Sunday, 26 October 2014

నాడీ వ్యవస్థ దెబ్బతింటే నిద్రలేమి!

సర్వశరీరగతంగా వ్యాపించిన కండరాల నొప్పిని ఫైబ్రోమైయాల్జియా అంటారు. నొప్పి కండరాల్లోనూ, మెత్తని కణజాల సముదాయాల్లోనూ నిగూఢంగా ఉంటుంది. కటి ప్రదేశానికి ఎగువన, దిగువన, శరీరానికి ఇరుపక్కలా కేంద్రీకృతమై ఉంటుంది. నిజానికి ఇది ఒక వ్యాధి కాదు కొన్ని లక్షణాల సమూహం. అందుకే దీనిని సిండ్రోమ్ అంటారు. స్పష్టమైన కారణాలు తెలియని సమస్య ఇది. ఈ స్థితి ప్రాప్తించినవారిలో నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. నరాలు, మెదడు, వెన్నుపాముకు చేరే సంకేతాలు సక్రమంగా తర్జుమా కావు. దీంతో కండరాలు, జాయింట్లు, మెత్తటి కణజాలాల్లో జరిగే మామూలు మార్పులను మెదడు నొప్పిని అన్వయించుకుంటుంది. అందుకే ఫైబ్రోమైయాల్జియా కలిగిన వ్యక్తుల్లో శరీరంమీద గాయాలు, దెబ్బలూ వంటివి లేకపోయినప్పటికీ నొప్పులతో ఇబ్బందిపడుతుంటారు.
ఫైబ్రోమైయాల్జియా అనే పదం ల్యా టిన్ నుంచి వచ్చింది. ఫైబ్రస్ అంటే గట్టి నార వంటి కణజాలమని అర్థం. మయో అంటే కండరాలకు సంబంధించినది అని అర్థం. ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. కండరాలు, సంధాయక కణజాలాల్లో నొప్పి ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని ఫైబ్రోమైయాల్జియాగా వ్యవహరిస్తారు.
కారణాలు
ఈ వ్యాధికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ అధ్యయనకారులు కొన్ని అంశాలను కారణాలుగా ప్రతిపాదిస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా ఒకరికి ఈ సమస్య ఉంటే మిగతావారిలో కూడా కనిపించవచ్చు. ఇలా ముఖ్యంగా మహిళల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సమూహాన్ని 1980 నుంచి ఒక వైద్యపరమైన సమస్యగా వైద్యలోకం పరిగణించటం మొదలుపెట్టింది. పైబ్రోమైయాల్జియాకు దారితీసే కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం.
మెదడులోను, వెన్నుపాములోనూ ఉండే నరాల కణజాలం బాగా సున్నితంగా మారటం వల్లగానీ, లేదా నాడీ వ్యవస్థలో తయారయ్యే రసాయనాల మొత్తాల్లో మార్పులు చోటుచేసుకోవటంవల్లగానీ నరాల కణజాలం అత్యధికంగా స్పందిస్తుంది. దీంతో చిన్నపాటి కారణానికే, కొద్దిపాటి మార్పుకే శరీరం నొప్పిని పసిగడుతుంది. మానసిక ప్రవర్తన (మూడ్)ని నియంత్రించే మెదడులోని జీవరసాయనాల్లో మార్పులు రావటంవల్ల నొప్పిని తట్టుకునే తత్వం తగ్గిపోతుంది. దీంతో నిద్రలో విశ్రాంతి లభించకపోవటం, నిస్త్రాణ వంటివి కలుగుతాయి. దీని తరువాత బాధితుల శారీరక చైతన్యం తగ్గిపోతుంది. కండరాల్లోను, కణజాలాల్లోనూ ఫ్లూజ్వరంలో మాదిరిగా అకారణంగా నొప్పిగా అనిపిస్తుంటుంది.
కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ వంటి హార్మోన్ల విడుదలను మెదడులోని పిట్యూటరి గ్రంథి, హైపోథెలామస్ అనే భాగాలు నియంత్రిస్తుంటాయి. ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి లోనైనవారిలో ఈ హార్మోన్ల విడుదలలో తేడాలు చోటుచేసుకుంటాయి. వీటి తయారీలో సంభవించిన అసమతుల్యత కారణంగా నిస్త్రాణ, ప్రవర్తనలో మార్పులు, విషయగ్రహణ శక్తితగ్గటం, మనసును లగ్నం చేయలేకపోవటం, నొప్పిని తట్టుకోలేకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
నిద్రలో గాఢనిద్ర స్థితిని పొందలేకపోవటం ఈ వ్యాధికి మరో కారణం. గ్రోత్ హార్మోన్ వంటి పదార్థాలు గాఢ నిద్రలో విడుదలవుతుంటాయి. నిద్రచెదిరినప్పుడు ఈ హార్మోన్ల విడుదలకు అంతరాయం ఏర్పడుతుంది. నిద్ర చెడిపోవటం అనేది ఫైబ్రోమైయాల్జియా వ్యాధిలో ఒక లక్షణంగానూ, ఒక కారణంగాను పరిణమిస్తుంది. చాలామంది ఫైబ్రోమైయాల్జియా లక్షణాలను ఇతర వ్యాధిస్థితులకు ఆపాదించుకుంటారు. ఫ్లూజ్వరం, దెబ్బలు తగలటం, శస్తచ్రికిత్స దుష్ఫలితాలు, మనోభిఘాతం, ఒత్తిడి. ఇలాంటివాటి కారణంగా ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ప్రారంభమైనట్లు భావిస్తుంటారు. మరికొంతమంది ఈ వ్యాధి లక్షణాలను ‘వేడి చేయటం’గా అభివర్ణిస్తుంటారు.
లక్షణాలు
ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒకో తీవ్రతతో, ఒకో పద్ధతిలో వ్యక్తమవుతాయి. ముఖ్యంగా నడుము పైభాగంలోనూ, అలాగే నడుము దిగువ భాగంలోనూ నొప్పి ఏకకాలంలో కనిపిస్తుందని చెబుతుంటారు. అలాగే నొప్పి, శరీరంలో కుడి ఎడమ భాగాల్లో ఒకే స్థాయిలో కనిపిస్తుందని చెపుతుంటారు. ప్రధానంగా మొండెం, మెడ, నడుము, తుంటి భాగం, భుజాలు... ఈ భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. హస్తపాదాల్లో అంతగా ఉండదు. నొప్పి అస్పష్టంగా మొదలై క్రమంగా తీవ్రతరమవుతుంది. ఫైబ్రోమైయాల్జియా వ్యాధి లక్షణాలను పోలిన లక్షణాలు అనేక ఇతర వ్యాధుల్లో కనిపిస్తాయి. కనుక ఇతర వ్యాధుల ఉనికిని పరీక్షించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫైబ్రోమైయాల్జియాతోపాటు ఇతర వ్యాధులు కూడా సమాంతరంగా ఉండే అవకాశం ఉంటుంది. *

కొవ్వు తగ్గితే గుండెకు హాయ..

గుండెపోటు ఎవరికైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడ ఎలా వున్నా రావచ్చు. గుండెకు రక్తసరఫరా చేసే నాళాలు మూడు. వాటిని కరోనరి ఆర్టెరీస్ అంటారు. వీటిల్లో అడ్డంకులు వస్తే గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దాంతో ఆహారం, ఆక్సిజన్ సరిగ్గా అందదు. కార్డియక్ అరెస్ట్ సంభవించి గుండె కండరాలు నీరసిస్తాయ. లేకపోతే గుండెపోటు రావొచ్చు.
మన దేశంలో మరణాలలో ఎక్కువ శాతం గుండెపోటు కారణానే జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాలలో వాళ్లకన్నా పది సంవత్సరాల ముందే మన దేశంలో గుండెపోటులొస్తున్నాయి.
హార్ట్ ఎటాక్ వస్తే ఏం జరుగుతుంది?
గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని శరీరంలోని భాగాలన్నింటికి చేరేలా పంప్ చేస్తుంది. రక్తప్రసరణకి ముఖ్య రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని ప్రాంతాలకి వెళ్తుంటే, వాటినుంచి శాఖోపశాఖలు చీలి శరీరంలోని అన్ని అవయవాలకూ చేరుతుంటుంది. ఒక్కో అవయవానికి ఒక్కో నాళం ద్వారా రక్తసరఫరా జరుగుతూంటుంది. గుండె కరోనరి, ఆర్టెరి మూడు శాఖలుగా చీలి రక్త సరఫరా జరిగేలా చూస్తుంటుంది. ఏ భాగాలకు రక్తసరఫరా తగ్గినా ఆక్సిజన్ ఆహారం సరిగా లభ్యంకాక బాధపడుతుంటారు. గుండెకి రక్తసరఫరా తగ్గినా అంతే! గుండె చాలా ముఖ్యమైన అవయవం. రక్తాన్ని ‘లబ్ - డబ్’ అని కొట్టుకుంటూ అన్ని అవయవాలకు ప్రసరింపజేసి, కార్బన్‌డయాక్సైడ్‌తో కూడిన రక్తాన్ని వెనక్కి తెచ్చుకుని ఊపిరితిత్తులలోకి పంపి, కార్బన్‌డయాక్సైడ్‌ని బయటకు పంపి, ఆక్సిజన్‌ని రక్తం ద్వారా తీసుకుని మళ్లీ అన్ని అవయవాలకు పంపుతుంటుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాలలో గోడలమీద పేరుకుపోవడం జరుగుతుంది. అలా పేరుకుంటున్న కొలెస్ట్రాల్ పదార్థం రక్తనాళాలలో రక్తం ప్రవహించే మార్గాల్ని మూసేస్తూంటుంది. దాంతో గుండెకి కావలసిన రక్తం అందక హార్ట్‌ఎటాక్ వస్తుంది. కాలం గడిచినకొద్ది ఆహారం, ఆక్సిజన్ అందక రక్తప్రసరణ లోపించడంతో గుండె కండరాలు దెబ్బతింటాయి.
కొద్ది కొద్దిగా గుండె రక్తనాళాలు మూసుకుపోవడం ప్రారంభమైనపుడు కొన్ని హెచ్చరికలు వస్తాయి. వాటిని ఎంజైనా అంటారు. గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి. ఆయాసపడుతుంటారు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంటుంది. గుండె ప్రాంతంలో నొప్పిగా ఉండవచ్చు. ఆ నొప్పి చేతులలోకి వెళ్తుండవచ్చు. దవడలోకి వెళ్లవచ్చు. కిందకు రావచ్చు. కాబట్టి బొడ్డు నుంచి దవడల వరకూ రకరకాలుగా మిమిక్ చేస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో నొప్పి ఉంటే వెంటనే గుండె వైద్యుణ్ణి కలిసి ఇసిజి తీయించాలి. అది గుండె నొప్పయితే ఈ చిన్న పరీక్షలో తెలిసిపోతుంది. గుండె నొప్పయితే గుండె చికిత్సా నిపుణులతో అత్యవసరంగా చికిత్స చేయించుకోవాలి. లేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు. ఛాతీ మధ్యభాగంలో మంట వస్తే ఎసిడిటి తాలూకు నొప్పి అని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నట్లవుతుంది!
లక్షణాలు
గుండెపోటు చాలా సార్లు ఛాతిలో చిన్న నొప్పిగా ప్రారంభమై- అడ్డంకులు పెరిగేకొద్దీ- పెరుగుతుంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. అందుకని ఛాతిలో నొప్పి చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది ఈ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం తీసుకువస్తుంది. చాలాసార్లు మనమింతకు చెప్పుకున్నట్లు ఎసిడిటి అనో, అజీర్ణమనో భావించి వైద్యుణ్ణి కలవకుండా ఉండడంతో హఠాత్తుగా రోగి నొప్పితో తన్నుకునే పరిస్థితి వస్తుంది.
చికిత్స
హార్ట్ ఎటాక్ తీవ్రంగా వచ్చినపుడు ప్రతి నిమిషం విలువైనది! ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత వేగంగా గుండె కండరాలు దెబ్బతినడాన్ని అరికట్టవచ్చు. ప్రాణాన్ని కాపాడవచ్చు, గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తిని పునరుద్ధరించి! దాంతో వేగంగా కోలుకుంటారు.
చికిత్సని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకోవాలి. ముఖ్యంగా లక్షణాలు కనిపించిన రెండు గంటలలోపు. గుండెపోటు వచ్చిందని తెలిసింతర్వాత అయిదు నిముషాలు కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఇ.సి.జి తీసి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకుంటారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసి, వాటిని తొలగించాలి. ఒకప్పుడు యాంజియోప్లాస్టి అంటే శస్త్ర చికిత్స కాదు, ప్రొసీజర్. గతంలో తొడద్వారా కేథటార్‌ని పంపి అడ్డంకుల్ని తొలగించేవారు. రక్తస్రావం ఎక్కువగా ఉండేది. కదలకుండా ఒక రోజు విశ్రాంతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు చేతి రేడియల్ ఆర్టీ ద్వారా యాంజియో చేస్తున్నారు. పొద్దున చేయించుకుని, విశ్రాంతి తీసుకుని రాత్రికి ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు. చేతి ద్వారా చేయటంవల్ల చాలా తేలికగా పొసీజర్ జరుగుతుంది. దీనిని ‘రేడియల్ యాంజియో’ అంటారు.
రేడియల్ యాంజియో ద్వారా ఇప్పుడు అతి క్లిష్టమైన అడ్డంకుల్ని తొలగిస్తున్నారు. గట్టిగా అయిపోయిన వాటిని ఆర్టరీ చీలే చోట ఉన్న అడ్డంకుల్ని గుండెకి రక్తం సరఫరా చేసే ముఖ్యమైన ఆర్టెరీలో బ్లాక్‌లు వున్న యాంజియోప్లాస్టీతో తొలగిస్తున్నారు. కేథటార్‌ని లోపలకు పంపి ఇంజెక్షన్‌నిచ్చి అడ్డంకుల్ని తెలుసుకోవడాన్ని ‘యాంజియోగ్రామ్’ అంటారు. కేథటార్ ద్వారా అడ్డంకుల్ని తొలగించే ప్రక్రియని ‘యాంజియోప్లాస్టీ’ అంటారు. అడ్డంకుల్ని తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో రక్తనాళం మూసుకుపోకుండా స్టంట్‌లని అమరుస్తారు. అనుభవమున్న గుండె చికిత్సా నిపుణులతోనే యాంజియోప్లాస్టి, స్టంటింగ్ చేయించుకోవాలి.

