Pages

Tuesday, 12 May 2015

Trupthi - Santhrupthi


తృప్తి - సంతృప్తి

తృప్తి-సంతృప్తి అనే మాటలను సమానార్థకాలుగా వాడుతుంటాం. అలా చేయడం తప్పు కానప్పటికీ ఆ పద ప్రయోగాలమధ్య ఎంతో వ్యత్యాసముంది.
పరమేశ్వరుని అనుగ్రహంవల్ల రూపొందిన ఈ చరాచర సృష్టిని నిశితంగా పరిశీలిస్తే మానవుని ఉత్కృష్టత తెలుస్తుంది. యుక్తాయుక్తాలను వివేచించి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చో, తదనుగుణంగా బహుళార్థ ప్రయోజనకరంగా మలుచుకునే శక్తి ఇతర ప్రాణులకన్నా మానవునికే అధికం. మనిషి తన భావాలను, అనుభవాలను, అనుభూతుల్నీ ఇతరులతో పంచుకొనగలడు. అప్పుడు మాత్రమే అని జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. తన జీవనం ఎంతో ‘తృప్తి’గా ఉందని భావిస్తాడు. అంటే మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇటువంటి భావన కలుగుతుంది.
తృప్తి లేదా సంతృప్తి మనస్సుకు సంబంధించిన ఫలాలు. ‘తృపి’ దేహానికి (జీవుడికి) సంబంధించినది. సంతృప్తి అంతరంగానికి (ఆత్మకు) సంబంధించినది. పరిశీలనం చేస్తేనే గాని అవగాహన కాదు.
‘తృప్తి’ అనుభవించడం కర్మేంద్రియాల ద్వారా జరిగితే, ‘సంతృప్తి’ జ్ఞానేంద్రియాలకు మాత్రమే పరిమితం.
ఎండలో నడుస్తున్నవానికి చల్లని నీడ తృప్తినిస్తుంది. అలానే ఆ స్థితిలో దాహార్తికి చల్లని నీళ్ళు తృప్తి కలిగిస్తుంది. ఆకలితో సతమతమవుతున్నవానికి పట్టెడన్నంతో కడుపు నింపితే ముఖంలో తృప్తి తాండవమాడుతుంది. పరీక్షల్లో విద్యార్థి కృతార్థుడైనా, నిరుద్యోగికి ఉద్యోగం లభించినా, శ్రమనెంచక ఇల్లు కట్టినా, కూతురుకు పెళ్లిచేసినా ఆ వ్యక్తుల ముఖాలలో కనిపించే ‘తృప్తి’ని మాటలో వర్ణించలేం.
ఒక విధంగా వీటిని చూస్తే ఇవన్నీ కోరికలు. సముద్రంలో అలల వంటివి. ప్రతి కోరిక తీరగానే అంతటితో సమప్తం కాదు. ఆ కోరికననుసరించి మరొక కోరిక పుడుతుంది. ధనం లభించాలనీ, కీర్తిపొందాలనీ పదవి చేపట్టాలనీ- ఇలా ఎన్నో కోరికలు మనిషికి కలుగుతూనే ఉంటాయి. వాటికోసం మనస్సు ప్రేరేపించని మార్గమంటూ లేదు. కోరిక తీరాలనే కాని, ఆ మార్గం ఎటువంటిదని మనస్సుకు తట్టదు. కోరిక తీరితేనే తృప్తి. దొరికినదానితో తృప్తి చెందడం, అంతటితో సరిపెట్టుకోవడం మనసుకు అలవాటు లేదు. మంచి, చెడులు రెండూ మనసుకు రెండు పార్శ్వాలు. లేదా నాణేనికి బొమ్మా, బొరుసులు. ఐహిక వాంఛలకు అలవాటుపడిన దేహానికి ఆ విధంగానే తృప్తిని సమకూరుస్తుంది మనస్సు. అంటే భౌతికంగా మనిషికి లభిస్తున్న తృప్తి మనుస్సు కారణంగా లభిస్తున్నది. ఈ తృప్తి అనిత్యమైనది. అశాశ్వతమైనది.
నిత్యమైనది, శాశ్వతమైనది అయిన తృప్తి వేరొకటున్నది. అంతరంగంలో ఉన్నది. మనోనేత్రం మిథ్యాజగత్తును చూస్తూ అనుభవించేది బాహ్మికమైన తృప్తి. దేహానికి మాత్రమే సంబంధించినది. మనోనేత్రాన్ని అంతరంగంవైపు మళ్లించి వీక్షిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ ధర్మ సౌందర్య దర్శనం, ఆత్మానంద జ్యోతి ప్రకాశం గోచరమవుతుంది. విశ్వంలో ప్రతి ఒక్కరూ ఆనందానే్న కోరుకుంటారు. మానవుని సహజ స్థితి ఆనందం అంటాయి ఉపనిషత్తులు. ‘‘ఆనందం మన వారసత్వ సంపద, సంతోషం మన ధనం, శాంతి మన స్వంతం’’- ఇవన్నీ మనలోనే ఉన్నాయి. కాని మనం వాటిని అనుభూతం చేసుకోలేకపోతున్నాం అంటారు స్వామి చిన్మయానంద.
శాంతి వంటి తపస్సు, సంతోషాన్ని మించిన సుఖం లేదు. సాగరంలోని అలలు వంటి కోరికలకు మించిన వ్యాధులు లేవు. దయతో సరితూగగల ధర్మం కూడా లేదని శృతులు వక్కాణిస్తున్నాయి.
మనస్సును అంతర్ముఖం చేసి, ఇంద్రియాలను నియంత్రించి, పరమాత్మను ఆత్మలో దర్శించే సాధన చేయాలి. ఫలాపేక్ష రహితమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన అనంతమైన ప్రేమ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు పరమాత్మ. అక్కడ సదా పరివేష్టితుడై ఉన్నాడు. వైభోగాలకు, భోగాలకు అక్కడ తావు లేదు. అది పరతత్త్వమైన, ఆధ్యాత్మికమైన స్థితి. 

No comments:

Post a Comment