Wednesday, 17 May 2017

కులాంతర వివాహమైతేే... ఆస్తి రాదా?

కులాంతర వివాహమైతేే... ఆస్తి రాదా?
మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నేను పెద్దదాన్ని. 2001లో నాకు పెళ్లైంది. కులాంతర వివాహమది. మాకంటే తక్కువ వర్గంవాడిని చేసుకున్నావంటూ ఇంట్లోవాళ్లు పదిహేడేళ్లుగా రానివ్వడం లేదు. మా ఇద్దరి చెల్లెళ్లని ఒకే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు! మొదట పెద్ద చెల్లినీ, ఆస్తి వేరేవాళ్లకి వెళ్లకూడదనే ఉద్దేశంతో రెండో అమ్మాయినీ ఒకతనికే కట్టబెట్టారు. ఈ విషయం తెలిసి నేను నా ఆస్తి గురించి అడిగితే చెల్లెళ్లూ, అమ్మానాన్నా నన్ను కొట్టినంత పనిచేశారు. నా పెళ్లి కాకముందు నా పేరు మీద ఇల్లూ, స్థలాలూ, చెలక ఉండేవి. ఆ పత్రాలేవీ నాకు ఇవ్వలేదు. కనీసం నా చదువుకి సంబంధించిన సర్టిఫికెట్స్‌ కూడా ఇవ్వకపోతే.. నేనే ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగి తెచ్చుకున్నా. ఇప్పుడు బీఎస్సీ బీఈడీ చదివి ఓ ప్రైవేటు బడిలో ఉద్యోగం చేస్తున్నా. మా ఆయన వైన్‌షాపులో గుమాస్తా. ఆదాయం అంతంతమాత్రం. ఆయనకూ ఈ మధ్య జబ్బు చేసింది. మా అమ్మానాన్నా సంపాదించిన ఆస్తి, ఇదివరకు నాపేరుపై ఉన్న ఆస్తి నాకు దక్కదా?
- ఓ సోదరి
ప్పకుండా దక్కుతుంది. మీ కులాంతర వివాహం ఇందుకో అడ్డంకి కాదు. కాకపోతే మీ నాన్న నుంచి ఈ ఆస్తి మీకు ఎలా వచ్చిందన్నదే కీలకం. నేరుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందా.. తాతల నుంచి దక్కిందా అన్నదీ ప్రధానంగా చూడాలి. ఒకవేళ తల్లిదండ్రుల స్వార్జితం అయితే.. అది మీ పేరుమీద ఏ విధంగా బదిలీ చేశారో పరిశీలించాలి. సాధారణంగా తల్లిదండ్రులు ఆస్తుల్ని తమ పిల్లల పేరుమీద కొంటుంటారు. మీవాళ్లు ఆవిధంగా కొనిఉంటే.. దానిపై మీకు సర్వహక్కులు(అబ్‌సల్యూట్‌ ప్రాపర్టీ అంటారు!) ఉంటాయి. అలాకాకుండా మీకు దానవిక్రయం(గిఫ్ట్‌ డీడ్‌)గా ఇచ్చి ఉంటే మళ్లీ వెనక్కి తీసుకునే హక్కు వాళ్లకి ఉంటుంది. కాబట్టి వాళ్లు ఎలా ఇచ్చారు అన్న విషయం ముందు నిర్ధరించుకోవాలి. వెంటనే మీ వూరిలోని రిజిస్ట్రార్‌ ఆఫీసుకి వెళ్లి మీకు సంబంధించిన ఆస్తి ఎవరిపేరుమీద ఉందో తేల్చుకోండి. ఇందుకోసం ఎన్‌కంబరన్స్‌ సర్టిఫికెట్‌ లేదా నకలు పత్రాలు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. అవి మీ పేరుమీదే ఉంటే.. ఇక మీరు ఆస్తిని న్యాయస్థానం ద్వారా స్వాధీనం (పొసెషన్‌) చేసుకోవచ్చు. ‘అయ్యో! అమ్మానాన్నా, చెల్లెళ్లూ అడ్డుపడతారేమో, దాడికి దిగుతారేమో!’ అని భయపడుతున్నారా? అధైర్యపడకండి. మీ ఆస్తిని మీరు స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఎవరూ అడ్డుపడకుండా, మీపై ఎవ్వరూ దౌర్జన్యం చేయకుండా న్యాయస్థానం నుంచి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకోవచ్చు. కోర్టుల చుట్టూ తిరిగే స్థోమత లేదంటున్నారు కాబట్టి.. మీకు దగ్గర్లోని ఉచిత న్యాయసేవాధికార సంస్థని సంప్రదించండి. మీ వివరాలు చెబుతూ ఓ దరఖాస్తు చేసుకోండి. వాళ్లు దాన్ని పరిశీలించి మీకోసం వాదించడానికి న్యాయవాదిని కేటాయిస్తారు. మీరు న్యాయస్థానం ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ తల్లిదండ్రులపై కేసువేయడం ఇష్టంలేకపోతే.. ప్రీ-లిటిగేషన్‌కి ప్రయత్నించవచ్చు. న్యాయస్థానంలోని కౌన్సెలర్‌లు మీ తల్లిదండ్రులని పిలిచి సమస్యని సుముఖంగా పరిష్కరించేలా చూస్తారు. మీరు ఏది చేయాలన్నా ఆస్తికి తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. మీరు ఆస్తికోసం గత పదహారేళ్లుగా చట్టరీత్యా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. ఈలోపు మీ తల్లిదండ్రులు దాన్నేం చేసుంటారో తెలియదు. ఒకవేళ వాళ్లు ఇంకెవరికో విక్రయించినా దాన్ని కొట్టివేసేలా ‘క్యాన్సలేషన్‌ ఆఫ్‌ సేల్‌ డీడ్‌’ దావా వేయొచ్చు. ఇంతకాలం మీపేరుమీద ఉన్న ఆస్తిని అనుభవించినందుగ్గాను.. ఫలసాయం కోసం వ్యాజ్యం వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలస్యమైంది.. వెంటనే మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి.

No comments:

Post a Comment