Tuesday, 12 May 2015

Dyana Yogam - Telugu spirutual


ధ్యానయోగం


పరమాత్మ సాక్షాత్కారం కోసం సాధకులు ఏకాగ్రతతో చిత్తమందు భగవంతుని రూపాన్ని నిల్పుకొని నిరంతరం అర్చించే చర్యనే ధ్యానయోగం అని అంటారు.
ధ్యానయోగానికి పూనుకునేవారికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటుచేయబడ్డాయి. వారు ఆ నియమ నిబంధనలు పాటించినట్లయితేనే ధ్యానయోగం సఫలీకృతమవుతుంది. ధ్యానయోగులు తమ మనసులోకి ఏ భయాన్నీ రానీయరాదు. భయంవల్ల మనస్సు చంచలమై పరమాత్మయందు లగ్నం చేయడం చాలా కష్టమవుతుంది. సర్వవ్యాపి, సర్వరక్షకుడైన భగవంతుడు తనకు అండగా ఉంటాడని విశ్వసించాలి. అలా చేయడంవల్ల భయం వారి దరిచేరదు. అలాగే వారు మరణం విషయమై ఏ మాత్రం దిగులు చెందకూడదు. ధ్యానయోగంలో ఉన్న సమయంలో అనుకోకుండా మరణమే సంభవించినా అది వారికి శ్రేయోదాయకమై మోక్షప్రదమవుతుంది. అందువల్ల ధ్యానయోగులు ఏ విషయానికీ వెరువకుండా ధ్యానయోగం మొదలు పెట్టాలి.
ధ్యానసమయంలో రాగద్వేషాలకూ, సుఖ దుఃఖాలకూ, కామక్రోధాలకూ, ప్రాపంచిక సంకల్ప, వికల్పాలకూ అతీతులై ఉండాలి. ప్రశాంత చిత్తంతో ధ్యానయోగం కొనసాగించాలి.
ధ్యానయోగాలు నిద్ర, సోమరితనం, అలసత్వం, ప్రమాదాది అవరోధాల్ని అధిగమించాలి. సావధాన చిత్తంతో మెలగుతూ ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా ఉండాలి. ఏమరుపాటు కలిగితే మనస్సు, ఇంద్రియాలు పక్కదారి పట్టి ధ్యానానికి ఇబ్బందులు అవుతాయి. ధ్యానయోగ సమయంలో సాధకులు మిక్కిలి యుక్తియుక్తంగా వ్యవహరించడం అలవరచుకోవాలి.
నిలకడ లేని మనస్సును బలవంతంగా నిగ్రహించడానికి ప్రయత్నించినా అది విషయ సుఖాలవైపు పరుగులు తీయడం సహజం. అందువల్ల దృఢ సంకల్పంతో మనసును అదుపులో ఉంచుకోవాలి. బాహ్య విషయాలనుండి మనస్సును మరలించి భగవంతునియందు లగ్నం చేసి ధ్యానయోగం కొనసాగించాలి.
అత్యాధునిక పరిస్థితులు, పరికరాలు మనస్సులను ఆకర్షించి తమవైపు తిప్పుకునేందుకు సర్వదా ప్రయత్నిస్తూనే ఉంటాయి. అట్టి సమయాల్లో తగినంత నిగ్రహాన్ని పాటిస్తూ నియమ నిబంధనలకు నీళ్ళొదలకుండా ధ్యాన యోగాన్ని కొనసాగించాలి.
గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ధ్యానయోగ సాధనా సమయంలో నిర్దేశింపబడిన నియమాలను ఏ మాత్రం ఉల్లంఘించరాదు. మనుస్మృతి మొదలైన శాస్త్రాల్లో ధ్యానయోగ సమయాల్లో బ్రహ్మచర్యం పాటించాలని తెలుపబడింది. ధ్యానయోగ సాధకులు బాహ్య అందాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకుండా అంతఃసౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు కృషిచేయాలి.
ధ్యానయోగ సాధకులు తమ తల్లిదండ్రులనూ, గురువులనూ, పెద్దలనూ గౌరవించాలి. వారి యెడ వినయ విధేయతలతో ప్రవర్తించాలి. ఎవరితోనూ ఎట్టి వివాదాలూ సల్పకుండా వివాద రహితులై ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ నిందింపరాదు. జూదం జోలికి పోరాదు. సాత్త్వికమైన ఆహారానే్న భుజించాలి. సత్యవ్రతులై మెలగాలి. అహింసామార్గవర్తులై ఉండాలి. అరిషడ్వర్గాలను జయించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ ధ్యానయోగంతో మోక్షాన్ని పొందగలగాలి.
ధ్యానయోగులు తమకు ఇష్టమైన దైవ స్వరూపాన్ని చిత్తంలో ప్రతిష్ఠించుకొని ధ్యానం చేయవచ్చు. ‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి’ అన్నట్లుగా ఏ రూపాన్ని పూజించినా, ధ్యానించినా అది పరమాత్మకే చెందుతుంది.
ధ్యానం నిర్గుణ పరబ్రహ్మను కాకుండా సగుణ పరమేశ్వర ధ్యానంగా ఉండాలి.
మత్పరాయణులు అనన్య భావంతో చిత్తాన్ని పరమాత్మ యందే లగ్నం చేసి ధ్యానం చేస్తారు. భగవత్పరాయణులు భగవల్లీలా విలాసాల యందే సంతుష్టులౌతా
రు

No comments:

Post a Comment