Pages

Saturday, 30 August 2014


పింఛన్ (కథ)

  • - గుండు రమణయ్య గౌడ్
  •  
  • 31/08/2014
‘డొడ్డంక ఢాం.. డొడ్డంక ఢాం..’ డప్పు కొడుతూ సపాయి రామయ్య ఊరు చాటింపు చేస్తున్నాడు. ‘బియ్యం, చక్కర, గోధుమలు, ఫించన్లు, వికలాంగుల ఫించన్లు అచ్చినయి, గ్రామ పంచాయతీలో తీసుకోవాలంటూ’ గట్టిగా చెప్పి, మళ్లీ ‘డొడ్డంక ఢాం.. డొడ్డంక ఢాం..’ డప్పు కొడుతూ వెళ్లిపోతున్నాడు.
సఫాయి రామయ్య డప్పు చాటింపు వినగానే రంగయ్యకు పోయిన ప్రాణం వచ్చినట్లయ్యింది. ఎందుకంటే రంగయ్యకు పింఛను వస్తేనే పూట గడిచేది. రంగయ్య, అతని భార్య వాటితోనే బతికేది. ప్రతి నెల ఒకటో తారీఖునే అన్ని వచ్చేవి. ఈ నెల మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. మూడు రోజులు ఆలస్యం అయ్యేసరికి ప్రాణం మూడు తిరుగులు తిరిగింది. పింఛన్ వస్తేనే ఇంట్లో అన్ని సామాన్లు కొనుక్కునేది. పింఛను రాక ఈ మూడు రోజులు రంగయ్యకు నరకం కనబడింది.
ఒకప్పుడు రంగయ్యది పెద్ద ఉమ్మడి కుటుంబం. దాదాపు ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. దానికి ఇద్దరు పాలేర్లు ఉండేవారు. వ్యవసాయం పని వాళ్లతో చేయించేవాడు. నాలుగు ఎద్దులు, పాల కోసం రెండు బర్రెలు ఉండేవి. రంగయ్యకు నలుగురు సంతానం. ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు. తన పిల్లలు చిన్నగా ఉన్న సమయంలో రంగయ్య తన వద్ద పని చేసే పాలేరుకు మంచి అమ్మాయిని చూసి పెండ్లి కూడా చేశాడు. రంగయ్య ఇల్లు చూడటానికి కళ్లు చాలేవి కావు. అంత పెద్దగా ఉండేది భవంతి. ఆ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగేది. కానీ రంగయ్య కుటుంబంపై కాలం పగబట్టింది. కొన్ని రోజులలో అనేక మార్పులు సంభవించాయి. కొడుకులు, కోడళ్లు మాటలు వినో.. లేకపోతే ఏమైందో ఏమో ఇంటికి రావటం కొంచెం కొంచెం తగ్గించేశారు. చాలా రోజులకొకసారి చుట్టపు చూపుగా వచ్చి వచ్చి వెళ్లేవారు. ఓ వైపు రంగయ్య వయస్సు పెరిగిపోయంది. కుటుంబ సభ్యులు రోజురోజుకి దూరం అవుతున్నారు. కోడళ్లకు అత్తామామలపై కోపాలు పెరిగిపోయాయి. ఆస్తి ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా అందరూ దగ్గరయ్యారు. ఆస్తి దూరమయ్యేసరికి మానవ సంబంధాలు కూడా దూరమవుతున్నాయి. రామయ్య తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యేవాడు. రంగయ్య ఇంట్లో ఇప్పుడు ఏ పాలేర్లు లేరు. అంతా బోసిపోయి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎకరం పొలం తనే ఒంటరిగా సాగు చేసుకుంటున్నాడు.
