జ్ఞాపకాల నీడలు (కథ)
కాసేపటికి యథాలాపంగా ఆవిడపైకి నా చూపులు తిరిగినయ్. కేరింతలు కొడుతున్న పిల్లల వంక చూస్తూ నవ్వుతోంది. ఆ నవ్వులోనే చిరుగాలికి కదిలి నుదుటిమీద పడ్డ జట్టుని చేత్తో వెనక్కి తోస్తూ పక్కకి తిరిగింది. దాంతో ఒక్క క్షణం ఆమె కళ్ళు నన్ను చూసినయ్. వెంటనే మళ్లీ తల తిప్పుకొని పిల్లల వేపు చూస్తూ కూచుంది. ఆమె చూసిన ఒక్క క్షణంలోనే- వర్షంలో మేఘాల మధ్య మెరిసిన మెరుపులా ఆమెని ఎక్కడో చూసిన మెరుపు జ్ఞాపకం చుట్టుముట్టింది. మళ్లీ ఒకసారి చూశాను. నిజమే... ఆ నవ్వులో, మొహంలో, చూపులో లెక్కలేనితనం.. తనే.. అవును తను మంజిష్టే. నీడల్లోకి జారిపోయిన జ్ఞాపకాలు కాసేపు మనసులో సుళ్లు తిరిగినయ్. వాకిళ్ళకి కట్టిన తోరణాలు చిరుగాలికి సన్నని సవ్వడిగా ఊగినట్టుగా నాలో మంజిష్ట ఆలోచనలు సందడి రేపినయ్.
***
అప్పుడే జూనియర్ కాలేజీలో చేరిన రోజులు. వేరు వేరు స్కూళ్లల్లోంచి వచ్చిన అమ్మాయిలూ, అబ్బాయిలూ... అందరి మొహాల్లో కొత్తబెరుకులూ, బిడియాలూ.. నెల తిరిగేసరికి కలిసిపోయిన పరిచయాలూ, స్నేహాలూ... అల్లర్లూ, పాఠాలు, పరీక్షలు.. మొదటి సంవత్సరం గడిచిపోయింది. సెలవులు ముగిశాక మొదలయిన రెండో సంవత్సరం. అందరిలో- కాలేజీ చదువు తెచ్చిన వేషభాషల్లో మార్పులు, కాస్త కొత్త పోకడలూ, స్టైల్స్... అందరి సంగతి ఏమోగానీ నాలో మాత్రం కొత్త సరిగమలు కోయిల గొంతుకల వసంతం జేగంటలు మోగినయ్ ఆ ఏడు. అదే మంజిష్ట రాక.
కాలేజీ మొదలైన వారం రోజులకి ఫిజిక్స్ క్లాస్ జరుగుతుండగా ‘మే ఐ కమిన్ మాడమ్..’ అన్న గొంతు వినిపించడంతో అందరి తలలూ ఒకేసారి తలుపుకేసి తిరిగినయ్. బాబ్డ్‌హెయిర్, పాంటు, టీషర్ట్‌తో ఒక్కసారి చూస్తే మళ్లీ ఒకసారి చూడాలనిపించే అందం. మొహంలో ఎక్కడా కొత్త అన్న బెరుకు లేదు. తనే మంజిష్ట. అందం కాదేమో! ఆమె చలాకిదనం, నిర్భీతి కావచ్చో... మరేదో తెలీదు కానీ తనపై నాకు ఏదో తెలీని అభిమానం ఏర్పడింది. చిన్న చిన్న పలకరింపులు తనతో. ఇంటర్, డిగ్రీ రెండూ ఒకే చోట కావటాన డిగ్రీ కూడా కలిసి చేసే అవకాశం వచ్చింది. డిగ్రీకొచ్చేసరికి అమ్మాయిల్లోనూ, అబ్బాయిల్లోనూ మానసిక శారీరక మార్పులు. మంజిష్ఠలోనూ సోయగం. దానికితోడు చలాకీతనం. బంగారు నగలకి నగిషీ అద్దిన చమక్కు తనకి.
కాలం తెచ్చే మార్పులు మాత్రం మనిషి చేతిలో ఉండవన్నట్టుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో రఘురాం అనే కుర్రాడు క్లాస్‌లో చేరాడు. ఆజానుబాహువు. అరవిందదళతాయక్షుడు అన్నదానికి ప్రతిరూపంగా ఉన్నాడు. ఎక్సర్‌సైజులు చేసే అలవాటేమో శరీరం అందమైన షేపులో ఉంది. మంజిష్ఠ రూపం, చలాకీతనం అతన్ని ఇష్టపడేట్టు చేసినయ్యో, అతని రూపురేఖలు మంజిష్ఠనాకరించినయ్యో, ఇద్దరూ ఎక్కువగా కలిసి ఉంటుండేవాళ్లు. ప్రేమో, స్నేహమో తెలీదు. ఓసారి సినిమా హాల్లో, మరోసారి షాపింగ్ చేస్తూ కనబడ్డారు.
