Pages

Thursday, 28 August 2014

కౌలూన్-జన సాంద్రత

1960ల్లో యూరోపియన్ శాస్తజ్ఞ్రులు ఎలుకల మీద ఓ పరిశోధన చేసారు. తక్కువ ప్రదేశంలో ఎక్కువ ఎలుకలుంటే వాటిలో అశాంతి, చిరాకు, కోపం అధికమవుతాయని ఆ పరిశోధనల వల్ల గ్రహించారు. ప్రపంచంలో తక్కువ ప్రదేశంలో ఎక్కువమంది కిక్కిరిసి నివసించే ప్రాంతం ఏది?
హాంకాంగ్‌లోని కౌలూన్ వాల్ట్ సిటీ! ఆరున్నర ఎకరాల ప్రదేశంలో గోడల మధ్య ఏభై వేల మంది నివసించేవారు. వారంతా చైనీస్.
ఒకప్పుడు ఇది చైనీస్ మిలటరీ కోట. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హాంకాంగ్‌ని జపాన్ ఆక్రమించుకున్నప్పుడు అక్కడి జనాభా విపరీతంగా పెరిగింది.
కౌలూన్ జనాభా లెక్కల ప్రకారం 1987లో ఆ ఆరున్నర ఎకరాల్లోని ఇళ్లల్లో ముప్ఫై మూడు వేల మంది నివశిస్తున్నారు. 1992కల్లా అది ఏభై వేలుగా చేరిందని అంచనా. ఇక్కడ వ్యభిచారం, జూదం, మాదక ద్రవ్యాలు ఇతర నేరాలు అధికంగా జరిగేవి.
చైనీస్ ఎంపరర్ కౌలూన్ పీక్ పేరిట దీనికి కౌలూన్ అనే పేరు వచ్చింది. చాలా కాలం ఈ ప్రదేశం అభివృద్ధి చెందలేదు. బ్రిటిష్ వారు దీన్ని పులివేటకి వాడేవారు. 1898లో హాంకాంగ్‌ని తొంభై తొమ్మిదేళ్లపాటు బ్రిటిష్ వాళ్లకి అద్దెకి ఇవ్వడంతో బ్రిటిష్ వాళ్లు దీన్ని బాగా అభివృద్ధి చేసారు. చైనీస్ 1960-70లలో నియమ నిబంధనలని పక్కనపెట్టి ఇష్టం వచ్చినట్టుగా అక్కడి ఇళ్లని నిర్మించుకున్నారు. కౌలూన్‌లో అనేక చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వాధికారులు కౌలూన్ ప్రాంతంలో దాడులు నిర్వహించేవారు కారు. ఇందుకు ఓ కారణం హాంకాంగ్‌లోని రెండు నియోజకవర్గాలు ఇందులోనే ఉన్నాయి. తూర్పు కౌలూన్ ఓ నియోజకవర్గం కిందికి, పశ్చిమ కౌలూన్ మరో నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
హాంకాంగ్ ఏర్‌పోర్ట్ కాయిటక్‌కి సమీపంగా ఇది వుండడంతో విమానాలకి అడ్డంకి కాకూడదని ఈ ప్రాంతంలో ఎత్తయిన భవంతులని అనుమతించలేదు. దాంతో ఈ ప్రాంత మొత్తం మురికివాడగా రూపొందింది. చైనాలో కమ్యూనిజం రాగానే పారిపోయి వచ్చిన వారు ఇక్కడ ఆశ్రయం పొందారు. పశ్చిమ కౌలూన్‌కి సమీపంలోనే ఓడ రేవు వుండడంతో కూలీలుగా పని చేసేవారు ఇక్కడ అధికంగా ఆశ్రయం పొందారు. వీరంతా చదువు సంస్కారం లేని వారే కాబట్టి నాగరికంగా ప్రవర్తించేవాళ్లు తక్కువ. ఇక్కడ ఇంటి పన్నులు తక్కువగా వుండడం కూడా బీదలు ఇక్కడ నివసించడానికి ఓ కారణం. దీనికి రెండు పక్కలా సముద్ర తీరం, ఓ వైపు కొండలు, మరోవైపు విక్టోరియా హార్బర్ ఉండడంతో విస్తరణకి అవకాశం లేకపోయింది. అందుకే శతృదాడికి అనువుగా ఇక్కడ కోటని నిర్మించారు.