ఓ రోజు దుస్సంఘటన జరగనే జరిగింది. ఆ రోజు పెందలకడనే లేచి పొలంలో పెంట పోయడానికి తనకున్న బక్కచిక్కిన రెండు ఎడ్లతో బండి కట్టుకొని పొలం వైపు వెళ్లాడు. బారెడు పొద్దెక్కినా ఇంటికి రాలేదు. ఇంటివద్ద రంగయ్య భార్యకు గుండెల్లో ఆందోళన మొదలైంది. అక్కడ పొలంలో శరీరం సరిగా సహకరించక రంగయ్య తూలి కిందపడ్డాడు. లేద్దామని ప్రయత్నిస్తే లేవరావటం లేదు. తొంటిలో తీవ్ర నొప్పనిపించింది. సమయం తెల్లవారుజామున నాలుగున్నర, ఐదు మధ్యలో అనుకుంటా పక్కనే ఊరి నుండి ‘అల్లాహ్ అక్బర్’ అంటూ మసీదునుండి వినబడుతోంది. రంగయ్య ఎంత అరిచినా అక్కడ ఎవరూ లేరు. కాసేపటికి రంగయ్య మొర ఆ దేవుడు కరుణించాడేమో.. పక్క పొలం యువకుడు ఉదయానే్న లేచి హనుమాన్ పూజ చేసుకొని మాలధారణతో ఉన్నట్లున్నాడు. తన పొలంలో నీరు చూసుకుంటూ ఇటువైపు చూసేసరికి ఎద్దుల బండి పక్కన రంగయ్య పడి ఉన్నాడు. వెంటనే ఆ యువకుడు ‘ఏమైంది తాతా’ అంటూ పరుగెత్తుకొచ్చాడు. లేపడానికి ప్రయత్నించాడు. ‘అమ్మా.. నొప్పి’ అంటూ రంగయ్య మూలుగసాగాడు. ఆ యువకుడు ఆ బండిలో ఉన్న పెంటను తీసివేసి అదే బండిలో రంగయ్యను తీసుకొని ఇంటికి వచ్చాడు.
పట్టణాల్లో ఉన్న కొడుకులకి, కూతుళ్లకి సమాచారం అందించి, ఆసుపత్రికి తీసుకెళ్లాడు. రంగయ్యకి తుంటిలో విరిగింది. మేజర్ ఆపరేషన్ జరిగింది. తాను కోలుకోవడానికి, లేచి నడవడానికి దాదాపు ఐదు నెలలు పట్టింది. రంగయ్య మనస్సు మాత్రం తన ప్రాణంలా భరించే పొలంపైనే ఉంది. రైతు దేశానికి వెనె్నముక అన్నట్లు రంగయ్యకు ఉన్న ఎకరం పొలం తనకి వెనె్నముక. ఈసారి పొలం సరిగా పండలేదు, వేరే వాళ్లకి కౌలుకివ్వటం వల్ల.
ఇప్పుడు రంగయ్య వికలాంగుడు అయిపోయాడు. ఒకప్పుడు పది ఎకరాలు ఒక్కచేత్తో దునే్న మనిషి ఒంటికాలువాడయ్యాడు. గ్రామంలో ఉన్న సుంకర్లని, సర్పంచిని అడిగి మెల్లగా వికలాంగ సర్ట్ఫికెట్ జిల్లా కేంద్రం నుండి తెచ్చుకున్నాడు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొన్నాడు. పింఛన్ వచ్చేసరికి రెండు సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ప్రభుత్వ పథకాల్లో అన్ని పైరవీలేనాయే. వికలాంగ పింఛన్ ఐదువందలు, తెల్లరేషన్ కార్డు ద్వారా బియ్యం, పప్పులు, కిరోసిన్ రావటం వల్ల నెలనెలా గడుస్తోంది. తన బ్రతుకంతా ఉన్న ఎకరం పొలంపైనే, పింఛన్ పైనే. ప్రతి నెల పింఛన్ వస్తేనే రంగయ్యకు బ్రతుకు, మెతుకు. కానీ ఈ నెల ఆ పింఛన్, రేషన్ సామానులు రెండు, మూడు రోజులు ఆలస్యం అయ్యేసరికి ప్రాణమంతా చితు బొత్తియింది. ‘డొడ్డంక.. ఢాం.. డొడ్డంక.. ఢాం..’ అంటూ సపాయి రామయ్య డప్పు సప్పుడు వినగానే రామయ్య మనసు తేలికయ్యింది. ఇక నెల దాకా ఏ బాధ లేదు తిండితిప్పలుకు అనుకున్నాడు.
బ్రతుకంటే సుఖం కాదు, కష్టం అని ఆ రోజు పూర్తిగా అర్థమై పోయింది రంగయ్యకు. ‘మనిషి జీవితం నిత్యపోరాటం’. ఇది నగ్న సత్యం. కష్టం అనుభవించి సుఖం పొందటం తేలికే.. కానీ సుఖం అనుభవించి కష్టపడాలంటే జీవితానికి ఎదురీతే.. అందుకే.. కష్టం నుండి వచ్చిన సుఖాన్ని మించినదేదీ ఈ ప్రపంచంలో లేదు. ఒక్కసారిగా ‘రంగయ్య’ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి ఆనంద పారవశ్యంతో.

No comments:

Post a Comment