Monday, 29 September 2014

Fat - Liver

అదనపు కొవ్వుతో కాలేయానికి కష్టాలు

కాలేయం మన శరీరంలోని అంతర్గత అవయవాల్లో చాలా కీలకమైన అవయవం. చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఉదాహరణకు శరీరంలోని అదనపు గ్లూకోజ్‌ని గ్లైకోజన్‌గా మార్చుకొని నిల్వ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు గ్లైకోజన్‌ని తిరిగి గ్లూకోజ్‌గా మార్చి శరీరంలోకి విడుదల చేస్తుంది. జీర్ణక్రియలో భాగంగా కొవ్వు, ప్రొటీన్లవంటివి సూక్ష్మాంశాలుగా మారడానికి సహాయపడుతుంది. రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన ప్రొటీన్లను తయారుచేస్తుంది. వివిధ సమస్యల కోసం వాడే మందుల పనితీరును నియంత్రిస్తుంది. మద్యం, విషపదార్థాలు, రసాయనాలు, ప్రమాదకర అంశాలు వంటివి శరీరం నుంచి త్వరితగతిన బహిర్గతమయ్యేలా చేస్తుంది. పైత్యరసాన్ని (బైల్ జ్యూస్) తయారుచేస్తుంది. కాలేయం ద్వారా విడుదలైన పిత్తరసం చిన్నపేగును చేరుకొని ఆహారంలో కొవ్వు పదార్థాలను జీర్ణం చేస్తుంది.
ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎఫ్‌ఎల్‌డి) అంటే?
తేలికపాటి భాషలో చెప్పాలంటే కాలేయపు కణజాలాల్లో కొవ్వు అధికమొత్తాల్లో చేరడాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. కాలేయపు కణ సముదాయాలు (హెపటోసైట్స్) మామూలుగానే కొంత కొవ్వును, కొవ్వుకు సంబంధించిన పదార్థాలను (ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్) కలిగి వుంటాయి. కాలేయంలోని అదనపు కొవ్వు సాధారణంగా కాలేయం నుంచి రక్తప్రవాహంలోకి ప్రవేశించి సర్వశరీరగతంగా వ్యాపించి వుండే కొవ్వు కణ సముదాయాల్లో (ఎడిపోస్ టిష్యూ)లో నిల్వ ఉంటుంది. అయితే ఫ్యాటీ లివర్ వ్యాధిలో అదనపు కొవ్వు శరీరంలోకి వెళ్లకుండా కాలేయపు కణ సముదాయాల్లోనే సంచితమవుతుంది. దీనితో కాలేయపు సామర్థ్యం దెబ్బతిని తదనుగుణమైన సమస్యలు తలెత్తుతాయి. కాలేయపు కణజాలాలు కొవ్వుకు సంబంధించిన పదార్థాలను సమర్థవంతంగా అదుపు చేయలేనపుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
స్థూలకాయం, మధుమేహం, రసాయన పదార్థాలనూ మందులనూ, అధిక మొత్తాల్లో వాడటం (మద్యం, కార్టికోస్టీరాయిడ్స్, టెట్రాసైక్లిన్స్, మెథాట్రేక్సేట్), పోషకాహార లోపం, మాంసకృతులను తగిన మొత్తాల్లో తీసుకోకపోవటం, గర్భధారణ, విటమిన్-ఎని ప్రమాదకర మోతాదులో వాడటం, పేగులమీద శస్త్ర చికిత్స జరగటం, గ్లైకోజన్‌కి సంబంధించిన వంశపారంపర్య వ్యాధి ఉండటం వంటివి అనేకం ఫ్యాటీ లివర్ డిసీజ్‌కి సామాన్య కారణాలు.
కాలేయ వ్యాధులమీద, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వ్యాధిమీద పనిచేసే మూలికలు, ఔషధాలు ఆయుర్వేదంలో అనేకం ఉన్నాయి. వీటి పనితీరుపై ఇటీవల ముమ్మరంగా అధ్యయనాలు జరిగాయి. ఈ వ్యాధితో బాధపడేవారు ఈ అధ్యయన ఫలితాలను, ఆయుర్వేద మూలికల సమర్థతను ఉపయోగించుకోవచ్చు.
వివిధ రూపాలు
ఫ్యాటీలివర్ వ్యాధి వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. వ్యాధి ఏర్పడే విధానాన్ని బట్టి ఈ వ్యాధిని వర్గీకరించారు. ఇన్‌ఫ్లమేషన్ అంశ లేనిది మొదటి రకం. దీనిని హెపాటిక్ స్టియటోసిస్ అంటారు. కాగా ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపు అనే లక్షణం ప్రధానంగా కలిగి ఉండేది రెండవ రకం. దీనిని స్టియటో హెపటైటిస్ అంటారు. ఇది తిరిగి రెండు రకాలు. మద్యాన్ని అధిక మొత్తాల్లో తీసుకోవటంవల్ల వచ్చేది ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్. మద్యం తీసుకోకపోయినప్పటికీ వచ్చేది నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ (ఎన్‌ఎయస్‌హెచ్)
సింపుల్ ఫ్యాటీలివర్
ఈ వ్యాధి భారతీయుల్లో ఇతర కాలేయ వ్యాధులన్నిటికన్నా ఎక్కువగా కనిపిస్తోంది. కొవ్వు ప్రధాన ఆహార పదార్థంగా ఉండే పాశ్చాత్య దేశాల ఆహారపుటలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి భారతీయుల్లో పెరగటం దీనికి కారణం కావచ్చు. కాలేయపు బరువులో 5-10 శాతం కంటే ఎక్కువ బరువును కాలేయపు కణజాలాలు కొవ్వు రూపంలో కలిగి ఉంటే సింపుల్ ఫ్యాటీలివర్‌గా చెబుతారు. సాధారణంగా ఈ వ్యాధి ప్రమాదరహితమైనది. దీనితో తీవ్రమైన అనారోగ్యాలంటూ ఏవీ చోటుచేసుకోవు. ఇతరత్రా సమస్యలు లేనివారిలో ఈ స్థితి కారణంగా ఇబ్బందులు తలెత్తవు. అయితే దీనితోపాటు ఇతర అంశాలు తోడైతే మాత్రం ఈ స్థితి సమస్యాత్మకమవుతుంది.
స్టియటోహెపటైటిస్.. కాలేయంలో అధిక మొత్తాల్లో సంచితమైన కొవ్వు పదార్థం ఇన్‌ఫ్లమేషన్‌ని లేదా వాపును కలిగించటంవల్ల స్టియటోహెపటైటిస్ ప్రాప్తిస్తుంది. ఇది దీర్ఘకాలంపాటు కొనసాగితే కాలేయపు కణజాలం గట్టిపడి సిరోసిస్ ప్రాప్తించే అవకాశం ఉంది. ఇది ప్రమాదభరితమైన స్థితి కనుక ఈ స్థితి ప్రాప్తించేవరకూ ఉపేక్షించకూడదు.
*

No comments:

Post a Comment