుంది. ఏం చెయ్యాలిప్పుడు?''
సుజాత ఏమీ మాట్లాడలేదు, మహేష్‌ రెట్టించి ఆమెను ఏమీ అడగలేదు.
***
ఆరు నెలల తర్వాత మహేష్‌ వివాహం అతను కోరుకున్నట్లుగా కొలీగ్‌ ఉషతో జరిగింది. హనీమూన్‌ వెళ్ళి వచ్చిన మూడో రోజున అతని బాస్‌ పిలిచి ''నెక్ట్స్‌ వీక్‌ నుంచి రాత్రి మూడు గంటల నుంచి పని చెయ్యవలసి ఉంటుంది''. అన్నాడు.
మహేష్‌ కొంత ఆశ్యర్యంగా, కొంత నిరుత్సాహంగా ''ఎందుకు'' అన్నాడు.
''ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్‌ చెయ్యాలి. అంటే వాళ్ళ టైమింగ్స్‌కి సరిపోయేలా మనం పనిచెయ్యాలి. మీ టీంలో అందరికీ అవే టైమింగ్స్‌''
రెండు, మూడేళ్ళుగా పనిచేస్తున్నా మహేష్‌లో అమాయకత్వం పూర్తిగా పోలేదేమో. అతను ''వాళ్ళే టైమింగ్స్‌ అడ్జస్ట్‌ చేసుకోవచ్చుగా. మనకి ఎనిమిది నుంచి అయిదు గంటలంటే వాళ్ళకి ఒంటిగంట నుంచి రాత్రి పది దాకా సుమారుగా కదా. అంత కష్టంకాదు''. అన్నాడు.
బాస్‌ గట్టిగా నవ్వాడు. ''డబ్బిచ్చేది వాళ్ళు, పని చేసేది మనం''.
***
మహేష్‌ తన కొత్త టైమింగ్స్‌ చెప్తే ఉష ఏ మాత్రం కంగారుపడలేదు. ''ఇటీజ్‌ ఆల్‌రైట్‌. నువ్వు ఉదయం మూడు గంటల నుంచి పన్నెండు గంటలదాకా ఆఫీసులో ఉంటావు. నేను ఈవెనింగ్‌ అయిదు దాకా ఉంటాను. సాయంత్రమంతా ఇద్దరం ఎంజారు చెయ్యొచ్చు. నో ప్రాబ్లం''.
ఉష రియాక్షన్‌ మహేష్‌కి వింతగా అన్పించింది కానీ ఏమీ మాట్లాడలేదు.
''అసలు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. మన ఇంటిని ఫర్నిష్‌ చేసుకోవాలి. డ్రాయింగ్‌ రూం, డైనింగ్‌ రూం, రెండు బెడ్రూమ్స్‌, స్టడీకి ఏవేం కొనాలి ఇప్పుడే ఇంటర్నెట్‌లో చూద్దాం. టివి కూడా పెద్దది కొనాలి. ఫ్రిజ్‌ ఫైవ్‌ హండ్రడ్‌ లీటర్స్‌ది బెటర్‌''.
ఇద్దరూ కూచుని నెట్‌లో వరసగా ఏవేం కొనాలో చూసి సెలెక్ట్‌ చేసే సరికి అర్ధరాత్రయింది. డబ్బున్నప్పుడు కొనుక్కుందాం అనుకుంటే మల్టీనేషనల్‌ కంపెనీలు కానీ, క్రెడిట్‌ కార్డులిచ్చే బ్యాంకులు కానీ ఊరుకోవు. అవి ఊరుకున్నా యువత ఊరుకుంటుందా?
***
కొత్త కాపురం చూడ్డానికి వచ్చిన సుజాత, రామారావులు ఆశ్చర్యపోయారు.
''ఇన్ని వస్తువులు ఒక్కసారే ఎలా కొన్నావు? అవునులే ఇద్దరి జీతాలున్నాయిగా. నెలకో వస్తువు కొన్నా సరిపోతుంది. నేనూ, అమ్మా ఏడాదికొకటిగా నెమ్మది నెమ్మదిగా అమర్చుకున్నాం''.
మహేష్‌ సన్నగా నవ్వాడు. ''ఇప్పుడలా దేనికీ ఆగే అవసరం లేనే లేదు నాన్న. అన్నీ ఒకేసారి కొనెయ్యొచ్చు. ప్రతినెలా అకౌంట్‌లోంచి వాళ్ళకి చెల్లింపు చెయ్యొచ్చు'' అన్నాడు.
***
రాత్రి ఎప్పటికీ నిద్రపోకుండా దొర్లుతున్న రామారావుతో సుజాత ''ఏమిటి ఆలోచిస్తున్నారు. హాయిగా పడుకునే ప్రయత్నం చెయ్యండి'' అంది.
''అది కాదు సుజాతా. మన ఎంత పొదుపుగా బతికాం. ఇప్పుడన్నీ ఒకేసారి కొనేశారు. ఇద్దరూ ఇన్‌కమ్‌టాక్స్‌ కట్టద్దా, కొంతైనా పొదుపు చెయ్యద్దా''
''వాళ్ళ జమాఖర్చులు మీకెందుకు? పిల్లల్ని కనిపెంచి పెద్దచేశాం. మన బాధ్యత అయిపోయింది'' ''సుజాతా! బాధ్యత తీరిపోవడమేమిటి? పిల్లల పట్ల బాధ్యత, చుట్టూ ఉన్న వారి పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత ఎప్పటికీ ఉంటాయి. కొన్న వస్తువులని చూడు. అన్నీ విదేశీవే. ఇందుకేనా స్వాతంత్య్ర పోరాటం చేసింది. ఆనాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఈనాడు మల్టీనేషనల్స్‌, మన రైతులూ, కార్మికులూ మట్టికొట్టుకు పోవలసినదే.''
''ఒకటి, రెండేళ్ళు పోనివ్వండి. పిల్లలు పుడతారు. అప్పుడు నెమ్మదిగా చెప్దురుగానీ''.
ఎ ఎ ఎ మహేష్‌ తల్లితండ్రులను రైలెక్కించి ఇంటికొచ్చేసరికి ఉష టివి చూస్తోంది. ఏమిటి విశేషాలంటూ అతను ఆమె పక్కనే కూచున్నాడు. ''ఇప్పుడే మా ఫ్రెండ్‌ ఫోనుచేసి కన్నీళ్ళు పెట్టుకుంది. వాళ్ళ ఆఫీసులో మాస్‌ స్కేల్లో రిట్రెంచ్‌మెంట్‌ అవుతోంది. తన ఉద్యోగం కూడా పోయిందట. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అని భయపడుతోంది''.
''మనకా ప్రాబ్లం లేదులే. నాకు పోయినా నీకుంటుంది. నీకు పోతే నాకుంటుంది.''
''అయినా మన బిపి ఓ లో ప్రాజెక్టులు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడిద్దరినీ సింగపూర్‌కి సంబంధించిన ప్రాజెక్టులోనే వేశారు. కల్సి వెళ్ళి కల్సి వచ్చేస్తున్నాం. ఇద్దరికీ హాయిగా ఉంది.''
మర్నాడు 'హాయిగా ఉన్నాం' అన్న మాట ఇద్దరి నోట్లో వచ్చే ఛాన్స్‌ లేకపోయింది. ఇద్దరి టీబిల్స్‌ మీద పింక్‌స్లిప్స్‌ ఉన్నాయి. తలెత్తి చూసేసరికి చాలామంది ముఖాల్లో ఆందోళన. అందరికీ అదే పరిస్థితా?
నెమ్మదిగా కారణం తెలిసింది. ఇండియాలో కన్నా ఫిలిప్ఫైన్స్‌లో చవగ్గా పని జరిగే సూచనలు కన్పించాయి. ఇండియాలో బిపిఓ మూసేసి ఫిలిప్పైన్స్‌లో తెరుస్తున్నారు. ఎక్కడ చవగ్గా పని చేసేవాళ్ళు దొరికితే అక్కడే పని చేయించుకోడం వ్యాపార విజయ రహస్యం. మరి ఎంప్లాయీల మాట ఏమిటి?
వాళ్ళ గోడు ఎవరికిపడుతుంది? ఇప్పుడేం చెయ్యాలి? అన్ని వస్తువులూ లోన్‌ చేసికొన్నారు. లోన్‌ తీర్చకపోతే క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు ఊరుకోవు. మనిషిని చూసి అప్పు ఇచ్చామంటారు. మనిషి రక్తాన్ని జలగలా పీల్చుకుంటారు. ఏం చెయ్యాలి, ఎవరికి తనగోడు పడుతుంది?
మహేష్‌ ఆలోచనలని భగం చేస్తూ ఫోను మోగింది. తన తండ్రి క్షేమంగా చేరినట్లు చెప్పడానికి చేసినట్లున్నారు.
''నాన్నా, నా ఉద్యోగం పోయింది'' ఆ ఒక్క వాక్యం వెనక ఎంతో ఉంది... ''నాన్నా, మీరు ఆనాడు చెప్పారు. భూమి తల్లిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు ఉపయోగంగా ఏదైనా చెయ్యమన్నారు. చిన్న ఫ్యాక్టరీ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించ మన్నారు. అవేవీ నేను పట్టించుకోలేదు. ధనం కోసం వెంపర్లాడాను. నాకు పెద్ద జీతమిస్తున్న వాడు నన్ను మించి డబ్బు కోసం అంగలారుస్తున్నాడని ఇప్పుడే తెలిసింది. కంపెనీకి కావల్సింది లాభం మాత్రమే. ఉద్యోగులను పట్టించుకోదు. ప్రపంచం కుగ్రామమంటున్నారు. కుగ్రామం అంటే చెడ్డవాళ్ళ లాభానికి ఏర్పడ్డ గ్రామం. నన్ను క్షమించండి నాన్నా''
''బాబూ మహేష్‌, భయపడకు, వర్రీకాకు'' రామారావు అన్న ఆ వాక్యం వెనక ఎంతో ఉంది... ''మహేష్‌, తెలియక తప్పుచేశావు. బిపిఓ అంటే మాయామృగమైన బంగారు జింక అని తెల్సుకోలేకపోయావు. నువ్వే కాదు యువతీ యువకుల్లో చాలా మందికి తెలియడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుకున్నావు. నీ చదువుకి తగిన ఉద్యోగం దొరకడం కష్టం కాదు. ఇంత జీతం ఉండకపోవచ్చు. లేదా నేను సూచించినట్లుగా ఇండిస్టీ పెట్టినా సరే, భయపడే పనిలేదు.''
తండ్రీ కొడుకుల మధ్య మాటలు సెల్‌టవర్స్‌ ట్రాన్స్మిట్‌ చేసి ఉండచ్చుకానీ వారి హృదయ సంవాదాన్ని ఏ వేవ్స్‌ ట్రాన్స్మిట్‌ చేశాయో తెలియదు. ఇద్దరి మధ్యా దూరం తరిగి ప్రపంచం ఆర్థ్ధికంగా కాకా హార్ధికంగా కుగ్రామమైనట్లు వారికి అన్పించింది.

పశ్చాత్తాపం!


 తిమ్మాపురం అనే గ్రామంలో రామోజీ అనే భూస్వామి ఉండేవాడు. ఆ ఊరి మొత్తంలో అతనే ధనవంతుడు కావడంతో అతనికి చాలా గర్వంగా ఉండేది. ఓ రోజున రామోజీ పొరుగూరుకు వెళ్లవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఉన్న నదిని దాటాల్సిందే. అందువల్ల రామోజీ ఓ పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ నడిపేవాడు మరో మనిషి వస్తే బయలుదేరుదామని ఎదురు చూడసాగాడు. అంతలో అదే గ్రామానికి చెందిన చెప్పులు కుట్టే చంద్రయ్య వచ్చాడు. రామోజీ కూర్చున్న పడవలోకి ఎక్కి కూర్చోబోయాడు. అంతే! రామోజీ శివాలెత్తిపోయాడు. నాలాంటి ధనవంతుని పక్కన చెప్పులు కుట్టే నీలాంటి వాడు కోర్చోవడం ఏంటి? ఒరేరు! ఇద్దరు మనుషులకు అయ్యే కిరాయి నేనే చెల్లిస్తాను. ఇంకెవ్వరినీ పడవ ఎక్కించుకు పద అని కోపంగా పడవ నడిపేవాడితో అన్నాడు రామోజీ. అందుకు పడవనడిపేవాడు సరేనని పడవని ముందుకు తీసుకెళ్ళాడు. చంద్రయ్య మౌనంగా ఒడ్డుపై ఉండిపోయాడు. కొద్దిసేపటికి రామోజీ ప్రయాణిస్తున్న పడవ పెనుగాలికి బోర్లా పడింది. ఈత రాని రామోజీ నన్ను కాపాడండి! రక్షించండి! అంటూ కేకలు వేశాడు. అది గమనించిన చంద్రయ్య ధైర్యంగా నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి రామోజీని ఒడ్డుకు చేర్చాడు. స్పృహ కోల్పోయిన రామోజీ కడుపుపై నొక్కి నీళ్ళు బయటకు కక్కించాడు. కొద్ది సేపటికి స్పృహలోకి వచ్చిన రామోజీ చంద్రయ్యను హత్తుకొని చంద్రయ్యా నన్ను క్షమించు. ధనవంతుడిని అనే అహంకారంతో నిన్ను అవమానించాను అంటూ పశ్చాత్తాపపడ్డాడు. రామోజీలో మార్పు కలిగినందుకు చంద్రయ్య సంతోషించాడు.


అంకుశం

                  సమయం ఉదయం తొమ్మిది గంటలు.. పాల్వంచ ఫెర్టిలైజర్స్‌ కంపెనీ సైరన్‌ ''కార్మికులారా! రండహో'' అన్నట్టు మ్రోగింది. జనరల్‌ షిప్ట్‌ వాళ్ళంతా రకరకాల వాహనాల మీద వస్తున్నారు. సరిగ్గా అప్పుడే ''గిరిజన కార్మికుడికి న్యాయం చెయ్యాలి'', ''వెంటనే ఆఫీస్‌ సైడ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చెయ్యాలి'' అంటూ.. కంపెనీ మెయిన్‌ గేట్‌ దగ్గర్లోవున్న కొమరం భీమ్‌ విగ్రహం ముందు రోడ్డుకు అడ్డంగా నిల్చున్న కొంతమంది చేస్తున్న నినాదాలతో ఒక్కసారిగా ఆ పరిసరాలు హోరెత్తిపోసాగాయి. దాంతో ఉలిక్కిపడిన సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి వాళ్ళను చుట్టుముట్టారు. డ్యూటీకి వెళుతున్న వాళ్ళంతా ఆగిపోయి ''పిట్టన్న విషయంలోనే కావచ్చు!'' అనుకోసాగారు. ''అంగవికలుడైన గిరిజన కార్మికుడికి వెంటనే న్యాయం చేయాలి'' అనుకుంటూ వున్నవాళ్ళకు తోడుగా మరి కొంత మంది గిరిజనులు చేరవచ్చారు. అంతమంది గిరిజనులక్కడ గుమిగూడడం చూసిన కార్మికులు దగ్గరికొచ్చి ''ఏం జరిగింది'' అంటూ పిట్టన్ననే అడిగారు. అసలు జరిగిందేమిటో నలుగురికి తెలియడమే మంచిదనుకున్న పిట్టన్న తన చుట్టూ మూగి వున్న తోటి కార్మికుల వంక చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు.
***
పిట్టన్న వాళ్ళకున్న ఇరవై ఎకరాల భూమి ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో కలిసిపోయింది. భూ ములు కోల్పోయిన వాళ్ళందరికీ కంపెనీలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సర్కార్‌ ఆ తరువాత మాట తప్పింది. పదవ తరగతి వరకు చదువుకున్న పిట్టన్న చేతులు ముడుచుకుని కూర్చోకుండా భూములు కోల్పోయిన వాళ్ళందరినీ కూడేసి రకరకాలుగా ఆందోళనలు చేశాడు. ఆ ఆందోళనల ఫలితంగా దిగివచ్చిన ఫెర్టిలైజర్స్‌ కంపెనీ యాజమాన్యం భూములు కోల్పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలిచ్చింది.
పోరాడి ఉద్యోగం సంపాదించుకున్న పిట్టన్న, ఉద్యోగం చేసుకుంటూనే ప్రైవేట్‌గా డిగ్రీ చదివాడు. తోటి గిరిజన కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యంతో రాజీలేకుండా పోరాడుతున్నాడు. మిగతా యూనియన్ల నాయకులకు పిట్టన్న కారణంగానే గిరిజన కార్మికులెవ్వరూ తమ దగ్గరికి రావడం లేదన్న ద్వేషాన్ని రగిలించింది. ఎక్కడ వీలైతే అక్కడ పిట్టన్నను తొక్కిపడెయ్యడానికి వాళ్ళంతా కాచుక్కూర్చున్నారు.
ట ట కాల ప్రవాహంలో మరో ఏడు వందల ఇరవై రోజులు కొట్టుకుపోయాయి. ఈ మధ్యకాలంలో పిట్టన్న పేరు గిరిజన కార్మికులతో పాటు గిరిజనేతర కార్మికుల్లో కూడా చొచ్చుకుపోయింది. మిగతా యూనియన్ల నాయకులకు అది మరింత కోపాన్ని తెప్పించింది. ఇక లాభం లేదనుకున్న ఆ ఇతర యూనియన్ల నాయకులంతా ఓరోజు సమావేశమై పిట్టన్నను మట్టుపెట్టడానికి పథకం వేశారు. ఓ రోజు ఉదయం ఐదు గంటలకు పిట్టన్న బైక్‌ మీద ఫస్ట్‌ షిఫ్ట్‌ డ్యూటీకి వెళుతున్నాడు. బైక్‌ భగత్‌ సింగ్‌ సెంటర్‌ నుండి కుడి పక్కకు తిరిగి కంపెనీ వైపునకు పోతుంది. అదే సమయంలో కంపెనీ వైపు నుండి వేగంగా వస్తున్న టిప్పర్‌ ఒకటి, బైక్‌ను గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయింది.
టిప్పర్‌ తగలడంతోనే బైక్‌ మీద నుండి బంతి మాదిరిగా గాల్లోకి లేచిన పిట్టన్న అంత దూరాన నడిరోడ్డు మీద స్పృహ కోల్పోయాడు. సరిగ్గా అదే సమయంలో కంపెనీ వైపు నుండి వచ్చిన ఇంకో టిప్పర్‌ పిట్టన్న ఎడమ కాలును నుజ్జునుజ్జుగా తొక్కు కుంటూ వెళ్ళిపోయింది. ఈ మొత్తం వ్యవహారం ఐదే ఐదు నిమిషాల్లో ముగిసిపోయింది. మరో పది నిమిషాలు, పావు గంట తరువాత డ్యూటీకి వస్తున్న కార్మికులు, రక్తం మడుగులో పడివున్న పిట్టన్నను గుర్తించి వెంటనే కంపెనీ అంబులెన్స్‌కి ఫోన్‌ చేశారు. ఆగమేఘాల మీద వచ్చిన అంబులెన్స్‌ పిట్టన్నను ఎక్కించుకొని కొత్తగూడేనికి తీసుకెళ్ళింది. అంబులెన్స్‌ లో నుండి అతణ్ణి దించక ముందే ''ఈ కేస్‌ మేం తీసుకోకూడదు మీరు వెంటనే గవర్నమెంట్‌ హాస్పటల్‌కి తీసుకుపోండి!'' అంటూ గేట్‌లో నుండే వెనక్కి పంపించారు ప్రైవేట్‌ హాస్పిటల్‌ వాళ్ళు.గవర్నమెంట్‌ హాస్పిటల్లో ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తై అడ్మిట్‌ చేసుకునే సరికి పక్కా రెండు గంటలు పట్టింది. ఆ తరువాత మరో గంటకు వచ్చిన సంబంధిత డాక్టర్‌ ''ఈ కేస్‌ ఇక్కడ లాభంలేదు వెంటనే ఖమ్మం గానీ, హైదరాబాద్‌ గానీ తీసుకుపోండి! ఆలస్యం చేస్తే బాడీ మొత్తం పాయిజన్‌ అవుతుంది. దాంతో అసలు ప్రాణానికే ముప్పురావచ్చు.'' అంటూ చేతులు దులిపేసుకున్నాడు. ఇంతలో పిట్టన్న భార్య, అన్నదమ్ములు రెండు ఆటోలు వేసుకుని కొత్తగూడెం హాస్పిటల్‌ దగ్గరికి చేరుకున్నారు. అటు నుండి అటే ఖమ్మం బయలుదేరుదామనుకుంటే ''కంపెనీ అంబులెన్స్‌ ఖమ్మం దాకా రావడానికి పర్మిషన్‌ లేదు. మీరేదైనా ప్రైవేట్‌ ఆంబులెన్స్‌ మాట్లాడుకొని వెళ్ళడమే.'' అంటూ ఆంబులెన్స్‌ సిబ్బంది చేతులెత్తేశారు.
దాంతో ఇంక చేసేదేంలేక అప్పటికప్పుడు ప్రైవేట్‌ ఆంబులెన్స్‌ మాట్లాడిన తోటికార్మికులు, తాము ఆగిపోయి కుటుంబ సభ్యులను ఎక్కించి ఖమ్మం మమత హాస్పిటల్‌కి పంపించారు. పిట్టన్నను చూసిన వెంటనే ''మేం ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి పంపిస్తాం గాని, మీరు వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కి తీసుకుపోతే మంచిది.'' అంటూనే ఫస్ట్‌ ఎయిడ్‌ మొదలుపెట్టారు మమత హాస్పిటల్‌ డాక్టర్లు. గంట తరువాత అదే ప్రైవేట్‌ ఆంబులెన్స్‌లో పిట్టన్నను ఎక్కించుకున్న కుటుంబ సభ్యులు నాలుగు గంటల్లో హైదరాబాద్‌ నిమ్స్‌లో చేర్పించారు. పిట్టన్నను చూడ్డంతోనే ''వెంటనే ఆపరేషన్‌ చేసి కాలు తీసెయ్యాలి. లేకుంటే ప్రాణానికే ప్రమాదం.'' అంటూ కొత్తగూడెం డాక్టర్లు చెప్పిన విషయాన్నే నిమ్స్‌ డాక్టర్లు కూడా ఖాయం చేశారు. ఆ మాటలను విన్న కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కొట్టుమిట్టాడసాగారు. వాళ్ళ పరిస్థితిని గమనించిన పిట్టన్న ''ఇంక ఆలస్యం అనవసరం. ఆపరేషన్‌ కానివ్వండి సార్‌!'' అంటూ ధైర్యంగా తన అంగీకారాన్ని తెలియజేశాడు. పేషెంట్‌ అంగీకారాన్ని తీసుకున్న డాక్టర్లు చకచకా ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఐదు గంటల ఆపరేషన్‌ తరువాత పిట్టన్న కాలు మోకాలు పైకి తీసేశారు.
ట ట ట
ఇరవై రోజుల తరువాత హాస్పిటల్‌ నుండి డిశ్చార్జై ఇల్లు చేరాడు పిట్టన్న. లాస్‌ ఆఫ్‌ పే మీద రెండు నెలలు సిక్‌ లీవ్‌ తీసుకుని ఇంట్లోవున్న పిట్టన్న, మరోసారి హైదరాబాద్‌ హాస్పిటల్‌కి వెళ్ళి చెక్‌ చేయించుకున్నాడు. చెక్‌ చేసిన డాక్టర్లు ఫిట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. డ్యూటీలో జాయిన్‌ అవుదామని ఫిట్‌ సర్టిఫికెట్‌ తీసుకుని వాకర్‌తోనే కంపెనీకి వెళ్ళిన పిట్టన్న, కంపెనీ డాక్టర్‌తో ఫిట్‌ సర్టిఫికెట్‌ మీద కౌంటర్‌ సైన్‌ చేయించుకుని నేరుగా జి.యం. పర్సనల్‌ ఆఫీస్‌కి వెళ్ళాడు.
''సార్‌! పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌ అన్నీ పన్నెండున్నర తరువాతే చూస్తారు. అప్పటి దాకా మీరక్కడ కూర్చోండి!'' అంటూ ఆ పక్కనేవున్న ఓ బల్ల చూపించాడు ఆఫీస్‌ మెసెంజర్‌. ''ఈ రూల్‌ ఎప్పట్నుంచి!?'' అనుకున్న పిట్టన్న వెళ్ళి ఆ బల్లమీద కూర్చున్నాడు. ఆ బల్లకు దగ్గర్లోనే తన టేబుల్‌ మీదున్న కంప్యూటర్లో గేమ్‌ ఆడుకుంటున్న జి.యమ్‌. సెక్రటరీ వచ్చిందెవరోనని కనీసం తల తిప్పి కూడా చూడలేదు. అర గంట గడచినా జి.యమ్‌. పర్సనల్‌ రాలేదు. సెక్రటరీ కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద నుండి తల తిప్పలేదు. చూసీ చూసీ విసుగొచ్చిన పిట్టన్న తన ముందున్న వాకర్ని కావాలనే గట్టిగా ఎత్తిపడేశాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డ సెక్రటరీ కంప్యూటర్‌ మీద నుండి అప్పుడు తల తిప్పి పిట్టన్న వంక చూశాడు. చూడ్డంతోనే పిట్టన్న కుంటి కాలు కనిపించడంతో గిల్టీగా ఫీలైన సెక్రటరీ ''సారీ! నేనేదో ధ్యాసలో వుండి పట్టించుకోలేదు. సార్‌ రాగానే అందరికన్నా నిన్నే ముందు పంపిస్తా గాని అసలింతకూ నీ కాలుకేమైంది?'' అంటూ సానుభూతిగా అడిగాడు.వివరించాడు పిట్టన్న. ''అయ్యో అలాగా! ఇప్పటిదాకా నాకీ విషయమే తెలియదు.'' అన్నాడు సెక్రటరీ. ఇంతలో జి.యమ్‌.తో పనుందంటూ ఏడదెనిమిది మంది కార్మికులొచ్చారు. మరో అర గంట తరువాత జి.యమ్‌. వచ్చాడు. చెప్పినట్టుగానే అందరికన్నా ముందు పిట్టన్ననే లోపలికి పంపించాడు సెక్రటరీ. పిట్టన్నను చూడగానే ''కాలెలా వుంది?'' అంటూ క్యాజ్‌వల్‌గా అడిగాడు జి.యమ్‌. ''ఫరవా లేదు. డాక్టర్లు లైట్‌ జాబ్‌కి రికమెండ్‌ చేస్తూ లెటర్‌ ఇచ్చారు.'' అంటూ ఫిట్‌ సర్టిఫికెట్‌ తీసి జి.యమ్‌. చేతికందించాడు పిట్టన్న.
పావుగంట పాటు సర్టిఫికెట్‌ను పరిశీలించిన జి.యమ్‌. పర్సనల్‌ ''పాపం పిట్టయ్యా! నీకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. కనీసం ఆ వెహికల్‌ ఏదో దొరికినా బావుండేది. ఫిజికల్‌గా ఇంత లాసైనందుకు ఎంతో కొంత ఫైనాన్సియల్‌ బెనిఫిట్‌ అన్నా వచ్చేది.'' అంటూ మోయలేనంత సానుభూతిని వర్షించాడు. ''ఒక్కోసారి అట్లా జరుగుతుందంతే'' అంటూ బదులిచ్చాడు పిట్టన్న జి.యమ్‌.కళ్ళలోకి చూస్తూ. పిట్టన్న రాసుకున్న కవరింగ్‌ లెటర్‌ మీద ఏదో కామెంట్‌ రాసిన జి.యమ్‌. పర్సనల్‌ ''ఈ లెటర్‌ తీసుకెళ్ళి జి.యమ్‌.వర్క్స్‌ని కలవండి.'' తిరిగి ఇస్తూ అన్నాడు.
లెటర్‌ తీసుకున్న పిట్టన్న ''సార్‌! ఈ కాలుతో బాయిలర్‌ పైకెక్కి డ్యూటీ చెయ్యడం కుదరదు. అంతో ఇంతో చదువుకున్నవాణ్ణి కాబట్టి ఎక్కడన్న ఆఫీస్‌లో టేబుల్‌ వర్క్‌ ఇవ్వండి చేస్తాను.'' అంటూ రిక్వెస్ట్‌ చేశాడు. పిట్టన్న రిక్వెస్ట్‌ను విన్న వెంటనే ''అసలిప్పటికే మినిస్టీరియల్‌ స్టాఫ్‌ ఎక్కువయ్యారని హైదరాబాద్‌ ఆఫీస్‌ వాళ్ళు గొడవ చేస్తున్నారు. అయినా నీది జన్యున్‌ కేస్‌ కాబట్టి నాకూ కన్సిడర్‌ చెయ్యాలనే వుంది. కాకపోతే నీకొక్కడికిస్తే మిగతా యూనియన్‌ నాయకులు 'మా క్యాండెట్స్‌ కూడా చాలామంది చాలా రకాల జబ్బులతో బాధపడుతున్నారు. మావాళ్ళ కేస్‌లు కూడా కన్సిడర్‌ చెయ్యండి.' అంటూ మా పీకల మీద కత్తిపెట్టి కూర్చుంటారు. అందుకే నిజంగా అవసరమున్న మీలాంటి వాళ్ళకు సాయం చెయ్యాలని వున్నా చెయ్యలేకపోతున్నాం. సారీ!'' అంటూ ఎంతో లౌక్యంగా మాట్లాడాడు జి.యమ్‌. పర్సనల్‌.
''మీరెన్నన్నా చెప్పండి సార్‌! నేను మాత్రం ఈ కాలుతో పైకెక్కి ఆ బాయిలర్ల మీద పని చెయ్యలేను.'' అంటూ గట్టిగానే చెప్పాడు పిట్టన్న. ''సరే చూద్దాం! ముందు మీరీ లెటర్‌ తీసుకుని జి.యమ్‌. వర్క్స్‌ దగ్గరికెళ్ళండి. మీకక్కడ ఆయనే ఏదో ఒక సూటబుల్‌ ప్లేస్‌ చూపిస్తాడు. కావాలంటే నేను కూడా ఆయనకు ఫోన్‌ చేసి పర్సనల్‌గా చెబుతాను.'' అంటూనే తరువాత వాళ్ళను పంపించమన్నట్టు బయటవున్న సెక్రటరీకి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు జి.యమ్‌.పర్సనల్‌. ఇక తప్పదన్నట్టు మెల్లగా లేచి బయటకొచ్చాడు పిట్టన్న.
ట ట ట ''సారీ పిట్టన్నా! వ్యక్తిగతంగా నీకు సాయం చెయ్యాలని వున్నా చెయ్యలేని పరిస్థితి మాది. అయినా ఆల్‌ సెక్షనల్‌ హెడ్స్‌ను నీ ముందే పిలిపించి మాట్లాడుతానుండు వాళ్ళేం చెబుతారో విందువు గాని..'' అంటూ ఇంటర్‌కాంలో ఫోన్లు చేసి వెంటనే తన చాంబర్‌కి రమ్మన్నాడు జి.యమ్‌.వర్క్స్‌. ''మీరు డెసిషన్‌ తీసుకొని పంపిస్తే వద్దనేదెవరు సార్‌!'' జి.యమ్‌. వర్క్స్‌ కావాలనే ఏదో డ్రామా ఆడుతున్నాడన్న విషయం అర్థమైపోతుంటే వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు పిట్టన్న.
''లేదు.. లేదు.. ఏదైనా వాళ్ళిష్టంతోనే చెయ్యాలి తప్ప నా అభిప్రాయం వాళ్ళ మీద రుద్దకూడదు.'' అంటూ అతనింకేదో మాట్లాడుతుండగానే హెచ్‌.ఒ.డి.లందరూ వచ్చేశారు. వాళ్ళంతా పిట్టన్నను చూస్తూనే ''ఈ తద్దినాన్ని మన మీద రుద్దడానికి పిలవలేదు కదా?'' అనుకుని ముఖాలు ముడుచుకుంటూ జి.యమ్‌. ఎదురుగా కూర్చున్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా హెచ్‌.ఒ.డిలు అందరూ వచ్చారని నిర్థారించుకున్న జి.యమ్‌. వర్క్స్‌ ''చూడండీ! మన పిట్టన్నకు చాలా ఘోరం జరిగిపోయింది. పోయిన కాలును మనమెలాగూ తీసుకురాలేం. ఆ కాలుతో తానిక బాయిలర్‌ పైకెక్కి పని చేయలేనంటున్నాడు. తను చదువుకున్నవాడే కాబట్టి ఏ టేబుల్‌ వర్కో ఇవ్వడం మన ధర్మం. మీలో ఎవరో ఒకరు అతణ్ణి తీసుకుని పేపర్‌ వర్క్‌ చేయించుకోండీ!'' నిజానికి మీరెవ్వరూ అతణ్ణి తీసుకోనవసరం లేదు అన్న ఓ సంకేతాన్ని ఆపద్ధర్మంగా అందజేస్తూ తెలివిగా విషయాన్ని వెల్లడించాడు.
సూది దూరేంత సందిస్తే చాలు ఏనుగును గూడా లాక్కుపోయే తెలివితేటలున్న హెచ్‌.ఒ.డి.లంతా జి.యమ్‌. సంకేతాన్ని సునాయాసంగా అందిపుచ్చుకుని ''నిజంగా ఈ పరిస్థితిలో మీరన్నట్టు పిట్టన్నకు టేబుల్‌ వర్క్‌ ఇవ్వడం న్యాయమే. మాక్కూడా ఇవ్వాలనే వుంది. కాకపోతే ఇప్పటికే మా సెక్షన్స్‌లో క్లరికల్‌ స్టాఫ్‌ ఇబ్బడిముబ్బడిగా వున్నారు. కాబట్టి సారీ సార్‌!'' అంటూ ప్రతి ఒక్కరూ పిట్టన్నను నాకొద్దంటే నాకొద్దని సున్నితంగా తిరస్కరించారు.
''అందరూ అట్లాగే అంటే ఎట్లా మరి?'' నీళ్ళు నమిలినట్టుగా మాట్లాడాడు జి.యమ్‌. వర్క్స్‌. ''ఏమో సార్‌! మీరేమన్నా చేసుకోండది. మాకు మాత్రం అవసరం లేదు.'' అంటూ ఎవరి మానాన వాళ్ళు లేచిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తరువాత పిట్టన్న వంక తిరిగిచూస్తూ ''ఎలా మాట్లాడారో చూశావు గదా? ఎవ్వరూ వద్దంటుంటే మరి నేను మాత్రం ఏం చెయ్యగలను చెప్పు?'' అంటూ తనూ మెల్లగా తప్పుకోవాలన్నట్టు మాట్లాడాడు జి.యమ్‌. వర్క్స్‌.
''అదంతా నాకు తెలియదు సార్‌! నేనైతే బాయిలర్‌ మీదికి పోయి పని చేయటమనేది జరిగేది కాదు. మీరేంజేసుకుంటారో ఏమో నేను మాత్రం రోజూ వచ్చి మీ ఆఫీస్‌ ముందు కూర్చొని పోతాను.'' వున్న విషయం తెగేసినట్టు చెప్పి మెల్లగా లేచి బయటికి నడిచాడు పిట్టన్న.
ట ట ట మరునాడు ఉదయం పది గంటలకు తను చెప్పినట్టే వచ్చి జి.యమ్‌.వర్క్స్‌ ఆఫీస్‌ ముందు కూర్చున్నాడు పిట్టన్న. పదిన్నరకు ఆఫీస్‌కి వచ్చిన జి.యమ్‌. వర్క్స్‌ పిట్టన్నను చూస్తూనే ''లోపలికి రా!'' అంటూ తన చాంబర్లోకి వెళ్ళాడు. అతని వెనుకనే లోపలికెళ్ళిన పిట్టన్న చేతికి ఓ కాగితం ఇచ్చిన జి.యమ్‌. ''నువ్వెళ్ళి కెమికల్‌ డివిజన్‌లో వుండే రామిరెడ్డి డి.ఈ.కి రిపోర్ట్‌ చెయ్యి.'' అంటూ నిన్న హెచ్‌వోడీల మీటింగ్‌కి అటెండ్‌ కాని కెమికల్‌ డివిజన్‌ ఇన్‌చార్జి డి.ఈ. దగ్గరికి పంపించాడు. మెల్లగా కెమికల్‌ డివిజన్‌కి వెళ్ళి జి.యమ్‌. ఇచ్చిన లెటర్‌ డి.ఈ. రామిరెడ్డి చేతికిచ్చాడు పిట్టన్న. ఆ లెటర్‌ చూస్తూనే ''అరె.. నేను నిన్న ఫోన్‌లోనే వద్దని చెప్పాను కదా. మళ్ళీ నిన్నెందుకు పంపించాడు?'' అంటూ విసుక్కున్న డి.ఈ. ''మీరు మళ్ళీ వెళ్ళి ఆ జి.యమ్‌.నే కలవండీ!'' పిట్టన్నతో నిర్మొహమాటంగా అన్నాడు. అతని మాట తీరుకు మనస్సు చివుక్కుమంటుంటే వస్తున్న కోపాన్ని దిగమింగుకున్న పిట్టన్న అతను చెప్పినట్టే తిరిగి జి.యమ్‌.వర్క్స్‌ ఆఫీస్‌కి వెళ్ళాడు.
అప్పటికే ఫోన్‌లో జి.యమ్‌. వర్క్స్‌కి కెమికల్‌ డివిజన్‌ డి.ఈ.కి గొడవేదో పెద్దగానే జరిగినట్టుంది. అతను పిట్టన్నను చూస్తూనే ''చూడండి! ఈ వ్యవహారాలన్నీ చూడాల్సిన జి.యమ్‌. పర్సనల్‌, మ్యాటర్ని మెల్లగా నా మీదకు తోసి డ్రామా చూస్తున్నాడు. మీరేమో వచ్చి నా పీకల మీద కూర్చుంటున్నారు. ఎవ్వడూ వద్దంటుంటే నేనేం చెయ్యాలి?'' అన్నాడు కోపంగా.
బదులు మాట్లాడకుండా అరగంట పాటు అక్కడే కూర్చు న్నాడు పిట్టన్న. ఆఖరికి పిట్ట న్నను మళ్ళీ తన చాంబర్‌లోకి పిలిపించుకున్న జి.యమ్‌. వర్క్స్‌ ''ఒక పని చేస్తారా?'' అన్నాడు. ''చెప్పండేంటో?'' అన్నట్టు చూశాడు పిట్టన్న.
''కంపెనీలో వుండే అన్ని యూనియన్ల నాయకుల దగ్గరకి వెళ్ళి మిమ్మల్ని ఆఫీస్‌ సైడ్‌కి పంపిస్తే వాళ్ళకేమీ అభ్యంతరం లేదన్నట్టు ఒక లెటర్‌ రాయించుకు రండి. అప్పుడిక మిమ్మల్ని ఎటు మార్చినా అడిగేవాడుండడు.'' అంటూ సాధ్యంకాని సలహాను ఇచ్చాడు జి.యమ్‌.వర్క్స్‌.
***
''ఇదీ జరిగిన సంగతి. నాకు న్యాయం జరగాలంటే రోడ్డెక్కక తప్పని పరిస్థితి కల్పించారు.'' అంటూ తన చుట్టూ చేరినవాళ్ళకు అప్పటిదాకా జరిగిన ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు పిట్టన్న. ఆ తరువాత మరో గంటకు
''పాల్వంచ ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో అంగవైకల్యంతో బాధపడుతున్న గిరిజన కార్మికుడికి తగిన పోస్టింగ్‌ ఇవ్వకుండా ఏడిపిస్తున్న అధికారగణం. కొమరం భీమ్‌ విగ్రహం సాక్షిగా కంపెనీ గేట్‌ ముందు గిరిజనుల ఆందోళన.'' అన్న బ్రేకింగ్‌ న్యూస్‌ అన్ని చానల్స్‌లోనూ వచ్చింది.
అంతే!
ఇతర యూనియన్ల నాయకులంతా ఎక్కడివాళ్ళక్కడే గప్‌చుప్‌ అయిపోయారు.
అధికార గణం ఆగమేఘాల మీద కదిలింది.

