Pages

Wednesday, 1 October 2014

health

కొలెస్ట్రాల్ తక్కువైనా ముప్పే..!

సాధారణంగా వార్తాపత్రికల్లో, టెలివిజన్ వ్యాపార ప్రకటనల్లో కొలెస్ట్రాల్ పేరు ఎక్కువగా వినబడుతుంది. కొలెస్ట్రాల్ గురించి ఎప్పుడు మాట్లాడినా గుండె దానికి సంబంధించిన వ్యాధులు గుర్తుకువస్తాయి. మానవ శరీరం రకరకాల కణాలతో కూడి వుంటుంది. ఈ కణాలలో అనేక రసాయన పదార్థాలుంటాయి. అనేక రసాయన పదార్థాలలో కార్బోహైడ్రేట్‌లు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ముఖ్యమైనవి. కొవ్వు పదార్థాలు నీటిలో కరగవు, అవి మైనము, నూనెలాంటి పదార్థాల్లాగా వుంటాయి. చాలా రకాలైన క్రొవ్వు పదార్థాలలో కొలెస్ట్రాల్ ఒకటి. మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్‌లు మరియు ఇతర అణువులు నీటిలో కరిగే గుణం వుండటం చేత అది జీర్ణమైన తర్వాత రక్తంలో కలిసి వేర్వేరు కణజాలాలకు అందజేయబడతాయి. కానీ కొవ్వు పదార్థాలు నీటిలో కరగవు గనుక కొన్ని నీటిలో కరిగే గుణం కల లైపోప్రోటీన్లు అనే పదార్థాలు కొలెస్ట్రాల్ మరియు ఇతర కొవ్వు పదార్థాలను కణజాలాలకు చేరవేస్తాయి. ఈ సరఫరాలో లోపం వస్తే అది చాలా అనర్థాలకు దారి తీయవచ్చు.
రక్తంలో చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ వుండటాన్ని హైపర్ కొలెస్ట్రీమియా అంటారు. అలాగే సాధారణ స్థాయికంటే తక్కువ శాతం కొలెస్ట్రాల్ వుండటాన్ని హైపో కొలెస్ట్రీమియా అంటారు. ఈ రెండు స్థితులు అనారోగ్యదాయకమే. హైపర్ కొలెస్ట్రీమియా వల్ల గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
హైపర్ కొలెస్ట్రీమియా అన్నది చాలా నిశ్శబ్ద రోగం. ఈ జబ్బుకు ఫలానా లక్షణాలు అని లేవు కనుక కనుక్కోవడం కష్టం. హైపర్ కొలెస్ట్రీమియావలన అథిరోస్ల్కీరోసిస్, దాని మూలాన ఛాతీనొప్పి, గుండెపోటు, పక్షవాతం వచ్చేంతవరకు దీన్ని కనుగొనలేము. హైపర్ కొలెస్ట్రీమియాలో చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ రక్తంలో వుండటంవల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిల్వలు ఏర్పడవచ్చు. ఈ నిల్వలను ప్లేక్స్ అంటారు. ముందుగా చిన్నగా వున్న ప్లేక్స్ పెద్దవి అయ్యేకొద్ది రక్తనాళాలలో ఎక్కువ స్థలం ఆక్రమించడంవల్ల రక్తప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. క్రమేణా ప్లేక్స్ పరిమాణం పెరిగి అథిరోస్ల్కీరోసిస్ అనే వ్యాధికి దారితీయవచ్చు. ఫలితంగా రక్తం రక్తనాళాలలో గడ్డకట్టి రక్తప్రవాహం ఆగిపోవచ్చు. ఇదే కనుక గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో జరిగితే గుండెపోటు వస్తుంది. ఇదే మెదడుకు సరఫరాచేసే రక్తనాళాలలో జరిగితే అది పక్షవాతం రావడానికి కారణవౌతుంది. భారతదేశంలో కూడా అథిరోస్క్లీరోసిస్‌వల్ల మరణించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
రెండు చాలా ముఖ్యమైన కొలెస్ట్రాల్స్ శరీరంలో వుంటాయి. ఒకటి లోడెన్సిటీ లైపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్), రెండవది హైడెన్సిటీ లైపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ (హెడిఎల్). ధమనిలో పేరుకొన్న వున్న కొలెస్ట్రాల్‌ని నిర్మూలించి వాటిని కాలేయానికి తరలించడంవల్ల కొన్ని హృద్రోగాలను నివారించవచ్చు. ఈ పని హెచ్‌డిఎల్ చేస్తుంది కనుక దీనిని ‘మంచి’ కొలెస్ట్రాల్ అంటారు. కానీ ఎల్‌డిఎల్ ధమని గోడలలో ఎక్కువ కొలెస్ట్రాల్ అంటి వుండేటట్లు దోహదం చేసిన హృద్రోగానికి దారితీస్తుంది. అందువల్ల ఎల్‌డిఎల్‌ని చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు.
ఆహారం, వ్యాయామం, ధూమపానం, మధుపానంవల్ల మరికొన్ని వ్యాధులలో ఈ మంచి చెడ్డ కొలెస్ట్రాళ్ళ స్థాయిలో తేడా వస్తుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలు వున్న ఆహారం తీసుకొంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే వ్యాయామం చేయడం, బరువు తగ్గించడంవల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ రక్తంలో వున్నాయో లేదో తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేయవల్సి వుంటుంది. ఆహారం ఏమీ తీసుకోకుండా 12 గంటలు పాస్టింగ్‌లో వున్న తర్వాత ఈ పరీక్షకు రక్తం తీసుకొని కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఏ శాతంలో వున్నాయో తెలుసుకోవాలి. 45 సం.లు దాటినవారు ఈ పరీక్ష చేయించుకొని అవసరమైతే వైద్య సలహా పొందుతూ వుండాలి.
డాక్టర్ సలహా ప్రకారం ముందుగా కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, కొన్ని అలవర్చుకోవాలి. ఫైబర్ అధికంగా వుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కనీసం రోజుకు 40 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. వరి, గోధుమలు, ఇతర ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలలో ఫైబర్ అధికంగా వుంటుంది. కొలెస్ట్రాల్ తక్కువ వున్న ఆహారం తీసుకోవడం మంచిది. ఆహారంలో కొలెస్ట్రాల్ రోజుకు 300 మి.గ్రాలు మించకూడదు. కొలెస్ట్రాల్ తక్కువ వున్న ఆహార పదార్థాలు అంటే మీగడ తీసేసిన పాలు, కొలెస్ట్రాల్ తక్కువ వున్న పాలు, చేపలు, కోడిమాంసం తక్కువ కొలెస్ట్రాల్ వున్న మాంసం (లీన్ మీట్) తీసుకోవచ్చు. కానీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ వున్న కోడిగుడ్లు, వెన్న, నెయ్యి తీసుకోకూడదు.
లావుగా వున్నవారు బరువును అదుపు చేసుకోవడం అవసరం. రోజుకు సుమారు 45 ని.ల చొప్పున కనీసం వారంలో 5 రోజులు నడక వంటి శారీరక వ్యాయామం చేయడం శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గించడానికి దోహదపడుతుంది. వ్యాయామమే అదనపు ఆరోగ్యం గనుక రోజూ వ్యాయామం చేయండి.
ఎక్కువ కొలెస్ట్రాల్ ఎంత హానికరమో, తక్కువ కొలెస్ట్రాల్ కూడా అంతే హానికరం. ఎందుచేతనంటే జీవన చర్యలకు అవసరమైన బైలు ఆమ్లాలు, స్టీరాయిడ్ హార్మోన్లు మొదలగునవి కొలెస్ట్రాల్ నుంచి తయారవుతాయి. కాబట్టి రక్తంలో కొలెస్ట్రాల్ బాగా తగ్గినట్లయితే ఉపయోగకరమైన ఈ పదార్థాల స్థాయి తగ్గి అనారోగ్యం రావచ్చు. కావున ఆహారంలో కొవ్వు శాతం కావాల్సిన దానికంటే మరీ తగ్గించడానికి ప్రయత్నించకూడదు. *

No comments:

Post a Comment