Pages

Monday, 15 June 2015

అన్నంతో అనేకం

కొత్తిమీర రైస్‌
కావలసిన పదార్థాలు
కొత్తిమీర కట్టలు-3, బియ్యం-అరకిలో
జీలకర్ర, ఆవాలు-రెండు టీ స్పూన్స్‌
పచ్చిమిరపకాయలు-6, అల్లంముక్కలు -1 టేబుల్‌ స్పూన్‌, వేరుశేనగ గుళ్ళు- 1 టేబుల్‌ స్పూన్‌
జీడిపప్పు-1 టేబుల్‌ స్పూన్‌, ఉప్పు- తగినంత
తయారు చేయి విధానం
ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద మూకుడు ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తి మీర వేయించి దానిలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయల ముక్కలు , అల్లం ముక్కలు, వేరుశనగ గుళ్లు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు ,ఉప్పు, వండిపెట్టుకున్న అన్నం వేసి బాగా కలియబెట్టాలి. ఇంకేముంది కొత్తిమీర రైస్‌ రెడీ.

పులగం
కావలసిన పదార్థాలు
బియ్యం-ఒకటిన్నర కప్పు
పెసరపప్పు-అరకప్పు
నెయ్యి- టీ స్పూన్‌
జీలకర్ర- టీ స్పూన్‌
మిరియాలపొడి-పావుటీ స్పూన్‌, ఉప్పు- తగినంత
నీళ్ళు- మూడున్నర కప్పులు
జీడిపప్పు- 10
తయారు చేయు విధానం
బియ్యం, పప్పు కడిగి 20 నిమిషాలు నానబెట్టాలి. గిన్నె లో నెయ్యి వేడయ్యాక జీలకర్ర, మిరియాలు వేసి వేయించాలి, నీళ్ళు పోసి మరుగుతుండగా నానబెట్టిన బియ్యం, పప్పు, ఉప్పు వేసి ఉడికించాలి. అన్నం అయ్యాక జీడిపప్పు పలుకులు వేసి కలపాలి.

కొబ్బరి రైస్‌
కావలసిన పదార్థాలు
కొబ్బరి చిప్పలు-2
బియ్యం-అరకిలో
జీలకర్ర, ఆవాలు- రెండు టీ స్పూన్స్‌, పచ్చిమిరపకాయలు-6
ఎండు మిర్చి- 4 కాయలు
అల్లం ముక్కలు-1 టేబుల్‌ స్పూన్‌, కరివేపాకు-రెండు రెబ్బలు, వేరుశనగ గుళ్ళు- 1 టేబుల్‌ స్పూన్‌, జీడిపప్పు-1 టేబుల్‌ స్పూన్‌, నిమ్మకాయ-1
ఉప్పు-తగినంత
తయారు చేయి విధానం
ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. తరువాత కొబ్బరి చిప్పలను కోరుకోవాలి. ఆ తర్వాత స్టౌమీద మూకుడు ఉంచి నూనె పోసి కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు. ఎండు మిర్చి కలిపి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కోరి ఉంచుకున్న కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అన్నం వేసి దానిలో కొంచెం ఉప్పు కలిపి బాగా కలియబెట్టాలి. దించే ముందు నిమ్మకాయ పిండుకుంటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.

పులిహోర

కావలసిన పదార్థాలు
బియ్యం-అరకిలో
శనగపప్పు-రెండు టీ స్పూన్లు
వేరుశనగ పప్పు-50 గ్రాములు
పసుపు-1 టీ స్పూను
ఆవాలు-1 టీ స్పూను
జీలకర్ర-1 టీ స్పూను
కరివేపాకు-రెండు రెమ్మలు
ఎండు మిరపకాయలు-4
పచ్చి మిరపకాయలు-6
నిమ్మకాయలు-2 (పెద్దవి)
ఉప్పు-తగినంత
నూనె- 4 టీ స్పూన్లు
తయారు చేయి విధానం
ముందుగా అన్నంను కొంచెం పలు కుగా వండి వార్చి ఒక పళ్లెంలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత పళ్లెంలో ఉన్న అన్నానికి కొంచెం నూనె, పసుపు, ఉప్పు వేసి అన్నం మొత్తం కలిసేటట్టు కలియ బెట్టాలి. ఆ తరువాత మూకుడు తీసుకుని దానిలో నూనె వేసి శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర , పచ్చి మిరపకాయలు, ఎండు మిర్చి కలిపి వేయించాలి. ఇలా వేయించిన తాలిం పును ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి కలిసేటట్టు అటూ ఇటూ తిప్పాలి. అంతా బాగా కలిశాక నిమ్మకాయ రసం పిండుకుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment