Pages

Thursday, 28 August 2014

విసుగేస్తే ఏం చేయాలి?

  • 20/07/2014
  • |
  • - పద్మజ
ఎక్కడో పుట్టి ఎక్కడో అనామకంగా పెరిగి, హాలీవుడ్‌కి వచ్చి తమ నైపుణ్యంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సెలబ్రిటీలు ఎందరో! అయితే తమ నటనా నైపుణ్యంతో కొందరు/ మరణం ద్వారా వారిలోని కొందరు అనేక పుస్తకాల్లో, వ్యాసాల్లో తరచూ ప్రస్తావించబడుతున్నారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న వారు. మేర్లిన్ మన్రో, జేమ్స్ నీల్, లూజీ గార్డన్, కెరోల్ వేండిస్, బార్బరా బేస్ మొదలైన వారు. ఆత్మహత్య చేసుకుని మరణించారు. ప్రతీ వారి మరణం వెనుక ప్రేమ వైఫల్యం కారణంగా ఉంటోంది. ఈవామే అనే నటి తన ఇరవై రెండో ఏట ఆత్మహత్య చేసుకుంటే, డొరియన్ గ్రే అనే నటి డెబ్బై ఐదో ఏట ఆత్మహత్య చేసుకుంది. వీరందరి ఆత్మహత్యల్లోకి జార్జి శాండర్స్ ఆత్మహత్య అతి విచిత్రమైనది.
జూలై 1906లో బ్రిటీష్ తల్లిదండ్రులకి రష్యాలో పుట్టిన జార్జి హెన్రీ శాండర్స్ వారితోపాటు రష్యా విప్లవం సమయంలో ఇంగ్లండ్‌కి వచ్చేశాడు. అక్కడే కాలేజ్‌లో చదువుకున్నాక అతనికి నటన మీద అభిరుచి కలిగింది. జార్జి అన్నయ్య టామ్ కాన్వీ నటుడు, చెల్లెలు కూడా నటే. అన్నయ్య నాటకాలు చూడడానికి వెళ్లిన శాండర్స్‌కి తనూ నటుడవ్వాలని కోరిక కలిగింది. చదువయ్యాక ఓ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పనిచేసేప్పుడు ఆ కంపెనీ సెక్రటరీ గ్రేర్ గ్రాసన్ అతన్ని నటుడవమని ప్రోత్సహించింది. తర్వాత ఆమె కూడా హాలీవుడ్ నటిగా మారి ఏడు అకాడెమీ అవార్డు నామినేషన్లని పొందింది. ఆమె ప్రోత్సాహంతో 1929లో శాండర్స్ తొలిసారిగా ఓ బ్రిటీష్ సినిమాలో నటించాడు. ఏడేళ్లు అలా అనేక సినిమాల్లో నటించాక అమెరికన్ నిర్మాణసంస్థ ‘లాయ్‌డ్స్ ఆఫ్ లండన్’ అనే చిత్రంలో ఇతనికి వేషం ఇచ్చింది. ఆ తర్వాత శాండర్స్ హాలీవుడ్‌కి వలస వెళ్లిపోయాడు. ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన ‘ఫరిన్ కరస్పాండెంట్’ ‘రెబెకా’ మొదలైన సినిమాల్లో నటించాడు. తన అన్నాచెల్లెళ్లతో కలిసి 1786లో ‘డెట్ ఆఫ్ ఏ స్కాండ్రిల్’ అనే చిత్రంలో నటించాడు. ‘ది పిక్చర్ ఆఫ్ డొనియన్ గ్రే’ సినిమాలోని నటనకు 1950లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డు వచ్చింది. శాండర్స్ తన వృత్తిలో విజయాన్ని సాధించినా, వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలు అనుభవించాడు. ఏ పెళ్లీ విజయవంతం కాలేదు. 