Pages

Wednesday, 1 October 2014

Begger - Telugu short story

ముష్టివాడి నవ్వు (కథ)

ఉదయం తొమ్మిదిన్నర... షా పులు తెరిచే వేళ...
రిక్షా దిగిన విశ్వం రిక్షావాడికి డబ్బులిచ్చి, వెనుదిరిగి వీధిలోకి నడవబోయి- పామును చూసినవాడిలా ఒక్కసారి ఉలిక్కిపడి పక్కకి జరిగాడు.
వీధి మలుపులో ఎవడో కొత్తగా వచ్చిన ముష్టివాడు.
చూడగానే ఇట్టే పోల్చుకోవడానికి తగిన లక్షణాలన్నీ ఉన్నాయి అతడిలో. చింపిరిజుట్టు, చినిగిన చొక్కా, మట్టిగొట్టుకుపోయిన పాత లుంగీ, చేతిలో కర్ర కాదు గానీ.. ఓ పాత మోడల్ గొడుగు.
గారపళ్లను బయటపెట్టి పలకరింపుగా నవ్వాడు ఆ ముష్టివాడు.
విశ్వానికి ఒళ్లు జలదరించింది. చిరాగ్గా నొసలు చిట్లించి వేగంగా ముందుకి కదిలాడు.
ఛీఛీ..! ఈ దేశంలో అడుగడుగునా అడుక్కునే వాళ్లుంటారు. ఇదొక పనిగా పెట్టుకుని జీవిస్తున్నారు- వేరే పని చేయలేని, చేతకాని సోమరిపోతులు.
ప్రభుత్వాలు ఎన్ని మారినా వీళ్లని శాశ్వతంగా కనబడకుండా చేసే మహానుభావులే కనబడ్డం లేదు. ఇలా ప్రతిచోటా వీళ్లని ఎట్లా భరించడం..?
ఆఖరికి తన షాపుకి పది అడుగుల దూరంలోనూ ఒక ముష్టివాడు తయారయ్యాడు. ఏం చేసేది..?
ఈ అడుక్కునేవాళ్లు మహా మొండివాళ్లు. ఎవరి మాటా వినరు. వీళ్లకి ఎవరి భయమూ లేదు. ఎవరూ తమ దగ్గరకి రావడానిక్కూడా సాహసించరనే విషయం వీళ్లకు బాగా తెలుసు మరి.
షాపు తెరిచాక దినపత్రిక తిరగేస్తుంటే తెలిసింది- ఒక్క హైదరాబాద్‌లోనే యాచక వృత్తిలో ఏటా కోట్ల వ్యాపారం జరుగుతోందట. ముష్టివాళ్ల దందా ఎంతగా విస్తరించింది..?
ఇక రోజూ వచ్చేటప్పుడూ, వెళ్లేటప్పుడూ ఈ కొత్త ముష్టివాడి మొహం చూడక తప్పదన్న నిజం- విశ్వాన్ని అశాంతికి గురిచేస్తున్నది.
కాసేపటికి పక్కషాపుల వాళ్లు అటుగా వచ్చినపుడు.. పిచ్చాపాటీ కబుర్లలో ముందుగా ఈ సమస్యనే లేవదీశాడు విశ్వం.
‘‘ఎవరండీ వాడినట్లా అక్కడ ఉండనిచ్చింది..? అక్కడున్న షాపుల యజమానులకి ఈ విషయం పట్టదా..?’’ అక్కసు వెళ్లగక్కాడు విశ్వం.
‘‘వాళ్లు ఈ విషయం సీరియస్‌గా తీసుకోవడం లేదంటే.. వాళ్లు చాలా దయామయులు, దానశీలురు అనుకోవాలి మరి’’.
‘‘పోనీలెండి.. బతకనివ్వండి.. మనం మాత్రం ఏం చేయగలం?’’
‘‘ఇందులో వేలు పెడితే పరువు పోదూ?’’
‘‘వాడితో మనకి గొడవేంటి..?’’
