అ)మృత భాషలు
- 17/08/2014 |
- పద్మజ
భాషలని భవిష్యత్ తరాల కోసం భద్రపరచడానికి కృషి చేస్తున్న ఇండియానా యూనివర్సిటీకి చెందిన డేనియల్ అనే ఆంత్రోపాలజిస్ట్ వేళ్లమీద లెక్కపెట్టదగ్గ మంది మాట్లాడే భాషలు ప్రపంచంలో ఆరు మాత్రమే ఉన్నాయని చెప్తున్నాడు.
వాటిలో ఒకటి అయపానికో. అది మెక్సికోలోని అయపా అనే గ్రామ ప్రజలు మాత్రమే మాట్లాడే భాష!
స్పానిష్ వారు మెక్సికోను జయించి కొంతకాలం పరిపాలించాక వారు పాఠశాలల్లో స్పానిష్ భాషని తప్పనిసరి చేయడంతో ఆ భాష వస్తే కాని ఉద్యోగాలు లభించని పరిస్థితి ఏర్పడింది. క్రమేపీ స్థానిక భాషలు మాయమై మెక్సికో అంతటా నేడు స్పానిష్ భాషనే మాట్లాడుతున్నారు. పట్టణీకరణ వల్ల పెరిగిన వలసల కారణంగా స్థానిక భాషలని మాట్లాడడం తగ్గిపోయింది. అతి కొద్దిమంది వృద్ధులకు మాత్రమే తమ స్థానిక భాష వచ్చు.
కానీ అయపా గ్రామ ప్రజలు మాత్రం తమ మాతృభాషైన అయపానికో భాషమీద ప్రేమతో దాన్ని ఇళ్లల్లో మాట్లాడడం కొనసాగిస్తుండడంతో అదింకా జీవించే ఉంది.
మెక్సికోలో 68 స్థానిక భాషలుండేవి. అవి మళ్లీ 364 మాండలికాల్లో ఉండేవి. అయపా గ్రామంలో 1970లలో 75 కుటుంబాలు నివసించేవి. వారు మాత్రమే ఈ భాషని మాట్లాడగలిగేవారు. క్రమేపీ చాలా కుటుంబాలు భృతి కోసం ఆ గ్రామాన్ని వదిలి వలస వెళ్లిపోయారు.
నేషనల్ ఇండిజినస్ లాంగ్వేజ్ ఇనిస్టిట్యూట్ అనే మెక్సికన్ సంస్థ తమ స్థానిక భాషలు మృతి చెందకుండా కాపాడే ప్రయత్నం చేసినప్పుడు అయపాలో కేవలం రెండు కుటుంబాలకి చెందిన ఇద్దరు మనుషులు మాత్రమే ఆ భాషని మాట్లాడేవారు జీవించి ఉండడం గమనించారు. ఒకతను మేన్యువల్ సెగోవియా. వయసు 75. రెండో వ్యక్తి పేరు ఇసిడ్రో వెలాజుక్వెట్.వయసు 69. దక్షిణ మెక్సికోలోని తబాస్కో జిల్లాలో అయపాలో వీళ్లిద్దరి ఇళ్లు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి.