Monday, 6 October 2014

Quantitative reasoning - GRE

క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లో మెలకువలు

గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌ (GRE) లో క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ అతి ముఖ్యమైన, బాగా స్కోరు చేసుకోగలిగిన విభాగం. అందుకే విద్యార్థులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పరీక్షకు సన్నద్ధం కావాలి!
ఈ విభాగంలో 35 నిముషాల వ్యవధి ఉండే రెండు భాగాలుంటాయి. ప్రతి భాగంలో 20 ప్రశ్నలు ఇస్తారు. క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌కు స్కోరు 130-170 స్కేలులో ఇస్తారు. వెర్బల్‌ రీజనింగ్‌ స్కోరుతో కలుపుకొని ఓవరాల్‌ స్కోరు 260-340 గా నిర్ణయిస్తారు.
క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లో ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌, మల్టిపుల్‌ ఆన్సర్‌, కంపారిజన్‌, న్యూమరికల్‌ ఎంట్రీ రకాలుగా ఇస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు సమాధానం, ప్రశ్నకు దిగువన ఇచ్చిన ఐదు ఆప్షన్ల నుంచి ఎంచుకోవలసివుంటుంది. దీనికి ఏదో ఒకటే ఆప్షన్‌ సరైనదిగా ఉంటుంది.
అలా కాకుండా మల్టిపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నల్లో ప్రశ్నకు దిగువన ఇచ్చిన ఆప్షన్లలో ఎన్ని సరైనవిగా ఉంటే అన్నింటినీ ఎంచుకోవలసి ఉంటుంది. కరెక్ట్‌ సమాధానాలన్నింటినీ టిక్‌ చేస్తేనే మార్కులు వస్తాయి. సరైన ఆప్షన్‌ ఒక్కటి వదిలేసినా వెయిటేజి ఉండదు.
కంపారిజన్‌ ప్రశ్నల్లో ప్రశ్న/సమస్య ఇచ్చిన తరువాత, దానికింద Column A, Column B కింద ఎంట్రీలు ఇస్తారు. కాలమ్‌ A ఎంట్రీ, కాలమ్‌ B ఎంట్రీ కంటే ఎక్కువగా ఉంటే సమాధానం 'A' అని గుర్తించాలి. అలాకాకుండా కాలమ్‌ A ఎంట్రీ కాలమ్‌ B ఎంట్రీ కంటే తక్కువగా ఉంటే సమాధానం 'B' అని గుర్తించాలి. రెండూ సమానంగా ఉంటే 'C' గా, ఒకవేళ ఇచ్చిన ప్రశ్నలో అవసరమైన డేటా లేకపోతే (insufficient Data) సమాధానం 'D'గా గుర్తించాలి.
కంపారిజన్‌ ప్రశ్నల్లో సమస్యలపట్ల మంచి అవగాహన, సాధన ఉన్నట్లయితే పూర్తిగా సమస్య పరిష్కరించకుండానే సమాధానాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే దీంట్లో కచ్చితమైన సమాధానం అవసరం ఉండదు కాబట్టి. ఇలా చాలావరకు పరీక్ష సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే విద్యార్థి పరీక్షకంటే ముందే సబ్జెక్టుపై పట్టు సాధించవలసి ఉంటుంది.
న్యూమరిక్‌ ఎంట్రీ ప్రశ్నల్లో సమాధానాలు, ప్రశ్న కింద ఇచ్చిన ఖాళీల్లో పూరించవలసి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టడానికి సమస్యను చివరివరకూ సాల్వ్‌ చేయాల్సి ఉంటుంది.
ఏ టాపిక్స్‌ అధ్యయనం ఎలా?
సిలబస్‌ ప్రకారం చూస్తే పాఠశాల స్థాయి భావనలే ఉన్నట్లు కనిపిస్తాయి. అయినా ప్రశ్నలను మాత్రం తార్కికశక్తితో సాల్వ్‌ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నలు నేరుగా ఫార్ములాను ఉపయోగించి చేసేవి కాకుండా విద్యార్థి నిజమైన అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి.
సిలబస్‌ అంకగణితం (Arithmetic), బీజగణితం (Algebra), రేఖాగణితం (Geometry) , దత్తాంశ విశ్లేషణ (Data Analysis)గా ఉంటుంది. ఒక్కొక్కదాన్ని చిన్న అధ్యాయాలు (Chapters)గా విభజించి అధ్యయనం చేస్తే సుమారు 20 అధ్యాయాలు అవుతుంది.
క్వాంటిటేటివ్‌ విభాగంలో ప్రశ్నల్లో వాడే సింబల్స్‌, పదాలు (terminology) ప్రామాణిక గణితంలో వాడే వాటిలాగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక సింబల్స్‌ ఏదైనా ప్రశ్నలో వాడినట్త్లెతే, దాని గురించిన వివరణ కూడా ఇస్తారు.
అరిథ్‌మెటిక్‌లో అంకెలు, సంఖ్యలు, భిన్నాలు, వర్గాలు, వర్గమూలాలపై ప్రాబ్లమ్స్‌ సాధన చేయాలి. ఇవే కాకుండా డెసిమల్స్‌, రియల్‌ నంబర్స్‌, నిష్పత్తులు, పర్సెంటేజీలో కూడా ప్రశ్నలు అడుగుతారు. వీటిల్లో ప్రశ్నలు నేరుగా కాకుండా కొంచెం విమర్శనాత్మకంగా- విద్యార్థి ఆలోచనాశక్తిని పరీక్షించేవిగా అడుగుతారు.
ఆల్జీబ్రాలో లీనియర్‌, నాన్‌-లీనియర్‌లో సమీకరణాలను సాల్వ్‌ చేసే పద్ధతులపై ప్రశ్నలుంటాయి. నాన్‌-లీనియర్‌లో ముఖ్యంగా క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఈక్వేషన్సే కాకుండా అసమానతల (Inequalities) పై కూడా ప్రశ్నలు వస్తాయి. అసమానతలను చేయడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ పరీక్ష కంటే ముందే సాధన చేస్తూ సులభమైనదిగా మార్చుకోవచ్చు.
జామెట్రీలో రేఖలు, కోణాలను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. త్రిభుజాలు, చతుర్భుజాలు, బహుభుజాలపై మంచి అవగాహన ఉండాలి. వాటి వైశాల్యాలు, చుట్టుకొలతలు, అంతర కోణాలు, బాహ్య కోణాలకు సంబంధించిన ఫార్ములాలను గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది.
వృత్తాలు, త్రీడైమెన్షనల్‌ ఫిగర్స్‌ మీద కూడా ప్రాక్టికల్‌ ఓరియంటెడ్‌గా ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలను చేయడానికి ఫార్ములాలను గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తయితే, ఇచ్చిన ప్రశ్నను సరిగ్గా విశ్లేషించి ఎక్కడ ఏ ఫార్ములాను ఉపయోగించాలో పసిగట్టడం మరో ఎత్తు.
డేటా అనాలిసిస్‌లో గ్రాఫికల్‌ మెథడ్స్‌, న్యూమరికల్‌ మెథడ్స్‌, కౌంటింగ్‌ మెథడ్స్‌ మీద ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. ఈ అంశంలో సంభావ్యత (Probability), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ మీద ప్రశ్నలు వస్తాయి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో ఇచ్చిన డేటాను సరిగ్గా, తప్పు లేకుండా గుర్తించడంలోనే అసలైన నేర్పు ఉంటుంది. దీంట్లో ప్రశ్నలు తేలికగా ఉన్నప్పటికీ విద్యార్థులు కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం ద్వారా మార్కుల కోల్పోతూ ఉంటారు. అందుకే పరీక్షకు సన్నద్ధమవుతున్నప్పుడే విద్యార్థి తను ఏ తప్పులు చేస్తున్నాడో గుర్తించి వాటిని అధిగమించేవిధంగా అభ్యాసం చేస్తూ సన్నద్ధం కావాలి.
పైన చెప్పిన అంశాలపై విద్యార్థి ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. ఒకవేళ విద్యార్థి తను ఇంతకుముందు నేర్చుకున్న అంశాలు మరిచిపోయి ఉన్నట్లయితే ఇంకోసారి ఈ అంశాల పునశ్చరణ చేసుకోవాలి. ఇది పరీక్ష సన్నద్ధతకు ఉపకరిస్తుంది. ప్రాథమిక అవగాహన ఏర్పడిన తర్వాత పరీక్షకు మిగిలున్న సమయాన్ని బట్టి ఎన్ని ఎక్కువ ప్రశ్నలు అభ్యాసం చేస్తే అంత ఆత్మవిశ్వాసం ఏర్పడుతూ ఉంటుంది.
ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే- ఒకే రకమైన ప్రశ్నలు ఎక్కువ సాధన చేయడం కంటే వైవిధ్యం ఉన్న ప్రశ్నలను ఎంచుకొని సాధన చేస్తే పరీక్ష సమయంలో ఎంతో ఉపయుక్తం!.

toefl - ielts

ఆ రెండు పరీక్షలకూ ఏమిటి తేడా?