రేపటి బీడు


                   మా వైపు కోర్టులో శ్రీను ఒక్కడే మిగిలాడు. కూతకెళ్లి, ఇద్దర్ని అవుట్‌ చేయడంతో; నేను, రమేష్‌ బతికొచ్చాం. ఇప్పుడు కోర్టులో ముగ్గురమయ్యాం. స్కోరు సమానమైంది. ఒకే ఒక్క పాయింటు. ఎవరికొస్తే వారు విజేత. చుట్టూ చేరిన విద్యార్థులు, ఉపాధ్యాయులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తున్నారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలోని సెయింట్‌ మేరీస్‌ హైస్కూలు. సాయంత్రం అయిదు కావస్తోంది. విశాలమైన మైదానం మధ్యలో కబడ్డీ ఆట క్లైమాక్సుకు చేరింది.
అవతలి వైపు కెప్టెన్‌ కూతకు సిద్ధమయ్యాడు. మా నలుగురికీ లోలోపల వణుకు మొదలైంది.
సుమారు ఎనభై కేజీల బరువుండే ఆ శాల్తీని అటకాయించడం అంత తేలిగ్గాదు. ముగ్గురం ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కబడ్డీ...కబడ్డీ.. అంటూ మా కోర్టులో సగం దూరం వచ్చాడో లేదో మా శ్రీనుగాడు పాములా నేలమీద పాకి, అతగాడి కాళ్లను చుట్టేశాడు. మేమిద్దరం వెనకా ముందూ వాటేసుకుని కదలకుండా చేశాం. అంతే పిల్లల కేరింతలు మైదానంలో ప్రతిధ్వనించాయి. జోనల్‌ పోటీల ఫైనల్స్‌ మా స్కూలు గెలిచింది.
మరుసటి రోజు టీమంతా ఒకచోట చేరి, పార్టీ చేసుకున్నాం. పది పప్పుండలు, పది నూజీడీలు, చాక్లెట్లు, రెండు గోల్డ్‌స్పాట్‌ బాటిళ్లు తెచ్చుకుని సమానంగా పంచుకుని సంతోషంగా గడిపాం. అప్పుడే మేం పదో తరగతి చదువుతున్నాం.
మా ముగ్గుర్నీ అందరూ పొగిడారు. ఆరో తరగతి నుంచే మాది విడదీయరాని అనుబంధం, రమేష్‌ది శాఖమూరు. రోజూ సైకిల్‌పై వచ్చేవాడు. ఒక్కో సారి, నాలుగు కిలోమీటర్లు నడిచే వచ్చేవాడు. శ్రీను, నేను పెదపరిమి వాసులమే. శ్రీను తండ్రి నాలుగెకరాల రైతు. మాకు పదికెరాలపైనే ఉండేది. ఓ రోడ్డు ప్రమాదంలో నాన్న మృతి చెందడం, ముగ్గురు పిల్లల్ని చదివించాల్సిరావడంతో, అమ్మ, ఒక్కో ఎకరం అమ్మసాగింది. ఆదివారం వచ్చినా, పండగ సెలవు వచ్చినా నేనూ శ్రీనూ పొలం పనులకు వెళ్లేవాళ్లం. వాడు గొడ్డులా కష్టపడతాడు. మునుంలో దిగాడంటే, పత్తి చకచకా తెగి, వాడి 'వంచె' గబగబా నిండాల్సిందే. పత్తి మోళ్లు పీకడం మొదలు పెట్టాడంటే, మేం వాడి వెనుక పరుగులు పెట్టాల్సిందే.
సంక్రాంతి రోజు చూడాలి మా ముచ్చట! శ్రీను, నేను కొత్త చొక్క, కొత్త నిక్కరు తొడుక్కుని తాడికొండ సినిమాకు వెళ్లేవాళ్లం, నాలుగు కిలోమీటర్లు నడిచి. అరుదుగా అలాంటి 'పండగ' లు మాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి. పదో తరగతి ప్రథమ శ్రేణిలో పాసైనందుకు నన్ను మా బంధువులందరూ అబ్బురంగా చూశారు. సెకండ్‌ క్లాస్‌లో పాసైన శ్రీను చదువు మానేసి, తండ్రికి తోడుగా తలగుడ్డ చుట్టి నాగలి పట్టాడు.
శ్రీను బాగానే చదివేవాడు. రమేష్‌ పప్పుసుద్ద. నేను బాగా చదువుతాననీ, అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తానన్న గర్వం తలకెక్కి, రమేష్‌ను చిన్నచూపు చూస్తున్న తరుణంలో ఓ రోజు సాయంత్రం స్కూలు వదలగానే రమేష్‌తో కలిసి వాళ్ల ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి వాళ్లింట్లోనే ఉన్నాను.
''ఏం బాబూ నువ్వన్నా బాగా సదువుతావా, లేక మా సన్నాసిలాగానేనా'' అన్నం వడ్డిస్తూ
అడిగింది రమేష్‌ తల్లి. నేను నవ్వి ఊరుకున్నాను. వాడు మాత్రం ''అట్టనమాకమ్మా, ఆడు క్లాస్‌లో ఫస్టు'' అన్నాడు. ''అవునా! మానాయనే, మానాయనే...'' అంటూ మెటికలు విరిచింది.
ముద్దపప్పు, గోంగూర పచ్చడి, వంకాయ ఇగురు, ఉలవచారు, ఆ భోజనం రుచి ఇప్పటికీ నాలుకపైనే ఉంది. భోజనాలయ్యాక రాత్రి పదింటికి నిద్రపోయాం.ఉదయం ఆరున్నర అవుతుండగా మెలకువ వచ్చింది.
''కానీ కానీ, పని ఒగదెగడంలా. గేదెల్ని కట్టేరు. పేడకళ్లు తీసేరు...' పంచలోంచి రమేష్‌ వాళ్ల నాన్న కేకలు వినిపిస్తున్నాయి. బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ బయటికొచ్చి, మెల్లా మీదికి చూపు సారించాను.
''అదుగో, ఆ సిబ్బిలో పేడ దీసుకెళ్లి దిబ్బలో పడేరు. ఎడ్లకు ఉలవలు పెట్టు. గేదె మూతికి సిక్కం గట్టి గాటికి కట్టేరు. పొలికట్టె దీస్కొని
చెత్తంతా ఊడ్చేరు. దూడకు కుడితి తాగించు... ''వాళ్ల నాన్న, తన తొడమీద గోగుతాడు పేనుతూ, రమేష్‌కు పనులు పురమాయిస్తున్నాడు. వాడు యంత్రంలా ఒకదాని తర్వాత ఒక పని చక్కబెడుతున్నాడు. అయినా ఆయన హడావుడి చేస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకట్రెండు దెబ్బలు కూడా వేశాడు.
నేను బ్రష్‌ చేసి, టిఫిన్‌ చేసే లోపల, రమేష్‌ పొలం వెళ్లి, సైకిల్‌ మీద మేత మోపు తెచ్చాడు.
హడావిడిగా స్కూలుకు సిద్ధమయ్యాడు. నేను వెనక కూచోగానే సైకిల్‌ను ముందుకు
దూకించాడు రమేష్‌. ''సారీరా...'' పొలాల మధ్య డొంకదారిలో ఉసీగా సైకిల్‌ తొక్కుతున్న రమేష్‌ వీపుమీద చెయ్యివేస్తూ అన్నాను. ''ఎహే, ఇయ్యేమీ
నువ్వు పట్టించుకోమాక. మనకిది రోజూ మామూలే...'' తేలిగ్గా కొట్టిపారేశాడు రమేష్‌. ఆ తర్వాత నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠాలు వివరిస్తూ, వాడు పదో తరగతి పాసవడానికి శక్తి వంచన లేకుండా తోడ్పడ్డాను.

1995 ఆగస్టు15
ముగ్గురం రాములవారి గుళ్లో సమావేశమయ్యాం. నేనొస్తున్నానని ఉత్తరం రాయడంతో రమేష్‌ కూడా పరిమి వచ్చాడు. అప్పటికీ నేను డిగ్రీ పూర్తి చేసి ఓ దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నాను. రమేష్‌, శ్రీను వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. ''ఏంటిరా ఇది, మన ఊరిలో ఇంత ఫ్యాక్షనిజమా? పట్టపగలు నడిరోడ్డు మీద ఒక మనిషిని గొడ్డళ్లతో నరికి చంపడం ఏమిటి!'' నమ్మలేనట్టుగా అడిగాను.
'ఇదేం జూశావ్‌. మొన్న కాంగ్రెసోళ్లు టిడిపి నాయకుణ్ణి బాంబులేసి చంపారు. రెండో రోజు టిడిపి వాళ్లు కాంగ్రెస్‌ మండలాధ్యక్షుణ్ని ఇనపరాడ్లతో కొట్టి చంపారు'' నింపాదిగా చెప్పాడు శ్రీను.
'' అన్యాయమైపోతున్నదల్లా పిల్లలే. స్కూలు గురించి పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో వాళ్ల చదువులు దెబ్బతింటున్నాయి.'' విశ్లేషించాడు రమేష్‌. వాడిది శాఖమూరే అయినా పరిమి గురించి బాగా తెలుసు.
''అందుకే, మనమే ఏదో ఒకటి చెయ్యాలి.'' అన్నాను, శ్రీరాముడి విగ్రహం వెనుక పేరుకున్న బూజును చూస్తూ. '' మనమేం చెయ్యగలం?'' ఇద్దరూ ఏకకంఠంతో అడిగారు.
''ఓ సంస్థను ప్రారంభిద్దాం. చదువుకునే పిల్లలకు అవసరమైన సహకారం అందిద్దాం. నా ఫ్రెండ్స్‌ ద్వారా డబ్బు పోగుచేసే బాధ్యత నాది. విద్యాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత మీది.'' వివరించాను.
అలా ప్రారంభమైన 'చేయూత' స్వచ్ఛంద సంస్థ అతి త్వరలోనే పిల్లల నేస్తమైంది. వారి చదువులకు మార్గదర్శి అయింది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకారవేతనమైంది. మెల్లగా గ్రామ పెద్దలు కూడా సంస్థలో సభ్యులయ్యారు. మా కార్యక్రమాలకు అండగా నిలిచారు.
2007 మార్చి 21
పెదపరిమిలో రైతులకు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అయిదు వందల మందికి పైగా హాజరైన రైతులనుద్దేశించి లాంఫాం శాస్త్రవేత్త అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. వారిలో శ్రీను, రమేష్‌ కూడా ఉన్నారు.
అప్పటికి సంవత్సరం క్రితం జర్నలిస్టు ఉద్యోగం వీడి, హైదరాబాదులోని స్వచ్ఛంద సంస్థలో మేనేజర్‌గా చేరాను. ఆ సంస్థ తరపున ఈ శిబిరం ఏర్పాటు చేశాను.
రమేష్‌ లేచి, ఓ ప్రశ్న అడిగాడు. శాస్త్రవేత్త సంతోషంగా తల ఊపుతూ, రమేష్‌ను స్టేజీ మీదకు పిలిచి ''ముందు , పత్తిసాగులో మీ అనుభవాలు చెప్పండి.'' అన్నారు.
రమేష్‌ గొంతు సవరించుకుని, మాట్లాడటం మొదలు పెట్టాడు. విత్తనాన్ని ఎంచుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల దగ్గర్నుంచీ దళారుల కారణంగా ధర గిట్టుబాటు కాని వాస్తవం దాకా అనర్గళంగా మాట్లాడాడు. మధ్య మధ్యలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అన్యాపదేశంగా వివరించాడు. ఇరవై నిమిషాల తర్వాత వాడు ''ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడాను. తప్పులుంటే క్షమించండి.'' అని రెండు చేతులూ జోడించగానే కరతాళధ్వనులు మిన్నంటాయి.
అది మొదలు, మా సంస్థ తరుపున రాష్ట్రంలో ఎక్కడ రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించినా, రమేష్‌ను ప్రత్యేకంగా రప్పించేవాణ్ణి. వాడు సిసలైన వ్యవసాయ భాషలో రైతుల్ని కట్టిపడేసేవాడు.
పరిమిలో కార్యక్రమం ముగియగానే కోటయ్య అనే రైతు నా దగ్గరికొచ్చి.తనను తాను పరిచయం చేసుకున్నాడు.పెనుమాక గ్రామానికి చెందిన ఆయన కాకతాళీయంగా ఈ శిబిరానికి వచ్చాడట. ఇలాంటిది తమ గ్రామంలో కూడా నిర్వహించ మని అడిగాడు. వారం తిరక్కుండానే పెనుమాకలో కార్యక్రమం ఏర్పాటు చేశాం. అది మధ్యాహ్నానికి ముగిసింది. భోజనం తర్వాత కోటయ్య నన్నూ మా బృందాన్నీ పొలాలకు తీసుకెళ్లాడు. విజయవాడకూ, కృష్ణానదికీ అత్యంత సమీపంలో ఉన్న పెనుమాక, ఒక ఆకుపచ్చని కలకు ప్రతిరూపం. ఎండ ఫెళ్లున కాస్తున్న మార్చి నెల చివరి వారంలో కూడా పచ్చని పంటలు కనువిందు చేస్తున్నాయి. ఉల్లి, అరటి, కూరగాయల సాగు ఎక్కువగా కనిపించింది. కోటయ్య ఎకరం పొలంలోని దొండచెట్లు విరగకాశాయి.
''దొండను పందిళ్ల మీద పాకిస్తారు కదా!'' నేల మీదే తీగలు సాగిన చెట్ల నుంచి అవిరామంగా కాయలు కోస్తున్న కూలీల వంక చూస్తూ సందేహం వ్యక్తం చేశాను.
''అవును సారూ, ఇంతకు ముందు పందిళ్లు వేసేవాళ్లం. ఇప్పుడా అవసరం లేకుండానే నేలమీద కాస్తున్నాయి. మంచి దిగుబడి వస్తంది. విజయవాడ మార్కెట్టు దగ్గర కావడంతో రేటు బాగానే గిట్టుబాటయితాంది.'' సంతోషంగా చెప్పాడు. ఒక గోతాము నిండా దొండకాయలు పోసి, మా కారులో వేశాడు కోటయ్య.
2012 మే 23
పెదపరిమిలో శ్రీను పెద్ద కూతురి పెళ్లి సందర్భంగా అందరం కలిశాం. అప్పటికి నాకు బాగా స్థిరత్వం దొరికింది. మా పిలల్లు హైస్కూలు చదువుల్లో ఉన్నారు. రమేష్‌కు వ్యవసాయం బాగా కలిసొచ్చింది. అదును చూసి అవసరం గ్రహించేవాడు. తండ్రి నుంచి సంక్రమించిన అయిదెకరాలకు తోడు మరో మూడెకరాల భూమి కొన్నాడు. కొడుకునీ కూతుర్నీ ఇంజినీరింగ్‌ చదివిస్తున్నాడు. శ్రీను తనకున్న నాలుగెకరాలకు తోడు మరో నాలుగెకరాల కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. పెద్దమ్మాయి డిగ్రీ పూర్తి చేయగానే, పెళ్లి తలపెట్టాడు. ఆ అమ్మాయికి రెండెకరాలు అప్పగించాడు. రెండో కూతుర్ని సీఏ చదివిస్తున్నాడు. చిట్టీల ద్వారా పొదుపు చేసుకున్న సొమ్ముతో శ్రీను సలహా మీదటే నేనూ పరిమిలో రెండెకరాల పొలం కొనుక్కున్నాను.
2014 సెప్టెంబరు
మా ఊరికి అయిదు కిలోమీటర్ల దూరంలోని 'తుళ్లూరు'ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. రాత్రికి రాత్రి మా ఊరి భూములకు రెక్కలొచ్చాయి. పొలాలు కోట్లకు పడగలెత్తాయి. సగం ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం లేని మారుమూల గ్రామంలో రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసులు వెలిశాయి. కార్లు క్యూ కట్టాయి. దళారుల్ని ఆకస్మిక అదృష్టం వరించింది. రాజధాని నిర్మాణానికి తొలిదశలో 30 వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తుకు అనుకూలంగాలేని 'అవలక్షణం' కారణంగా మా ఊరిని మినహాయించారు. అయితే మా ఊరి పొలం సింహ భాగం తుళ్లూరు గ్రామపరిధిలో ఉంది. నాదీ, శ్రీనుదీ కూడా అక్కడే ఉంది. మా పొలం నెత్తిన ''ల్యాండ్‌ పూలింగ్‌ కత్తి'' వేలాడుతోంది.
దళారుల పుణ్యమాని నెల తిరక్కుండానే మా ఊరి బీడు భూమి కూడా ఎకరం కోటిన్నరకు చేరుకుంది. ఓ రోజు రమేష్‌ ఫోన్‌ చేసి నేను పొలం అమ్మాలనుకుంటున్నాను. నువ్వు కూడా ఇచ్చేస్తావా, మంచి బేరం వచ్చింది.'' అన్నాడు. ''శ్రీను గాడేమంటున్నాడు?' ఆరా తీశాను.
''వాడా ....సెంటిమెంటల్‌ ఫూల్‌. ఆ మట్టిని అమ్ముకోలేనంటున్నాడు.'' చెప్పాడు హేళనగా నవ్వుతూ. ''అయితే నేనూ ఫూల్‌నే.'' అన్నాను. వాడు ఫోన్‌ పెట్టేశాడు.
రమేష్‌ రెండెకరాల పొలం అమ్మాడు. మూడు కోట్ల రూపాయలతో మకాం గుంటూరుకు మార్చాడు. ఫైనాన్స్‌ వ్యాపారం ప్రారంభించాడు. ఖరీదైన మిత్రులు జత కలిశారు.
2015 ఫిబ్రవరి 27, శక్రవారం
''రామీ, భూమిని ప్రభుత్వానికి అప్పగించక తప్పేట్టు లేదు..'' ఫోన్‌లో చాలా నీరసంగా ఉంది శ్రీను గొంతు. ''ఎందుకని? మీరంతా కలిసి అభ్యంతర పత్రం సమర్పించారుగా'' అడిగాను.
''అధికారులు తెలివిగా బెదిరిస్తున్నారు. ఈ నెల 28 లోపు భూమిని అప్పగిస్తే మనకు ఎకరానికి పన్నెండొందల గజాల స్థలం కేటాయిస్తారట. అది భవిష్యత్తులో కోట్ల ఖరీదు చేస్తుందట. లేకపోతే భూ సేకరణలో భాగంగా బలవంతంగా లాగేసుకుని, తృణమో పణమో పరిహారంగా ఇస్తారట.'' బాధగా చెప్పాడు శ్రీను.
''మరి ఏం చెయ్యాలనుకుంటున్నావు?'' ''ఇచ్చేదామ్‌రా. ఈ టెన్షన్‌ మనం భరించలేము. రాత్రికి బయల్దేరి వచ్చెరు. నీది కూడా ఇచ్చేద్దువు గానీ.''
''ఓకే శ్రీనూ. టికెట్‌ బుక్‌ చేసుకుంటాలే. ఇంకేంటి సంగతులు?''
''ఇంకో ముఖ్యమైన సంగతుందిరా, రమేష్‌ గురించి...''
''ఏమైంది రమేష్‌కు? రెండు చేతులా సంపాదిస్తున్నాడని విన్నాను.''
''డబ్బు పాపిష్టిదిరా. వాడేదో ఇల్లీగల్‌ వ్యవహారాల్లో ఇరుక్కున్నాడట. వాడి భార్య నాకు వారం నుంచీ ఫోన్లు చేస్తోంది. ఓసారి మనిద్దరినీ తనింటికి రమ్మని బతిమాలుతోంది. రేపొస్తావుగా వెళ్లి పాపం ఆమె బాధేమిటో కనుక్కుందాం.''
2015 ఫిబ్రవరి 28, శనివారం, ఉదయం పది గంటలు
తుళ్లూరులో ప్రత్యేక ప్రభుత్వ కార్యాలయం
జనంతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వాజ్ఞను శిరసా వహించి బుద్ధిగా భూమిని అప్పగించడానికి వచ్చిన మాలాంటి వాళ్లు, ఇంకేవేవో పనులపై వచ్చినవాళ్లతో కీసరబాసరగా ఉంది. శ్రీనూ నేనూ భూమినివ్వడానికి సంసిద్ధత తెలుపుతున్నట్లు సంతకాలు పెట్టి బయటికొచ్చాం. శ్రీను మౌనంగా ఉన్నాడు. వాడి మొహంలో బాధ, పగిలిన పత్తిగుల్లలా స్పష్టంగా కనిపిస్తోంది. మెయిన్‌ రోడ్డు మీదకి చేరుకున్నాం. అక్కడ కొంతమంది రైతులు ధర్నా చేస్తున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా నినాదాలిస్తున్నారు. ఇంతలో ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌ వచ్చి, మైకును ఓ రైతు చేతికిచ్చి మాట్లాడమన్నాడు. తలకు కండువా, భుజాన పైపంచెతో, మాసిన గడ్డంతో మాట్లాడటానికి  సిద్ధమైన కోటయ్యను వెంటనే పోల్చుకోలేకపోయాను. గుర్తిం చగానే దగ్గరగా వెళ్లి శ్రద్ధగా అతని మాటలు వినసాగాను.
''అసలేమనుకుంటున్నారు రైతుల గురించి? మట్టిని నమ్ముకుని మట్టిలోనే బతుకుతున్న వాళ్లం. ఆ మట్టిని లాగేసుకుంటే మాకేగాదు, జనానిగ్గూడ అన్నం ముద్ద దొరకదు. మూడు కార్లు పండే భూమి. మండు వేసవిలో గూడా మల్లెలు పండే భూమి. ఎకరం ఉండా దిగుల్లేకుండా సంసారాలు సాదుతున్నాం. పిల్లల్ని చదివించుకుంటున్నాం. పెళ్లిళ్లు చెయ్యగల్గుతున్నాం. ఎకరానికి రెండు లక్షల ఆదాయం వస్తుంది. ఇప్పుడు దాన్ని లాగేసుకుని ఏటా పాతిక వేలు ఇస్తామంటే, అది ఏ మూలకొచ్చేను? ఎవురి కడుపు నింపేను? నాలుగెకరాల్లోంచి రొండెకరాలిమ్మంటే అర్థముంది. ఉన్నది మొత్తం ధారదత్తం సెయ్యమంటున్నారు. పదెకరాల రైతు కూడా బికారిగా మారాల్సిందేనా?..''
పాతికపైగా గ్రామాల్లోని పంటపొలాలు సమస్తం రాజధాని నిర్మాణానికి ఇచ్చే యాల్సిందేనని సర్కారు ఆదేశం. ''ఎకరం దొండ తోటసాగుకు ఏటా పదిహేను వందల మంది కూలీలు
పడతారు. ఈ ప్రాంతం నుంచి లారీలకు లారీలు కూరగాయలు మార్కెటుకు పోతున్నాయి. ఇంత మంది కూలీల కడుపులేం గావాలి? మీ దగ్గర రాజధాని పెట్టబట్టే మీ భూములకు రేట్లొచ్చాయని మంత్రులు బుకాయిస్తున్నారు. బోడి ఇప్పుడు పెరగడమేంది...మా భూములు ఎప్పుడో కోటి దాటాయి. అయినా రాజధాని నిర్మాణా నికి లచ్చ ఎకరాలు నిజంగా అవసరమా?'' కోట య్య ఆవేశంగా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. అన్యమ నస్కంగానే అక్కణ్నుంచి కదిలాం, శ్రీను బైకు మీద. ముందుగా అనుకున్న ప్రకారం, పరిమి వెళ్లే దారి మధ్యలోనే చెరువు దగ్గర్నుంచి ఎడమవైపు ప్రయాణించి శాఖమూరు చేరుకున్నాం. ''రండన్న య్యా !'' ఆహ్వానించింది రమేష్‌ భార్య. నలభై నిండక ముందే శరీరం మీద ముసలితనం వాలినట్లు, నిస్సత్తువగా ఉందామె. మొహంలోని దిగుల్ని దాచుకోలేకపోతోంది. పైపై మాటలు పూర్తయ్యాక ''రమేష్‌ రెండు మూడు రోజులకోసారైనా ఇంటికొస్తున్నాడా?'' తీగ లాగాను. అమె ఒక్క పెట్టున ఏడ్చేసింది. మేం కంగారు పడ్డాం.
నేను కొంచెం దగ్గరగా వెళ్లి ''ఊరుకోమ్మా, ప్లీజ్‌, ఊరుకో. నీ కష్టంలో మేం పాలు పంచుకుంటాం. ధైర్యంగా ఉండు.'' అన్నాను ఆమె స్థిమిత పడింది. ''అదెవత్తో, టీవీ నటి అంట. అయన దాంతో ఉంటున్నాడు, ఊరంతా ఆ విషయం కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. తల కొట్టేసిన ట్లయింది. నాకు...''.
అప్పటికే అన్ని విషయాలూ శ్రీను చెప్పడంతో నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు.
''నువ్వేం కంగారు పడకు. మేమిద్దరం రేపు గుంటూరు వెళ్లి, మందలిస్తాం. కొట్టో తిట్టో వాణ్ని ఆ రొంపిలోంచి బయటికి తీసుకొస్తాం.'' ధైర్యం చెప్పా ను.
''డబ్బు చాలా పాపిష్టిది అన్నయ్యా. పొలం మట్టి రూపంలో ఉండగా ఆయన దేవుడు. ఆది డబ్బు రూపంలోకి మారిందో లేదో మాయదారి రోగాలు పుట్టుకొచ్చాయి.'' రెండు వాక్యాల్లో రమేష్‌ జీవితాన్ని విశ్లేషించిందామె.
ఆమె దగ్గర సెలవు తీసుకుని బండి మీద బయల్దేరాం. చెరువు దాటగానే, మెయిన్‌ రోడ్డు మీద పరిమి వైపు ఫర్లాంగు దూరం పోయాక, బైకును డొంకలోకి మళ్లించాడు శ్రీను.
''ఇటెక్కడకిరా?'' అడిగాను.
పోగొట్టుకున్న పొలాన్ని చివరిచూపు చూద్దామని... అంటూ బైక్‌ స్టాండ్‌ వేశాడు. ఇద్దరం చేలోకి నడిచాం. పత్తిచేను చివరి దశలో ఉంది. మునుం మధ్యలో నడుస్తుంటే, మొక్కలు ఎండుకట్టెల్లా గుచ్చుకుంటున్నాయి. ఒక్కసారిగా, పిచ్చిపట్టిన వాడిలా శ్రీను రయ్యిన పొలానికి అడ్డంగా పరుగెత్తాడు. కంగారుగా నేను కూడా పరుగెత్తుతూ వెళ్లాను. గట్టు దాకా వెళ్లి, అక్కడ కూలబడ్డాడు వాడు. నేను వెళ్లి పక్కనే కూచున్నాను, పత్తిగుల్లలు గీసుకుపోయి, వాడి చేతులు అక్కడక్కడా రక్తమోడుతున్నాయి. వాడు రొప్పుతున్నాడు. నేను సముదాయిస్తున్నట్టుగా, వాడి భుజం మీద చెయ్యి వేశాను. బావురుమన్నాడు.
''ఇక్కడే! ఇక్కడే రా... నేను అరక దున్నడం నేర్చుకుంది. గొర్రు తిప్పడం, విత్తనం ఎద బెట్టడం, కలుపు తియ్యడం,మందు చల్లడం... అన్నీ ఈ మట్టిలోనే నేర్చుకున్నాను. పత్తి, మిర్చి, మినుము, కంది, శనగ, జామ... ఎన్ని రకాల పంటలిచ్చిందో ఈ తల్లి. కేవలం ఈ నేల మీదనే సంసారం గడిచింది. పెద్దకూతురి పెళ్లి చేశాను. చిన్నదాన్ని సీఏ చదివిస్తున్నాను... ఇప్పుడు ఇచ్చేశాను. ప్రభుత్వానికి నా వంతు కానుకగా ఇచ్చేశాను. తల్లి వేరు తుంచుకున్నాను. మట్టి బంధం తెంచుకున్నాను. రేపట్నుంచి ఎలా బతకాలి? తెల్లారే లేచి, ఏ దిక్కుగా నడవాలి? నాగలిని ఏం చెయ్యాలి?'' శ్రీను గుండెలవిసేలా విలపిస్తున్నాడు, పత్తిచెట్టును పొదివి పట్టుకుని. నాకు తెలియకుండానే, నా కళ్లు తడిదేరాయి. వాణ్ని ఓదార్చడానికి విఫలయత్నం చేశాను.ఏడ్చీ ఏడ్చీ సొమ్మసిల్లి పడిపోయాడు శ్రీను.
2015 మార్చి, అదివారం
నేను, శ్రీను ఉదయం తొమ్మిదింటికి పరిమిలో బయల్దేరి పదింటికి గుంటూరు చేరుకున్నాం. ఆటోలో నేరుగా రమేష్‌ ఫ్ల్లాటు దగ్గరకు వెళ్లాం. అపార్టుమెంటు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే జనం మూగి ఉన్నారు. వాడు నాలుగో అంతస్తులో ఉంటాడు. లిఫ్ట్‌లో పైకి వెళ్లడానికి ప్రయత్నించగా, ఓ పోలీస్‌ అడ్డుకున్నాడు. అంతమంది జనం, నలుగురు కాన్‌స్టేబుళ్లు అక్కడెందుకున్నారో మాకర్థం కాలేదు. ఓ పక్కగా నిలబడి, వింతగా చూస్తున్నార. ఇంతలో లిఫ్ట్‌ కిందికి వచ్చింది. అందులోంచి, ఇద్దరు పోలీసులు రమేష్‌కు చెరో పక్క నిలబడి బయటికొచ్చారు. తోసుకుంటున్న జనాన్ని తప్పించుకుంటూ, వాడి చెరో రెక్క పట్టుకుని చకచకా తీసుకెళ్లారు. అంత హడావుడిలోనూ గోడవారగా నిలబడి ఉన్న మా ఇద్దర్నీ రమేష్‌ ఓరకంట గమనించినా, చూడనట్లే ముందుకు సాగిపోయాడు. మాకంతా అయోమయంగా ఉంది. ''ఏం జరిగింది?'' అని జనంలోంచి అడిగిన ఓ వ్యక్తికి మరో వ్యక్తి చెబుతున్న సమాధానం మాకు స్పష్టంగా వినిపిస్తోంది.
''గంట క్రితం, బ్రాడీపేటలో ఉన్న లాడ్జిలో ఎవరో ఓ టీవీ నటిని హత్య చేశారట. ఆ హత్యతో ఇతనికి సంబంధం ఉండొచ్చన్న కారణంతో అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు.''
మాకిక అక్కడ ఉండ బుద్ధి కాలేదు. బీడువారిన హృదయాలతో భారంగా కదిలాం.

