Pages

Tuesday, 12 May 2015

Did you find the differences in heart beating?


‘హృదయ స్పందన’లో తేడాలు గమనించారా?


గుండె-్ఛతీ లోపల పిడికిడంతే ఉంటుంది గానీ తల నుంచి కాళ్ళ వరకూ శరీరంలోని అణువణువుకూ రక్తం అందేలా అది నిరంతరాయంగా సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ.. నిమిషానికి 60 నుంచి 100సార్లు దాకా బలంగా కొట్టుకుంటుంది. అదే దీని ప్రత్యేకత. అయితే ఈ గుండె కొట్టుకునే వేగంలో తీవ్రమైన తేడాలు వస్తే మాత్రం.. గుండె దడ, ఊపిరాడకపోవడం, స్పృహ తప్పటం వంటి రకరకాల సమస్యలు బాధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు హఠాత్తుగా మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. అందుకే దీని గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం!
స్పందించే తీరు
నిజానికి మన గుండె రోజంతా ఎప్పుడూ ఒకే వేగంతో కొట్టుకోదు. నిద్రపోతున్న సమయంలో మన శరీరానికి రక్తం అవసరం తగ్గుతుంది. దీనికి తగ్గట్టుగానే మన గుండె కొట్టుకునే వేగం కూడా నిమిషానికి 50-60 సార్లకు తగ్గిపోతుంది. అదే మనం వేగంగా పరుగెడుతుంటే గుండె నిమిషానికి 110, 120 సార్లవరకూ కూడా కొట్టుకోవచ్చు. ఇలా మనం చేస్తున్న పనిని బట్టి గుండె కొట్టుకునే వేగంలో తేడాలు రావడం మామూలే. అప్పుడప్పుడు ఉన్నట్టుండి పెరిగిపోవటం, వేగంగా కొట్టుకుంటుండడం, లేదా వేగం మరీ తగ్గిపోవటం, ఇవన్నీ సమస్యలే! ఇలా గుండె ‘లయ’ తప్పి ఎక్కువ, తక్కువలుగా అసహజంగా కొట్టుకోవటాన్ని ‘అరిత్మియా’ అంటారు.
లక్షణాలు
గుండె మామూలు కంటే చాలా వేగంగా కొట్టుకుంటుంటే దాన్ని ‘టెకీకార్డియా’ అనీ, మామూలు కంటే తక్కువగా కొట్టుకుంటుంటే దాన్ని ‘బ్రాడీకార్డియో’ అని అంటారు. పూర్తిగా సంకోచించకుండా వణుకుతున్నట్టుగా పైపైనే కొట్టుకోవటాన్ని ఫిబ్రిలేషన్, ప్లట్టర్ అంటారు. గుండె లయ ఇలా అస్తవ్యస్తంగా తయారైతే దాని లక్షణాలు రకరకాలుగా ఉండొచ్చు.
ఛాతిలో ఏదో వేగంగా బలంగా కొట్టుకుంటున్నట్టు దడ అనిపిస్తుంది. ఉన్నట్టుండి కొద్దిసేపు స్పృహ తప్పి పడిపోవచ్చు.
స్పృహ తప్పి పడిపోతే మామూలుగా దాన్ని మూర్ఛ, పక్షవాతం వంటి మెదడుకు సంబంధించిన న్యూరాలజీ సమస్యగా అనుకుంటారు గానీ.. ఇలా ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతున్నవారిలో 40 శాతంమందికి మెదడు సమస్యలేమి లేవని, గుండె సమస్యలే కారణమని చాలా అధ్యయనాల్లో తేలింది.
కొన్నిసార్లు గుండె కొట్ట్టుకోవటం మరీ అస్తవ్యస్తంగా మారి, హఠాన్మరణం కూడా సంభవించవచ్చు. ఒకసారి గుండెపోటు బారినపడినవారికి ఈ ప్రమాదం మరీ ఎక్కువ. కొంతకాలం పాటు అతివేగంగా కొట్టుకోవటంవల్ల గుండె సైజు పెరిగి దానివల్ల పంపింగ్ సామర్థ్యం తగ్గి.. క్రమంగా ‘హార్ట్ ఫెయిల్యూర్’ రావచ్చు.