చాలామంది విద్యార్థులు టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌లలో దేన్ని రాయాలా అని తికమకపడుతుంటారు. వీటిలో ఏది సులభమా అని ఆలోచిస్తుంటారు. ఈ రెండు పరీక్షల మధ్య భేదాలేమిటో, సరైన దాన్ని ఎంచుకోవటానికి వేటిని గమనించాలో పరిశీలిద్దాం!
ఆంగ్లం మాతృభాషగా లేని విద్యార్థులు విదేశాల్లోని (ఉదా: యునైటెడ్‌ స్టేట్స్‌, కెనడా, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌) విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకుంటే వారు తప్పకుండా ఆంగ్ల భాషా సామర్థ్య (లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ) పరీక్షను ఎదుర్కొనాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు ఆమోదించే ఆంగ్ల భాషా పరీక్షలు IELTS(ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం), TOEFL (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌). భారత్‌ లాంటి దేశాల విద్యార్థులకు ఈ రెండు పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. 
ఐఈఎల్‌టీఎస్‌ను ఇంగ్లాండ్‌లో రూపొందించారు. ఇది అంతర్జాతీయంగా ఆమోదించే ఆంగ్లాన్ని పరీక్షిస్తుంది. టోఫెల్‌ను ఉత్తర అమెరికాలో రూపొందించారు. ఇది అమెరికన్‌ ఇంగ్లిష్‌ను పరీక్షిస్తుంది.
పోలికలు 
ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌ రెండింటినీ ఆంగ్లభాషలో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించడానికే రూపొందించారు. ముఖ్యంగా తరగతి గదిలో భావవ్యక్తీకరణ, ఆంగ్లభాషా సంస్కృతిలో ఇమడగల సామర్థ్యాలనూ పరీక్షిస్తాయి. ఇవి రెండూ కూడా వినడం, చదవడం, రాయడం, మాట్లాడటం అనే నైపుణ్యాలను విద్యార్థులు ఎంత బాగా సమన్వయం చేయగలరో విశ్లేషిస్తాయి.
తేడాలు 
రెండు పరీక్షలూ బాహ్యంగా ఒకే నైపుణ్యాలను పరీక్షిస్తున్నప్పటికీ, తీరు మాత్రం వేర్వేరు. ఆశయం, లక్ష్యం ఒకటే అయినప్పటికీ వాటి విధానం, పరీక్షా ప్రమాణాల్లో తేడాలు ఉంటాయి. అవి ఏమిటంటే...
ఎ) టోఫెల్‌లో పఠనం (రీడింగ్‌), శ్రవణం (లిసనింగ్‌) విభాగాలకు బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ఐఈఎల్‌టీఎస్‌లో విద్యార్థులు ఇచ్చిన వ్యాసం/ సంభాషణల్లోని పదాలను కాపీ చేసి రాయాల్సి ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంగ్రహ ఆలోచన అవసరముంటుంది. కానీ ఐఈఎల్‌టీఎస్‌ యథాతథంగా ఆలోచించగలిగేవారికి ఉపయోగకరం.
లిసనింగ్‌ విభాగం మౌఖిక ఉపన్యాసాలు, సంభాషణలను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. విదేశంలో విద్య, సామాజికపరంగా విజయం సాధించడానికి వీటిది కీలకపాత్ర. ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష... విన్న అంశాలపై సమాధానాలు రాసే వీలు కల్పిస్తుంది. ఈ లిసనింగ్‌ విభాగంలో వివిధ రకాల ఉచ్చారణలు వినే అవకాశముంటుంది. కేవలం బ్రిటిష్‌, అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌, కెనడియన్‌ ఉచ్చారణ రీతులకే పరిమితం కాకుండా మిగిలినవి కూడా వినవచ్చు.
కానీ టోఫెల్‌లో ప్రామాణిక అమెరికన్‌ ఉచ్చారణనే నిర్వహిస్తారు. టోఫెల్‌ లిసనింగ్‌ విభాగంలో నోట్సు రాసుకోగలిగే నైపుణ్యం ఉండడం తప్పనిసరి. ఎందుకంటే దీనిలో సుదీర్ఘ ఉపన్యాసం/ సంభాషణ విన్న తరువాతే ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.
బి) టోఫెల్‌ భాషణ (స్పీకింగ్‌), లేఖన (రైటింగ్‌) విభాగాలు రెండింటినీ సంపూర్ణంగా గ్రేడ్‌ చేస్తారు. వ్యాసంతోపాటు పద సముదాయం, తర్కం, శైలి, వ్యాకరణం నాణ్యతలను బట్టే మార్కులు ఇస్తారు. ఐఈఎల్‌టీఎస్‌ దీనికి భిన్నం. దీనిలో లక్ష్యఛేదన, సాధన, సందర్భశుద్ధి, పొందిక, నిఘంటు వనరులు, ధారాళంగా మాట్లాడడం, వ్యాకరణస్థాయి, కచ్చితత్వం వంటి వ్యక్తిగత అంశాలను బట్టే మార్కులు కేటాయిస్తారు.
సి) ఐఈఎల్‌టీఎస్‌లో స్పీకింగ్‌ పరీక్ష కోసం పరీక్షకునితో ముఖాముఖీ (ఇంటర్వ్యూ)కు హాజరుకావాల్సి ఉంటుంది. టోఫెల్‌లో మాత్రం మౌఖికపరీక్షను ఓ మైక్రోఫోన్‌లో రికార్డు చేస్తారు. ఆరు ప్రశ్నలకు సమాధానాలు రికార్డు చేసి ఎగ్జామినర్‌కు పంపిస్తారు. ఎక్కువ ప్రశ్నలు విద్యాపరమైనవే (పాఠ్యాంశాలకు సంబంధించినవే) ఉంటాయి. ఓ పాఠం/ విద్యాసంబంధ చర్చను విని మీ అభిప్రాయాలను ఇందాకటి పద్ధతిలోనే చెప్పాల్సి ఉంటుంది. (వీటిని టోఫెల్‌లో ఇంటిగ్రేటెడ్‌ టాస్క్స్‌ అంటారు).
డి) మార్కుల విధానం కూడా రెండింటిలోనూ భిన్నం. ఐఈఎల్‌టీఎస్‌లో 0- 9 బ్యాండ్స్‌ వరకు ఇస్తారు. టోఫెల్‌ గ్రేడులు సంఖ్యల్లోనే ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 పాయింట్ల చొప్పున మొత్తం 120 పాయింట్లు ఉంటాయి.
ఇ) అధికారిక టోఫెల్‌ గైడ్‌ ద్వారా ఐదు పాత ప్రశ్నపత్రాలు, డిస్క్‌లో పొందుపరచిన ఆడియో పాసేజ్‌లతో అభ్యాసం చేయొచ్చు. ఈ పుస్తకం ద్వారా పరీక్షకు ఏమేరకు సిద్ధమయ్యారో పరీక్షించుకోవచ్చు. ఐఈఎల్‌టీఎస్‌కు రిజిస్టర్‌ చేసుకుంటే ఇలాంటి మెటీరియల్‌నే సమాధానాలతో సహా అందిస్తున్నారు. 
ఏది సులభం?
బ్రిటిష్‌ ఇంగ్లిష్‌ కావడం వల్ల ఐఈఎల్‌టీఎస్‌ కాస్త సులభంగా అనిపించవచ్చు. పేపర్‌పై రాసేదే కావడం వల్ల టోఫెల్‌లో మాదిరిగా కీబోర్డ్‌, టైపింగ్‌ అనుభవం అవసరం ఉండదు. అలాగే టోఫెల్‌ తరహాలో స్పీకింగ్‌, రైటింగ్‌ వంటి ఏకీకృత పరీక్షలు ఐఈఎల్‌టీఎస్‌లో ఉండవు. స్పీకింగ్‌ విభాగం విడిగా, వేరేరకంగా నిర్వహిస్తుండటం మూలంగా పరీక్ష వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ మైక్‌ కంటే ప్రత్యక్షంగానే ముఖాముఖికి హాజరవడం హాయి అనిపిస్తే మాత్రం టోఫెల్‌ సులభమనిపిస్తుంది.
ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష 2.45 గంటలుంటే, టోఫెల్‌ పూర్తవడానికి 4 గంటలు పడుతుంది. రెండు పరీక్షలూ ఏడాదిపాటూ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రెండు పరీక్షలూ మీ ఆంగ్లపరిజ్ఞాన స్థాయికి అనుగుణంగా మిమ్మల్ని కచ్చితంగా గ్రేడ్‌ చేస్తాయి.
విద్యార్థులు రెండు పరీక్షల నమూనా పరీక్షలను రాయడం ఉత్తమం. దాన్ని బట్టి మీకు ఏది సులభతరమో ఎంచుకోవచ్చు. నమూనా పరీక్షల కోసంwww.roadtoielts.com/testdrive/ ,www.ets.org/toefl/ibt/prepare/quick pep/ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
చివరగా, మీరు ఎంచుకున్న విద్యాసంస్థ ఏ పరీక్ష స్కోరును అంగీకరిస్తుందో చూసుకోవాలి. టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ల మధ్య తేడాలు కొన్నే. అవి అంత ప్రధానమైనవి కావు. విద్యార్థిగా మీరు లక్ష్యంగా పెట్టుకున్న విశ్వవిద్యాలయాలు కోరే పరీక్ష వివరాలను తెలుసుకోవాలి.
స్థూలంగా చెప్పాలంటే... మీరు బ్రిటిష్‌ కామన్‌వెల్త్‌లోని కళాశాలలకు దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే ఐఈఎల్‌టీఎస్‌ రాయవచ్చు. లేదంటే టోఫెల్‌ రాయండి. మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో దానిపై ఆధారపడి (యూఎస్‌/ యూకే/ ఆస్ట్రేలియా) వీటిలో ఏదో ఒక పరీక్షను ఎంచుకోవచ్చు.
ఏదేమైనా యూఎస్‌లోని చాలా విశ్వవిద్యాలయాలు ఐఈఎల్‌టీఎస్‌ స్కోరును అంగీకరిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని పేరున్న విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంకా ఈ పరీక్షను ఆంగ్ల నైపుణ్య పరీక్షగా గుర్తించటం లేదు. ఈ పరిస్థితుల్లో మీరు ఎంచుకునే విశ్వవిద్యాలయం ఏ పరీక్షను అంగీకరిస్తుందో దాన్నే ఎంచుకోవడం మేలు!

Wednesday, 1 October 2014

smoking === health effects


fasting - immunity


knee joint health


beauty -- health

అందంలోనే ఆరోగ్యం

‘‘ఇప్పుడు నాకందమేమిటి? పెళ్లయింది, పిల్లలూ ఉన్నారు’’ అనే మాట మనం చాలామంది ఆడవాళ్ళ నోటినుంచి వింటుంటాం.
ఇది చాలా తప్పు అభిప్రాయం. అందంగా ఉండడం ఒకవిధంగా చెప్పాలంటే ఆరోగ్యానికి గుర్తు.
శరీరం బిగుతుగా ఉండడంతో అందంగా కనిపించడమే కాదు, ఆరోగ్యంగానూ ఉండగల్గుతాం.
సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ కండరాలు సడలుతుంటాయి. ఆడవాళ్ళలో ప్రసవానంతరం ఈ మార్పులు బాగా కనిపిస్తాయి. పొట్ట ప్రాంతం, స్థనాలు సాగినట్లవుతుంటాయి. పెళ్ళయ్యేంతవరకే కాదు ఆ తర్వాత భర్తనాకర్షించడానికి అందం కావాలి.
గర్భం ధరించినప్పుడు కడుపు ప్రాంతంలోని కండరాలు, చర్మం బాగా సాగుతాయి. ప్రసవానంతరం అవి మళ్లీ మామూలు స్థాయికి రావడానికి ప్రయత్నిస్తాయి. పూర్తిగా మామూలు కావు. ఇలా పొట్ట ప్రాంతంలో కండరాలు దెబ్బతినడంవల్ల ‘హెర్నియా’లు రావచ్చు.
అంటే, లోపలి అవయవాలు చర్మాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చి, ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యపరిస్తే ఆ ప్రాంతంలో చర్మం చిట్లి అవయవాలు బయటికొచ్చేస్తాయి. అందుకని వీటికి వీలైనంత వెంటనే చికిత్స చేయించడం అవసరం.
ఇప్పుడెన్నో రకాల శస్తచ్రికిత్సల్ని మనకు అందించే విధంగా వైద్య రంగం అభివృద్ధి చెందింది. అలాంటి వాటిలో సాగిన కడుపు ప్రాంతంలోని కండరాలు, చర్మాన్ని సరిదిద్దే శస్త్ర చికిత్స ఒకటి. ఈ శస్త్ర చికిత్సతో కడుపు ప్రాంతంలో జారిన కండరాలు, చర్మాన్ని సరిచేస్తారు. దీంతో అందమే కాదు, ముందు ముందు వచ్చే హెర్నియా లాంటివి రాకుండా కాపాడుకోవచ్చు.
సిజేరియన్ శస్తచ్రికిత్సలలో పొత్తికడుపు క్రింది భాగాన శస్తచ్రికిత్స మచ్చ పడుతుంది. ఆ మచ్చ ద్వారానే జారినట్టని సరిచేసే శస్తచ్రికిత్సని చేస్తున్నారు. అందుకని ఈ శస్తచ్రికిత్సవల్ల బయటకు ఎబ్బెట్టుగా కనిపించే మచ్చలేవీ పడవు. ఈ శస్తచ్రికిత్సలో బయట జారిన చర్మాన్ని కత్తిరించి, లోపలి కండరాల్ని బిగుతుగా చేయవచ్చు. ఈ శస్తచ్రికిత్సని ‘అబ్డామినో ప్లాస్ట్’ అంటారు. శస్త్ర చికిత్స తర్వాత పదిహేను రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మళ్లీ మన పనుల్లోకి మనం వెళ్లిపోవచ్చు. ఈ శస్తచ్రికిత్సవల్ల ఇతర ఇబ్బందులేవీ రావు. కొంతకాలం పొట్ట ప్రాంతంలో బెల్టులాంటిదానిని వాడితే చాలు.
దీనిని హెర్నియా శస్తచ్రికిత్సలతోపాటు లైపోసక్షన్‌తో బాటు చేయవచ్చు.
లైపోసక్షన్ అంటే శరీరంలో కొన్ని ప్రాంతాలలో పేరుకుపోయిన కొవ్వుని తొలగించడం. ఇలాంటి శస్తచ్రికిత్సలు అనుభవమున్నవాళ్ళతో చేయించుకోవాలి. లేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తాయి.
అధిక బరువుతో ఉండేవాళ్లు బరువు తగ్గించుకోవడానికి చేసే శస్తచ్రికిత్సలు బేరియాట్రిక్ సర్జరీస్. పొట్ట, తొడలు లాంటి ప్రాంతాలలో పేరుకుపోయిన కొవ్వుని తొలగించడానికి లైపోసక్షన్ తోడ్పడుతుంది.

health

కొలెస్ట్రాల్ తక్కువైనా ముప్పే..!

