Saturday, 30 August 2014

నాన్న పాపమే శాపమై.. (చిన్న కథ)

  • - కోట సావిత్రి
  • 31/08/2014
తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే కోల్పోయిన మేనల్లుడు కృష్ణచైతన్యని చదివించి, తన ఏకైక కుమార్తె రుక్మిణినిచ్చి పెళ్లి చేసి, ఇంటిని అల్లుడి పేర రాసి తీర్థయాత్రలకు వెళ్లాడు సత్యం.
తిరిగి రాలేదు. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగినందున రుక్మిణి అంటే చెల్లెలు అనే భావమే తప్ప మరో భావం కలుగలేదు కృష్ణచైతన్యకు. మామయ్య మాటకి ఎదురు చెప్పలేకపోయాడు.
నీకు మంచివాడిని చూసి పెళ్లి చేస్తానన్నాడు. రుక్మిణి ఒప్పుకోలేదు. భర్త కాలేజీలో తోటి లెక్చరర్ నిర్మలతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి పాల పాకెట్‌కని వెళ్లి సిటీబస్ కిందపడి చనిపోయింది రుక్మిణి. ఆమె ఆత్మహత్య చేసుకుందని అర్థమై చాలా బాధపడ్డాడు కృష్ణచైతన్య.
సహజీవనం చేస్తున్న నిర్మలని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు తెలిసింది వాడకట్టుకి రుక్మిణి యాక్సిడెంట్‌లోని మర్మం.
మొదట ఇద్దరు ఆడపిల్లలు, తరువాత ఇద్దరు మగపిల్లలు. పెద్ద చదువులు చదివించాడు. నలుగురికీ మంచి ఉద్యోగాలే వచ్చాయి. కానీ ఆడపిల్లలు ఇద్దరూ నలభై దగ్గరపడినా పెళ్లిళ్లు కాలేదు.
‘మా సంగతి మరచిపోండి. తమ్ముళ్లిద్దరికీ పెళ్లిళ్లు చేయండి’ అంది పెద్దకూతురు ఇందిర. పెద్ద కొడుక్కి పెళ్లి చేశాడు. పెళ్లయిన నెలలోపలే ఇల్లువిడిచి ఎటో వెళ్లిపోయాడతను. కారణం ఏమిటో చెప్పకుండానే కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది.
ఏడాది తరువాత చిన్నకొడుక్కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. ఎవరూ పిల్లనిస్తామని ముందుకు రాలేదు. ఆ ఇంటి కథను ప్రచారం చేసేశారు ఆ వీధివాళ్లు.
‘అమ్మా, నాన్న చేసిన పాపం శాపమై మనల్నిలా వెంటాడుతోంది. రుక్మిణి పెద్దమ్మ ఉసురు తగిలింది. ఆమెకి తండ్రి ఇచ్చిన ఇంట్లో మనం వుంటున్నాం. ఆమెకి నాన్న చేసిన అన్యాయం ఊరిలో అందరికీ తెలుసు. మనలో ఎవరూ ఈ ఇంట్లో సుఖంగా సంసారం చేయడం సాధ్యంకాదు.
నేను మీతో కలిసి వుండాలంటే పెళ్లి చేసుకోను. నా బతుకూ మీలా మారిపోకూడదు. మిమ్మల్ని అందరినీ వదిలి నేను బయటకు వెళ్లలేను’ అన్నాడు అక్కలతో చిన్నోడు. పక్కగదిలో ఉన్న తండ్రి ఈ మాటలు విన్నాడు. వారం తరువాత తనకు బదిలీ అయ్యిందని, అది తండ్రే చేయించాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు చిన్నకొడుకు.
