Thursday, 28 August 2014

విమానయాన చరిత్రలోనే ఆశ్చర్యకరమైన సంఘటన

ఏప్రిల్ 28, 1988న ఇది జరిగింది. హవాయ్‌కి చెందిన అలోహా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 243 హవాయ్‌లోని హీలోనగరంనుంచి హొనలూలుకి బయలుదేరింది. 19 సంవత్సరాలు వయసుగల ఆ బోయింగ్ 737కి క్వీన్ లిలియోకలనీ అనే పేరుపెట్టారు. అది బోయింగ్ కంపెనీ నిర్మించిన 737 మోడల్ విమానాల్లో 152వది. 1969లో అలోహా ఏర్ లైన్స్ దాన్ని కొన్నది. అంతదాకా ఆ విమానం 35,496 గంటలు ప్రయాణించింది. ఇది 89,680 ఫ్లైట్ సైకిల్స్‌కి సమానం. ఫ్లైట్ సైకిల్ అంటే టేకాఫ్, లేండింగ్‌లు. 44 ఏళ్ల రాబర్ట్ స్కోరన్స్ సైమర్ అనుభవస్తుడైన పైలట్. అప్పటికే 8,500 గంటలు విమానాన్ని నడిపాడు. కో పైలట్ 36 ఏళ్ల మేడలైన్ లాంష్కిన్స్‌కి కూడ ఎనిమిది వేల ఫ్లైట్ అవర్స్ అనుభవం వుంది. వాటిలో 3,500 గంటలు బోయింగ్ 737వే. అదే రోజు ఆ విమానం హోనలూలు, హీలోలకి మూడు ట్రిప్పులు పూర్తి చేసింది.
ఆ విమానంలో 90 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. మధ్యా హ్నం ఒకటి ఇరవై ఐదుకి అది గాల్లోకి లేచింది. అది గాల్లోకి ఎగిరిన 23 నిముషాల తర్వాత ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తుకి చేరుకుంది. ఆ అపూర్వ సంఘటన అప్పుడు జరిగింది.
అకస్మాత్తుగా ఏదో పేలిన శబ్దంతో విమాన ప్రవేశద్వారం, కప్పు పైకి లేచి విమానంనుంచి విడిపోయాయి!
మొదటి ఆరు సీట్ల పైభాగం ఎగిరిపోవడమే కాక, 58 ఏళ్ల క్లారా బెల్ లేన్సింగ్ అనే ఏర్ హోస్టెస్ కూడా అక్కడినుంచి మాయమైంది. ఆ సమయంలో ఆమె 5,6 సీట్ల వరస మధ్య నించుని ఉంది. ప్రయాణీకులంతా సీట్ బెల్ట్స్ కట్టుకుని వుండడంతో వారికేం కాలేదు. ఎరిక్ బెక్లిన్ (48) అనే మరో ఏర్ హోస్టెస్ ఆ సమయంలో విమానంలోని వెనక భాగంలో ఉంది. ఎగిరిపోతున్న ఆమెని సీట్లోని ప్రయాణీకులు గట్టిగా పట్టుకుని ఆపారు. పుస్తకాలు, కాగితాలు విమానం అంతటా ఎగిరాయి. విమానంలోని మూడవ వంతు కప్పు లేచిపోయింది.
మధ్యాహ్నం 1.48కి ఈ కప్పు లేచిపోయింది. కాక్‌పిట్ తలుపు కూడా ఎగిరిపోవడంతో తల తిప్పిచూసిన పైలట్‌కి నీలి ఆకాశం కనిపించింది. ఆ సమయంలో కో పైలట్ మేడలైన్ విమానాన్ని నడుపుతోంది. వెంటనే పైలట్ రాబర్ట్ కంట్రోల్స్ తీసుకుని దాన్ని నడిపాడు. విమానాన్ని పదమూడు నిముషాల తర్వాత అతి సమీపంలోని మాయి ద్వీపంలోని కుహులూయి విమానాశ్రయంలో రన్‌వే నంబర్ రెండులో దింపాడు. వెంటనే కో పైలట్ ప్రయాణీకులు కిందకి దిగడానికి సహాయం చేసింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఏర్‌పోర్టులో అకమాయ్ టూర్స్ వారి రెండు బస్సులు ఉన్నాయి. గాయపడ్డ వారిని వాటిలో హాస్పిటల్‌కు తరలించారు. ఆ బస్సు డ్రైవర్లు ఇద్దరూ పేరా మెడిక్స్‌లో శిక్షణ తీసుకున్న వాళ్లవడంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఈ ప్రమాదంలో 65మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గయోల్ ఎమమోటో అనే ప్రయాణీకురాలు విమానం బయలుదేరే ముందు విమానంలోని సీలింగ్ పగులుని, అందులోంచి పడే సూర్యరశ్మిని చూసి కూడా ఎవరికీ చెప్పలేదని తెలిసింది. తర్వాత విమానాన్ని పరీక్షిస్తే ముందే పది బై పది అంగుళాల మేర పగులు ఏర్పడిందని, విమానం పైకి వెళ్లాక గంటకి 700 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుండడంతో గాలి వేగానికి పై కప్పుఆ మేరకి లేచిపోయిందని కనుక్కున్నారు. ఆ రంధ్రం వైపు లేన్సింగ్ పీల్చబడి, తాత్కాలికంగా రంధ్రం మూయబడింది. కొద్దిసేపటికి లేన్సింగ్ బయటికి వెళ్లిపోగానే 18 అడుగుల మేర పై కప్పు లేచిపోయింది. గాలిలోని తేమవల్ల, సముద్రపు ఉప్పు గాలి వల్ల ఇలా జరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేసారు.
బయటికి ఈడ్చబడ్డ ఫ్లయిట్ అటెండెంట్ లేన్సింగ్ ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఆమె శరీరం దొరకలేదు. అది జరిగినప్పుడు విమానం సముద్రం మీద ఎక్కడ ఎగురుతోందో అక్కడ లేన్సింగ్ శరీరం కోసం వెదికినా ఉపయోగం లేకపోయింది. ఆ విమానం ఇక రిపేర్‌కి కూడా పనికిరాకుండాపోయింది.
ఆ తర్వాత బోయింగ్ కంపెనీ మరోసారి ఇలా జరగకుండా సాంకేతికంగా విమాన నిర్మాణాన్ని అభివృద్ధి చేసింది. రూఫ్ జాయింట్స్ దగ్గర రేకులకి 0.36 అంగుళం మందాన్ని పెంచింది.
విమాన ప్రమాదాల్లో టాప్ టెన్ సంఘటనల్లో ఇదొకటి. దీని ఆధారంగా హాలీవుడ్‌లో ఓ సినిమా కూడా వచ్చింది.

No comments:

Post a Comment