ఐతే అయపానికో భాషకి డిక్షనరీని తయారుచేసే ప్రయత్నం ఆరంభించినపుడు వారిద్దరు ఒకరితో మరొకరు మాట్లాడుకోరని తెలిసింది! సెగోవియా తన భార్య, కొడుకులతో తన మాతృభాషలోనే మాట్లాడేవాడు. వారిద్దరు గతించాక ఇక అతనికి తమ గ్రామంలో తన భాష మాట్లాడడానికి ఇసిడ్రో తప్ప మరొకరు మిగిలి లేరు. ఇసిడ్రోకూడా పదేళ్ల క్రితం దాకా జీవించి వున్న తన సోదరుడితో మాతృభాష మాట్లాడేవాడు. వీరిమధ్య గల పొట్లాటవల్ల ఒకరితో మరొకరు మాట్లాడడం ఆపేయడంతో ఇద్దరూ వౌనం వహించారని తెలిసింది. వారిమధ్య రాజీకి ఎంత ప్రయత్నించినా అది కుదరలేదు. వారు జీవించి వుండగానే తమ మాతృభాషని ఇతరులకి బోధించేందుకు వారి చేత తరగతులని నిర్వహింపచేసారు. ఆ భాషలో ఉచ్ఛారణకి ప్రాముఖ్యత ఉంది. అంటే ఉచ్ఛారణని బట్టి పదం అర్ధవంతం అవుతుంది. (చైనీస్ భాష కూడా అంతే) సరైన ఉచ్ఛారణ లేకపోతే అర్ధం మారిపోతుంది. కాబట్టి పదంతో పాటు ఉచ్ఛారణని కూడా డిక్షనరీలో పొందుపరచాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రపంచంలో అతి తక్కువమంది మాట్లాడే భాషలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాయవ్య రష్యాలోని టెర్సమీ అనే భాషని 1930లలో 450 మంది మాట్లాడేవారు. దానికి డిక్షనరీని తయారు చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం కేవలం ఇద్దరు వృద్ధులే దాన్ని మాట్లాడుతున్నారని తెలిసింది. అలాగే ఆస్ట్రేలియాలోని మార్నింగ్టన్ ద్వీపంలో కేవలం నలుగురు స్థానిక ఆటవికులు మాత్రమే కెయార్ డిల్డ్ అనే భాషని మాట్లాడతారు. దానికీ డిక్షనరీని తయారుచేసారు. వేళ్లమీద లెక్కపెట్టదగ్గ మంది మాట్లాడే మరి కొన్ని ఇతర భాషలు, ఇండోనేషియాలోని కలిమంతన్ అనే ప్రాంతంలో వెంగెలు అనే భాష. దీన్ని నలుగురు మాత్రమే మాట్లాడతారు. మబైర్ అనే భాషని ఔలెక్ అనే గ్రామంలోని కేవలం ముగ్గురు మాత్రమే మాట్లాడుతున్నారు. అర్జెంటీనాలోని పటగోనియా అనే ప్రాంతంలో టెహుఎల్బీ అనే భాషని నలుగురుమాత్రమే మాట్లాడగలరు.
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే పది భాషలు. వంద కోట్లమందికి పైగా మాండరిస్, 51 కోట్ల మందికి పైగా ఇంగ్లీష్, 49 కోట్ల 70 లక్షల మంది హిందీ, 39 కోట్ల 20 లక్షల మంది స్పానిష్, 27 కోట్ల 70 లక్షలమంది రష్యన్, 24 కోట్ల 60 లక్షలమంది అరబిక్, 21 కోట్ల 10 లక్షలమంది బెంగాలీ, 10 లక్షలమంది పోర్చుగీస్, 15 కోట్ల 90 లక్షల మంది మలై ఇండోనేసియాలని, 12 కోట్ల 90 లక్షలమంది ఫ్రెంచ్ భాషని మాట్లాడుతున్నారు. ప్రపంచ భాషల్లోని ఒక్కో భాషని సగటున 4,500 మంది మాట్లాడుతున్నారు. ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, డచ్‌వారు ప్రపంచంలోని అనేక దేశాలని పాలించడంతో ఆయా దేశాల్లో ఆ భాషలు పాతుకుపోయాయి.
విదేశస్తులు ఓ దేశాన్ని ఆక్రమించుకున్నాక వారి దేశ భాషే అధికార భాషగా మారి స్థానిక భాషల క్రమంగా కనుమరుగవుతాయని చరిత్ర చెప్తోంది. అమెరికాలోని రెడ్ ఇండియన్స్ భాషలు 300 కూడా దాదాపుగా అంతరించిపోయాయి. ఒక దేశంలోనే అనేక భాషలు, మాండలికాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి చైనీస్ భాషలో కెంటోనీస్, హక్కా, షాంఘైనీ మొదలైన వెయ్యి మాండలికాలు ఉన్నాయి. హిందూస్తానీ భాషలోని మాండలికాలు ఉర్దు, హిందీలు. *
No comments:
Post a Comment