Pages

Wednesday, 13 May 2015

Get the beauty with milk


పాలతో అందానికి మెరుగులు

  • -
పాలను ఓ సౌందర్య సాధనంగా వాడడం ఈనాటి అలవాటు కాదు. రాజులు, మహారాణులు పాలతో స్నానాలు చేసేవారని చరిత్ర చెబుతూనే ఉంది. ఈనాటికీ కొన్ని ప్రాంతాల్లో వివాహానికి ముందు రోజు పెళ్లికూతురికి పాలతో స్నానం చేయించే ఆచారం ఉంది. సౌందర్య పోషణకు సంబంధించి నేటితరం వారికీ పాలపైన ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఎన్నో వ్యాపార సంస్థలు పాలను ప్రాతిపదికగానే చేసుకుని మాయిశ్చరైజర్లు, క్రీమ్‌లు, సన్‌స్క్రీన్ లోషన్, బ్లీచ్ వంటి పలు సౌందర్య సాధనాలను తయారుచేస్తున్నాయి.
క్లెన్సర్‌గా..
పాలను ఉత్తమమైన క్లెన్సర్‌గా చెప్పుకోవచ్చు. పాలలోని లాక్టిక్ యాసిడ్‌లో ఉండే అల్ఫా హైడ్రాజెల్ అనే పదార్థానికి చర్మాన్ని శుభ్రం చేసే గుణం ఉంది. చర్మం టోనింగ్‌ను (నల్లబడటాన్ని) తక్కువగా చేస్తుంది. చర్మ రంధ్రాలు పెద్దవైతే విరిగిన పాలు కలిపిన లేపనం వాడాలి. పాలలో కొద్దిగా నిమ్మరసం పిండితే అవి విరుగుతాయి. అందులో దూదిని ముంచి రాత్రి పూట పడుకునే ముందు ముఖానికీ, మెడకూ రాసుకుని టిష్యూ పేపరుతో అదనపు పాలను తుడిచివేయాలి. జిడ్డు చర్మంగలవారు, పాలతో దూదిని ముంచి ముఖానికీ, మెడుకు రాసుకుని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. శుష్క చర్మం వున్నవారు మీగడపాలు వాడాలి.
మాయిశ్చరైజర్‌గా ..
పాలను మించిన మంచి మాయిశ్చరైజర్ ఇంకొకటి లేదు. ఎండిపోయినట్లుగా, గురుకుగా ఉండే చర్మానికి తేమ కలిగిస్తుంది. ఒక కప్పు పాలతో మూడు స్ట్రాబెర్రీలను రుబ్బి పేస్ట్‌లా చేయాలి. ఒక చిన్న చెంచాడు గ్లిజరిన్‌ను దీనికి చేర్చి శుభ్రమైన సీసాలో పోసి రిఫ్రిజిరేట్‌లో నిలువ వుంచి నిత్యం రాసుకుంటూ ఉండాలి. అయితే, ఈ లోషన్‌ను రాసుకునేముందు సీసాను కుదపటం మరువకూడదు.
బ్లీచ్‌గా..
చర్మపు రంగును తేర్చటంలో పాలు చక్కని బ్లీచ్‌గా ఉపయోగపడతాయి. ఒక కప్పు పాలు, ఒక చెంచాడు కమలాపండు రసం, ఒక చిన్న చెంచాడు తేనె కలిపి మిశ్రమంలా చేసి దానితో తరచూ ముఖం కడుక్కోవాలి.
సన్‌స్క్రీన్ లోషన్‌గా..
చల్లటి మజ్జిగను ముఖానికీ, చేతులకూ, కాళ్ళకూ బాగా రాస్తే ఎండలోంచి వచ్చిన తరువాత మంచి ఔషధంలా పనిచేస్తుంది.
యవ్వనవంతులుగా...
పాలలో ఉండే ప్రొటీనులు, కొవ్వు వయసును ఎక్కువగా కనిపించకుండా చేస్తాయి. ముఖంపైన ఉండే ముడతలను కనిపించకుండా చేస్తాయి.
ఫేషియల్ స్క్రబ్‌గా..
జిడ్డు చర్మంగలవారు ఒక చెంచాడు స్కిమ్‌డ్ పాలలో ఒక చిన్న చెంచాడు తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. శుష్కర్మం గలవారు మీగడపాలు వాడాలి. చర్మం బిగువుగా రావాలంటే పాలు కాచిన తరువాత పాత్ర అడుగున అంటుకుపోయిన మీగడను తీయాలి. దీనికి పన్నీరు, కాస్త తేనె కలిపి ముఖానికీ, మెడకూ రాసుకుని పావు గంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మానికి బిగువును కలిగించేలా పనిచేస్తుంది.
మాస్క్‌గా...
చెంచాడు పాలలో, పావు చెంచాడు బాదం నూనె కలపాలి. మామూలుగా ముఖం కడుక్కున్న తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పూత పూయాలి. అది ఎండిపోయిన తరువాత మరో పూత పూయాలి. బాగా ఎండిపోయి బిగువుగా అయిన తరువాత గోరువెచ్చని నీటితో మాస్క్‌ను తీసేయాలి.
స్నానానికి..
ఒక బకెట్ నీటిలో రెండు చుక్కలు లావెండర్ నూనె, ఒక పెద్ద చెంచా తేనె, రెండు చెంచాల పాలపొడి కలపాలి. తరువాత ఈ నీటితో స్నానం చేయాలి. కొద్దిసేపు ఆగి మామూలు నీటితో తిరిగి స్నానం చేయాలి. ఈ పద్ధతి కాకుండా మరో పద్ధతిని కూడా పాటించవచ్చు. ఒక చిన్న గినె్నలో కొద్దిగా తేనె తీసుకుని, దానికి పాల పొడి చేర్చి పలుచని మిశ్రమంలా తయారుచేసి శరీరమంతటిపైనా కొద్ది కొద్దిగా జల్లులా చల్లుకుంటూ రాసుకుని, తరువాత మామూలు నీటితో స్నానం చేయాలి.
హెయిర్ ప్యాక్‌గా..
పావు కప్పు పాల పొడిని నీటిలో కలిపి ముద్దలా చేసి జుట్టుకు రాసుకుని మర్దనా చేసుకోవాలి. వేడి నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టుకుని అరగంట సేపు ఉంచుకోవాలి. టవల్ ఆరిపోతే మళ్లీ నీటిలో ముంచి చుట్టుకోవాలి. ఒక కప్పులో పాలు తీసుకుని కొద్దిగా బాదంనూనె కలిపి, అందులో దూదిని ముంచి ముఖానికీ, మెడకూ రాసుకుని మేకప్‌ను తీసివేయవచ్చు. పాలు చక్కని మేకప్ రిమూవర్‌గానూ పనిచేస్తాయి

No comments:

Post a Comment