కలుపుగోలు (కథ )
- - చింతల ఉదయసాయికుమార్
- 03/08/2014
TAGS:
నా బాల్య మిత్రుడు రెడ్డి నాకు చిన్ననాటినుండి ఆత్మీయుడు. అతనంటే నాకు ప్రాణం. మేమిద్దరం కలిసి నాలుగైదేళ్ళయింది. ఉద్యోగాల వల్ల మేమిద్దరం చెరో ఊర్లో వుంటున్నాం. మిత్రుడైన రెడ్డిని రమ్మని నేనే ఫోన్ చేశాను. ఎవరి బతుకు పనుల్లో వారు చేరిపోవడం వల్ల మా ఇద్దరి మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో మందగించాయి. కులాసాగా మాట్లాడుకుందామని నేను ఫోన్ చేశాను. అతనంటే నాకు ఎందుకో ప్రత్యేక అభిమానం. చాలా రోజుల తర్వాత మిత్రుడి ఆత్మీయతలు గుర్తురాసాగాయి. అందువల్లే రమ్మని ఆహ్వానించాను. రెడ్డి చక్కటి రచయిత. కవిత్వం, కథలు రాయడంతోపాటు, వ్యాసాలు రాసి వివిధ పత్రికలకు పంపిస్తుంటాడు. కొత్త పుస్తకాలు కొంటుంటాడు. రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని నేను కథావ్యాసంగాన్ని చేబట్టి రచయితగా రాణించాలని నాకు తహతహలాడేవాడిని. రెడ్డి ఎప్పుడూ ఫోన్ చేసి పలకరించినా, కథల గురించి, కవిత్వం గురించి చాలా వివరంగా చెబుతాడు. కథ ఎలా రాయాలో తగిన సూచనలు ఇస్తుంటాడు. రచయితగా ఎదగడం వల్ల విశాలత్వం పెరిగి, ఇంటా బయటా బాధ్యతలు తెలిసి వస్తాయని రెడ్డి అంటుండేవాడు. రెడ్డి రచనలు ఇటీవలి కాలం నుండి చిన్నపత్రికలతోపాటు, అప్పుడప్పుడు పెద్ద పత్రికల్లో ప్రచురితమవుతున్నాయ. చాన్నాళ్ళనుండి నాకు కూడా పుస్తకాలు, సాహిత్యాధ్యయనం వుంది. కవితలు, కథలు చదవడంతో పాటు వాటి రచనా తీరును పరిశీలిస్తుండేవాడిని. రెడ్డి తన రచనా వ్యాసాంగంలో కథారచన గూర్చే ఎక్కువగా వివరిస్తుండేవాడు. పత్రికల్లో ఇతరులు రాసిన ఏవేని మంచి కథలు అచ్చయినపుడల్లా ఫోన్ చేసి మరీ చెబుతాడు. వాటిని చదవటంతో పాటు శైలి పరిశీలించమని అంటుండేవాడు. నేను నా ఆఫీసు, ఇతర పనుల బిజీ వల్ల చదవడం నాకు కుదరనప్పటికీ, చదివాను బాగుందని, అబద్ధాలు సైతం చెప్పేవాడ్ని. నా అసమర్థతను, బద్ధకాన్ని అలా కప్పిపుచ్చుకునేవాడ్ని. రెడ్డి అంతరంగానికి కాస్తోకూస్తో అర్థమైనా, కథారచన చేబట్టమని బలవంతం చేసేవాడు. కథారచనలో వివిధ పాత్రల చిత్రణ, కథలోని భాష, శైలీ, శిల్పం, ముగింపు ఎలా వుండాలో విశదీకరిస్తూ చర్చ జరిపేవాడు. ఇదంతా ఇప్పటిదాకా ఫోన్‌లోనే జరిగేది. సాహిత్యం పట్ల రెడ్డికున్న శ్రద్ధాసక్తులకి నేను అబ్బురపడేవాడ్ని. వారానికి రెండుసార్లయినా ఫోన్ చేసి చెప్పేవాడు. రెడ్డి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నట్లనిపించింది. రెడ్డి నిరంతర ప్రేరణ వల్ల నాకు కథలు రాయాలన్న తలంపు కలిగింది. రెడ్డిలా రాయకున్నా, కాస్తోకూస్తో కథారచన చేబట్టాలన్న ఆసక్తి నాలో బలపడింది. ఓ రెండు కథలు రాసి, టైపుచేయించి, రెడ్డి చెప్పినట్లుగా పత్రికలకు కొరియర్‌ద్వారా పంపాను. చిత్రంగా రెండు కథలూ ఓకే అయ్యాయ. ఓ కథను సవరించి పంపమన్నారు. మరో కథ మాత్రం ప్రచురణకు అర్హమైనట్లుగా తెలిపి, ఒక నెల వ్యవధిలో మరో కథను ప్రచురించారు. నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. నోబెల్ బహుమతి వచ్చినట్లుగా ఫీలయ్యాను. నేను నా కలంతో తెల్లకాగితంపై పేర్చిన అక్షరాల్ని అచ్చులోకి