ఎడ్ల బండి

Posted On Sat 23 May 22:20:59.059454 2015
సిపిఎం జాతీయ మహాసభల సందర్భంగా జరిపిన కథల పోటీలో ప్రచురణకు 
ఎంపికైన కథ
             బహుశా మీకు ఓడలు బండ్లవడం గురించి తెలిసే ఉంటుంది. అలాగే బండ్లు ఓడలుగా కూడా.అయితే ఎడ్ల బళ్లు ఉద్యమం బాట పట్టి సమ్మె చేయడం గురించి మీకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అది మా ఊళ్ళో జరిగింది.
బళ్ల వెనుక మనుషులున్నారు. జీవితాలున్నాయి. తరాతరాల బతుకులున్నాయి. అదొక్కటీ తెలుసుంటే మీరు కథ చదవడానికి అర్హులే. ఆలస్యమెందుకు? పదండి ముందుకు...
చెట్టు నీడ. ఎడ్ల బండి చక్రం ఊడదీసి బలమైన రాటను జాకీలా మోపు చేశాడు కాసులు. తగువు తేలిపోతే బండిని రోడ్డెక్కించాలని నార ఎక్కించే పని పెట్టుకున్నాడు. సుబ్బడు సాయంగా ఉన్నాడు. కాసులు చెమటతో తడిసి ముద్దయ్యాడు. ఒడుపుగా మధ్య మధ్య లో ఆముదం పోస్తూ బండి ఇరుసుకు జనపనారను గట్టిగా చుడు తున్నాడు. ఆము దం వాసన. చిత్రమైన కంపు. ముఖానికి వేడి గాడ్పు కొడుతు న్నది.
చేతి కర్ర ఊతంతో ఆయా సపడుతూ సత్యం వచ్చాడు. ఎడ్ల బండి తోలుకుంటూ కిరాణా సరకులు రవాణా చేయడంతోనే అతని జీవితకాలమంతా గడిచిపోయింది. సాదక బాధకాలు బాగా ఎరిగినవాడు. ఇప్పుడు కొడుకును అదే పనిలో దింపి తను తప్పుకున్నాడు. ఎద్దుల మనసు చదివినవాడు.
''ఈ సందేళ కూచుని ఏదో కాసేపు ముచ్చట్లాడేసుకుని, సీకటడింతర్వాత తాగి తొంగుంటే సరిపోదు. పొద్దుట సద్ది ముద్దవేళ అందరూ బండ్లు కట్టుకుని దొరగారి బంగ్లాకి చేరిపోవాలి. అందరూ కనకాలపేట వాళ్ళే గనుక ఒకళ్లనొకళ్ళు హెచ్చరిక చేసుకుని బయలెల్లాలి. అటో ఇటో తేల్చేద్దాం.. నాయాల కుటుంబాల్లోని చిన్నాచితకా అందర్నీ బీరుపోకుండా బండ్లు ఎక్కించుకుని వెళ్లిపోవాలి. మన బలం ఏపాటిదో ఎరుక పర్చాలి. ఆ తర్వాత జగన్నాథం బాబున్నాడు... ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆ పైన దేవుడున్నాడు..'' నేల మీద పడి వున్న దుంగపై కూర్చుని అన్నాడు సత్యం.
''దేవుడుండాడా? ఉంటే ఈ బతుకు నలుగుడు కట్టాలేంటి?'' కాసులు అన్నాడు. నిక్కరు జేబులోంచి జాగ్రత్తగా వేళ్ళతో చుట్ట తీసి నోట్లో పెట్టుకున్నాడు. చేతుల నిండా మసి. సుబ్బడు అగ్గిపుల్లతో వెలిగిం చాడు. కాసులు దమ్ము లాగాడు. ఓసారి బండికేసి చూశాడు. అతని చూపు గ్రహించాడు సత్యం.
''ఏ మాత్రం పెట్టావేంటి? '' సత్యం అడిగాడు.
''ఈ బండికి పెట్టిన పెట్టుబడికి నానా సంకలు నాకాను. ఈ మోస్తరు తయారు కావడానికి డబ్బులకి రెక్కలొచ్చాయనుకో. గుడ్డి నమ్మకంతో అప్పుచేసి, మళ్ళీ..ఇట్టంగానే అనుకో.. వొళ్ళు తెలవకుండా బాగు చేసి ఈ కాడకి తీసుకొచ్చాను. అంతా కొత్త బండికి చేసినట్లే. నువ్వే చూడు... చక్రానికి ఆకులు.. పూటీలు.. ఇనుప పట్టా.. అన్నీ మార్చేశాను. డబ్బులు ఖర్సైపోబట్టి గానీ పోలికర్ర కూడా మార్చేద్దును. ఏనాటిదో అది. అక్కడక్కడ చిట్లింది, మరో దఫా చూద్దాం లే అనుకుని...'' అన్నాడు కాసులు.
సుబ్బడు ఆముదం సీసా తన్నేశాడు... సన్నని ధారతో వొలికి పోతోంది.
''ఎదవ నాయాల...తిన్నగా చూసి అడుగెయ్య లేవా?'' అంటూ సత్యం గదమాయించాడు.
''ఒరేరు కాసులూ ... ఇందాక చూసాను. ఎద్దులకు మెత్తగాళ్ళు పడినట్లున్నాయేంటి?''
'' అవును.. రేపు ఈ గొడవ తేలిం తర్వాత నాడాలు ఏయించాలి. ముగ్గురు మనుషులుంటే గానీ పనవ్వదు. ఎద్దుని పడగొట్టాల. డెక్కల మీద నాడాలు కొట్టాలి. ఎద్దుకు వంద కొడితే గానీ నాడాలేసేవాడు వొప్పడం లేదు.'' అన్నాడు కాసులు. ''కానీ మాత్రం, ఒరేరు! ఏ మాటకామాట సెప్పుకోవాలి. మన కనకాల పేటలో బండినీ, ఎద్దుల్నీ నీ అంత కుశాలంగా చూసుకునేవాడు లేడు రా. తొట్టె గెడల మధ్య మోకుతో బిగించిన పడకదిన్నె అదిరందనుకో. ఎద్దులకు రంగుల దారాలతో కట్టిన మువ్వలు, నగిషీల చిడతలు, సొంపుగా ఒసికర్రల మధ్య అల్లిన ఎదురు తడికలు మంచి కుదురుగా వాటంగా అమరాయి. సోగ్గాడి బండిలా ఇంపుగా గూడు.. దాని పైన నల్లటి టార్పాలిన్‌.. అందుకే కాసులుగాడి బండి చూసి అందరూ ఉడుక్కుంటారు. కుళ్ళి చస్తారు.'' సత్యం పొగిడాడు.
''ఏమిటో పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట... అన్నట్టుంది బతుకు. మా జయవిజయుల కడుపు నింపేటప్పటికి తల తోకకు వత్తున్నాది.
ఉలవలు, గంట్లు, తవుడుతో ఉడకపెట్టిన దాణా తడిసి మోపిడవుతున్నాది. గుర్రం గుడ్డిదైన దాణా తప్పదన్నట్లు... పనున్నా లేకపోయినా తిండి తప్పదు కదా. పైగా మా నేస్తాలకు కాకినాడ వెళ్ళొస్తే చాలు వేడినీళ్ల కాపడం పెట్టాలి.'' కాసులు అన్నాడు.
''నువ్వు అలా అలవాటు చేసావు... సరేలే, నేనొత్తాను. రేపొద్దును ఎలాగూ వుంది కదా రగడ. సూద్దాం! గవర్నమెంటోడు దిగొత్తాడో లేదో?'' సత్యం లేచి నిలబడ్డాడు, వెళ్లడానికి సిద్ధపడుతూ.తెల్లారింది. సముద్రం మూల సూర్యుడు ఎర్రగా కందిపోయి పెద్దగా కనిపిస్తున్నాడు. గోదారి మీంచి చల్లటి గాలి రివ్వుమని కొడుతూంది. లంకల్లోంచి పాలు పితుక్కుని వచ్చేవాళ్ళూ, న్యూస్‌ పేపర్లు పంచే కుర్రాళ్ళూ, ముసుగులు తొడుక్కుని నడకే ఆరోగ్యరహస్యమని చిరుచెమటలతో నడిచే వాళ్లూ, ఇళ్ల ముందు కళ్ళాపు జల్లుకుని ముగ్గులేసుకునే ఆడాళ్లూ, వీపులకు బ్యాటులు తగిలించుకుని మోటారు వాహనాల మీద ఇండోర్‌ స్టేడియంకు వెళ్ళేవాళ్ళూ, కురచ ఖాకీ నిక్కర్లతో కవాతులు చేస్తున్న ఆరెస్సెస్‌ వాళ్ళూ, సైరన్‌ మోత వినిపించగానే వడివడిగా పిరమిడ్‌ మందిరానికి పరుగులు పెట్టేవాళ్లూ... అంతటా సుందర తేట హృదయాల పసందైన ఉదయపు కోలాహలం.
ఎడ్లబండ్లు సాఫీగా బహు నెమ్మదిగా రోడ్డు మీద బారులు తీరి వస్తున్నాయి. గిట్టల శబ్దం లేదు. కొరడా ఝలిపింపులు లేవు. అదలింపులు లేవు. ముందు బండి దారి చూపుతుంటే మిగిలినవి అనుసరిస్తున్నాయి. విషయమేమిటో తెలియని జనం వింతగా చూస్తున్నారు.
దొరగారి బంగ్లా చేరాయి. ఆ బంగ్లాలో యానాంలోని సమస్త ప్రభుత్వ శాఖలకు ముఖ్య అధికారి ఉంటాడు. ఆయన్ని ప్రాంతీయ పరిపాలనాధికారి అంటారు.
బంగ్లా చుట్టూ రెండు వరుసలలో బండ్లను నిలిపారు. ఎడ్లను బండ్లకు కట్టేశారు. కాడి దగ్గర తొట్టిలో బండి లోంచి ఎండు గడ్డి తీసుకొచ్చి వేశారు. తోకలూపుకుంటూ ఆత్రంగా గడ్డిని అందుకుంటున్నాయి.
ఇంతలో జగన్నాథం వచ్చాడు. తెల్లని ఛాయ. అందంగా పెరిగిన చిరుగెడ్డం. కళ్ళల్లో మెరుపు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడు. నలభై ఏళ్ల వయసు. ప్రజా సమస్యల పట్ల స్పందించి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
''నేను చెప్పేంత వరకూ మీరిక్కడే ఉండండి'' అంటూ లోపలికి వెళ్ళాడు జగన్నాథం.
అరగంటయ్యింది. ఏ కబురూ లేదు. బళ్ళ వారందరూ గుంపుగా చేరి కబుర్లలో పడ్డారు.
'' ఏం జరుగుతుందో లోపల?''
''పని అవుతుందంటావా!''
''ఇంకా ఎంతసేపు...''
''ఆఫీసరు గార్కి మన బాధ అర్థం చేసుకోవాలా? ఆ పైన పాండిచేది వాళ్ళతో మాట్లాడాలా? ఊరికే కంగారుపడితే ఎలా?''
''ఆఫీసరు గారు లేరంట. గుడికెళ్లారంట. ఆయన రావాలి. అప్పుడు దాకా అంతే.''
అసలు విషయం తెలిసింది. రకరకాల వ్యాఖ్యానాలు.
''అక్కడ్నుంచి అటే ఏ కాకినాడకో చెక్కేసాడేమో. జగన్నాథం బాబు ప్రతిపక్షం వాడు కదా, ఆయనకు పేరొస్తే ఎలా? పై నుంచి సంకేతాలు అందుంటాయి.'' ఊళ్ళో జరిగే ప్రతి సంఘటననూ రాజకీయాలకు ముడి పెట్టి మాట్లాడేవాడొకడు అంటున్నాడు. జగన్నాథం వచ్చాడు. కోపంతో ఆయన ముఖం మరింత ఎర్రబారింది. ఆవేశం రగులుకున్న మనిషిలా ఉన్నాడు. ''మన దెబ్బకు జడిసినట్లున్నాడు. ఫోన్‌లో మాట్లాడితే సాయంత్రం రమ్మంటున్నాడు. కనీసం మనం చెప్పే విషయాలు వినకపోవడం దారుణం. ఓ గంట చూద్దాం. అప్పుడే ఆలోచిద్దాం ఏం చేయాలో?'' జగన్నాథం పైమెట్టు మీద నిలబడి బళ్ళ వాళ్ళందరికీ వినపడేలా గట్టిగా అన్నాడు. వాళ్ళ ఉత్సాహం నీరు గారింది. ఏదో రకంగా తేలిపోతుందనే నమ్మకం సన్నగిల్లింది. అనుకున్న సమయం గడిచింది. అంతా అసహనంగా ఎదురు చూస్తున్నారు.
అప్పటికే జగన్నాథం ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. అందర్నీ దగ్గరకు రమ్మని పిలిచాడు.
''పద్ధతి ప్రకారం ముందు రోజే మనం చేయబోయే నిరసన గురించి తెలియజేసాం. దీనికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. వాళ్ళు కావాలనే మనకు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. ఎవరూ భయపడక్కర్లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఎడ్లను బళ్ళ నుండి విప్పండి. జాగ్రత్తగా ఈ చిన్న మెట్ల గుండా ఆఫీసు గ్రౌండులోకి తోలుకు రండి. మనం తెగించకపోతే లాభం లేదు.
ఊ...కానీయండి.''
జగన్నాథం ఆదేశించగానే పొలోమని ఎద్దుల్ని ఆఫీసు ఎదురు ఖాళీ ప్రదేశంలోకి వదిలేశారు. అవి కదను తొక్కాయి. పూల మొక్కల్ని ధ్వంసం చేశాయి. కనకాంబరాలు, చేమంతులు, బంతిపూలు, గులాబీలు, క్రోటన్సు, సన్నజాజులు... అన్నింటినీ తొక్కి పారేశాయి. ఆ ప్రాంతమంతా పేడతో ఖరాబు అయ్యింది. ఎవరూ ఊహించలేదు.
ఉద్యోగులు బయటకు రాలేదు. చక్కగా తీర్చిదిద్దినట్లు పెంచుతున్న పూలవనం నిమిషంలో బోడిగా మారిపోయింది. అప్పుడొచ్చారు పోలీసులు. ఎద్దుల్ని బయటకు తోలడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
నిమిషాల్లో జగన్నాథం మరో నిర్ణయం తీసుకున్నాడు.టెంట్‌ వచ్చింది. కుర్చీలు వచ్చాయి. కుటుంబ సభ్యుల్ని అందులో కూర్చోబెట్టాడు. ప్లెక్సీలొచ్చాయి. నినాదాలు రాసిన ప్లకార్డులు నలుమూలలా పెట్టారు.
'పాండిచేరి ప్రభుత్వం ఆదుకోవాలి', 'తూ.గో జిల్లా కలెక్టరుతో మంతనాలు జరపాలి', 'ఎడ్ల బండ్ల మీదే ఆధారపడ్డ వారికి అండగా నిలవాలి', 'తూ.గో జిల్లా వాణిజ్య అధికారుల జులం నశించాలి', 'మట్లపాలెం బళ్ళను అడ్డగించి సరుకులు దింపేసి ఎద్దుల్ని కట్టడిలోకి తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి', 'కిరాణా సరకుల రవాణాను యధాప్రకారం కొనసాగించాలి'.. ఈ రాతల్ని చుట్టూ అంటించారు.
వాతావరణం మారిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఉత్కంఠ పెరిగిపోయింది. పరిపాలనాధికారి సూర్యతేజ వచ్చారు. ఎవరినీ పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయారు. చర్చలకు పిలవలేదు.
కాసేపటికి సూపరిండెంటు మరో గుమస్తా వచ్చారు.''ఇది ప్రభుత్వ పరిధిలో పరిష్కరించే సమస్య కాదు. పరాయి రాష్ట్రం వారు తీసుకున్న నిర్ణయానికి మనం బాధ్యులం కాము.'' అని పరిపాలనాధికారి మాటగా చెప్పారు.














''కుదరదు. సూర్యతేజగారు స్వయంగా టెంటు దగ్గరకు రావాల్సిందే. మేం ఆయనతోనే మాట్లాడతాం.''
మరో అరగంటలో సూర్యతేజ శిబిరం దగ్గరకు వచ్చారు. జగన్నాథం స్పష్టంగా చెప్పాడు.
''వీరంతా వారానికి ఒక రోజు అంటే ఆదివారం నాడు కాకినాడ వెళతారు. షావుకార్లు సరుకుల్ని కొనిబడి చేసి బళ్ళకు అప్పగిస్తారు. మంగళవారం పొద్దుటకు యానాం చేరతాయి. యానాం చుట్టు పక్కల గ్రామాలకు వీళ్ళే కిరాణా సామానులు తీసుకొస్తారు. ఇది ఇప్పుడు కొత్తగా మొదలయ్యింది కాదు. వందల ఏళ్ళ నాటి నుంచి జరుగుతున్న విధానం వీటికి మోటారు వెహికల్స్‌కి మల్లే వే బిల్లులేంటి? డబ్బులు లంచాలేమిటి? అవగాహన లేకుండా ఆంధ్రా వాళ్ళు చేస్తున్నారు. యానాంలో ముఖ్యంగా కనకాల పేటలో చాలా కుటుంబాలు ఇదే వృత్తిలో ఉన్నాయి. మానవతాదృష్టితో ఆలోచించి న్యాయం చేయమని కలెక్టరు గారికి మన ప్రభుత్వం తరుపున చెప్పుకుందాం.



