Pages

Wednesday, 20 August 2014


మాతృగర్జన ( కథ)


.........
దీపావళి నాడు తెల్లారి, ఆనక మధ్యాహ్నమై, పొద్దు పడమటికి వాలినా ‘ఇంకెప్పుడు చీకటి పడుతుందిరా బా బూ..!’ అని అసహనంగా ఆరాటపడే పిల్లకాయలా ఉంది సరస్వతి. సాయంత్రం నాలుగు గంటలకు కానీ పిల్లల్ని కలుసుకోనివ్వరని తెలిసినా- కూతురు కనిపించకపోయినా, గోడలు అడ్డంగా ఉన్నా- కనీసం కొన్ని గజాల దూరంలో మాత్రమే ఉన్నానన్న తృప్తి అయినా దక్కుతుందని రెండు గంటలకే ‘రాశి’ విద్యా సంస్థల కార్యాలయానికి ఆమె వచ్చేసింది.
‘ఆరాటపు పేరంటాళ్ళు తెల్లవారక ముందే అరుగుపై తిష్టవేశారు’ అన్నట్టు సరస్వతి వచ్చేసరికే కొందరు తల్లిదండ్రులు ఉన్నారక్కడ. వాళ్ళ దగ్గరున్న సంచుల్లో రకరకాల తీపి, కారపు పిండివంటలు, చాక్లెట్లు, శీతల పానీయాలున్నాయ. ‘రాశి’ విద్యా సంస్థలు రకరకాల పరీక్షల ఫలితాలకు బాగా పేరుమోశాయి. అందుకే వందెకరాల విస్తీర్ణంలో వేలాదిమంది విద్యార్థులతో విస్తరించాయి ఆ విద్యా సంస్థలు. నెలలో ఓ ఆదివారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు హాస్టల్లో ఉన్న తమ పిల్లలను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు ఇస్తుంటుంది పాఠశాల యాజమాన్యం. బిడ్డలను చూడాలన్న ఆదుర్దాతో చాలామంది మ ధ్యాహ్నం రెండు కాకుండానే వచ్చినా వాళ్ళ పిల్లల పేర్లు రాసుకునే బాధ్యత నిర్వర్తించడానికి అక్కడ ఎవరూ లేరు. అక్కడున్న సిబ్బందిని అడుగుతుంటే ‘పిల్లలను బయటకు పంపించమని హాస్టల్ వార్డెన్లకు ఫోన్ చేసి చెప్పే అధికారం ఒక్క వేణు సార్‌కే ఉంది. ఆయన మూడింటికి వస్తారు. అప్పటివరకూ ఆగండి’ అని చెపుతున్నారు.
మూడు గంటలైనా వేణు సార్ రాలేదు కానీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ హాలు తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. అక్కడ చోటులేకపోవడంతో కొందరు బయట చెట్ల కింద చేరారు. ఆ రోడ్డుకు అటూ ఇటూ వందలాది బైక్‌లూ, కార్లే. అక్కడనుంచి చూస్తుంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పెద్ద రాక్షసి తలలా, దానికి అ టూ ఇటూ పదడుగుల ఎత్తు ప్రహరీ గోడలు ఆ రాక్షసి భుజాల్లా కనిపిస్తున్నాయి. ఆ గోడలపై తిరిగి ‘వై’ ఆకారంలో ఇనుప కమీలూ, వాటికి మళ్లీ ఇనుప ముళ్ళతీగా ఉన్నాయి. ఆ గోడల్ని చూస్తే సరస్వతికి రాజమండ్రి సెంట్రల్ జైలు గుర్తుకు వచ్చింది. తమ ఊరి పంచాయితీ ఎన్నికలప్పుడు జరిగిన కొట్లాటలో ఆమె తండ్రి అరెస్టయి రిమాండ్‌లో ఉన్నప్పుడు చూడడానికి ఆ జైలుకి వెళ్ళింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు కుడివైపున ఉన్న భారీ గేటు కూడా