ఐతే మూడు అడుగుల వెడల్పు సందులు, ఓపెన్ డ్రైనేజీ, వీధులనిండా చెత్త, ఇంటి బయట చూరుకి అడ్డంగా కట్టబడ్డ నిచ్చెనలు, బాల్కనీలు లేని వారు, బాల్కనీ వున్న వారిని అర్ధించి తమ బట్టలు ఆరేసుకోవాల్సి వచ్చేది. ఎండ కూడా చొరబడని విధంగా ఇళ్ల నిర్మాణం జరిగింది.
పిల్లలంతా ఆడుకోవడానికి ఇళ్ల కప్పుల మీదకి వెళ్తారు. వీరి అరుపులు వంద మీటర్ల దూరంలోని ఏర్‌పోర్టు రన్‌వే మీదకి కూడా వినిపించేవి. పై అంతస్తు అద్దెలు అధికం. కారణం డాబా మీద తాజా గాలి పీల్చుకునేందుకు కొంతసేపు ఏ పడక కుర్చీలోనో విశ్రమించవచ్చు. ఏదైనా ఆరబెట్టుకోవచ్చు. డాబాలమీద పిట్టగోడలు కూడా వుండవు.
ఆ ఏరియాకి పంపబడే పోస్టుమేన్, పోలీసులు, డ్రైనేజ్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ మొదలైనవారు అది శిక్షగా భావించేవారు. అక్కడ అద్దెలు తక్కువ కాబట్టి మాంసం కబేళాలు అనేకం నడిచేవి. వేశ్యాగృహాలు, కేసినోలు, కొకైన్ పార్లర్స్, ఓపియం డెన్స్, కుక్కమాంసం సర్వ్‌చేసే రెస్టారెంట్లు, లైసెన్సు లేకుండా ప్రాక్టీసు చేసే డెంటిస్టులు అక్కడ సర్వసాధారణంగా ఉండేవి.
అక్కడ నివసించేవారి ఆరోగ్య భద్రత అనుమానాస్పదంగా మారడంతో చివరికి 1994లో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని నిశ్చయించింది. చైనీస్, బ్రిటిష్ ప్రభుత్వాల మీద అంతర్జాతీయ వత్తిడి రావడం కూడా ఇందుకు కారణం. దాంతో జనవరి 1987లో హాంకాంగ్ ప్రభుత్వం కౌలూన్ వాల్ట్ సిటీని కూలగొట్టాలని నిర్ణయించింది. అక్కడ నివసించేవారిని తరలించడానికి ఆరేళ్లుపట్టింది. మార్చి 1993లో కూలగొట్టడం ఆరంభించి ఏప్రిల్ 1994కల్లా ఆ పనిని పూర్తి చేసింది. ఆ ప్రదేశంలో డిసెంబర్ 1995లో కౌలూన్ వాల్ట్ సిటీ పార్క్‌ని నిర్మించారు. అలాగే సౌత్ గేట్‌ని కూడా కూల్చకుండా చారిత్రాత్మక అవశేషంగా ఉంచారు. ఇందుకోసం 270 కోట్ల హాంకాంగ్ డాలర్లు ఖర్చయ్యాయి.
నేడు హాంకాంగ్ ప్రజలకి ఆ పార్కు విహార స్థలంగా ఉపయోగిస్తోంది. అక్కడ నివసించినవారు నలభై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హాంకాంగ్‌లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. బ్రిటన్ తిరిగి హాంకాంగ్‌ని చైనాకి అప్పగించక మునుపే ఈ మార్పు జరిగింది. ఇళ్లల్లో కిటికీలు కూడా లేకుండా అంతదాకా నివసించినవారు సౌకర్యవంతమైన కొత్త ఇళ్లకు వెళ్లినందుకు తర్వాత సంతోషించారు. *

No comments:

Post a Comment