Tuesday, 12 May 2015

Boat Museum

భలే భలే బోట్‌ మ్యూజియం

వర్షం కురుస్తుందంటే.... నోటు పుస్తకాల్లోని పేజీలు చిరిగిపోతాయి.. చిరిగిన పేజీలు కాస్త అందమైన పడవల్లా రూపుదిద్దుకుంటాయి. ఇంటి ముందర పారుతున్న నీటిలో ఆ కాగితపు పడవల్ని వదిలితే ఎంచక్కా పోతాయి కదా. అయితే తాతల కాలం నాటి నాటు పడవలను, ఆకట్టుకునే నావలు... ఎన్నెన్నో రకాల ఓడలు అన్నింటిని ఒకేసారి చూడవచ్చు. ఎక్కడంటే మనదేశంలో ఉన్న ఏకైక బోట్‌ మ్యూజియంలో.. ఆ విశేషాలు తెలుసుకుందాం...
ప్రయాణానికి, సరుకుల రవాణాకు, వర్తక, వ్యాపారాల కోసమే కాకుండా, ఇంకా ఎన్నో ఇతర పనుల కోసం అనాదిగా పడవలను వాడుతున్నాం. వేలాది ఏళ్ల నుంచి వాడుతున్న పడవలు, వివిధ ఆకారాల్లోని పడవల నమూనాలు కోల్‌కాతాలోని బోట్‌ మ్యూజియంలో కొలువై ఉన్నాయి. ఈ బోట్‌ మ్యూజియాన్ని 2014 సంవత్సరం, జనవరి నెలలో ప్రారంభించారు. బెంగాళీయులు, ఇతర రాష్ర్టీయులు, వివిధ తెగల ప్రజలు ఎన్నో రకాల నాటు నావలను, పడవలను నిర్మించారు. కానీ వాటిలో చాలా మటుకు ప్రస్తుతం కనిపించవు. అప్పటి కాలంలోనే రేసింగ్‌ బోట్స్‌ తయారుచేశారు. వాటన్నింటి నమూనాలను మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. సముద్రయానంలో బెంగాళ్‌కు సుస్థిర స్థానం ఉంది. ఆ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడటం కోసమే కోల్‌కాతాలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
- హరప్పా నాగరికత ప్రజలు ఉపయోగించిన ప్రాచీన పడవల నమూనాలను నుంచి ప్రస్తుతం ఉపయోగిస్తున్న పడవల వరకు ఎన్నో పడవలను అక్కడ చూడవచ్చు. విదేశాలు చుట్టివచ్చిన పెద్ద పెద్ద నౌకలు నుంచి చిన్న నాటు పడవల వరకు అన్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
- బోట్‌ మ్యూజియంలో సుమారు 46 రకాల పడవలు కొలువుదీరాయి.
- కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాళ్‌ మొదలైన రాష్ట్రాలకు చెందిన ప్రత్యేకమైన పడవ నమూనాలు తయారుచేసి ఇక్కడ ఉంచారు.
- ఇతర దేశాల పడవలను కూడా ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు చరిత్రలో కనుమరుగైన ఎన్నో పడవల నమూనాలను తయారుచేసి అద్దాల గదుల్లో ప్రత్యేకంగా ఉంచారు. ప్రతి పడవ దగ్గర ఆ పడవ ఏ ప్రాంతానిది, ఏ కాలం నాటిది వంటి వివరాలు పొందపర్చారు.
- రేసింగ్‌ పడవల నమూనాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
- దేశ, విదేశాలకు చెందిన రకరకాల పడవల నమూనాలతో కూడిన ఫొటో అల్బమ్‌ను కూడా ప్రదర్శనకు ఉంచారు.
 

No comments:

Post a Comment