Pages

Wednesday, 3 December 2014

Think before you go USA

ఆలోచించి మరీ... అమెరికా వెళ్లండి..!

అమెరికన్ డాలరు విలువ నేడు అరవై రూపాయల పైచిలుకే. అంటే అమెరికాలో ప్రజలు ఇక్కడవారికన్నా అరవై రెట్లు సుఖపడతారు కాబోలు!. సినిమాల్లో, టీవీలో, వార్తాపత్రికల్లో అమెరికా దేశపు ఫొటోలు చూసినవారికి అలా అన్పించడంలో తప్పులేదు. విశాలమైన రోడ్లు, నాలుగెకరాల తోటలో అందమైన భవంతులు, పడవల్లాంటి కార్లు... ఇవన్నీ చూస్తుంటే అమెరికా భూతల స్వర్గమే అని ఎవరికైనా అనిపిస్తుంది. అందునా అమెరికాలోని భారతీయులు మరింత ఎక్కువగా సుఖపడుతూ ఉండి ఉండాలి. అమెరికాలో పౌరులందరినీ కలిపి లెక్కకడితే సగటు కుటుంబ ఆదాయం ఏడాదికి సుమారుగా 82 వేల డాలర్లు. అమెరికాలో ఉన్న సగటు భారతీయ కుటుంబ ఆదాయం 88 వేల డిలర్ల దాకా ఉంటుంది. ఇది భారతీయులకు గర్వకారణమే. డాలర్లను రూపాయలలోకి మారిస్తే సంవత్సరాదాయం యాభై లక్షల పైచిలుకే. ఇది భారతీయులకు- అందునా తెలుగువారికి ఆశాకిరణం. ఆశలకు కారణం. అప్పో సొప్పో చేసైనా పిల్లలను అమెరికాకు పంపించాలి. అలా సాధ్యం కాకపోతే వారికి అమెరికా సంబంధం చెయ్యాలి. ఈ విషయంలో ఆడపిల్లా, మగ పిల్లవాడూ అన్న తేడా లేదు. పిల్లలు అమెరికాలో సుఖపడాలి, మనని సుఖపెట్టాలి.
మరి పిల్లలను అమెరికా పంపించడమెలా? బాగా తెలివైన పిల్లలను అక్కడ యూనివర్సిటీలు ఫీజు లేకుండా చేర్చుకోవడమే కాదు, నెలకు మూడు వేల దాకా స్టయఫండ్ ఇస్తాయి, అమెరికా రావడానికి విమాన ఛార్జీలు చెల్లిస్తాయి. తెలివిగల పిల్లలకు ఫీజు రాయితీలు ఇస్తాయి. తెలివితేటలను బట్టి యూనివర్సిటీలో సీటు రావడం, ఫీజు రాయితీ ఉంటుంది. మంచి యూనివర్సిటీలో ఫీజు రాయితీ లేకుండా చేరడమా? ఓ మోస్తరు యూనివర్సిటీలో ఫీజు రాయితీతో చేరడమా? అన్నది విద్యార్థి ఇష్టంపై, తల్లిదండ్రుల శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఎంత తక్కువగా అంచనా వేసినా ఒక సాధారణ విద్యార్థి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చెయ్యడానికి యాభై లక్షలైనా ఖర్చవుతుంది. కొన్నిచోట్ల తక్కువ కావచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ కావచ్చు. బాధ్యత తెలిసిన పిల్లలు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటూ, వీలైతే చిన్న చిన్న మొత్తాలు సంపాదిస్తూ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గిస్తారు.
యాభై లక్షలు ఒకేసారి డబ్బు సమకూర్చడం చాలామందికి సాధ్యం కాదు. అలాంటివారికి లోన్ తీసుకోవడం తప్పనిసరి. కష్టమేముంది? ఏడాదిలో పిల్లలు తీర్చెయ్యగలరు కదా! ఎనభై వేల డాలర్ల జీతమంటే మాటలా? ఇక్కడే ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. ఎనభై ఎనిమిది వేల డాలర్ల ఆదాయంతో ఉద్యోగం మొదలెట్టడం అందరికీ సాధ్యం కాదు. అధవా మొదలెట్టగలిగితే జీవితం ఎలా ఉంటుంది? అమెరికాలో అందరూ అందమైన తోటలో అయిదారు బెడ్రూమ్‌లు ఉన్న ఇళ్ళల్లోనే ఉండరు. అక్కడా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె వెయ్యి డాలర్ల ప్రాంతంలో ఉంటుంది. కాలిఫోర్నియా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలలో ఎక్కువ కావొచ్చు; లూసియానా, మిస్సిసిపీ వంటి రాష్ట్రాలలో తక్కువ కావచ్చు (ఇండియాలో సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌కి అరవై వేలు చెల్లిస్తున్నామా!). విద్యార్థులూ, కొత్తగా ఉద్యోగంలో చేరినవారూ ముగ్గురు, నలుగురు కలిసి ఫ్లాట్ తీసుకుని అద్దె పంచుకుంటూ ఉంటారు. నలుగురు ఉంటామని చెప్పి ఎక్కువమంది ఉంటారన్న ఇమేజీ భారతీయుల గురించి అక్కడ ఉంది. నిజానిజాలు భగవంతుడికెరుక.!
