Pages

Monday, 15 June 2015

ఉసురు

Posted On Sat 13 Jun 01:38:10.907807 2015
                       ''ముసురు పట్టిన వానలా ముసల్ది ఏడ్చింది ఏడ్చినట్లే ఉంది. దూరంగా కానుగ చెట్టు క్రింద కూర్చుని సీతమ్మోరిలా కంటికి, మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. కారే కంటికి, చీదే ముక్కుకి తెరిపి లేకుండా పోయింది.
రెండ్రోజులుగా ముసల్దానిదిదే తంతు. నేనెంత సముదాయించినా విన్లేదు. ముసల్దాన్ని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు.
క్లాసులోంచి ఏడుస్తున్న ముసల్దాన్ని చూస్తున్నాను. ఏవో ఆలోచన్లు ముసురుకున్నాయి.
పదేళ్ళ నాటి మాట.నేను బడికి వచ్చినప్పటి నుండి ముసల్ది బళ్ళో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడుతుంది. అంతకు ముందు ఎవరెవరో ఉన్నారు గాని ఒక్కళ్ళూ నిలకడగా ఉండి వండింది లేదు.
కూరకెంత? నారకెంత? ఉప్పుకెంత? పప్పు కెంత? గవర్మెంటోళ్ళు పిల్లోనికి ఇస్తున్న దెంత? ఖర్చు లన్ని పోనూ మిగుల్తు న్నదెంత? అంటూ లెక్కలేసుకుని కూలిపాటు కూడా దక్కకపోవడంతో మేం చేయమంటే... మేం చేయం అని ఒక్కొక్కరే మానుకున్నారు.
పిల్లలకు మధ్యాహ్నం పస్తులు తప్పలేదు.కొత్త ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నాపై అధికారుల ఒత్తిడి. ఊర్లో ఎవర్నడిగినా కూలి కెళ్తే మూడొందలి దస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం. అది మాకు గిట్టదు లెండి మాష్టారూ... అంటూ ఎవరూ రానన్నారు.
నాకేం చేయాలో పాలుపోలేదు.సరిగ్గా ఆ పరిస్థితుల్లో ముసల్ది నేనొండిపెడతానంటూ ముందుకొచ్చింది.
''పిల్లలు పస్తులుంటే కడుపు తరుక్కుపోతుంది.
పసిపిల్లలు దేవున్తో సమానం అంటారుగా. దేవుడికి నైవేద్యం పెడ్తా నాకేమొస్తుందని లెక్కలేసుకుంటామా? పసిపిల్లలకు అన్నం వండి పెట్టడం కన్నా మంచి పని ఏముంటుంది? వాళ్ళ ఆకలి తీర్చడం కన్నా పుణ్యం ఏముంటుంది? కడుపుకు పెట్టే దానికాడ లాభనష్టాల లెక్కలేస్కుంటే ఎలా? నేనొండిపెడతానయ్యవారు.''
ముసల్దాని మాటలకు నా సంతోషానికి మేర లేకుండా పోయింది. ఆ క్షణం ముసల్ది నా కంటికి నన్ను, పిల్లల్ని ఆదుకోవడానికొచ్చిన అమ్మవారిలా కన్పించింది. అదుగో అప్పటి నుండి ముసల్దే పిల్లలకు అన్నం వండి పెడుతుంది.
ముసల్ది అని ఊరంతా పిలిచే ముసల్దాని పేరేంటో ఎవరికీ తెలీదు. కాని అందరు ముసల్ది అనే పిలుస్తారు. అసలు ముసల్దానిదీ వూరు కాదు. ఎక్కడో కనిగిరి దగ్గర కొండరాయుడి పల్లె. పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు పుట్టలేదని పెనిమిటి ఇంకో మనువాడితే కోపంతో వాణ్ణి, ఇంటిని వదిలి ముప్పై ఏళ్ళ క్రితం ఈ ఊరొచ్చింది. బడి ప్రక్కనే చిన్న గుడిసె వేసుకొని చిన్నా చితక పన్చేసుకుంటూ బతుకు వెళ్ళదీస్తుంది.
వంట చేయడంలో ముసల్ది నలభీముడికి అమ్మమ్మే! తన హస్తవాసి అలాంటిది. వంట చేసిపెట్టడం ఓ పనిలా ఏనాడు భావించలేదు ముసల్ది. పరమభక్తురాలు భగవంతుడికి భక్తితో నైవేద్యం పెట్టినట్లు పిల్లల పట్ల ప్రేమతో ఇష్టంగా వండి పెట్టేది. లాభ నష్టాల లెక్కల్తో పన్లేకుండా ఎక్కడా రాజీ పడకుండా వండేది. ఇంటి భోజనాన్ని మరిపించేది.
