Wednesday, 3 December 2014

పాలకులకు పట్టని గురజాడ


ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆది కారకుడు గురజాడ. ప్రపంచమంతా ఎప్పటికైనా ఆధునిక భాషవైపు మొగ్గు చూపక తప్పదన్న చారిత్రకమైన వాస్తవాన్ని ఎరిగినవాడు. తన జీవితకాలమంతా ఒక పూనికతో సర్వతోముఖ ఆధునికత పక్షాన నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి గురజాడ మన మధ్య లేని నూరేళ్ళూ, ఆయన ఆలోచనల ప్రాముఖ్యతను గుర్తించామా? ఈ శతాబ్ది కాలాన్ని కొంత స్వతంత్రం లేకా, తర్వాత స్వతంత్రంలోనూ మనం అశ్రద్ధ, అవిధేయత, అసమర్థతల మధ్యే ప్రధానంగా గడిపామన్నది ఒక కటువైన వాస్తవం. కొన్ని పరిశోధనలూ, కొంత విశే్లషణాత్మక విమర్శ వెలువడినా, దాని కోసం నిష్ణాతులు పనిచేసినా, ఇంకా జరగాల్సింది చాలా ఉన్నదన్నది పచ్చి నిజం. ఎవరో కథలు రాసిన వారిని చూపెట్టి, ఇంకేవో ఘనతలు ఒక రంగంలో సాధించిన వారిని చూపెట్టి, గురజాడను పక్కన పెట్టడం సాధ్యమయ్యే పనికాదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి రెడ్డి పోయె... నాయుడొచ్చె చందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా గురజాడను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. గురజాడ తర్వాత వందేళ్ళకు పుట్టిన కాళోజీ, జయశంకర్ వంటి ధీమంతులకు తెలంగాణ ప్రభుత్వం విశేషించి ఉత్సవాలు జరుపుతుండగా, గురజాడను గత ప్రభుత్వాలు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం.
1903లో తన తెలుగు కథలకు ఏడేళ్ళు ముందే గురజాడ ఆంగ్లంలో ఒక కథ రాశారు. అది ‘స్టూపింగ్ టు రైజ్’. (గురజాడ ఈ పేరు పెట్టడంలో ‘స్టూపింగ్ టు కాంకర్’ పేరిట 1773లో ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన నాటకం గమనానికి వస్తుంది). అప్పటికి ఆంగ్లంలో కథలు రాసిన భారతీయ రచయితలు కొద్దిమందే ఉండొచ్చు. లేదా తొలి తరం భారతీయ ఆంగ్లకథా వికాసకర్తలు అయిన ఆర్.కె.నారాయణ్, రాజారావు, ముల్క్‌రాజ్ ఆనంద్‌ల కన్నా ముందున్నాడనడంలో సందేహం లేదు. ఈ గణాంకాలు ఏవి వెలికితీద్దామన్నా మన వద్ద ఆ కథ మూలం లేదు. దానిని పారేసుకున్న అశ్రద్ధ మనది. అనువాదం చేసిన అవసరాల సూర్యారావు గారు దానిని జాగ్రత్త చేయలేకపోయారు. విశాలాంధ్ర వారి మధ్య, స్టేట్ ఆర్కైవ్స్ శాఖ వారికి చేరేలోపు ఆ కథ ఎక్కడో గల్లంతు అయిపోయింది. పాత కవులవి దొరకలేదు అంటే ఓ అర్థం వుంది. కానీ నూరేళ్ళలోపే జరిగిన ఒక ప్రామాణిక రచనను ఆధారాలు లేకుండా పారేసుకున్న మన అశ్రద్ధ, మరే ఇతర భాషా సమాజానికి ఉంటుందని అనుకోలేం. కన్యాశుల్కం తొలి ముద్రణ ప్రతి సైతం అంతే. ఆరుద్ర దానిగురించి రాయగా రాయగా ఆ పూనికతో బండి గోపాలరెడ్డి (బంగోరె) దానిని మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్యలిఖిత ప్రతుల భాండాగారంలో కూచుని ఆనాడు జిరాక్స్ వెసులుబాటు లేనందువల్ల నకలు