కోరదాం. వాళ్లు అంగీకరించకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం.'' అన్నాడు జగన్నాథం. ''పాండిచేరి అధికారులతో మాట్లాడి చెబుతాను.
ముందుగా మీరు ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోండి. ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే మీ సహకారం అవసరం. జగన్నాథం గారూ, నాక్కొంచెం సమయం ఇవ్వండి, దయచేసి అందర్నీ ఇక్కడ్నుంచి తీసుకుపోండి.'' అని సూర్యతేజ చెప్పి వెళ్ళిపోయాడు.
''ఆయన దగ్గర్నుంచి సరైన స్పందన వచ్చిందాక కదలొద్దు'' అన్నాడు సత్యం.
''అలాగే...'' అన్నాడు జగన్నాథం.
బండివాళ్ళ సమ్మె ప్రభావం అంత తేలిగ్గా తీసేయదగ్గది కాదని ఊళ్ళో వాళ్ళకు తెలుసు. కాకినాడ నుండి రావాల్సిన టోకుగా తీసుకున్న సరకులు నిలిచిపోతాయి. దాంతో ధరలు పెరిగిపోతాయి. అమ్మకందార్లు తమ దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులను దాచి అమ్మడం మొదలెడతారు. పత్రికలు విరుచుకుపడతాయి. కోరింగ రేవు గుండా జల రవాణా చేసుకోవాల్సి వస్తుంది. దానికి మరల ఎలాంటి సమస్యలొ





స్తాయో తెలియదు. పరిస్థితి చక్కదిద్ద కపోతే మరింత గడ్డు కాలం దాపురిం చడం ఖాయమని అందరూ అనుకు న్నారు.
సాయంత్రమైంది...
ఆఫీసు ప్రాంగణం లోని మొక్కల్ని పాడు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు శిబిరంలో ఉన్నవాళ్లు నోటీసులు అందుకున్నారు.
ఇంత దాకా వచ్చాక అరెస్టులకైనా సిద్ధపడక తప్పదని జగన్నాథం తెలియజేశాడు.
మచ్చికైన ఎద్దులు ఎంత గొప్పగా విశ్వాసాన్ని ప్రకటిస్తాయి? పోలీ సులు వాటిని బయటకు తోలేయగానే సుశిక్షు తులైన సేవకుల్లా తమ బండిని
గుర్తించుకుని సరిగ్గా అక్కడకెళ్ళి నిలబడ్డాయి. వాటి క్రమశిక్షణ తీరు గొప్పది. యానాం నుండి కాకినాడ వెళ్ళేటపుడు గానీ, సరుకులు నింపుకుని తిరిగి యానాం వచ్చేటప్పుడు గానీ ప్రత్యేకంగా తోలనక్కర్లేదు. రోడ్డు ఎడమ పక్కన నిదానంగా నడుచుకుంటూ పోతాయి. బండివాడు నిండా సరుకులు సర్దుకుంటాడు. కాకినాడలో జనం సద్దుమణిగాక రాత్రి పదకొండు గంటలకు బళ్ళన్నింటినీ ప్రయాణానికి సిద్ధం చేస్తారు. అన్ని బళ్ళు ఒకేసారి బయలు దేరతాయి. ముందున్న బండివాడు ఎదర తొట్టె మీద పడుకుని ఎద్దుల్ని అదలిస్తాడు అంతే. ఇక వాటి గమనం సంగతి పట్టించుకోనక్కర్లేదు. ఆదమరచి నిద్రపోయినా ఇబ్బంది లేదు. చక్కగా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ గమ్యం చేరుస్తాయి. ప్రతి బండి అడుగున ఇరుసు మధ్యగా కిరోసిన్‌ లాంతరు వెలిగించి వేలాడదీస్తారు. అది అటూ ఇటూ ఊగుతూ వుంటుంది. లారీలు, బస్సులు దూరం నుంచే వెలుగును బట్టి బళ్ళను గుర్తించడం వల్ల చీకటి రాత్రుల్లో కూడ ప్రమాదాలు జరిగే అవకాశం లేదు.
ఏమైంది అక్కడీ ఏదో గలాభా జరుగుతున్నట్టుంది?
కాసులు ఎద్దు తన కొమ్ములతో పోలీసును పొడిచింది. బొక్క బోర్లా పడ్డాడు. లేచి నిలబడి బట్టలు దులుపుకుని అటూ ఇటూ చూశాడు. కాడి చిడత లాక్కుని ఎద్దుని కుమ్మడం మొదలెట్టాడు. అక్కడితో ఆ పోలీసు కోపం చల్లారలేదు. గబగబా బండెక్కి తడికలకు ఆధారమైన ఒసికొయ్య ఊడదీసి దిగ్గున కిందికి ఉరికాడు. ఎద్దుని బాదాడు. బాదాడు.. బాదాడు.. అలుపొచ్చేదాక. ఎద్దు అలాగే ఒళ్ళప్పగించి నిలబడి ఉంది. కాసులు ముందుకు అడుగేసి పోలీసు చేతిలోని ఒసికొయ్యను పట్టుకుని ఆపాడు. ఇద్దరూ గింజుకుంటున్నారు. మిగిలిన్న
వాళ్ళు విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపులో జరగాల్సిన దారుణం జరిగిపోయింది. సంఘటనను అనుకోని మలుపు తిప్పింది.ఎద్దు సొమ్మసిల్లి పడిపోయింది. చలనం లేకుండా తల వాల్చేసింది. ప్రాణం గాలిలో కలిసిపోయింది.
ఇక కాసులు వీరంగం చేశాడు. పిచ్చెక్కినట్లు అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. జనం పోగుపడిపోయారు. తనొక కర్ర తీసుకున్నాడు. మెట్లెక్కి ఆఫీసు కిటికీ వైపుకు విసిరాడు. అద్దం భళ్ళున బద్దలయ్యింది. రోడ్డు మీద పేడ తీసుకుని దొరగారి బంగ్లా గోడకేసి కొట్టాడు. చేతుల్లోకి తీసుకుంటున్న పేడను అలా విసురుతూనే ఉన్నాడు. అతనికి మరో ఇద్దరు తోడయ్యారు. రాళ్లు, పేడ విరజిమ్ముతూనే ఉన్నారు. జగన్నాథం నిశ్చేష్టుడై చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయుడుగా నిలబడిపోయాడు.
''ఒరేరు! కనకాల పేట వాళ్లు పౌరుషానికి పెట్టింది పేరని తెలియదా? అగ్గి రాజేస్తే ఇక ఆరదు రా..! తాతల నాటి నుండీ ఇదే పని చేస్తున్నాం. ఇదే బతుకు తెరువుగా గడుపుతున్నాం. ఒక్కపక్క ఏడ్వ గలిగేవాడే ఎగసాయం చేత్తున్నాడు. కొద్దిపాటి కొండ్రకు వేడినీళ్ళుకు చన్నీళ్లని ఈ బండి తోలుకుని మేం చేస్తున్నాం. సవా లచ్చ రూల్స్‌ అడ్డంగా పెట్టి కాల్చుకు తింటున్నారు.'' ఎగిరెగిరిరి పడుతూ అరుస్తున్నాడు కాసులు.
తువ్వాలు మెడ చుట్టుకుంటూ- ''ఆవు ఎంతో ఎద్దూ అంతే. అది పాలు ఇత్తుంది. ఇది బతుకు ఈడుత్తుంది. ఈయేళ అత్తారబత్తంగా చంటిపిల్లాడిలా పెంచుకునే నా జయుడ్ని పొట్టన పెట్టుకున్నారు. అంటేనన్ను సంపినట్లే. జయుడు లేకపోతే విజయుడు లేడు. వీళ్ళిద్దరూ లేకపోతే ఈ కాసులు గాడు లేడు. నన్ను కూడా సంపి ఆటితో నన్నూ తగలెయ్యండి.'' అంటూ ఒంటి మీది బనీను చింపుకుని గుండెను చూపిస్తున్నాడు. వాళ్ళలో ఒకడు కాసుల్ని గట్టిగా పట్టుకున్నాడు. విదిలించుకున్నాడు.
''నాయాలా! ఇప్పుడొచ్చాయా రూల్స్‌? జీవాలు మోసే సరుకులకు వే బిల్లులు కావాల్సి వచ్చిందా? మా కడుపులు కొట్టే అధికారం మీకెవ్వరిచ్చారు? వందల ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడెందుకు? మా బతుకు నాశనం గురించి కలక్టేరుతో మాట్లాడడానికి మీకేమైనా నొప్పా? అయ్యా...బాబూ...మా పెజల బాధలు ఇవీ.. ఈటిని యదాపెకారం నడవనీయండి అని అడగలేరా? దొంగచాటున లచ్చల రూపాయిల దొడ్డి దారిన దాటి పోతూనే ఉంటాయి. నోటిమాట సాయం చేయడానికి ఇంత యాగీ చేసేత్తున్నారు. కలక్టేరు మంచి వాడంట. బతుకుల్ని వీధి పాలు చేయడానికి ఒప్పడంట. మరేం పోయేకాలం వచ్చింది మీకు?''
పోలీసుల బలగం వచ్చేసింది. గుంపుని చెదరగొడ్తున్నారు. పరిస్థితి జగన్నాథం చేతుల్లోంచి ఎప్పుడో జారిపోయింది. ఉన్నట్టుండి కాసులు ఒక్కుదుటన ముందుకురికాడు. బండి కింద వేలాడుతున్న లాంతరును గట్టిగా లాగి చేతుల్లోకి తీసుకున్నాడు. మూత తీసి నెత్తి మీద పోసుకుని అగ్గిపుల్ల వెలిగించడానికి సిద్ధమై పోయాడు. అందరూ భయం భయంగా చూస్తున్నారు.
''ఎవరూ దగ్గరకు రాకండి. వస్తే నేనేం చేత్తానో నాకు తెలియదు. ఎద్దులు పోయాక నేనెందుకు నా బండెందుకు?'' ''ఏరు ..కాసులు.. ఎలాంటి పిచ్చిపనులు చేయకు. నీ వెనకాతల పెళ్లాం పిల్లలు ఉన్నారు. అనవసర రాద్ధాంతం చేయకు. తొందరపడితే నష్టపోయేది నీవే...'' జగన్నాథం మాటలు ఇంకా పూర్తి కాలేదు.
లాంతరు లోంచి కిరసనాయిలు బండి మధ్యలో ఉన్న గడ్డి మీదపోశాడు. అగ్గిపుల్ల వెలిగించి విసిరాడు. భగ్గుమంది. క్షణంలో సగం మంటలు ఎగిశాయి. వెదురు తడికలు, పడక దిన్నె, తాళ్లు, కాడి పైకప్పు మీది టార్పాలిన్‌ అంటుకుంటే ఆర్పడం ఎవరి తరమూ కాదు. అంటుకుంది... అందుకే ఉవ్వెత్తున మంటలు. కాసులు అపురూపంగా చూసుకునే బండి కళ్ళెదుట అగ్గిపాలవుతున్నది. ఎద్దు చనిపోయింది. పిచ్చెక్కినవాడిలా బండి చుట్టూ తిరుగుతున్నాడు. మంట తాలుకు అగ్ని కీలలు కాసుల్నీ తాకుతున్నాయి. అయినా లెక్క చేయకుండా మంట ఎగదోయడానికి, వద్దంటున్నా వినకుండా పక్క బండి లోంచి గడ్డి తీసుకొచ్చి వేస్తున్నాడు. చీకటి తెరల మధ్య ఎవరేం చేస్తున్నారో తెలియడం లేదు. వాతావరణమంతా ఆడాళ్ళ రోదనలతో గందరగోళంగా తయారయ్యింది. మంట అంతకంతకూ పెరిగిపోతోంది.
జనం నీళ్ళ కోసం పరుగులెట్టారు. ఈ లోపులో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. మిగిలిన బళ్ళను దూరంగా తీసుకుపోయారు.
ఆ మంటలు చూస్తూ కాసులు నేల మీద చతికిలపడిపోయాడు. కళ్ళు మూసుకుని ఏడవడం మొదలెట్టాడు. అప్పటికే కాసులు చేతులు కాలాయి. బట్టలు అంటుకున్నాయి. ఆర్పేశారు. వెంటనే కాసుల్ని ఆసుపత్రికి తీసుకునిపోయారు. అక్కడితో, ఆ రోజుతో నిరసనలు ఆగిపోలేదు. కారణాలేమైతేనేం వారం రోజుల పాటు సాగాయి.
ఉద్యమాలు, పోరాటాల త్యాగం ఊరికే పోదు. కలకాలం చెప్పుకునే గాథగా మారుతుంది. తరతరాలకు ఒక స్ఫూర్తిగా నిలిచిపోతుంది. జెండా తొలిసారి పాతిన వారి పేరు చరిత్ర పుటలలో ఎప్పటికీ ఉండిపోతుంది. పరిపాలకులు దిగి రాక తప్పదు.
ఆలస్యంగా నైనా కాసులు త్యాగం కూడ ఊరికే పోలేదు.

మాయ‌

Posted On Sat 06 Jun 22:10:56.781552 2015
                        అర్ధరాత్రి గాఢ నిద్రలో గ్రామం. అమావాస్య చీకటి రాత్రి. పోలీస్‌ సైరన్‌ మోతలు, డి.యస్‌.పి. నిరంజన్‌ దాసు పోలీసు బలగంతో గ్రామ దిగ్బంధం చేశాడు. దీక్షా శిబిరం కూల్చివేశాడు. గాఢ నిద్రలో ఉన్న సంజీవరావు, ముత్తమ్మ, యలమంద, మధుసూదన్‌తో పాటు ఉద్యమ నాయకులందరిని అరెస్టు చేసి పోలీసు జీపులెక్కించారు. లారీచార్జీ, బాష్పవాయువు ప్రయోగంతో జనాలను భయభ్రాంతులు చేసి దొరికిన యువకులనల్లా పట్టుకెళ్లారు. గ్రామంలో పోలీసు పికెట్‌. రోజూ పోలీసుల కవాతు. చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల్లో పోలీసుల మోహరింపు. దొరికిన వారిని దొరికినట్లు పోలీస్‌ స్టేషన్లకు తరలింపు. ఆడవారిని కూడా వదిలిపెట్టలేదు. మొత్తానికి భయానక వాతావరణం ఏర్పడింది. 
              ''కలెక్టర్‌ గారూ! ఏం జేస్తున్నారు. మీ అధికారులంతా ఎక్కడ పడుకున్నారు. నెల రోజుల నుండి సిరిపురం గ్రామంలో ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, బంద్‌లు చేస్తుంటే ... మీరు, మీ యంత్రాంగం ఏంజేస్తున్నట్లు? ఏరికోరి మీరు నా మనిషని మిమ్ములను అక్కడికి పంపితే ఇదా మీ నిర్వాకం? అవతల సి.యం. రాజా ఫార్మాసీ కంపెనీ శంకుస్థాపనకు తొందర పెడుతున్నారు. మీరేంజేస్తరో తెల్వదు! వారంలో అంతా సద్దుమణిగి పనులు మొదలు కావాలి....'' మంత్రి గుర్నాథరెడ్డి ఫోన్‌తో కలెక్టర్‌ సురేంద్రకుమార్‌కు ముచ్చెమటలు పట్టాయి. ''అలాగే సార్‌ ...అలాగే సార్‌... '' అని ఫోన్‌ పెట్టేశాడు.
ఇక చూడు కలెక్టర్‌, యస్‌.పి., జేసి., ఆర్‌.డి.వో.తో పాటు అధికారులంతా సిరిపురం వైపు వురుకులు పరుగులు.
అసలు కథేేంటంటే సిరిపురం గ్రామం పక్కనే రెండు గుట్టల మధ్య రెండొందల ఎకరాల ప్రభుత్వ భూమిఉంది. ఎప్పుడూ గల గలాపారే అమృతం వాగు. ఆపైన ఎప్పుడూ నీరుండే పెద్ద చెరువు. సదరు ప్రభుత్వ భూమి మీద ఓ బడా మందుల ఫ్యాక్టరీ యజమాని కన్ను పడింది. భూమి ఉంది, నీరు ఉంది, కారు చౌకగా దొరికే కూలీలున్నారు. ఇంకేం కావాలి. చక్రం తిప్పాడు.
ఎప్పుడైతే గతంలో ఎసైన్‌మెంటు భూములిచ్చిన సన్న చిన్న కారు రైతులకు ఫ్యాక్టరీకి భూమి అవసర ముందని కలెక్టరు నోటీసులు పంపాడో గ్రామంలో అలజడి మొదలైంది. సంజీవరావు అతనే రిటైర్డ్‌ టీచర్‌ నాయకత్వంలో ఆందోళన మొదలైంది. ఆయనకు తోడుగా మహిళా నాయకురాలు ముత్తమ్మ, రైతు నాయకుడు యలమంద, విద్యార్థి నాయకుడు మధుసూదన్‌ జతకలిశారు.
రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు అంతా ఒక్క తాటి మీద నడిచారు. చుట్టూ వున్న నాలుగు గ్రామాల ప్రజలు వీళ్ళకు మద్దతుగా నిలిచారు. సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. ఎక్కడైతే ఫ్యాక్టరీకి భూమి ఇస్తున్నారో అక్కడే టెంటు వేసి ఆందోళన మొదలుపెట్టారు. ఫ్యాక్టరీ వద్దని ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు, ర్యాలీలు, ధూంధాం, ఆటాపాటా, రిలే నిరాహారదీక్షలతో ఉద్యమం ఊపందుకుంది. సంజీవరావు పిలుపిస్తే చాలు కదం తొక్కవలసిందే.
సంజీవరావు మాస్టారంటే ఆ ఊరుకు వల్లమాలిన ప్రేమ. ఎంతో మంది పేదపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ముందుకు నడిపించారు. సిరిపురం ఊరి బాగోగులు మొత్తం ఆయన చేతిమీద నడవాల్సిందే. ఎలాంటి తగాదాలైనా ఇరువర్గాలకు నచ్చచెప్పి పరిష్కారం చేసి పంపేవాడు. ఇంతవరకు ఆ ఊరు నుండి పోలీస్‌స్టేషన్‌లో ఒక్క కేసు నమోదు కాలేదంటే ఆయన చలవే! సాఫ్ట్‌వేరు ఉద్యోగం చేస్తూన్న కొడుకు సతీష్‌ హైదరాబాదు రమ్మని ఎన్నిసార్లు పిలిచినా ఉన్న వూరిమీద ప్రేమతో ససేమిరా రానన్నాడు.
రోజూ పోలీసులు వస్తూనే వున్నారు. నానా హాంగామా చేసి పోతున్నారు. లాఠీ చార్జీలు, అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి. మంత్రి గుర్నాథరెడ్డి హెచ్చరి కతో జిల్లా యంత్రాంగమంతా కలిసి హడావిడిగా సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయించింది. ఆందోళనకారుల టెంటుకు ఎదురుగానే గ్రామసభ వేదిక సిద్ధమయింది.
జిల్లా కలెక్టరు సరేంద్రకుమార్‌, జే.సి.విజ యరాణి, ఆర్‌.డి.వో. మునిసుందరం, తహశీల్దార్‌ సుందర్‌రావు ముందురాగా ఫ్యాక్టరీ యజమాని సుబ్బరాజు, మేనేజరు సురేంద్ర తళతళ మెరిసేకార్లలో సూటుబూట్లతో దిగారు. డి.యస్‌.పి. నిరంజన్‌దాసు, ఓ వందమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాడు.
వీళ్లంతా వచ్చేసరికి ఆటాపాటా ఊపందుకుంది. ''ఈ వూరు మనదిరో, ఈ భూమి మనదిరో ఏరు మనది, నీరు మనది, గుట్ట మనది, చెట్టు మనది, పంట మనది, పండించే భూమాత మనదిరో, ఫ్యాక్టరీ ఏందిరో, వాని పీకుడేందిరో, పోలీసులేందిరో వాల్ల జులుం ఏందిరో'' నారాయణమూర్తి సినిమా స్టైల్‌ పాటతో సమావేశ స్థలం దద్దరిల్లింది. మాయదారి మందుల కంపెనీ మాకొద్దు, నినాదాలు జోరందుకున్నాయి. ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. డప్పులు, కంజర్లు, గజ్జెలు ఎవరి దగ్గరున్నవి వారు మోగించారు. వేదిక మీద అధికారులు, వేదిక కింద ఉద్యమకారులు, గ్రామ ప్రజలు. కలెక్టరు లేచి నిల్చుని మైకందుకున్నారు. జనం నినాదాలు చేస్తూనే వున్నారు. సంజీవరావు లేచి తన చేయి ఊపాడు. క్షణంలో అంతా సైలెంటయి పోయింది. కలెక్టరు ఒకింత ఆశ్చర్యపోయాడు.
''సిరిపురం గ్రామ పెద్దలు, ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ దయచేసి గ్రామసభకు సహకరి ంచండి. ఇక్కడ ఫ్యాక్టరీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. అన్ని రకాల అనుమతు లొచ్చాయి. మీ ప్రాంతం వెనుకబడిందని ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే, మీ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. విద్యుత్తు, నీరు, రోడ్లు బాగుపడుతాయి. దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి. మా జె.సి.గారు, కంపెనీ యం.డి. సుబ్బరాజుగారు మీకు సమాధానాలు చెప్తారు. సంజీవరావుగారు మీరు మాట్లాడండి.'' కలెక్టరు మాట్లాడుతున్నంత సేపు ''వద్దు, వద్దూ'' అనే నినాదాలు చేస్తూనే వున్నారు. కలెక్టరు కూర్చోగానే సంజీవరావు లేచాడు.
''కలెక్టరుగారూ, వేదిక మీదున్న పెద్దలందరికి నమస్కారం. అయ్యా! ఫ్యాక్టరీ వద్దని గత నెల రోజులుగా మేం ఆందోళన చేస్తూనే వున్నాం. ఎన్నో అర్జీలు పెట్టుకున్నాం. ఎంతో మంది పర్యావరణ శాస్త్రవేత్తలు వచ్చారు. ఏ ఫ్యాక్టరీ అయినా పర్యావరణం పాడు చేస్తుందని ముఖ్యంగా నీరు కలుషితమైపోతుందని చెప్పారు.
గత నెలరోజుల నుండి మా పేదరైతులు తిండి, నిద్రలేక నానా యిబ్బందులు పడుతున్నారు. తమ భూములు పోతే తామేం చేసి బతకాలని వీళ్ల భయం. అదీగాక ఇప్పుడు మీరు భూములు తీసుకుంటున్న రైతులంతా ఎకరం రెండెకరాల సన్న చిన్నకారు రైతులే. అదీగాక మీరు నిర్మించబోయే ఫ్యాక్టరీ వూరికి దగ్గరలో వుంది దయచేసి ఈ ఫ్యాక్టరీని వేరే చోటికి తరలించండి. ఇది మా గ్రామ ప్రజల అభ్యర్థన'' ముఖం మీద పట్టిన చెమటను పైనున్న తువ్వాలుతో తుడ్చుకుని కూర్చున్నాడు సంజీవరావు.
''చూడండీ సంజీవరావుగారు ఇక్కడ ప్రభుత్వ భూమి వందెకరాలు వుంది. మరో వందెకరాలు మేము పేదరైతులకు తలా ఎకరం రెండెకరాలు ఎసైన్డ్‌ పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇచ్చిన్నాడే ప్రభుత్వానికి ఎప్పుడు అవసరముంటే అప్పుడు తీసుకుంటాం అనే కండీషన్‌ మీదే యిచ్చాం. ఇకపోతే ఫ్యాక్టరీ ఆపడం మా చేతుల్లో లేదు. భూ సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. నష్ట పరిహారం ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ఉపాధి కల్పిద్దాం. వారి పిల్లలకు ఉద్యోగాలిప్పిద్దాం. కాదు మాకు భూమే కావాలంటే ఇంకోచోట కొనిద్దాం.'' జె.సి. విజయరాణి వివరించారు.
''అయ్యా! కలెక్టరు గారూ! మీరిచ్చిన పోరంబోకు భూములు వీల్లంతా రాత్రనక, పగలనక కష్టపడి బావులు తవ్వీ, బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటున్నారు. కూలి బతుకు పోయి రైతుగా బతుకుతున్నామని సంతోషంగా వున్నారు. మీరు కంపెనీ పేరుతో మా పొట్టగొట్టకండీ''
''ఇగో ఈ చంద్రమ్మని చూడండి సార్‌! దీని మొగుడు సారా తాగితాగి సచ్చిండు. వున్న ఒక్క బిడ్డను పెంచి పెద్దచేసి ఈ రెండెకరాల భూమిచ్చి పెండ్లి చేసింది. మీ నోటీసు చూసి ఆ అల్లుడు నీ భూమి పోయినంక నీ బిడ్డ నాకెందుకని తన్ని తగిలేసిండు.'' మహిళా నాయకురాలు ముత్తమ్మ తన ఆవేదన వెలిబుచ్చింది. పక్కనే నిల్చున్న చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఓదార్చింది ముత్తమ్మ.
''సార్‌! పచ్చటి పంట పొలాల మధ్య ఈ ఫ్యాక్టరీ చిచ్చేంది సార్‌. ఎకరం, రెండెకరాలున్న మాల, మాదిగోల్ల, సుద్దరోల్ల భూములేగావాల్నా సార్‌. పెద్ద భూస్వాములజోలికెల్లరు. అష్టకష్టాలుపడి పెండ్లాల మీద పుస్తెలు అమ్మి ఈ పొలాల్ని బాగుచేసుకున్నాం. మా బతుకులు మేం బతుకుతున్నాం. మా భూములివ్వమంటే ఇవ్వంగాక ఇవ్వం.'' రైతు నాయకుడు యలమంద కరాఖండిగా చెప్పాడు. జారిపోతున్న తన నడికట్టు బిగదీసుకుని కూర్చున్నాడు. వెనుక నుండి చప్పట్లు మోగాయి.
''చూడండీ మీరంతా ఆవేశంలో వున్నారు. అపోహ పడుతున్నారు. ఇప్పుడు కంపెనీ యం.డి. సుబ్బరాజుగారు తమ ఫ్యాక్టరీ గురించి చెబుతాడు వినండి.'' కలెక్టరు మాటలతో జనం సుబ్బరాజు వైపు చూశారు.
సుబ్బరాజు చేయెత్తు మనిషి, పసిడి ఛాయ, రెండు చేతుల వేళ్లకు బంగారు వుంగరాలు, మెడలో గొలుసు, బంగారం ఫ్రేము కళ్లజోడు. ఎటువంటి వారినైనా తన మాటలతో బుట్టలో వేసుకోగల మాయల మరాఠీ. జనం వైపు చూసి రెండు చేతులెత్తి నమస్కరించాడు చిరునవ్వుతో.
''చూడండీ మీరంతా ఏదో ఊహించుకుని భయపడుతున్నారు. మా ఫ్యాక్టరీ మనుషుల ప్రాణాలు కాపాడే మందుల కంపెనీ, ఇది పురుగు మందుల కంపెనీ కాదు. పంటలకు ఏ మాత్రం హాని జరగదు.''
''మేం పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు కేంద్రం మాకు క్లీన్‌చిట్‌ యిచ్చింది. మాకు ఫ్యాక్టరీ కొత్త కాదు. ఇంతకు ముందే మాకు హర్యానా, బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కంపెనీలున్నాయి. ఎక్కడా ఏ విధమైన హానీ జరగలేదు. కావలిస్తే పోయి చూసిరండి.'' తేలికగా అనేశాడు. వీళ్లెెవరూ అక్కడికి పోయి చూడరని ఈయన ధీమా.
''మీ గ్రామం చాలా వెనుకబడి వుంది. నీళ్ళు లేవు. రోడ్లు లేవు. కరెంటు లేదు. వీధిలైట్లు లేవు. ఒక్క నెల రోజుల్లో అన్నీ సమకూరుస్తా. మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా. బడి, గుడి కట్టిస్తా. కొద్ది రోజుల్లోనే మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తా! నా మాటలు నమ్మండి! ''చిరునవ్వులు చిందిస్తూ ముందున్న మంచినీళ్ళ సీసా ఖాళీ చేశాడు.
సర్పంచ్‌ను మాట్లాడమన్నట్లు కలెక్టరు సర్పంచ్‌ వైపు చూశాడు. సుబ్బరాజు పక్కనే కూర్చున్న సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి లేచాడు. ''సుబ్బరాజుగారు చెప్పింది అక్షరాల నిజం. ఇంతకాలం మన వూరు వెనుకబడి వుంది. అందుకే మన మంత్రిగారు మన వూరు బాగు కొరకు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టిస్తున్నాడు. అందుకే మన గ్రామ పంచాయితీ ఫ్యాక్టరీకి అనుమతిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది సార్‌.''
''ఎంతెంత మేశారు?'' వెనుక నుండి అరుపులు కేకలు.
''మాయదారి కంపెనీ మాకొద్దు, సుబ్బరాజు గోబ్యాక్‌, సర్పంచ్‌ డౌన్‌ డౌన్‌ నినాదాలు మిన్నుముట్టాయి.'' అంతా గోలగోలగా వుంది. జనమంతా లేచి నిల్చున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో వినబడడం లేదు. అంతా గందరగోళం.
స్టేజీ మీదున్న అధికారుల్లో అసహనం మొద లైంది. డి.యస్‌.పి. నిరంజన్‌ దాసు పొట్టమీద నుండి జారి పోతున్న బెల్టు సరిచేసుకుని మీసం మీద చేయి వేసి నెత్తిమీద టోపీ అటూఇటూ తిప్పి చేతికర్రతో టేబుల్‌ మీద టకటకలాడించాడు. అతని కండ్లు ఎర్ర బారాయి. కలెక్టరు ముందు జరుగుతున్న గొడవకు కోపం నషాలానికెక్కింది. ''చూడండీ చట్టాన్ని మీచేతుల్లోకి తీసుకుని శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వూరుకునేది లేదు. మీరు చెప్పేది మీరు చెప్పారు. మేము చెప్పేది వినాలిగాని ఈ గొడవేంటి. వయోలెన్సు ఏ విధంగా కంట్రోల్‌ చెయ్యాలో మాకు బాగా తెల్సు. నెల రోజులుగా ఓపిక పట్టాం. మీరు కమ్యునిస్టుల్లా, విప్లవకారుల్లా మాట్లాడకండి. వూరుకునేది లేదు....'' కోపంతో వూగిపోతూ కూర్చున్నాడు డి.యస్‌.పి. నిరంజన్‌ దాసు.
జనంలో అక్కడక్కడ ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు, ఎర్ర రుమాళ్లు, ఎర్ర బ్యానర్లు కనిపించాయి. అదీ ఆయనకు మంట. ఇంట్లో భార్య ఎర్ర చీర కట్టుకున్నా సహించేవాడు కాదు. విప్లవకారుల పేరుతో అన్యాయంగా నలుగురు యువకులను కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌ నిరంజన్‌దాసు అయ్యాడు. ఎప్పుడూ ఓ పది మంది సెక్యూరిటీ లేంది బయటకెళ్లలేని భయం భయం బతుకు ఆయనది.
''అయ్యా డి.యస్‌.పి. గారూ నిజం మాట్లాడితే, అన్యాయాన్ని ఎదిరిస్తే మా రైతుల గోస చెప్పుకుంటే, మా గ్రామ ప్రజల బాధ చెప్పుకుంటే, మా ఆడపడుచుల బాధ, మా కడుపు మంట చెప్పుకుంటే మేం కమ్యూనిస్టులమా! విప్లవకారులమా! కానియ్యండి. మేం ప్రజల పక్షాన నిలబడుతాం. మా ఊరిని వల్లకాడుగా మార్చే ఫ్యాక్టరీని పెట్టనివ్వమంటే పెట్టనివ్వం. మా ప్రాణాలు పోయినా సరే వెనకడుగు వేసేది లేదు ఏంజేసుకుంటారో చేసుకోండి'' విద్యార్థి నాయకుడు మధుసూదన్‌ మాట్లాడటంతో సభ వేడెక్కింది. పెద ్దపెట్టున నినాదాలు మొదలయ్యాయి. ''డౌన్‌ డౌన్‌, గోబ్యాక్‌'' నినాదాల మధ్య కాసేపు మంతనాలాడి కలెక్టరు, సుబ్బరాజు, అధికారులంతా గ్రామసభ ముగిసిందని చెప్పి వెళ్ళిపోయారు.
అర్ధరాత్రి గాఢ నిద్రలో గ్రామం. అమావాస్య చీకటి రాత్రి. పోలీస్‌ సైరన్‌ మోతలు, డి.యస్‌.పి. నిరంజన్‌ దాసు పోలీసు బలగంతో గ్రామ దిగ్బంధం చేశాడు. దీక్షా శిబిరం కూల్చివేశాడు. గాఢ నిద్రలో ఉన్న సంజీవరావు, ముత్తమ్మ, యలమంద, మధుసూదన్‌తో పాటు ఉద్యమ నాయకులందరిని అరెస్టు చేసి పోలీసు జీపులెక్కించారు. లారీచార్జీ, బాష్పవాయువు ప్రయోగంతో జనాలను భయభ్రాంతులు చేసి దొరికిన యువకులనల్లా పట్టుకెళ్లారు. గ్రామంలో పోలీసు పికెట్‌. రోజూ పోలీసుల కవాతు. చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల్లో పోలీసుల మోహరింపు. దొరికిన వారిని దొరికినట్లు పోలీస్‌ స్టేషన్లకు తరలింపు. ఆడవారిని కూడా వదిలిపెట్టలేదు. మొత్తానికి భయానక వాతావరణం ఏర్పడింది.
అనుకున్న ప్రకారం ఓ వారం రోజుల్లో అనుకున్న చోట భారీ పోలీసు బందోబస్తు మధ్య రాజా ఫార్మసీ మందుల ఫ్యాక్టరీ శంకుస్థాపన ఘనంగా జరిగింది. క్యాబినెట్‌ మంత్రి గుర్నాథరెడ్డి, సుబ్బరాజు జిల్లా అధికారులు మందీ మార్బలంతో కార్యక్రమం సజావుగా సాగింది. ఉద్యమకారులంతా పోలీసు స్టేషన్‌లోనే ఉన్నారు.
ఇక ఆ రోజు నుండి నిర్మాణ కార్యక్రమాలు ఊపందు కున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు గుడి, బడి, హాస్పిటల్‌ పనులు చకచక జరిగిపో తున్నాయి. మెయిన్‌రోడ్డు నుండి గ్రామానికి రెండు కిలోమీటర్ల డబుల్‌లైన
తారు రోడ్డు. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు, వీధివీధికి కరెంటు స్తంభాలు వేసి లైట్లు బిగించారు. కూడళ్లలో హైమాస్టు లైట్లు ఏర్పాటు. ఇంటింటికి నల్లా ఇరువై నాలుగ్గంటలు నీళ్ళు వచ్చే ఏర్పాట్లు జరిగాయి.
ఇంతకాలం నిరసనలతో, ఆందోళనలతో అట్టుడికిన గ్రామం క్రమంగా చల్లబడింది. యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. ఇంజనీరింగ్‌లో సీట్లు రాని కొంతమంది విద్యార్థులకు సుబ్బరాజు తన కాలేజీలో సీట్లు ఇప్పించాడు. కేసుల భయంతో చాలా మంది గప్‌చుప్‌ అయిపోయారు. తాయిలాలతో ఒక్కొక్కరిని తనవైపు తిప్పుకున్నాడు రాజు. మేనేజర్‌ సురేంద్ర సర్పంచ్‌ ఇంట్లో మకాం వేసి అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నాడు.
ఆరునెలల్లో రాజా ఫార్మసీ ఫ్యాక్టరీతో పాటు రామాలయం, హాస్పిటల్‌, పాఠశాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులంతా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామాలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించాడు రాజు. ఓ పదిమంది వేద పండితులు వారం రోజులపాటు పూజలు, యజ్ఞాలు నిర్వహించారు. ఊరి పెద్దలం దరిని పిలిచి అందులో పాల్గొనేలా చేశాడు రాజు.
ఇంటింటికి పులిహోర పొట్లాలు, లడ్డూ, ప్రసాదం పంపిణీ, ఆఖరి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆడవారికి పసుపు, కుంకుమ, చీరలు, గాజులు మగవారికి ధోవతులు, ముసలివారికి పెన్షన్లు పంపిణీ చేశాడు. స్కూలు పిల్లలకు యూనిఫారాలు, బ్యాగులు క్రికెట్‌ కిట్‌లు పంచాడు.
కార్పొరేటు తలదన్నే పాఠశాల, హాస్టల్‌ వసతి కల్పించి గ్రామంలోని విద్యార్థులందరిని చేర్పించాడు. వారం వారం హాస్పిటల్‌కు హైదరాబాదు నుండి స్పెషలిస్టులను పిలిపించి ఉచితంగా మందులిచ్చే ఏర్పాటు, మరీ పెద్ద జబ్బయితే హైదరాబాదులోని తన హాస్పిటల్‌కు తరలించి వైద్యం చేయించే ఏర్పాట్లు చేశాడు. అందరి మీద కేసులు ఎత్తివేయించాడు.
ఇంకో విషయం


