Pages

Wednesday, 20 August 2014


అవును.. అర్థమైంది..!


‘‘అత్తయ్యా.. స్టౌ మీద అన్నం పెట్టాను. కుక్కర్ నాలుగు కూతలు రాగానే కట్టేయండి.. నేను స్నానానికి వెళుతున్నాను’’ అంది కోడలు తులసి.
‘‘సరే!’’ అంది హాల్లో కుర్చీలు సర్దుతూ పార్వతమ్మగారు. అప్పుడు సమయం ఉదయం తొమ్మిది కావస్తోంది. పిల్లలిద్దరూ స్కూలుకెళ్లిపోయారు. వాళ్ళను స్కూలుకి రెడీ చేసి పంపించేటప్పటికి ఎనిమిదిన్నర.. ఆ తరువాత కాస్త కాఫీ తాగి స్నానానికి బయలుదేరింది తను.
స్నానం చేసి బయటికొచ్చేటప్పటికి పార్వతమ్మగారు కుక్కర్ కట్టేసింది. ఆపై భర్త సురేష్ అన్నం తిని ఆఫీస్‌కి బయలుదేరాడు. అప్పుడు సమయం పది. కాస్త తీరిక దొరికింది తులసికి. తీరికంటే పెద్దగా రిలాక్స్ అవ్వడానికేం లేదు. ఇంకా నిన్న విడిచిన బట్టలు కుప్పలుగా పడి ఎదురుచూస్తున్నాయి ‘మమ్మల్ని ఎప్పుడు పునీతం చేస్తావ్?’ అన్నట్లు! ‘ఇదిగో మీ పనిమీదే ఉంటానని’ ఓ హామీ పడేసింది తులసి.
పార్వతమ్మగారికిద్దరు సంతానం. భర్త పోయి అయిదేళ్ళయింది. అప్పట్నించీ ఆవిడ కొడుకు దగ్గిర కొంతకాలం, కూతురు దగ్గర కొంతకాలం ఉంటూ కాలం వెళ్ళదీస్తోంది. అత్తగారు కూడా ఉండడంతో రెణ్ణెల్లనుంచీ తులసికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఇంతటి మహానగరంలో, జనారణ్యంలో ఆత్మీయంగా పలకరించేవారెవరు? చుట్టూ నీళ్ళే ఉన్నా- తాగడానికి గుక్కెడు నీళ్ళు కరవన్నట్టు చుట్టూ ఇంతమంది జనమున్నప్పటికీ నా అన్నవాళ్ళు లేనపుడు అదో పెద్ద వెలితే! అత్తగారు వచ్చినప్పటినుంచీ కాస్త మనసుకి నిండుగా వుంటోంది. ఆమెమీద తానేమీ పనిభారం మోపదు. తనంతట తాను కల్పించుకుని ఏపనైనా చేస్తే మాత్రం కాదనదు.
ఓ పట్టాన పార్వతమ్మగారు కూతురిని వదలిపెట్టి రాదు. వైజాగ్‌లో కూతురి దగ్గర వుంటున్న తనను కొడుకు బలవంతపెడితే వచ్చింది ఓ నాలుగు నెలలుండిపోవడానికి. కూతురంటే ఆవిడకి ఎక్కువ అభిమానం కాబోలు అనుకుంటుంది తులసి.
హాల్లో సెల్‌ఫోన్ మోగుతోంది. ‘‘్ఫన్ తియ్యండి అత్తయ్యా..!’’ అంది తులసి బట్టలు పిండుతూ.
పార్వతమ్మ ఫోన్ అందుకుని ‘ఎవరూ.? ఆఁ.. నువ్వా ఎలా వున్నావురా? ఈవేళ కాలేజీకి వెళ్లలేదా? అమ్మేం చేస్తోంది..?’’ పార్వతమ్మగారి కంఠంలోనూ, ముఖంలోనూ ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తులసికి అర్థమైంది ఆ ఫోన్ ఎక్కడినుంచి వచ్చిందో! అది తన ఆడపడుచు ఇంటి దగ్గరనుంచి. ఆ మాటల్ని బట్టి ఆ ఫోన్ చేసింది తన ఆడపడుచు కొడుకు సుదీప్ అని అర్థమైంది. అక్కడినుంచి ఫోన్ వచ్చినపుడు మాత్రమే మామూలుగా పార్వతమ్మగారి గుండెల్లో ఆనందం- గొంతులోనూ, కళ్ళలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కూతురంటే ఆవిడకున్న ప్రేమ అలాంటిది. అల్లుడు వైజాగ్‌లో ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఫోన్ పేట్టేశాక పార్వతమ్మ తన ఆనందాన్ని కోడలితో పంచుకోవడం మొదలెట్టింది. ‘‘సుదీప్‌గాడు మొన్న జరిగిన హాఫ్ ఇయర్లీ పరీక్షలో రెండో ర్యాంకు సంపాదించాడట!’’ పార్వతమ్మ మొహంలో ఆనందం పెల్లుబికింది. తనే ఆ ర్యాంకు సాధించినంత సంబరం కనబడుతోంది ఆమె కళ్ళలో!