సెంట్రల్ జైలు గేటుతో పోటీపడేలా ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఆ గేటుకు దూరంగా నిలబడ్డారు. ఏవైనా వాహనాల లోపలికి వెళుతున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డులు గేటు తీసి, మళ్లీ మూస్తున్నారు. అలా తీసినప్పుడు చూస్తే గేటుకు వంద మీటర్ల దూరంలోని హాస్టల్ బ్లాక్ కనిపిస్తోంది. ఆ కొన్ని క్షణాల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఆతృతగా హాస్టల్ బ్లాక్ వంక చూస్తున్నారు. ‘ఏ వరండాలోనో తచ్చాడుతూ తమ బిడ్డలు కనబడకపోతారా?’ అన్నదే వారి ఆశ. గేటు తీసినప్పుడల్లా కళ్ళు చిట్లించి చూసినా వాళ్ళలో ఏ ఒక్కరి ఆశ తీరలేదు. సరస్వతి కూడా అలా నిరాశ చెందింది. ప్రహరీ గోడమీది ముళ్ళతీగలపై వాలిన పావురాలు మెడలు లోపలి వైపుకి, బయటి వైపుకి తిప్పుతూ- పంజరాల్లో చిక్కుకున్న ప్రాణులను చూసినట్టు తమను జాలిగా చూస్తున్నట్టనిపించింది సరస్వతికి.
***
సరస్వతి చిన్నప్పుడు- ఆమె తండ్రి ముంజెకాయలు కోయడానికి తాటి చెట్టెక్కి, ఎండుకొమ్మ పట్టుకోవడంతో జారి కిందపడ్డాడు. కాళ్ళు విరిగి కొన ఊపిరితో ఉన్న అతడిని ట్రాక్టర్‌పై తణుకులోని ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. ఎంతో బలాఢ్యుడైన తండ్రిని ఆ స్థితిలో చూసేసరికి సరస్వతి గొల్లుమంది. ఎవరెంత వారించినా, కసిరినా మొండికేసి తానూ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ తెల్లటి దుస్తుల్లో ఉన్న వైద్యులు తండ్రికి చికిత్స చేయడానికి ఉరుకులు, పరుగులు పెట్టడం చూసింది. గండం గడిచి, కోలుకున్నాక తండ్రి ఆస్పత్రి నుంచి వస్తూ, చెంపల వెంట కన్నీళ్లు కారుతుండగా ఆ వైద్యులకు చేతులెత్తి మొక్కడం చూసింది. పండగలప్పుడు కూడా దేవుళ్ళకు మొక్కని తండ్రి డాక్టర్లకు చేతులు జోడించడం చూసిన సరస్వతిలో ఓ ఆలోచన రేకెత్తింది. డాక్టర్లంటే కనిపించే దేవుళ్ళంత గొప్పవాళ్ళనిపించింది. తానూ పెద్ద చదువు చదివి డాక్టర్ కావాలన్న కోరిక ఆ క్షణంలోనే సరస్వతి మనసులో హత్తుకుపోయింది. అయితే, ఆడపిల్లను పొరుగూరు పంపి చదివించడానికి ససేమిరా వీల్లేదన్న ఆమె నానమ్మ, తాతయ్యల పట్టుదలతో- కలుపుమొక్కను పెకలించినంత నిర్దాక్షిణ్యంగా ఆమె కోరికను పెకలించి వేశారు. దాంతో ఆమె చదువు ఏడవ తరగతితోనే ముగిసిపోయింది. చదువు మానాల్సి వచ్చినప్పుడు సరస్వతికి జీవితం ఎంత నాణ్యమైన విత్తనం వేసినా మొలకెత్తని చవిటిపర్రలా తోచింది. మక్కువతో పెంచుకున్న పూలమొక్కను మొగ్గ తొడక్కుండానే పశువులు మేసేసినట్టనిపించింది. తర్వాత అయిదేళ్ళకే ఆ ఊరివాడే అయిన సత్యనారాయణకు ఇచ్చి పెళ్లి చేసేశారు.
