Wednesday 1 October 2014

Suputri - Telugu short stories

సుపుత్రి ( కథ)

ఈ రోజు తన స్నేహితురాలు రేఖ రాకపోవడం వల్ల ఒంటరిగా తినాల్సి వస్తోందని అనుకుంటూ, టిఫిన్ బాక్స్‌లో తను తెచ్చుకున్న రెండు చపాతీలు తినేసి మంచినీళ్లు తాగి అలాగే దిగులుగా కూర్చుంది సుకన్య. ఏదో బాధ ఆమె మనసును తొలిచేస్తుంటే- అప్రయత్నంగా ఆమె కంటి కొలకుల్లో రెండు కన్నీటి బిందువులు నిలిచాయి.
రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన చేదు జ్ఞాపకంలా ఆమె మనసులో మెదిలింది. పదిహను రోజుల క్రితమే పెద్ద కూతురు విద్య పురిటికని వచ్చింది. వారం రోజుల్లో ఓ మంచి రోజు చూసి ఆమె అత్తగారి కుటుంబ సభ్యులను, ఇతర బంధువులను ఆహ్వానించి సీమంతం చేయాల్సి ఉంది. అదిగో.. ఆ ఏర్పాట లకోసమని డబ్బు అడిగితేనే భర్తతో గొడవ అయింది. ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ పెట్టవద్దనీ, అసలు పురుడు పోసి పంపించడమే చాలా ఎక్కువనీ గట్టిగా చెప్పి తాను నచ్చచెప్పబోతే విదిలించేయడమే కాకుండా, డబ్బు విలువ తెలియని దానినని తనను గట్టిగా తిట్టి వెళ్లిపోయాడు. ఆ రోజునుంచీ తన మనసు ఏమీ బావుండడం లేదు. గండం ఎలా గట్టెక్కుతుందో తెలియదు. ఏనాడూ తన మీద అరవని భర్త అంత గట్టిగా అరవడం సుకన్యను షాక్‌కి గురి చేసింది. అదృష్టం ఏమిటంటే- ఘర్షణ జరిగిన సమయంలో విద్య ఏసీ బెడ్‌రూమ్‌లో నిద్రపోతూ ఉండడం.
తనకి ఇంకా ఐదేళ్లు సర్వీసుంది. భర్త వ్యాపారం నాలుగేళ్లుగా అంత ఆశాజనకంగా వుండకపోవడం వల్ల తనది ప్రభుత్వోద్యోగం కావడం వల్ల సుకన్య అన్ని రకాల రుణ సదుపాయాలను వినియోగించుకున్నది ఇప్పటికే. నాలుగు నెలల క్రితమే చిన్నకూతురు కావ్యకు వివాహం చేశారు. ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టిన ప్రణీత్ ఇంటర్ చదువుతున్నాడు. వాడి చదువు అయ్యేదాకా తను ఉద్యోగం చేయాల్సిందే. సుకన్యకు ఈ గానుగెద్దు జీవితం చాలా విసుగ్గా ఉంటున్నది. ఉదయం లేచింది మొదలు క్షణం తీరికలేని ఇంటి పనులు.. ఆపై ఉద్యోగ బాధ్యతలు... దాంతో పాటు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని తేలికగా తీసుకోవడం, అవి కోతిపుండు బ్రహ్మరాక్షసి చందాన పెద్దవి కావడం. అలాంటి సమస్యే తనకు కొత్తగా వచ్చిన మోకాలి నొప్పులు. ఎంత బాధపడుతున్నా ఎక్కువ కాలం సెలవు దొరక్కపోవడంతో ఓ మూడు నెలల పాటు ఫిజియోథెరపీ తీసుకుంటూ, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సుకన్య పెయిన్ కిల్లర్స్‌తో బాధను అణచివేస్తూ తిరుగుతోంది. ఉద్యోగానికి రాజీనామా చేద్దామంటే తీరని బాధ్యతలు, భర్త నుంచి చాలీచాలని ఆదాయం అందుకు సహకరించడం లేదు. లంచ్ టైమ్ పూర్తి కావడం వలన ఆలోచనలలోంచి తేరుకుని ఓ నిట్టూర్పు విడిచి లేచి తన సీట్‌లోకి వచ్చేసింది సుకన్య.
* * *
బిజినెస్ పనిమీద ముంబయి వెళ్లిన రాజేంద్ర మనసు కూడా అల్లకల్లోలంగానే ఉంది. ఎన్నడూ లేనిది భార్యను కసురుకున్నాడు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నా సరే- పిల్లలకోసం, కుటుంబం కోసం రాజీనామాను ఉపసంహరించుకునే తన శ్రీమతిని చూస్తుంటే- తనమీద, తన నిస్సహాయత మీద కోపం రెండూ ఒకేసారి వచ్చేస్తూ వుంటాయి తనకు.
