Pages

Thursday, 28 August 2014

మరగుజ్జుల గ్రామం

ప్రతీ సమాజంలో మరగుజ్జులు కనిపిస్తుంటారు. వారిని ఏడిపించేవాళ్లు కూడా. పొడుగు మనుషులుండే ప్రపంచంలో పొట్టి మనుషులు అనేక అవమానాలకి, ఎగతాళులకి గురవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతునే ఉంటోంది. పొట్టివాళ్లు తమ పొట్టితనానికి బాధపడడానికి మానసికవేత్తలు ‘ది నెపోలియన్ కాంప్లెక్స్’ అని పేరుపెట్టారు. ఫ్రెంచ్ నియంత నెపోలియన్ బాగా పొట్టివాడు. దాన్ని అధిగమించడానికి అంటే అందరికన్నా ఎత్తుగా ఎదగడానికి అతను నియంతగా మారాడని చరిత్ర చెపుతోంది. దీనికి మరోపేరు ‘షార్ట్‌మేన్ సిండ్రోమ్’.
ఈ కాంప్లెక్స్ లక్షణాలు అరవడం, పెద్దగా మాట్లాడడం. సాంప్రదాయాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం. తమ రంగంలో పైకి రావాలని తీవ్ర ప్రయత్నం చేయడం మొదలైనవి. తద్వారా వారు ఇతరుల చేత గుర్తింపబడతామని అనుకుంటారు. సమాజం మీద వారికి కసి కూడా ఉంటుంది.
చైనాలో ఏకంగా మరగుజ్జులకి ఓ ప్రత్యేక గ్రామం ఉంది. కున్‌మింగ్ అనేచోట గల ఈ గ్రామంలో ఓ పర్వత పాదంలో వీరంతా నివశిస్తున్నారు. ఇక్కడ నేడు 120మంది మరగుజ్జులు జీవిస్తున్నారు. వీరంతా చైనా లోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చారు.
నిజానికి ఇది ఓ వ్యాపార సంస్థ ఆలోచన. యూనన్ బొటాయ్ వెంచర్స్ ఇనె్వస్ట్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ 2006లో కున్‌మింగ్‌కి ఈశాన్యంలో నలభై కిలోమీటర్ల దూరంలో ఓ పెద్ద కొండని ప్రభుత్వంనుంచి అద్దెకు తీసుకుంది. అక్కడ కుక్కగొడుగు ఆకారంలో చిన్న చిన్న ఇళ్లని నిర్మించి, మరగుజ్జులని వాటిలో నివసించడానికి ఆహ్వానించింది. మరగుజ్జు అంటే నాలుగు అడుగుల మూడు అంగుళాల ఎత్తు మించని వారు అనే నియమాన్ని విధించింది. ఇక్కడ మరగుజ్జులే ఉంటారు కాబట్టి పొడుగువారి బాధలు వారికి ఉండవు.
వీరికి నటనలో, వివిధ వినోద కళలలో ఆ వ్యాపార సంస్థ శిక్షణని ఇచ్చింది. 2006 జూలై ఒకటి నుంచి కొండమీద థియేటర్‌లో రోజుకి రెండుసార్లు నాటకాలు ప్రదర్శిస్తున్నారు. పర్యాటకులు వాటిని తిలకిస్తారు. పార్క్‌లాంటి ఈ ప్రదేశానికి పర్యాటకులు రావడానికి తలకి నలభై యువాన్స్‌ని వసూలు చేస్తున్నారు. మరగుజ్జులకి ఒక్కొక్కరికి నెలకి వెయ్యి యునాన్స్ జీతంగా ఇస్తున్నారు. నివాసం, భోజనం ఉచితం. ఇది కున్‌మింగ్ ప్రాంతంలోని యూనివర్సిటీ గ్రాడ్యియేట్ సంపాదనకన్నా అధికం. మరగుజ్జుల వయసు 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నాటకం వేయని సమయంలో వాళ్లు పర్యాటకులకి కాఫీ, ఇతర ఆహార పదార్ధాలు అమ్మే స్టాల్స్‌లో పనిచేస్తారు. ఓ కాఫీ ఖరీదు మూడు అమెరికన్ డాలర్లకి సమానం. అక్కడి పోలీసులు, ఫైర్ బ్రిగేడ్స్ కూడా మరగుజ్జులే. ఇరవై ఏళ్ల జియావో అనే మరగుజ్జు యువతి హర్బన్ అనే ఊరినుంచి ఇక్కడికి వచ్చింది. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడే ఆమె ఆ గ్రామానికి యువరాణిగా ఎన్నిక చేయబడింది. చైనాలోని మరగుజ్జుల పరిస్థితి గురించి జియావో ఇలా చెప్పింది.
‘‘ఇక్కడికి రాక మునుపు చాలామంది ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించారు. ఎందుకంటే మాకు పని దొరకదు. ప్రపంచం మమ్మల్ని వింతగా చూస్తుంది.’’
లిన్‌సెన్ అ మరో మరగుజ్జు యువకుడు ఇలా చెప్పాడు. ‘‘ఇదివరకటి జీవితం కంటే నాకు ఈ గ్రామంలోని జీవితమే బాగుంది. నృత్యంలో, ఇంగ్లీషు భాషలో ఉచిత శిక్షణ లభిస్తోంది. అనేకమందికి నిత్యం వినోదం ఇచ్చే పనివల్ల అది నా పుట్టుకకి ఓ ప్రయోజనాన్ని చేకూర్చుతుందని అనిపిస్తోంది. బయటి ప్రపంచంలో నేను బార్‌లో పనిచేసేవాడిని. చాలామంది నన్ను ఎగతాళి చేయడం కోసం బార్‌కి వస్తుండేవాళ్లు’’.
ఈ పార్క్‌కి వచ్చే పర్యాటకులు మరగుజ్జులని ఎగతాళి చేయరు. పైగా వారి నటనా పటిమని మెచ్చుకుంటారు. పర్యాటకులు వారితో సగటున రెండు గంటలు గడిపి వాళ్లతో ఫోటోలు తీసుకుంటారు. ప్రతీరాత్రి బీర్, కాల్చిన మాంసంతో డిన్నర్ కూడా ఉంటుంది.
మొదట్లో ఈ పార్కుకి మరగుజ్జుల్ని తీసుకురావడం సమస్యగా ఉండేది. వారి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించేవారు కాదు. రీలొకేషన్ ఫీజ్ పేరిట వారి కుటుంబాలకి కొంత డబ్బు ఇస్తే మరగుజ్జులని పంపేవారు. నేడు అక్కడ 120మంది మరగుజ్జులు నివశిస్తున్నారు. వీరి లక్ష్యం వెయ్యిమందిని రప్పించాలని. ఐతే చైనాలోని చాలామంది మరగుజ్జులకి ఈ గ్రామం గురించి తెలియదు.
‘కింగ్‌డమ్ ఆఫ్ ది లిటిల్ పీపుల్’గా పిలవబడే ఈ పార్క్‌లో మరగుజ్జులని దోచుకుంటున్నారని, దాన్ని మానవ జూగా మార్చారని మానవ హక్కులకి చెందిన కొన్ని సంఘాలు విమర్శిస్తున్నాయి. విదేశీ పర్యాటకులు కూడా ఈ పార్క్‌ని సందర్శించడం అధికం అవడంతో పెరిగిన ఆదాయం వల్ల ఈ విమర్శలని ఎవరూ పట్టించుకోవడం లేదు.
1911లో న్యూయార్క్ రాష్ట్రంలోని కోనీ ఐలండ్‌లో డ్రీమ్‌లేండ్ పేర ‘లిల్లిపుటియా’ అంటే మరగుజ్జుల నివాసం కోసం ఓ పార్క్‌ని ఏర్పాటు చేసారు. ఇప్పుడది లేదు. ఆ తర్వాత ప్రపంచంలో ఇప్పుడు చైనాలో ఇది ఒక్కటే ఉంది. విదేశాలనించి కూడా మరగుజ్జులని ఆహ్వానిస్తున్నారు. ఐతే ఇంకా ఎవరూ అక్కడికి చేరుకోలేదు. *

No comments:

Post a Comment