ఎన్నో సమస్యలు
గుండెలో విద్యుత్ ప్రేరేపణలను విడుదల చేస్తుంది. ‘ఎన్‌ఏనోడ్’ చాలా వేగంగా లేదా చాలా మెల్లగా స్పందిస్తున్నా, లేక దీనికి పోటీగా గుండెలోని మరో ప్రాంతం కూడా విద్యుత్ ప్రేరణలను ఉత్పత్తి చేయటం మొదలుపెట్టినా లేక గుండెలో ఈ విద్యుత్ ప్రేరణలు ప్రయాణించే మార్గాల్లో ఎక్కడన్నా అంతరాయాలు వచ్చినా.. గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తమై ‘అరిత్మియా’కు దారితీస్తుంది.
తేడాలెందుకు?
అసలు మన గుండె క్రమబద్ధంగా కొట్టుకుంటూ ఉండటానికి విద్యుత్ ప్రేరేణలే ముఖ్యం. ఈ విద్యుత్ ప్రేరణలను గుండెలోని కుడివైపు పై గది (కర్ణిక మీద సైనో ఏట్రియల్ నోడ్ (ఎస్‌ఎనోడ్) ఆ చిన్న ప్రాంతం పుట్టిస్తుంటుంది. ఈ ప్రాంతం మన గుండెలో ఉండే సహజసిద్ధమైన ‘పేస్‌మేకర్’ లాంటిది. మనం ఏ పని చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా రక్తం సరఫరా ఎలా ఉండాలి, గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో ఇదే ఎప్పటికప్పుడు విశే్లషిస్తూ.. తగ్గట్టుగానే నిరంతరాయంగా కరెంట్ ప్రేరణలను విడుదల చేస్తుంటుంది. ఇక్కడ మొదలైన ప్రేరణలు... ముందు వైపు రెండు గదులకూ ప్రయాణిస్తాయి. వెంటనే అవి ఒక్కసారిగా సంకోచిస్తాయి. ఇంతలో ఈ కరెంట్ ప్రేరణలు గుండెలోని పై గదులకూ, కింది గదులకు మధ్యలో వుండే ‘ఏట్రియా వెంట్రిక్యులర్ నోడ్’ను చేరుతాయి. ఈ నోడ్ ఒక రకంగా మన విద్యుత్ తీగల జంక్షన్ వంటిది. ఇక్కడనుంచి కరంట్ ప్రేరణలు- ప్రత్యేకమైన వైర్ల వంటి కణమార్గాల ద్వారా కింది రెండు గదులనూ చేరతాయి. దీంతో కొద్దిక్షణాల తేడాలోనే కింది గదులు రెండు కూడా బలంగా సంకోచిస్తాయి. రక్తం ఒక్కసారిగా బలంగా పంప్ అవుతుంది ఈ పద్ధతిలో ఉండే గొప్పతనం గుండె మొత్తం ఒక్కసారే సంకోచించకుండా.. కరెంట్ ప్రేరణలను బట్టి ముందుగా పై గదులు, కొద్ది మిల్లీ సెకన్ల తేడాలోనే కింది గదులు సంకోచిస్తుండటం! ఈ చిన్న తేడావల్ల రక్తం పై గదుల నుండి పూర్తిగా కిందికి వచ్చే వీలుంటుంది. ఈ సంకోచ- వ్యాకోచాలు.. ఇదే విధంగా, ఎక్కడా లయ దెబ్బతినకుండా కొనసాగుతుంటేనే.. గుండె రక్తాన్ని సక్రమంగా పంపింగ్ చెయ్యగలుగుతుంటుంది. ఈ విద్యుత్ యంత్రాంగంలో ఎక్కడ తేడా వచ్చినా కూడా పరిస్థితి అస్తవ్యస్తంగా ‘అరిత్మియా’కు దారితీస్తుంది. రక్తసరఫరా కూడా అస్తవ్యస్తమవుతుంది.
