Wednesday 1 October 2014

Control your words about your spouse

‘చులకన వ్యాఖ్యల’తో దాంపత్య బంధానికి చేటు


లంచ్ అవర్‌లో డల్‌గా వున్న సరోజతో- ‘ఏంటి మేడం.. డల్‌గా వున్నారు.? పొద్దున్నించి చూస్తున్నాను. మీలో మీరు ఏదో బాధపడుతున్నారు’ అంది మాధవి.
అంతవరకు ఉగ్గపట్టి వున్న సరోజ ఒక్కసారిగా భళ్ళుమంది. ‘‘మావారు నిన్న వూరినుండి వచ్చిన నా ఆడపడుచుల ముందు అవమానించారు. కాఫీలో చాలినంత చక్కెర లేదని ముఖాన చిమ్మినంత చేశాడు. కనీసం వారున్నారనే ఆలోచన కూడా లేకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఆడపడుచుల్లో ఒకరు నా ముఖానే- ‘మొగుడికి కమ్మగా కాఫీ కూడా ఇవ్వడం కూడా రాదా..?’’ అని అంటే, మరో ఆమె- ‘ఉద్యోగం వెలగబెడుతోందిగా, వీడే కాఫీ కమ్మగా చేసి ఆవిడకివ్వాల్సింది’ అనడంతో నాకు తల కొట్టేసినట్లయింది. ఎంత సంపాదించి ఏం ప్రయోజనం? ’’ అంది.
మాధవి నాలుగు ఉపశమనం మాటలు చెప్పగలిగిందే కానీ, సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఆడపడుచుల ముందు తనను చులకన చేసి భర్త మాట్లాడడంతో సరోజ మనసు గాయపడింది.
***
‘‘హాయ్.. లలితా చీరెక్కడ కొన్నావే..? నీకు అదిరిపోయింది..’’ పక్కింటి పావని అడిగింది.
‘‘షాపింగ్ మాల్‌లో కొన్నానే..! పదివేలైంది’’
‘‘ఏమైనా మీ ఆయన బెటరే.. మా ఆయనైతేనా నీ ముఖానికి పదివేల చీర కావాలా? అని నన్ను తీసిపారేస్తాడు’’ పవిత్ర నీరసంగా చెప్పింది.
‘‘ఇది మా ఆయన కొన్నదనుకొన్నారా..? కాదు, మా అమ్మ కొన్నది. అయినా పదివేల చీర కొనిచ్చేంత త్యాగం మా ఆయనలో లేదక్కా.. అసలు పదివేల చీరంటే మా ఆయన గుండాగి చచ్చూరుకుంటాడు. పెళ్లయ్యాక ఆయన డబ్బుతో చీర కొన్న పాపాన పోలేదంటే నమ్మండి...’’ చెప్పింది లలిత.
‘‘మా ఆయనే పరమ పీనాసి అనుకున్నా... మీ వారు కూడా అదే బాపతన్నమాట’’ పావని అందుకుంది. అంతా పకపక నవ్వుకున్నారు. వారు తమ తమ భర్తల గురించి అలా తేలిగ్గా మాట్లాడుకోవడం వింటున్న మిగతా ఆడవాళ్లూ ముసిముసిగా నవ్వుకున్నారు.
‘‘మా ఆయనకంత సీను లేదు’’, ‘‘ఏదో కట్టుకున్న మొగుడు కదాని కాపురం చేస్తున్నా... వట్టి వేస్ట్ ఫెలో..’’ ఇలా తమ భర్తల గురించి కామెంట్ చేసే కొందరు మహిళలు అక్కడక్కడా ఉంటారు.
‘‘దీని ముఖం, దీనికి సరిగ్గా వంట కూడా రాదు. నా ఖర్మకాలి కట్టుకున్నా. ఏ రోజైనా కమ్మగా నాలుగు మెతుకులు తిన్నానా..’’, ‘‘మా ఆవిడ ఒట్టి పల్లెటూరి మొద్దు. ఓ అచ్చటా ముచ్చటా తెలియదు’’, ‘‘అత్త కూతురని వద్దన్నా తగిలించారు. నా ఖర్మ బతుకంతా శివరాత్రి అయింది...’’- అంటూ కొంతమంది భార్యలు తమ భర్తల గురించి ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడుతూ వుంటారు. తమ ఆధిక్యతను చాటుకోవడానికి అంటారో లేక తెలియక అంటారో గానీ ఎదుటివారి ముందు తన జీవిత భాగస్వామిని తక్కువ చేస్తున్నామనే భావన వారిలో వుండదు.
భార్యగానీ, భర్తగానీ తమ ఆధిక్యతను ప్రదర్శించే సమయంలో ఏదో ఒకటి నోరుజారి అనేస్తూ వుంటారు. ఇతరుల వద్ద తమ జీవిత భాగస్వామి గుణగణాల గురించి, బలహీనతల గురించి .. తక్కువ చేసి చెప్పినందువల్ల... ఇతరుల దృష్టిలో.. తన జీవిత భాగస్వామి ఎంత లోకువ అవుతారో అర్థం చేసుకోరు. ఆలుమగలు తమ గౌరవ మర్యాదలను పరస్పరం కాపాడుకోవాలంటే ముం దుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి లోపాలను ఒకరు ఏకాంతంలో సరిదిద్దుకోవాలి. భార్యాభర్తలన్నాక పాలూ నీళ్ళలా కలిసిపోవాలి. ఒకరి లోపాలను మరొకరు ఇతరుల ముందు ఎత్తిచూపడం, తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. ఒక్కోసారి ఇలాంటి మాటలు జీవిత భాగస్వామి మనసుని గాయపరచి, సంసారాల్లో కల్లోలాలు సృష్టించే వీలుంది. చిన్న చిన్న మాటలే చినికి చినికి గాలివానగా మారి, దాంపత్య బంధంలో తుపాన్లు సృష్టించే ప్రమాదం వుంది. భర్తలో కొన్ని విషయాలు నచ్చకపోతే గోరంతలు కొండంతలు చేసి పొరుగువారికి భార్య ఆ విషయాలు చెప్పటం గానీ, అలాగే భార్య గురించి నలుగురిలో వ్యంగ్యంగా భర్త మాట్లాడటం గానీ మంచిది కాదు.

No comments:

Post a Comment