సత్యనారాయణ చదివింది అయిదో తరగతి వరకే. సరస్వతికిచ్చిన కట్నంతో కలిసి వారికిగల పొలం నాలుగెకరాలైంది. పెళ్లయిన నాలుగు నెలలకే నెల తప్పిన సరస్వతి ఆ క్షణంలోనే నిశ్చయించుకుంది. తనకు పుట్టే బిడ్డ ఆడైనా, మగైనా మెడిసిన్ చదివించాలి. తన కనుముక్కు తీరుకే కాదు, తాను నిజం చేసుకోలేని తన కలను కూడా బిడ్డ వారసత్వం గా అందిపుచ్చుకోవాలని ఆశించింది. డాక్టర్ చదువు అప్పటికే తమలాంటివారికి అందనంత ఖరీదైపోతోందని సరస్వతికి తెలుసు. ఫ్రీ సీటు తెచ్చుకోకుంటే తమకున్న నాలుగు ఎకరాలు అమ్మి మేనేజ్‌మెంట్ కోటాలోనైనా బిడ్డను చదివించాల్సిందేననుకుంది. అదేమాట భర్తతో చెప్పింది. మరో బిడ్డ అక్కరలేకుండానే మొదటి బిడ్డతోనే ఆపరేషన్ చేయించుకుంటానంది. ఆ ప్రకారమే స్వాతి పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటించింది. భర్త సత్యనారాయణ కూడా తన తల్లిదండ్రులు ‘ఓ కన్ను కన్నూ కాదు, ఓ బిడ్డ బిడ్డా కాదు’ అంటూ మగబిడ్డ కోసం ఆగమని పోరు పెడుతున్నా లెక్క చేయకుండా భార్య మాటను మన్నించాడు. డాక్టర్ కావాలన్న తన జీవిత స్వప్నాన్ని స్వాతి ద్వారా నిజం చేసుకోవాలని కంకణం కట్టుకున్నా- ఎన్నడూ బిడ్డపై దాన్ని బలవంతంగా రుద్దినట్టు ప్రవర్తించలేదు సరస్వతి. మనిషి గుండెలపై బండరాయిలా తిష్టవేసిన మృత్యువును సైతం దూదిపింజలా ఎగరగొట్టగల ఆ వృత్తి ఎంత గొప్పదో చెప్పడం ద్వారా- చెలమలో నీరూరినంత సహజంగా స్వాతికే డాక్టర్ కావాలన్న కోరిక బలంగా కలిగేలా చేసింది. ఖర్చును ఖాతరుచేయకుండా ఎల్‌కెజీ నుంచే తణుకులోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదివింది. స్వాతి కూడా ప్రతి క్లాసులో అగ్రస్థానంలో ఉంటూ తల్లి నమ్మకాన్ని ఏ యేటికాయేడు రెట్టింపు చేస్తూ వచ్చింది. పదో తరగతి మంచి మార్కులతో పాసైన కూతురిని నెల్లాళ్ల క్రితమే ‘రాశి’లో చేర్పించారు సరస్వతి దంపతులు. పదో తరగతి వరకూ చదువు పొరుగూళ్ళోనే అయినా రోజూ స్కూలు బస్సులో వెళ్లి వచ్చేది స్వాతి. దాంతో ఏనాడూ బిడ్డను విడిచిపెట్టి ఉండాల్సిన అవసరం రాలేదు వారికి. స్వాతిని రాశి హాస్టల్‌లో విడిచిపెట్టి వచ్చే రోజున ముగ్గురి కళ్లూ తుఫాన్ వేళ మబ్బులయ్యాయి. ముగ్గురి గుండెల్లోనూ వినబడని పిడుగేదో పడ్డంత బాదే. వెక్కెక్కి ఏడుస్తూ, బలవంతంగా చెయ్యూపుతున్న స్వాతిని విడిచిపెట్టి రావాలంటే సరస్వతికి అడుగుపడలేదు. అయితే- తనను తాను సంబాళించుకుని- తెల్లకోటు వేసుకుని, మెడలో స్టెత్‌తోరోగులను చిరునవ్వుతో పలకరిస్తున్న ‘డాక్టర్ స్వాతి’ని ఊహించుకుంటూ, ఆ అందమైన ఊహ ఊతంతో దుఃఖాన్ని తట్టుకుని, తన ఊరికి తిరిగి రాగలిగింది. ఈరోజు సత్యనారాయణ కూడా సరస్వతితో రావలసినవాడే. అతడు కూడా నెర్రెలు కొట్టిన వేళ వరినాట్లు నీటి తడి కోసం తహతహలాడినట్టు- కూతురిని చూడాలని తపిస్తున్నాడు. అయితే, చేనుపై చీడ ఆశించడంతో వెంటనే పురుగుమందు కొట్టాల్సి రావడంతో ఆగిపోయాడు.