చూసుకుని తెగమురిసి పోయాను. నా మిత్రుల నుండి అభినందనలు అందాయి, అందుతున్నాయి. ఎంతో సంతోషపడ్డ నేను, ఈ శుభవార్తని రెడ్డికి తెలియపరిచాను. రెడ్డి కూడా ఆనందించాడు. కథ బాగుందని, శైలిని, చక్కని ముగింపును జోడిస్తే మంచి కథా రచయితవవుతావని కితాబునిచ్చాడు. రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం నన్ను కదిలించింది. నాలోని సోమరితనాన్ని కుదిపేసింది. రెడ్డి చెప్పినట్లుగానే కథలు రాస్తుండేవాడిని. రెడ్డి రాక కోసం ఎదురుచూస్తున్న నాకు, ఓ రోజు కరీంనగర్ వస్తున్నానని చెప్పిన తర్వాత నాకు కలిగిన ఆనందం అంతా ఇంతాకాదు. రెడ్డి రాక నాకు నవ వసంతంలా అనిపించింది. ఉగాది పండుగ జరుపుకునేంత సంబురమైంది. రెడ్డిని ఆనందంగా రిసీవ్ చేసుకున్నాను. అతనున్న రెండు రోజుల్లో మా ఇరుగు పొరుగువారితో ఆత్మీయుడిగా కలిసిపోయాడు. నా ఆఫీస్‌కి సెలవుపెట్టి రెడ్డితో జల్సాగా, ఖుషీగా కరీంనగర్ అంతా తిరిగాను. సాహిత్య విషయాలపై, పత్రికల ధోరణిపై విపులంగా చర్చించుకున్నాం. తను సైతం చాన్నాళ్ళకు కలుసుకున్నందులకు తబ్బిబ్బయిపోయాడు. నా సహచర్యంలో, నా పరిసరాల్ని,వ్యక్తుల్ని తనే స్వయంగా పరిచయం చేసుకుని అందరితో హృదయపూర్వకంగా మాట్లాడాడు, రెడ్డి. గమ్మత్తయిన విషయం ఏమిటంటే నా చుట్టుపక్కల వారితో ఇంతకాలంగా మొక్కుబడిగా మాట్లాడుకోవడమే కాని, రెడ్డి వెళ్ళినంత లోతుగా, పూర్వాపరాల్లోకి వెళ్ళి నేను ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడలేదు. అలాంటి వ్యక్తులతో మమైకమై సరదాగా సంభాషించాడు, రెడ్డి. అది ఆయనలో వున్న కలుపుగోరుతనమని, రచయితగా మారాక రెడ్డి లో వచ్చిన మార్పు నన్ను ఆశ్చర్యపరచింది. రెండురోజులు హాయిగా అందరితో సఖ్యంగా వుండి, సరదాగా గడిపేసి వెళ్ళిపోయాడు,రెడ్డి. రెడ్డి వెళ్ళాక నాకు ఎందుకో ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది. నెలరోజుల తర్వాత రెడ్డి నాకు ఫోన్ చేసి, ఫలానా పత్రికలో ‘కలుపుగోలుతనం’ అనే కథ అచ్చయిందని, చదివి అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ కథ సాంతం చదివి ఆశ్చర్యపోయాను. అది నన్ను కేంద్రంగా చేసుకుని రాసిందని, మా ఇరుగుపొరుగు సఖ్యత గూర్చి రాసిందని అర్థమయ్యింది. కాకపోతే మనుషుల మధ్య యాంత్రిక జీవితం అనుభవిస్తున్న నేను జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, ఇన్నాళ్ళు లేమిగా వున్న నాకు కలుపుగోలుతనం ఆవశ్యకత తెలిసివచ్చింది. దాని ప్రాధాన్యతను నేను గుర్తించాను. ఇరుగుపొరుగుతో ఆత్మీయంగా కలుపుగోలుగా వుండాలని, రెడ్డి నాలోమార్పురావడానికే ఇలా రాసి వుంటాడని భావించాను. నాలోని ఒంటరితనాన్ని దూరం చేయడానికి, సఖ్యతను పెంచడానికి నన్ను ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథ నాకు ఎంతగానో నచ్చింది. ముఖాముఖిగా చెప్పకుండా, కథ రూపంలో చెప్పి నాకూ, నాలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మనస్సులోనే రెడ్డికి కృతజ్ఞత చెప్పుకున్నాను. అంతేకాదు, నేను కలుపుగోలుతనాన్ని అలవరుచుకోవడమే అసలైన కృతజ్ఞత అని కూడా నిర్ణయంచుకున్నాను.
- చింతల ఉదయసాయికుమార్
No comments:
Post a Comment