‘అక్కడ నీకు నచ్చిన అమ్మాయిని చూసి రిజిస్టర్ మ్యారేజీ చేసుకో. మమ్మల్నందరినీ మరచిపో. నువ్వయినా సుఖంగా వుండాలని ఈ నిర్ణయం తీసుకున్నా. నేను రుక్మిణికి చేసిన ద్రోహం ఫలితమేనని నాకూ అనిపించింది’ తలొంచుకుని అన్నాడు కృష్ణచైతన్య.
చిన్న కథ
నిజాయితీ
చాకలికి బట్టలు వేసి పద్దు రాస్తున్నాను. ‘అయ్యగారూ! మీ ఫేంట్ జేబులో ఇరవై రూపాయల నోటు మరచిపోయారు’ అని తీసి ఇచ్చింది చాకలి రత్తాలు- ఆమె నిజాయితీకి సంతోషించి మనసులోనే ఆమెను అభినందించి, ఇరవై రూపాయల నోటు తీసుకున్నాను. మరొకసారిలాగే యాభై రూపాయల నోటు ఫేంట్ జేబులో మరచిపోతే తీసి ఇవ్వడంతో, ఆమె నిజాయితీకి సంతోషించి ఆ తరువాత జేబులు మరీ చెక్ చేయకుండానే చాకలికి బట్టలు వేయడం ప్రారంభించాను.
ఒక రోజువెయ్యి రూపాయల నోటు మార్చి, ఏదో వస్తువు కొని మిగిలిన సొమ్ము సుమారు 800 రూపాయలు ఫేంటు జేబులో మరచిపోయి చాకలికి బట్టలు వేసాను. పద్దు రాసాక చాకలి బట్టలు తీసుకెళ్లిపోయింది. ఆఫీసుకు బైలుదేరుతూ ఫేంటు జేబు తడిమేసరికి డబ్బులు కనిపించకపోవడంతో చాకలికి వేసిన ఫేంటులో డబ్బులున్న సంగతి గుర్తుకు వచ్చి హడావుడిగా స్కూటరు ఎక్కి చాకలి రత్తాలు ఇంటికి బయలుదేరాను.
చాకలి రత్తాలుకి విషయం చెప్పగానే చాకలి బట్టల మూట తెచ్చి నా ముందే విప్పి, ఫాంటు జేబులు చూపించింది. అందులో డబ్బు కనపడకపోవడంతో, ‘అయ్కగారూ, ఇంకెక్కడో డబ్బులు పెట్టి మరచిపోయి వుంటారు. ఇంటికి వెళ్ళి మరొకసారి వెతకండి’ అని చెప్పడంతో బుర్రగోక్కుంటూ ఇంటికి బయలుదేరాను. నిన్న రాత్రి వెయ్యిరూపాయలు నోటు మార్చి చిల్లర నోట్లతో ఫేంటు జేబులోనే పెట్టాను. అందులో సందేహం లేదు. నేను వస్తానని గ్రహించిన చాకలి ముందుగానే జాగ్రత్తపడి ఫేంటు జేబులో డబ్బు కాజేసి ఉంటుంది.
వ్యాపారస్తులెవరైనా పొరపాటున పదో, పాతికో చిల్లర డబ్బులు ఎక్కువ ఇస్తే నిజాయితీగా వెనక్కి ఇచ్చే అలవాటు నాకుంది. ఒకసారి ఒక షాపులో ఏదో ఒక వస్తువుకొని ఐదువందల రూపాయల నోటు ఇస్తే షాపు యజమాని చిల్లర ఇస్తూ మూడువందల రూపాయల నోటుతో పాటు ఒక ఐదువందల రూపాయల నోటు పొరపాటున ఇచ్చాడు. ముందు అయిదు వందల రూపాయల నోటు షాపు యజమానికి తిరిగి ఇవ్వాలనుకొని మరల వ్యాపారంలో బోలెడు లాభాలు ఆర్జిస్తూ మేడమీద మేడలు కడుతున్న వ్యాపారులకెందుకు ఇవ్వాలనుకుంటూ ఐదువందల రూపాయల నోటుపై ఆశపుట్టి ఇవ్వకుండా ఇంటికి తిరిగి వచ్చాను. తనలాగే పదికి, యాభైకి ఆశపడని చాకలి రత్తాలు కూడా వందలలో రూపాయలు ఒకసారి కనిపించగానే ఆశపుట్టి నొక్కేసి ఉంటుందని ఆలోచన రాగానే మనుషుల నిజాయితీ ఇల్లాగే ఉంటుంది కాబోలు అనుకొని ఏడవలేక నవ్వుకుంటూ ఆఫీసుకి బయలుదేరాను.

No comments:

Post a Comment