తాగినవారికి తాగినంత 'మందు' ఏర్పాట్లు చేశాడు. అన్ని తాయిలాలతో ఒక్కొక్కరుగా అందరిని తనవైపు తిప్పుకున్నాడు సుబ్బరాజు. సిరిపురం గ్రామాన్ని రంగుల ప్రపంచంలో ముంచేశాడు. ఆ వూరి మీద ఓ మాయ పొర కమ్మేలా చేశాడు.
మందుల ఫ్యాక్టరీలో మందుల తయారీ కార్యక్రమం మొదలైంది. నైపుణ్యం పేరుతో పెద్ద ఉద్యోగస్తులందరినీ తన వారితో నింపేశాడు. చిన్నాచితక అటెండర్‌, స్వీపర్‌, చౌకీదారు లాంటి పోస్టులు గ్రామస్తులకిచ్చాడు. ఆడవారిని అతి తక్కువ కూలీతో ప్యాకింగ్‌ పనుల్లో పెట్టుకున్నాడు.
ముందు ఓ పది రకాల మందుల తయారీతో మొదలుపెట్టి రెండు మూడెండ్లలో వందల కొలదీ మందులు తయారీ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసి దేశంలో నెం.1 స్థానానికి ఎగబాకింది రాజా ఫార్మసీ. రాత్రి, పగలు రెండు షిప్టుల పని చేయటం మొదలుపెట్టింది.
రెండు సంవత్సరాలు గడిచేసరికి బావులలోని, బోర్లలోని నీళ్ళన్నీ క్రమంగా ఎర్రగా చందనంలా మారాయి. ఎటూ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఇదే పరిస్థితి. తాగడానికి ఏ మాత్రం పనికిరాకుండా పోయాయి. మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల పంట పండింది. రాజు ఏర్పాటు చేసిన బోరు నీళ్ళు కూడా పనికి రాకుండా పోయాయి. జనం అయోమయం, ఆందోళనలో పడిపోయారు.
తెల్లటినీళ్ళతో గలగలాపారే అమృతం వాగునీళ్ళు నల్లగామారి కంపు వాసనకొడుతున్నాయి. ఏడాది పొడుగునా పశువులు, మనుషులు ఆ నీళ్ళు తాగి సేద తీరడం జరిగేది. వాగెంట వేసిన బోర్లన్నీ కలుషితమైపోయాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలు మొదట్లో దూరంగా డంప్‌ చేసేవారు. క్రమంగా రాత్రిపూట గుట్ట పక్కనే వున్న వాగులో డంప్‌ చేయటం మొదలుపెట్టారు.
ఏడాదికి మూడు పంటలు పండే భూములన్నీ చవుడు బారిపోయాయి. పంట పొలాలు ఎర్రగా మారి పెట్టుబడులు రాక రైతులు అప్పులపాలయ్యారు. అదీగాక పెద్దచెరువులోని అర టియంసి నీళ్లని సుబ్బరాజు తన ఫ్యాక్టరీకి మల్లించుకున్నాడు. వెరసి రైతులు ఓ పంట నష్టపోయారు.
గాలి, నీరు కలుషితమైపోయి గ్రామంలో జనం చిత్ర విచిత్ర రోగాల బారిన పడ్డారు. చాలామంది టి.బి., క్యాన్సర్‌, పచ్చకామెర్లు, దద్దుర్లలాంటి రోగాల తో హాస్పిటల్‌ల చుట్టూ తిరగటం మొదలు పెట్టారు.
రెండేళ్లయ్యేసరికి ఏవో కారణాలతో హాస్పిటల్‌, పాఠశాల ఎత్తివేశాడు. ముసలివాళ్ళ పెన్షన్లు ఎగనామం పెట్టాడు.
కోటి రూపాయల కాంట్రాక్టుకు ఆశపడి సర్పంచ్‌ నాగిరెడ్డి ఫ్యాక్టరీ ప్రక్కన ప్రభుత్వ భూమిలో
కట్టిన కస్తూర్బా పాఠశాల ముణ్ణాల్ల ముచ్చటైంది. పిల్లలందరికి శరీరమంతా దద్దుర్లు, బొబ్బర్లు, పుండ్లు, దగ్గులు, తుమ్ములతో పాఠశాల అక్కడి నుండి షిప్టు చేయటం జరిగింది. ఫ్యాక్టరీ దగ్గరగా వున్న రైతులంతా అయినకాడికి సుబ్బరాజుకు తమ భూములమ్ముకుని వూరు విడిచిపోయారు.
ఎప్పుడూ పచ్చని చెట్లతో, పచ్చని గడ్డితో పశువులకు, మేకలకు, నెమళ్ళకు, కుందేళ్ళకు, రకరకాల పక్షులకు ఆలవాలమైన మల్లన్న గుట్టలు మసిబారిపోయాయి. చెట్లన్నీ ఆకు రాల్చాయి. ఇప్పుడక్కడ నెమళ్ళు కాదు ఏ పిట్టలు లేవు. రాజు వేయించిన రోడ్లు, లైట్లు ఆయన ఫ్యాక్టరీ కొరకే అని ఆలస్యంగా అర్థమైంది.
రాజా ఫార్మసీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అట్టహాసంగా ఉత్సవాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఫార్మా ఉత్పత్తులు దేశ విదేశాల్లో ఎగుమతి చేసి కోట్ల టర్నోవరు సంపాదించారు. పది కోట్లతో ప్రారంభించిన కంపెనీ ఐదేండ్లలో వేల కోట్ల టర్నోవరుకు ఎదిగింది. వందల ఎకరాల భూములు సంపాదించినది. ఎక్కువ మందులు ఉత్పత్తి చేసినందుకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఫార్మసీ అవార్డు అందుకుంది.
నష్టపోయిందల్లా సుబ్బరాజు మాయ మాటలతో నమ్మి మోసపోయిన సిరిపురం అమాయక జనం. గాలి, నీరు కలుషితమై రోగాలపాలు కావటం, అమ్మలాంటి అమృతం వాగు విషతుల్యం గావటం, మల్లన్న గుట్ట మసిబారిపోవటం, భూములు కోల్పోయి రైతులు అనాథలు కావటం, కోటి రూపాయల కస్తుర్బా స్కూలు పనికిరాకుండా పోవటం, వెరసి సిరులొలికే సిరిపురం బికారిగా మిగిలిపోయింది.
సంజీవరావు మాస్టారుకు టి.బి., ముత్తమ్మకు పచ్చకామెర్ల వ్యాధి వచ్చిందనే వార్త వూరంతా దావానంలా వ్యాపించింది. అలజడి మొదలైంది. అందరిలో ఆందోళన మొదలైంది. నివురుగప్పిన నిప్పులా వున్న ఆవేశం లావాలా బయటకొచ్చింది. వూరిని కమ్మిన మాయపొర తొలగిపోయింది. ఓ అరుణోదయవేళ ''ఫ్యాక్టరీ బంద్‌ కరో - గాంవ్‌ కో బచావో'' నినాదం ఊపందుకుంది. మరో ఉద్యమం పురుడు పోసుకుంది. 

Posted On Mon 01 Jun 13:46:49.729199 2015
                 మూసీ నది ఒడ్డునున్న దట్టమైన తాటి వనంలో తొమ్మిది మంది సభ్యులున్న గెరిల్లా దళం విశ్రాంతి తీసుకుంటోంది. దళ కమాండర్‌ హరినారాయణ బ్రాహ్మడు. నిజాం మీద జరుగుతున్న పోరాటానికి ఆకర్షితుడై మిల్ట్రీ నుంచి వచ్చి, దళ సభ్యులకు గెరిల్లా శిక్షణ ఇస్తున్నాడు. చాకలోళ్ల సాయన్న, తురకోళ్ల హుసేను, ఒడ్డెరోళ్ల పిచ్చయ్య, కంసలోళ్ల రామబ్రహ్మం, కోంటోళ్ల శేషయ్య, అనిరెడ్డి చంద్రారెడ్డి, మాలోళ్ల మోష, వివిధ కులాల వాళ్లు, మతాల వాళ్లు ఉన్నారు.
వారినందరినీ ఒకటి చేసి దండు కట్టించింది కమ్యూనిస్టు పార్టీ డిప్యూటి దళ కమాండర్‌ తెలగోళ్ల వెంకటాద్రి సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు.
వెన్నెల సన్నగా కాస్తోంది. బలుసు పొదలు, మంగ పొదలు, జిట్ట రేగు పొదల నుండి వచ్చే సన్నటి పరిమళం ఆ ప్రాంతాన్నంతా సుగంధభరితం చేస్తోంది. కానీ ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేడు వెంకటాద్రి. రజాకార్ల అకృత్యాలకు అతని గుండె భగభగ మండిపోతోంది. ఒకటా, రెండా? ఎన్నని ....? ఐనా, ప్రజల అండతో రజాకార్లను ముప్పు తిప్పలు పెట్టి, పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఉరుములేని పిడుగులా కొత్తగా వచ్చి పడ్డది ఆశ్విక దళం. గుర్రాలు ఎనుబోతంత ఉన్నాయి. గుల్బర్గా నుంచి వచ్చాయట. హైద్రాబాదులో వీటికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద శాలలే ఉన్నాయట. నైజాం నవాబు కమ్యూనిస్టుల్ని అణిచి వేయడానికి ప్రత్యేకంగా పంపాడు. కమ్యూనిస్టు కనబడితే వదిలి పెట్టడం లేదు. ఎంత జనంలో ఉన్నా ఇట్టే గుర్తు పట్టి వెంటబడుతున్నాయి. ఇప్పటికే ఆశ్విక దాడిలో పసు నూరు వెంక టరెడ్డి
చనిపోయారు. కాలేజీ చదు వుల్ని వదిలేసి పోరాటంలోకి వచ్చినవాడు. వెన్నెలంత చల్లనోడు. గ్రామంలో ఉండగా సిఐడిల సమాచారంతో హఠాత్తుగా దాడిచేసి చంపింది. హరినారాయణ దళం గ్రామంలోకి పగలే వెళ్లింది. ప్రజలంతా ఆత్మ బంధువును చూసి మూగినట్టు చుట్టూ చేరారు.
''మీరు లెవీ కట్టకండి. ఈ నిజామోడి తాబేదార్లయిన జమీందార్లని, పట్వారీలని ఊళ్ళె నుంచి వెళ్లగొట్టాలె. మన గ్రామంలో మన పరిపాలనే ఉండాలె. దున్నే వాడికే భూమి దక్కాలె. అందరికీ భూమి కోసమే ఈ పోరాటం. భూముంటే బువ్వుంటుంది. బట్టుంటది. మనం మంచిగ బతుకుతాం... ముఖ్యంగా శత్రువుకు మన సమాచారం ఇచ్చే వాళ్లని కనిపెట్టి ఉండండి.'' దళ కమాండర్‌ ప్రజలకు వివరిస్తున్నాడు.
ఇంతలో ఉరుము లేని పిడుగులా వచ్చి పడ్డాయి.. పన్నెండు గుర్రాలు. ఊళ్లో నుంచి మోత్కూరుకు పోవడానికి తూర్పు వైపు నుంచే వెళుతుంటారు సామాన్యంగా. అటు నుంచే పోలీసు రావచ్చని సెంట్రీని పెట్టారు. దాన్ని అంచనా వేసి, గ్రామాల మీదుగా దాటి, పడమర వైపు నుంచి వచ్చారు. వంద గజాల దూరంలో గుర్రాలు కనబడే సరికి ''గ్రామాల మీదుగా దాడి, పారిపోండి.'' మొదట చూసిన వ్యక్తి గట్టిగా అరిచాడు. గద్ద కనబడితే కోడి పిల్లలు కకావికలం అయినట్లు జనమంతా తలో దిక్కు పరిగెత్తారు. ఆ సమయంలో పొజిషన్‌ తీసుకోవడం కూడా సరైనది కాదని దళం కూడా పరిగెత్తింది. రజాకార్లు జనాన్ని బెత్తంతో బాదుతూ, తుపాకి మడమతో గుద్దుతూ వెంటబడ్డారు. బలం కొద్దీ జనంలో పడి పరిగెత్తుతున్నారు. సంకనున్న తుపాకిని చూసి, చోటేమియా గాని గుర్రం వెంకటాద్రి వెంటబడ్డది. దాని గురించి జనం కతలు కతలుగా చెప్పుకోసాగారు. అది మేలు జాతిదని, చోటేమియా రిజ్వీనడిగి ప్రత్యేకంగా తెచ్చుకున్నాడని, అది వెంటబడితే యమినోడు వెంటబడ్డట్లేనని, అది కాళ్లతోటే మనిషిని తొక్కి చంపుద్దని.. జనంలో ప్రచారం జరిగింది. అది రజాకార్లకు అవసరం కూడ. ఆశ్విక దళం గురించి నాయకులు చెప్పింది గెరిల్లాకు జ్ఞాపకముంది. గుర్రాలంటే భయపడొద్దు. అట్లాగని తక్కువ అంచనా వేయొద్దు. వాడి దగ్గర తుపాకి ఉంటది. దూరం నుంచి కాలు స్తాడు. గుర్రం పరిగెత్తు తుంటది కాబట్టి, గురికుదర కపోవచ్చు. కానీ దగ్గరలో వుంటే తల్వార్‌ విసురుతాడు. అది మరీ ప్రమాదం కత్తికి అందనంత దూర ంలో పరిగెత్తాలి. బారుగా ఎక్కువ దూరం పరిగెత్తొద్దు. ఎందుకంటె గుర్రంతో సమానంగా మనిషి పరుగెత్తాలి. వంకర టింకరగా ఉరకాలె.. అక్షరాలా సూచనలు పాటిస్తూ ఉరుకుతున్నాడు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడ్డది. వేగంగా మోదుగు పొదలు దాటి పరిగెత్తుతున్నాడు. గుర్రం ఊపిరి వెంకటాద్రి మెడ మీద వెచ్చగా తగులుతోంది. గభాల్ని కిందకు వంగి, పక్కకు పరిగెత్తాడు. అదే వడి మీద గుర్రం ఇరవై గజాలు ముందుకు పరిగెత్తింది. గుర్రాన్ని మలుపుకుని వచ్చే సరికి, తుపాకిని గుబురుగా ఉన్న మోదుగు పొదలో వదిలేశాడు. చాటు నుంచి బావిలోకి దిగి, మోట దార్ల కింద పెరిగిన రాగి చెట్టు చాటున నక్కాడు. రజాకారు పొదల్ని తుపాకితో కెలుకుతూ దిగి, డేగ కళ్లతో చూడసాగాడు. కానీ గెరిల్లా కనబడలేదు. బావికి అడ్డంగా వెళ్లడానికి వీల్లేకుండా ముళ్లకంపలున్నాయి. ఇక కనిపించడని ఆశ వదులుకుని గుర్రాన్ని వెనక్కు మలిచాడు.
వెంకటాద్రి మెల్లగా వెలుపలకు వచ్చి, గుబురుగా వున్న మర్రి చెట్టెక్కి, దాని తొర్రలో కూర్చుని చూడసాగాడు. రజాకార్లు జనాన్ని పశువుల్ని మందగా జేసినట్లు, బెత్తంతో బాదుతూ ఒక్క చోటికి గుంపు చేస్తున్నారు. జనంలో బడి పరిగెత్తి , కనబడకుండా ఉండేందుకు జొన్న చొప్ప వామి కింద దూరాడు.. పాపిరెడ్డి. ఆ దృశ్యం గుర్రం కంట్లో పడ్డది. అది నేరుగా వామి దగ్గరకు పరిగెత్తి గట్టిగా సకిలించింది. గుర్రం భాష తెలిసిన చోటేమియా, తుపాకి చేతిలోకి తీసుకుని కిందకు దూకాడు. చొప్పకు చెదలు ఎక్కకుండా మూరెడు ఎత్తున రాళ్లతో నెట్టు కట్టి ఉంది. దళంలో పనిచేసే పాపిరెడ్డి, తల్లిని చూసి పోదామని వచ్చా డు. సిఐడి సమాచారంతో వచ్చిపడ్డారు రజాకార్లు. తుపాకి తీసి ఊపుతూ ''బాహర్‌ ఆవో సాలే. నైతో గోలీ మార్‌ దూంగా.'' బెదిరించాడు తుపాకితో. తప్పదని పాపిరెడ్డి పాక్కుంటూ మెల్లగా వెలుపలకు వచ్చాడు. కమ్యూనిస్టులకు అన్నం పెడుతున్నారని, ఊళ్లోకి వస్తే కలిసి తిరుగుతున్నారని ఐదుగురిని వేరు చేశారు. వాళ్ల కాళ్లు, చేతులు తాళ్లతో గట్టిగా కట్టేశారు. పాపిరెడ్డి కమ్యూనిస్టు గెరిల్లా అని తెలవగానే, తుపాకి మడమతో వీపున ఒక్క గుద్దు గుద్దాడు చోటేమియా. కింద పడ్డవాడ్ని, బూటు కాలుతో తొక్కిపట్టి, రెక్కలు వెనక్కు విరిచి కట్డాడు. కాళ్లు కదలకుండా కట్టాడు. మరో పోలీసు రాగానే ఇద్దరు చెరో వైపు పట్టి అమాంతం చొప్ప వామి మీదకు విసిరేశారు. అప్పటికే బందీలుగా వున్న ఐదుగుర్ని కూడా దాని మీదకు విసిరేశారు. తల్లీ పిల్లలు, జనం గుండెలు బాదుకుంటున్నా, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. చొప్ప వామికి నిప్పంటించి, చచ్చారనుకున్న తర్వాత కొంత మంది యువకుల్ని కొట్టుకుంటూ స్టేషన్‌ వైపు నడిపించారు. సహచరులు సజీవ దహనం అవుతుంటే ఏమీ చేయలేక చెట్టు మీదే పొగిలి పొగిలి ఏడ్చాడు వెంకటాద్రి. తనీ రోజు గుర్రానికి దొరికి వుంటే.....? ఆ పైన ఆలోచించలేకపోయాడు. ఎలాగైనా ఆ గుర్రం అంతు చూడాలి. సిఐడిల సంగతి తేల్చాలి. మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఆ అవకాశం దళ కమాండర్‌ ప్రయాణ రూపంలో రానే వచ్చింది. ''బిడ్డకు సంబంధం వచ్చిందంట. వెళ్లి వెంటనే వస్తా. దళం బాధ్యత నీదే...'' అని రివాల్వర్‌ చేతిలో పెట్టి, ఆయుధం జాగ్రత్త అని ఆ రాత్రే ఇంటికి బయలు దేరాడు.
దళం బాధ్యతలు తీసుకోగానే, తర్వాతి సీనియర్‌ అయిన శేషయ్యకు బాధ్యతలు అప్పజెప్పి బయలు దేరాడు. చావిట్లో నిలబడే నిద్రపోతున్నాయి గుర్రాలు. పగలల్లా జనాన్ని హింసించిన
పోలీసులు, గొల్లోళ్ల దగ్గర ఎత్తుకొచ్చిన రెండు యాటల్ని కోసుకు తిని, గౌండ్లోళ్ల దగ్గర కల్లుబిర్రుగ దాగి గురకలు బెట్టి నిద్రపోతున్నారు. పదహారు గుర్రాలు వరుసగా కట్టేసి వున్నాయి. పోలీసుల్లాగే బలిసి దృఢంగా వున్నాయి. చివరన వుంది...
చోటేమియా ముద్దుగా పిలుచుకునే కాలాషేర్‌. దాని తోక చీకట్లో తెల్లగా మెరుస్తోంది. వెళితే కొత్త మనిషిని చూసి అలికిడి చేస్తాయి. ఒక్క క్షణం ఆలోచించి, పక్కనే ఉన్న గుడిసెలో నిద్రపోతున్న నపరోడి దగ్గరకు వెళ్లాడు. గుర్రాల్ని కడగడం, మాలిషు చేయడం, వాటికి దాణా పెట్టడం వాడి పని. మెల్లగా లేపాడు. కళ్లు తెరిచి చూసిన తిరపయ్యకు మృత్యువు ముందల నిలబడ్డట్ల నిపించింది. గడగడా వణుకుతూ ''పోలీసులు ఠాణాల ఉన్నారు. నన్ను సంపకండి, నేను మీ జోలికి రాలే.'' అని చేతులు జోడించాడు.
''నిన్ను చంపను కానీ, నాకు చోటేమియా గాడెక్కే ఆ తెల్లతోక నల్ల గుర్రాన్ని తెచ్చిపెట్టు'' అన్నాడు.
''తెలిస్తే నన్ను సంపుతరయ్యా...'' అన్నాడు భయపడుతూనే.
''అందరం సచ్చెటోల్లమే. మంది కోసమే మేము హత్యార్‌ బట్టింది. మేము జనం కోసం జస్తుంటే, మీరు రజాకార్లకు రజాయి కప్పుతారా? తేకుంటే నా చేతిలో ఆయుధముంది చూసినవు గద?'' అన్నాడు బెదిరింపుగా.
''పట్టకొస్తనయ్యా. తెంపుకు పోయిందని చెప్తాలే. జీతం లేదు, నాతం లేదు.
కొడుకులు సంపక తింటున్నారు. కాళ్లు పట్టాలె. ఒళ్లునొక్కాలె. తిన్నయన్ని సాపు జెయ్యాలె. సస్తున్న సాకిరి జెయ్యలేక. ఒక్కోడి కాడ కంపు వాసన.'' అని గొణుక్కుంటూ లేచాడు.. యాభయ్యేళ్లున్న తిరుపయ్య. వెంకటాద్రి చావడి వెలుపలకు వచ్చి మసక చీకట్లో దూరంగా నిలబడ్డాడు. గుర్రం తాడు విప్పి, గోడకు తగిలించిన జీను గుర్రం మీద సర్ది, కళ్లాన్ని తెచ్చి చేతికిచ్చాడు.వెనక్కు ముందుకు ఒకసారి చూచి, అమాంతం గుర్రం ఎక్కాడు. తన యజమాని కాకపోవడంతో ముందుకు కదలకుండా మొరాయించింది. నాలుగేళ్ల కింద కిషన్‌ రావు దొరకాడ షేర్‌దారుగా పనిచేసినప్పుడు వాళ్ల గుర్రాల మీద సవారి చేసిన అనుభవముంది. వెంటనే దాని డొక్కలో కాలి మడమతో ఒక్క తన్ను తన్నాడు. దాంతో ముందుకు దూకింది.
గుర్రాన్ని సవారీ చేస్తూ నేరుగా వెల్మజాల షావుకారు మల్లయ్య ఇంటి ముందుకు తీసుకుపోయి నిలిపాడు. జిలుగు జిలుగు వెన్నెల రాలుతోంది. మనిషి పూర్తిగా కనబడకుండా వేపచెట్టు నీడలో వున్నాడు. గుర్రం తల మాత్రం వెలుతురులో కనబడుతుంది. అరుగు మీద నిద్రపోతున్న జీతగాడ్ని లేపాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్లి మల్లయ్యను లేపాడు. పోలీసు వచ్చాడని ఊడే పంచను సర్దుకుంటూ ఈ వేళప్పుడు వచ్చింరేంది బాంచెన్‌... అని అడిగాడు వినయంగా.
''కమ్యూనిష్టు ...కొడుకులు రేత్తిరే గదరా తిరిగేది. వాళ్లను పట్టుకోవాలంటే రేత్తిరే రావాలె. ఊళ్లకు ఇయ్యాల ఎవరన్నా వచ్చిండ్రా?''. ముఖం కనబడకుండా మీద వేసుకున్న గొంగడి చాటు నుంచి ''రాలేదు బాంచన్‌. వస్తే కబురు చేస్త గదా. పాపిరెడ్డి వచ్చింది, దళం వచ్చేది ముందే చెప్పినగా బాంచెన్‌.'' వినయంగా వంగి సమాధానం చెప్పాడు.
''నువ్వు ఒక్కడివి జాస్తవు? మిగతా వాళ్లు సరిగ్గా సిఐడి చేస్తున్నారా?''
''చేస్తున్నారు బాంచెన్‌. పూసల రంగయ్య, తురకోళ్ల మోదిన్‌, వడ్డెర సాయిలు మంచిగ పని జేస్తున్నారు. ఆ కమ్యూనిస్టు కొడుకులు నా వడ్డీ కాగితాలు తగలబెట్టింరు బాంచెన్‌. భీమిరెడ్డి గాడ్ని ముందు సంపాలె. వాడ్ని జూసి జనం తెగ రెచ్చిపోతుంరు బాంచెన్‌''.
''సంపడానికే గదరా మేం తిరిగేది. అట్టనే మందిల ఉండి ఎంక్వైరీలు దీయండి. మీకు రిజ్వీ తోటి పెద్ద ఇనాం ఇప్పిస్తా. కొడుకులు వచ్చేది ఎప్పటికప్పుడు జెప్పాలి. వాళ్లని సావనూకాలె.''
''అట్లాగే బాంచెన్‌...'' సంతోషంతో అని, వినయంగా వంగి అలాగే ఉన్నాడు.
గుర్రాన్ని వెనక్కు తిప్పాడు. మనసులోనే వాళ్ల పేర్లు నమోదు చేసుకుని కాస్త దూరం వెళ్లగానే జేబులో వున్న చిన్న పుస్తకంలో రాసుకున్నాడు. అదే రాత్రి గుర్రం మీద రేపాక, ఎర్రబెల్లి వెళ్లి, అంతకు ముందు ప్రజలు అందించిన సమాచారం ప్రకారం సిఐడిలను కలిశాడు. కమ్యూనిస్టుల్ని తిట్టుకుంటూ, నల్లగుర్రం మీద నుంచే సమాచారం సేకరించాడు. అందరి పేర్లు పుస్తకంలో రాసుకుని తెల్లవారే సరికి దళాన్ని చేరుకున్నాడు.
''అరే ఇది చోటేమియా గాడి గుర్రం గదన్నా. కళ్లెం వదులు దీన్ని చంపేస్తా. చాల మందిర్ని సంపిందన్నా.'' ఇస్తారి గన్నుతీశాడు, పళ్లు నూరుతూ.
''ఇంకొంత పనుంది దీనితోటి. పనైనాక ఇస్తాలే.'' అని జరిగిన సంగతంతా చెప్పి, మూడు ఊళ్లల్ల పోలీసులకు సమాచారం అందించే వాళ్ల పేర్లు చదివాడు.
''అమ్మా ఈ ... కొడుకులు మనం బోంగనే, జై గొట్టుకుంట మనెంబటే తిరుగుతరన్నా. వట్టి ఎల్లాబి... కొడుకులు. వాడి డబ్బుకు ఆశపడి సిఐడి జేస్తున్నారు. కొడుకుల్ని బతకనీయెద్దు.'' బ్రహ్మం ఆవేశంగా అన్నాడు.
''వీళ్లు చోటేమియా గాడ్ని కలిసే లోపే పట్టుకోవాలె. వాడి గుర్రాన్ని గెరిల్లాలు దొబ్బుకుబోయింరని చెబితే భయపడి తప్పించుకుపోతారు.'' అన్నాడు హుసేను.
''అన్న జెప్పింది నిజమే. మనకో మంచి వార్త. ఆ చోటేమియా గాడు నాలుగు రోజులు హైద్రాబాదు పోతున్నడంట రజ్వీని కలవడానికి. రోజుకో ఊరుబొయ్యి కొడుకుల సంగతి చూద్దాం.'' అన్నాడు.
''లేదు, లేదు. ఒకే రోజు మూడు ఊళ్లల్లో సిఐడిలను పట్టుకోవాలె. ఒక ఊళ్లె పట్టుకున్నమని వార్త తెలవంగనే, తప్పించుకపోతారు. కాబట్టి ముగ్గురు చొప్పున ఒక్కో ఊరు వాళ్లను పట్టుకుందాం. నేను వెల్మజాల వెళతాను ఎందుకంటే జనం భయం మీదున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పాలె.'' అన్నాడు.
మిగతా ఇద్దర్ని వెంటబెట్టుకుని వెల్మజాల వెళ్లాడు. చోటేమియా గాడి గుర్రాన్ని జూసిన జనం పారిపోసాగారు. జేబులోంచి ఎర్ర జెండా తీసి గాలిలో ఊపాడు. అది పీడితులకు రక్షణ నిచ్చే గొడుగని, అణచివేయబడే జనానికి వేగు చుక్కని తెలుసు. అందుకే, వాన పడితే ఉసిళ్లు బైటికొచ్చినట్లు, ఊరంతా వాళ్ల దగ్గరికి వచ్చి చేరింది. చోటేమియా గాడ్ని, వాడి గుర్రాన్ని తిట్టసాగారు. ''ఎట్ల దెచ్చినవు ...గాడి గుర్రాన్ని?'' అని గుచ్చి గుచ్చి అడగసాగారు.
''గా ముచ్చట తర్వాత చెబుతగాని, కోంటోళ్ల మల్లయ్యను, పూసల రంగయ్యను, తురకోళ్ల మోదిన్‌ను, వడ్డెర సాయిగాడ్ని గుంజక రాపోండి. కొడుకులు సిఐడి జేస్తుంరు.'' అన్నాడు.. వెంకటాద్రి. ''కొడుకులు అంత పని జేస్తున్నారా? బతకనీయోద్దు. సక్కదనాల పాపిరెడ్డిని, రాంరెడ్డిని పొట్టన బెట్టుకున్నరా.'' అంటూ పరిగెత్తుకు వెళ్లి ఇండ్ల మీద పడ్డారు. తలకు వున్న కండువాను శత్రువు మెళ్లో వేసి, కచ్చేరి వద్దకు లాక్కొచ్చారు. కాస్త చదువుకున్న మల్లయ్య వచ్చినోళ్లని మాటల్తో అదరగొట్టాడు. కానీ చోటేమియా గాడి గుర్రాన్ని దళం దగ్గర చూసే సరికి నక్కిళ్లు పడ్డాయి. తప్పయిందని కాళ్లా, వేళ్లా పడ్డాడు. అప్పుడు దళ కమాండర్‌ రాత్రి జరిగిన సంగతంతా జనానికి వివరించాడు.
''ఈ దుర్మార్గుల్ని అస్సలు వదలొద్దన్నా. వీళ్లను క్షమిస్తే పామును వదిలి పెట్టినట్లే. మళ్లీ సిఐడి జేసి జనాన్ని సంపిస్తరు.'' జనం కేకలు వేయసాగారు.
''సోచాయించకండి బిడ్డలారా. నా కొడుకు చూసిపోదామని వస్తే, ఆ రజాకారు నా బట్టకు జెప్పి, సంపించిండ్రు. నా కొడుకు నిలువున మంటల్లో కాలిపోయిండు.'' గుండెలు బాదుకుంటూ ఏడ్వసాగింది తల్లి. తర్వాత తేరుకుని మీకు పాపమనిపిస్తే, ఆ అత్యారిటియ్యండ్రి. నిలువున గాలుస్త. ఆటెంక అమీనోడొచ్చి సంపినా సస్త.'' డెబ్బయ్యేళ్ల ఆదెమ్మ శిగం వచ్చిన దానిలా ఊగిపోతోంది.
గెరిల్లా తుపాకి ఎక్కు పెట్డాడు. సిఐడిలు జనం నుంచి దూరమైపోయారు.
ఎర్రబెల్లి రాపాకల్లో గూడా ప్రజలు, సిఐడిలు చేసే వాళ్ల పేరు చెప్పగానే పట్టి లాక్కొచ్చారు. కమ్యూనిస్టులొచ్చారని తెలిసి, గడ్డివాముల్లో, గాదెల్లో, మసెల మీద దాక్కున్న ద్రోహుల్ని గాలించి మరీ గుంజుకొచ్చి బజాట్లో కూలేశారు. జరిగనదంతా జనానికి వివరించి నిర్ణయం ప్రజలకు వదిలేశారు.
జనం చంపాల్సిందేనని తీర్పిచ్చారు. తీర్పును అమలు చేశారు.. గెరిల్లాలు.
ఒకే రోజు మూడు గ్రామాల్లో కమ్యూనిస్టు ద్రోహుల్ని ఏరేసి స్థావరానికి చేరుకున్నారు. దళ కమాండర్‌ ముందు కూర్చుని వున్నారు.. దళ సభ్యులు.
''గెరిల్లాకు తుపాకి ఎలాగో, గుర్రం కూడా అట్లాంటిదే. అది ఎవడి చేతిలో ఉంటే వాడికి ఉపయోగపడుద్ది. అదే ఒక్కోసారి మన ఉనికిని శత్రువుకు కూడా తెలియజేస్తుంది. శత్రువుకు తెలిసిన విద్యలన్నీ మనకు తెలిసుండాలి కూడా.'' అని బోధించాడు. దళ సభ్యులు వారం పాటు ఆ గుర్రం మీద మూసీ ఇసుకలో స్వారీ నేర్చుకున్నారు. ''మనం స్థావరం మార్చాలి. పోలీసులు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ప్రస్తుతం మనకీ గుర్రం ప్రతిబంధకం. చూస్తే శత్రువు వెంటనే గుర్తుపడతాడు. శత్రువుకు దొరికితే మరింత ప్రమాదం. దీన్ని పట్టుకొచ్చిన అవసరం కూడ తీరింది.'' అని గుర్రాన్ని ఇస్తారికి అప్పజెప్పాడు. కమ్యూనిస్టుల్ని పట్టిచ్చిన పోలీసు గుర్రం మూసీ ఇసుకలో మట్టైపోయింది.