రాసుకున్నాడు. దీంతో ఆ రచన అక్కడ వుందన్న సమాచారం మనకు అప్పుడు తెలిసింది. ఒక వెలోరియమ్ ఎడిషన్ కూడా తీసుకురావాల్సిన అవసరాన్ని బంగోరె ప్రస్తావించాడు. ఆ కన్యాశుల్కం ప్రతి జీర్ణావస్థలో వుంటే, దానిని డిజిటల్ కాపీ చేసి భద్రపరిచే జాగ్రత్తలు ఇటీవలే మొజాయిక్ సాహిత్య సంస్థ తీసుకుంది. గురజాడ 150వ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్రలో, విజయవాడలో దానిని 2012లో బహిరంగ ప్రదర్శనకు పెట్టింది. తొమ్మిది గంటల కన్యాశుల్కం నాటకాన్ని ఎవరికి తోచిన కత్తిరింపులతో వారు ప్రదర్శించడం తప్పితే - ఈ నాటకం గురించి ఒక సమ్యక్ అవగాహన, దృష్టి ఈ నూరేళ్ళలో మనం ఏర్పరచుకోలేదు. చక్కని టెలిఫిల్మ్స్‌లా తీయతగ్గ చిత్రపరిశ్రమ మనకున్నా, గురజాడ రెండు కథలు అలాగే ఉన్నాయి. కన్యాశుల్కం సినిమాని 1955లో నిర్మించిన నిర్మాతలు తమకేదో దివ్యమైన హక్కులున్నట్టుగా నాటక ముగింపును మార్చివేశారు. ఇదే పని ఇంకే ప్రపంచ నాటకానికి, సాహిత్య రూపానికి ఆ దేశంలో జరిగితే అక్కడి ప్రజానీకం సహిస్తారా అన్నది సందేహమే. తక్కువ సమయంలో ప్రదర్శితమయ్యే సంపూర్ణ నాటకం గురించి మనకు అసలు ఏ ఆలోచనలూ లేకపోవడమే ఒక శిఖరాయన జడత్వం. యువతరం ఈ దిశలో ఆలోచన చేస్తున్న ఒకే ఒక్క ఆశాకిరణం - ప్రముఖ రచయిత కుమారుడైన అట్టాడ సృజన్ గురజాడ వారి ‘దిద్దుబాటు’ కథను ‘కమిలి’ పేరిట ఒక లఘుచిత్రంగా రూపొందించి ప్రదర్శనలిచ్చాడు. గురజాడ గేయ కథానికలైన పూర్ణమ్మ, కన్యక, లవణరాజు కల, డామస్ పీతియస్ - ఏదీ కూడా మన నాటకాలవాళ్లకీ, రూపకాలవాళ్లకీ, రేడియోవాళ్లకీ, టెలివిజన్ వాళ్లకీ, సినిమావాళ్లకీ, రాష్ట్ర చలనచిత్ర మండళ్ళ దృష్టిలో పడలేదు. ఏవో స్కూల్ వార్షికోత్సవాల్లో పిల్లలు ప్రదర్శనలు ఇచ్చుకోవడం తప్ప, మన సాంస్కృతిక సమాజం వీటి గురించి పెద్దగా చేసిందేమీ లేదు. గురజాడ రాసిన నీలగిరి పాటలు చక్కని సంగీత ప్రదర్శనగా రూపొందించడానికి ఎంతో పనికొస్తాయి. వాటిని పాడే గాయకుడూ కనిపించడు, సంగీత దర్శకుల మాట సరేసరి. షేక్‌స్పియర్, టాల్‌స్టాయ్, గోర్కీ, టాగోర్, శరత్, వల్లథోల్, సుబ్రహ్మణ్య భారతి, ఫకీర్ మోహన్ సేనాపతి వంటి వారి పట్ల ఆయా భాషా సమాజాల స్పందన, మన తెలుగువారి కన్నా మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. అనువాదాల విషయానికొస్తే - అమ్మకానికి అమ్మాయిలు (గర్ల్స్ ఫర్ సేల్) పేరిట వేల్చేరు నారాయణరావు చేసినది అనువాదం కాదు, అపరాధం. ఇంకో జాతిలో అయితే మూల రచనలో ఆయన తీసుకున్న స్వాతంత్య్రానికి, అనువాదకుడు, ప్రచురణకర్తలపై చట్టపరమైన చర్యలు మొదలై వుండేవి. గురజాడ వ్యక్తిత్వం గిరీశంలో ఉందని భావించేవారి సంఖ్య ఎంత ఉన్నా, వాల్మీకి రావణుడిలో ఉన్నాడంటే ఎంత నొచ్చుకుంటామో అటువంటిదే ఈ వదరుబోతుతనం కూడా.
