|
చెద పట్టిన చెట్టు కొమ్మ పెళుసుగా మారి ఎలా విరిగిపోతుందో గుల్లబారిన ఎముకలు కూడా అంతే తేలికగా విరిగిపోతాయి. ఇలా ఎముకలు బోలుగా తయారయ్యే రుగ్మతే ‘ఆస్టియోపొరోసిస్’. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలను ఎక్కువగా బాధించే ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోగలిగితే ఎముకలు విరిగిపోకుండా కాపాడుకోవచ్చంటున్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డా.జి.శశికాంత్.
మగవారితో పోలిస్తే ఆడవాళ్ల ఎముకలు చిన్నవిగా, పలుచగా ఉంటాయి. మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలలో ఎముకలకు బలాన్నిచ్చే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో ఎముకలు నాణ్యత కోల్పోయి గుల్లబారటం మొదలుపెడతాయి. అవి క్రమంగా బలాన్ని కోల్పోయి పెళుసుగా మారతాయి. దాంతో చిన్న తాకిడికే విరిగిపోతూ ఉంటాయి. అయితే ఆస్టియోపొరోసిస్‌లో రెండు రకాలున్నాయి. మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల ఎముకలు గుల్లబారే సమస్య ‘పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపొరోసిస్’ అయితే 65 - 70 ఏళ్ల వయసుకి చేరుకున్న వృద్ధుల్లో ఎముకలు గుల్లబారే సమస్య ‘సెనైల్ ఆస్టియోపొరోసిస్. అయితే ఈ రెండు రకాల సమస్యలు ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇందుకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే....
- కాల్షియం తగు మోతాదులో శరీరానికి అందకపోవటం.
- వ్యాయామం చేయకపోవటం
- ఎక్కువగా స్టిరాయిడ్స్ వాడటం.
- వంశపారంపర్యంగా సంక్రమించటం.
- థైరాయిడ్ హార్మోన్‌లో అవకతవకలు.
ఆస్టియోపొరోసిస్ అంటే?
ఆస్టియోపొరోసిస్ లక్షణాలు ఆస్టియోపొరోసిస్‌ను ‘సైలెంట్ డిసీస్’ అని అంటూ ఉంటారు. ఎముకలు గుల్లబారటం అనేది శరీరంలో అంతర్గతంగా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ సమస్యను కనిపెట్టటం కష్టం. కాబట్టే ఎముకలు గుల్లబారి విరిగే వరకూ తమకు ఆ సమస్య ఉందని రోగులు కనిపెట్టలేకపోతూ ఉంటారు. అయితే ఈ సమస్య కొన్ని లక్షణాలతో బహిర్గతమవుతూ ఉంటుంది. అవేంటంటే...
- వెన్నుపూసల మధ్య దూరం తగ్గి ఎత్తు తగ్గటం.
- వెన్నెముక వంగిపోవటం.
- వెన్ను నొప్పి
- ఎముకల నొప్పులు
- చిన్న దెబ్బలకే ఎముకలు చిట్లడం, విరగటం
చికిత్సా పద్ధతులు ముందుగానే డెక్సా స్కాన్‌లో ఆస్టియోపొరోసిస్ ఉందని రుజువైన పక్షంలో ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా క్యాల్షియం తీసుకోవటం, వ్యాయామం చేయటం, విటమిన్ డి తీసుకోవటంలాంటివి వైద్యులు సూచిస్తారు. వీటితోపాటు ఎముక క్షీణత తగ్గించే మందులు, ఎముక నాణ్యత పెంచే మందులను కూడా చికిత్సలో భాగంగా తీసుకోవలసి ఉంటుంది. ఆస్టియోపొరోసిస్‌లో ఎముకలు గుల్లబారతాయి కాబట్టి బరువైన వ్యాయామాలు చేయటం ప్రమాదమని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒట్టి అపోహ మాత్రమే! బరువులెత్తే వ్యాయామాలు చేయటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అలాగే నడక, జాగింగ్‌లాంటి వ్యాయామాలు కూడా క్రమం తప్పక చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆస్టియోపొరోసిస్ కారణంగా ఎముకలు చిట్లితే ఇందుకు ప్రత్యేక చికిత్సలున్నాయి. వర్టిబ్రొప్లాస్టీ
గుల్లబారిన ఎముకలు విరిగినప్పుడు సర్జరీ చేసి వాటిని అతికించటం ఒక ఎత్తైతే ఎముక నాణ్యతను పెంచటం మరో ఎత్తు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆస్టియొపొరోసిస్‌కు గురయిన వ్యక్తుల ఎముకలు అతుక్కునే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రుగ్మతతో ఎముకలు విరిగినప్పుడు వాటిని అతికించటంతోపాటు అదే సమయంలో ఎముక నాణ్యత పెంచే చికిత్సను కూడా వైద్యులు మొదలుపెడతారు. దాంతో కొంత ఆలస్యమైనా ఎముకలు చక్కగా అతుక్కోవటంతోపాటు బలంగా కూడా తయారవుతాయి. సాధారణంగా వెన్నెముక, తుంటి, మణికట్టు ఎముకలు ఆస్టియొపొరోసిస్‌కు గురవుతూ ఉంటాయి. అయితే వీటిలో వెన్నెముక ఎముకలే ఎక్కువగా చిట్లుతూ ఉంటాయి. ఇలా చిట్లినప్పుడు బెడ్‌రెస్ట్‌తోపాటు, పెయిన్ కిల్లర్స్, ఎముక బలాన్ని పెంచే మందులు వైద్యులు సూచిస్తారు. అయినా నొప్పి తగ్గకపోతే ‘వర్టిబ్రొప్లాస్టీ’ అనే చికిత్స చేయవలసి ఉంటుంది. ఈ చికిత్సలో ఒత్తుకుపోయిన ఎముకకు చిన్న రంథ్రం చేసి ఎముకను బోన్ సిమెంట్‌తో నింపుతారు. దాంతో ఎముక దృఢంగా తయారవుతుంది. అలాగే మణికట్టు, తుంటి ఎముకలు విరిగినప్పుడు వాటిని అతికించటం కోసం ఉపయోగించే ఇంప్లాంట్స్ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణ వ్యక్తులకు ఉపయోగించే ప్లేట్స్, స్ర్కూల బదులుగా ఆస్టియొపొరోసిస్ పేషెంట్స్‌కు ఎముకల్లో రాడ్స్, లాకింగ్ ప్లేట్స్ అనే ప్రత్యేక ఇంప్లాంట్స్ అమరుస్తారు.
గర్భిణుల్లో ఎముకల బలహీనత ‘ఆస్టియోమలేసియా’...
సాధారణ సీ్త్రలకు రోజుకి 800 నుంచి 1200 మి.గ్రా క్యాల్షియం అవసరమైతే గర్భిణిలకు రోజుకి 12000 మి.గ్రా క్యాల్షియం అవసరమవుతుంది. ఈ మోతాదు తగ్గితే గర్భంలోని పిండం తల్లి నుంచి తనకు కావలసినంత క్యాల్షియం గ్రహించటం వల్ల గర్భిణి ఎముకలు బలహీనపడతాయి. ఈ పరిస్థితినే ఆస్టియోమలేసియా అంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతోపాటు విటమిన్ డి కూడా గర్భిణులు అదనంగా తీసుకుంటూ ఉండాలి.
పురుషుల్లో ఆస్టియోపొరోసిస్..
|
No comments:
Post a Comment