ఉసురు

Posted On Sat 13 Jun 01:38:10.907807 2015
                       ''ముసురు పట్టిన వానలా ముసల్ది ఏడ్చింది ఏడ్చినట్లే ఉంది. దూరంగా కానుగ చెట్టు క్రింద కూర్చుని సీతమ్మోరిలా కంటికి, మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. కారే కంటికి, చీదే ముక్కుకి తెరిపి లేకుండా పోయింది.
రెండ్రోజులుగా ముసల్దానిదిదే తంతు. నేనెంత సముదాయించినా విన్లేదు. ముసల్దాన్ని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు.
క్లాసులోంచి ఏడుస్తున్న ముసల్దాన్ని చూస్తున్నాను. ఏవో ఆలోచన్లు ముసురుకున్నాయి.
పదేళ్ళ నాటి మాట.నేను బడికి వచ్చినప్పటి నుండి ముసల్ది బళ్ళో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడుతుంది. అంతకు ముందు ఎవరెవరో ఉన్నారు గాని ఒక్కళ్ళూ నిలకడగా ఉండి వండింది లేదు.
కూరకెంత? నారకెంత? ఉప్పుకెంత? పప్పు కెంత? గవర్మెంటోళ్ళు పిల్లోనికి ఇస్తున్న దెంత? ఖర్చు లన్ని పోనూ మిగుల్తు న్నదెంత? అంటూ లెక్కలేసుకుని కూలిపాటు కూడా దక్కకపోవడంతో మేం చేయమంటే... మేం చేయం అని ఒక్కొక్కరే మానుకున్నారు.
పిల్లలకు మధ్యాహ్నం పస్తులు తప్పలేదు.కొత్త ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నాపై అధికారుల ఒత్తిడి. ఊర్లో ఎవర్నడిగినా కూలి కెళ్తే మూడొందలి దస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం. అది మాకు గిట్టదు లెండి మాష్టారూ... అంటూ ఎవరూ రానన్నారు.
నాకేం చేయాలో పాలుపోలేదు.సరిగ్గా ఆ పరిస్థితుల్లో ముసల్ది నేనొండిపెడతానంటూ ముందుకొచ్చింది.
''పిల్లలు పస్తులుంటే కడుపు తరుక్కుపోతుంది.
పసిపిల్లలు దేవున్తో సమానం అంటారుగా. దేవుడికి నైవేద్యం పెడ్తా నాకేమొస్తుందని లెక్కలేసుకుంటామా? పసిపిల్లలకు అన్నం వండి పెట్టడం కన్నా మంచి పని ఏముంటుంది? వాళ్ళ ఆకలి తీర్చడం కన్నా పుణ్యం ఏముంటుంది? కడుపుకు పెట్టే దానికాడ లాభనష్టాల లెక్కలేస్కుంటే ఎలా? నేనొండిపెడతానయ్యవారు.''
ముసల్దాని మాటలకు నా సంతోషానికి మేర లేకుండా పోయింది. ఆ క్షణం ముసల్ది నా కంటికి నన్ను, పిల్లల్ని ఆదుకోవడానికొచ్చిన అమ్మవారిలా కన్పించింది. అదుగో అప్పటి నుండి ముసల్దే పిల్లలకు అన్నం వండి పెడుతుంది.
ముసల్ది అని ఊరంతా పిలిచే ముసల్దాని పేరేంటో ఎవరికీ తెలీదు. కాని అందరు ముసల్ది అనే పిలుస్తారు. అసలు ముసల్దానిదీ వూరు కాదు. ఎక్కడో కనిగిరి దగ్గర కొండరాయుడి పల్లె. పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు పుట్టలేదని పెనిమిటి ఇంకో మనువాడితే కోపంతో వాణ్ణి, ఇంటిని వదిలి ముప్పై ఏళ్ళ క్రితం ఈ ఊరొచ్చింది. బడి ప్రక్కనే చిన్న గుడిసె వేసుకొని చిన్నా చితక పన్చేసుకుంటూ బతుకు వెళ్ళదీస్తుంది.
వంట చేయడంలో ముసల్ది నలభీముడికి అమ్మమ్మే! తన హస్తవాసి అలాంటిది. వంట చేసిపెట్టడం ఓ పనిలా ఏనాడు భావించలేదు ముసల్ది. పరమభక్తురాలు భగవంతుడికి భక్తితో నైవేద్యం పెట్టినట్లు పిల్లల పట్ల ప్రేమతో ఇష్టంగా వండి పెట్టేది. లాభ నష్టాల లెక్కల్తో పన్లేకుండా ఎక్కడా రాజీ పడకుండా వండేది. ఇంటి భోజనాన్ని మరిపించేది.
సాంబారు పెడితే ఆ ఘుమఘుమలు బడి మొత్తం ఘుమాయించేవి. పిల్లల బొజ్జల్లో జఠరాగ్ని ఉవ్వెత్తున ఎగసేది. ఆ చేత పులిహోర కలిపితే అది రాములోరి గుళ్ళో ప్రసాదంలానే ఉండేది. అంత రుచిగా వండేది.
మధ్యాహ్నం అయ్యిందంటే చాలు పిల్లలు ఆవురావురుమనేవాళ్ళు. కొసరి కొసరి వడ్డించేది. అప్పుడు చూడాలి. ముసల్దాన్ని నెత్తిన ముగ్గు బుట్ట లాంటి జుట్టు, నుదుట రూపాయి కాసంత బొట్టు, రెండు చేతులా నిండుగా గాజుల్తో సాక్షాత్తూ కాశీలోని అన్నపూర్ణ తల్లిలానే కన్పించేది ముసల్ది.
''తినండ్రా... తినండి... ఒక్క మెతుకు మిగలకుండా ముందు తిన్నోళ్ళు రాజన్నమాట.''తన కడుపున పుట్టిన బిడ్డల్ని బతిమాల్తున్నట్లు బతిమాల్తు పిల్లల చేత తినిపించేది. ఆ చేతి మహత్యమేమోగాని పళ్ళెంలో ఒక్క మెతుకు మిగల్చకుండా తినేవాళ్ళు పిల్లలు. ఆ క్షణం ముసల్ది రాముని ఆకలి తీరుస్తున్న శబరిలానే కన్పించేది. పిల్లలు తింటే ముసల్దాని కడుపు నిండిపోయేది.
ఇంత చేసినా నెల చివర ఖర్చులు, రాబడి చూస్తే ముసల్దానికి మిగిలేది అంతంత మాత్రమే. పాపం కూలీపాటు కూడా మిగల్లేదుగా అంటే 'పోన్లేయ్యా!.... ఒంటి ముండని మిగిల్నా నేనేం చేసుకుంటాను' అనేది.
ఒక్కోసారి ఆ కొద్దిపాటి కూడా మిగలక నష్టం వస్తే 'పసి బిడ్డలకేగా పెట్టింది.. మిగలకపోతే మాన్లే.. పోతూ కట్టుకు పోయేదేముంది' అనేది.పనైపోయినా బడొదిలి ఇంటికెళ్ళేది కాదు ముసల్ది. బళ్ళోనే తిరుగుతూ పిల్లల్తో గడిపేది. తనకు పిల్లలు లేకపోవడం వలన ఏమో గాని ముసల్దానికి పిల్లలంటే అంత ఆపేక్ష. పిల్లలు కూడా ముసల్దంటే అంతే ప్రేమ కనబర్చేవారు.
రోజులుసాఫీగా గడిచిపోతున్నాయి. నాలుగు నెళ్ళ క్రితం రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నారేమో అధికారంలోకి రాగానే ఆ పార్టీ మనుషులకు అడ్డు లేకుండా పోయింది. అన్నీ మాకే కావాలన్నారు. అనుకున్నదే తడవుగా ఊర్లో రేషన్‌ డీలర్‌ నుండి అంగన్‌వాడీ దాకా అప్పటిదాకా ఉన్నవాళ్ళను తీసేసి తమ పార్టీ వాళ్ళకు అప్పగించారు.
ఇప్పుడు గ్రామాల్లో ఇదో ఆనవాయితీగా మారింది.
ఈ క్రమంలో వాళ్ళ కన్ను బళ్ళో మధ్యాహ్న భోజన పథకంపై పడింది. 'మొదట్లోలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పిల్లాడికి బానే ఇస్తోంది. ప్రస్తుత రేట్ల మీద బాగానే గిట్టుబాటవుతుంది. ఏ లాభం లేకపోతే ముసల్ది అన్నేళ్ళుగా ఎలా చేస్తుంది?' అనుకుని ఏజెన్సీని తమ వాళ్ళకు ఇప్పించాలనుకున్నారు.
స్కూలుకొచ్చి నన్ను కలిసి ఏజెన్సీ మార్చాలన్నారు.''ముసల్ది ఏ రాజకీయ పార్టీకి చెందని మనిషి. గిట్టుబాటు కాక వండిపెట్టడానికి ఎవరూ ముందుకు రాక పథకం ఆగిపోయిన పరిస్థితుల్లో పాపం ముసల్దే ముందుకొచ్చి పిల్లలకు అన్నం వండి పెడుతోంది. ఇప్పుడు ముసల్దాన్ని తీయడ మెందుకు?''
నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. విన్లేదు. మార్చాల్సిందేనని పట్టుపట్టారు. అంతటితో ఆగక స్థానిక యం.యల్‌.ఎ. చేత పై అధికారులకు ఫ్యాక్స్‌/ సిఫారసు చేయించారు. ఏజెన్సీ వాళ్ళు చెప్పిన వాళ్ళకిమ్మని అధికారులు నన్నాదేశించారు.
చేసేది లేక మరుసటి రోజు ముసల్దాన్ని పిలిచి విషయం చెప్పాను. ముసల్ది అనిమిష మాత్రంగా నన్నలాగే చూస్తుండి పోయింది.
తేరుకున్న ముసల్ది ''ఇదెక్కడి న్యాయమయ్యా! గిట్టుబాటు కాదని ఒక్కరూ ముందుకు రాకపోతే కష్టమో, నష్టమో ఇన్నాళ్ళుగా వండిపెడుతున్నాను. ఇప్పటిదాకా ఈ పనికి అలవాటు పడ్డాను. ఇప్పుడీ వయసులో ఇంకో పని చేసుకోలేను. తీసేస్తామంటే ఎలా అయ్యవారు? అదీగాక పిల్లల్తో నాకు తెలీకుండా మాలిమయ్యాను... వచ్చే రాబడి మాట అటుంచితే కడుపు తీపి అంటే ఏంటో తెలిసింది... పిల్లల్లేరని నా పెనిమిటి నన్ను కాదన్నా దేవుడు ఇంతమంది పిల్లల్ని నాకిచ్చాడనుకున్నా... పిల్లల్నొదిలి వెళ్ళమంటే నా వల్ల కాదయ్యా'' అంటూ కన్నీటి పర్యంతమైంది.
ముసల్దాన్ని చూడగానే నాకు దుఃఖం తన్నుకొచ్చింది. ఎట్లానో దిగమింగుకున్నాను. కళ్ళలోంచి జారిన కన్నీటి బొట్లను ముసల్దానికి కన్పించకుండా కర్చీఫ్‌తో తుడుచుకున్నా.
''నిన్ను తీయాలని నాకేం లేదు. ఈ విషయంలో నేను నిమిత్తమాత్రుణ్ణి. పైనుంచి ఒత్తిడులు అలా ఉన్నాయి. నన్ను క్షమించు.''
గొంతు గద్గదం కాగా ఎలాగో గొంతు పెగల్చుకుని చెప్పాను.ముసల్ది విన్లేదు. వినకపోగా కోపంగా ''ఎలా తీసేస్తారో... ఎవరొచ్చి తీసేస్తారో నేను చూస్తా. నేను మానేస్తున్నట్లు సంతకం పెట్టకుండా ఇంకోళ్ళకు ఎట్లా ఇస్తారో చూస్తా'' అంటూ కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయింది.
నిజమే! మానేస్తున్నట్లు ముసల్ది సంతకం పెట్టకుండా కొత్తవాళ్ళకు ఏజెన్సీ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదు.
ఇదే విషయం పై అధికార్లకు చెప్పాను.అలా అయితే రేపు ఎంక్వైరి వేసి తీసేద్దాం. వాళ్ళ మనుషుల చేత సరిగా అన్నం వండి పెట్టదడం లేదని, సంతకాలు తీసుకుందాం. ఆనక పాత ఏజెన్సీని మనమే రద్దుచేసి కొత్త ఏజెన్సీ పెడదాం.
అధికార్ల మాటలకు నేను నివ్వెర పోయాను. దారుణమన్పించింది. హత్య కన్నా మహాపాతకమన్పించింది.
ఆఖరి ప్రయత్నంగా ముసల్దానికి నచ్చచెప్పా లనుకున్నా. ''సంతకం పెట్టకపోతే నువ్వు సరిగా వండట్లేదని చెప్పి బలవంతంగా తీసేస్తారు. దానికంటే స్వచ్ఛందంగా తొలగిపోవడమే మర్యాద.'' అని చెప్పాను.
ముసల్ది ససేమిరా అంది. ''నేనెట్లా వండానో తిన్న పసిబిడ్డలకు తెల్సు... చూసిన మీకు తెల్సు. పైన దేవుడనే వాడొకడున్నాడు... నేను సరిగా వండలేదని చెప్పడానికి నోరెలా వస్తుందో చూస్తా'' అంది ముసల్ది.
''అయ్యో! దేవుడనే వాడుంటే ఈ అరాచకాలు జరుగుతాయా!'' అనుకున్నాను.
ముసల్ది ఏడుస్తూనే ఉంది. మధ్యాహ్నానానికి అధికార్లు ఎంక్వైరీకి వచ్చారు.ముసల్ది అధికార్ల కాళ్ళా, వేళ్ళ పడుతూ పరిపరి విధాలుగా బతిమాల్తోంది.
''మీకు దణ్ణం పెడతానయ్యా... నా కడుపు కొట్టమాకండి... ముసల్దాన్ని కనికరించండి... ఈ వయసులో ఇంకో పని చేసుకోలేను... మీ కాళ్ళు పట్టుకుంటా... పిల్లల్నొదిలి నేను బతకలేనయ్యా... పిల్లల నుంచి నన్ను దూరం చేయకండయ్యా...''
ఎవరో చేత్తో గుండెను నులిమినట్లు విలవిలలాడిపోయాను. ఆ దృశ్యాన్ని చూసి అధికార్లు ముసల్దాని మొరనాలకించలేదు.అటెండరు ముసలా ్దన్ని రెక్కపట్టుకుని తీస్కెళ్ళి దూరంగా కూర్చోబెట్టాడు.
ఎంక్వయిరీ మొదలైంది.అన్నం సరిగా వండటం లేదని, సాంబారు నీళ్ళలా ఉంటుందని, గుడ్డు ఇవ్వడం లేదని వాళ్ళు ముసల్దానిపై లేనిపోని ఆరోపణలు చేశారు. సంతకాలు సేకరించి రాతపూర్వకంగా అధికార్లకు అందచేశారు.
అధికార్లు ఆ ఆరోపణలను బహిరంగంగా చదివి విన్పించారు.అవి విన్న ముసల్ది ఖిన్నురాలైంది. చేష్టలుడిగి అలాగే చూస్తుండి పోయింది.
ఆ తరువాత అధికార్లు పాఠశాల కమిటీ ద్వారా పాత ఏజెన్సీని తొలగిస్తూ, కొత్త ఏజెన్సీని నియమిస్తూ సంతకాలు సేకరించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
అంతా క్షణాల్లో జరిగిపోయింది.నేను కొయ్య బొమ్మలా నిల్చుండిపోయి చూస్తున్నాను.నా సంతకం పెట్టమన్నారు. అన్యాయం అంటూ నా అంతరాత్మ గొంతు చించుకు అరుస్తోంది. న్యాయానికి, భయానికి మధ్య క్షణకాలం అంతులేని మానసిక సంఘర్షణ. చివరికి భయమే గెల్చింది. అరవకుండా నా అంతరాత్మ నోరు నొక్కాను. మారు మాట్లాడకుండా సంతకం పెట్టాను. నా సంతకంతో ముసల్దాని బతుకు మీద దెబ్బకొట్టాను.ముసల్దాని వైపు చూశాను. తనిప్పుడు ఏడ్వడంలేదు. గంభీరంగా మారిపోయింది. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. అందర్ని ఒక్కసారి కలియచూసింది.
''నాల్గు మెతుకులు పెడితే కుక్క బతికినంత కాలం విశ్వాసం చూపిస్తుంది. ఇన్నేళ్ళుగా మీ బిడ్డల ఆకలి తీర్చాను. అందుకు నాకు బాగానే చేశారు. మీ అధికారంతో, బలగంతో ఒంటరి ముసల్దాని బతుకు మీద దెబ్బకొట్టారు. ఈ అరాచకం చూడటానికేనా దేవుడు నన్నింకా తీసుకుపోలేదు... మీకు నేనడ్డు రాను... మీరే చేసుకోండి... అంతా మీరే ఏలుకోండి.''
రెండు చేతులు జోడించి అందరికి దణ్ణం పెట్టింది. ఒక్కసారి బడంతా కలియచూసి కౌరవుల మోసానికి ఓడిపోయిన ధర్మరాజులా నెమ్మదిగా నడు చుకుంటూ ముసల్ది అక్కణ్నుంచి నిష్క్రమించింది.
అందరూ వెళ్ళిపోయారు.నా కళ్ళలో ముసల్దే కన్పిస్తోంది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ముసల్ది అమ్మోరికి బలిచ్చిన మేకపోతులా అన్పించింది. అన్యమనస్కంగానే మరిసటి రోజు స్కూలుకొచ్చాను.
ఎవరో వచ్చి చెప్పారు. ముసల్ది రాత్రి దిగుల్తో నిద్దట్లోనే చచ్చిపోయింది.ఓ క్షణం నాకు నోట మాట రాలేదు. కుర్చీలో కుప్పకూలిపోయాను.దుఃఖం లావాలా తన్నుకొచ్చింది. చిన్నపిల్లాడిలా రోదించాను. అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. చాలాసేపటికి గానీ మనిషిని కాలేకపోయాను.
అందరం కల్సి ముసల్దాని ఉసురు తీశామన్పించింది.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ఎవరో నేత టీవీలో గొంతు చించుకుంటున్నాడు. నవ్వొస్తోంది... సిగ్గేస్తోంది... అసహ్యమేస్తోంది.
- జి.ఎస్‌.కె. కరీముల్లా
9966757407.


