Pages

Monday, 6 October 2014

toefl - ielts

ఆ రెండు పరీక్షలకూ ఏమిటి తేడా?

చాలామంది విద్యార్థులు టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌లలో దేన్ని రాయాలా అని తికమకపడుతుంటారు. వీటిలో ఏది సులభమా అని ఆలోచిస్తుంటారు. ఈ రెండు పరీక్షల మధ్య భేదాలేమిటో, సరైన దాన్ని ఎంచుకోవటానికి వేటిని గమనించాలో పరిశీలిద్దాం!
ఆంగ్లం మాతృభాషగా లేని విద్యార్థులు విదేశాల్లోని (ఉదా: యునైటెడ్‌ స్టేట్స్‌, కెనడా, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌) విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకుంటే వారు తప్పకుండా ఆంగ్ల భాషా సామర్థ్య (లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ) పరీక్షను ఎదుర్కొనాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు ఆమోదించే ఆంగ్ల భాషా పరీక్షలు IELTS(ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం), TOEFL (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌). భారత్‌ లాంటి దేశాల విద్యార్థులకు ఈ రెండు పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. 
ఐఈఎల్‌టీఎస్‌ను ఇంగ్లాండ్‌లో రూపొందించారు. ఇది అంతర్జాతీయంగా ఆమోదించే ఆంగ్లాన్ని పరీక్షిస్తుంది. టోఫెల్‌ను ఉత్తర అమెరికాలో రూపొందించారు. ఇది అమెరికన్‌ ఇంగ్లిష్‌ను పరీక్షిస్తుంది.
పోలికలు 
ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌ రెండింటినీ ఆంగ్లభాషలో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించడానికే రూపొందించారు. ముఖ్యంగా తరగతి గదిలో భావవ్యక్తీకరణ, ఆంగ్లభాషా సంస్కృతిలో ఇమడగల సామర్థ్యాలనూ పరీక్షిస్తాయి. ఇవి రెండూ కూడా వినడం, చదవడం, రాయడం, మాట్లాడటం అనే నైపుణ్యాలను విద్యార్థులు ఎంత బాగా సమన్వయం చేయగలరో విశ్లేషిస్తాయి.
తేడాలు 
రెండు పరీక్షలూ బాహ్యంగా ఒకే నైపుణ్యాలను పరీక్షిస్తున్నప్పటికీ, తీరు మాత్రం వేర్వేరు. ఆశయం, లక్ష్యం ఒకటే అయినప్పటికీ వాటి విధానం, పరీక్షా ప్రమాణాల్లో తేడాలు ఉంటాయి. అవి ఏమిటంటే...
ఎ) టోఫెల్‌లో పఠనం (రీడింగ్‌), శ్రవణం (లిసనింగ్‌) విభాగాలకు బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ఐఈఎల్‌టీఎస్‌లో విద్యార్థులు ఇచ్చిన వ్యాసం/ సంభాషణల్లోని పదాలను కాపీ చేసి రాయాల్సి ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంగ్రహ ఆలోచన అవసరముంటుంది. కానీ ఐఈఎల్‌టీఎస్‌ యథాతథంగా ఆలోచించగలిగేవారికి ఉపయోగకరం.
లిసనింగ్‌ విభాగం మౌఖిక ఉపన్యాసాలు, సంభాషణలను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. విదేశంలో విద్య, సామాజికపరంగా విజయం సాధించడానికి వీటిది కీలకపాత్ర. ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష... విన్న అంశాలపై సమాధానాలు రాసే వీలు కల్పిస్తుంది. ఈ లిసనింగ్‌ విభాగంలో వివిధ రకాల ఉచ్చారణలు వినే అవకాశముంటుంది. కేవలం బ్రిటిష్‌, అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌, కెనడియన్‌ ఉచ్చారణ రీతులకే పరిమితం కాకుండా మిగిలినవి కూడా వినవచ్చు.
కానీ టోఫెల్‌లో ప్రామాణిక అమెరికన్‌ ఉచ్చారణనే నిర్వహిస్తారు. టోఫెల్‌ లిసనింగ్‌ విభాగంలో నోట్సు రాసుకోగలిగే నైపుణ్యం ఉండడం తప్పనిసరి. ఎందుకంటే దీనిలో సుదీర్ఘ ఉపన్యాసం/ సంభాషణ విన్న తరువాతే ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.
బి) టోఫెల్‌ భాషణ (స్పీకింగ్‌), లేఖన (రైటింగ్‌) విభాగాలు రెండింటినీ సంపూర్ణంగా గ్రేడ్‌ చేస్తారు. వ్యాసంతోపాటు పద సముదాయం, తర్కం, శైలి, వ్యాకరణం నాణ్యతలను బట్టే మార్కులు ఇస్తారు. ఐఈఎల్‌టీఎస్‌ దీనికి భిన్నం. దీనిలో లక్ష్యఛేదన, సాధన, సందర్భశుద్ధి, పొందిక, నిఘంటు వనరులు, ధారాళంగా మాట్లాడడం, వ్యాకరణస్థాయి, కచ్చితత్వం వంటి వ్యక్తిగత అంశాలను బట్టే మార్కులు కేటాయిస్తారు.