వేగంలో మార్పులు
సిక్ సైనస్ సిండ్రోమ్
ఇది ముసలివాళ్ళలో ఎక్కువ. సమయానికి తగ్గట్టుగా విద్యుత్ ప్రేరణలను విడుదల చేయాల్సిన నైనోఏట్రియల్ నోడ్ మందకొడిగా మారుతుంది. దీంతో ముందు గుండె కొట్టుకునే వేగం తగ్గిపోయి, నడక, ఊపిరి కష్టంగా మారటం వంటి సమస్యలన్నీ వస్తాయి. దీనికి ప్రత్యామ్నాయ స్పందనగా, గుండె మొత్తం అక్కడక్కడ కరెంట్ ప్రేరణలు ఉత్పత్తి అవుతూ క్రమేపీ ‘ఏట్రియల్ ఫిబిలేషన్’ వచ్చి గుండె లయ మొత్తం తప్పి, గుండె గదులు ఒక పద్ధతి లేకుండా గందరగోళంగా కొట్టుకుంటూ ఉంటాయి.
హార్ట్ బ్లాక్.. వయసుతోపాటు గుండె కండరంలో కూడా తేడాలు వస్తుంటాయి. కొన్నిసార్లు కాల్షియం ఉరుకుని, మరికొన్నిసార్లు నాడీ మార్గాలు ముందుగా తయారై, గుండె గదుల మధ్య పైనుంచి కిందికి కరెంట్ ప్రేరణల ప్రసారం ఆగిపోతుంది. ఇలా అంతరాయం ఏర్పడితే, ఉన్నట్టుండి కరెంట్ ప్రసారం నిలిచిపోయి, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దానివల్ల స్పృహ తప్పే అవకాశం కూడా ఉంది.
వ్యాధి నిర్థారణ.. రోగిని క్షుణ్ణంగా పరీక్షించటం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని ఇతరత్రా సమస్యల్లో కూడా ‘గుండెదడ’ రావచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలవల్ల గుండె వేగం మారిపోతుంది. అలాగే జింకోబిల్చ్ లాంటివి కలిసిన మూలికా ఔషధాలు తీసుకున్నా కూడా గుండె కొట్టుకోటం అస్తవ్య్తమవుతుంది. కొంతమందిలో, మరీ ముఖ్యంగా చిన్న వయసు స్ర్తిలలో కేవలం మానసిక ఆందోళన కూడా లయ తప్పటానికి, గుండె దడ కారణమవుతుంది. కాబట్టి ముందుగా ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో చూడటం అవసరం. ఇవేమీ లేకపోతే.. సమస్య గుండెలోనే ఉందని అనుమానించవచ్చు. గుండెలోని విద్యుత్ ప్రేరణల తీరును తెలిపే ప్రధానమైన పరీక్ష ఈసీజీ. దీన్ని దడగా ఉన్నప్పుడు చేస్తేనే లయలో వస్తున్న తేడాలు తెలుస్తాయి. 24 గంటల పాటు ఈసీజిని రికార్డు చేసే ‘హోల్డర్’ పరీక్ష ఇందుకు ఉపకరిస్తుంది. గుండె పరిమాణం పెరిగేలా చేసే ఏ సమస్య అయినా చివరికి అరిత్మియాలకు దారితీయవచ్చు. కాబట్టి అవసరాన్ని బట్టి ఎకో, త్రెడ్‌మిల్ పరీక్షలు కూడా చేస్తారు. మరీ అవసరమైతే, తొడ దగ్గర లేదా మెడ దగ్గర రక్తనాళాల గుండా సన్నటి తీగలను గుండెలోకి పంపించి వాటి ద్వారా కరెంట్ ప్రేరణలను పంపుతూ... గుండెను ప్రేరేపిస్తారు. లోపం ఏదైనా ఉంటే అప్పుడు బయటపడుతుంది. ఈ పరీక్షల్లో గుండె లయల్లో తేడాలున్నాయా, ఉంటే దానికి మూలం ఎక్కడుందనే విషయం కూడా స్పష్టమవుతుంది.
చికిత్స
గుండె దడకు అసలు మూలం ఏమిటి, బాధితుల వయస్సు, లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే చికిత్స ఈ విధంగా ఉంటుంది.