ఇలా సాగాయి ఆ వ్యాపారస్తుల వ్యాఖ్యానాలు.
విశ్వానికి చిర్రెత్తుకొచ్చింది. కానీ, నిస్సహాయత ఆవరించి తల పట్టుకున్నాడు.
తనకి అడుక్కునేవాళ్లంటే విపరీతమైన ఎలర్జీ.
****
ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఈ ముష్టివాడి దర్శనం తప్పించుకోలేకపోతున్న విశ్వం- వాడిని చూసిన అరగంట వరకూ ఏదో పట్టలేని కోపంతో రగిలిపోతున్నాడు.
ఏమిటా వేషం..? కలవరం పుట్టించే వెధవ నవ్వొకటి పైగా.. అసలా నవ్వుకు అర్థం ఏమిటి..?
రోజులో పదిసార్లయినా ఆ ముఖం, ఆ నవ్వు... గుర్తొచ్చి ఏదో చికాకు కలుగుతోంది.
నిద్రలోనూ ఆ వెకిలి నవ్వు వెంటాడుతోంది.
కానీ, దీని గురించి ఎవరికీ చెప్పుకునేట్టులేదు. ఏమని చెప్పుకోగలడు? ఒక ముష్టివాడి నవ్వు తనని వెంబడిస్తోందంటే- విన్నవాళ్లు పగలబడి నవ్వకుండా ఉంటారా?
‘పోకిరి’ సినిమాలో బ్రహ్మానందం లాగా ఉంది తన పరిస్థితి అని పరి పరి విధాలా వగచాడు.
పదే పదే వాడి వేషం ఎందుకు గుర్తుకొస్తోంది? చేతిలో ఆ గొడుగేంటి? అప్పుడే వానాకాలం వచ్చేసిందా వాడికి? మండే ఎండాకాలం కూడా కాదు.
వీలుకావడం లేదు. కానీ.. తనకే గనక అవకాశం, అధికారం ఉంటే- ఓ పెద్ద కర్రందుకుని వాడిని వెంటబడి తరిమి తరిమి కొట్టేవాడు.. మళ్లీ ఈ ఏరియాకే రాకుండా చేసేవాడు.
అంతలోనే అతని అంతరాత్మ అడుగుతున్నట్టుగా ఒక ప్రశ్న విశ్వంలో-
‘‘ఆ ముష్టివాడు నీకు ఏం అపకారం చేశాడు? నిన్ను డబ్బు అడిగి వేధిస్తున్నాడా? షెల్టరడిగి హింసిస్తున్నాడా? ఎందుకు వాడి గురించి ఆలోచిస్తావ్? వాడి బతుకు వాడిని బతకనీరాదా?’’
తన వద్ద జవాబు లేదు మరి..!
****
అలా నెల రోజులు గడిచాయ్.
అన్నయ్య కొడుక్కి ఒంట్లో బాగాలేదని తెలిసి వెంకటాచలం (తమ గ్రామం) వెళ్లాడు విశ్వం.
హాస్పిటల్లో అన్నయ్య, వదినలను పలకరించి, వాళ్లబ్బాయి వేణుని పరామర్శించి సాయంత్రం వరకు అక్కడే గడిపిన విశ్వం ‘ఇక వెళ్లివస్తాను..’ అంటూ సెలవు తీసుకుని బయలుదేరాడు తన ఊరికి.
‘‘ఏమిటంత అర్జంటు..? రేపు వెళుదువుగానీలే..!’’ అని అన్నావదినలు ఎంత చెప్పినా వినలేదు.
‘‘ఈ రోజు ఆదివారం కాబట్టి వచ్చాను. షాపులో నేను లేకపోతే.. మీకు తెలిసిందేగా అంతా అస్తవ్యస్తమే! వెళ్లక తప్పదు’’ అంటూ విశ్వం బస్సెక్కాడు.
