Pages

Sunday, 26 October 2014

కొవ్వు తగ్గితే గుండెకు హాయ..

గుండెపోటు ఎవరికైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడ ఎలా వున్నా రావచ్చు. గుండెకు రక్తసరఫరా చేసే నాళాలు మూడు. వాటిని కరోనరి ఆర్టెరీస్ అంటారు. వీటిల్లో అడ్డంకులు వస్తే గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దాంతో ఆహారం, ఆక్సిజన్ సరిగ్గా అందదు. కార్డియక్ అరెస్ట్ సంభవించి గుండె కండరాలు నీరసిస్తాయ. లేకపోతే గుండెపోటు రావొచ్చు.
మన దేశంలో మరణాలలో ఎక్కువ శాతం గుండెపోటు కారణానే జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాలలో వాళ్లకన్నా పది సంవత్సరాల ముందే మన దేశంలో గుండెపోటులొస్తున్నాయి.
హార్ట్ ఎటాక్ వస్తే ఏం జరుగుతుంది?
గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని శరీరంలోని భాగాలన్నింటికి చేరేలా పంప్ చేస్తుంది. రక్తప్రసరణకి ముఖ్య రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని ప్రాంతాలకి వెళ్తుంటే, వాటినుంచి శాఖోపశాఖలు చీలి శరీరంలోని అన్ని అవయవాలకూ చేరుతుంటుంది. ఒక్కో అవయవానికి ఒక్కో నాళం ద్వారా రక్తసరఫరా జరుగుతూంటుంది. గుండె కరోనరి, ఆర్టెరి మూడు శాఖలుగా చీలి రక్త సరఫరా జరిగేలా చూస్తుంటుంది. ఏ భాగాలకు రక్తసరఫరా తగ్గినా ఆక్సిజన్ ఆహారం సరిగా లభ్యంకాక బాధపడుతుంటారు. గుండెకి రక్తసరఫరా తగ్గినా అంతే! గుండె చాలా ముఖ్యమైన అవయవం. రక్తాన్ని ‘లబ్ - డబ్’ అని కొట్టుకుంటూ అన్ని అవయవాలకు ప్రసరింపజేసి, కార్బన్‌డయాక్సైడ్‌తో కూడిన రక్తాన్ని వెనక్కి తెచ్చుకుని ఊపిరితిత్తులలోకి పంపి, కార్బన్‌డయాక్సైడ్‌ని బయటకు పంపి, ఆక్సిజన్‌ని రక్తం ద్వారా తీసుకుని మళ్లీ అన్ని అవయవాలకు పంపుతుంటుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాలలో గోడలమీద పేరుకుపోవడం జరుగుతుంది. అలా పేరుకుంటున్న కొలెస్ట్రాల్ పదార్థం రక్తనాళాలలో రక్తం ప్రవహించే మార్గాల్ని మూసేస్తూంటుంది. దాంతో గుండెకి కావలసిన రక్తం అందక హార్ట్‌ఎటాక్ వస్తుంది. కాలం గడిచినకొద్ది ఆహారం, ఆక్సిజన్ అందక రక్తప్రసరణ లోపించడంతో గుండె కండరాలు దెబ్బతింటాయి.
కొద్ది కొద్దిగా గుండె రక్తనాళాలు మూసుకుపోవడం ప్రారంభమైనపుడు కొన్ని హెచ్చరికలు వస్తాయి. వాటిని ఎంజైనా అంటారు. గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి. ఆయాసపడుతుంటారు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంటుంది. గుండె ప్రాంతంలో నొప్పిగా ఉండవచ్చు. ఆ నొప్పి చేతులలోకి వెళ్తుండవచ్చు. దవడలోకి వెళ్లవచ్చు. కిందకు రావచ్చు. కాబట్టి బొడ్డు నుంచి దవడల వరకూ రకరకాలుగా మిమిక్ చేస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో నొప్పి ఉంటే వెంటనే గుండె వైద్యుణ్ణి కలిసి ఇసిజి తీయించాలి. అది గుండె నొప్పయితే ఈ చిన్న పరీక్షలో తెలిసిపోతుంది. గుండె నొప్పయితే గుండె చికిత్సా నిపుణులతో అత్యవసరంగా చికిత్స చేయించుకోవాలి. లేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు. ఛాతీ మధ్యభాగంలో మంట వస్తే ఎసిడిటి తాలూకు నొప్పి అని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నట్లవుతుంది!
