Saturday, 30 August 2014

సులువైన వ్యాయామం.. మేలైన ఆరోగ్యం

  • - చందన
  • 27/08/2014
అనారోగ్యం కలిగినపుడే ఆరోగ్యం మీద శ్రద్ధ కలుగుతుందంటారు. అసలు అనారోగ్య ఛాయలే మనదరి చేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ కొంత సమయాన్ని శారీరక శ్రమకు విధిగా కేటాయంచాలి. చాలామంది గృహిణులు తాము చేసే ఇంటిపనే తమకు నిజమైన వ్యాయామం అని భ్రమపడుతుంటారు.
ఇంటి పనుల వల్ల తమకు వచ్చేది అలసట మాత్రమే అని గ్రహించటం లేదు.
ఉదయం నుంచి రాత్రి వరకూ పనుల్లోనే నిమగ్నం కావడంతో తగిన పోషకాహారం తీసుకునే సమయం లేక ఎంతోమంది గృహిణులు, ఉద్యోగినులు పలురకాల శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వీటి బారిన పడకుండా మహిళలు కనీసం ఏడు వ్యాయామాలను ప్రతిరోజూ తమ దినచర్యలో భాగంగా చేసుకుంటే చాలా రకాల జబ్బులను దరిచేరనీయకుండా జాగ్రత్త పడొచ్చు. వ్యాయామంతో పాటు సరైన పౌష్టికాహారం, తగినంత నిద్ర ఉంటే చాలు.
ఏడు రకాల వ్యాయామాల గురించి మహిళలు అవగాహన పెంచుకుంటే మంచి ఆరోగ్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది.
జంపింగ్ రోప్
ఈ వ్యాయామం మహిళలకు చాలా అనువుగా వుంటుంది. దీనినే మనం ‘తాడాట’ అని అంటాం. దీన్ని చాలామంది చిన్నతనంలో ఆడేవుంటారు. తాడుతో ఎగరడం అనేది ఎవరికైనా చాలా తేలిక, సరదాగా కూడా అనిపిస్తోంది. దీని కోసం జిమ్‌కు వెళ్లి వేలకు వేలు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఏ ఇతర వ్యాయామం వల్ల కలగని ప్రయోజనం దీని వల్ల దక్కుతుంది. మన శరీరంలో ఉన్న అధిక కేలరీలను జంపింగ్ రోప్ వల్ల సులువుగా తొలగించుకోవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారితో కలిసి సరదాగా ఆడొచ్చస. దీన్ని ఆడితే శరీరం ఫిట్‌గా ఉండటమే కాదు. గుండెకు ఎంతో మేలు చేస్తోంది. జంపింగ్ రోప్ అనేది పిల్లలకే అనుకోనవసరం లేదు.
స్క్వాట్ (గొంతుకూర్చోవడం)
మహిళలకు స్క్వాట్ వ్యాయామం చేయటం ఎంతో తేలిక. దీని వల్ల కండరాలన్నీ కదులుతాయి. దీనివల్ల పిరుదుల్లో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించుకోవచ్చు. శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. గుండెకు తగినన్ని కేలరీలు సక్రమంగా అందటమేకాకుండా అది చక్కగా కొట్టుకుంటుంది. దీన్ని మహిళలు ఎక్కడైనా చేయవచ్చు. వంట చేస్తున్నపుడు కుక్కర్ విజిల్ వచ్చే వరకు ఇలాంటి వ్యాయామాన్ని చేస్తే శరీరం ఫిట్‌గానే కాదు, ఉత్తేజాన్ని సంతరించు కుంటుంది.
పుష్ అప్స్
ఈ తరహా వ్యాయామం పసివయసులో మనందరమూ చేసిన వారమే. అత్యంత సులభమైన దీన్ని నేడు మనం మర్చిపోతున్నాం. దీన్ని ఆచరిస్తే భుజాలు, చేతుల కండరాలకు ఎంతో మంచిది. అవి చురుకుగా కదులుతాయి. ముందు కొద్దిమేరకే శరీరాన్ని కదల్చండి. నిదానంగా ఎగువ శరీరాన్ని వీలైనంత మేరకు పైకి లేపటానికి ప్రయత్నించండి. అయతే, దీన్ని సక్రమంగా చేయకపోతే వెన్నునొప్పు వచ్చే ప్రమాదం లేకపోలేదు. వారంలో కొద్దిరోజుల పాటు చేస్తే చాలు శరీరంలో ఎంతో మార్పు గమనిస్తారు. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తోంది.
లంగెస్ (కాళ్లను వంచడం)
ఈ వ్యాయామం కాళ్లకు ఎంతో మేలు చేస్తోంది. శరీరానికే కాదు గుండెకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. రోజూ ఒక్కొక్క కాలితో కనీసం పదిసార్లు ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తూ శక్తిని పుంజుకుంటాయి. ప్రతిరోజూ ఇలాంటి సులువైన వ్యాయామాన్ని కొద్దిసేపైనా చేస్తే మంచిది. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే శరీరం దీనికి అలవాటు పడుతుంది.
స్విమ్మింగ్
స్విమ్మింగ్‌ను నేడు చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారు. కండరాలన్నింటికీ పని చెప్పటం వల్ల ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. రక్తపోటును నియంత్రించి, గుండెకు శక్తినిస్తుంది. ఎరోబిక్ వ్యాయామానికి ఇది ఏ మాత్రం తీసిపోదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఎంజాయ్ చేస్తూ దీనిలో పాల్గొనవచ్చు.
రన్నింగ్
రన్నింగ్ వల్ల ఏన్నోరకాల ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి నుంచి తగిన ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడతాం. గుండెకు ఎంతో మేలు చేస్తోంది. శరీరంలో ఉన్న అధిక క్యాలరీలను నియంత్రించి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ప్రభాత వేళలో చేసే అన్ని వ్యాయామాల కంటే ఇది అతి ముఖ్యమైంది. మహిళలు వయసు రీత్యా రన్నింగ్ చేయటం కష్టమైతే జాగింగ్ చేయటానికైనా ప్రయత్నించాలి.
సైక్లింగ్
సైక్లింగ్ అందరికీ అద్భుతమైన వ్యాయామం. కాళ్లకు, చేతులకు బలాన్ని ఇస్తుంది. గుండె చక్కగా పనిచేసేలా చేస్తుంది. అధిక బరువును వదిలిస్తుంది. ఆఫీసు, మార్కెట్ వంటివి దగ్గర్లోనే ఉంటే సైకిల్‌పై వెళ్లడం ఉత్తమం. ఇందువల్ల వాహన కాలుష్యం నుంచి బయటపడొచ్చు. సైకిల్‌పై వెళ్లడం అలవాటైతే డబ్బు ఆదా అవుతుంది. శారీరక దారుఢ్యం లభిస్తుంది.
సంపూర్ణ ఆరోగ్యం పొందాలనుకునే మహిళలు ఇలాంటి సులభమైన వ్యాయామాలను అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాలను సాధించవచ్చు.

No comments:

Post a Comment