Pages

Wednesday, 6 May 2015

Tutions - Burden or blessing to the child?

ట్యూషన్లు భారమవుతున్నాయా? (20-Apr-2015)

అవసరమైనంత విషయజ్ఞానం తమ పిల్లలకు స్కూల్లో అందడం లేదనుకునే తలిదండ్రులే ఈ రోజుల్లో ఎక్కువ. అలాంటి వారే పిల్లలకు ట్యూషన్లు చెప్పిస్తుంటారు. కాక పోతే అటు స్కూలూ, ఇటు ట్యూషన్లు పిల్లల మీద బాగా భారమవుతున్నాయేమో అన్న మీమాంస కూడా కొందరిని తొలుస్తుంది. మరైతే ఏమిటి చేయడం? కొంత మంది తలిదండ్రుల్లో ఇదో పెద్ద సందిగ్ధావస్థ. ముఖ్యంగా అప్పర్‌ ప్రైమరీ స్కూలు, హై స్కూలు వెళ్లే నాటికి ఈ తరహా ఆలోచనలు అధికమవుతుంటాయి. ఈ స్థితిని అధిగమించడం ఎలాగో ఇదుగో 
నిపుణులు చెబుతున్నారు....
 
పిల్లలు అధిక సంఖ్యలో ఉండే క్లాస్‌రూమ్‌లో పిల్లలు అన్నీ నేర్చుకోలేరన్న అభిప్రాయమే విడిగా మళ్లీ ట్యూషన్లకు పంపడంలోని ఒక ప్రధాన అంతరార్థం. పిల్లల ర్యాంకులు త గ్గుతూ రావడం కూడా కొంత మంది తలిదండ్రుల్లో ఈ తరహా ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఒకవేళ అప్పటికే పిల్లలకు మంచి ర్యాంకులే వస్తున్నా, అంతకన్నా ఉన్నత స్థాయిని, మునుముందు కాంపిటీటివ్‌ పరీక్షల్లో స్టేట్‌ ర్యాంకులు, నేషనల్‌ ర్యాంకులు సాధించాలనికూడా ట్యూషన్లకు, కోచింగ్‌లకు పంపిస్తారు. స్కూల్లో ఉండే రిసోర్సెస్‌, టీచర్లు తమ పిల్లలకు కావలసిన సమాచారాన్ని అందించే స్థితి లేదనే భావన కూడా చాలామందిలో ఉంటుంది. పిల్లలు మరింత ఉన్నత ప్రమాణాల్ని సాధించాలనుకోవడంలో తప్పులేదు గానీ, ఈ ట్యూషన్లు ఎంత మేరకు ఉపయోగపడతాయనే విషయాన్ని గుర్తించడంలో తలిదండ్రులకు ఒక స్పష్టమైన అంచనా ఉండా లి. అయితే ట్యూషన్లలో హోమ్‌ వర్క్‌ చేసే సులభమైన విధానాల్ని నేర్పడంతోపాటు, హోమ్‌ వర్క్‌ కారణంగా వచ్చిపడే మానసిక ఒత్తిళ్లను తట్టుకునే నైపుణ్యాన్ని ఇచ్చే స్థితిలో కూడా ట్యూషన్లు ఉంటే అవి మరింత ఉపయోగపడతాయి. అలాగే, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవిగా కూడా ట్యూషన్లు ఉంటే అది మరీ మంచిది.
 
ట్యూషన్లు ఎప్పుడు అవసరం?
1. ఈ అవసరం అన్నది కొంత మేరకు పిల్లల వయసును బట్టికూడా ఉంటుంది. సాధారణంగా ప్రైమరీ స్కూలు దశలో అయితే ఎవరికీ ట్యూషన్‌ అవసరం ఉండదు. మిడిల్‌ స్కూల్‌లో అయితే పిల్లలు స్కూలు విషయాలనుంచి దూరంగా వెళ్లకుండా, పట్టి ఉంచడానికి, చదువు పట్ల వారిలో ఆసక్తి పెంచడానికి కొంత మేరకు ఉపయోగపడతాయి. హైస్కూల్‌లో చేరాక పోటీ పరీక్షల్లో విజేతలుగా ఉండడానికి ట్యూషన్లు ఉపయోగపడతాయి. అయితే తోటి పిల్లలు వెళుతున్నారు కాబట్టి మన పిల్లలూ వెళ్లాల్సిందే అనే ధోరణి మాత్రం ఉండకూడదు. పిల్లల్లో ఎవరైనా మౌలిక విషయాల్లో వెనుకబడి ఉన్నట్లు గానీ, కొన్ని విషయాల్లో స్పష్టమైన అవగాహన లేనప్పుడు గానీ, ట్యూషన్లు అవసరం కావచ్చు. కాకపోతే పిల్లలు తమకు తాముగానే ఈ ఇబ్బందుల్ని అధిగమించగలిగినప్పుడు ఇంక ట్యూషన్ల అవసరం ఉండకపోవచ్చు.
2. వాస్తవానికి వారానికి ఒకటి రెండు గంటల ట్యూషన్లు సరిపోతాయి. అయితే క్లాస్‌రూమ్‌లా సమూహంలో కాకుండా, ఒక ట్యూటర్‌- ఒక విద్యార్థి అన్నట్లే ఉండాలి. ఏ రకంగా చూసినా గ్రూప్‌ ట్యూషన్‌ అనేది ఉపకరించేది కాదు.
3. పిల్లలకు కావలసినంత ఫ్రీ టైం ఉండేలా చూడాలి. ఎనిమిది గంటలు స్కూలు కోసం పోతే, ఎనిమిది గంటలు నిద్రకు అవసరం. కాకపోతే, కాలకృత్యాలు, స్నానం, భోజనం కూడా నిద్రా సమయంలోనే భాగంగా గుర్తించాలి. ఇంకో ఐదు గంటల సమయం ఉంటే టి.వి. చూడటానికి, ఆడుకోవడానికి మరేదైనా హాబీ ఉంటే దానికి కేటాయించాలి.
 
ఏది సరియైునది
  •  విద్యావిషయక అంశాలు, ఇతర అంశాలు, వీటి మధ్య సమన్వయాన్ని సాధించడం కూడా పిల్లల జీవితాల్లో ముఖ్యమే. ఇందులో ముఖ్యంగా ట్యూషన్లు పిల్లల మనసుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయా? భారమనే భావన కలిగిస్తున్నాయా? అనేది ఇక్కడ కీలక అంశం.
  •  సబ్జెక్ట్‌లోని బ్యూటీ, దాని విస్తృతిని చెప్పలేకపోతే పిల్లల్లో ట్యూషన్‌ పరంగా వచ్చే ఆనందమేమీ ఉండదు. ఆ లోటేమైనా ఉంటే దాన్ని పూరించే ప్రయత్నం చేయాలి.
  •  ట్యూషన్లు కేవలం పిల్లల్లోని లోపాల్ని తొలగించడానికే కాదు. వారిలో కొత్త శక్తిని నింపేవిగా కూడా ఉండాలి.

No comments:

Post a Comment