***
చూస్తుండగానే నాలుగైంది. అప్పటికీ వేణుసార్ రాలేదు. అలాగని పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులకు అనుమతినిచ్చేబాధ్యత మరెవరూ తీసుకోలేదు. ఎవరడిగినా, ఎన్నిసార్లడిగినా ఒకటే సమాధానం- ‘వేణుసార్ రావాలి’! అయిదు గంటలైనా ఆయన ఊడిపడలేదు. బిడ్డలను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆరాటంలో ఉన్న తల్లిదండ్రుల ముఖాల్లో ఉక్రోషం, ఆగ్రహం, నిస్సహాయత కలగలసి కనిపిస్తున్నాయి. ‘‘మా అబ్బాయికి వేడి వేడి బొబ్బట్లంటే ఇష్టం. హాట్ ప్యాక్‌లో తెచ్చాను. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అవి చల్లారి పోయేవరకూ పర్మిషన్ ఇచ్చేలా లేరు’’ అని ఒక తల్లి వాపోయింది.
‘డిసిప్లిన్ ఉండొచ్చు. కానీ, ఇంత రిజిడ్‌గా కాదు. వేణుసార్ రాలేకపోతే ఆల్టర్నేటివ్ పర్సన్‌కి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పజెప్పాలి తప్ప మనల్నందరినీ ఇంతసేపు వెయిట్ చేయించడం- వెరీ రూడ్ మేనేజ్‌మెంట్’’ ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు.
సరస్వతి పైకి ఏమీ అనలేదు కానీ మనసులోనే వేణుసార్‌ని బూతులు తిట్టుకుంది. మేతకోసం గూడువిడిచి వెళ్లిన తల్లి పొద్దువాలి చీకటి కమ్ముకున్నా తిరిగి రానప్పుడు పక్షికూనల్లా అక్కడున్న ప్రతి తల్లీ, తండ్రీ అసహనంతో, దుఃఖంతో వేగిపోతున్నారు. కొందరు సహనం కోల్పోయి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అయినా సిబ్బంది- చీకట్లో ఎంత అదిలించినా ఒకే శృతితో గీపెట్టే కీచురాళ్ళలా తొణక్కుండా ఒకేమాట చెబుతున్నారు- ‘‘వేణుసార్ రావాలి.. కొద్ది సేపట్లో వచ్చేస్తారు’’. అని
***
హాస్టల్ బ్లాక్ వెనుక పొద్దుగుంకుతోంది. ఆరైంది. అయినా వేణుసార్ జాడలేదు. బయట ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి- ఏడుపొక్కటే తక్కువ అన్నట్టుంది. చీకటి పడకుండానే అందరి ముఖాలూ ఆవేదనతో నలుపెక్కాయి. ‘తమకే ఇంత బాధగా ఉంటే, తమ కోసం లోపల ఎదురుచూస్తున్న బిడ్డలకు ఇంకెంత బాధగా ఉందో? ప్రతి క్షణమూ ముల్లులా గుచ్చుకునే నిరీక్షణతో ఆ లేత హృదయాలు ఇంకెంత విలవిలలాడుతున్నాయో?’ అని అనుకుంటుంటే వారి బాధ రెట్టింపవుతోంది. హాస్టల్‌కు సరుకుల లోడుతో ఓ లారీ వచ్చింది. దాంతో గేటు బార్లా తెరిచారు సెక్యూరిటీ సిబ్బంది. లారీ లోపలికి వెళ్ళి గేటు తిరిగి మూసేలోగా హాస్టల్ బ్లాక్ దగ్గరనుంచి ‘్ధబ్’మన్న శబ్దం, ఆ మరుక్షణమే కెవ్వున కేకలు వినిపించాయి. గేటు ఎదురుగా నిలుచున్న నిలుచున్న తల్లిదండ్రులు గుండెలు గుబగుబలాడుతుండగా చరచరా గేటును సమీపించారు. వారిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ లోపలికి చొరబడ్డారు. దూరం నుంచే కంటబడ్డ దారుణాన్ని చూసి హాహకారాలు చేస్తూ అటువైపు ఉరికారు. హాస్టల్ బ్లాక్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకేసిందో అమ్మాయి. నెత్తుటి మడుగులో గిలగిలా తన్నుకుంటున్న ఆ బిడ్డ తమలో ఎవరి పేగు తెంచుకుని పుట్టిందో? ప్రతి తల్లీ అటు ఉరుకుతూనే ఆ బిడ్డ తమ బిడ్డ కారాదని దేవుళ్ళను కోరుకుంది. వాళ్ళంతా అక్కడకు చేరుకునేసరికే బిడ్డలో చలనం ఆగిపోయింది. ఎరుపెక్కిన పడమర దిక్కున సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి నెత్తుటి మడుగులో ఓ బాల్యం అస్తమించింది. అక్కడి చదువుతో పదునెక్కి, ఉన్నత శిఖరాలు చేరడానికి దోహదపడుతుందనుకున్న ఓ మెదడు- పగిలిన తలలోంచి బయటపడి ఆ ప్రాంగణంలోని మట్టిలో పడి ఉంది. దాని నుంచి స్రవిస్తున్న నెత్తుటితో పచ్చిక ఎర్రబారింది. వాళ్ళలో ఓ తల్లి- ప్రాణాలు కోల్పోయింది తాను ప్రాణాధికంగా ప్రేమించిన తన బిడ్డేనని గుర్తించి గుండెలు బాదుకుంటూ బిడ్డ శవంపై పడి ‘‘తల్లీ.. సుష్మా.. నీకు ఏ కష్టం వచ్చిందని ఇంత పని చేశావమ్మా! వేలమంది ఉంటున్నారు.. నాలుగు రోజులు పోతే నీకూ అలవాటవుతుందనుకున్నామేగానీ ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదే తల్లీ!’’ రోదించింది. ఆమె తమ బిడ్డ కాదని నిర్థారణ కావడంతో ‘అమ్మయ్యా’ అని నిట్టూర్చినా, చాలామంది అమ్మలు సాటి అమ్మ దుఃఖంతో చలించి విలపించసాగారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉన్న తల్లిదండ్రులు, గేటు దగ్గరున్న సెక్యూరిటీ వాళ్ళే కాక మొత్తం సిబ్బంది అంతా అక్కడకు చేరుకున్నారు. సుష్మ దూకిన మూడో అంతస్తులో నిలబడి గొల్లున ఏడుస్తున్న పిల్లలనుంచి ఓ వార్త పాకింది. కొత్తగా హాస్టల్లో చేరిన సుష్మకు ప్రతి రాత్రీ అమ్మా నాన్నా గుర్తొచ్చి ఏడుస్తూనే ఉంది. ఆదివారం వాళ్ళు వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసింది. తెల్లవారిన దగ్గర్నుంచి ఎవరు పలకరించినా ఆ ప్రస్తావనే తెచ్చింది. పొద్దుగుంకేవేళైనా- అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు రమ్మన్న పిలుపు రాకపోవడంతో గుండె బరువును భరించలేకపోయింది. అంతే- పరుగు పరుగున వెళ్లి కిందికి దూకేసింది.