మనసులో ఎక్కడో ఏదో తెలీని బాధ- తను రఘురాంతో కలిసి ఉన్నప్పుడు. నాతోనూ అప్పుడప్పుడూ బాగానే కబుర్లు చెబుతుండేది. ప్రేమ మాటలెప్పుడూ రాలేదు మా మధ్యలో. బహుశా నాకు మాత్రమే ఆమె మీద ఇష్టం అవటాన కావొచ్చు. ఎందుకో ఒక ఆలోచన వచ్చింది నాలో. తనకి లేకపోతే ఏమిటి నాకు ఉందిగా తనమీద ప్రేమ. అందుకే నా అభిప్రాయం తెలపాలనుకున్నాను. కావాలనే తనని ‘నోట్స్ కావాలి’ అని అడిగి తీసుకొని, నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ రాసి ఆ నోట్స్‌లో పెట్టి ఇచ్చాను. అప్పటికి ఫైనలియర్ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చినయ్.
నాలుగైదు రోజులు ఎదురుచూశాను. నా లెటర్ విషయం ఏమన్నా మాట్లాడుతుందేమోనని. తనేం ఆ ప్రసక్తి తేలేదు. మామూలుగా మాట్లాడింది కలిసినప్పుడల్లా. మనసాగక నేనే ఆ విషయం కదిలించాను తను నాతో ఒంటరిగా ఉన్నప్పుడు. అల్లరిగా నవ్వింది. ‘‘సారీ.. నిన్ను గురించి నేను ఎప్పుడూ ఆ విధంగా ఊహించుకోలేదు’’ అని ఏవో నాలుగు మాటలు మాట్లాడి అక్కడినుంచి వెళ్లిపోయింది. బహుశా తన మనసు రఘురాం మీద ఉందేమో అనుకున్నాను.
బాధ, కష్టం అనిపించినా ఇంక తన ఆలోచనలు నా మనసులోంచి తీసేయడం మంచిదనుకున్నాను నిరాశ, నిస్పృహల్లోనే. పరీక్షలపై ధ్యాసపెట్టాను. డిగ్రీ అయిపోయింది. ఎక్కడివాళ్ళు ఎక్కడెక్కడో చెల్లాచెదురైపోయాం. పీజీలో చేరాను. రఘురాం, మంజిష్ఠ ఒకే యూనివర్సిటీలో చేరారు. మళ్లీ నాకు వాళ్ళెప్పుడూ కనిపించలేదు పీజీ అయ్యేవరకు. పీజీ పూర్తవగానే ఉద్యోగంలో చేరాను.
ఆ రోజు ఆదివారం ఇంట్లో ఉన్నాను. సాయంత్రం వేళ అనుకోని వాన లాగా మంజిష్ఠ మా ఇంటికొచ్చింది. ఒక కార్డు తీసి నా చేతికిచ్చింది. అది తన పెళ్లి శుభలేఖ. పెళ్లికొడుకు స్థానంలో రఘురాం ఫొటో లేదు. అర్థవంతంగా చూశాను. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ స్నేహితుడి ద్వారా విన్నాను. నా భావం కనిపెట్టిందేమో!
‘‘రఘురాంతో పెళ్లికి మావాళ్ళు ఒప్పుకోలేదు. నా పాలసీ తెలుసుగా, ఏదైనా టేకిట్ ఈజీ’’ అంటూనే- వేరే వాళ్ళకీ ఇవ్వాలి కార్డ్సు అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది.
‘‘మరి గంటలు, గంటలు మాట్లాడుకున్నదీ? కలిసి సినిమాలూ, షాపింగులూ?’’ నాలో నేను ఓ నిముషం గొణుక్కున్నాను. తన పెళ్లికి నేను వెళ్లలేదు. ఇది జరిగిన రెండేళ్లకు కాబోలు కంపెనీ పనిపై బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. రాత్రి తొమ్మిది గంటల బస్సుకి బెంగళూరు పోయే బస్సు ఎక్కాను. ఖాళీగా కనిపించిన ఒక సీట్లో కూర్చున్నాను. యథాలాపంగా అటు ఇటు చూస్తున్న నాకు పక్కన కూర్చున్న మనిషి తెలిసిన మొహంలా అనిపించింది. తల తన పక్కనున్నతని భుజంమీద ఆనించి కూర్చొని ఉంది. కచ్చితంగా మంజిష్ఠే. పక్కనున్నది తన భర్తెమో. అతను ‘ఎలా ఉంటాడో’ చూడాలన్న కుతూహలం కలిగి ఆ వైపు కళ్లు తిప్పాను. అప్పుడే కిటికిలోంచి బయట చూస్తున్న అతను నావేపు తల తిప్పాడు. ఆశ్చర్యం.. అతను రఘురాం..!