‘‘మొన్న జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో కూడా వాడికి ప్రైజ్ వచ్చిందట! వాడెంత తెలివైనవాడని..! చూస్తుండు, వాడు వాళ్ళ మేనమామనే మించిపోతాడు’’. పార్వతమ్మ మొహం వెలిగిపోతోంది. మేనమామని మించిపోవడం అంటే- తన భర్తనన్నమాట అనుకుంది తులసి.
‘‘మంచిది’’ అంది తులసి ఏ భావం వ్యక్తపరచకుండా.
‘‘ఇంకా వాడు ఆటలనీ, పాటలనీ... చాలా వాటిల్లో ఉంటాడు! పోయిన ఏడాది వాళ్ళ స్కూల్‌డేకి వేసిన డాన్సుల సి.డి పట్టుకొచ్చాడు! చూస్తే ఎంత హుషారుగా చేశాడో వెధవ! అచ్చం చిరంజీవిలా చేసేస్తున్నాడు డాన్సులు’’ మురిసిపోతోంది పార్వతమ్మ.
అంతేనా...? వాడి చెల్లెలు దీప్తి! దాని దుంపతెగా! ఏమని చెప్పాలి? పదో తరగతి చదువుతోందా..! మొన్న స్కూల్లో వ్యాసరచన పోటీ పెడితే ఫస్టు ప్రైజ్ కొట్టిందట! అదీ ఇంగ్లీషులో..! చూడు... పిల్లలిద్దరూ మెరికలనుకో!’’ చెప్పుకుపోతోంది పార్వతమ్మ గర్వంగా.
తులసికి ఆ పిల్లల ప్రతిభ పట్ల సంతోషం కలిగినప్పటికీ కించిత్ క్లేశం కూడా చోటుచేసుకుంది మనసులో.
‘‘ఏవిటీ ఈవిడ ఆనందం..! నా పిల్లలు కూడా చదువుతున్నారే...! అంత మెరిట్ కాకపోయినా ఏదో ఫర్వాలేదు! తన కొడుకు రాజేష్ సెకెండ్ వచ్చాడు పదో తరగతిలో. సుష్మ ఆరో క్లాసులో మొన్నా మధ్య సంస్కృత శ్లోకాల పోటీలో థర్డ్‌ప్రైజు గెలుచుకుంది. ఆ విషయం చెప్పినపుడు అత్తగారి మొహంలో ఇంత ఉత్సాహం కనబడలేదే..! కారణం ఏమై ఉంటుంది? ఏమోలే...! ఎదుటివారి మనస్తత్వం అర్థం కావడం అంత తేలిక కాదు’ అనుకొంది తులసి.
ఓ రోజు సాయంకాలం రాత్రికి కావలసిన కూరగాయలు తరిగే పనిలో పడ్డారు అత్తాకోడళ్లిద్దరూ. పెద్దగా కూరగాయలేవీ ఇంట్లో లేకపోవడంతో ‘‘ఈ పూటకి సాంబారు చేసి సరిపెడదామా..? పొద్దుటి కూర ఎలాగూ ఉంది. నాలుగు వడియాలు వేపితే సరిపోతుందిగా!’ అంది తులసి.
‘‘సరే!’’ అంది పార్వతమ్మ. అలా అని వూరుకుందా..?
‘‘మా అమ్మాయిగారింట్లో కూరగాయలకెప్పుడూ లోటుండదు. వారానికి రెండుసార్లయినా అల్లుడుగారు బజారుకి వెళ్లి తీసుకువస్తారు. రోజూ ఇంటిముందు ఆకు కూరలూ అవీ అమ్ముతూ వస్తూనే వుంటాయి’’ అంది.