***
విద్యా సంస్థల సిబ్బంది అక్కడకు చేరిన తల్లిదండ్రులను వెళ్లిపొమ్మని అభ్యర్థించారు. అంతలో వేణుసార్ వచ్చాడు. వచ్చీరాగానే ‘‘ప్లీజ్.. ప్లీజ్! అందరూ బయటకు వచ్చేయండి. చనిపోయిన అమ్మాయి మెంటల్ కండిషన్ బాగాలేదు. హాస్టల్‌లో చేర్చుకోమని చెప్పినా పేరెంట్సే బలవంతంగా చేర్చారు. ఇప్పుడిలా అయింది. ఎవరైనా చేయగలిగిందేముంది? మీ పిల్లలను అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు పంపిస్తాం. కలుసుకుని వెళుదురుగాని.. రండి’’ బతిమాలుతున్నట్టు అన్నాడు.
కొంతసేపటివరకూ మెదడు మొద్దుబారినట్టయిన సరస్వతి అప్పటికి తేరుకుంది. ఓ బిడ్డ కళ్లెదుట నెత్తుటి ముద్దలా పడి ఉంటే తానూ, తనలాంటి తల్లులూ ఏం చేస్తున్నారు? అడవిలో పులి జింక పిల్లను నోట కరచుకుపోతుంటే ఏమీ చేయలేని పెద్దజింకల మందలా చూస్తున్నారు. ఇదేనా తాము చేయాల్సింది? సిగ్గుతో, రోషం తో, దుఃఖంతో సరస్వతి ముఖం ఎర్రబారింది. పడమరన గుంకిన పొద్దు ఆమె ముఖంలో చేరినట్టయింది. మడుగు కట్టిన నెత్తుటిలో తన కూతురు స్వాతి ముఖం ప్రతిబింబిస్తున్నట్టూ, ఆమె మెడలో స్టెతస్కోపుకు బదులు ఉరితాడు ఉన్నట్టు అనిపించింది. కూతురిని డాక్టర్ని చేయాలన్న కోరిక- గోదావరి గట్టు తెగిన వేళ వరి మొలకలా కొట్టుకుపోగా, ఆమె అపాయంలో ఉందన్న భీతి క్షణ క్షణానికీ ఉప్పొంగే వరద గోదావరిలా పెరిగిపోయింది. ఆరుగంటలవరకూ పత్తాలేని వేణుసార్‌ఓ పిల్ల ప్రాణం పోయాక వచ్చి- తప్పును ఆ పిల్లపైనే నెడుతున్నాడు. తప్పు ఆ పిల్లదికాదు- ఆ వేణుసార్‌దీ, ఈ విద్యా సంస్థదీ, తమలాంటి తల్లిదండ్రులదీ అన్న నిజం ఆమెకు నెత్తుటి రంగు ఎరుపు అన్నంత నిశ్చయంగా తోచింది. అకస్మాత్తుగా అరిచింది- ‘‘అమ్మా.. స్వాతీ.. స్వాతమ్మా! ఎక్కడున్నావు తల్లీ?’’ ఆ అరుపు ఆమె ఒక్క గొంతుదిలా కాక అక్కడున్న అమ్మలందరూ అరిచినంత బిగ్గరగా ఉంది. పురిటినొప్పులవేళ కలిగిన వ్యధార్తికి వందల రెట్లు ఎక్కువగా ఉంది.
వేణుసార్ సరస్వతికి దగ్గరగా వచ్చి ‘‘ఎందుక మ్మా అలా అరుస్తావు? ఇక్కడ అసలే పరిస్థితి బాగాలేదు..’’ మందలింపుగా అన్నాడు.