అతని మొహంలో నవ్వు. మంజిష్ఠని తట్టి లేపి, సీట్లోంచి లేచి కాస్త వంగి నాకు షేక్‌హాండ్ ఇస్తూ ‘బాగున్నావా?’ అన్నాడు. ఆశ్చర్యంలో ఉన్న నేను తేరుకుని ‘ఆ..’ అన్నాను. తిరిగి రఘరాం తన సీట్లో కూర్చున్నాడు. రఘురాం అందరితో సరదాగా మాట్లాడేవాడు క్పా ఏదో ఫీలింగ్‌తో నేనే తనతో అంత పరిచయం పెంచుకోలేదు. అందుకేనేమో ముక్తసరి పలకరింపే మా మధ్య చోటుచేసుకుంది. ఇదంతా చూసినా మంజిష్ఠ కూడా నా వంక చూసి- నేనని తెలిసాక ‘హాయ్ బాగున్నావా?’ అంది నవ్వుతూ, నవ్వి ‘ఆ’ అన్నాను పొడిగా. తనే ఏవో కుశల ప్రశ్నలు సాగించింది కాసేపు. ఆ తర్వాత నేను అడగకుండానే తన వివరాలు చెప్పింది.
‘‘పెళ్లయిన ఏడాదికే నేనూ, ఆయనా విడిపోయాం. ఇద్దరికి కుదరలేదు. మా పేరంట్స్‌కి ఇష్టంలేదు ఇదంతా. విడాకులు తీసుకొని రఘురాం దగ్గరకు వచ్చేసాను. రఘుకి బెంగళూరులో జాబ్. పండక్కి రఘు వాళ్ళింటికి వచ్చి వెళ్లిపోతున్నాం’’.
ఆమె చెబుతుండగానే టిక్కెట్లు పని అయిపోయిందేమో బస్సులో లైట్లు ఆరిపోయినయ్. చీకటి కాగానే తను రఘురాం వైపు తిరిగింది. నేను బస్సు సీట్ వెనక్కి తల ఆనించి నిద్రకుపక్రమించాను.
ఆమె రఘురాం దగ్గరకి వచ్చేసిందా..? పెళ్లిచేసుకొనా లేక..! ఏమో.. అంతటి మనిషిలాగే ఉంది చూస్తుంటే. ఎందుకో ఒక్క క్షణం మనసు బెదిరిపోయింది. ‘ఇటువంటి సమాజపు విలువలు తెలీని మనిషి, చపలచిత్తురాలినా.. నేను కోరుకుంది?’ అన్న ఆలోచన వచ్చి ‘నయం చేసుకున్నాను కాను, ఇరుక్కుపోయేవాడిని’. మంజిష్ఠ మొదటి భర్త గుర్తుకి వచ్చాడు. ఒక్కసారిగా ఉలికిపాటుగా భుజాలు కదిలినయ్. ఆలోచనల్లోనే నిద్రలోకి జారుకున్నాను. ఆ తర్వాత నాకు పెళ్లవ్వడం, పిల్లలూ. వాళ్ల పెళ్లిళ్లూ, వాళ్లకి పిల్లలూ, రిటైర్‌మెంటు మీద పడిన ముదిమి. జీవిత చక్రం ముప్ఫయి అయిదేళ్లు దాదాపు ముందుకు తిరిగింది.
***
అప్పుడు కనిపించిన మంజిష్ఠ మళ్లీ అనుకోని రీతిలో ఇక్కడ కన్పించింది. ఆలోచనల్లోనుంచి బయటపడిన నాకు- తను నన్ను గుర్తుపట్టలేదని అర్థమైంది. ఎలా గుర్తుపడుతుంది నన్ను? చదువుకొనే రోజుల్లో ఒత్తయన గిరిజాల జుట్టుతో, నల్లటి మీస కట్టుతో ఉండేవాడిని. ఇప్పుడు మిగిలింది ‘బట్టతల’, తల చట్టూ తెల్లబడ్డ నాలుగు వెంట్రుకలు. తెల్లబడిన మీసాలెందుకని తీసేసాను. అందుకే ఎలా గుర్తుపడుతుంది ఆమె నన్ను?