సాధారణంగా వార్తాపత్రికల్లో, టెలివిజన్ వ్యాపార ప్రకటనల్లో కొలెస్ట్రాల్ పేరు ఎక్కువగా వినబడుతుంది. కొలెస్ట్రాల్ గురించి ఎప్పుడు మాట్లాడినా గుండె దానికి సంబంధించిన వ్యాధులు గుర్తుకువస్తాయి. మానవ శరీరం రకరకాల కణాలతో కూడి వుంటుంది. ఈ కణాలలో అనేక రసాయన పదార్థాలుంటాయి. అనేక రసాయన పదార్థాలలో కార్బోహైడ్రేట్‌లు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ముఖ్యమైనవి. కొవ్వు పదార్థాలు నీటిలో కరగవు, అవి మైనము, నూనెలాంటి పదార్థాల్లాగా వుంటాయి. చాలా రకాలైన క్రొవ్వు పదార్థాలలో కొలెస్ట్రాల్ ఒకటి. మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్‌లు మరియు ఇతర అణువులు నీటిలో కరిగే గుణం వుండటం చేత అది జీర్ణమైన తర్వాత రక్తంలో కలిసి వేర్వేరు కణజాలాలకు అందజేయబడతాయి. కానీ కొవ్వు పదార్థాలు నీటిలో కరగవు గనుక కొన్ని నీటిలో కరిగే గుణం కల లైపోప్రోటీన్లు అనే పదార్థాలు కొలెస్ట్రాల్ మరియు ఇతర కొవ్వు పదార్థాలను కణజాలాలకు చేరవేస్తాయి. ఈ సరఫరాలో లోపం వస్తే అది చాలా అనర్థాలకు దారి తీయవచ్చు.
రక్తంలో చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ వుండటాన్ని హైపర్ కొలెస్ట్రీమియా అంటారు. అలాగే సాధారణ స్థాయికంటే తక్కువ శాతం కొలెస్ట్రాల్ వుండటాన్ని హైపో కొలెస్ట్రీమియా అంటారు. ఈ రెండు స్థితులు అనారోగ్యదాయకమే. హైపర్ కొలెస్ట్రీమియా వల్ల గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
హైపర్ కొలెస్ట్రీమియా అన్నది చాలా నిశ్శబ్ద రోగం. ఈ జబ్బుకు ఫలానా లక్షణాలు అని లేవు కనుక కనుక్కోవడం కష్టం. హైపర్ కొలెస్ట్రీమియావలన అథిరోస్ల్కీరోసిస్, దాని మూలాన ఛాతీనొప్పి, గుండెపోటు, పక్షవాతం వచ్చేంతవరకు దీన్ని కనుగొనలేము. హైపర్ కొలెస్ట్రీమియాలో చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ రక్తంలో వుండటంవల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిల్వలు ఏర్పడవచ్చు. ఈ నిల్వలను ప్లేక్స్ అంటారు. ముందుగా చిన్నగా వున్న ప్లేక్స్ పెద్దవి అయ్యేకొద్ది రక్తనాళాలలో ఎక్కువ స్థలం ఆక్రమించడంవల్ల రక్తప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. క్రమేణా ప్లేక్స్ పరిమాణం పెరిగి అథిరోస్ల్కీరోసిస్ అనే వ్యాధికి దారితీయవచ్చు. ఫలితంగా రక్తం రక్తనాళాలలో గడ్డకట్టి రక్తప్రవాహం ఆగిపోవచ్చు. ఇదే కనుక గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో జరిగితే గుండెపోటు వస్తుంది. ఇదే మెదడుకు సరఫరాచేసే రక్తనాళాలలో జరిగితే అది పక్షవాతం రావడానికి కారణవౌతుంది. భారతదేశంలో కూడా అథిరోస్క్లీరోసిస్‌వల్ల మరణించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
రెండు చాలా ముఖ్యమైన కొలెస్ట్రాల్స్ శరీరంలో వుంటాయి. ఒకటి లోడెన్సిటీ లైపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్), రెండవది హైడెన్సిటీ లైపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ (హెడిఎల్). ధమనిలో పేరుకొన్న వున్న కొలెస్ట్రాల్‌ని నిర్మూలించి వాటిని కాలేయానికి తరలించడంవల్ల కొన్ని హృద్రోగాలను నివారించవచ్చు. ఈ పని హెచ్‌డిఎల్ చేస్తుంది కనుక దీనిని ‘మంచి’ కొలెస్ట్రాల్ అంటారు. కానీ ఎల్‌డిఎల్ ధమని గోడలలో ఎక్కువ కొలెస్ట్రాల్ అంటి వుండేటట్లు దోహదం చేసిన హృద్రోగానికి దారితీస్తుంది. అందువల్ల ఎల్‌డిఎల్‌ని చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు.
ఆహారం, వ్యాయామం, ధూమపానం, మధుపానంవల్ల మరికొన్ని వ్యాధులలో ఈ మంచి చెడ్డ కొలెస్ట్రాళ్ళ స్థాయిలో తేడా వస్తుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలు వున్న ఆహారం తీసుకొంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే వ్యాయామం చేయడం, బరువు తగ్గించడంవల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ రక్తంలో వున్నాయో లేదో తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేయవల్సి వుంటుంది. ఆహారం ఏమీ తీసుకోకుండా 12 గంటలు పాస్టింగ్‌లో వున్న తర్వాత ఈ పరీక్షకు రక్తం తీసుకొని కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఏ శాతంలో వున్నాయో తెలుసుకోవాలి. 45 సం.లు దాటినవారు ఈ పరీక్ష చేయించుకొని అవసరమైతే వైద్య సలహా పొందుతూ వుండాలి.
డాక్టర్ సలహా ప్రకారం ముందుగా కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, కొన్ని అలవర్చుకోవాలి. ఫైబర్ అధికంగా వుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కనీసం రోజుకు 40 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. వరి, గోధుమలు, ఇతర ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలలో ఫైబర్ అధికంగా వుంటుంది. కొలెస్ట్రాల్ తక్కువ వున్న ఆహారం తీసుకోవడం మంచిది. ఆహారంలో కొలెస్ట్రాల్ రోజుకు 300 మి.గ్రాలు మించకూడదు. కొలెస్ట్రాల్ తక్కువ వున్న ఆహార పదార్థాలు అంటే మీగడ తీసేసిన పాలు, కొలెస్ట్రాల్ తక్కువ వున్న పాలు, చేపలు, కోడిమాంసం తక్కువ కొలెస్ట్రాల్ వున్న మాంసం (లీన్ మీట్) తీసుకోవచ్చు. కానీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ వున్న కోడిగుడ్లు, వెన్న, నెయ్యి తీసుకోకూడదు.
లావుగా వున్నవారు బరువును అదుపు చేసుకోవడం అవసరం. రోజుకు సుమారు 45 ని.ల చొప్పున కనీసం వారంలో 5 రోజులు నడక వంటి శారీరక వ్యాయామం చేయడం శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గించడానికి దోహదపడుతుంది. వ్యాయామమే అదనపు ఆరోగ్యం గనుక రోజూ వ్యాయామం చేయండి.
ఎక్కువ కొలెస్ట్రాల్ ఎంత హానికరమో, తక్కువ కొలెస్ట్రాల్ కూడా అంతే హానికరం. ఎందుచేతనంటే జీవన చర్యలకు అవసరమైన బైలు ఆమ్లాలు, స్టీరాయిడ్ హార్మోన్లు మొదలగునవి కొలెస్ట్రాల్ నుంచి తయారవుతాయి. కాబట్టి రక్తంలో కొలెస్ట్రాల్ బాగా తగ్గినట్లయితే ఉపయోగకరమైన ఈ పదార్థాల స్థాయి తగ్గి అనారోగ్యం రావచ్చు. కావున ఆహారంలో కొవ్వు శాతం కావాల్సిన దానికంటే మరీ తగ్గించడానికి ప్రయత్నించకూడదు. *

Suputri - Telugu short stories

సుపుత్రి ( కథ)

ఈ రోజు తన స్నేహితురాలు రేఖ రాకపోవడం వల్ల ఒంటరిగా తినాల్సి వస్తోందని అనుకుంటూ, టిఫిన్ బాక్స్‌లో తను తెచ్చుకున్న రెండు చపాతీలు తినేసి మంచినీళ్లు తాగి అలాగే దిగులుగా కూర్చుంది సుకన్య. ఏదో బాధ ఆమె మనసును తొలిచేస్తుంటే- అప్రయత్నంగా ఆమె కంటి కొలకుల్లో రెండు కన్నీటి బిందువులు నిలిచాయి.
రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన చేదు జ్ఞాపకంలా ఆమె మనసులో మెదిలింది. పదిహను రోజుల క్రితమే పెద్ద కూతురు విద్య పురిటికని వచ్చింది. వారం రోజుల్లో ఓ మంచి రోజు చూసి ఆమె అత్తగారి కుటుంబ సభ్యులను, ఇతర బంధువులను ఆహ్వానించి సీమంతం చేయాల్సి ఉంది. అదిగో.. ఆ ఏర్పాట లకోసమని డబ్బు అడిగితేనే భర్తతో గొడవ అయింది. ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ పెట్టవద్దనీ, అసలు పురుడు పోసి పంపించడమే చాలా ఎక్కువనీ గట్టిగా చెప్పి తాను నచ్చచెప్పబోతే విదిలించేయడమే కాకుండా, డబ్బు విలువ తెలియని దానినని తనను గట్టిగా తిట్టి వెళ్లిపోయాడు. ఆ రోజునుంచీ తన మనసు ఏమీ బావుండడం లేదు. గండం ఎలా గట్టెక్కుతుందో తెలియదు. ఏనాడూ తన మీద అరవని భర్త అంత గట్టిగా అరవడం సుకన్యను షాక్‌కి గురి చేసింది. అదృష్టం ఏమిటంటే- ఘర్షణ జరిగిన సమయంలో విద్య ఏసీ బెడ్‌రూమ్‌లో నిద్రపోతూ ఉండడం.
తనకి ఇంకా ఐదేళ్లు సర్వీసుంది. భర్త వ్యాపారం నాలుగేళ్లుగా అంత ఆశాజనకంగా వుండకపోవడం వల్ల తనది ప్రభుత్వోద్యోగం కావడం వల్ల సుకన్య అన్ని రకాల రుణ సదుపాయాలను వినియోగించుకున్నది ఇప్పటికే. నాలుగు నెలల క్రితమే చిన్నకూతురు కావ్యకు వివాహం చేశారు. ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టిన ప్రణీత్ ఇంటర్ చదువుతున్నాడు. వాడి చదువు అయ్యేదాకా తను ఉద్యోగం చేయాల్సిందే. సుకన్యకు ఈ గానుగెద్దు జీవితం చాలా విసుగ్గా ఉంటున్నది. ఉదయం లేచింది మొదలు క్షణం తీరికలేని ఇంటి పనులు.. ఆపై ఉద్యోగ బాధ్యతలు... దాంతో పాటు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని తేలికగా తీసుకోవడం, అవి కోతిపుండు బ్రహ్మరాక్షసి చందాన పెద్దవి కావడం. అలాంటి సమస్యే తనకు కొత్తగా వచ్చిన మోకాలి నొప్పులు. ఎంత బాధపడుతున్నా ఎక్కువ కాలం సెలవు దొరక్కపోవడంతో ఓ మూడు నెలల పాటు ఫిజియోథెరపీ తీసుకుంటూ, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సుకన్య పెయిన్ కిల్లర్స్‌తో బాధను అణచివేస్తూ తిరుగుతోంది. ఉద్యోగానికి రాజీనామా చేద్దామంటే తీరని బాధ్యతలు, భర్త నుంచి చాలీచాలని ఆదాయం అందుకు సహకరించడం లేదు. లంచ్ టైమ్ పూర్తి కావడం వలన ఆలోచనలలోంచి తేరుకుని ఓ నిట్టూర్పు విడిచి లేచి తన సీట్‌లోకి వచ్చేసింది సుకన్య.
* * *
బిజినెస్ పనిమీద ముంబయి వెళ్లిన రాజేంద్ర మనసు కూడా అల్లకల్లోలంగానే ఉంది. ఎన్నడూ లేనిది భార్యను కసురుకున్నాడు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నా సరే- పిల్లలకోసం, కుటుంబం కోసం రాజీనామాను ఉపసంహరించుకునే తన శ్రీమతిని చూస్తుంటే- తనమీద, తన నిస్సహాయత మీద కోపం రెండూ ఒకేసారి వచ్చేస్తూ వుంటాయి తనకు.
విద్య పుట్టింటికి రాగానే అప్పుకోసం బయలుదేరాడు. కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు. చిన్నదాని పెళ్లికి దాచిన సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోయాయి. పిల్లవాడు ఇంకా చేతికి అందిరాలేదు. పైగా ఇంకా వాడి చదువుకు లక్షలు కావాలి. అందుకే సీమంతం గురించి సుకన్య ప్రస్తావించగానే అసహాయతతో ఆమెమీద అరిచేశాడు తను. పైగా తిట్టాడు కూడా. ఏ సమస్య వచ్చినా తన స్నేహితురాలై, జీవన సహచరియై దాన్ని ముడివిప్పే తన ప్రియసతి మీద కోపం తెచ్చుకున్నాడు మొట్టమొదటిసారిగా. పశ్చాత్తాపంతో, బాధతో మూ ల్గింది అతని మనసు.
* * *
అఫీషియల్ మెయిల్స్ చెక్ చేసుకుంటున్న సుకన్య, వాటికి జవాబులు పంపించిన తరువాత కాస్త ఖాళీ సమయం దొరకడంతో చిన్న కూతురు ఏమైనా లెటర్ రాసిందేమోనని తన పర్సనల్ మెయిల్ తెరిచింది. చిత్రంగా భర్తనుంచి మెయిల్. ఆశ్చర్యాన్ని అణచుకుంటూ గబగబ మెయిల్ తెరిచి చదువుకోసాగింది.
‘‘డియర్ సుకన్యా..
మన పెళ్లి అయి ఇన్నాళ్ల తరువాత అనవసరంగా నీమీద కేకలు వేశాను. నా నిస్సహాయత, నిస్పృహలోంచి వచ్చిన ఆక్రోశం అది. అర్థం చేసుకుంటావు కదూ? ఏది ఏమైనా- నిన్ను అనవసరంగా బాధ పెట్టినందుకు నన్ను క్షమించు సుకన్యా..
ఇప్పుడు నేనొక నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. నువ్వు చాలాసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన నేను ఇప్పుడు గట్టిగా నిశ్చయించుకున్నాను. మన వ్యాపారాన్ని మూసివేయడానికి నిర్ణయించుకున్నాను. మీ అన్నయ్య కంపెనీలో మేనేజర్‌గా చేరడానికి అర్థం లేని అభిమానం, ఇబ్బంది అడ్డు వచ్చి ఆగిపోయాను కదా... ఈరోజే మీ అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పబోతున్నాను. వచ్చేవారం నా పనులన్నీ పూర్తి కాగానే వచ్చి చేరతానని. నాకు ప్రేమించే హక్కు మాత్రమే కాదు, నిన్ను చక్కగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నాపై ఉన్నది కదా... అందుకే ఆరునెలల తరువాత నీ చేత ఉద్యోగం మాన్పించేస్తాను సుకన్యా... చక్కగా వ్యాయామాలు చేస్తూ సరైన సమయానికి మంచి ఆహారం తీసుకుంటూ నీ ఆరోగ్యం బాగు చేసుకుందాము. మనకి పిల్లలనిచ్చిన భగవంతుడే వారి బాధ్యతలు పూర్తయ్యేవరకు మనకి సహాయం చేస్తాడు.
రేపు ఉదయానికల్లా ఇంట్లో ఉంటాను.’’
- నీ రాజేంద్ర
సుకన్య కనుల నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి.
* * *
మర్నాడు ఉదయం భర్త రాగానే ఆనందంగా ఎదురేగింది సుకన్య. అతని చేతిలోంచి బ్రీఫ్ కేసును అందుకుని లోపల పెట్టి వచ్చి అతనికి కాఫీ అందిస్తూ- ‘చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండీ.. అన్నయ్య కంపెనీలో చేరితే వాడికి సహాయంగా ఉండడంతోపాటుగా మన కుటుంబం కూడా ఒడ్డున పడుతుంది. నేను కొన్నాళ్లు సెలవు తీసుకుని ఉద్యోగంలో కొనసాగుతానే తప్ప- మన ప్రణీత్ చదువు అయ్యేవరకు ఉద్యోగం మాత్రం మానునులెండి...’ అంది నవ్వుతూ.
అప్పటివరకు ఆమె ముఖంలోకి చూడాలంటేనే సిగ్గుపడుతున్న రాజేంద్ర అబ్బురంగా ఆమెవైపు చూసాడు. వ్యాకులంగా ఉన్న అతని మనసు చిత్రంగా ఆమె మాటలకు సాంత్వన పొందినట్టయింది. కానీ, తన మనసులోని నిర్ణయాలు ఆమెకు ఎలా తెలిసిపోయాయో మాత్రం అర్థం కాలేదతనికి. అయినా బయటపడకుండా ఒకరకమైన నిశ్చింతతో స్నానం చేసి వచ్చి టిఫిన్‌కి కూర్చున్నాడు.
ఇద్దరూ కలిసి టిఫిన్ తిన్న తరువాత అతనికి ఓ కవర్ అందిస్తూ- ‘ఇందులో యాభై వేలున్నాయి. ఫంక్షన్‌కి ఏర్పాట్లు చూడండి. చిన్నదానికి ఫోన్ చేయండి రమ్మని. వచ్చే ఆదివారం బాగుందట...’ అన్నది సుకన్య.
‘‘సుకన్యా... ఎక్కడివి ఇన్ని డబ్బులు..?’’ చిత్రంగా చూస్తూ అన్నాడు రాజేంద్ర.
‘‘నా బంగారం మీద అప్పు తీసుకున్నాను లెండి... ఆపదలో ఆదుకోని ఆభరణాలు ఎందుకు చెప్పండి? ఆ.. మీరు ఆ పనుల మీద ఉండండి.. మరి నేను ఆఫీసుకు వెళ్లి వస్తాను. విద్యను సాయంత్రం చెకప్‌కి కూడా తీసుకువెళ్లాలి. నీరసంగా వుందని పడుకుంది. లేచాక దానికి కాస్త టిఫిన్ పెట్టి మందులు వేసుకునేలా చూడండి.. సరేనా? మరి వెళ్లిరానా? అంటూ బయలుదేరబోతున్న భార్యను చూస్తుంటే- అతని మనసు తీరని భావోద్వేగాలకు లోనైంది. దాన్ని కప్పిపుచ్చుకుంటూ- ‘‘సుకన్యా.. ఒక్క నిముషం’’ అని భార్యను చేతులలోకి తీసుకుని నుదుటిపై చుంబించాడు. అతని కంటిలోని చెమ్మను గ్రహించిన సుకన్య ఆర్ధ్రంగా ‘‘ఏమిటిది రాజా.. చిన్నపిల్లాడిలా? తప్పుకదూ?’’ అని సున్నితంగా అతడ్ని విడిపించుకుని, తన కంటి నీరు అతనికి కనపడకుండా బయటికి నడిచింది.
ఇంతలో మొబైల్ మోగడంతో జేబులోంచి తీసి ఆన్సర్ చేశాడు రాజేంద్ర.
‘‘నాన్నా.. నేనే..’’ అవతలి నుంచి కావ్య గొంతు.
‘‘నిన్న నువ్వు చెప్పినవన్నీ కరక్టేరా చిన్నీ.. నేను మావయ్య కంపెనీలో జాయినవుతానని చెప్పగానే అమ్మ ఎంత సంతోషపడిందనుకున్నావు? ఆ.. వచ్చే ఆదివారమే అక్క సీమంతమటరా.. నువ్వు, అల్లుడు ఆ రోజుకి వచ్చేయండి. సరేనా? అవునూ నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు అమ్మకి ఎలా తెలిసిపోయాయో అర్థం కావడం లేదు. నువ్వు చెప్పనని అన్నావుగా? కలేమైనా వచ్చిందో.. ఏమిటో?’’ అయోమయంగా కూతురుతో అన్నాడు రాజేంద్ర.
కిలకిలా నవ్వింది కావ్య. ‘‘అంతే అయుంటుందిలే నాన్నా... పాపం అమ్మ... తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తమ్ముడెలా ఉన్నాడు? బాగా చదువుకుంటున్నాడా? వాడిని బాగా చూసుకోండి. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటేనే అమ్మకి, నీకు భవిష్యత్తులో చక్కని విశ్రాంతి దొరికేది...సరే నాన్నా... మళ్లీ మాట్లాడుతా...’’ అంటూ కాల్ కట్ చేసింది కావ్య.
హాట్స్ ఆఫ్ టు టెక్నాలజీ.. థాంక్ గాడ్.. అమ్మానాన్నల మధ్యన సయోధ్య కుదిర్చేలా చేసినందుకు. తన లాప్‌టాప్‌లో- తాను తండ్రి పేరున సృష్టించిన మెయిల్ ఐడీని మురిపెంగా చూసుకుని లాగవుట్ అయింది కావ్య. *

Gyanapakam

జ్ఞాపకాల నీడలు (కథ)

సాయంత్రం అయిదు గంటలు దాటింది. శీతాకాలం కావటాన వాతావరణం చలిగానే ఉంది. టీవీ కట్టేసి మంచంపై నుంచి లేచి కాళ్ళు, మొహం కడుక్కుని వచ్చి ప్యాంటూ, షర్టు వేసుకున్నాను. ఈలోగా నాలుగేళ్ల మనవణ్ణి, టీని నాకు అప్పగించింది కోడలు. టీ తాగి, మనవడి చేయి పట్టుకొని, మా ఆవిడతో వస్తానని చెప్పి పార్కుకేసి నడిచాను. పార్కు చిన్నా పెద్దలతో సందడిగా ఉంది. మావాణ్ణి ఆ పిల్లల్లో వదిలి బెంచీమీద కూర్చున్నాను. కాసేపటికి సంధ్య చీకట్లు అలుముకుపోతున్నాయ్. లైట్లన్నీ ఒక్కసారి వెలగడంతో పార్క్‌కి కొత్త పెళ్లికూతురు కళ వచ్చినట్లుంది. పిల్లల కేరింతలు ఎక్కువైనాయి. ఆ సమయంలోనే ఓ పెద్దావిడ వచ్చి నా బెంచీ చివర్లో కూర్చుంది.
కాసేపటికి యథాలాపంగా ఆవిడపైకి నా చూపులు తిరిగినయ్. కేరింతలు కొడుతున్న పిల్లల వంక చూస్తూ నవ్వుతోంది. ఆ నవ్వులోనే చిరుగాలికి కదిలి నుదుటిమీద పడ్డ జట్టుని చేత్తో వెనక్కి తోస్తూ పక్కకి తిరిగింది. దాంతో ఒక్క క్షణం ఆమె కళ్ళు నన్ను చూసినయ్. వెంటనే మళ్లీ తల తిప్పుకొని పిల్లల వేపు చూస్తూ కూచుంది. ఆమె చూసిన ఒక్క క్షణంలోనే- వర్షంలో మేఘాల మధ్య మెరిసిన మెరుపులా ఆమెని ఎక్కడో చూసిన మెరుపు జ్ఞాపకం చుట్టుముట్టింది. మళ్లీ ఒకసారి చూశాను. నిజమే... ఆ నవ్వులో, మొహంలో, చూపులో లెక్కలేనితనం.. తనే.. అవును తను మంజిష్టే. నీడల్లోకి జారిపోయిన జ్ఞాపకాలు కాసేపు మనసులో సుళ్లు తిరిగినయ్. వాకిళ్ళకి కట్టిన తోరణాలు చిరుగాలికి సన్నని సవ్వడిగా ఊగినట్టుగా నాలో మంజిష్ట ఆలోచనలు సందడి రేపినయ్.
***
అప్పుడే జూనియర్ కాలేజీలో చేరిన రోజులు. వేరు వేరు స్కూళ్లల్లోంచి వచ్చిన అమ్మాయిలూ, అబ్బాయిలూ... అందరి మొహాల్లో కొత్తబెరుకులూ, బిడియాలూ.. నెల తిరిగేసరికి కలిసిపోయిన పరిచయాలూ, స్నేహాలూ... అల్లర్లూ, పాఠాలు, పరీక్షలు.. మొదటి సంవత్సరం గడిచిపోయింది. సెలవులు ముగిశాక మొదలయిన రెండో సంవత్సరం. అందరిలో- కాలేజీ చదువు తెచ్చిన వేషభాషల్లో మార్పులు, కాస్త కొత్త పోకడలూ, స్టైల్స్... అందరి సంగతి ఏమోగానీ నాలో మాత్రం కొత్త సరిగమలు కోయిల గొంతుకల వసంతం జేగంటలు మోగినయ్ ఆ ఏడు. అదే మంజిష్ట రాక.
కాలేజీ మొదలైన వారం రోజులకి ఫిజిక్స్ క్లాస్ జరుగుతుండగా ‘మే ఐ కమిన్ మాడమ్..’ అన్న గొంతు వినిపించడంతో అందరి తలలూ ఒకేసారి తలుపుకేసి తిరిగినయ్. బాబ్డ్‌హెయిర్, పాంటు, టీషర్ట్‌తో ఒక్కసారి చూస్తే మళ్లీ ఒకసారి చూడాలనిపించే అందం. మొహంలో ఎక్కడా కొత్త అన్న బెరుకు లేదు. తనే మంజిష్ట. అందం కాదేమో! ఆమె చలాకిదనం, నిర్భీతి కావచ్చో... మరేదో తెలీదు కానీ తనపై నాకు ఏదో తెలీని అభిమానం ఏర్పడింది. చిన్న చిన్న పలకరింపులు తనతో. ఇంటర్, డిగ్రీ రెండూ ఒకే చోట కావటాన డిగ్రీ కూడా కలిసి చేసే అవకాశం వచ్చింది. డిగ్రీకొచ్చేసరికి అమ్మాయిల్లోనూ, అబ్బాయిల్లోనూ మానసిక శారీరక మార్పులు. మంజిష్ఠలోనూ సోయగం. దానికితోడు చలాకీతనం. బంగారు నగలకి నగిషీ అద్దిన చమక్కు తనకి.
కాలం తెచ్చే మార్పులు మాత్రం మనిషి చేతిలో ఉండవన్నట్టుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో రఘురాం అనే కుర్రాడు క్లాస్‌లో చేరాడు. ఆజానుబాహువు. అరవిందదళతాయక్షుడు అన్నదానికి ప్రతిరూపంగా ఉన్నాడు. ఎక్సర్‌సైజులు చేసే అలవాటేమో శరీరం అందమైన షేపులో ఉంది. మంజిష్ఠ రూపం, చలాకీతనం అతన్ని ఇష్టపడేట్టు చేసినయ్యో, అతని రూపురేఖలు మంజిష్ఠనాకరించినయ్యో, ఇద్దరూ ఎక్కువగా కలిసి ఉంటుండేవాళ్లు. ప్రేమో, స్నేహమో తెలీదు. ఓసారి సినిమా హాల్లో, మరోసారి షాపింగ్ చేస్తూ కనబడ్డారు.
మనసులో ఎక్కడో ఏదో తెలీని బాధ- తను రఘురాంతో కలిసి ఉన్నప్పుడు. నాతోనూ అప్పుడప్పుడూ బాగానే కబుర్లు చెబుతుండేది. ప్రేమ మాటలెప్పుడూ రాలేదు మా మధ్యలో. బహుశా నాకు మాత్రమే ఆమె మీద ఇష్టం అవటాన కావొచ్చు. ఎందుకో ఒక ఆలోచన వచ్చింది నాలో. తనకి లేకపోతే ఏమిటి నాకు ఉందిగా తనమీద ప్రేమ. అందుకే నా అభిప్రాయం తెలపాలనుకున్నాను. కావాలనే తనని ‘నోట్స్ కావాలి’ అని అడిగి తీసుకొని, నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ రాసి ఆ నోట్స్‌లో పెట్టి ఇచ్చాను. అప్పటికి ఫైనలియర్ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చినయ్.
నాలుగైదు రోజులు ఎదురుచూశాను. నా లెటర్ విషయం ఏమన్నా మాట్లాడుతుందేమోనని. తనేం ఆ ప్రసక్తి తేలేదు. మామూలుగా మాట్లాడింది కలిసినప్పుడల్లా. మనసాగక నేనే ఆ విషయం కదిలించాను తను నాతో ఒంటరిగా ఉన్నప్పుడు. అల్లరిగా నవ్వింది. ‘‘సారీ.. నిన్ను గురించి నేను ఎప్పుడూ ఆ విధంగా ఊహించుకోలేదు’’ అని ఏవో నాలుగు మాటలు మాట్లాడి అక్కడినుంచి వెళ్లిపోయింది. బహుశా తన మనసు రఘురాం మీద ఉందేమో అనుకున్నాను.
బాధ, కష్టం అనిపించినా ఇంక తన ఆలోచనలు నా మనసులోంచి తీసేయడం మంచిదనుకున్నాను నిరాశ, నిస్పృహల్లోనే. పరీక్షలపై ధ్యాసపెట్టాను. డిగ్రీ అయిపోయింది. ఎక్కడివాళ్ళు ఎక్కడెక్కడో చెల్లాచెదురైపోయాం. పీజీలో చేరాను. రఘురాం, మంజిష్ఠ ఒకే యూనివర్సిటీలో చేరారు. మళ్లీ నాకు వాళ్ళెప్పుడూ కనిపించలేదు పీజీ అయ్యేవరకు. పీజీ పూర్తవగానే ఉద్యోగంలో చేరాను.
ఆ రోజు ఆదివారం ఇంట్లో ఉన్నాను. సాయంత్రం వేళ అనుకోని వాన లాగా మంజిష్ఠ మా ఇంటికొచ్చింది. ఒక కార్డు తీసి నా చేతికిచ్చింది. అది తన పెళ్లి శుభలేఖ. పెళ్లికొడుకు స్థానంలో రఘురాం ఫొటో లేదు. అర్థవంతంగా చూశాను. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ స్నేహితుడి ద్వారా విన్నాను. నా భావం కనిపెట్టిందేమో!
‘‘రఘురాంతో పెళ్లికి మావాళ్ళు ఒప్పుకోలేదు. నా పాలసీ తెలుసుగా, ఏదైనా టేకిట్ ఈజీ’’ అంటూనే- వేరే వాళ్ళకీ ఇవ్వాలి కార్డ్సు అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది.
‘‘మరి గంటలు, గంటలు మాట్లాడుకున్నదీ? కలిసి సినిమాలూ, షాపింగులూ?’’ నాలో నేను ఓ నిముషం గొణుక్కున్నాను. తన పెళ్లికి నేను వెళ్లలేదు. ఇది జరిగిన రెండేళ్లకు కాబోలు కంపెనీ పనిపై బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. రాత్రి తొమ్మిది గంటల బస్సుకి బెంగళూరు పోయే బస్సు ఎక్కాను. ఖాళీగా కనిపించిన ఒక సీట్లో కూర్చున్నాను. యథాలాపంగా అటు ఇటు చూస్తున్న నాకు పక్కన కూర్చున్న మనిషి తెలిసిన మొహంలా అనిపించింది. తల తన పక్కనున్నతని భుజంమీద ఆనించి కూర్చొని ఉంది. కచ్చితంగా మంజిష్ఠే. పక్కనున్నది తన భర్తెమో. అతను ‘ఎలా ఉంటాడో’ చూడాలన్న కుతూహలం కలిగి ఆ వైపు కళ్లు తిప్పాను. అప్పుడే కిటికిలోంచి బయట చూస్తున్న అతను నావేపు తల తిప్పాడు. ఆశ్చర్యం.. అతను రఘురాం..!
అతని మొహంలో నవ్వు. మంజిష్ఠని తట్టి లేపి, సీట్లోంచి లేచి కాస్త వంగి నాకు షేక్‌హాండ్ ఇస్తూ ‘బాగున్నావా?’ అన్నాడు. ఆశ్చర్యంలో ఉన్న నేను తేరుకుని ‘ఆ..’ అన్నాను. తిరిగి రఘరాం తన సీట్లో కూర్చున్నాడు. రఘురాం అందరితో సరదాగా మాట్లాడేవాడు క్పా ఏదో ఫీలింగ్‌తో నేనే తనతో అంత పరిచయం పెంచుకోలేదు. అందుకేనేమో ముక్తసరి పలకరింపే మా మధ్య చోటుచేసుకుంది. ఇదంతా చూసినా మంజిష్ఠ కూడా నా వంక చూసి- నేనని తెలిసాక ‘హాయ్ బాగున్నావా?’ అంది నవ్వుతూ, నవ్వి ‘ఆ’ అన్నాను పొడిగా. తనే ఏవో కుశల ప్రశ్నలు సాగించింది కాసేపు. ఆ తర్వాత నేను అడగకుండానే తన వివరాలు చెప్పింది.