విందు భోజనం ( కథ)

  • 03/08/2014
  •  | 
  • జీవన్
‘‘ముహుర్త సమయం ముంచుకొస్తుంటే తెమలకుండా బెల్లం కొట్టిన రాయల్లే ఇంకా కూర్చునే ఉన్నావేం?’’ ముందు గదిలో ఏదో పుస్తకంలో నిమగ్నమై వున్న నన్ను తొందరపెడుతూ అంది వింధ్య. రాత్రెప్పుడో ఏడున్నరకు పెండ్లనగా మధ్యాహ్నం నుంచే తెగ హడావుడి చేస్తున్నది.
‘‘ఇంకా అయిదైనా కాలేదు, ఏమిటా ఆరాటం’‘ పుస్తకంలో లీనమయ్యే సమాధానమిస్తున్న నాతో- ‘‘ప్రాణ స్నేహితుని ఇంట్లో పెండ్లవుతుంటే ముహుర్తం వేళకే వెళ్తే ఏం బాగుంటుంది- అయినా ఓ పూట ముందే రమ్మన్నాడుగా మీ స్నేహితుడు!’’ అంది.
నిజానికి సురేశ్ నాకిప్పుడు ప్రాణస్నేహితుడేం కాదు. బాల్యంలో మాత్రమే అట్లా ఉండేవాళ్లం. అతను ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పటినుండి ఆ స్నేహం కొంచెం కొంచెంగా పలచబడుతూ ఇప్పుడేమో అప్పుడప్పుడు కలుసుకునే స్థాయికి దిగింది. అదీ ప్రత్యేక సందర్భాల్లోనే.
‘‘అంగ రంగ వైభవంగా జరిగే ఆ వివాహానికి మనం వెళ్లాలంటావా?’’ అన్నా-వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలోనే ఉన్న నేను. ‘‘గరంగరమేమిటి-ఇంటికల్లా వొచ్చి అంత స్వీట్ స్వీట్‌గా ఆహ్వానిస్తేనూ!’’ అంది. నా మాటలకు ప్యారడీలు అల్లి నన్ను వేళాకోళం చేయడం ఆమెకు సరదా.
అంగ రంగ వైభవమని ఎందుకన్నానంటే సురేశ్‌తో వియ్యమందే పెద్దమనిషి నీటిపారుదలల్లో ఓ పేద్ద కాంట్రాక్టరు. కాలువల్లో చుక్కనీరు పారించకుండానే తన అకౌంట్లో భారీగా బిల్లులు పారించుకోగలిగే ఉద్ధండుడు. మా సురేశేమో ఆ ‘పారుదల’ కోసం అహోరాత్రులు శ్రమించే చీఫ్ ఇంజనీర్. పర్సంటేజీలు కాకుండా వాటాలే ఉన్నాయంటారు ఆయన సన్నిహితులు. ఇహ ఆ ఇద్దరి ఉద్ధండుల కాంబినేషన్ సూపర్‌స్టార్‌ల కాంబినేషన్‌లా కాకుండా మరెట్లా ఉంటుంది?
వింధ్య అన్నట్టుగా ఇంటికొచ్చి స్వీట్ స్వీట్‌గానే ఆహ్వానించాడు. కానీ, బడా బడా వ్యాపారవేత్తలూ, బ్యూరోక్రాట్లూ, పొలిటీషియన్ల కోలాహలాల వివాహ మహోత్సవంలో మనల్నెవరు కానతారు-అందునా ఆఫ్ట్రాల్ ఓ సామాన్య లెక్చరర్‌ని.
నా సందిగ్ధాన్ని పటాపంచలు చేస్తూ చేతిలోని పుస్తకాన్ని లాగి టేబుల్‌మీద పడేసి తొందరగా తెమలండంటూ మరీ తొందర చేసింది వింధ్య. అప్పటికే అలంకారాలన్నీ పూర్తి చేసుకుని ఉంది. పట్టుచీర సింగారించి ఉన్నంతలో నగలు ధరించింది. అమ్మాయి సుమని పట్టుపావడా ఓణీలో ముస్తాబు చేసింది- ఈ వేషం నాకొద్దు మొర్రో అని అది ఎంత గోలపెడుతున్నా వినకుండా. మా అబ్బాయేమో జీన్స్‌తోఅల్ట్రా మాడ్రన్‌గా తయారయ్యాడు-ఇంజనీరింగ్ స్టూడెంటాయె! నేను గవర్నమెంటు కాలేజీలో విద్యాబోధన చేస్తున్నా నా పిల్లలకు మాత్రం ‘ప్రైవేటు చదువులు’ కొంటూనే ఉన్నా లక్షలు పోసి. వాడికి ఇంజనీరింగ్, దానికి కంప్యూటర్ సైన్సూ.
ఎట్లాగూ హై క్లాస్ సొసైటీకి ఎగబాకలేం కనుక ఆ సొసైటీ వేడుకలెట్లా ఉంటాయో చూద్దామని తెగ ఉబలాటపడుతున్నది వింధ్య. పెండ్లికి ఆహ్వానించడానికి వచ్చిన సురేశ్‌నుంచి
కొంత సమాచారం సేకరించగలిగింది నేర్పుగానే. కట్నం విషయం అసలు పట్టించుకోలేదు, అమ్మారుూ అబ్బారుూ ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు, తథాస్తు అన్నాం అంతే-అని మాత్రమే మావాడు అన్నాడు. బడా నీటిపారుదల కాంట్రాక్టరు ఏకైక కుమార్తెను అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పీహెచ్‌డీ చేసే తన కుమారుడు ప్రేమించాడు. అల్ట్రా మాడ్రన్ యువతీ యువకులు ‘ప్రేమ’ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తారనడానికి ఇదో ఉదాహరణ. కాస్ట్, క్లాస్, స్టేటస్, ఎడ్యుకేషన్-ఇట్లా అనేక తూనిక రాళ్లతో కొలిచి మాత్రమే ‘ఐ-లవ్-యూ’ చెప్పేస్తారు. అట్లా మావాడి ముద్దుల తనయుడితో బడా కాంట్రాక్టరుగారి ఏకైక గారాలపట్టి ప్రేమ వివాహం నిశ్చయమైంది.
మరో గంటకల్లా వివాహ వేదికకు చేరుకున్నాం. మా పట్నంలోని పెద్ద చెరువు ఆక్రమించుకుని పదుల ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ గార్డెన్ కమ్ ఫంక్షన్ హాల్ అది. ఎక్కడికక్కడ లాన్సూ, క్రోటన్సూ, పూలమొక్కలు, లతలూ, కొబ్బరి, ఖర్జూర, పోక చెట్లతోనూ ఫౌంటెన్స్‌తోనూ కళకళలాడుతున్నది. రంగురంగుల విద్యుద్దీపాల కాంతులు వాటిని మరింత శోభాయమానం చేస్తున్నవి. క్రమపద్ధతిలో వేల సంఖ్యలో ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారికి ఆసనాలు ఏర్పాటు చే సారు. కార్తీక మాసపు ఆహ్లాదకర వాతావరణానికి తోడు సరస్సునుండి వీచే చల్లని గాలులతో మనోల్లాసంగా ఉంది. యంత్రాలు విరజిమ్ముతున్న రకరకాల పెర్‌ఫ్యూమ్‌లు గాలుల్ని మత్తెక్కిస్తున్నాయి. అందంగా అలంకరించిన విశాలమైన వేదికమీద క్రతువును అందరూ స్పష్టాతిస్పష్టంగా వీక్షించడానికి వీలుగా ఎక్కడికక్కడ వెడల్పాటి డిజిటల్ తెరలేర్పాటు చేసారు. వచ్చే అతిథులూ వాళ్లని ఆహ్వానించేవాళ్లతో అంతటా కోలాహలంగా ఉంది. అటు, ఇటు బెరుకు బెరుగ్గా చూస్తూ లోనికి వస్తున్న నన్ను చూసి సురేశ్ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా షేక్ హ్యాండిచ్చి వియ్యంకుడికి పరిచయం చేయబోతుండగానే మంత్రిగారెవరో వస్తున్నారని సెక్యూరిటీ వాళ్లు హడావుడి మొదలుపెట్టారు. ఆ వియ్యంకుడు నావైపో చిరునవ్వు విసిరి మంత్రిగారిని సాదరంగా ఆహ్వానించడానికి గోచీ సర్దుకుంటూ పరుగులు తీసాడు. నన్ను, నా కుటుంబాన్నీ మరో వ్యక్తికి అప్పజెప్పి మావాడూ అటే పరుగు తీసాడు.
మాంగల్యధారణ, తలంబ్రాలూ అయిపోగానే ప్రముఖులొక్కక్కరుగానూ జంటలగానూ, గుంపులుగానూ వధూవరులను ఆశీర్వదిస్తూ యధోచితంగా కానుకలని అందిస్తున్నారు. ఫొటోగ్రాఫర్లూ, వీడియోగ్రాఫర్లూ, టీవీ కెమెరావాళ్ల ఆర్భాటం చెప్పనలవి కాకుండా ఉంది. రకరకాల పోజుల్లో ఫొటోలు తీసుకుంటున్నారు. కొద్దిగా రద్దీ తగ్గగానే మేమూ అక్షింతలు వేశాం. భోంచేసి వెళ్లండని మావాడు మరోమారు గుర్తు చేసాడు. పరిచయస్తులెవరున్నారా? అని వెతుకుతుంటే బ్యాంకు మేనేజరు, మా ఫ్యామిలీ డాక్టరు వారి వారి కుటుంబాలతో సహా తారసపడ్డారు. ప్రాణం కుదుటపడ్డట్టనిపించింది.
అటుపక్కన విశాల ప్రాంగణంలో డైనింగ్‌కు ఏర్పాటు చేసారు. ఈ కొస నుండి ఆ కొసదాకా వరసల్ని పరిశీలిస్తూ ‘ఒక్కసారి ఎంతమంది భోం చేయొచ్చో’ అన్నాను అటు, ఇటు చూస్తూ. ‘మాథెమెటిక్స్ లెక్చరర్ గదా, మీరే చెప్పండి’ నవ్వుతూ అన్నాడు బ్యాంకు మేనేజరు. ‘అయిదారువేలకు తగ్గరు..’ అన్నా ధీమాగా. ‘పాతిక, ముప్పైవేలమందికైనా భోజనాలు పెట్టందే వాళ్ల హోదాకు భంగం కాదూ!’ అన్నారు డాక్టరు గారు. వింధ్యకూ, పిల్లలకూ స్నేహితులు దొరకడంతో ఉల్లాసంగా ఉన్నారు.
అందరం ఒకే పంక్తిలో కూర్చున్నాం. పసుపురంగు పేపరు పరిచిన టేబుల్సు మీద పెద్దపెద్ద ప్లాస్టిక్ అరిటాకులు వేసారు. యూనిఫాంలో వున్న యువతీ యువకులు చకచకా వడ్డిస్తున్నారు. నాలుగు రకాల స్వీట్లు, అరటికాయ, మిరపకాయ బజ్జీలు, ఘుమఘుమల బిర్యానీ, ఖుర్మా వడ్డించారు. మా కుడివైపున కూర్చున్న వృద్ధుడు ‘ఒద్దంటుంటే వడ్డిస్తారేమయ్యా స్వీట్లూ, నేనసలే సుగర్ పేషంటును, కడుపులో సుగర్ మిల్లుంది. మూడొందలు దాటింది’ అంటూ గగ్గోలు పెడుతున్నాడు. ‘అంత మిల్లుండగా ఈ నాలుగేమవుతాయ్ తినండి’ అంటున్నాడు మేనేజర్ నవ్వుతూ. ‘నీకేం నాయనా.. మిల్లు ఒక్కసారే భళ్లుమంటుంది-ఇంటికైనా చేరకముందే’ అన్నాడు ఆ పెద్దాయన అంతే పరిహాసంతో. ‘పక్కనే డాక్టరుగారున్నారులే భయంలేదు’ అన్నానే్నను. ‘డాక్టర్ల ఫీజులతో ఇల్లు గుల్లయింది కానీ వ్యాధి మాత్రం తగ్గట్లేదు’ అన్నాడు ఆ వృద్ధుడు మిరపకాయ బజ్జీ కొరుకుతూ. డాక్టరుగారు చిన్నబుచ్చుకున్నట్టున్నారు-‘మీరు పెంచుకుంటుంటే మేమేం చేస్తాం?’ అన్నారు. ‘కళ్ల ముందు ఊరిస్తుంటే నోరెట్ల కట్టుకుంటాం నాయనా!’ జాంగ్రీ ముక్కన నోట్లో పెట్టుకుంటూ నవ్వాడు. వాతావరణం తేలికపడింది.
అన్నమూ, రకరకాల కూరలు, వేపుళ్లు,పప్పు పచ్చళ్లు, సాంబారు వడ్డిస్తూనే ఉన్నారు. ‘పది పొట్టలు అరువు తెచ్చుకున్నా చాలేట్లు లేవే’ అన్నాడొకాయన వద్దంటున్న వినకుండా వడ్డిస్తున్న తీరు చూసి. ‘అది వాళ్లడ్యూటీ, తిన్నంత తిని మిగతాది పారేయ్’ అన్నాడు మరొకాయన.
అంతే అన్పిస్తున్నది. తిన్నవాటికంటే పారేసిన పదార్ధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెరుగు కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఆఖరి పంక్తిలో కలకలమేదో విన్పించి అటు చూశాం. మాసిన బట్టల్లోని ఓ యువకుడు టేబుల్ ముందు కూర్చుని గబగబ తినేస్తున్నాడు పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని. ఎక్కడినుంచొచ్చాడో ఒక నడీడు తుమ్మ మొద్దు లాంటి మనిషి ‘ఎవరి తరఫునుంచొచ్చావ్’ అంటూ గద్దిస్తున్నాడు అతన్ని. ‘‘అన్నం...అన్నం..’ అంటూ తడబడుతూ సమాధానమిస్తున్నాడు వాడు. ‘ఎవరి తరపోడివి’ అంటూ వాడి కాలర్ పట్టి లేపాడు. ‘ఆకలి...ఆకలి..’ సమాధానం చెబుతున్నాడు వాడు. ‘అన్నసత్రమనుకున్నావ్‌రా.. బద్మాష్, ఆకలిగొట్టెదవలందర్ని మేపడానికి’ అంటూ వాడి రెండు చెంపలూ బలంగా వాయించి ‘ఈ ఎదవను బైటికి నెట్టండిరా’ అంటూ తన అనుచరులకు ఆజ్ఞాపించి ఆ విస్తరిని బయటకి గిరాటేశాడు. అతని అనుచరులు పిడిగుద్దులు గుద్దుకుంటూ వాడ్ని బయటకు లాక్కుపోతున్నారు. ‘ఇంకెందరున్నారో ఇట్లాంటెదవలు’ అనుకుంటూ అట్లాంటి వెధవల వేటకు బయల్దేరాడు పంక్తులన్నీ వెతుకుతూ.
ఇబ్బందిగా లేచి చేతులు కడుక్కుని బయలుదేరాం. ఇవతలకు రాగానే నా స్నేహితుడు కనిపించి ‘కాసేపుండవోయ్, మీ వాళ్లను కారులో పంపుదాం’ అంటూ నా మాటైనా వినకుండా డ్రైవర్‌కు ఆ పని పురమాయించాడు. చేసేదేమీ లేక మిన్నకుండిపోయా. రద్దీ కొద్దిగా తగ్గింది. తన వియ్యంకుడి కుటుంబాన్ని, బంధువుల్ని, ఇతర ఉన్నతాధికారుల్నీ పరిచయం చేస్తూ పోతున్నాడు హుషారుగా. ఎప్పుడు బయటపడదామా? అన్నట్టుంది నాకు. ఇంతలో ఎవరో మీఠా పాన్ తెచ్చిచ్చారు. అది నముల్తూ గేటు దగ్గరకొచ్చా.
గేటు ముందు మిడతల దండులా బిచ్చగాళ్లు. ఖాళీ కడుపులు, ఖాళీ గినె్నలు చూపుతూ దీనాతిదీనంగా యాచిస్తున్నారు. వస్తాదులాంటి మరొక వ్యక్తి ఓ పేద్ద లాఠీ తీసుకుని ‘సుట్టాలొచ్చిన్రు.. సుట్టాలు..! ఆళ్లందరు తినక ముందట్నె ఒడ్డించాలె! నడువుండ్రి ఎదవముండలాల! ఎదవ ముండకొడుకులాల!’ అంటూ తరుముతున్నాడు. ‘గింతంత పెట్టిచ్చయ్యా, శాన పొద్దుపోయింది, ఆకలైతంది’ అంటూ ఆక్రోశిస్తున్నారు వాళ్లంతా దెబ్బలు తింటునే. సెక్యూరిటీ గార్డులొచ్చి తరిమి తరిమి కొట్టారు అందర్నీ.
ఉండలేకపోతున్నా వాడి దగ్గరకెళ్లి ‘నేనొస్తానోయ్’ అన్నా మరోసారి. ‘కాసేపుండవోయ్, ఏముందంత తొందర! ఎన్నాళ్ల తరువాతో కలిసాం’ అంటూ ఆప్యాయత ఒలకపోశాడు. ఇంకొద్దిసేపు ఉండక తప్పేట్టు లేదు.
అందరి భోజనాలు అయ్యాయి. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు-వియ్యంకులూ వాళ్ల పరివారమూ మినహా. కాసేపట్లో వాళ్ల భోజనాలూ అయ్యాయి.
సిగరెట్టు అంటించుకుని ఓ మూలకెళ్లి నించున్నా. కుండీలకొద్ది అన్నము, బేసిన్లకొద్దీ బిర్యానీ. కూరలు ఎత్తుకొచ్చి మురుగు కాలువల్లో పారబోస్తున్నారు. కాలువలన్నీ వాటితో నిండిపోయాయి.
ఇహ మా వాడితో చెప్పకుండానే బయలుదేరా. వీధులనిండా, పేవ్‌మెంట్ల మీదా రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్‌ల మీదా, బస్టాండుల నిండా అన్నార్తులు పేగులు మెలిపెట్టే ఆకలితో కడుపులో కాళ్లు పెట్టుక పడి ఉన్నారు. కొందరు నిద్రపోతూ...కొందరు నిద్ర రాకా...
కడుపులో దేవుతున్నట్టనిపించింది. ఆటోరిక్షా మాట్లాడుకుని ఇంట్లో పడ్డా తొందరగా.
కడుపులో మరింత దేవుతున్నది. గబగబ వాష్‌బేసిన్ దగ్గరకుపోగానే భళ్లున వాంతైంది.
‘ఏమైంది నాన్నా?’ అంటూ పరిగెత్తుకొచ్చారు పిల్లలు.
‘ఏదో పడలేదట్టుంది’ అంటున్నది వింధ్య.
‘డాక్టరు దగ్గరకు పోదాం పద నాన్నా..’ మావాడు ఆందోళనతో అంటున్నాడు.
‘పూర్తిగా వాంతైంది లే! ఇప్పుడు హాయిగా ఉంది. కంగారు పడకండి’ అన్నా మా అమ్మాయి అందించిన మంచినీళ్ల గ్లాసు అందుకుంటూ. *