ఇంటి తరువాత ముఖ్యమైనది భోజనం. మన దేశంలోలానే అక్కడా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ తేడాలుంటాయి. సీజన్‌కీ, సీజన్‌కీ తేడాలుంటాయి. అందుకే ఇక్కడ ఇచ్చినవి ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే. మన దేశంలో పాలు లీటరు ముప్ఫై ఎనిమిది రూపాయలైతే అక్కడ లీటరు అరవై ఒక్క రూపాయలు. ఇక్కడ బ్రెడ్ ఇరవై రెండయితే అక్కడ నూట నలభై అయిదు రూపాయలు. బంగాళా దుంపలక్కడ కిలో నూట యాభై, టమాటోలు రెండు వందల ఇరవై, గుడ్లు అమెరికాలో డజను నూట ముప్ఫై రూపాయలు (ఇవన్నీ డాలర్లను రూపాయలలోకీ, పౌండ్లను కిలోలలోకీ మార్చి ఇచ్చిన ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే). దొండ, అరటి, చేమ వంటి మన కూరలింకా ఖరీదు. పోనీ హోటల్‌కి వెడదామంటే భోజనం పది డాలర్లు. ఒక్క మనిషికి మామూలు భోజనం ఆరు, ఏడు వందల రూపాయలా? అమ్మ బాబోయ్..! నీళ్ళ సీసా వంద రూపాయలు. టాక్సీకి కిలోమీటరుకి దగ్గర దగ్గరగా వంద రూపాయలు.
మీడియాలో కొంతకాలం కిందట దేవయాని అనే ఫారీన్ సర్వీస్ ఆఫీసరు ఉదంతం వచ్చింది కాబట్టి పనిమనుషుల మాట ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. లాన్ కత్తిరించడానికీ లేదా ఇల్లు క్లీన్ చెయ్యడానికీ వంద నుంచి రెండు వందల డాలర్లదాకా తీసుకుంటారు. చాలా పెద్ద జీతాలున్నవారు తప్ప పనులకు మనుషులను పెట్టుకోలేరు. స్వయంగా చేసుకోవలసినదే. ఒక కుటుంబం ఇండియా రావాలంటే కనీస ఖర్చు అయిదారు వేల డాలర్లు. అందుకే మూడేళ్ళకోసారి కానీ చాలామంది రాలేరు.
ఇదంతా అమెరికాలో జీవితం దుర్భరంగా ఉంటుందని చెప్పడానికి కాదు. ఆ దేశంలోనూ సుఖపడే అంశాలెన్నో ఉన్నాయి. రోడ్లు విశాలంగా, శుభ్రంగా ఉంటాయి. చెత్తా చెదారం ఉండవు. నీళ్ళకీ, కరెంటుకీ ఇబ్బంది లేదు. మన దేశంలో కొన్ని సుఖదాయకాలున్నట్లే అక్కడా కొన్ని ఉన్నాయి. అమెరికా వెళ్ళాలనుకునే యువతకూ, పంపించాలనుకునే తల్లిదండ్రులకూ ఒక్కటే విన్నపం. పూర్తిగా ఫీజు వేవర్, స్ట్ఫైండ్‌తో చదువుకునే అవకాశం దొరికితే మంచిదే. కంపెనీ యాజమాన్యం వారి ఖర్చులమీద పంపినా మంచిదే. అలా కాకుండా సొంత ఖర్చుపై చదువుకుందుకు వెళ్ళేవారు జాగ్రత్తగా బేరీజు వేసుకోవడం మంచిది. డాలరనగానే అరవై రూపాయల పైచిలుకు అనుకుని లెక్కలు వెయ్యవద్దు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసులో చదివిన విద్యార్థులు డాలరు విలువ అయిదు రూపాయల నుంచి పది రూపాయల దాకా ఉండచ్చని లెక్కకట్టారు. అమెరికాలో ఎనభై వేల డాలర్లంటే ఇండియాలో అయిదారు లక్షల రూపాయలు మాత్రమే (హెచ్చుతగ్గులతో). ఆ లెక్కన ఖర్చుకి తగ్గ రాబడి ఉంటుందా? అని ఆలోచించండి.
పిల్లలను చూసి, వారు చూపించే అమెరికా అద్భుతాలు చూడడానికో, మనవలను పెంచడానికో చాలామంది అమెరికా వెళ్లి వస్తుంటారు. వారు చెప్పే విశేషాలతో అమెరికాను ఊహించుకోవద్దు. మూడేళ్లకో, నాలుగేళ్లకో ఓసారి ఇండియాకి వచ్చి గొప్పలు కొట్టుకునే ప్రవాస భారతీయుల మాటలనూ పూర్తిగా నమ్మవద్దు. బోస్టన్ నుంచి హ్యూస్టన్‌దాకా, అలాస్కా నుంచి అలబామాదాకా, వాషింగ్టన్ రాష్ట్రం నుంచి వాషింగ్టన్ డి.సి దాకా బస్సులో తిరిగితే కానీ అమెరికా అసలు స్వరూపం తెలియదు. అమెరికా భూతల స్వర్గమూ కాదు, భూతాలు మాత్రమే తిరిగే నరకమూ కాదు. ఆ విషయం గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. శుభం భూయాత్.

No comments:

Post a Comment