దాదాపుగా అందరికీ వ్యాయామం అనేది కామన్ థెరపీ. రన్నింగ్, వాకింగ్, యోగ వంటి వ్యాయామాలు చేయడం వల్ల మహిళలు పని ప్రదేశాల్లో ఒత్తిడి మోతాదును తగ్గించుకోగలుగుతున్నారు.
వ్యాయామం: ఒత్తిడి నుంచి బయటపడేందుకు వ్యాయామం మంచి మందు. దాదాపుగా అందరికీ వ్యాయామం అనేది కామన్ థెరపీ. రన్నింగ్, వాకింగ్, యోగ వంటి వ్యాయామాలు చేయడం వల్ల మహిళలు పని ప్రదేశాల్లో ఒత్తిడి మోతాదును తగ్గించుకోగలుగుతున్నారు. శారీరక వ్యాయామాలు నరాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. దీని వల్ల ఒత్తిడినుంచి బయటపడటమే కాకుండా శరీరాకృతి కూడా బాగుంటుంది.
మాట్లాడాలి: చాలామంది మగవాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు. కాని ఆడవాళ్లు అలా కాదు కాస్త ఎక్కువ మాట్లాడతారు. గమనిస్తే మనసు విప్పి మాట్లాడిన తరువాత ఆడవాళ్లు మనసు భారాన్ని దించుకున్నట్టు కనిపిస్తారు. ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు కొరకరాని కొయ్యల్లా ఉండే బాస్‌లు, ఏ మాత్రం సహకరించని సహోద్యోగుల వల్ల తలనొప్పి రావడం ఖాయం. ఇలాంటప్పుడు స్నేహితులతో మాట్లాడితే మనసుకు ఉపశమనం లభిస్తుంది. మనసు విప్పి మాట్లాడారంటే ఆ సమస్యలన్నీ కిటికీలో నుంచి వెళ్లి గాల్లో కలిసిపోవాల్సిందే. పనికి సంబంధించిన విషయాలు స్నేహితులతో ఏం మాట్లాడతాం అంటున్నారా... ఆ విషయాలే మాట్లాడాలనేం లేదు. మీ స్నేహితులకి, మీకు కామన్‌గా నచ్చిన విషయాలేవైనా మాట్లాడుకోవచ్చు. కాసేపు అలా మాట్లాడితే చాలు మనసు తేలికపడుతుంది. అందుకే మాట్లాడండి...
మనసుకు నచ్చింది: మనసుకు నచ్చిన పనిచేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చదవడం, రాయడం, సినిమాలు చూడడం, ఫోటోలు తీయడం, వండడం, తోటపని చేయడం... ఇలా ఏదైనా కావొచ్చు. ఇవి చేయడం వల్ల మనసు తేలికపడుతుంది. నచ్చిన పనులు చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది అంటున్నారా? ఈ మాటలను పక్కన పెట్టేయాలి. ఆఫీసు నుంచి ఇంటికెళ్లాక కొద్ది సమయాన్ని మీకోసం కేటాయించుకుని మనసుకు నచ్చిన పని చేయాలి.
మైండ్‌సెట్ మార్చుకోవాలి: మైండ్‌సెట్ మార్చుకుంటే మంచి భావన కలుగుతుంది. ఆఫీసులోకి సానుకూల ధోరణితో అడుగుపెట్టాలి. ‘ఇవ్వాళ నాకు మంచి రోజు’ అనుకోవాలి. చేసే పని పట్ల వ్యతిరేక భావనలు ఉండొద్దు. ఒకవేళ ఉన్నా తుడిచేయాలి. అలాగే మీ డెస్క్ దగ్గర చేయాల్సిన పనుల్ని, ముఖ్యమైన విషయాలను స్టిక్ నోట్స్ రాసుకుని అతికించుకోవాలి. ఇలాచేస్తే చేయాల్సిన పనులు మర్చిపోరు. ఆ తరువాత పనికాలేదన్న ఒత్తిడికి గురికావాల్సిన పరిస్థితీ రాదు. సానుకూల ధోరణి ఒత్తిడిని దూరం చేయడంలో ఎంతో సాయపడుతుంది.
టేక్ ఎ బ్రేక్: ఆడవాళ్లు కష్టపడి పనిచేస్తారనే విషయం తెలిసిందే. అందుకని చేసే పని రొటీన్ అయిపోయి బోర్ కొట్టకుండా ఉండేందుకు తప్పక బ్రేక్ తీసుకోవాలి. పనిచేసే మూడ్ లేదనిపించినప్పుడు సెలవు పెట్టి ఎంజాయ్ చేయాలి. తిరిగొచ్చాక రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం గ్యారెంటీ.
చివరిదే అయినా అతి ముఖ్యమైనది అద్దం ముందు నిల్చొని చిరునవ్వుతో పలకరించుకోండి. ఈ చిరునవ్వు ఇచ్చే కిక్ ఎక్స్‌పీరియెన్స్ అయిన వాళ్లకే తెలుస్తుంది.
No comments:
Post a Comment