లక్షణాలు
గుండెపోటు చాలా సార్లు ఛాతిలో చిన్న నొప్పిగా ప్రారంభమై- అడ్డంకులు పెరిగేకొద్దీ- పెరుగుతుంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. అందుకని ఛాతిలో నొప్పి చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది ఈ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం తీసుకువస్తుంది. చాలాసార్లు మనమింతకు చెప్పుకున్నట్లు ఎసిడిటి అనో, అజీర్ణమనో భావించి వైద్యుణ్ణి కలవకుండా ఉండడంతో హఠాత్తుగా రోగి నొప్పితో తన్నుకునే పరిస్థితి వస్తుంది.
చికిత్స
హార్ట్ ఎటాక్ తీవ్రంగా వచ్చినపుడు ప్రతి నిమిషం విలువైనది! ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత వేగంగా గుండె కండరాలు దెబ్బతినడాన్ని అరికట్టవచ్చు. ప్రాణాన్ని కాపాడవచ్చు, గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తిని పునరుద్ధరించి! దాంతో వేగంగా కోలుకుంటారు.
చికిత్సని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకోవాలి. ముఖ్యంగా లక్షణాలు కనిపించిన రెండు గంటలలోపు. గుండెపోటు వచ్చిందని తెలిసింతర్వాత అయిదు నిముషాలు కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఇ.సి.జి తీసి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకుంటారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసి, వాటిని తొలగించాలి. ఒకప్పుడు యాంజియోప్లాస్టి అంటే శస్త్ర చికిత్స కాదు, ప్రొసీజర్. గతంలో తొడద్వారా కేథటార్‌ని పంపి అడ్డంకుల్ని తొలగించేవారు. రక్తస్రావం ఎక్కువగా ఉండేది. కదలకుండా ఒక రోజు విశ్రాంతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు చేతి రేడియల్ ఆర్టీ ద్వారా యాంజియో చేస్తున్నారు. పొద్దున చేయించుకుని, విశ్రాంతి తీసుకుని రాత్రికి ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు. చేతి ద్వారా చేయటంవల్ల చాలా తేలికగా పొసీజర్ జరుగుతుంది. దీనిని ‘రేడియల్ యాంజియో’ అంటారు.
రేడియల్ యాంజియో ద్వారా ఇప్పుడు అతి క్లిష్టమైన అడ్డంకుల్ని తొలగిస్తున్నారు. గట్టిగా అయిపోయిన వాటిని ఆర్టరీ చీలే చోట ఉన్న అడ్డంకుల్ని గుండెకి రక్తం సరఫరా చేసే ముఖ్యమైన ఆర్టెరీలో బ్లాక్‌లు వున్న యాంజియోప్లాస్టీతో తొలగిస్తున్నారు. కేథటార్‌ని లోపలకు పంపి ఇంజెక్షన్‌నిచ్చి అడ్డంకుల్ని తెలుసుకోవడాన్ని ‘యాంజియోగ్రామ్’ అంటారు. కేథటార్ ద్వారా అడ్డంకుల్ని తొలగించే ప్రక్రియని ‘యాంజియోప్లాస్టీ’ అంటారు. అడ్డంకుల్ని తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో రక్తనాళం మూసుకుపోకుండా స్టంట్‌లని అమరుస్తారు. అనుభవమున్న గుండె చికిత్సా నిపుణులతోనే యాంజియోప్లాస్టి, స్టంటింగ్ చేయించుకోవాలి.

No comments:

Post a Comment