నేనే- ‘మంజిష్ఠా...’ అని చిన్నగా పిలిచాను. నా పిలుపుకి నావేపు తిరిగింది. కళ్ళలో నేనెవరో తెలీని అనుమానం, అయోమయంలో ఉండగా- ‘నేను ఫలానా’ అని గుర్తుచేశాను. ఆమె కళ్లలో ఒక్క క్షణం- చదువుకునే రోజుల్లో నేస్తాన్నన్న ఆనందం తొంగిచూసినట్టు అనిపించింది. ‘‘నువ్వా..? ఎంత మారిపోయావ్... నేనూ అంతేననుకో..’’ అంది నవ్వుతూ. ఆ నవ్వులో అలనాటి చక్కదనం ఇంకా అట్లాగే ఉంది.
ఇద్దరిమధ్య కాసేపు ముచ్చట్లు. ‘‘మాకు ఒకడే కొడుకు. వాడికి పెళ్లయి ఒక కొడుకున్నాడు. వాడే వీడు’’ అక్కడే ఉన్న మనవణ్ణి చూపించింది. మళ్ల తనే ‘‘మా వాడికి ఈ ఊరు ట్రాన్స్‌ఫర్ అయింది ఈమధ్యనే. ఇన్నాళ్లూ బెంగళూరులోనే ఉన్నాం’’ అంది.
‘‘మరి రఘురాం..?’’ అని అంటుండగానే- తనే ‘‘రఘురాం రెండేళ్ల క్రితమే మరణించాడు జబ్బు చేసి. నేను కొడుకు దగ్గరకొచ్చేశాను’’ అని చెప్పి ఎందుకో కామ్‌గా కూచుంది. బహుశా రఘురాం గుర్తుకొచ్చాడేమో?
‘‘రఘురాం పోయాడా’’....? నా మనసు కాసేపు బాధతో మెలితిరిగింది. ఎంతయినా కలిసి చదువుకున్నాం కదా!
అలా.. రెండు, మూడు నెలలు గడిచినయ్. అప్పుడప్పుడు పార్క్‌లో నేను కూర్చున్న బెంచిమీద కూర్చుంటుండేది. కొన్నిసార్లు వేరే ఎవరి దగ్గరో, ఒంటరిగానే కూర్చుంటుండేది పార్కుకి మనవణ్ణి తెచ్చి. ఒక రోజు తన మొహం ఎందుకో నీరసంగా కనిపించింది. అదే అడిగాను.
‘‘రెండు మూడు రోజులనుండి ఎందుకో రాత్రిళ్లు జ్వరం వస్తోంది’’.
‘‘డాక్టర్ దగ్గరికి వెళ్లలేదా?’’
‘‘డాక్టర్ దగ్గరికి ఈ రోజు ఉదయం వెళ్లాను. ఏవో టెస్ట్‌లు చేశారు. రిపోర్టులకి సాయంత్రం రమ్మన్నారు. డ్యూటీ నుంచి వస్తూ మావాడు తెస్తానన్నాడు వాటిని.’’
మరుసటి రోజు ఎందుకో తను రాలేదు. దాదాపు రెండు నెలలు గడిచినయ్. కానీ తన జాడ లేదు. ఎందుకో మనసు కీడు శంకించింది. ‘‘ఆమెకు ఏమన్నా...?’’ .. వద్దు, వద్దు, ఆ ఊహే- ఏదో భయం, బాధ.. తెలీని ఫీలింగ్ కలిగించింది. నా ఊహ నిజం కాదని నిరూపిస్తూ రెండు నెలల తర్వాత మనవణ్ణి తీసుకొని పార్కులో కనిపించింది మంజిష్ఠ. సన్నటి ఎర్రంచున్న చిలకపచ్చ కాటన్ చీర, ఎర్ర జాకెట్, నడుస్తుంటే చీర కుచ్చులు అలవోగా అటూ ఇటూ కదులుతున్నాయ్. వయసు దాటినా నాటి సోయగం ఇంకా కాస్త మిగిలే ఉంది.
కోటి రూపాయల లాటరీ తగిలినట్టు, వేయి ఏనుగుల బలం వచ్చినట్టు ఏదో తెలీని రిలీఫ్ నాలో పొంగినట్లయింది.
వచ్చి నా బెంచీ చివర కూర్చున్న తనని అడిగాను. ‘‘ఇన్నాళ్లూ రాలేదు.. ఆరోగ్యం బాగాలేదా...?’’ అని.