‘‘పెళ్లయిన ఏడాదికే నేనూ, ఆయనా విడిపోయాం. ఇద్దరికి కుదరలేదు. మా పేరంట్స్‌కి ఇష్టంలేదు ఇదంతా. విడాకులు తీసుకొని రఘురాం దగ్గరకు వచ్చేసాను. రఘుకి బెంగళూరులో జాబ్. పండక్కి రఘు వాళ్ళింటికి వచ్చి వెళ్లిపోతున్నాం’’.
ఆమె చెబుతుండగానే టిక్కెట్లు పని అయిపోయిందేమో బస్సులో లైట్లు ఆరిపోయినయ్. చీకటి కాగానే తను రఘురాం వైపు తిరిగింది. నేను బస్సు సీట్ వెనక్కి తల ఆనించి నిద్రకుపక్రమించాను.
ఆమె రఘురాం దగ్గరకి వచ్చేసిందా..? పెళ్లిచేసుకొనా లేక..! ఏమో.. అంతటి మనిషిలాగే ఉంది చూస్తుంటే. ఎందుకో ఒక్క క్షణం మనసు బెదిరిపోయింది. ‘ఇటువంటి సమాజపు విలువలు తెలీని మనిషి, చపలచిత్తురాలినా.. నేను కోరుకుంది?’ అన్న ఆలోచన వచ్చి ‘నయం చేసుకున్నాను కాను, ఇరుక్కుపోయేవాడిని’. మంజిష్ఠ మొదటి భర్త గుర్తుకి వచ్చాడు. ఒక్కసారిగా ఉలికిపాటుగా భుజాలు కదిలినయ్. ఆలోచనల్లోనే నిద్రలోకి జారుకున్నాను. ఆ తర్వాత నాకు పెళ్లవ్వడం, పిల్లలూ. వాళ్ల పెళ్లిళ్లూ, వాళ్లకి పిల్లలూ, రిటైర్‌మెంటు మీద పడిన ముదిమి. జీవిత చక్రం ముప్ఫయి అయిదేళ్లు దాదాపు ముందుకు తిరిగింది.
***
అప్పుడు కనిపించిన మంజిష్ఠ మళ్లీ అనుకోని రీతిలో ఇక్కడ కన్పించింది. ఆలోచనల్లోనుంచి బయటపడిన నాకు- తను నన్ను గుర్తుపట్టలేదని అర్థమైంది. ఎలా గుర్తుపడుతుంది నన్ను? చదువుకొనే రోజుల్లో ఒత్తయన గిరిజాల జుట్టుతో, నల్లటి మీస కట్టుతో ఉండేవాడిని. ఇప్పుడు మిగిలింది ‘బట్టతల’, తల చట్టూ తెల్లబడ్డ నాలుగు వెంట్రుకలు. తెల్లబడిన మీసాలెందుకని తీసేసాను. అందుకే ఎలా గుర్తుపడుతుంది ఆమె నన్ను?
నేనే- ‘మంజిష్ఠా...’ అని చిన్నగా పిలిచాను. నా పిలుపుకి నావేపు తిరిగింది. కళ్ళలో నేనెవరో తెలీని అనుమానం, అయోమయంలో ఉండగా- ‘నేను ఫలానా’ అని గుర్తుచేశాను. ఆమె కళ్లలో ఒక్క క్షణం- చదువుకునే రోజుల్లో నేస్తాన్నన్న ఆనందం తొంగిచూసినట్టు అనిపించింది. ‘‘నువ్వా..? ఎంత మారిపోయావ్... నేనూ అంతేననుకో..’’ అంది నవ్వుతూ. ఆ నవ్వులో అలనాటి చక్కదనం ఇంకా అట్లాగే ఉంది.
ఇద్దరిమధ్య కాసేపు ముచ్చట్లు. ‘‘మాకు ఒకడే కొడుకు. వాడికి పెళ్లయి ఒక కొడుకున్నాడు. వాడే వీడు’’ అక్కడే ఉన్న మనవణ్ణి చూపించింది. మళ్ల తనే ‘‘మా వాడికి ఈ ఊరు ట్రాన్స్‌ఫర్ అయింది ఈమధ్యనే. ఇన్నాళ్లూ బెంగళూరులోనే ఉన్నాం’’ అంది.
‘‘మరి రఘురాం..?’’ అని అంటుండగానే- తనే ‘‘రఘురాం రెండేళ్ల క్రితమే మరణించాడు జబ్బు చేసి. నేను కొడుకు దగ్గరకొచ్చేశాను’’ అని చెప్పి ఎందుకో కామ్‌గా కూచుంది. బహుశా రఘురాం గుర్తుకొచ్చాడేమో?
‘‘రఘురాం పోయాడా’’....? నా మనసు కాసేపు బాధతో మెలితిరిగింది. ఎంతయినా కలిసి చదువుకున్నాం కదా!
అలా.. రెండు, మూడు నెలలు గడిచినయ్. అప్పుడప్పుడు పార్క్‌లో నేను కూర్చున్న బెంచిమీద కూర్చుంటుండేది. కొన్నిసార్లు వేరే ఎవరి దగ్గరో, ఒంటరిగానే కూర్చుంటుండేది పార్కుకి మనవణ్ణి తెచ్చి. ఒక రోజు తన మొహం ఎందుకో నీరసంగా కనిపించింది. అదే అడిగాను.
‘‘రెండు మూడు రోజులనుండి ఎందుకో రాత్రిళ్లు జ్వరం వస్తోంది’’.
‘‘డాక్టర్ దగ్గరికి వెళ్లలేదా?’’
‘‘డాక్టర్ దగ్గరికి ఈ రోజు ఉదయం వెళ్లాను. ఏవో టెస్ట్‌లు చేశారు. రిపోర్టులకి సాయంత్రం రమ్మన్నారు. డ్యూటీ నుంచి వస్తూ మావాడు తెస్తానన్నాడు వాటిని.’’
మరుసటి రోజు ఎందుకో తను రాలేదు. దాదాపు రెండు నెలలు గడిచినయ్. కానీ తన జాడ లేదు. ఎందుకో మనసు కీడు శంకించింది. ‘‘ఆమెకు ఏమన్నా...?’’ .. వద్దు, వద్దు, ఆ ఊహే- ఏదో భయం, బాధ.. తెలీని ఫీలింగ్ కలిగించింది. నా ఊహ నిజం కాదని నిరూపిస్తూ రెండు నెలల తర్వాత మనవణ్ణి తీసుకొని పార్కులో కనిపించింది మంజిష్ఠ. సన్నటి ఎర్రంచున్న చిలకపచ్చ కాటన్ చీర, ఎర్ర జాకెట్, నడుస్తుంటే చీర కుచ్చులు అలవోగా అటూ ఇటూ కదులుతున్నాయ్. వయసు దాటినా నాటి సోయగం ఇంకా కాస్త మిగిలే ఉంది.
కోటి రూపాయల లాటరీ తగిలినట్టు, వేయి ఏనుగుల బలం వచ్చినట్టు ఏదో తెలీని రిలీఫ్ నాలో పొంగినట్లయింది.
వచ్చి నా బెంచీ చివర కూర్చున్న తనని అడిగాను. ‘‘ఇన్నాళ్లూ రాలేదు.. ఆరోగ్యం బాగాలేదా...?’’ అని.
‘‘జ్వరం అన్నాను కదా! అది తగ్గింది కానీ, సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటలూ, మందులూ... రెస్టూ... ఇదిగో ఇవాళ మనవడి గోల పడలేక ఇటు తెచ్చాను. ఊరికే ఇంట్లో ఉన్నా బోర్ కొడుతోంది’’ నవ్వుతూనే ఎప్పటి తేలిక మాటల్లోనే సమాధానం చెప్పింది. ఆమెలో ఎక్కడా హార్ట్ ఎటాక్ సంబంధించి ఏ భయమూ, దిగులూ కనిపించలేదు.
మాట్లాడుతుండగానే పార్క్‌లోనే పరిచయమైన ఒకావిడ పిలిస్తే తన దగ్గరకెళ్లిపోయింది. ఎందుకో తనలో మునుపటి చలాకీతనం తగ్గినట్టు అన్పించింది నాకు. తను వెళ్లినా ఆమె ఆలోచనలే నాలో మెదిలినయ్. మంజిష్ఠకి హార్ట్‌ఎటాక్ వచ్చిందా...? నాకు తెలియకుండానే ఎందుకో నా మనసు కాస్త డీలా పడినట్టు అయింది. మనసులో ఏవో చీకటి పొరలు. కానీ, వెంటనే నా ఆలోచనలు మారినయ్. ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాను..? ఆమె జ్ఞాపకాలు ఎప్పుడో నీడల్లోకి జారిపోయినయ్. తను మళ్లీ కనిపించడంతో ప్రశాంతంగా ఉన్న కొలనులో రాయి విసిరివేసినట్టు, తేనె తుట్టెను కదిలించినట్టూ నాలో ఏవో అసంకల్ప కదలికలు. తనకి ‘హార్ట్ ఎటాక్’ వచ్చిందని అనగానే నా మనసు బెదిరిందో, చెదిరిందో.
ఒకప్పుడు నేను తనని ఇష్టపడింది వాస్తవమే. కానీ, తను నన్ను ఇష్టపడలేదు. రాను రాను తన వైఖరీ నాకు నచ్చలేదు. త్వరగానే ఆమె జ్ఞాపకాలు నా మనసులోని నీడల్లోకి జారిపోయినయ్. ఇపుడు ఎటూ జీవితం పడమటికి నడక మొదలుపెట్టేసింది. నీడల్లోకి జారిపోయిన చేదు జ్ఞాపకాలను మళ్లీ వెలుగులోకి తేవద్దనుకుని ఒక నిర్ణయానికి వచ్చాను- రేపటి నుండి ఈ పార్క్‌కి ఇంక రాకూడదని.
కాకపోతే- తనకి ‘హార్ట్‌ఎటాక్’ మళ్లీ వస్తే.. అన్న ఆలోచన కాస్త నన్ను కదిలిస్తుంది కాబోలు. ఎంతైనా నేను ఒకప్పుడు తనని వలచి వరించాలని అనుకున్న మనిషి కదా! ఎప్పుడైనా తను జ్ఞాపకం వస్తే- ‘తను లేదు కదా ఇంక..’ అన్న చేదు నిజం కన్నా- ‘క్షేమంగానే ఉండే ఉంటుంది’ అన్న ఊహ.. అది నిజమైనా, అబద్ధమైనా మనసుకి అదొక ఊరట.
అంతే... బెంచి మీదనుండి లేచి కాస్త దూరంలో ఆడుకుంటున్న మనవణ్ణి పిలిచి, దూరంగా మాటల్లో ఉన్న మంజిష్ఠ దగ్గరికు వెళ్లాను.
‘‘మంజిష్ఠా.. నేను ఇంటికి బయలుదేరుతున్నా’’ అన్నాను. ఒక్క క్షణం నావైపు చూసిన ఆమె కళ్ళలో అయోమయం- ఇంత దూరం వచ్చి నాకు చెపుతున్నాడేమిటా? అని. వెంటనే - ‘మంచిది’ అని మళ్లీ తన ఎదురుగా ఉన్న ఆవిడతో మాటల్లో పడింది. అదే నిర్లక్ష్య వైఖరి..! మనసులోనే చిన్నగా నవ్వుకొని, మళ్లీ ఒక్క క్షణం ఆమెవేపు చూశాను. బహుశా ఇదే- నేను తనను ఆఖరిసారి చూడటం కావొచ్చు. చూపు తిప్పేసుకొని మనవడి చేయి పట్టుకొని పార్క్ గేటు వేపు అడుగులు వేశాను నా ఇంటికి వెళ్లేందుకు. *