బస్సు వెంకటాచలం దాటి, సర్వేపల్లి సెంటర్‌ని క్రాస్ చేస్తుండగా రెండు నిముషాల్లో నల్లని మబ్బులు వేగంగా వచ్చేసి చంద్రుణ్ణి కమ్మేశాయ్. చలిగాలి బలంగా వీచింది. చినుకులు మొదలయ్యాయ్.
‘‘ఇదేమిటబ్బా.. ఈ అకాల వర్షం!’’ అనుకుంటూ కిటికీ అద్దాలు మూశాడు విశ్వం.
వాన మరింత జోరందుకుంది. పది నిముషాల్లో బుజబుజ నెల్లూరు దాటి ఊర్లోకి అడుగుపెట్టింది బస్సు. మరో పది నిముషాల్లో గమ్యం రానే వచ్చింది. బస్టాండ్‌లో దిగాడు విశ్వం. అప్పటికి వర్షం ఒక్కసారిగా తగ్గిపోయింది. చినుకులు కూడా ఆగిపోయాయ్.
‘ఇంటికి ఫోన్ చేస్తే తమ్ముడు బైక్ తీసుకుని వస్తాడు కదా!’ అనుకున్నాడు విశ్వం.
కానీ, తమ్ముడు ఇంట్లో లేడనీ ఎవరో ఫ్రెండ్‌ని కలవడానికి కావలి వెళ్లాడనే వియం గుర్తొచ్చింది.
ఆటో కోసం చూశాడు విశ్వం. తమ ఇంటివైపు వెళ్లే ఆటో ఒక్కటి కూడా లేదు అక్కడ. అయినా చిన్న చిన్న దూరాలకు ఆటో ఎక్కడం విశ్వంకు నచ్చదు. సైకిల్ రిక్షాలు కూడా కనిపించడం లేదు.
‘పది నిముషాలు ఓపిగ్గా నడిస్తే ఇంటికెళ్లొచ్చు’ అనుకుంటూ బయలుదేరాడు విశ్వం.
జేబులోని సెల్‌ఫోన్ బయటకు తీసి టైం చూశాడు. పదకొండు అయింది.
చిన్నగా నడక సాగించాడు.
బస్టాండ్ నుంచి ఇల్లు కిలోమీటరు కంటే తక్కువే. సగం దూరం వచ్చాడో లేదో ఒక్కసారిగా మళ్లీ వర్షం మొదలైంది.
‘తగ్గుతుందిలే.. ఇల్లు చేరిపోతే బట్టలు మార్చుకోవచ్చు’ అనుకున్నాడు విశ్వం. కానీ, వర్షం క్షణాల్లో కుంభవృష్టిగా మారింది.
‘‘కాసేపు ఏదైనా షాపుముందు ఆగాల్సిందే’ అనుకుంటూ అటూ ఇటూ చూశాడు.
కుడివైపునకు రోడ్డు పక్కన ఒక పెద్ద షాపు ఉంది. దాని ముందు నిలబడితే వర్షం నుండి తప్పించుకోవచ్చు అనుకుని అటు తిరిగి రెండడుగులు వేశాడో లేదో.. వెనకనుండి సర్రున ఒక జీపు దూసుకురావడం గమనించాడు.
కానీ, జీపు ఎంత వేగంగా వచ్చిందంటే... విశ్వం దానినుండి తప్పించుకోలేకపోయాడు.
అంతే..! క్షణంలో విశ్వాన్ని రాసుకుంటున్నట్లుగా అదే వేగంతో తోసినట్టుగా.. అల్లంత దూరాన ఎగిరిపడ్డాడు విశ్వం.
కళ్లు బైర్లు కమ్మాయ్.... క్షణాల్లో స్పృహ తప్పాడు.
***
కళ్లు తెరిచిన విశ్వం మెల్లగా లేచి కూర్చోబోయాడు. ఒళ్లంతా నొప్పులు. ఎలాగో శక్తినంతా కూడదీసుకుని లేచాడు. జేబు తడుముకున్నాడు. సెల్‌ఫోన్ ఉంది, డబ్బుంది.