జీవితం - కథ

  • 10/08/2014
  •  | 
  • -పి.ఎల్.ఎన్.శేషారత్నం
సాయంసంధ్య..
సూర్యుడింకా మలిగిపోలేదు. బాగా వెలుతురుగానే ఉంది. వీధి మలుపులో ఉన్న పెంకుటింటి ముందు ఆటో ఆగింది. గేటు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది సుభద్ర. పిల్లలిద్దరు ఆమెను అనుసరించారు.
గేటు తీసిన చప్పుడవడంతో...వరండాలోకి వచ్చి చూసాడు పరంధామయ్య. తండ్రి కనపడగానే చెప్పలేని దుఃఖం ముంచుకు వచ్చింది సుభద్రకు. చేతిలోవున్న బేగులు కింద పడవేసి తండ్రి చేతులు పట్టుకుని ‘ఇక నేను ఆ ఇంటికి వెళ్లను నాన్నా’ కన్నీళ్లు పెట్టుకుంది.
సుభద్ర అలా రావడం అది మొదటిసారి కాదు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు అలవాటైపోయాయి ఆ ఇంటికి. వీధి గుమ్మంలో అలికిడికి వంట చేస్తున్న కామాక్షమ్మ బయటకు వచ్చింది. విషయం చెప్పకనే అర్ధమైంది. షరా మామూలే...ఆరు నెలలు కాలేదు కథ మొదటికే వచ్చింది అనుకుంది.
‘‘అన్ని సర్దుకుంటాయిలే...మేమున్నాము కదా!’’ నచ్చ చెప్పారు.
కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ‘‘మీరెన్ని చెప్పినా ఇంక నేను ఆ ఇంటికి వెళ్లను. ఆ మాటలు, ఆ హింస భరించగలిగే ఓపిక నాకు లేదు.’’ ఖరాఖండిగా చెప్పేసింది. ఇంతకు ముందెన్నడు ఇంత బేలగా లేదు. ఏం జరిగి ఉంటుందో!
‘‘్భరించకపోతే ఎలా? ఇదేం మేము ఇష్టపడి చేసిన పెళ్లా? కులం కాని వాడ్ని వద్దు వద్దంటుంటే..విన్నావా? ప్రేమ ప్రేమ అంటూ వెళ్లి రహస్యంగా చేసుకొచ్చావు.
ఇప్పుడు అవకాశం వాళ్లదైపోయింది. అయినా మీ ఆయన ఏమన్నాడు? మీ అత్తగారు కూడా ఏమైనా అన్నదా?’’ ఆరా తీసింది కామాక్షమ్మ.
‘‘అవును. అత్తగారు అస్తమానం అనేదే..ఇప్పుడు ఈయనా అంటున్నాడు. తనవలన వంశం నిలబడడం లేదట. అందుకు విడాకులు కావాలంట. లేకపోతే..లేకపోతే’‘ చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తుంది.
‘‘ఊ...లేకపోతే’’ రెట్టించింది కామాక్షమ్మ.
‘‘విడాకులకు వప్పుకోకపోతే..తను చచ్చైనా పోవాలంట...అప్పుడు మళ్లీ తను పెళ్లి చేసుకోవడానికి వీలౌతుందట. అప్పుడైనా మగపిల్లాడు పుడతాడంట’’
‘‘సరేలే! ఆపరేషను చేయించుకోలేదుగా మరొకటి చూస్తే సరి..ఈమాత్రం దానికి విడాకులు..చావులు ఏమిటి? విషయం పెద్దవాళ్లకు చెప్పేది లేదు, అన్నీ నీ స్వంత నిర్ణయాలే.’’
ఆ మాటకు తల్లి వంక చివాల్న తలెత్తి చూసింది సుభద్ర. ‘‘ఇక నావల్ల కాదమ్మా! ఆ ఆపరేషనులు.. కష్టం తట్టుకోవడం నా వల్ల కాదు. మరో కాన్పు వస్తే నాకే ప్రమాదం అని డాక్టరు చెప్పలేదా! వాళ్లకోసం..వాళ్ల వంశం కోసం నా ప్రాణాల్ని బలిపెట్టదలచుకోలేదు. అయినా నేను పోతే నా పిల్లలు దిక్కులేని వాళ్లైపోతారు. పిల్లలిద్దరినీ పొదవి పట్టుకుని ఏడ్చింది.
ఒకప్పుడు..కామాక్షమ్మ కూడా ఇలాంటి పరిస్థితిని అనుభవించింది. తనకీ ఇద్దరాడపిల్లలే. అత్తగారూ అలాగే బాధపడింది. అలా అని రాచి రంపాన పెట్టేయలేదు. దేవుడిచ్చిన ప్రాప్తం అంతే అని సరిపెట్టుకుంది.
ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించిన సుభద్రకు నిద్ర దూరమైంది. ఆలోచనలు. తల పగిలిపోయేటన్ని ఆలోచనలు ఎడతెరిపి లేకుండా..అలల ఉధ్రుతిలా ఒకదాని వెంట ఒకటి సినిమా రీలులా తిరుగుతున్నాయి.
నిజమే! అమ్మ అన్న దానిలో ఎంతో నిజముంది. పిక్నిక్ అని ఇంట్లో చెప్పి స్నేహితుని వెంటేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా సింహాచలంలో పెళ్లి చేసుకుంది మనోహర్‌ని. ఒకమాటలో చెప్పాలంటే మనోహర్ అంత అందమైన వాడేం కాదు. తినగా తినగా వేప తియ్యనైనట్టు..చూడగా చూడగ అతను నచ్చాడు.
వాళ్ల ఇంటికి నాలుగు లైన్ల అవతల మనోహర్ ఇల్లు. డిగ్రీలో ఉండగా ఒకే స్టేజిలో కాలేజీ బస్సు ఎక్కేవాళ్లు. అదేవాళ్ల స్నేహానికి పునాది అయింది. పైగా క్లాస్‌మేట్స్. ఇక వాళ్ల స్నేహానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. నల్లగా సన్నగా బక్కపలచగా వున్నా అతని ముఖంలో ఏదోకళ కనపడేది. ఆ కళ్లలో తనమీద ఆరాధన కనబడేది. అదే తన్ని ముంచేసింది.
ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్లు ఊరికే అనలేదు. అలా అని పెద్దలమాట వినాలనీ లేదు. అందుకే అటు పెద్దలు..ఇటు పెద్దలు..తమని వేరుచేస్తుంటే, అన్నిటికీ అతీతంగా, దేవుని గుళ్లో స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకుంది. ఆ నిముషంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత సంతోషంగా అనిపించింది.
పెళ్లి చేసుకుని మనోహర్ నేరుగా ఇంటికే తీసుకువెళ్లాడు స్నేహితులు వెంట రాగా..పెళ్లి బట్టలతో ఉన్న తమని చూసి శివాలు తొక్కింది అత్తగారు అనబడే సుందరమ్మ.
‘‘ఒక్కగానొక్క కొడుకువి..లక్షలకు లక్షలు కట్నాలు ఇస్తామని...అయినవాళ్లందరు ఇంటి చుట్టు తిరుగుతుంటే..ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బులొస్తాయట్రా. నీ తరువాత ఆడిపిల్లలకి ఏమిచ్చి పెళ్లి చేస్తానురా!’’ బాధపడింది. భర్త నచ్చచెప్పడంతో కాసేపటికి శాంతించి ఎర్ర నీళ్లు దిష్టి తీయించి ఇంట్లోకి రానిచ్చింది. అదే మహాభాగ్యం అనుకుంది తను.
తల్లయితే ముందే చెప్పింది. ‘‘నువ్వు వాడినే కట్టుకునేట్టయితే..ఇక నువ్వు మా గురించి మర్చిపో. నీ తరువాత దానికి పెళ్లవ్వాలనుకుంటే ఈ గడప తొక్కకు’’ అని.
పెద్దలు వద్దన్నారన్న పట్టుదల పట్టింది గానీ..తనెంత పొరపాటు చేసిందో ఇప్పుడర్ధమైంది. పెళ్లిళ్ల విషయంలో అటు ఏడు తరాలు..ఇటు ఏడు తరాలు చూడాలన్నది ఎంత ముఖ్యమైన విషయమో ఇప్పటికే తెలిసి వచ్చింది. తనిష్ట ప్రకారం తను నడుచుకున్నందుకు....చెల్లి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఈ జీవిత సత్యం తెలిసే నాటికి ఆరేళ్ల కాలం..సంతోషానికి..దుఃఖానికి తేడా తెలియకుండా గడిచిపోయింది.
* * *
ఎంత కట్టడి పెట్టినా తల్లి...తల్లే.. అందునా కళ్లముందే ఉన్నారు కాబట్టి తను కడుపుతో ఉందని తెలిసి ఆ ఇంటికి వచ్చి, మిఠాయిలు ఇచ్చి, డెలివరీకి తీసుకువచ్చింది. అప్పుడే అంది అత్తగారు ‘మావాడు...మీ పిల్లని ఇష్టపడబట్టి గానీ లేకపోతే లక్షలుతెచ్చే పిల్ల నా కోడలు అయేది. చదువు ఒక్కటే సరిపోదు. మనిషి బతకడానికి డబ్బు కూడా ముఖ్యమే’’ అని.
మనోహర్ తండ్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో గుమాస్తా. ఎలాగో తంటాలు పడి..కొంత డబ్బు ఖర్చుపెట్టి కొడుక్కి చిన్న ఉద్యోగం వేయించగలిగాడు. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు అనుకుంటే కట్న కానుకలు ఎలానూ లేవు..ఉద్యోగానికి ఖర్చు పెట్టుకున్నదైనా తన నుంచి ‘కలసి’ వస్తే బాగుండునని ఆశించింది అత్తగారు.
ఆవిడ అలా అనుకోవడంలో తప్పులేదు. చదువుకుని కూడా తను వీళ్లకు ‘తిండి’ భారమైంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని..ఎక్కడైనా టీచర్‌గా వెడదామనుకుంటున్న తరుణంలోనే వేవిళ్లు మొదలయ్యాయి. దాంతో ఇంట్లోనే ఉండిపోయింది.
తొలిచూలు ఆడపిల్ల. మొదటిసారిగా పంపినపుడు చంటిపిల్లకు బంగారం పెట్టి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి పంపారు తల్లిదండ్రులు. దానికి సంతోషపడింది సుందరమ్మ.
చిట్టిపాపాయి..చిన్నారి చేష్టలతో..బుడిబుడి నడకలతో సంవత్సరం తిరిగిందో లేదో మళ్లీ నెల తప్పింది తను. చిట్టి పాపాయిని చూసి సంతోపడుతున్నా..మలి సంతానం అబ్బాయే కావాలని పట్టుపట్టింది అత్తగారు.
‘‘మన చేతుల్లో ఏముంది అత్తయ్యా!’’ అంది తను.
‘‘అది నాకు తెలీదు. నా వంశం నిలవాలి.. అలా అని ఇంకా ఇంకా అవకాశాలు చూడాలంటే..మన స్తోమతు సరిపోదు.’’ ఖచ్చితంగా చెప్పింది.
మొదటిసారే సిజేరియన్ జరిగింది. ఈసారీ ఆపరేషన్ తప్పకపోవచ్చు. అత్తగారి కోరిక తీర్చడం కోసం ఏదైనా టెస్ట్ చేయించుకుందాం అనుకున్నా. గవర్నమెంటు వాటిని నిలుపు చేసింది. మగపిల్లాడి కోసం ఎన్ని కష్టాలు పడగలదు తను. అంతా దేవుడిదే భారం అనుకుంది.
అయినా దేవుడు ఆ భారాన్ని తను తీసుకోలేదు. తనకే వదిలేసాడు. మళ్లీ అమ్మాయే. అత్తగార్ని సంతోషపెట్టేలా మరిన్ని కానుకలు ఇచ్చి పంపాడు పరంధామయ్య.
రెండవ డెలివరీకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తానంది డాక్టరు. తల్లికి భయపడి మనోహర్ వప్పుకోలేదు.
రానురాను అత్తగారి సాధింపులు ఎ క్కువయ్యాయి. పెద్దాడపడుచు పెళ్లి దగ్గర పడడంతో, ఇల్లు ఇరుకు అన్న నెపంతో వేరుకాపురం పెట్టించాడు పరంధామయ్య మనోహర్‌తో...అత్తారింటికి...పుట్టింటికి మధ్యస్తంగా ఉన్న అద్దె ఇంట్లోకి. దానికే కొడుకు దూరం అయిపోయాడని బాధపడింది సుందరమ్మ.
కొంతలో కొంత తెరిపిన పడ్డట్లయింది తనకు. చిన్న పిల్లకూ రెండేళ్లు గడిచింది. జీవితం నల్లేరు మీద నడకలా సాఫీగానే జరుగుతుందనుకున్న సమయంలో మళ్లీ అవాంతరం.
పెద్దాడపడుచుకు మగపిల్లాడు. ఎంకిపెళ్లి...సుబ్బి చావుకొచ్చినట్టయింది. కొడుక్కి వంశాంకురం లేడని..తప్పంతా కోడలిదేనని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది . వినగా..వినగా తల్లిమాటలు బుర్రకెక్కాయి మనోహర్‌కి. తల్లి మాటలకే వత్తాసు పలికాడు. అతను చివరగా పలికిన మాటలే...మళ్లీ పుట్టింటి పంచన చేరేలా చేసాయి.
* * *
రాత్రి కలత నిద్రయినా...ప్రశాంతంగా నిశ్చింతగా నిద్ర లేచింది సుభద్ర. ఇక్కడ తన మనసును కష్టపెట్టేవాళ్లు ఎవరూ లేరు. పిల్లలిద్దరూ అప్పటికే నిద్రలేచి గార్డెన్లో తాతయ్యతోపాటు కూర్చుని కబుర్లు చెబుతున్నారు.
లేచి ముఖం కడుక్కుని పిల్లల దగ్గరకు వెళ్లింది. నిన్నటినుంచి వాళ్ల ఆలనా పాలనా చూడలేదు. తల్లిని చూడగానే ముందుగా చిన్న పిల్ల దివ్య ఎదురొచ్చి గట్టిగా కావలించి పట్టుకుంది. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా ‘‘అమ్మా! నాన్నది ‘తీసి’ బయట పడెయ్యి’’ అంది కోపంగా..తల్లిమెడలో వున్న మంగళ సూత్రాలనుచూపిస్తూ. ఇంకా ముక్కుపచ్చలారలేదు దానికే ఎంత లోకజ్ఞానం తెలిసింది.
తనే ఎప్పుడోచెప్పింది...పిల్లలు తన ఒడిలో చేరి, మెడలో వున్న మంగళ సూత్రాలతో ఆడుతుంటే..‘ఇందులో ఒకటి మీ నాన్నది..ఒకటి నాది’ అని. ఆ మాట దానికి బాగా గుర్తున్నట్లుంది. నాన్నతో గొడవ జరిగి బయటికొచ్చేసినందుకు..దానికి ఈ విషయం ఇలా గుర్తుండిపోయింది. అందుకే ‘నాన్నది తీసి బయటపడెయ్యి’ అంది. ఒక సూత్రం తీసి బయటపడేసినంత మాత్రాన తెగిపోయే బంధమా ఇది.
దాని అమాయకత్వం చూస్తే..అంత బాధలోనూ మనసుకి ఊరట కలిగింది. అమాంతం దివ్యనెత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దు మాటలేమీ అర్ధం కాని పరంధామయ్య...‘ఏమిటమ్మా! ఏమంటుందీ గడుగ్గాయ్...దాని మాటలు నాకింకా అర్ధం కావడంలేదు. అయినా భలే స్పీడుగా మాట్లాడేస్తుందిలే’’ సుభద్రకు దగ్గరగా వచ్చి చిన్న పిల్ల భుజాన్ని ప్రేమగా తడుతూ...
తండ్రి అలా అడిగేసరికి దాని మాటల సారాంశం వివరించక తప్పింది కాదు సుభద్రకి.
‘‘ఔరా! ఎంత జ్ఞాపక శక్తి. వేలెడంత లేదు’’ ముక్కున వేలేసుకున్నాడు పరంధామయ్య. ‘‘ఎంతైనా పెద్దది అమాయకురాలు.’’ అన్నాడు.
* * *
ఇక్కడకు వచ్చినప్పటినుంచి ఆలోచిస్తోంది, తన సమస్యకు...పరిష్కారం వెతుక్కోవాలి.స్నేహితురాలు ప్రసూనాంబ ధైర్యం చెప్పింది.
మంచి చీర కట్టుకుని ముస్తాబవుతున్న కూతుర్ని చూసి ఆశ్చర్యం కలిగింది కామాక్షమ్మకి.
‘‘పొద్దుటే ఎక్కడికి బయలుదేరావు. అపుడే ఇంటిమీద ధ్యాస మళ్లింది గానా’’ అడిగింది. ఈ వంకనైనా కాపురం చక్కబడితేచాలు అనుకుంటూ.
ఆ విషయం అమ్మకి, నాన్నకి ఎలా చెప్పాలో తెలియక అవస్థపడుతుంది. తల్లి మాటలకు జలజల కన్నీళ్లు ఉబికి వచ్చాయి.
‘‘్ఛ అలా ఏడవకు...ప్రొద్దుటే ఇంటికి మంచిది కాదు.’’ మందలించింది.
‘‘అవును. నా బతుక్కి మనసారా ఏడవడానికే కూడా స్వేచ్ఛలేదు. అందుకే నా సమస్యకు నేనే పరిష్కారం వెతుక్కున్నాను. ననె్నవ్వరూ ఆపేందుకు ప్రయత్నించకండి. నా ఫ్రెండ్ ప్రసూన తెలుసుకదా! తను పనిచేసే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీగా వుందని, జీతం పదివేలు వరకూ వుండొచ్చని చెప్పింది. జీతం ఎంతిచ్చినా సరే..నేను అక్కడ జాయిను అవ్వాలనుకుంటున్నాను. మీరు నాకు చెయ్యగలిగే సహాయం ఒక్కటే. కాస్త పిల్లల్ని చూడండి అంతేచాలు.’‘ కన్నీళ్లు తుడుచుకుంటు చెప్పింది దృఢ నిశ్చయంతో
కూతురి మాటలకు విస్తుపోయింది కామాక్షమ్మ.
వీళ్ల సంభాషణ అంతా తోటలో కూర్చుని గమనిస్తున్న పరంధామయ్య వరండాలోకి వస్తూ ‘‘అలా నీపాటికి నువ్వు నిర్ణయం తీసేసుకోవడమేనా? మనోహర్ వచ్చి అడిగితే నేనేం చెప్పాలి? సంసారం అన్నాక ఏవో గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి.’’ కూతురికి నచ్చచెప్పే ధోరణిలో.
‘‘అయినాసరే! నాకంటూ ఓ ఆర్థిక వెసులుబాటు లేకే...ఈ అవమానాలు పడుతున్నాను. ఏ కష్టం వచ్చినా...పరిగెత్తుకుంటూ వచ్చి మీ పంచన వాలిపోతున్నాను. ఆ దాష్టికం నేను చెయ్యలేను. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకండి.కొద్దిరోజులు పిల్లల్ని చూడండి చాలు’’ అంది వేడుకోలుగా.
‘‘సరే! నీ ఇష్టం. ఇదీ ఒకందుకు మంచిదే అనుకుందాం. నీవు చదువుకున్న చదువూ ఉపయోగపడుతుంది. మీ పరిస్థితులు చక్కబడతాయి. మీ ఆయన ఆలోచనలు మారవచ్చు.’’ వొప్పుకున్నాడు పరంధామయ్య.
ఆ మాటకి కొండంత ధైర్యం వచ్చింది సుభద్రకు
* * *
వారం రోజులుగా ఉద్యోగానికి వెడుతోంది సుభద్ర. పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల లాలనలో తల్లిని వదిలి వుండడానికి అలవాటుపడ్డారు. సుభద్ర చేదు జ్ఞాపకాల్ని మరిచిపోవాలనుకున్నా యదలో గాయం పచ్చిగానే ఉంది.
ఓ రోజు...ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డాడు మనోహర్. వరండాలో ఆడుకుంటున్న కావ్య కనిపించగానే రమ్మని చేతులు చాచి పిలిచాడు.ఒక్క నిముషం తండ్రినిచూసిన ఆనందంలో కావ్య పరిగెత్తుకుంటూ ఎదురెళ్లబోయి..ఆగిపోయింది ‘నేను రాను’...అన్నట్టు బుర్ర అడ్డంగా తిప్పింది.
‘‘రా! మనింటికి వెళ్లిపోదాం’’ చేతులు చాచి మళ్లీ పిలిచాడు.. రానని అమ్మమ్మ వెనక్కు వెళ్లిపోయింది
అక్కడే వున్న దివ్య తండ్రిని చూడగానే ...పట్టరాని కోపంతో కిందకి వంగి నేలమీద వున్న ఆటవస్తువు తీసి మనోహర్‌మీదకి బలంగా విసిరేసింది.
దెబ్బ తగలకుండా తప్పించుకున్నాడు. ఆ పిల్ల ఎదురుతిరగడంలోనే చూస్తే తెలుస్తుంది జరిగిన దానికి ఆ పసిమనసు ఎంత గాయపడిందో. మాటల్లో వ్యక్తం చేయలేని భావం చేతల్లో చూపింది.
ఆ ముద్దుగారే.. పసి మనసులో ఇంత కోపం వుందని అనుకోలేదు కామాక్షమ్మ. ‘తప్పు అలా చేయకూదు’ అంది దివ్యను వారిస్తూ.
‘‘ఏం నాయనా! ఇన్నాళ్లకు పిల్లలు గుర్తుకొచ్చారా? పెళ్లాం గుర్తుకొచ్చిందా? మగపిల్లాడు పుట్టలేదని, నా కూతుర్ని తన్ని తగలేసావు కదా! ఇప్పుడు దేనికొచ్చినట్లో. అసలు మగపిల్లాడు పుట్టకపోవడం అనేది మగవాడిలో లోపమే. ఆడదానిది కాదు. సైన్సు చదువుకున్నావు కదా! ఆ మాత్రం తెలీదా!’’ అడిగింది.
‘‘....’’ వౌనం సమాధానం లేదు.
‘‘ఎంతోమంది ఇళ్లలో.. ఇప్పుడు ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లాడు లేడని అనుకోవడం సహజమే అయినా.. ఎవ్వరూ మీలా వీధిన పడడంలేదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దేవుడిచ్చిన ప్రాప్తం అని సరిపెట్టుకుంటే అంతా ఆనందమే. మేము లేమూ! మగపిల్లాడు లేకుండా. మాకు అల్లుళ్లు అయినా మీరే కొడుకులు అయినా మీరే. చివరగా తల కొరివీ మీరే పెడతారు. ఎపుడో జరగబోయే దానికోసం ఇప్పటినుంచే జీవితాలు బుగ్గి చేసుకుంటామా’’
అత్తగారు అలా ఏకబిగిన మాట్లాడేస్తుందనుకోలేదు. ‘ఇకనుంచి బాగానే చూసుకుంటాను సుభద్రను పిలవండి.’
‘‘సుభద్ర రావడానికి ఇంకా గంట టైము కావాలి. ఇప్పుడు ఉద్యోగానికి వెడుతుంది.’’
‘‘ఉద్యోగమా!’’
‘‘అవును. నువ్వు మళ్లీ పెళ్లిచేసుకోవడం కోసం..నా కూతురు చచ్చిపోవాలనుకోవడం లేదు. తన పిల్లలు అనాధలు కాకూడదని ఇప్పటినుంచీ కష్టపడడం నేర్చుకుంటోంది. వస్తుంది కూర్చో.’’ కుర్చీ చూపించింది.
తీరిగ్గా కూర్చుంటే అత్తగారు ఇంకా ఏం క్లాసు పీకుతుందోనని బతుకుజీవుడా అనుకుంటూ మళ్లీ వస్తానని బయటపడ్డాడు.
* * *
మనోహర్ వచ్చి వెళ్లిన విషయం విని కూడా సుభద్ర పెద్దగా చలించిపోలేదు. ప్రతిసారిలా కన్నీరు పెట్టుకోలేదు. విని వూరుకుంది. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నందుకు సంతోషపడింది.
అంతకుముందు ఒకసారి పిల్లల్ని తనతో తీసుకుపోవడంతో..వాళ్లకోసం..తనూ వెళ్లాల్సి వచ్చింది దూడకోసం ఆవులా!
అత్తగారి మాటల తరువాత మనోహర్‌లో అలజడి మొదలైంది. తను చదువుకున్నదే సైన్సు. సంతానం విషయం అత్తగారు అంటేనే కానీ తనకి సెక్స్ డిటర్మినేషన్ గురించి ఆలోచనకి రాలేదు. సుందరమ్మ అస్తమానం వంశాంకురం కోసం తాపత్రయపడి బుర్ర తినడంతో తనకి వాస్తవం గ్రహించే కనీస జ్ఞానం లేకపోయింది.
మగవాడిలో వున్న ఎక్స్ వై క్రోమోజోములలో, వై క్రోమోజోము బలహీనంగా ఉన్నప్పుడు స్ర్తినుంచి వచ్చిన ఎక్స్ క్రోమోజోముతో.. మగవాడిలో ఉన్న ఎక్స్ క్రోమోజోము కలవడం వల్ల ఆడ సంతానం కలుగుతుంది.
విడాకులు... మళ్లీ పెళ్లి.. బోలెడు కట్నం..అనుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగి, కొత్త జీవితం ఏర్పడుతుందనుకున్నాడు. కొన్నాళ్లపాటు పాత జీవితపు జ్ఞాపకాలు బాధించినా..కాలగతిన కొట్టుకుపోతాయ్ అనుకున్నాడు.
ఇంటికి దీపమైన ఇల్లాలిని...వెళ్లగొట్టినందుకు పదిరోజులుగా ఇంట్లో దీపం పెట్టడానికి ఇల్లాలు లేదు. ఎదురొచ్చే పిల్లలు లేరు. ఏమైనా కొన్నా తినడానికి ఇంట్లో మనిషి లేదు. ఇక తన సంపాదన ఎవరికోసం. ఆకలైనప్పుడు తల్లిదగ్గరకు వెళ్లి అన్నం తిని వస్తున్నాడు. ఇదేనా జీవితం? ఎన్నాళ్లిలా?
రేపు వెళ్లి సుభద్రని, పిల్లల్ని ఇంటికి తీసుకురావాలి అనుకున్నాడు మనోహర్.
* * *
ఆ మరునాడు మనోహర్ ఎప్పటిలానే పిలిచాడు. ఆ మాటలన్నీ అలవాటైపోయాయి సుభద్రకి. తను తన పిల్లలతో వంటరిగా జీవించాలనుకున్నానని, తన గాలి సోకనంత దూరంగా..ఉద్యోగం దగ్గరే ఇల్లు తీసుకుని అక్కడే వుండాలనుకుంటున్నట్టు చెప్పింది.
పరంధామయ్య నచ్చచెప్పాలని చూసాడు. వినలేదు సుభద్ర. ఇదివరకటంతటి బేలతనం ఇప్పుడు లేదు. ఆర్థిక స్వతంత్రం. ‘‘నేనే కావాలనుకుంటే నాతోపాటు వచ్చి నా కంపెనీకి దగ్గరగా అద్దె ఇంట్లో ఉండమనండి లేకపోతే లేదు’’ అంది.
‘‘నా స్టీల్ సిటీకి దూరం’’ చెప్పాడు మనోహర్
‘‘నువ్వే కావాలని, నా వాళ్లని వదులుకున్నాను అప్పుడు. ఇప్పుడు నిన్ను వదులుకోవడం ఏమీ కష్టం కాదు నాకు. వదులుకోవడం నా జీవితానికి ఓ అలవాటని అనుకుంటాను’’ స్థిరంగా పలికింది.

జరిగినదంతా తల్లితో చెప్పాడు మనోహర్. ఆఫీసుకు శెలవు కావాలని ఫోనులో పర్మిషన్ అడిగాడు. స్కూటర్ తీసుకుని కోడలు ఇంటివైపుగా వెడుతున్న కొడుకుని చూసి స్థాణువులా నిలబడిపోయింది సుందరమ్మ. *

ఎడ్వంచర్ (కథ)

     | 
  • -నర్సాపేట ఒత్సల

ఎర్రమట్టి లైసెన్సు కోసమో, పందిపెంట పర్మిట్ కోసమో మాడిశెట్టి మాణిక్యాలు గుప్త ఆదరాబాదరా సిటీకి వెళ్లవలసి వచ్చింది.
‘‘ఎందుకయినా మంచిది! ఎటిఎంలో డబ్బేసి, అక్కడికి పోయింతర్వాత మళ్లీ అక్కడ ఎటిఎంలో గోకి తీసుకో!’’ ముందు చూపు గాక ముందు చూపున్న మిత్రుడు విశ్వనాధం గుప్త అడక్కుండానే సలహా ఇచ్చాడు.
‘‘శింగినాదం! జీలకర్ర! ఆ ఎటిఎంలు గోకటాలు, నాకటాలు నాకు తెలవ్వు! అదీకాక ఎటిఎంలో వేసేసిన డబ్బే చాకచక్యంగా దొబ్బేస్తున్నారట! అసలు రోజులు బాగాలేవు!’’ అన్నాడు మాణిక్యాలు గుప్తా.
తగుమాత్రంగా నిట్టూర్చి,
‘‘సరే! నీ ఇష్టం! నువ్వెడుతున్నది పట్నం! అక్కడ చోరులు, జారులు, క్రూరులు, సంఘ విదూరులు జాస్తిగా ఉంటారని వింటున్నాం! పట్టపగలే గత మాసం కాలేజీకి వెళ్లే అమ్మాయిని నలుగురు కుర్రాళ్లు డోర్‌లేని జీపులో పడదోసి-వూరు బయటికి తీసుకుపోయి రాక్షసంగా చెరిచేరుట! పేపర్లో వేసారు! తర్వాత నీ ఇష్టం!’’ అన్నాడు విశ్వనాధం గుప్త.
‘‘అదికాదూ! ఖర్చులికి ఓ అయిదువేలు జేబులో వేసుకుపోతున్నాను! అంతగా అక్కడ ఇంకా డబ్బవసరం పడితే ఇంటికొచ్చి డీడీ పంపిస్తాను!’’
‘‘సర్లే! డబ్బులేకుండా ఈరోజుల్లో పన్లవుతయ్యా? మనిషి గుండెకాయే డబ్బు, డబ్బు అని కొట్టుకుంటుంది! నీకు తెలవందేముంది? కొబ్బరికాయ కొట్టకుండా, ముడుపులు కట్టకుండా దైవదర్శనమే కాదు! ఇది ప్రజాస్వామ్యం!’’ అన్నాడు విశ్వనాథం.
‘‘చెప్పేను గదా! ఏమైనా దండిగా పిండి పెట్టవలసి వస్తే వాపస్ వచ్చేక డిడి తీసి పంపిస్తానని?’’
‘‘సర్లే! ఇంతకీ పట్నంలో ఎవర్ని కలవాలని వెడుతున్నావ్?’’
‘‘ఇంకెవరు! ఉన్నాడుగా మనూరి ఏడుచింతల ఏడుకొండలు? లఘు పరిశ్రమల మంత్రి కింద పనిచేసే పి.ఎస్.
‘‘ఓహో! ఏకాంబరం కొడుకు ఏడుకొండలా! ఐతే నువ్వు సిటీలోని మైసూర్ హోటల్‌కి వెడితే ఆయన్ని వీజీగా పట్టుకోగలవు! మన వూరు వాడే కాబట్టి నీ పని కొద్దిలో అయిపోచ్చు!’’ అన్నాడు విశ్వనాథం
‘‘సరే! మర్నే వస్తాను. రాత్రికి ప్రయాణం, గుడ్డ గోచులు సర్దుకోవాలి!’’ అన్నాడు మాణిక్యాల గుప్త.
‘‘సర్దు కోవడం సరే! నువ్వేమో చూడబోతే పుట్టి బుద్ధెరిగి ఎన్నడూ వూరి పొలిమేర దాటి ఎక్కడికీ వెళ్లని ఆగర్భ అర్భకుడివి! జేబులో డబ్బు, దస్కం జాగర్త! అక్కడ ఆలోచిస్తూ నించుంటేనే కన్రెప్పలు కత్తిరించుకుపోయే జాదూగాళ్లుంటారు! రిక్షా వాళ్లు కూడా కొత్తవాడివని వాసన పట్టేరో-అడ్డగోలుగా కిరాయి చెప్పి మూలగ లాగుతారు!’’ అన్నాడు అనుభవజ్ఞుడయిన విశ్వనాధం.
‘‘ఆయ్! నేనంత వెర్రి వెంగళప్పనా ఏం?’’ అన్నాడు మాణిక్యాల గుప్త.
‘‘అంటే ఎంతో కొంత వెర్రివెంగళప్పవని ఒప్పుకున్నట్టేగా? వెధవ్వేషాలు మాని నా మాట విని ఒక పని చెయ్’’
‘‘ఒకటి కాకపోతే రెండు పన్లు చేస్తా! ఏంటవి?’’
‘‘ఎక్కడికి వెళ్లినా రిక్షా బాడుగ ఐదులోపు బేరమాడు! ఆంతకన్నా ఎక్కువ పెట్టమాకు! ఆరిపోతావ్!’’ అన్నాడు విశ్వనాధం.
* * *
ఎర్రబస్సులో గుంటూరు వెళ్లి, అక్కడ రైల్వే బుకింగ్‌లో సెకండు క్లాసు టిక్కెట్టు తీసుకుని పట్నం వెళ్లే రైలెక్కాడు మాణిక్యాలు
దేశ పౌరులని పుక్కిటబట్టి-రైసు మిల్లులో జల్లెడలా వూగుతూ వానపాములా రైలు సాగిపోయింది.
ఎవరివైనా తెలిసిన మొహాలు కనబడతాయేమోనని ఆశతో కంపార్టుమెంట్లో చూపులు తిప్పి చూసాడు. ఉహు! మాణిక్యాలు గుప్తాకి తెలిసిన ఒక్క శాల్తీ కూడా తగల్లేదు.
సోడా మిషన్ గ్యాస్ వదిలినట్టు నిట్టూరుస్తూ కిటికీకి ఎదర లాంగ్ బెంచీ మీద ఖాళీ జాగా దొరికి-చటుక్కుని మ్యూజికల్ చెయిర్ ఆటల్లో మల్లేకూర్చున్నాడు. ఆ లాంగ్ బెంచీకి హాయిగా ఆనుడు కూడా ఉన్నది.
ఎదర కిటికీలోంచి చల్లగాలి హోళీలో పిచికారీతో వసంతం చిమ్మినట్టు వీస్తున్నది.
తనకి తెలీకుండానే కళ్లు మూతలు పడుతుంటే బెంచీకి ఆనించిన నడుం ముందుకు లాక్కున్నాడు.
పేసింజరు రైలు చిన్న స్టేషన్లలోనూ ఆగుతూ, ఇష్టంలేని పెళ్లి కూతురు కాపురానికి వెడలినట్టు పోతున్నది.
ఒళ్లు పెరిగిన వాళ్లమల్లే చెట్లు, చేమలు విరుచుకుపడిపోయున్నాయ్ గాలిని కోసుకుంటూ- వుండి వుండి బొంగురు గొంతుకతో కూత పెడుతూ రైలు వెడుతున్నది.
సిటీ సమీపిస్తున్నదో ఏమో-కంపార్ట్‌మెంట్‌లో అలబలం ఉద్ధృతమవుతున్నది. ఎవరికి వారు సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నారు.
ఏమీ తోచక ఎదర కిటికీకి ఆనుకుని కూచున్న పెద్దమనిషిని అడిగేడు మాణిక్యాలు
‘‘మీరెందాకా?’’
‘‘నేను పట్నం! మీరెక్కడికి?’’ అడిగాడు కిటికీకి తల అంకితం చేసి కూచున్న వ్యక్తి.
‘‘నేను సిటీకి కాదులెండి! మరో చోటికి వెళ్లాలి.’’
కిసుక్కున రబ్బరు ముక్క అడ్డంపెట్టి గోలీ సోడా కొట్టినట్టు నవ్వేడా వ్యక్తి.
‘‘ఏవిటో వెర్రిమాలోకం! పిచ్చిబట్టినట్టు నవ్వుతాడేమిటీ! తను చెప్పిన సమాధానంలో నవ్వు మొలిపించే మాట ఏముందీ?’’ అనుకున్నాడు మాణిక్యాలు గుప్త.
గొడుగుని చూసిన గొడ్డులా పరికించేడు.
తననే చూస్తూ- వెలువడే నవ్వుని బలంతంగా ఆపుకుంటున్నాడు కిటికీ పక్క జాగా తాత్కాలికంగా రిజిస్టరు చేసుకున్న పెద్ద మనిషి.
మాణిక్యాలు గుప్త అదేమీ పట్టించుకోకుండా తలవంచుకుని గోళ్లలో మట్టి తీసుకుంటూ కూచున్నాడు.
అంతలో పెట్టెలో
‘‘పట్నం వచ్చింది! పట్నం...! అలబలంగా అంటున్నారు జనం.
తత్తరపడుతూ లేచి నించుని-రద్దీలో జనాన్ని నెట్టుకుంటూ పోతే ఎక్కడ పక్క జేబులో పైకం చక్కగా కొట్టేస్తారోనన్న భయంతో నిదానంగా, గాలిలో గంధర్వుడులా రైలుపెట్టె దిగి ప్లాట్ ఫాం మీద కాలుపెట్టాడు.
ఆశ్చర్యం! తనతో మరో చోటికి వెళ్లాలన్న పెద్దమనిషి ప్లాట్ ఫాం మీద నిలబడి దర్శనమిచ్చేడు.
‘సందేహం లేదు! వీడెవడో పాకెట్ మార్! పెద్దమనిషి రూపంలో వున్న ఆషాఢభూతి!’ అనుకుంటూ చకచక మరో అడుగు వేసి-టిక్కెట్లు గుంజుకునే గేటు దగ్గరకొచ్చాడు. నెత్తిన రాళ్ల గుట్టలా లగేజి పెట్టుకుని-లైసెన్సు కూలీలు ఓ పట్టాన గేటు దాటి వెళ్లనిచ్చేరు కాదు, పెన్‌గ్విన్ పక్షిలా గేటు చెంత నిలబడ్డ టిక్కెట్ల కలక్టరు చకచక చేతులాడిస్తూ టిక్కెట్ ముక్కలు తీసుకుంటున్నాడు.
జనాన్ని తప్పుకుని-యంత్రంనుంచి నట్టూడిపడ్డట్టు స్టేషన్ దాటి బయటకొచ్చేసరికి పావు గంట పట్టింది.
బయట రిక్షావాళ్లు-గుడి దగ్గర బిచ్చగాళ్లమల్లే ఎగబడుతున్నారు.
మరీ మీసాల్లేని ఓ పిల్లిగడ్డం రిక్షావాడు-విడవకుండా మాణిక్యాలు గుప్త అడుగులో అడుగువేస్తూ
‘‘కహా జానా సాబ్! కహా జానా?’’ అంటూ వదలడంలేదు.
నింగిని కాకులు గాలిలో ‘క్యావ్? క్యావ్?’ అని హిందీలో ఏమిటో అడుగుతున్నవి.
‘‘చూడ చూడ ఇక్కడంతా హిందీ మాధ్యమంలావుందే? అవునే్ల హిందువులకి హిందీ మాధ్యమం గాక సింధీ మాధ్యమంగా ఉంటుందా? అనుకునేటంతలో
‘‘కహా జానాసాబ్?’’ అని తన వెంట బడ్డ రిక్షావాడు కంటగింపుగా పాట పాడుతున్నాడు.
‘‘మైసూరు! మైసూరు హోటల్‌కి పోవాలి!-వెల్లకితల పడ్డ బొద్దింకలా చేతులాడిస్తూ చెప్పాడు.
‘‘హా! లే జాయింగే సాప్! కిత్తే సవారీ?’’
‘‘సవారా? సవారేమిటి? నేనేం గుర్రాన్నా, లొట్టిపిట్టనా? సవారీ, జువారీ ఏం లేదు.! నేను-నేను మైసూర్ హోటల్ గయా!’’ చేతులాడిస్తూ చెప్పాడు మాణిక్యాలు గుప్త.
‘‘అచ్ఛా! అచ్ఛా! లేజాయింగే సాబ్!’’ అన్నాడు మేకపోతు గడ్డం రిక్షావాలా.
‘‘ఎంత? ఎంతకి వుతర్తావ్?’’-పిడికిలి బిగించి పైకి కిందికి ఆడిస్తూ అడిగేడు మాణిక్యాలు.
‘‘దేఢ్ రూప్యా దిలాయియే సాబ్!’’
‘‘దౌడ్ రూప్యా లేదు, తౌడ్ రూప్యా లేదు! ఐదు-ఐదు రూపాయలిస్తా! నీకిష్టమైతే రా! లేకపోతే పో!’’ కాంగ్రెస్ ఎన్నికల గుర్తు చూపిస్తూ అన్నాడు మాణిక్యాలు.
‘‘హోరి పిచ్చిముండా బేటా! ఐదు రూపాయలిస్తానంటే నాకేమైనా చేదు?’’ అనుకుంటూ
‘‘గట్లనే యియుండ్రి సాహబ్! మా అసుంటి గరిబోల్లకాణ్ణేగదా మీరు బేరమాడేది?’’ అన్నాడు.
‘‘అట్లారా దారికి!’ అని మనసులోనే అనుకుంటూ రిక్షా ఎక్కాడు మాణిక్యాలు గుప్త...
స్టేషన్‌నుంచి కుడివెంపు కొంచెం దూరం వెళ్లి-అక్కణ్ణించి లెఫ్టుకి తిరిగితే మైసూరు హోటల్ వస్తుంది. ఐతే ఆ కాస్త దూరానికే ఐదు రూపాయలా! అని పేచీ పెడతాడేమోనని సందేహించి-తిన్నగా మార్కెట్ వరకు వెళ్లి అక్కడినుంచి ఎడం చేతివైపు మండి సందులో గుండా వచ్చి మైసూర్ హోటల్ దగ్గర దింపేడు రిక్షావాలా!
పట్టిన చెమట తల గుడ్డతో తుడుచుకుంటూ
‘‘ఉస్! అబ్బ! చాలా చడావ్ వున్నది సాబ్! ఔర్ ఏక్‌రూపాయిప్పించుండ్రి!’’ అన్నాడు రిక్షావాలా.
‘నిజమే పాపం’ చాలా దూరం తీసుకొచ్చేడు-అదీ మోసగించి ఏ వూరు బయటకో తీసుకుపోయి, బెదిరించి జేబులో డబ్బులు లాక్కోకుండా!’ అనిపించించింది మాణిక్యాల గుప్త గారికి!

అందుకే వాడు కోరినట్టు ఐదుకి మరో రూపాయి జతచేసి ఇచ్చేడు. ఆ తర్వాత అంబాసిడర్లో లఘు పరిశ్రమల మంత్రిగారి పర్సనల్ సెక్రటరీ ఏడుకొండలు గారి ఇంటికి తీసుకుపోతానని నమ్మించి మరో తెలుగు సోదరుడు రెండువేలు కొట్టేశాడనుకోండి! అది మరో అధ్యాయం!


1 comment: