Pages

Saturday, 30 August 2014

నీ జతగా.. నేనుండాలి --- Movie review


' ఫీల్ ' లేని రీమేక్!

  • 29/08/2014
  •  | 
  • -ఆశ్రీత్
** నీ జతగా.. నేనుండాలి (ఫర్వాలేదు)
తారాగణం:
సచిన్ జోషి, నజియా హుస్సేన్
రావు రమేష్, శశాంక్ తదితరులు
సంగీతం: జీత్ గంగూలీ
మిథున్, అంకిత్ అంకుర్
మాటలు: మధుసూదన్
కథ, స్క్రీన్‌ప్లే: షాగుఫ్తా రఫీక్
పాటలు: చంద్రబోస్
నిర్మాత: బండ్ల గణేష్
దర్శకత్వం: జయ రవీంద్ర
ఆషికీ-2 సినిమా చూశారా? ఐతే అర్జంట్‌గా- ఆ సినిమా తాలూకు అనుభూతుల్ని ‘మైండ్’లోంచి తుడిచేయండి. లేకుంటే- మీరు ఏ చిత్ర రాజాన్ని తిలకిస్తున్నారో మీకే అర్థం కాదు కాబట్టి. థియేటర్ ముందు పోస్టర్ చూసి- ‘నీ జతగా...’ నేనుంటాలె అని భ్రమించి వెళ్తే మాత్రం అంతా శూన్యమే. ‘నేనుండను’ అన్నా వదిలిపెట్టరు. ఈ సినిమా ఆరంభించింది మొదలు.. ప్రేక్షకుణ్ణి ఓ సందేహం వెంటాడుతూండాలి. ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారంటే ఈ చిత్ర ఛాయల్ని నామమాత్రంగానైనా చూపెట్టగలగాలి. లేకుంటే - ‘్ఫల్’ ఉండదు. ఆషికీ-2 కథలో ఎటువంటి ప్రత్యేకతలూ లేకున్నప్పటికీ - నటీనటుల హావభావాలతో ఆద్యంతం రక్తి కట్టించి.. సగటు ప్రేక్షకుణ్ణి కట్టి పడేసింది. అంతకు మించిన బ్రహ్మాండమేదైనా జరిగితే తప్ప.. ఆ అనుభూతిని కళ్ల ముందు ఉంచటం కష్టం. ఇన్ని తెలిసీ - మాతృక నుంచీ స్క్రీన్‌ప్లేని సైతం యధేచ్ఛగా వాడేసిన ఈ సినిమా మీ ‘జత’ కట్టిందా? లేదా? అన్నది చూద్దాం.
తన గాత్రంతో జనాన్ని ఉర్రూత లూగించే రాఘవ జయరామ్.. ఉరఫ్ ఆర్జే (సచిన్) ఏ పాటనైనా అవలీలగా పాడేసి - శ్రోతల మదిలో పదేపదే ‘రింగ్ టోన్’లా మారతాడు. ఐతే- అతడికి ఉన్న ఒకే ఒక్క బలహీనత - తాగుడు. దానికి బానిస. రికార్డింగ్ ఏ అర్ధరాత్రో అపరాత్రో అయినా- మందు కోసం కిలోమీటర్ల కొద్దీ వెళ్లటం అతనికి అలవాటు. దీంతో కెరీర్ కుంటు పడే పరిస్థితికి వస్తుంది. అతడి ఫ్రెండ్ ఎంత చెప్పినా పట్టించుకోడు. ఒకానొక సందర్భంలో ఆర్జేకి గాయత్రి నందన (నజియా) ఒక సాదాసీదా బార్‌లో పాట పాడుతూ కనిపిస్తుంది. ఆమె పాట అతణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. అది తన పాటే. తను పాడిందాని కంటే మరింత మధురంగా ఆలపించటంతో తొలిచూపులోనే ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. సినీ ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడితో పరిచయాల్తో - ఆమెని మేటి గాయనిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు. యాదృచ్ఛికంగా నందన కూడా ఆర్జే ప్రేమలో పడుతుంది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకొంటారు. నందన సంగీత ప్రపంచంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తుంది. ఆర్జే తన తాగుడిని వదిలిపెట్టడు. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆర్జేని ఎంతగానో ప్రేమించిన నందన అతణ్ణి ఆ ఊబి నుంచీ బయటికి తెచ్చేందుకు కెరీర్‌ని కూడా వదలుకోటానికి సిద్ధపడుతుంది. తన కారణంగానే నందన ఉజ్జ్వల భవిష్యత్‌ని నాశనం చేసుకుంటుందని భావించిన ఆర్జే చివరికి ఏం చేశాడు? ఆమె నుంచీ దూరంగా వెళ్లిపోయాడా? ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
ఆషికీ-2 ఏమంత గొప్ప సినిమా కాదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ - ఆ సినిమాలో శ్రద్ధాకపూర్ హావభావాలూ - చూపులు ఇప్పటికీ జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సినిమాని సినిమా చూళ్లేదు. ఒక జీవితాన్ని చూశారు. ఆ భావాల తాలూకు నీడలు మనసులో ముద్రవేశాయి. అందుకు తగ్గట్టే- ఆడియో హృదయంలో వీణియల్ని మోగించింది. కాబట్టే- ఒక సాదాసీదా కథ సైతం... సూపర్ హిట్ కొట్టి ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది. ఇదీ ఆ చిత్ర విశేషం. మరి ఇన్ని వివరాలు తెలిసిన దర్శకుడు ఆ కథని ఏ విధంగా మలిస్తే - ప్రేక్షకుల్ని తమవైపు తిప్పుకోగలం అని ఆలోచించలేదు. అసలు ఆ ఆలోచనే పెట్టుకోలేదు. రీమేక్ అంటే అక్కడి స్క్రీన్‌ప్లేని ఇక్కడికి తెచ్చుకోవటం అన్న ఒక్క పని మాత్రం చేశాడు. స్క్రీన్‌ప్లే ఏది చెప్తే అది చేసేశాడు. ఎక్కడ కెమెరా అక్కడే అన్నట్టు. దాంతో - ఏ సినిమా చూస్తున్నాం అన్న సందేహం వస్తుంది. కానీ - ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పోనీ- హీరో హీరోయిన్లైనా ‘ఆషికీ-2’ చూశారా? అంటే అదీ అనుమానమే. చూస్తే సరిపోదు.. ఆయా పాత్రల నైజాన్ని మనసులో జీర్ణించుకోవాలి. అదీ చేసినట్టు కనిపించదు. ఆషికీ-2లో ప్లస్ పాయింట్ల నన్నింటినీ - ఏటి వదిలేసి.. స్క్రీన్‌ప్లే అన్న మహదాయుధంతో ‘ప్రేమ’ యుద్ధానికి బయల్దేరారు. అక్కడా బోర్లా పడ్డారు.
లవ్‌స్టోరీకి ఆయువుపట్టు - హీరోహీరోయిన్లు అన్నది తెలిసిందే. వారిద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ పుట్టకపోతే - రొమాన్స్ పండదు. ఆ విషయం తెలిసీ - అతి పేలవమైన నటనతో ప్రేక్షకుల్ని చిత్ర హింసలకు గురి చేస్తారు. ‘వౌనమేలనోయి’ సినిమాతో పది-పనె్నండేళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సచిన్ జోషి - కొన్నాళ్లు ఒకటీ రెండు సినిమాలు చేసి - మళ్లీ ఇలా ప్రత్యక్షమయ్యాడు.
ఇతగాడి నటనలో ఎంపిక పెట్టాల్సిందేం లేదు. ఎందుకంటే- ఏ భావమైనా ఒకేలా పలుకుతుంది. కాబట్టి- మనకి మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. అంతేగానీ - నవరస భావాల్ని పలికించటం అతడికి తెలీదు. పాఠాలు చెప్పినా వేస్ట్. మద్యానికి బానిసై కెరీర్‌ని నాశనం చేసుకునే బరువైన కేరెక్టర్‌ని ఇతగాడు చాలా తేలిగ్గా తీసుకున్నాడు. దాంతో కేరెక్టర్ తేలిపోయింది. నజియా ఫర్వాలేదనిపిస్తుంది. కానీ- ఇటువంటి కథలకు గ్లామర్‌తోపాటు - సరైన భావాల్ని పలికించ గలగాలి. అంటే ఏమిటని అడిగినా అడగొచ్చు కాబట్టి- దీనికీ అడ్జస్ట్ అయిపోవటమే. రావు రమేష్, శశాంక్ తమ పని తాము చేసుకుపోయారు.
ఫొటోగ్రఫీ కొంతలో కొంత నయం. బాలీవుడ్ ట్యూన్స్‌ని యధాతథంగా దింపేశారు గానీ - సాహిత్యం ఏదో తెచ్చి పెట్టుకొన్నట్టుగా ఉంది. కుదర్లేదు. ఇక ఏ శాఖ గురించీ ప్రస్తావించనక్కర్లేదు.
పూరీ శిష్య బృందంలో ఒకడైన జయ రవీంద్ర ఈ సినిమాకి ఏ మాత్రం కష్టపడలేదనిపిస్తుంది. యధా స్క్రీన్‌ప్లే - తథా జయ.

No comments:

Post a Comment