Pages

Friday, 19 September 2014


హెపటైటిస్‌కు చోటు.. కాలేయానికి చేటు

హెపటైటిస్ లాంటి వ్యాధులవల్ల లివర్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కో ప్రాంతాన్ని బట్టి లివర్ ఫెయిల్యూర్‌కి కారణాలు మారుతుంటాయి. విష పదార్థాలు, కొన్ని రకాలమందులు, ఆల్కహాల్, ఫాటీ లివర్ లాంటి ఎన్నో కారణాలు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి దాని పనిని అది పూర్తిగా నిర్వర్తించలేని స్థితికి తీసుకొస్తాయి. మన దేశంలో 23 నుంచి 56.5 శాతం వరకు హెపటైటిస్ వ్యాధుల కారణంగా లివర్ దెబ్బతినే సమస్య ఎదురవుతుంది. హెపటైటిస్ ఎ, బిలు కూడా మన దేశంలో ఎక్కువ కావడంవల్ల లివర్ వ్యాధులకు ఇది మరో ప్రధాన కారణం. మందులవల్ల లివర్ దెబ్బతినేవారి శాతం 4.6. మూత్రపిండాలు దెబ్బతింటే కొన్నాళ్లపాటు డయాలసిస్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. ఊపిరితిత్తులు దెబ్బతింటే వెంటిలేటర్స్‌మీద ఉంచవచ్చు. కాని లివర్ దెబ్బతింటే అలాంటి ప్రాణాలు కాపాడే పద్ధతులు ఏవీ లేవు. లివర్ పూర్తిగా దెబ్బతిన్నవారికి మార్పిడి ఒక్కటే మార్గం. లివర్ ఫెయిల్యూర్‌తో మరణించేవారు మన దేశంలో చాలా ఎక్కువ. అలాంటివారికి సంబంధించిన సరైన గణాంకాలు మన దేశంలో లేవు. పాశ్చత్య దేశాల్లో ఒక మిలియన్ జనాభాలో సంవత్సరానికి ఎనిమిది నుంచి పది వరకు మాత్రమే లివర్ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. యుకెలో ఏటా 50 నుంచి 60 వరకు లివర్ మార్పిడులు జరుగుతున్నాయి. మన దగ్గర దాదాపుగా ప్రతి సంవత్సరం 7 నుంచి 12వేల మంది లివర్ జబ్బులతో బాధపడుతున్నారు. వారిలో 1200 నుంచి 2000 మంది వరకు లివర్ మార్పిడి జరగకపోవడంవల్ల మరణిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ నలుగురైదుగురు లివర్ మార్పిడి జరుగక మరణిస్తున్నారు.
మన శరీరంలో చనిపోయేవరకూ పెరిగే అవయవం లివర్ ఒక్కటే. మూడో వంతు లివర్ ఉంటే చాలు. రెండు నెలల్లో మామూలు పరిమాణానికి పెరిగిపోతుంది. లివర్ మార్పిడిలో డోనర్‌కి వ్యాధిగ్రస్తుడు రక్తసంబంధికుడై ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయినవాళ్లనుంచి స్వీకరించే అవయవదానాన్ని కెడావరిక్ డొనేషన్ అంటారు. అవయవదానికి ఇరువర్గాలు ఒప్పుకోవడం ప్రధానం.
ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఎక్కువగా 20-40 సంవత్సరాల మధ్యవయస్సు వాళ్ళల్లో వస్తుంది. అంతకుముందు రోజువరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో కూడా హఠాత్తుగా ఈ ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కన్పిస్తోంది. వీరికి లివర్ మార్పిడి జరుగకపోతే మరణించే అవకాశం 80 శాతం. సకాలంలో లివర్ మార్పిడి చేయడంతో ఈ 80 శాతం మందిని రక్షించవచ్చు.
లివర్ దెబ్బతిన్నప్పటికీ రోగ నిర్థారణ కాకముందే కొంతమందికి మరణం సంభవిస్తుంది. లివర్ దెబ్బతింటుందన్న లక్షణాల్ని గుర్తించలేకపోతున్నారు. కొంతమందిలో మాత్రమే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఉన్నా సకాలంలో గుర్తిస్తే మందులతోనూ నయమవుతుంది. లివర్ మార్పిడి అనేది రోగిని బ్రతికించడం అనేది చివరి మార్గంగా ఎంచుకుంటారు. రోగ నిర్థారణలో ఆలస్యమైనా, సకాలంలో సరైన వైద్యం అందక తీవ్ర స్థాయిలో బాధపడుతున్నవారికి మార్పిడి కూడా కష్టసాధ్యమే. అందువల్ల శరీరంలో 500 పనులకుపైగా చేసే లివర్ ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకుంటూ ఉండాలి. రిస్క్ ఫ్యాక్టర్‌లని గమనించి జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుమానం రాగానే సరైన వైద్యుణ్ణి కలవడం అవసరం. ఈ విషయాలపట్ల ప్రజలలో అవగాహన పెరగాలి. లివర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

No comments:

Post a Comment