తులసి మనసు కొంచెం చివుక్కుమంది. అక్కడికి తాము పెద్దగా ఏమీ కనుక్కోనట్లూ, అన్నీ తన కూతురింట్లోనే వున్నట్లూ చెప్పుకొస్తుందేవిటీవిడ? మొన్నటికి మొన్న పెద్దోడు స్కూలునుంచి వచ్చి ఇంట్లో చిరుతిండి లేదని మరాం చేస్తోంటే ఓ చిన్న సైజు ఉపన్యాసం లాంటిదిచ్చింది ఈవిడగారు. సారాంశమేమిటంటే- అదే తన కూతురింట్లో అయితే పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి సిద్ధంగా ఉంటుందనీ, అలా పిల్లలు మారాం చేయాల్సిన అవసరం ఉండదనీ....
తులసికి చిర్రెత్తుకొచ్చింది అత్తగారి ధోరణి పట్ల. అయినా తమాయించుకుంది. ప్రతి విషయంలోనూ తన కూతురి కుటుంబంతో ఓ పోలిక తెస్తుంది. వాళ్ళకున్న విషయాలపట్ల ఒకింత ఆనందిస్తుంది. ఓ రకంగా ఇది తనను కించపరుస్తున్నట్లుగా అనిపించసాగింది తులసికి. అలాగని అత్తగారితో ఏమీ ద్వేషభావం లేదు తనకి. కానీ కొంచెం బాధగానే ఉంది. ఎందుకీవిడ ఇలా ప్రవర్తిస్తోంది? తులసి మనసులో ఆలోచనల దుమారం రేగుతోంది. స్వతహాగా అత్తగారు మంచిదే! మరేవిటిదంతా? అలాగని తాము మెరుగ్గా ఉన్న విషయాలపట్ల ఆమెకేదైనా ఆనందమా అంటే అదీ లేదు. మొన్నామధ్య ఈ ఇల్లు ఉండగా వేరే ఫ్లాట్ కొన్నాము. అద్దెకివ్వాలనే ఉద్దేశం. అంతకుముందటేడు సిటీలో ఓ స్థలం కూడా కొన్నారు మావారు. ఆమె కూతురు వాళ్ళుమాత్రం ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. పోనీ మేము వాళ్ళకన్నా ఈ విషయంలో మెరుగే కదా..! అందుకేమైనా సంతోషిస్తుందా? అంటే లేదు. పైపెచ్చు అప్పుడప్పుడూ ఖాళీగా ఉన్నప్పుడు ఏవేవో గుర్తుతెచ్చుకుంటూ బాధగా, ముభావంగా ఉన్నట్లు కనబడుతుంది.. ఇదీ ఆవిడ ధోరణి.
తులసిలో రాను రానూ అత్తగారి ప్రవర్తనపట్ల కాసింత అసంతృప్తి చోటుచేసుకుంటోంది. భర్త సురేష్‌తో ఈ విషయం అప్పుడప్పుడూ ప్రస్తావించింది కూడా. సురేష్ మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. ‘పెద్దావిడ కదా..! ఏదో చాదస్తం..’ అన్నాడు. తులసి మాత్రం తన మనసును తేలికగా సమాధానపరచుకోలేక పోతోంది. ఏవిటి అత్తగారి ధోరణి? ఆమెకున్నది ఇద్దరు పిల్లలు. కొడుకూ, కూతురూను. కూతురిమీద ఉన్న ప్రేమ కొడుకుమీద ఎందుకు చూపలేకపోతోంది? ఇలాంటి వివక్ష ఒక తల్లికి ఉంటుందా? ఆశ్చర్యంగా ఉంది.. కానీ- ఇది నిజం! క్రమంగా అత్తగారిపట్ల తన మనసులోని స్థానం దిగజారుతోంది.
మరో రెండు నెలలు గడిచాయి. సంక్రాంతి పండగ వస్తోంది. తులసి భర్తా పిల్లలతో కలిసి పుట్టింటికి వెళదామనుకుంటోంది. పార్వతమ్మగారు కూడా కూతుర్ని చూడాలని అనుకుంటోంది. వెళతానంది. భార్యాభర్తలిద్దరూ ఒప్పుకున్నారు. సురేష్ పార్వతమ్మగారి కోసం ‘గోదావరి’కి రిజర్వు చేయించాడు టిక్కెట్లు. ఆమె కూతురింటికి, తులసి పుట్టింటికీ ఒకేసారి బయలుదేరారు. ఇద్దరివీ వేర్వేరు దారులు.
***
తులసి పుట్టింటికి చేరింది. తను, భర్తా పిల్లలు దిగగానే ఎంతో ఆప్యాయంగా తండ్రి ఎదురొచ్చి బస్టాండు నుంచి అందర్నీ ఇంటికి తీసుకెళ్లాడు. తల్లినీ, అన్నయ్యనీ, వదిననీ చూడగానే ఏదో కొత్త సత్తువ వచ్చినట్లయింది తులసికి. తన మాటలోనే ఓ స్వాతంత్య్రం, చొరవ చోటుచేసుకున్నాయి. ఎంతయనా పుట్టిల్లుకదా..! పోయిన స్వాతంత్య్రం తిరిగి వచ్చినట్లు, తను చిన్నపిల్లై పోయినట్లు.. ఏవేవో తనకే తెలియని భావనలు చోటుచేసుకొని, స్వేచ్ఛగా విహరించే గువ్వలా ఆనందంగా అనిపించింది తులసికి. ఓ వారం రోజులు సెలవు తీసుకున్నాడు సురేష్‌కు. పిల్లలకు కూడా సంక్రాంతి సెలవులు. పండుగ మూడు రోజులూ హయిగా గడిచిపోయాయి. అన్నయ్య, వదిన రాజ్యలక్ష్మి తనతో ఆప్యాయంగా ఉన్నారు. అన్నయ్యకు ఇద్దరు మగపిల్లలు. తులసి పిల్లలతో వాళ్ళూ కలిసి ఆడుకునేవారు. పిల్లల మధ్య ఏవైనా చిన్న చిన్న కీచులాటలు వస్తే తులసి తల్లి సీతమ్మ ఆడపిల్ల పిల్లల పక్షమే వహించేది. తులసి పిల్లల్నే ఎక్కువగా నెత్తినపెట్టుకునేది.
మాటల మధ్యలో తులసి అప్పుడప్పుడూ తన తల్లిని అడిగేది- ‘‘అమ్మా..! వదినా , నువ్వూ బాగా కలిసిమెలిసి ఉంటారా?’’ అని. ‘‘పెద్దగా గొడవలు ఏమీ ఉండవు, కానీ ఆమెకు నాలో ఓ విషయం నచ్చదని అర్థమైంది’’ అంది సీతమ్మ.
‘‘ఏంటమ్మా..! అది?’’
‘‘ఏం లేదు..! మీరెక్కడో హైద్రాబాద్‌లో ఉన్నా నేనెప్పుడూ మీ గురించే బాధపడుతుంటానట. ఎదురుగుండా ఉన్నా వాళ్ళపై నాకంత అపేక్ష ఉండదని ఆవిడ భావం!’’ అంది.
‘‘నిజమే! తను కూడా గమనించింది. అన్నయ్య పిల్లలూ, అన్నయ్య సంసారం కన్నా నాపైనా, నా సంసారంపైనే అమ్మకు కొంచెం ప్రేమ ఎక్కువ అనిపిస్తోంది ఆవిడ ధోరణి చూస్తే’’ అనుకుంది తులసి. కానీ, ఎందుకిలా! ఇదే ధోరణి తను తన అత్తగారిలో సహించలేకపోయింది.
‘‘మరలాంటపుడు మా గురించి నువ్వెందుకెక్కువ తపనపడటం! వదినకి నచ్చేటట్లు ఉండొచ్చు కదా..?’’ అంది తులసి.
‘‘తపనేముంది? మీరెక్కడో ఉన్నారు. నువ్వు ఆడపిల్లవి! ఓ అయ్య చేతిలో పెట్టాము. అక్కడ ఎలా వున్నావో ఏమో అని తల్లిదండ్రులుగా మా ఆతృత! ఆ ఆతృతలోంచి పుట్టిందే అభిమానమూ, ప్రేమానూ’’ వివరిస్తున్నట్టుగా అంది. అప్పుడు అర్థమైంది తులసికి తాను ఇన్నాళ్లూ ఎందుకలా ఆలోచించానన్న విషయం.
*

No comments:

Post a Comment