Begger - Telugu short story

ముష్టివాడి నవ్వు (కథ)

ఉదయం తొమ్మిదిన్నర... షా పులు తెరిచే వేళ...
రిక్షా దిగిన విశ్వం రిక్షావాడికి డబ్బులిచ్చి, వెనుదిరిగి వీధిలోకి నడవబోయి- పామును చూసినవాడిలా ఒక్కసారి ఉలిక్కిపడి పక్కకి జరిగాడు.
వీధి మలుపులో ఎవడో కొత్తగా వచ్చిన ముష్టివాడు.
చూడగానే ఇట్టే పోల్చుకోవడానికి తగిన లక్షణాలన్నీ ఉన్నాయి అతడిలో. చింపిరిజుట్టు, చినిగిన చొక్కా, మట్టిగొట్టుకుపోయిన పాత లుంగీ, చేతిలో కర్ర కాదు గానీ.. ఓ పాత మోడల్ గొడుగు.
గారపళ్లను బయటపెట్టి పలకరింపుగా నవ్వాడు ఆ ముష్టివాడు.
విశ్వానికి ఒళ్లు జలదరించింది. చిరాగ్గా నొసలు చిట్లించి వేగంగా ముందుకి కదిలాడు.
ఛీఛీ..! ఈ దేశంలో అడుగడుగునా అడుక్కునే వాళ్లుంటారు. ఇదొక పనిగా పెట్టుకుని జీవిస్తున్నారు- వేరే పని చేయలేని, చేతకాని సోమరిపోతులు.
ప్రభుత్వాలు ఎన్ని మారినా వీళ్లని శాశ్వతంగా కనబడకుండా చేసే మహానుభావులే కనబడ్డం లేదు. ఇలా ప్రతిచోటా వీళ్లని ఎట్లా భరించడం..?
ఆఖరికి తన షాపుకి పది అడుగుల దూరంలోనూ ఒక ముష్టివాడు తయారయ్యాడు. ఏం చేసేది..?
ఈ అడుక్కునేవాళ్లు మహా మొండివాళ్లు. ఎవరి మాటా వినరు. వీళ్లకి ఎవరి భయమూ లేదు. ఎవరూ తమ దగ్గరకి రావడానిక్కూడా సాహసించరనే విషయం వీళ్లకు బాగా తెలుసు మరి.
షాపు తెరిచాక దినపత్రిక తిరగేస్తుంటే తెలిసింది- ఒక్క హైదరాబాద్‌లోనే యాచక వృత్తిలో ఏటా కోట్ల వ్యాపారం జరుగుతోందట. ముష్టివాళ్ల దందా ఎంతగా విస్తరించింది..?
ఇక రోజూ వచ్చేటప్పుడూ, వెళ్లేటప్పుడూ ఈ కొత్త ముష్టివాడి మొహం చూడక తప్పదన్న నిజం- విశ్వాన్ని అశాంతికి గురిచేస్తున్నది.
కాసేపటికి పక్కషాపుల వాళ్లు అటుగా వచ్చినపుడు.. పిచ్చాపాటీ కబుర్లలో ముందుగా ఈ సమస్యనే లేవదీశాడు విశ్వం.
‘‘ఎవరండీ వాడినట్లా అక్కడ ఉండనిచ్చింది..? అక్కడున్న షాపుల యజమానులకి ఈ విషయం పట్టదా..?’’ అక్కసు వెళ్లగక్కాడు విశ్వం.
‘‘వాళ్లు ఈ విషయం సీరియస్‌గా తీసుకోవడం లేదంటే.. వాళ్లు చాలా దయామయులు, దానశీలురు అనుకోవాలి మరి’’.
‘‘పోనీలెండి.. బతకనివ్వండి.. మనం మాత్రం ఏం చేయగలం?’’
‘‘ఇందులో వేలు పెడితే పరువు పోదూ?’’
‘‘వాడితో మనకి గొడవేంటి..?’’
ఇలా సాగాయి ఆ వ్యాపారస్తుల వ్యాఖ్యానాలు.
విశ్వానికి చిర్రెత్తుకొచ్చింది. కానీ, నిస్సహాయత ఆవరించి తల పట్టుకున్నాడు.
తనకి అడుక్కునేవాళ్లంటే విపరీతమైన ఎలర్జీ.
****
ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఈ ముష్టివాడి దర్శనం తప్పించుకోలేకపోతున్న విశ్వం- వాడిని చూసిన అరగంట వరకూ ఏదో పట్టలేని కోపంతో రగిలిపోతున్నాడు.
ఏమిటా వేషం..? కలవరం పుట్టించే వెధవ నవ్వొకటి పైగా.. అసలా నవ్వుకు అర్థం ఏమిటి..?
రోజులో పదిసార్లయినా ఆ ముఖం, ఆ నవ్వు... గుర్తొచ్చి ఏదో చికాకు కలుగుతోంది.
నిద్రలోనూ ఆ వెకిలి నవ్వు వెంటాడుతోంది.
కానీ, దీని గురించి ఎవరికీ చెప్పుకునేట్టులేదు. ఏమని చెప్పుకోగలడు? ఒక ముష్టివాడి నవ్వు తనని వెంబడిస్తోందంటే- విన్నవాళ్లు పగలబడి నవ్వకుండా ఉంటారా?
‘పోకిరి’ సినిమాలో బ్రహ్మానందం లాగా ఉంది తన పరిస్థితి అని పరి పరి విధాలా వగచాడు.
పదే పదే వాడి వేషం ఎందుకు గుర్తుకొస్తోంది? చేతిలో ఆ గొడుగేంటి? అప్పుడే వానాకాలం వచ్చేసిందా వాడికి? మండే ఎండాకాలం కూడా కాదు.
వీలుకావడం లేదు. కానీ.. తనకే గనక అవకాశం, అధికారం ఉంటే- ఓ పెద్ద కర్రందుకుని వాడిని వెంటబడి తరిమి తరిమి కొట్టేవాడు.. మళ్లీ ఈ ఏరియాకే రాకుండా చేసేవాడు.
అంతలోనే అతని అంతరాత్మ అడుగుతున్నట్టుగా ఒక ప్రశ్న విశ్వంలో-
‘‘ఆ ముష్టివాడు నీకు ఏం అపకారం చేశాడు? నిన్ను డబ్బు అడిగి వేధిస్తున్నాడా? షెల్టరడిగి హింసిస్తున్నాడా? ఎందుకు వాడి గురించి ఆలోచిస్తావ్? వాడి బతుకు వాడిని బతకనీరాదా?’’
తన వద్ద జవాబు లేదు మరి..!
****
అలా నెల రోజులు గడిచాయ్.
అన్నయ్య కొడుక్కి ఒంట్లో బాగాలేదని తెలిసి వెంకటాచలం (తమ గ్రామం) వెళ్లాడు విశ్వం.
హాస్పిటల్లో అన్నయ్య, వదినలను పలకరించి, వాళ్లబ్బాయి వేణుని పరామర్శించి సాయంత్రం వరకు అక్కడే గడిపిన విశ్వం ‘ఇక వెళ్లివస్తాను..’ అంటూ సెలవు తీసుకుని బయలుదేరాడు తన ఊరికి.
‘‘ఏమిటంత అర్జంటు..? రేపు వెళుదువుగానీలే..!’’ అని అన్నావదినలు ఎంత చెప్పినా వినలేదు.
‘‘ఈ రోజు ఆదివారం కాబట్టి వచ్చాను. షాపులో నేను లేకపోతే.. మీకు తెలిసిందేగా అంతా అస్తవ్యస్తమే! వెళ్లక తప్పదు’’ అంటూ విశ్వం బస్సెక్కాడు.
బస్సు వెంకటాచలం దాటి, సర్వేపల్లి సెంటర్‌ని క్రాస్ చేస్తుండగా రెండు నిముషాల్లో నల్లని మబ్బులు వేగంగా వచ్చేసి చంద్రుణ్ణి కమ్మేశాయ్. చలిగాలి బలంగా వీచింది. చినుకులు మొదలయ్యాయ్.
‘‘ఇదేమిటబ్బా.. ఈ అకాల వర్షం!’’ అనుకుంటూ కిటికీ అద్దాలు మూశాడు విశ్వం.
వాన మరింత జోరందుకుంది. పది నిముషాల్లో బుజబుజ నెల్లూరు దాటి ఊర్లోకి అడుగుపెట్టింది బస్సు. మరో పది నిముషాల్లో గమ్యం రానే వచ్చింది. బస్టాండ్‌లో దిగాడు విశ్వం. అప్పటికి వర్షం ఒక్కసారిగా తగ్గిపోయింది. చినుకులు కూడా ఆగిపోయాయ్.
‘ఇంటికి ఫోన్ చేస్తే తమ్ముడు బైక్ తీసుకుని వస్తాడు కదా!’ అనుకున్నాడు విశ్వం.
కానీ, తమ్ముడు ఇంట్లో లేడనీ ఎవరో ఫ్రెండ్‌ని కలవడానికి కావలి వెళ్లాడనే వియం గుర్తొచ్చింది.
ఆటో కోసం చూశాడు విశ్వం. తమ ఇంటివైపు వెళ్లే ఆటో ఒక్కటి కూడా లేదు అక్కడ. అయినా చిన్న చిన్న దూరాలకు ఆటో ఎక్కడం విశ్వంకు నచ్చదు. సైకిల్ రిక్షాలు కూడా కనిపించడం లేదు.
‘పది నిముషాలు ఓపిగ్గా నడిస్తే ఇంటికెళ్లొచ్చు’ అనుకుంటూ బయలుదేరాడు విశ్వం.
జేబులోని సెల్‌ఫోన్ బయటకు తీసి టైం చూశాడు. పదకొండు అయింది.
చిన్నగా నడక సాగించాడు.
బస్టాండ్ నుంచి ఇల్లు కిలోమీటరు కంటే తక్కువే. సగం దూరం వచ్చాడో లేదో ఒక్కసారిగా మళ్లీ వర్షం మొదలైంది.
‘తగ్గుతుందిలే.. ఇల్లు చేరిపోతే బట్టలు మార్చుకోవచ్చు’ అనుకున్నాడు విశ్వం. కానీ, వర్షం క్షణాల్లో కుంభవృష్టిగా మారింది.
‘‘కాసేపు ఏదైనా షాపుముందు ఆగాల్సిందే’ అనుకుంటూ అటూ ఇటూ చూశాడు.
కుడివైపునకు రోడ్డు పక్కన ఒక పెద్ద షాపు ఉంది. దాని ముందు నిలబడితే వర్షం నుండి తప్పించుకోవచ్చు అనుకుని అటు తిరిగి రెండడుగులు వేశాడో లేదో.. వెనకనుండి సర్రున ఒక జీపు దూసుకురావడం గమనించాడు.
కానీ, జీపు ఎంత వేగంగా వచ్చిందంటే... విశ్వం దానినుండి తప్పించుకోలేకపోయాడు.
అంతే..! క్షణంలో విశ్వాన్ని రాసుకుంటున్నట్లుగా అదే వేగంతో తోసినట్టుగా.. అల్లంత దూరాన ఎగిరిపడ్డాడు విశ్వం.
కళ్లు బైర్లు కమ్మాయ్.... క్షణాల్లో స్పృహ తప్పాడు.
***
కళ్లు తెరిచిన విశ్వం మెల్లగా లేచి కూర్చోబోయాడు. ఒళ్లంతా నొప్పులు. ఎలాగో శక్తినంతా కూడదీసుకుని లేచాడు. జేబు తడుముకున్నాడు. సెల్‌ఫోన్ ఉంది, డబ్బుంది.
అక్కడ అదే చీకటి.. అదే రోడ్డు... కానీ తాను.. ఆ పెద్ద షాపుముందే ఉండడం గమనించాడు. ఒక్కసారి జరిగింది గుర్తుతెచ్చుకున్నాడు. తనని జీపు ఢీకొట్టినంత పని చేసి వెళ్లడం గుర్తుకొచ్చింది.
అయితే, తనకేమీ కాలేదా? తాను ఇక్కడికి ఎలా వచ్చాడు? అర్థం కాని అయోమయం..
వర్షం ఇంకా పడుతూనే ఉంది. తనకేమీ కాలేదు కదా! మళ్లీ తన వంక చూసుకున్నాడు.
ఏమీ కాలేదు.. చిన్న చిన్న గాయాలు తప్ప..
ఎవరో తనని రక్షించి ఉంటారనే ఆలోచన కలిగింది. చుట్టూ చూశాడు.
పది గజాల దూరంలో కనిపించిందో మానవకారం. ఎవరది..? దొంగా..? నిశితంగా చూశాడు.. దొంగ కాదు.. మరెవరు..? కళ్లు చికిలించి మరీ చూశాడు.
అనుమానం లేదు.. ఆ ముష్టివాడే. గొడుగు కింద నిలబడి ఉన్నాడు.
సన్నగా పడుతున్న లైట్ల వెలుతురులో- అదే నవ్వు...
‘‘బాబూ..! మీకేం కాలేదు. రోడ్డు మధ్యలో పడి ఉంటే ఇటు తీసుకొచ్చాను’’ అన్నాడు తను. మెల్లగా విశ్వం వైపు వస్తూ.
విశ్వం నిశే్చష్టుడయ్యాడు.
తను నిత్యం అసహ్యించుకుంటున్న ఈ ముష్టివాడే- ఈ రోజు తన ప్రాణాన్ని కాపాడాడనే విషయం అర్థం కావడానికి ఎక్కువసేపు పట్టలేదు.
సిగ్గుతో కుంచించుకుపోయాడు విశ్వం.
‘‘బాబూ..! మీ ఇల్లెక్కడో పాపం.. ఎలా వెళతారు? ఇదిగో.. నా గొడుగు తీసుకెళ్లండి...’’ అన్నాడు ముష్టివాడు.
విశ్వం నిరుత్తరుడయ్యాడు.
కాళ్ల కింద భూమి పగిలిపోతున్న భావన.
లేచి నిల్చున్న విశ్వం... తల వంచుకుని నేల చూపులు చూస్తున్నాడు.
‘‘్ఫరవాలేదు బాబూ... తీసుకెళ్లండి. రేపు తిరిగి ఇచ్చేద్దురుగానీ..’’ అంటూ తన గొడుకును విశ్వం ముందుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు ఆ ముష్టివాడు.
విశ్వం వౌనంగా ఆ గొడుగుని అందుకున్నాడు. ఇప్పుడు ఆ గొడుగు అతనికి అంటరాని వస్తువుగా అనిపించలేదు. దేవుడిచ్చిన వరంలా ఉంది.
చేతిలో గొడుగుతో చిన్నగా నడక సాగించాడు విశ్వం. అతని మదిని తొలిచేస్తూ సవాలక్ష ఆలోచనలు.. ఆ ముష్టివాడిముందు తాను వామనుడిగా మారినట్టు అనిపిస్తున్నది.
విశ్వం ఇల్లు చేరేలోగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది.
రోడ్లపై పారుతున్న నీటిలో మురికి కొట్టుకుని పోతున్నది. విశ్వం మనసులోనూ అలాగే జరుగుతోంది.
ఎవరు గొప్ప? ఎవరు నీచులు? అనేది మనిషి సంస్కారాన్ని బట్టే ఉంటుంది. తనకి చేతనైన పరిధిలో.. మరో మనిషికి సాయపడేవాడే మహోన్నతుడు..!
ఇది విశ్వంకు జీవితం నేర్పిన పాఠం! *

