Pages

Tuesday, 12 May 2015

Avivekam - Telugu spirutual


అవివేకము



భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ శ్రీ భగవద్గీతలో అర్జునునితో జ్ఞాని అయిన వాడు నాకత్యంత ప్రియమైన వ్యక్తి. మనుష్యులలో బుద్ధిమంతు వారలలో బుద్ధిని నేనే. వివేకము బుద్ధియోగమునే ఆశ్రయించాలి, ఎందుకంటే అది ఫలహేతువు కనుక. దానివలననే ఫలితము కలుగును. ఆ ఫలితమునే అనుభవింపవలసి వచ్చును. మానవులు ఎల్లప్పుడును సమబుద్ధి యందే రక్షణోపాయమును పొందవలెను. రకరకములైన మాటలు వలనను, అవి వినుట వలనను వాదనల వలనను బుద్ధి విచలితమై స్థిరముగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది.
అలాంటప్పుడు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. వివేకము కోల్పోరాదు. ఎటువంటి పరిస్థితుల్లోను సుఖ దుఃఖాలలో గాని ద్వేషములందుగాని బుద్ధి స్థిరమైనదిగా ఉండాలి. ఎవని మనస్సు, ఇంద్రియములు వశమై ఉండునో అతని బుద్ధి స్థిరముగా నుండును. విషయములందు సదా ఆలోచించువానికి వానియందాసక్తి కలుగును. ఆ ఆసక్తివలన విషయములపట్ల కోరిక కలుగును. కోరిక తీరక విఘ్నములేర్పడినప్పుడు క్రోధము కలుగును, క్రోధమువలన మూఢభావము కలుగుతుంది. దానివలన స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమించినప్పుడు జ్ఞానశక్తి నశిస్తుంది.
అలా నశించినప్పుడు తానున్న స్థితినుండి దిగజారి పతనము మొదలవుతుంది. బుద్ధి వివేకము కోల్పోయి అవివేకము కలుగును. అవివేమువలన నిర్వర్తించు కార్యములు సక్రమంగా జరుగక నాశనము ప్రాప్తించును. చివరకు ప్రాణోపాయము కలుగును. బుద్ధి ద్వారా మనస్సును వశము గావించుకుని జాగరూకతతో సంచరించాలి. వివేకముతో జీవనము సాగించాలి.
దేవుడు ప్రాణికోటికంతటికిని బుద్ధిని ఎంతో కొంత ప్రసాదించాడు. ముఖ్యంగా మానవజాతి బుద్ధి వివేకములతో సక్రమ మార్గమున నియంత్రించగలిగితే అంతా ధర్మమే నాలుగు దిక్కుల ప్రభవిల్లుతుంది. అంతటా శాంతి సౌభాగ్యాలే వెల్లివిరుస్తాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే ప్రాచీన కాలం నుండి కొంతమంది బుద్ధిని సరిగా ఉపయోగించక తమ అవివేకముతో నాశనమయ్యారు. వారిలో.. దుర్యోధనుడు సోదరులతో శత్రుత్వం వహించి పోరు సల్పి అవివేకి అయ్యాడు. ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతో దుర్యోధనుని ఆగడాలు అనుమతించి అవివేకి అయ్యాడు.
శూర్పణఖ మాటలు విని సీతను అపహరించిన రావణుడు ఒక అవివేకి, దురాశచే దూరాలోచన లేక సులభంగా ధనార్జన చేసేవాడు అవివేకి, తాను కూర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కున్నవాడు అవివేకి. ఈతకాయతో తాటికాయ కోరేవాడు అవివేకి. వాత్సల్యంతో పిల్లలను అతి ముద్దుచేసే తల్లిదండ్రులు అవివేకులు. పరుల మెప్పుకోసం ప్రాకులాడేవాడు అవివేకి. అనాలోచితంగా తొందరపాటుతో అపాయంలో చిక్కుకున్నవాడు అవివేకి. రావణాసురుడు, దుర్యోధనుడు, వాలి, కంసుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారందరూ సర్వనాశనం కావడానికి కారణం వారి అవివేకమే. నేడు ఎంతోమంది ఉన్నత స్థాయి నుండి అథమ స్థాయికి చేరడానికి కారణం అవివేకమే. అయితే ఉపాయంతో, బుద్ధితో, వివేకంతో అపాయాన్ని తప్పించుకొనేవాడు వివేకవంతుడు.
మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

No comments:

Post a Comment