‘‘నువ్వు నోర్ముయ్యరా పనికిమాలిన నా కొడకా! నీవల్ల కాదూ ఇంత ఘోరం జరిగింది? అసలు ఇది చదువు చెప్పే చోటా, బిడ్డల్ని బలి ఇచ్చే చోటా? ఇంత జరిగాక నా బిడ్డను ఒక్క క్షణం ఇక్కడుంచను. అమ్మా.. స్వాతీ! అమ్మనొచ్చాను.. వచ్చెయ్యమ్మా! మనింటికి వెళ్లిపోదాం వచ్చెయమ్మా...!’’ ఆ సమయంలో సరస్వతి మామూలుగా లేదు. తన కూనకు హాని జరుగుతుందని పసిగట్టినవేళ తాండవమాడుతున్న సివంగిలా ఉంది. హాస్టల్ వరండాల్లో చేరిన పిల్లల్లో ఎక్కడుందో గానీ, స్వాతి బావురుమంటూ దూసుకుంటూ వచ్చి ఒక్కాసారి తల్లిని వాటేసుకుంది. ఓ భుజాన కారప్పూస, సున్నుండలున్న సంచి వేలాడుతుండగా, మరో భుజానికి కూతురిని ఎత్తుకుని చకచకా అలవోకగా గేటువైపు నడిచింది.
‘‘ఏంటమ్మా..! ఇది నీ ఇల్లు కాదు. రాశి ఇన్‌స్టిట్యూషన్. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు’’ అడ్డుపడబోయాడు వేణుసార్. ఓ తల్లి కన్నబిడ్డ ఓ పక్కన శవంగా పడి ఉంది. మరో పక్కన ఇంకో తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి ఉగ్రరూపం ధరించింది. అయినా వాడికి వణుకు పుట్టలేదు. కారణం- ఆ విద్యా సంస్థ యజమాని బంధువు ఓ ఎమ్మెల్యే కావడం. ఆ పలుకుబడికి తోడు ఏటా కోట్ల రూపాయల్లో మీడియాకు ప్రకటనలిస్తుంటారు. హాస్టల్ పిల్లలు మరణించిన సంఘటనలు ఇంతకుమునుపూ జరిగినా, తమ సంస్థలో బిడ్డలను చేర్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అదే వేణుసార్ ధీమాకు కారణం.
‘‘అడ్డు తప్పుకుంటావా? కాలెత్తి తన్నమంటావా?’’ తప్పుకోకపోతే తన మాటకూ, చేతకూ వెంట్రుకవాసి తేడా ఉండదన్న నిశ్చయం ధ్వనించింది సరస్వతి హెచ్చరికలో.
కాస్త జంకిన వేణు చివరి అస్త్రం ప్రయోగించాడు. ‘‘మీ అమ్మాయిని ఇప్పుడు తీసుకుపోతే- మళ్లీ చేర్చుకోం. అంతేకాదు- మీరు కట్టిన డబ్బులో పైసా కూడా తిరిగివ్వం’’. డబ్బుకన్నా మనిషిని నియంత్రించేది ప్రపంచంలో మరేదీ లేదన్నది అతడి నమ్మకం.
సరస్వతి గర్జించింది.
‘‘పోరా..! ఓ పంట పండలేదనుకుంటాం. అంతే తప్ప మా కడుపు పంటను మీ పొట్టన పెట్టుకోనిస్తామా?’’
వేణు ఇక మాట్లాడలేకపోయాడు. బొమ్మలా ఉన్నచోటే నిలబడిపోయాడు. చరిత్రను తిరగరాసి విజేతగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయిలా- బిడ్డను అలాగే మోసుకుంటూ చకచకా నడిచి, గేటు దాటింది సరస్వతి. తాను డాక్టర్ కాలేకపోయినా తన కూతురిని ప్రాణగండం నుంచి కాపాడుకున్నానన్న తృప్తి మెరిసింది ఆమె మొఖంలో! గేటు దగ్గరన్న సెక్యూరిటీ సిబ్బందే కాదు- అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సన్‌షేడ్ పైనున్న పావురాలు కూడా సరికొత్త దృశ్యాన్ని చూస్తున్నట్టు బిత్తరపోయాయి. *

No comments:

Post a Comment