సాంబారు పెడితే ఆ ఘుమఘుమలు బడి మొత్తం ఘుమాయించేవి. పిల్లల బొజ్జల్లో జఠరాగ్ని ఉవ్వెత్తున ఎగసేది. ఆ చేత పులిహోర కలిపితే అది రాములోరి గుళ్ళో ప్రసాదంలానే ఉండేది. అంత రుచిగా వండేది.
మధ్యాహ్నం అయ్యిందంటే చాలు పిల్లలు ఆవురావురుమనేవాళ్ళు. కొసరి కొసరి వడ్డించేది. అప్పుడు చూడాలి. ముసల్దాన్ని నెత్తిన ముగ్గు బుట్ట లాంటి జుట్టు, నుదుట రూపాయి కాసంత బొట్టు, రెండు చేతులా నిండుగా గాజుల్తో సాక్షాత్తూ కాశీలోని అన్నపూర్ణ తల్లిలానే కన్పించేది ముసల్ది.
''తినండ్రా... తినండి... ఒక్క మెతుకు మిగలకుండా ముందు తిన్నోళ్ళు రాజన్నమాట.''తన కడుపున పుట్టిన బిడ్డల్ని బతిమాల్తున్నట్లు బతిమాల్తు పిల్లల చేత తినిపించేది. ఆ చేతి మహత్యమేమోగాని పళ్ళెంలో ఒక్క మెతుకు మిగల్చకుండా తినేవాళ్ళు పిల్లలు. ఆ క్షణం ముసల్ది రాముని ఆకలి తీరుస్తున్న శబరిలానే కన్పించేది. పిల్లలు తింటే ముసల్దాని కడుపు నిండిపోయేది.
ఇంత చేసినా నెల చివర ఖర్చులు, రాబడి చూస్తే ముసల్దానికి మిగిలేది అంతంత మాత్రమే. పాపం కూలీపాటు కూడా మిగల్లేదుగా అంటే 'పోన్లేయ్యా!.... ఒంటి ముండని మిగిల్నా నేనేం చేసుకుంటాను' అనేది.
ఒక్కోసారి ఆ కొద్దిపాటి కూడా మిగలక నష్టం వస్తే 'పసి బిడ్డలకేగా పెట్టింది.. మిగలకపోతే మాన్లే.. పోతూ కట్టుకు పోయేదేముంది' అనేది.పనైపోయినా బడొదిలి ఇంటికెళ్ళేది కాదు ముసల్ది. బళ్ళోనే తిరుగుతూ పిల్లల్తో గడిపేది. తనకు పిల్లలు లేకపోవడం వలన ఏమో గాని ముసల్దానికి పిల్లలంటే అంత ఆపేక్ష. పిల్లలు కూడా ముసల్దంటే అంతే ప్రేమ కనబర్చేవారు.
రోజులుసాఫీగా గడిచిపోతున్నాయి. నాలుగు నెళ్ళ క్రితం రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నారేమో అధికారంలోకి రాగానే ఆ పార్టీ మనుషులకు అడ్డు లేకుండా పోయింది. అన్నీ మాకే కావాలన్నారు. అనుకున్నదే తడవుగా ఊర్లో రేషన్‌ డీలర్‌ నుండి అంగన్‌వాడీ దాకా అప్పటిదాకా ఉన్నవాళ్ళను తీసేసి తమ పార్టీ వాళ్ళకు అప్పగించారు.
ఇప్పుడు గ్రామాల్లో ఇదో ఆనవాయితీగా మారింది.
ఈ క్రమంలో వాళ్ళ కన్ను బళ్ళో మధ్యాహ్న భోజన పథకంపై పడింది. 'మొదట్లోలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పిల్లాడికి బానే ఇస్తోంది. ప్రస్తుత రేట్ల మీద బాగానే గిట్టుబాటవుతుంది. ఏ లాభం లేకపోతే ముసల్ది అన్నేళ్ళుగా ఎలా చేస్తుంది?' అనుకుని ఏజెన్సీని తమ వాళ్ళకు ఇప్పించాలనుకున్నారు.
స్కూలుకొచ్చి నన్ను కలిసి ఏజెన్సీ మార్చాలన్నారు.''ముసల్ది ఏ రాజకీయ పార్టీకి చెందని మనిషి. గిట్టుబాటు కాక వండిపెట్టడానికి ఎవరూ ముందుకు రాక పథకం ఆగిపోయిన పరిస్థితుల్లో పాపం ముసల్దే ముందుకొచ్చి పిల్లలకు అన్నం వండి పెడుతోంది. ఇప్పుడు ముసల్దాన్ని తీయడ మెందుకు?''
నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. విన్లేదు. మార్చాల్సిందేనని పట్టుపట్టారు. అంతటితో ఆగక స్థానిక యం.యల్‌.ఎ. చేత పై అధికారులకు ఫ్యాక్స్‌/ సిఫారసు చేయించారు. ఏజెన్సీ వాళ్ళు చెప్పిన వాళ్ళకిమ్మని అధికారులు నన్నాదేశించారు.
చేసేది లేక మరుసటి రోజు ముసల్దాన్ని పిలిచి విషయం చెప్పాను. ముసల్ది అనిమిష మాత్రంగా నన్నలాగే చూస్తుండి పోయింది.
తేరుకున్న ముసల్ది ''ఇదెక్కడి న్యాయమయ్యా! గిట్టుబాటు కాదని ఒక్కరూ ముందుకు రాకపోతే కష్టమో, నష్టమో ఇన్నాళ్ళుగా వండిపెడుతున్నాను. ఇప్పటిదాకా ఈ పనికి అలవాటు పడ్డాను. ఇప్పుడీ వయసులో ఇంకో పని చేసుకోలేను. తీసేస్తామంటే ఎలా అయ్యవారు? అదీగాక పిల్లల్తో నాకు తెలీకుండా మాలిమయ్యాను... వచ్చే రాబడి మాట అటుంచితే కడుపు తీపి అంటే ఏంటో తెలిసింది... పిల్లల్లేరని నా పెనిమిటి నన్ను కాదన్నా దేవుడు ఇంతమంది పిల్లల్ని నాకిచ్చాడనుకున్నా... పిల్లల్నొదిలి వెళ్ళమంటే నా వల్ల కాదయ్యా'' అంటూ కన్నీటి పర్యంతమైంది.
ముసల్దాన్ని చూడగానే నాకు దుఃఖం తన్నుకొచ్చింది. ఎట్లానో దిగమింగుకున్నాను. కళ్ళలోంచి జారిన కన్నీటి బొట్లను ముసల్దానికి కన్పించకుండా కర్చీఫ్‌తో తుడుచుకున్నా.
''నిన్ను తీయాలని నాకేం లేదు. ఈ విషయంలో నేను నిమిత్తమాత్రుణ్ణి. పైనుంచి ఒత్తిడులు అలా ఉన్నాయి. నన్ను క్షమించు.''
గొంతు గద్గదం కాగా ఎలాగో గొంతు పెగల్చుకుని చెప్పాను.ముసల్ది విన్లేదు. వినకపోగా కోపంగా ''ఎలా తీసేస్తారో... ఎవరొచ్చి తీసేస్తారో నేను చూస్తా. నేను మానేస్తున్నట్లు సంతకం పెట్టకుండా ఇంకోళ్ళకు ఎట్లా ఇస్తారో చూస్తా'' అంటూ కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయింది.
నిజమే! మానేస్తున్నట్లు ముసల్ది సంతకం పెట్టకుండా కొత్తవాళ్ళకు ఏజెన్సీ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదు.
ఇదే విషయం పై అధికార్లకు చెప్పాను.అలా అయితే రేపు ఎంక్వైరి వేసి తీసేద్దాం. వాళ్ళ మనుషుల చేత సరిగా అన్నం వండి పెట్టదడం లేదని, సంతకాలు తీసుకుందాం. ఆనక పాత ఏజెన్సీని మనమే రద్దుచేసి కొత్త ఏజెన్సీ పెడదాం.
అధికార్ల మాటలకు నేను నివ్వెర పోయాను. దారుణమన్పించింది. హత్య కన్నా మహాపాతకమన్పించింది.
ఆఖరి ప్రయత్నంగా ముసల్దానికి నచ్చచెప్పా లనుకున్నా. ''సంతకం పెట్టకపోతే నువ్వు సరిగా వండట్లేదని చెప్పి బలవంతంగా తీసేస్తారు. దానికంటే స్వచ్ఛందంగా తొలగిపోవడమే మర్యాద.'' అని చెప్పాను.
ముసల్ది ససేమిరా అంది. ''నేనెట్లా వండానో తిన్న పసిబిడ్డలకు తెల్సు... చూసిన మీకు తెల్సు. పైన దేవుడనే వాడొకడున్నాడు... నేను సరిగా వండలేదని చెప్పడానికి నోరెలా వస్తుందో చూస్తా'' అంది ముసల్ది.
''అయ్యో! దేవుడనే వాడుంటే ఈ అరాచకాలు జరుగుతాయా!'' అనుకున్నాను.
ముసల్ది ఏడుస్తూనే ఉంది. మధ్యాహ్నానానికి అధికార్లు ఎంక్వైరీకి వచ్చారు.ముసల్ది అధికార్ల కాళ్ళా, వేళ్ళ పడుతూ పరిపరి విధాలుగా బతిమాల్తోంది.