1940లో సుజాన్ లార్సన్‌ని పెళ్లి చేసుకుని 1949లో విడాకులు తీసుకున్నాడు. 1956లో హంగేరియన్ నటి, హాలీవుడ్ సెక్స్ బాంబ్ జాజా గేబర్‌ని పెళ్లి చేసుకుని రెండేళ్లలోనే విడాకులు ఇచ్చాడు. 1959లో నటి బెనిట్‌హ్యూంని పెళ్లి చేసుకున్నాడు. 1967లో ఆమె మరణించింది. తన ఆత్మకథకి ‘ఏ డ్రెడ్‌ఫుల్ మేన్’ అనే పేరుని రచయితకి సూచించాడు. కానీ ‘మెమోరీస్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ కాడ్’ పేరుతో అది 1979లో ప్రచురించబడింది. శాండర్స్ ఆఖరి పెళ్లి తన రెండో భార్య అనే్న మగ్దగేబర్‌తో 1970లో జరిగింది. అది కేవలం 32 రోజులు మాత్రమే కొనసాగింది. ఈ వ్యక్తిగత అపజయాలతో శాండర్స్ తాగుబోతు అయ్యాడు. ఓసారి గుండెపోటు వచ్చింది. క్షీణించే తన ఆరోగ్యం వల్ల అతను తరచూ నిరాశకి లోనయ్యేవాడు. ఓ రోజు తన వేళ్లు పియానోని వాయించలేక పోవడంతో దాని మీట బయటికి వచ్చేలా ఆవేశంగా గొడ్డలితో విరగ్గొట్టేశాడు.
స్పెయిన్‌లోని మోజోరో అనే ఊళ్లో గల తను బాగా ఇష్టపడే ఇంటిని అమ్మేశాడు. ఐతే ఆ ఇంటి మీద గల మానసిక బంధంతో తప్పు చేశానని కృంగిపోసాగాడు. శాండర్స్‌లోని డిప్రెషన్ క్రమేపీ అధికం అవసాగింది. ఏప్రిల్ 23, 1972లో అతని జీవితంలోని చీకటి రోజు. స్పెయిన్‌లో బార్సిలోనా సమీపంలోని సముద్రతీరంలో గల కేజిల్ డెఫెల్స్ అనే హోటల్‌లో గది తీసుకున్నాడు. నెంబుమిల్ అనే నిద్ర పాత్రల సీసాలు ఐదు రెండు రోజుల తర్వాత అతని శవం పక్కన ఖాళీగా కనిపించాయి. అతను తన ఆత్మహత్య లేఖలో ఇలా రాశాడు.
ప్రియమైన ప్రపంచమా,
విసుగు వల్ల నేను నిన్ను వదిలి వెళ్తున్నాను. నేను చాలా కాలం జీవించాను. నీ మురికి ప్రపంచంలో, నీ కష్టాలని నీకే వదిలి వెళ్తున్నాను. శుభాకాంక్షలు.
కింద సంతకం చేశాడు. అతని ఆత్మహత్యకి కారణం వింతగా ఉండడంతో దినపత్రికలన్నీ దాన్ని హెడ్‌లైన్స్‌లో ప్రచురించాయి. రష్యాలో పుట్టి, అమెరికాలో డబ్బు, ఖ్యాతి గడించిన శాండర్స్‌కి తన తల్లిదండ్రులతో నివసించిన ఇంగ్లండ్ అంటేనే మమకారం. అందుకని అతని కోరిక ప్రకారం అతని శవాన్ని లండన్‌కి తరలించి అంతిమ సంస్కారాలని అక్కడే జరిపారు. అతని చితాభస్మాన్ని ఇంగ్లీష్ ఛానల్‌లో కలిపారు. ఆశ్చర్యంగా 1932లోనే జార్జి శాండర్స్ స్నేహితుడు, అతను తన అరవై ఐదో ఏట ఆత్మహత్య చేసుకుంటాడని జ్యోతిష్యం చెప్పాడు.

No comments:

Post a Comment