విద్య పుట్టింటికి రాగానే అప్పుకోసం బయలుదేరాడు. కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు. చిన్నదాని పెళ్లికి దాచిన సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోయాయి. పిల్లవాడు ఇంకా చేతికి అందిరాలేదు. పైగా ఇంకా వాడి చదువుకు లక్షలు కావాలి. అందుకే సీమంతం గురించి సుకన్య ప్రస్తావించగానే అసహాయతతో ఆమెమీద అరిచేశాడు తను. పైగా తిట్టాడు కూడా. ఏ సమస్య వచ్చినా తన స్నేహితురాలై, జీవన సహచరియై దాన్ని ముడివిప్పే తన ప్రియసతి మీద కోపం తెచ్చుకున్నాడు మొట్టమొదటిసారిగా. పశ్చాత్తాపంతో, బాధతో మూ ల్గింది అతని మనసు.
* * *
అఫీషియల్ మెయిల్స్ చెక్ చేసుకుంటున్న సుకన్య, వాటికి జవాబులు పంపించిన తరువాత కాస్త ఖాళీ సమయం దొరకడంతో చిన్న కూతురు ఏమైనా లెటర్ రాసిందేమోనని తన పర్సనల్ మెయిల్ తెరిచింది. చిత్రంగా భర్తనుంచి మెయిల్. ఆశ్చర్యాన్ని అణచుకుంటూ గబగబ మెయిల్ తెరిచి చదువుకోసాగింది.
‘‘డియర్ సుకన్యా..
మన పెళ్లి అయి ఇన్నాళ్ల తరువాత అనవసరంగా నీమీద కేకలు వేశాను. నా నిస్సహాయత, నిస్పృహలోంచి వచ్చిన ఆక్రోశం అది. అర్థం చేసుకుంటావు కదూ? ఏది ఏమైనా- నిన్ను అనవసరంగా బాధ పెట్టినందుకు నన్ను క్షమించు సుకన్యా..
ఇప్పుడు నేనొక నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. నువ్వు చాలాసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన నేను ఇప్పుడు గట్టిగా నిశ్చయించుకున్నాను. మన వ్యాపారాన్ని మూసివేయడానికి నిర్ణయించుకున్నాను. మీ అన్నయ్య కంపెనీలో మేనేజర్‌గా చేరడానికి అర్థం లేని అభిమానం, ఇబ్బంది అడ్డు వచ్చి ఆగిపోయాను కదా... ఈరోజే మీ అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పబోతున్నాను. వచ్చేవారం నా పనులన్నీ పూర్తి కాగానే వచ్చి చేరతానని. నాకు ప్రేమించే హక్కు మాత్రమే కాదు, నిన్ను చక్కగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నాపై ఉన్నది కదా... అందుకే ఆరునెలల తరువాత నీ చేత ఉద్యోగం మాన్పించేస్తాను సుకన్యా... చక్కగా వ్యాయామాలు చేస్తూ సరైన సమయానికి మంచి ఆహారం తీసుకుంటూ నీ ఆరోగ్యం బాగు చేసుకుందాము. మనకి పిల్లలనిచ్చిన భగవంతుడే వారి బాధ్యతలు పూర్తయ్యేవరకు మనకి సహాయం చేస్తాడు.
రేపు ఉదయానికల్లా ఇంట్లో ఉంటాను.’’
- నీ రాజేంద్ర
సుకన్య కనుల నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి.
* * *
మర్నాడు ఉదయం భర్త రాగానే ఆనందంగా ఎదురేగింది సుకన్య. అతని చేతిలోంచి బ్రీఫ్ కేసును అందుకుని లోపల పెట్టి వచ్చి అతనికి కాఫీ అందిస్తూ- ‘చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండీ.. అన్నయ్య కంపెనీలో చేరితే వాడికి సహాయంగా ఉండడంతోపాటుగా మన కుటుంబం కూడా ఒడ్డున పడుతుంది. నేను కొన్నాళ్లు సెలవు తీసుకుని ఉద్యోగంలో కొనసాగుతానే తప్ప- మన ప్రణీత్ చదువు అయ్యేవరకు ఉద్యోగం మాత్రం మానునులెండి...’ అంది నవ్వుతూ.