గురజాడ జ్ఞాపకాలను పదిలపరుచుకోవడంలోనూ పాలకులూ, మనం చూపిన, చూపుతున్న అశ్రద్ధ అంతా ఇంతా కాదు. తాను నివసిస్తున్న ఇల్లు తనకు ఎలా వచ్చిందో తన లేఖల్లో వివరంగా రాశారు. పెద్ద దావా సెటిల్ చేయడంతో తన సేవలకు పారితోషికంగా ఇస్తామన్న సొమ్ములో రెండువేలో, పదిహేను వందలో చెల్లుబాటు చేసుకుని ఖాళీ జాగా కూడా ఇస్తే ఇల్లు కట్టుకుంటానని కూడా గురజాడ రాసిన లేఖల్లో వుంది. ఇప్పుడుంటున్న ఇల్లు ఇరుకుగా వుందని, కొత్త ఇంటికోసం నూయి తవ్వించి, ఇంటి నిర్మాణ సామగ్రి కుప్పలు వేసి, కాపలావాడిని పెట్టిన వైనాలన్నీ ఆయన డైరీలో స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకపోవడం వల్ల, గురజాడ కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యల వల్ల ఆయన కట్టుకున్న ఇల్లు ప్రైవేటు వ్యక్తుల పరమై నేలమట్టమై పోయింది. గురజాడ మరణించేవరకూ నివసించిన ఇల్లు ఒకప్పటి గుర్రపుశాల. దానినే కొన్ని దశాబ్దాల కింద అప్పటి ప్రభుత్వం ఒక చిన్న స్మారక మందిరంగా మార్చింది. చెక్క సున్నంతో కట్టిన పాతకాలపు హెరిటేజ్ కట్టడం అది. పక్కనే పెద్దఎత్తున లోతుగా పునాదులు వేసి, వ్యాపారపరమైన నిర్మాణాలు జరిపితే, అది కూలిపోవడం ఖాయం. దీన్ని అడ్డుకునే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్దకానీ, విజయనగరం స్థానిక అధికారుల వద్దకానీ ఉన్నట్టుగా లేవు. అది కూలిపోయిన వార్త కూడా ఈ శతవర్ధంతి వత్సరంలో వింటామేమో. ఇదీ మన సమర్థత!
గతంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుండి మేల్కొని, గురజాడ 150 జయంతి సందర్భంలో ఆయన పేరిట ఐదుకోట్ల నిధి ప్రకటించింది. అందులో, ఆ ఏడాది హడావిడికి ఒక ముప్ఫయి లక్షల కన్నా ఖర్చు అయిన దాఖలాలు లేవు. ఇప్పటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను గౌరవించడమో, ఆ నిధిని ఇంకా పెంచడమో చేస్తే తెలుగు జాతికి సాంస్కృతిక ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. అమ్ముడైపోయిన గురజాడ స్వంత ఇంటి స్థలాన్ని పక్కనే ప్రస్తుతం ఉన్న చిన్న మెమోరియల్‌ను కలిపి ఒక సముచిత స్మృతి కేంద్రంగా విజయనగరంలో నిర్మిస్తే తెలుగు జాతి సంతోషపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి జిల్లా ముఖ్య కేంద్రంలో గురజాడ కళామందిరాలు ఏర్పాటుచేయడం, నాటక సమాజాలకు ఒక సెంట్రల్ హాల్, సాహిత్య సంఘాల సభలకు చిన్న సమావేశ మందిరాలు, ఆధునిక వసతులు కలిగిన గ్రంథాలయం సమకూర్చడం తెలుగు జాతి ఖ్యాతికి దోహదపడే చర్య. కొత్త రాష్ట్రంలో, గురజాడ శతవర్ధంతి వత్సరంలో ‘దృశ్య మాధ్యమాల్లో గురజాడ సాహిత్యం’ అనే దానిపై దృష్టి పెట్టి, కార్యాచరణ రూపొందించి అమలు చేయడం ఎంతైనా అవసరం. ఇప్పుడైనా ఇది మొదలుపెడితే, గురజాడ మనకు దూరమైన ఈ రెండో శతాబ్దిలో, కనీసం, ఒక బాధ్యతాయుతమైన జాతిగా తలెత్తుకు నిలబడగలుగుతాం.

1 comment:

  1. ఇది ఎవరు రాశారు? బాగుంది. Editor@prakasika.org ki raayagalaru. thanks

    ReplyDelete