Control your words about your spouse

‘చులకన వ్యాఖ్యల’తో దాంపత్య బంధానికి చేటు


లంచ్ అవర్‌లో డల్‌గా వున్న సరోజతో- ‘ఏంటి మేడం.. డల్‌గా వున్నారు.? పొద్దున్నించి చూస్తున్నాను. మీలో మీరు ఏదో బాధపడుతున్నారు’ అంది మాధవి.
అంతవరకు ఉగ్గపట్టి వున్న సరోజ ఒక్కసారిగా భళ్ళుమంది. ‘‘మావారు నిన్న వూరినుండి వచ్చిన నా ఆడపడుచుల ముందు అవమానించారు. కాఫీలో చాలినంత చక్కెర లేదని ముఖాన చిమ్మినంత చేశాడు. కనీసం వారున్నారనే ఆలోచన కూడా లేకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఆడపడుచుల్లో ఒకరు నా ముఖానే- ‘మొగుడికి కమ్మగా కాఫీ కూడా ఇవ్వడం కూడా రాదా..?’’ అని అంటే, మరో ఆమె- ‘ఉద్యోగం వెలగబెడుతోందిగా, వీడే కాఫీ కమ్మగా చేసి ఆవిడకివ్వాల్సింది’ అనడంతో నాకు తల కొట్టేసినట్లయింది. ఎంత సంపాదించి ఏం ప్రయోజనం? ’’ అంది.
మాధవి నాలుగు ఉపశమనం మాటలు చెప్పగలిగిందే కానీ, సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఆడపడుచుల ముందు తనను చులకన చేసి భర్త మాట్లాడడంతో సరోజ మనసు గాయపడింది.
***
‘‘హాయ్.. లలితా చీరెక్కడ కొన్నావే..? నీకు అదిరిపోయింది..’’ పక్కింటి పావని అడిగింది.
‘‘షాపింగ్ మాల్‌లో కొన్నానే..! పదివేలైంది’’
‘‘ఏమైనా మీ ఆయన బెటరే.. మా ఆయనైతేనా నీ ముఖానికి పదివేల చీర కావాలా? అని నన్ను తీసిపారేస్తాడు’’ పవిత్ర నీరసంగా చెప్పింది.
‘‘ఇది మా ఆయన కొన్నదనుకొన్నారా..? కాదు, మా అమ్మ కొన్నది. అయినా పదివేల చీర కొనిచ్చేంత త్యాగం మా ఆయనలో లేదక్కా.. అసలు పదివేల చీరంటే మా ఆయన గుండాగి చచ్చూరుకుంటాడు. పెళ్లయ్యాక ఆయన డబ్బుతో చీర కొన్న పాపాన పోలేదంటే నమ్మండి...’’ చెప్పింది లలిత.
‘‘మా ఆయనే పరమ పీనాసి అనుకున్నా... మీ వారు కూడా అదే బాపతన్నమాట’’ పావని అందుకుంది. అంతా పకపక నవ్వుకున్నారు. వారు తమ తమ భర్తల గురించి అలా తేలిగ్గా మాట్లాడుకోవడం వింటున్న మిగతా ఆడవాళ్లూ ముసిముసిగా నవ్వుకున్నారు.
‘‘మా ఆయనకంత సీను లేదు’’, ‘‘ఏదో కట్టుకున్న మొగుడు కదాని కాపురం చేస్తున్నా... వట్టి వేస్ట్ ఫెలో..’’ ఇలా తమ భర్తల గురించి కామెంట్ చేసే కొందరు మహిళలు అక్కడక్కడా ఉంటారు.
‘‘దీని ముఖం, దీనికి సరిగ్గా వంట కూడా రాదు. నా ఖర్మకాలి కట్టుకున్నా. ఏ రోజైనా కమ్మగా నాలుగు మెతుకులు తిన్నానా..’’, ‘‘మా ఆవిడ ఒట్టి పల్లెటూరి మొద్దు. ఓ అచ్చటా ముచ్చటా తెలియదు’’, ‘‘అత్త కూతురని వద్దన్నా తగిలించారు. నా ఖర్మ బతుకంతా శివరాత్రి అయింది...’’- అంటూ కొంతమంది భార్యలు తమ భర్తల గురించి ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడుతూ వుంటారు. తమ ఆధిక్యతను చాటుకోవడానికి అంటారో లేక తెలియక అంటారో గానీ ఎదుటివారి ముందు తన జీవిత భాగస్వామిని తక్కువ చేస్తున్నామనే భావన వారిలో వుండదు.
భార్యగానీ, భర్తగానీ తమ ఆధిక్యతను ప్రదర్శించే సమయంలో ఏదో ఒకటి నోరుజారి అనేస్తూ వుంటారు. ఇతరుల వద్ద తమ జీవిత భాగస్వామి గుణగణాల గురించి, బలహీనతల గురించి .. తక్కువ చేసి చెప్పినందువల్ల... ఇతరుల దృష్టిలో.. తన జీవిత భాగస్వామి ఎంత లోకువ అవుతారో అర్థం చేసుకోరు. ఆలుమగలు తమ గౌరవ మర్యాదలను పరస్పరం కాపాడుకోవాలంటే ముం దుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి లోపాలను ఒకరు ఏకాంతంలో సరిదిద్దుకోవాలి. భార్యాభర్తలన్నాక పాలూ నీళ్ళలా కలిసిపోవాలి. ఒకరి లోపాలను మరొకరు ఇతరుల ముందు ఎత్తిచూపడం, తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. ఒక్కోసారి ఇలాంటి మాటలు జీవిత భాగస్వామి మనసుని గాయపరచి, సంసారాల్లో కల్లోలాలు సృష్టించే వీలుంది. చిన్న చిన్న మాటలే చినికి చినికి గాలివానగా మారి, దాంపత్య బంధంలో తుపాన్లు సృష్టించే ప్రమాదం వుంది. భర్తలో కొన్ని విషయాలు నచ్చకపోతే గోరంతలు కొండంతలు చేసి పొరుగువారికి భార్య ఆ విషయాలు చెప్పటం గానీ, అలాగే భార్య గురించి నలుగురిలో వ్యంగ్యంగా భర్త మాట్లాడటం గానీ మంచిది కాదు.

salt - heart

ఉప్పుతో గుండెకు ముప్పు


హృద్రోగ సమస్యల నుంచి గట్టెక్కాలంటే 2025 నాటికి ప్రపంచ దేశాలన్నీ 30 శాతం మేరకు ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తాజాగా కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. గుండె సంబంధ వ్యాధులు, ఆకస్మిక గుండెపోట్ల వల్ల విశ్వవ్యాప్తంగా ఏటా భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వంటల్లో, ప్యాకేజి ఫుడ్‌లో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని డబ్ల్యుహెచ్‌ఒకు చెందిన పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అన్ని దేశాలూ నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేసినపుడే 2025 నాటికి హృద్రోగ మరణాల సంఖ్య తగ్గే వీలుందని వారు పేర్కొంటున్నారు. ప్యాకేజీ ఫుడ్ విక్రయాల్లో ఉప్పు శాతం గురించి వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మోతాదుకు మించి ఉప్పు వాడడం వల్ల అధిక రక్తపోటు, టెన్షన్లు, గుండె సంబంధిత రోగాలు వస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

telugu short story - kaki, bathu


carbon - king of elements



yalakulu - yelachi - uses


thamalapaaku - health tips


Perfect diet - weight loss


exercise - beauty


Chaild habits


LED bulb @ Rs.10


Swachha Barat