అప్పటివరకు ఆమె ముఖంలోకి చూడాలంటేనే సిగ్గుపడుతున్న రాజేంద్ర అబ్బురంగా ఆమెవైపు చూసాడు. వ్యాకులంగా ఉన్న అతని మనసు చిత్రంగా ఆమె మాటలకు సాంత్వన పొందినట్టయింది. కానీ, తన మనసులోని నిర్ణయాలు ఆమెకు ఎలా తెలిసిపోయాయో మాత్రం అర్థం కాలేదతనికి. అయినా బయటపడకుండా ఒకరకమైన నిశ్చింతతో స్నానం చేసి వచ్చి టిఫిన్‌కి కూర్చున్నాడు.
ఇద్దరూ కలిసి టిఫిన్ తిన్న తరువాత అతనికి ఓ కవర్ అందిస్తూ- ‘ఇందులో యాభై వేలున్నాయి. ఫంక్షన్‌కి ఏర్పాట్లు చూడండి. చిన్నదానికి ఫోన్ చేయండి రమ్మని. వచ్చే ఆదివారం బాగుందట...’ అన్నది సుకన్య.
‘‘సుకన్యా... ఎక్కడివి ఇన్ని డబ్బులు..?’’ చిత్రంగా చూస్తూ అన్నాడు రాజేంద్ర.
‘‘నా బంగారం మీద అప్పు తీసుకున్నాను లెండి... ఆపదలో ఆదుకోని ఆభరణాలు ఎందుకు చెప్పండి? ఆ.. మీరు ఆ పనుల మీద ఉండండి.. మరి నేను ఆఫీసుకు వెళ్లి వస్తాను. విద్యను సాయంత్రం చెకప్‌కి కూడా తీసుకువెళ్లాలి. నీరసంగా వుందని పడుకుంది. లేచాక దానికి కాస్త టిఫిన్ పెట్టి మందులు వేసుకునేలా చూడండి.. సరేనా? మరి వెళ్లిరానా? అంటూ బయలుదేరబోతున్న భార్యను చూస్తుంటే- అతని మనసు తీరని భావోద్వేగాలకు లోనైంది. దాన్ని కప్పిపుచ్చుకుంటూ- ‘‘సుకన్యా.. ఒక్క నిముషం’’ అని భార్యను చేతులలోకి తీసుకుని నుదుటిపై చుంబించాడు. అతని కంటిలోని చెమ్మను గ్రహించిన సుకన్య ఆర్ధ్రంగా ‘‘ఏమిటిది రాజా.. చిన్నపిల్లాడిలా? తప్పుకదూ?’’ అని సున్నితంగా అతడ్ని విడిపించుకుని, తన కంటి నీరు అతనికి కనపడకుండా బయటికి నడిచింది.
ఇంతలో మొబైల్ మోగడంతో జేబులోంచి తీసి ఆన్సర్ చేశాడు రాజేంద్ర.
‘‘నాన్నా.. నేనే..’’ అవతలి నుంచి కావ్య గొంతు.
‘‘నిన్న నువ్వు చెప్పినవన్నీ కరక్టేరా చిన్నీ.. నేను మావయ్య కంపెనీలో జాయినవుతానని చెప్పగానే అమ్మ ఎంత సంతోషపడిందనుకున్నావు? ఆ.. వచ్చే ఆదివారమే అక్క సీమంతమటరా.. నువ్వు, అల్లుడు ఆ రోజుకి వచ్చేయండి. సరేనా? అవునూ నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు అమ్మకి ఎలా తెలిసిపోయాయో అర్థం కావడం లేదు. నువ్వు చెప్పనని అన్నావుగా? కలేమైనా వచ్చిందో.. ఏమిటో?’’ అయోమయంగా కూతురుతో అన్నాడు రాజేంద్ర.
కిలకిలా నవ్వింది కావ్య. ‘‘అంతే అయుంటుందిలే నాన్నా... పాపం అమ్మ... తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తమ్ముడెలా ఉన్నాడు? బాగా చదువుకుంటున్నాడా? వాడిని బాగా చూసుకోండి. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటేనే అమ్మకి, నీకు భవిష్యత్తులో చక్కని విశ్రాంతి దొరికేది...సరే నాన్నా... మళ్లీ మాట్లాడుతా...’’ అంటూ కాల్ కట్ చేసింది కావ్య.
హాట్స్ ఆఫ్ టు టెక్నాలజీ.. థాంక్ గాడ్.. అమ్మానాన్నల మధ్యన సయోధ్య కుదిర్చేలా చేసినందుకు. తన లాప్‌టాప్‌లో- తాను తండ్రి పేరున సృష్టించిన మెయిల్ ఐడీని మురిపెంగా చూసుకుని లాగవుట్ అయింది కావ్య. *

No comments:

Post a Comment