Pages

Wednesday, 3 December 2014

black teeth

నలుపుదనం.. పిప్పి పన్నుకు సంకేతం


మనం ప్రతిరోజూ ముఖం నోరు, దంతాలు, నాలుక శుభ్రం చేసుకుంటాం. చాలామంది ఈ కార్యక్రమాలన్నీ కూడా దైనందిన జీవితంలో మామూలుగా భావించి చేస్తుంటారు. ఈ ప్రక్రియలో పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల పళ్ళు గారపట్టడం, పుచ్చిపోవడం, నోటిలో పుళ్లు ఏర్పడతాయి. అసలు నోటిని పరీక్షగా చూసుకునే అలవాటు చాలామందికి ఉండదు. కాని అద్దంలో నోటిని పరీక్షించుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. పంటిమీద నల్లని మచ్చ ఏర్పడిందంటే పన్ను పుచ్చిపోవడానికి ప్రారంభదశలో ఉన్నదని గ్రహించాలి. ఆ తరువాత నల్లని మచ్చ రంధ్రంగా ఏర్పడుతుంది. పన్నుకు రంధ్రం పడితే మనకు ఇట్టే తెలుస్తుంది. ఎందుకంటే మనం చిన్న ఆహార పదార్థాలు ఆ పంటి రంధ్రంలో ఇరుక్కుని చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పిగా కూడా ఉంటుంది. కూల్‌డ్రింక్స్, స్వీట్లు, పులుపు మొదలైన ఆహార పదార్థాలు తిన్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిలో వైద్య సహాయం పొందినట్లయితే, అంటే దంత వైద్యుని దగ్గరకు వెళ్లినట్లయితే ఆ పుచ్చిన పంటికి జింక్ ఆక్సైడ్ సిమెంట్‌గాని, సిల్వర్‌గాని నింపుతాడు. కాని ఏ విధమైన చికిత్స పొందనట్లయితే ఆ పన్ను బాగా పుచ్చిపోయి పంటిలో ఉన్న జీవనాడులు, రక్తనాళాలు బయటపడిపోయి బాక్టీరియా ప్రవేశించి, పంటిని నాశనం చేస్తుంది. ఈ పరిస్థితిలో కూడా విపరీతమైన నొప్పి కలుగుతుంది.
పంటినొప్పికి పెయిన్‌బామ్ వాడవచ్చా?
చాలామంది పంటినొప్పి వచ్చిందంటే ఏదో ఒక నొప్పిని తగ్గించే బామ్‌ని వాడతారు. వేడినీటితో లేక వేడి ఉప్పుతో కాపడం చేస్తారు. ఈ విధంగా చేయడంవల్ల పంటి దగ్గర దవడ ఎముక బాగా కమిలిపోయి ఇంకా ఎక్కువ నొప్పి రావడం జరుగుతుంది. తరువాత దవడ వాపు వచ్చి విపరీతమైన నొప్పి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా పెయిన్‌బామ్‌ను వాడకూడదు. అలా వాడడంవల్ల దవడ భాగంలో చీము ఏర్పడుతుంది. ఈ చీము తీసివేయడానికి దవడ దగ్గర రంధ్రం చేసి చీమును తొలగించాలి. లేకుంటే ఆ చీము గొంతులోని మాగ్జిలరీ సైనస్‌లోకిపోయి ఎంకా ఎక్కువ ప్రమాదానికి దారితీస్తుంది. కనుక పరిస్థితి విషమించకుండా చీముని తీసివేయవలసి ఉంటుంది.
అదేవిధంగా బాగా పుచ్చిపోయిన పంటి రూట్‌లో క్రిందగా దవడ ఎముక భాగంలో చీము ఏర్పడుతుంది. ఈ చీమును తీసివేయకుంటే దవడ బాగా వాచి అక్కడ చీము పేరుకుపోయి ఉంటుంది. దీనిని డెంటల్ ఏబ్బిస్ అంటారు. ఈ దశలో కూడా మనకు చాలా నొప్పి కలుగుతుంది. ఈ దవడ మీద ఉన్న చీమును తీసివేస్తే కాని వాపు తగ్గదు. కనుక దవడకు రంధ్రం చేసినట్లయితే చీమంతా బయటకు పోతుంది. ఆ తరువాత ఆ భాగంలో ఒక మచ్చ ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా దంతవైద్యుడిని సంప్రదించినట్లయితే పన్ను పీకవలసిన పనిలేదు. ఆ పంటికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేసి చికిత్స చేసి పంటిని కాపాడుకోవచ్చు.
పన్ను తీసివేస్తే కన్ను పోతుందా?
పన్ను పీకించుకోవడంవల్ల ఏ విధమైన ప్రమాదం లేదు. చాలామంది పన్ను పీకించుకుంటే కంటిచూపు తగ్గడం, కొంతమంది కళ్లు పోతాయి అనే మూఢ నమ్మకాలు ఉన్నాయి. కాని పన్నుకు కన్నుకు ఎటువంటి సంబంధం లేదు. పన్ను పీకించుకోవడంవల్ల ఎట్టి పరిస్థితుల్లోను కంటికి ఎలాంటి హాని జరగదు.
పుచ్చిన పంటిలో పురుగులుంటాయా?
పళ్లను మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల బాక్టీరియా అంటే రోగపూరిత సూక్ష్మజీవులు ఇవి మన కంటికి కనిపించవు. బాక్టీరియాను మైక్రోస్కోప్‌తోనే చూడవలసి ఉంటుంది. కనుక పంటిలో ఏ విధమైన పురుగులు, కీటకాలు ఉండవు. కొంతమంది మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లి పురుగు తీయించుకోవడం చేస్తారు. కొంతమంది చెవిలో పసర్లు వేసి నోటిలోనుండి పురుగులు పడడం, మరి కొంతమంది నోటిలో పసరు వేసి పుక్కిలించడంవల్ల పుచ్చిన పంటిలో ఉన్న పురుగులు పడిపోయి, ఆ తరవాత పంటి నొప్పి ఉండదు అని చెబుతుంటారు. ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలే తప్ప మరేమీ కాదు.

No comments:

Post a Comment