సి) ఐఈఎల్‌టీఎస్‌లో స్పీకింగ్‌ పరీక్ష కోసం పరీక్షకునితో ముఖాముఖీ (ఇంటర్వ్యూ)కు హాజరుకావాల్సి ఉంటుంది. టోఫెల్‌లో మాత్రం మౌఖికపరీక్షను ఓ మైక్రోఫోన్‌లో రికార్డు చేస్తారు. ఆరు ప్రశ్నలకు సమాధానాలు రికార్డు చేసి ఎగ్జామినర్‌కు పంపిస్తారు. ఎక్కువ ప్రశ్నలు విద్యాపరమైనవే (పాఠ్యాంశాలకు సంబంధించినవే) ఉంటాయి. ఓ పాఠం/ విద్యాసంబంధ చర్చను విని మీ అభిప్రాయాలను ఇందాకటి పద్ధతిలోనే చెప్పాల్సి ఉంటుంది. (వీటిని టోఫెల్‌లో ఇంటిగ్రేటెడ్‌ టాస్క్స్‌ అంటారు).
డి) మార్కుల విధానం కూడా రెండింటిలోనూ భిన్నం. ఐఈఎల్‌టీఎస్‌లో 0- 9 బ్యాండ్స్‌ వరకు ఇస్తారు. టోఫెల్‌ గ్రేడులు సంఖ్యల్లోనే ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 పాయింట్ల చొప్పున మొత్తం 120 పాయింట్లు ఉంటాయి.
ఇ) అధికారిక టోఫెల్‌ గైడ్‌ ద్వారా ఐదు పాత ప్రశ్నపత్రాలు, డిస్క్‌లో పొందుపరచిన ఆడియో పాసేజ్‌లతో అభ్యాసం చేయొచ్చు. ఈ పుస్తకం ద్వారా పరీక్షకు ఏమేరకు సిద్ధమయ్యారో పరీక్షించుకోవచ్చు. ఐఈఎల్‌టీఎస్‌కు రిజిస్టర్‌ చేసుకుంటే ఇలాంటి మెటీరియల్‌నే సమాధానాలతో సహా అందిస్తున్నారు. 
ఏది సులభం?
బ్రిటిష్‌ ఇంగ్లిష్‌ కావడం వల్ల ఐఈఎల్‌టీఎస్‌ కాస్త సులభంగా అనిపించవచ్చు. పేపర్‌పై రాసేదే కావడం వల్ల టోఫెల్‌లో మాదిరిగా కీబోర్డ్‌, టైపింగ్‌ అనుభవం అవసరం ఉండదు. అలాగే టోఫెల్‌ తరహాలో స్పీకింగ్‌, రైటింగ్‌ వంటి ఏకీకృత పరీక్షలు ఐఈఎల్‌టీఎస్‌లో ఉండవు. స్పీకింగ్‌ విభాగం విడిగా, వేరేరకంగా నిర్వహిస్తుండటం మూలంగా పరీక్ష వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ మైక్‌ కంటే ప్రత్యక్షంగానే ముఖాముఖికి హాజరవడం హాయి అనిపిస్తే మాత్రం టోఫెల్‌ సులభమనిపిస్తుంది.
ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష 2.45 గంటలుంటే, టోఫెల్‌ పూర్తవడానికి 4 గంటలు పడుతుంది. రెండు పరీక్షలూ ఏడాదిపాటూ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రెండు పరీక్షలూ మీ ఆంగ్లపరిజ్ఞాన స్థాయికి అనుగుణంగా మిమ్మల్ని కచ్చితంగా గ్రేడ్‌ చేస్తాయి.
విద్యార్థులు రెండు పరీక్షల నమూనా పరీక్షలను రాయడం ఉత్తమం. దాన్ని బట్టి మీకు ఏది సులభతరమో ఎంచుకోవచ్చు. నమూనా పరీక్షల కోసంwww.roadtoielts.com/testdrive/ ,www.ets.org/toefl/ibt/prepare/quick pep/ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
చివరగా, మీరు ఎంచుకున్న విద్యాసంస్థ ఏ పరీక్ష స్కోరును అంగీకరిస్తుందో చూసుకోవాలి. టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ల మధ్య తేడాలు కొన్నే. అవి అంత ప్రధానమైనవి కావు. విద్యార్థిగా మీరు లక్ష్యంగా పెట్టుకున్న విశ్వవిద్యాలయాలు కోరే పరీక్ష వివరాలను తెలుసుకోవాలి.
స్థూలంగా చెప్పాలంటే... మీరు బ్రిటిష్‌ కామన్‌వెల్త్‌లోని కళాశాలలకు దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే ఐఈఎల్‌టీఎస్‌ రాయవచ్చు. లేదంటే టోఫెల్‌ రాయండి. మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో దానిపై ఆధారపడి (యూఎస్‌/ యూకే/ ఆస్ట్రేలియా) వీటిలో ఏదో ఒక పరీక్షను ఎంచుకోవచ్చు.
ఏదేమైనా యూఎస్‌లోని చాలా విశ్వవిద్యాలయాలు ఐఈఎల్‌టీఎస్‌ స్కోరును అంగీకరిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని పేరున్న విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంకా ఈ పరీక్షను ఆంగ్ల నైపుణ్య పరీక్షగా గుర్తించటం లేదు. ఈ పరిస్థితుల్లో మీరు ఎంచుకునే విశ్వవిద్యాలయం ఏ పరీక్షను అంగీకరిస్తుందో దాన్నే ఎంచుకోవడం మేలు!

No comments:

Post a Comment