''మీకు దణ్ణం పెడతానయ్యా... నా కడుపు కొట్టమాకండి... ముసల్దాన్ని కనికరించండి... ఈ వయసులో ఇంకో పని చేసుకోలేను... మీ కాళ్ళు పట్టుకుంటా... పిల్లల్నొదిలి నేను బతకలేనయ్యా... పిల్లల నుంచి నన్ను దూరం చేయకండయ్యా...''
ఎవరో చేత్తో గుండెను నులిమినట్లు విలవిలలాడిపోయాను. ఆ దృశ్యాన్ని చూసి అధికార్లు ముసల్దాని మొరనాలకించలేదు.అటెండరు ముసలా ్దన్ని రెక్కపట్టుకుని తీస్కెళ్ళి దూరంగా కూర్చోబెట్టాడు.
ఎంక్వయిరీ మొదలైంది.అన్నం సరిగా వండటం లేదని, సాంబారు నీళ్ళలా ఉంటుందని, గుడ్డు ఇవ్వడం లేదని వాళ్ళు ముసల్దానిపై లేనిపోని ఆరోపణలు చేశారు. సంతకాలు సేకరించి రాతపూర్వకంగా అధికార్లకు అందచేశారు.
అధికార్లు ఆ ఆరోపణలను బహిరంగంగా చదివి విన్పించారు.అవి విన్న ముసల్ది ఖిన్నురాలైంది. చేష్టలుడిగి అలాగే చూస్తుండి పోయింది.
ఆ తరువాత అధికార్లు పాఠశాల కమిటీ ద్వారా పాత ఏజెన్సీని తొలగిస్తూ, కొత్త ఏజెన్సీని నియమిస్తూ సంతకాలు సేకరించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
అంతా క్షణాల్లో జరిగిపోయింది.నేను కొయ్య బొమ్మలా నిల్చుండిపోయి చూస్తున్నాను.నా సంతకం పెట్టమన్నారు. అన్యాయం అంటూ నా అంతరాత్మ గొంతు చించుకు అరుస్తోంది. న్యాయానికి, భయానికి మధ్య క్షణకాలం అంతులేని మానసిక సంఘర్షణ. చివరికి భయమే గెల్చింది. అరవకుండా నా అంతరాత్మ నోరు నొక్కాను. మారు మాట్లాడకుండా సంతకం పెట్టాను. నా సంతకంతో ముసల్దాని బతుకు మీద దెబ్బకొట్టాను.ముసల్దాని వైపు చూశాను. తనిప్పుడు ఏడ్వడంలేదు. గంభీరంగా మారిపోయింది. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. అందర్ని ఒక్కసారి కలియచూసింది.
''నాల్గు మెతుకులు పెడితే కుక్క బతికినంత కాలం విశ్వాసం చూపిస్తుంది. ఇన్నేళ్ళుగా మీ బిడ్డల ఆకలి తీర్చాను. అందుకు నాకు బాగానే చేశారు. మీ అధికారంతో, బలగంతో ఒంటరి ముసల్దాని బతుకు మీద దెబ్బకొట్టారు. ఈ అరాచకం చూడటానికేనా దేవుడు నన్నింకా తీసుకుపోలేదు... మీకు నేనడ్డు రాను... మీరే చేసుకోండి... అంతా మీరే ఏలుకోండి.''
రెండు చేతులు జోడించి అందరికి దణ్ణం పెట్టింది. ఒక్కసారి బడంతా కలియచూసి కౌరవుల మోసానికి ఓడిపోయిన ధర్మరాజులా నెమ్మదిగా నడు చుకుంటూ ముసల్ది అక్కణ్నుంచి నిష్క్రమించింది.
అందరూ వెళ్ళిపోయారు.నా కళ్ళలో ముసల్దే కన్పిస్తోంది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ముసల్ది అమ్మోరికి బలిచ్చిన మేకపోతులా అన్పించింది. అన్యమనస్కంగానే మరిసటి రోజు స్కూలుకొచ్చాను.
ఎవరో వచ్చి చెప్పారు. ముసల్ది రాత్రి దిగుల్తో నిద్దట్లోనే చచ్చిపోయింది.ఓ క్షణం నాకు నోట మాట రాలేదు. కుర్చీలో కుప్పకూలిపోయాను.దుఃఖం లావాలా తన్నుకొచ్చింది. చిన్నపిల్లాడిలా రోదించాను. అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. చాలాసేపటికి గానీ మనిషిని కాలేకపోయాను.
అందరం కల్సి ముసల్దాని ఉసురు తీశామన్పించింది.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ఎవరో నేత టీవీలో గొంతు చించుకుంటున్నాడు. నవ్వొస్తోంది... సిగ్గేస్తోంది... అసహ్యమేస్తోంది.
- జి.ఎస్‌.కె. కరీముల్లా
9966757407.

No comments:

Post a Comment