మందులు.. ఎప్పుడన్నా ఒకసారి గుండె లయ తప్పి దడలాంటి లక్షణాలు బాధిస్తున్నప్పుడు మందులు ప్రయత్నించవచ్చు. 60-70 శాతం మందిలో మందులు బాగానే పనిచేస్తాయి. ఈ మందులన్నీ గుండె దడను తగ్గించేందుకు ఇచ్చేవి. తక్కువ డోస్‌తోనే పరిస్థితి దారిలోకి వస్తుంటే సమస్య ఉండదు. కాకపోతే వీటిని జీవితాంతం తీసుకుంటూ ఉండాలి. గర్భిణీలు మాత్రం ఈ మందులు వాడే విషయంలో వైద్య సలహా తీసుకొని ఉపయోగించడం మంచిది. ఈ మందులతో ఎలాంటి ఫలితం లేకపోతే ‘అబ్లేషన్’ వంటి ఇతర పద్ధతులకు వెళ్ళాల్సివస్తుంది.
అబ్లేషన్.. గుండెలో కొన్ని కొన్ని ప్రాంతాల్లోని కణాలు అనవసరంగా విద్యుత్ ప్రేరణలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ మొత్తం గుండె లయనే దెబ్బతీస్తున్నప్పుడు... వాటిని నిర్వీర్యం చేయడానికి ఈ చికిత్స చక్కగా ఉపయోగపడుతుంది. బయట నుంచి రక్తనాళాలద్వారా గుండెలోకి సన్నటి తీగను పంపి.. ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఆ ప్రాంత కణాలను 2-4 మిల్లీమీటర్ల తీగమొనతో బాగా వేడి చేసి (అబ్లేషన్) నిర్వీర్యం చేస్తారు. దీంతో ఆ కొద్ది ప్రాంతం చచ్చుబడి.. అతి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ చికిత్స 90 శాతం వరకూ సమర్థవంతంగా పనిచేస్తుంది.
పేస్‌మేకర్లు
గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గిపోతున్నా, గుండె విఫలమయ్యే పరిస్థితి ఉన్నా, స్పృహ తప్పటం వంటివి వచ్చినా... ‘పేస్ మేకర్ల’ను అమర్చటం వల్ల ఉపయోగం ఉంటుంది. చిన్న సర్జరీ చేసి.. భుజం దగ్గర ఈ పరికరాన్ని అమరుస్తారు. అక్కడినుంచి దీని తీగలను గుండెలోకి పెడతారు. ఇవి ఎప్పటికప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని గమనిస్తూ.. అది తగ్గుతున్నట్టుంటే వెంటనే బయటనుంచి విద్యుత్ ప్రేరేపణలు ఇవ్వడం ద్వారా గుండెను మళ్లీ దారిలోకి తెస్తాయి. ఈ పేస్‌మేకర్లలో చాలా రకాలున్నాయి. అవసరాన్ని బట్టి వేటిని అమర్చాలన్నది వైద్య నిపుణులు నిర్థారిస్తారు.
గుండె కొట్టుకోవడంలో సమస్యలైన ‘అరిత్మియా’లు ఎందుకు వస్తాయన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే మన ఆహారపు అలవాట్లలో కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి కెఫేన్ ఎక్కువగా ఉండే పానీయాలు గుండె విద్యుత్ చర్యల మీద నేరుగా ప్రభావం చూపుతాయని, అలాగే... ఆల్కహాల్ ఎక్కువగా తాగినా కూడా గుండె దడ పెరుగుతుందని, అస్తవ్యస్థమైన జీవనశైలి కూడా కొంతవరకు గుండె లయను తప్పడానికి కారణమని ఈ మధ్య చాలా అధ్యయనాల్లో తేలింది. కాబట్టి కెఫీన్, ఆల్కహాల్ పానీయాలు తగ్గించడం, చక్కని జీవనశైలితోపాటు హైబీపీని అదుపులో ఉంచుకోవడం వంటివి హృదయ స్పందనల్లో తేడాలను అరికట్టి, గుండె సక్రమంగా కొట్టుకునేలా చూసేటటువంటివి.. మంచి రక్షణ చర్య
లు

No comments:

Post a Comment