‘‘జ్వరం అన్నాను కదా! అది తగ్గింది కానీ, సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటలూ, మందులూ... రెస్టూ... ఇదిగో ఇవాళ మనవడి గోల పడలేక ఇటు తెచ్చాను. ఊరికే ఇంట్లో ఉన్నా బోర్ కొడుతోంది’’ నవ్వుతూనే ఎప్పటి తేలిక మాటల్లోనే సమాధానం చెప్పింది. ఆమెలో ఎక్కడా హార్ట్ ఎటాక్ సంబంధించి ఏ భయమూ, దిగులూ కనిపించలేదు.
మాట్లాడుతుండగానే పార్క్‌లోనే పరిచయమైన ఒకావిడ పిలిస్తే తన దగ్గరకెళ్లిపోయింది. ఎందుకో తనలో మునుపటి చలాకీతనం తగ్గినట్టు అన్పించింది నాకు. తను వెళ్లినా ఆమె ఆలోచనలే నాలో మెదిలినయ్. మంజిష్ఠకి హార్ట్‌ఎటాక్ వచ్చిందా...? నాకు తెలియకుండానే ఎందుకో నా మనసు కాస్త డీలా పడినట్టు అయింది. మనసులో ఏవో చీకటి పొరలు. కానీ, వెంటనే నా ఆలోచనలు మారినయ్. ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాను..? ఆమె జ్ఞాపకాలు ఎప్పుడో నీడల్లోకి జారిపోయినయ్. తను మళ్లీ కనిపించడంతో ప్రశాంతంగా ఉన్న కొలనులో రాయి విసిరివేసినట్టు, తేనె తుట్టెను కదిలించినట్టూ నాలో ఏవో అసంకల్ప కదలికలు. తనకి ‘హార్ట్ ఎటాక్’ వచ్చిందని అనగానే నా మనసు బెదిరిందో, చెదిరిందో.
ఒకప్పుడు నేను తనని ఇష్టపడింది వాస్తవమే. కానీ, తను నన్ను ఇష్టపడలేదు. రాను రాను తన వైఖరీ నాకు నచ్చలేదు. త్వరగానే ఆమె జ్ఞాపకాలు నా మనసులోని నీడల్లోకి జారిపోయినయ్. ఇపుడు ఎటూ జీవితం పడమటికి నడక మొదలుపెట్టేసింది. నీడల్లోకి జారిపోయిన చేదు జ్ఞాపకాలను మళ్లీ వెలుగులోకి తేవద్దనుకుని ఒక నిర్ణయానికి వచ్చాను- రేపటి నుండి ఈ పార్క్‌కి ఇంక రాకూడదని.
కాకపోతే- తనకి ‘హార్ట్‌ఎటాక్’ మళ్లీ వస్తే.. అన్న ఆలోచన కాస్త నన్ను కదిలిస్తుంది కాబోలు. ఎంతైనా నేను ఒకప్పుడు తనని వలచి వరించాలని అనుకున్న మనిషి కదా! ఎప్పుడైనా తను జ్ఞాపకం వస్తే- ‘తను లేదు కదా ఇంక..’ అన్న చేదు నిజం కన్నా- ‘క్షేమంగానే ఉండే ఉంటుంది’ అన్న ఊహ.. అది నిజమైనా, అబద్ధమైనా మనసుకి అదొక ఊరట.
అంతే... బెంచి మీదనుండి లేచి కాస్త దూరంలో ఆడుకుంటున్న మనవణ్ణి పిలిచి, దూరంగా మాటల్లో ఉన్న మంజిష్ఠ దగ్గరికు వెళ్లాను.
‘‘మంజిష్ఠా.. నేను ఇంటికి బయలుదేరుతున్నా’’ అన్నాను. ఒక్క క్షణం నావైపు చూసిన ఆమె కళ్ళలో అయోమయం- ఇంత దూరం వచ్చి నాకు చెపుతున్నాడేమిటా? అని. వెంటనే - ‘మంచిది’ అని మళ్లీ తన ఎదురుగా ఉన్న ఆవిడతో మాటల్లో పడింది. అదే నిర్లక్ష్య వైఖరి..! మనసులోనే చిన్నగా నవ్వుకొని, మళ్లీ ఒక్క క్షణం ఆమెవేపు చూశాను. బహుశా ఇదే- నేను తనను ఆఖరిసారి చూడటం కావొచ్చు. చూపు తిప్పేసుకొని మనవడి చేయి పట్టుకొని పార్క్ గేటు వేపు అడుగులు వేశాను నా ఇంటికి వెళ్లేందుకు. *
No comments:
Post a Comment