అక్కడ అదే చీకటి.. అదే రోడ్డు... కానీ తాను.. ఆ పెద్ద షాపుముందే ఉండడం గమనించాడు. ఒక్కసారి జరిగింది గుర్తుతెచ్చుకున్నాడు. తనని జీపు ఢీకొట్టినంత పని చేసి వెళ్లడం గుర్తుకొచ్చింది.
అయితే, తనకేమీ కాలేదా? తాను ఇక్కడికి ఎలా వచ్చాడు? అర్థం కాని అయోమయం..
వర్షం ఇంకా పడుతూనే ఉంది. తనకేమీ కాలేదు కదా! మళ్లీ తన వంక చూసుకున్నాడు.
ఏమీ కాలేదు.. చిన్న చిన్న గాయాలు తప్ప..
ఎవరో తనని రక్షించి ఉంటారనే ఆలోచన కలిగింది. చుట్టూ చూశాడు.
పది గజాల దూరంలో కనిపించిందో మానవకారం. ఎవరది..? దొంగా..? నిశితంగా చూశాడు.. దొంగ కాదు.. మరెవరు..? కళ్లు చికిలించి మరీ చూశాడు.
అనుమానం లేదు.. ఆ ముష్టివాడే. గొడుగు కింద నిలబడి ఉన్నాడు.
సన్నగా పడుతున్న లైట్ల వెలుతురులో- అదే నవ్వు...
‘‘బాబూ..! మీకేం కాలేదు. రోడ్డు మధ్యలో పడి ఉంటే ఇటు తీసుకొచ్చాను’’ అన్నాడు తను. మెల్లగా విశ్వం వైపు వస్తూ.
విశ్వం నిశే్చష్టుడయ్యాడు.
తను నిత్యం అసహ్యించుకుంటున్న ఈ ముష్టివాడే- ఈ రోజు తన ప్రాణాన్ని కాపాడాడనే విషయం అర్థం కావడానికి ఎక్కువసేపు పట్టలేదు.
సిగ్గుతో కుంచించుకుపోయాడు విశ్వం.
‘‘బాబూ..! మీ ఇల్లెక్కడో పాపం.. ఎలా వెళతారు? ఇదిగో.. నా గొడుగు తీసుకెళ్లండి...’’ అన్నాడు ముష్టివాడు.
విశ్వం నిరుత్తరుడయ్యాడు.
కాళ్ల కింద భూమి పగిలిపోతున్న భావన.
లేచి నిల్చున్న విశ్వం... తల వంచుకుని నేల చూపులు చూస్తున్నాడు.
‘‘్ఫరవాలేదు బాబూ... తీసుకెళ్లండి. రేపు తిరిగి ఇచ్చేద్దురుగానీ..’’ అంటూ తన గొడుకును విశ్వం ముందుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు ఆ ముష్టివాడు.
విశ్వం వౌనంగా ఆ గొడుగుని అందుకున్నాడు. ఇప్పుడు ఆ గొడుగు అతనికి అంటరాని వస్తువుగా అనిపించలేదు. దేవుడిచ్చిన వరంలా ఉంది.
చేతిలో గొడుగుతో చిన్నగా నడక సాగించాడు విశ్వం. అతని మదిని తొలిచేస్తూ సవాలక్ష ఆలోచనలు.. ఆ ముష్టివాడిముందు తాను వామనుడిగా మారినట్టు అనిపిస్తున్నది.
విశ్వం ఇల్లు చేరేలోగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది.
రోడ్లపై పారుతున్న నీటిలో మురికి కొట్టుకుని పోతున్నది. విశ్వం మనసులోనూ అలాగే జరుగుతోంది.
ఎవరు గొప్ప? ఎవరు నీచులు? అనేది మనిషి సంస్కారాన్ని బట్టే ఉంటుంది. తనకి చేతనైన పరిధిలో.. మరో మనిషికి సాయపడేవాడే మహోన్నతుడు..!
ఇది విశ్వంకు జీవితం నేర్పిన పాఠం! *

No comments:

Post a Comment