Pages

Wednesday, 20 August 2014


అదృశ్య భల్లూకం (కథ)


కన్నడ మూలం: మంజు యం.దొడ్డమణి అనువాదం: కల్లూరు జానకి రామారావు
లెక్కలేనన్ని రంధ్రాలతో చినిగిన బనియన్ తొడుక్కుని, తెగిపోయిన హవాయి చెప్పును పిన్నుతో కుట్టి- కుంటి లింగన్నగాడు ఏకబిగిన కుంటుకుంటూ ఎగబీలుస్తూ, ఇంటి అరుగుమీద కూర్చున్న గాజుల శివప్పకాడికి వచ్చి, ఎగూపిరి దిగూపిరితో నిల్చున్నాడు. వాణ్ని చూడగానే గాజుల శివప్పకి ఆరాటం ఎక్కువైంది. ‘‘ఏందిరా.. కుంటోడా, ఇట్లా లగెత్తుకుని ఆయాసపడుకుంటూ వచ్చినావేందిరా? ఏమయినాదిరా?’’ అని సముదాయించే సమయంలోనే కుంటోడు సరోజ చావు విషయాన్ని ఆద్యంతమూ చెప్పగానే విని గాజుల శివప్ప కుప్పకూలినంత నిశ్శక్తుడైనా, నిలదొక్కుకుని వస్తున్న దుఃఖాన్ని అతికష్టంమీద ఆపుకుంటూ, కుంటోడు చెప్పిన ఈ విషయం నిజం కాకూడదని వేయి దేవుళ్లకి మొక్కుకుంటూ, నదివైపు త్వరత్వరగా అడుగులు వేశాడు. శివప్ప వెనకాలే బయల్దేరాడు కుంటోడు.
***
కొనే్నళ్ల క్రితం బస్సు సౌకర్యమే లేని ఈ కుగ్రామానికి ఇసుకను సాగేసే ఓ లారీలోంచి ఎక్కణ్నుంచో వచ్చి ఇక్కడ దిగాడు కుంటోడు. నది ఒడ్డున శివలింగేశ్వరస్వామి గుళ్లో పూజారి పంచిపెడుతున్న ప్రసాదంతో కడుపు నింపుకుని రాత్రీపగలూ అక్కడే గడుపుతూ వుండేవాడు. రాను రానూ తానొక అనాథనని, ఊరూరూ తిరుగుతూండే బికారినని చెప్పుకుంటూ పూజారి సానుభూతిని సంపాదించాడు. కొందరి ఇళ్ళల్లో, పొలాల్లో పనే్జసి వాళ్లిచ్చిన చిల్లర కాసుల్ని పోగుచేసుకుని, అప్పుడప్పుడు లారీలని క్లీన్ చేస్తూ లారీ డ్రయివర్లు ఇచ్చిన పైసల్తో, వారానికోసారైనా దూరంగా వున్న పట్టణానికెళ్లి ఇంగ్లీషు చిత్రాలనాడిస్తున్న టెంట్లలోకెళ్లి సినిమాలని చూసి వచ్చేవాడు. ఇంగ్లీషు సినిమాలంటే కుంటోడికి ఎక్కడలేని వ్యామోహం. అయితే, వూళ్లోవాళ్లెవళ్లకీ ఈ విషయం తెల్సేదే కాదు. ఈ విషయం ఎవ్వరికీ తెలియనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. వాడి మంచితనాన్ని గమనించిన దేవస్థానపు కార్యదర్శి, పూజారి- గుడికో కావలివాడు దొరికాడని, గుడి కాంపౌండుకానుకొనున్న ఓ చిన్న పెంకుటింటిని వాడు ఉండటానికి కేటాయించారు. కుంటోడు సహితం వూరివాళ్లు తనపైన వుంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కాలం గడిపేవాడు. కుంటి లింగడి పూర్తి పేరేమిటనేది వూళ్లోవాళ్లెవరికీ తెలీని విషయం. వాడు మాత్రం తన పేరు లింగారాజని చెప్పుకుంటూ తిరిగేవాడు. లింగడు పుట్టుకతోటే కుంటోడు కాదు. అడవిలో ఓసారి తేనెపట్టును తీయబోయి, చెట్టునుండి కిందపడితే కుడికాలికి పెద్ద దెబ్బ తగిలింది. అయితే, దానికి సరైన చికిత్స ఏదీ చేసుకోకపోగా కుంటుతూ నడవటం ప్రారంభించాడు. ఆనాటినుంచి వాడు కుంటి లింగడయ్యాడు.
***
నదికి ఫర్లాంగు దూరంలో పొదల నడుమ పడున్న శవాన్ని గుంపులో కొందరు గుర్తుపట్టారు. అర్ధనగ్నంగా పడున్న ఆ శరీరాన్ని ఎవరో పుణ్యాత్ముడు తాను కట్టుకున్న పంచనే విప్పి చచ్చిన ఆ యువతి శరీరంపైన కప్పాడు. చచ్చిపడున్నది గాజుల శివప్ప కూతురు సరోజ! పెద్దమనిషై ఎన్నో నెలలు కాలేదు. పాపం..! తల్లి ప్రేమే ఎరగక తండ్రి ఆసరాలో పెరిగిన అమాయక ఆడకూతురు. పొద్దు పొడవకముందే లేచి, తండ్రి వద్దంటున్నా నదీ తీరానికొచ్చిన రెండు గంటల్లోపే శవమైపోయింది.
శవం చుట్టూ చేరిన అమాయకపు జనాల అనుమానమంతా ఆ కనిపించని ఎలుగుబంటిపైనే! ఓ నెలకిందట పొ లం కాపు కాయను వెళ్లిన చిన్నవ్వ తన పొలంలోనే ఇలాగే శవమైపోయింది.
అతి చిన్నవయసులోనే పెళ్లయి, పెళ్లయిన కొన్ని రోజులకే రోడ్డు ప్రమాదానికి గురై భర్తను కోల్పోయిన అభాగ్యురాలు చిన్నవ్వ. భర్తకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ వుండేది. ఎవరిముందు చేయిసాచక, మగాడివలే పొలంలో ఒకర్తే పనిచేసుకుంటూ వుండే ధైర్యవంతురాలైన ఆడది. అవసరమైనపుడు మాత్రమే ఓ ఇద్దరు కూలీలని పెట్టుకుని వ్యవసాయపు పనులు చేసుకుంటూ వుండేది. గవర్నమెంటు వాళ్ల సాయంతో బోర్‌వెల్ తవ్వించి దానికో చిన్న షెడ్డు కట్టించుకుంది. ఎన్నో రాత్రులు చిన్నవ్వ అదే షెడ్డులో నిర్భయంగా పొలం కాచుకుంటూ కాలం వెళ్లబుచ్చింది. ఒంటరిగానే జీవనాన్ని గడపటం ఆమెకు అలవాటైపోయింది.
ఆ రాత్రి- పంట చేతికి వచ్చి నిల్చిన సమయంలో తానే ఒంటరిగా కావలి కాయను వెళ్లింది. వెళ్లేటప్పుడు తనకెదురైన కుంటోణ్ని పలకరించింది. అయితే దాని దురదృష్టం.. అదే దాని కడపటి రాత్రి అయ్యింది. తాను నివాసముండే షెడ్డుకు కొంచెం దూరంలోనే- మనిషెత్తు పెరిగిన చెరకు తోట మధ్య చిన్నవ్వ శవం అనాథగా మిగిలింది. నక్కలపాలైన చిన్నవ్వ శవాన్ని మొదట చూసింది కుంటోడే. చిన్నవ్వ మరణవార్త వూరి జనానికి చేరవేశాడు. చిన్నవ్వ నిగూఢ మరణం వూరివారందరికీ కొరకరాని కొయ్య అయ్యింది. ఈ రహస్యాన్ని ఛేదించాలని, మరణానికి కారణాన్ని తెలుసుకోవడం కోసం వూరి జనాలు ముందుకు రాగా- సాయంత్రం ఒకచోట కనిపించిన ఎలుగుబంటి.. నిన్నటి రాత్రి పొలంలోకి నుగ్గి ఒంటరిగానున్న చిన్నవ్వను ఆక్రమించి చంపేసిందని, ఆమె శరీరంపైన కన్పించిన రక్కిన గోళ్ల గుర్తులని చూపించాడు కుంటోడు. అతడు చెప్పినట్లే- ఆ కనిపించని ఎలుగుబంటే దీనికి కారణమని అందరూ నిర్థారించారు. చిన్నవ్వ శరీరానికి అంత్యక్రియలు ఊళ్లోవాళ్లే అందరూ కలిసి నిర్వహించారు. తన రక్తసంబంధీకురాలిని పోగొట్టుకున్నంతగా కుంటోడు వలవలా ఏడ్చాడు. చిన్నవ్వ వీణ్ణి తన తమ్ముడిలా చూసుకుంటూ వుండేది.
ఈ ఘటన నడచిన మరుదినమే ఊరిలోని ప్రముఖులందరూ చేరి, తమ గ్రామానికి సంబంధించిన ఫారెస్టు ఆఫీసుకెళ్లి, ఆ ఎలుగుబంటిని పట్టుకుని తమను రక్షించవలసిందిగా ఫారెస్టు ఆఫీసు సిబ్బందిని ప్రార్థించారు. వెంటనే ఫారెస్టు డిపార్టుమెంటు వాళ్లు స్పందించి పనె్నండు మందిగల ఓ దళాన్ని ప్రతిరోజూ ఓ వారం రోజులపాటు, ఆ పల్లెల్లోని పొలాల్లో, తోటల్లో, అడవుల్లో గస్తీ ని ర్వహించి, కన్నుల్లో కన్నుపెట్టి గాలించినా ఎల్లాంటి ప్రయోజనం కన్పించకపోగా, ‘కానిపనికి కష్టం మెండని’ ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులు అక్కడి నుంచి నిష్క్రమించారు. వాళ్లు వెనుదిరిగి వెళ్లిన తర్వాత గ్రామస్థులు ఒక్కొక్కరే ప్రయాణామైపోవటాన్ని తగ్గించారు. నలుగురైదుగురు కలిసి గంపులుగా చేతుల్లో బడితెలతో తాము వెళ్లవలసిన చోటికి వెళ్లటం ప్రారంభించారు. గ్రామస్థులందరికీ ప్రాణభయం కరడుగట్టుకొనిపోయింది. ఆనాటినుంచి- ఎవరికీ కనిపించని ఆ ఎలుగుబంటే వాళ్ల ఆలోచనల్లో నిల్చిపోయింది.
****
తాను విన్న వార్త నిజం కాకూడదని వేయి దేవుళ్లకి మొక్కుకుంటూ, ఆతురాతురతో పరుగెత్తి వస్తున్న గాజుల శివప్ప- అక్కడ చేరిన గుంపులోకి దూసుకెళ్లి, నిర్జీవంగా పడున్న తన కూతుర్ని చూసి కడుపు తరుక్కుపోయేలా భోరుభోరున ఏడవడం ప్రారంభించాడు. అక్కడున్నవాళ్లు ఆయన్ని పట్టుకుని ఓదార్చకపోయి వున్నట్లయితే, అక్కడే పారుతున్న ఆ నదిలో పడి ప్రాణం తీసుకుని వుండేవాడే.
కూతురుపైన తనకున్న ప్రేమ అలాంటిది. కూతురు లేకుండా తాను జీవించటం సాధ్యం కాదనుకున్నాడు. కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖం, సంకటం గాజుల శివప్పని ప్రతిక్షణం హింసించసాగాయి. సరోజ చావుకు కారణం ఆ భల్లూకమేనని, అందులో సందేహమేమీ లేదని కుంటోడు ఇతరుల్తో అంటున్నప్పుడు, ఆ కనిపించని ఎలుగుబంటిని చీల్చి చెండాడి గ్రామ ద్వారానికి వేలాడగట్టాలనే ఆవేశం గాజుల శివప్పది. అయితే- ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
తల్లిలేని పిల్లని ఎంతో గారాబంగా పెంచాడు. ఇక మూడే మాసాల్లో కూతురు పెళ్లిచేయడానికని అన్నీ సిద్ధం చేసికొన్నాడు శివప్ప. మూడు నెలల కిందటే సరోజకి బంగారపు గాజులు చేయించి చేతులకి తొడుక్కోమన్నాడు. అయితే ఆమె ఎందు కో వేసుకోలేకపోయింది. దానికి బదులుగా తండ్రి విక్రయంచే ఆకుపచ్చని మట్టిగాజులే తొడుక్కుని ఎంతో సంబరంగా ఇల్లంతా గెంతింది.
ఉన్న ఒక్క ఆడకూతురు ఇప్పుడు లేకుండాపోయింది. కూతురు జ్ఞాపకాలు ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. చేసేది లేక ఒక్కగానొక్క కూతుర్ని మట్టిపాలు చేసి, బరువెక్కిన గుండెతో ఇంటి మార్గం పట్టాడు గాజుల శివయ్య.
సాయంకాలం గాజుల శివప్ప ఇంట్లో సరోజ పటం ముందు దీపం ప్రకాశించసాగింది. ఆ దీపమున్న చూరుకే శివప్ప శవం వేలాడుతూంది. ఇంత జరిగినా ఆ గ్రామస్థులెవ్వరూ పోలీస్ స్టేషన్‌వైపు చూడలేదు.
పతి ఇంటినుండి ఒక్కొక్కరు చొప్పున, పది గుంపులై, ఒక్కో గుంపు ఒక్కో దిక్కు, ఊరి నాల్గు దిక్కులా, ఆ అదృశ్య భల్లూకాన్ని వేటాడేందుకు బయల్దేరారు. ఎవ్వరికీ కన్పించని ఆ నల్లటి భయంకర భల్లూకం మాత్రం గ్రామస్థుల మధ్యలో రాజోచితంగా తన కామతృష్ణ తీర్చుకోవడానికి, ఇంకొకర్ని బలి తీసుకోడానికి- మనిషి రూపంలో కుంటుకుంటూ పోతున్నది.

*

No comments:

Post a Comment