Pages

Sunday, 26 October 2014

నాడీ వ్యవస్థ దెబ్బతింటే నిద్రలేమి!

సర్వశరీరగతంగా వ్యాపించిన కండరాల నొప్పిని ఫైబ్రోమైయాల్జియా అంటారు. నొప్పి కండరాల్లోనూ, మెత్తని కణజాల సముదాయాల్లోనూ నిగూఢంగా ఉంటుంది. కటి ప్రదేశానికి ఎగువన, దిగువన, శరీరానికి ఇరుపక్కలా కేంద్రీకృతమై ఉంటుంది. నిజానికి ఇది ఒక వ్యాధి కాదు కొన్ని లక్షణాల సమూహం. అందుకే దీనిని సిండ్రోమ్ అంటారు. స్పష్టమైన కారణాలు తెలియని సమస్య ఇది. ఈ స్థితి ప్రాప్తించినవారిలో నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. నరాలు, మెదడు, వెన్నుపాముకు చేరే సంకేతాలు సక్రమంగా తర్జుమా కావు. దీంతో కండరాలు, జాయింట్లు, మెత్తటి కణజాలాల్లో జరిగే మామూలు మార్పులను మెదడు నొప్పిని అన్వయించుకుంటుంది. అందుకే ఫైబ్రోమైయాల్జియా కలిగిన వ్యక్తుల్లో శరీరంమీద గాయాలు, దెబ్బలూ వంటివి లేకపోయినప్పటికీ నొప్పులతో ఇబ్బందిపడుతుంటారు.
ఫైబ్రోమైయాల్జియా అనే పదం ల్యా టిన్ నుంచి వచ్చింది. ఫైబ్రస్ అంటే గట్టి నార వంటి కణజాలమని అర్థం. మయో అంటే కండరాలకు సంబంధించినది అని అర్థం. ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. కండరాలు, సంధాయక కణజాలాల్లో నొప్పి ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని ఫైబ్రోమైయాల్జియాగా వ్యవహరిస్తారు.
కారణాలు
ఈ వ్యాధికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ అధ్యయనకారులు కొన్ని అంశాలను కారణాలుగా ప్రతిపాదిస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా ఒకరికి ఈ సమస్య ఉంటే మిగతావారిలో కూడా కనిపించవచ్చు. ఇలా ముఖ్యంగా మహిళల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సమూహాన్ని 1980 నుంచి ఒక వైద్యపరమైన సమస్యగా వైద్యలోకం పరిగణించటం మొదలుపెట్టింది. పైబ్రోమైయాల్జియాకు దారితీసే కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం.
మెదడులోను, వెన్నుపాములోనూ ఉండే నరాల కణజాలం బాగా సున్నితంగా మారటం వల్లగానీ, లేదా నాడీ వ్యవస్థలో తయారయ్యే రసాయనాల మొత్తాల్లో మార్పులు చోటుచేసుకోవటంవల్లగానీ నరాల కణజాలం అత్యధికంగా స్పందిస్తుంది. దీంతో చిన్నపాటి కారణానికే, కొద్దిపాటి మార్పుకే శరీరం నొప్పిని పసిగడుతుంది. మానసిక ప్రవర్తన (మూడ్)ని నియంత్రించే మెదడులోని జీవరసాయనాల్లో మార్పులు రావటంవల్ల నొప్పిని తట్టుకునే తత్వం తగ్గిపోతుంది. దీంతో నిద్రలో విశ్రాంతి లభించకపోవటం, నిస్త్రాణ వంటివి కలుగుతాయి. దీని తరువాత బాధితుల శారీరక చైతన్యం తగ్గిపోతుంది. కండరాల్లోను, కణజాలాల్లోనూ ఫ్లూజ్వరంలో మాదిరిగా అకారణంగా నొప్పిగా అనిపిస్తుంటుంది.
కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ వంటి హార్మోన్ల విడుదలను మెదడులోని పిట్యూటరి గ్రంథి, హైపోథెలామస్ అనే భాగాలు నియంత్రిస్తుంటాయి. ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి లోనైనవారిలో ఈ హార్మోన్ల విడుదలలో తేడాలు చోటుచేసుకుంటాయి. వీటి తయారీలో సంభవించిన అసమతుల్యత కారణంగా నిస్త్రాణ, ప్రవర్తనలో మార్పులు, విషయగ్రహణ శక్తితగ్గటం, మనసును లగ్నం చేయలేకపోవటం, నొప్పిని తట్టుకోలేకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
నిద్రలో గాఢనిద్ర స్థితిని పొందలేకపోవటం ఈ వ్యాధికి మరో కారణం. గ్రోత్ హార్మోన్ వంటి పదార్థాలు గాఢ నిద్రలో విడుదలవుతుంటాయి. నిద్రచెదిరినప్పుడు ఈ హార్మోన్ల విడుదలకు అంతరాయం ఏర్పడుతుంది. నిద్ర చెడిపోవటం అనేది ఫైబ్రోమైయాల్జియా వ్యాధిలో ఒక లక్షణంగానూ, ఒక కారణంగాను పరిణమిస్తుంది. చాలామంది ఫైబ్రోమైయాల్జియా లక్షణాలను ఇతర వ్యాధిస్థితులకు ఆపాదించుకుంటారు. ఫ్లూజ్వరం, దెబ్బలు తగలటం, శస్తచ్రికిత్స దుష్ఫలితాలు, మనోభిఘాతం, ఒత్తిడి. ఇలాంటివాటి కారణంగా ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ప్రారంభమైనట్లు భావిస్తుంటారు. మరికొంతమంది ఈ వ్యాధి లక్షణాలను ‘వేడి చేయటం’గా అభివర్ణిస్తుంటారు.
లక్షణాలు
ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒకో తీవ్రతతో, ఒకో పద్ధతిలో వ్యక్తమవుతాయి. ముఖ్యంగా నడుము పైభాగంలోనూ, అలాగే నడుము దిగువ భాగంలోనూ నొప్పి ఏకకాలంలో కనిపిస్తుందని చెబుతుంటారు. అలాగే నొప్పి, శరీరంలో కుడి ఎడమ భాగాల్లో ఒకే స్థాయిలో కనిపిస్తుందని చెపుతుంటారు. ప్రధానంగా మొండెం, మెడ, నడుము, తుంటి భాగం, భుజాలు... ఈ భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. హస్తపాదాల్లో అంతగా ఉండదు. నొప్పి అస్పష్టంగా మొదలై క్రమంగా తీవ్రతరమవుతుంది. ఫైబ్రోమైయాల్జియా వ్యాధి లక్షణాలను పోలిన లక్షణాలు అనేక ఇతర వ్యాధుల్లో కనిపిస్తాయి. కనుక ఇతర వ్యాధుల ఉనికిని పరీక్షించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫైబ్రోమైయాల్జియాతోపాటు ఇతర వ్యాధులు కూడా సమాంతరంగా ఉండే అవకాశం ఉంటుంది. *

No comments:

Post a Comment