Pages

Saturday, 30 August 2014

శిక్ష (కథ)

  • -ఎ.పుష్పాంజలి
  • 16/11/2013
ఆంధ్రభూమి కథల పోటీలో ఎంపికైన రచన
........................
మా అమ్మతో ‘‘మీరు పంపిన సొరకాయ
చాలా బాగున్నదండీ. లేత కాయ’’ అన్నది. దాంతో మా అమ్మకి విషయం అర్థమై నాకు తన పద్ధతిలో శిక్ష వేయబోయిందమ్మ. ఆ సమయంలో నాన్న వచ్చి, అంతా విని
‘‘దీన్ని నే చూస్తాను. నువ్వెళ్లి ఇంకేదైనా పని చూసుకో’’ అని నన్ను దగ్గరగా తీసుకున్నారు.
మరుసటి దినం నాన్న నాకు నాలుగు
సొరగింజలు ఇచ్చి, ‘‘శరత్! ఈ గింజలు వెయ్యి. అవి మొలిచాక పైకల్లించు. కాయలు కాశాక, వీరయ్య కాయలు వీరయ్యకి ఇచ్చెయ్యి. మిగతావి మనకీ,ఇరుగు పొరుగులవారికి
సరిపోతాయ్’’ అన్నారు.
..............................
‘‘ఆ పేపర్లూ పుస్తకాలు అట్లా సర్దిపెట్టు అలివేలూ!’’ అని అమ్మ చెప్తోంటే వినిపించుకోకుండా విసవిసా వెళ్లిపోయింది పనిమనిషి అలివేలు.
‘‘దీనికీమధ్య చాలా పొగరెక్కిందండీ’’ నాన్నతో అంది అమ్మ. ఆయన ‘ఊ’ అనిగాని, ‘ఆ’ అనిగాని అనలేదు. పుస్తకంలోంచి తలెత్తలేదు.
నాల్రోజుల తర్వాత నీర్సంగా వచ్చి కూలబడ్డది అలివేలు.
‘ఏమైంది’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘ఏమోనమ్మా, తల తిరగతా వుంది. వొల్లు సోదీనంలో లేదు’ అంటూ చేరగిలబడ్డది.
అందరూ ఉన్నా ఎవరు లేని నిర్భాగ్యురాలు అలివేలు.
‘‘సంపాదించిందంతా నీ కొడుకులకి ధారిపోస్తివిగా. పో.. పొయ్యి వాళ్ళనే అడుక్కో’’ కోపంగా అందమ్మ.
‘‘అనితా! ఏమిటా మాటాలు! నువ్వు సూటిపోటి మాటలనాల్సిన సమయమా ఇది?’’ అన్నారు నాన్న. తర్వాత ఆయన అలివేలమ్మను హాస్పిటల్‌కి తీసుకెళ్లి డాక్టర్ ఫీజులిచ్చి, మందులు కొనిచ్చి తీసుకొచ్చారు. అమ్మ కోపమంత ఏమైందో అలివేలమ్మకు పళ్లు, సూప్ పాకెట్లు వగైరాలు కొని పూట పూటా అన్నం కూడా పెట్టింది.
ఆనాటినుంచీ ఈనాటికీ మా ఇల్లు వదలలేదు అలివేలమ్మ. నాన్న పోయారు. అమ్మ రిటైరై ప్రస్తుతం నేనుండే వూళ్ళో నావద్దే ఉంటోంది.
అంత పొగరుగా వుండే అలివేలమ్మతో అంత మార్పెలా వచ్చింది? ఈనాటికీ మా ఇంటికీ కాపలా ఉంటూ, వెలుపలి గదిలో ఉంటోంది మా ఇంట్లోనే.
అమ్మ వృత్తిరీత్యా ఉపాధ్యాయని. నాన్న బాంకు ఉద్యోగి. అమ్మది టీచరు హృదయం. ఆమె క్రమశిక్షణా రాహిత్యాన్ని ఇసుమంత కూడా సహించగలిగేది కాదు.
ఆమె మాకిచ్చే పనిష్మెంట్లు చిత్ర విచిత్రంగా ఉండేవి. మాట్లాడకుండా ఒక మూల నించోడం, ఉత్త డ్రాయర్‌తో ఎండలో నించోవాలి. లేదా మేడ మెట్లమీద ఒంటరిగా కూర్చోవాలి... ఇలాంటివి! అమ్మ ఇలాంటి పనిష్మెంట్లివ్వడం నాన్నకి ఇష్టముండేదికాదు.
‘‘అనితా! మనుషుల్ని భౌతికంగా శిక్షిస్తే ఏం ప్రయోజనం? వాళ్ళలో మానసికంగా మార్పు తేవాలి గాని’’ అంటుండేవాడు.
ఆ వయసులో ఆ ‘మానసికం, భౌతికం’ అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు.
నాన్న విధించే శిక్షలు వేరుగా ఉండేవి.
మా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వీరయ్య ఇంటిమీదికి అల్లించిన సొరపాది తాలూకూ విరివిగా కాచిన కాయలు మేమంతా కలిసి, పోటీలమీద కోసేశాం.. నా కాయ కూడా ఇంటికి తీసుకువెళ్లకుండా పక్కింటావిడకిచ్చేశాను.
ఆమె ఊరుకోకుండా మా అమ్మతో ‘‘మీరు పంపిన సొరకాయ చాలా బాగున్నదండీ. లేత కాయ’’ అన్నది. దాంతో మా అమ్మకి విషయం అర్థమై నాకు తన పద్ధతిలో శిక్ష వేయబోయిందమ్మ. ఆ సమయంలో నాన్న వచ్చి, అంతా విని ‘‘దీన్ని నే చూస్తాను. నువ్వెళ్లి ఇంకేదైనా పని చూసుకో’’ అని నన్ను దగ్గరగా తీసుకున్నారు.
మరుసటి దినం నాన్న నాకు నాలుగు సొరగింజలు ఇచ్చి, ‘‘శరత్! ఈ గింజలు వెయ్యి. అవి మొలిచాక పైకల్లించు. కాయలు కాశాక, వీరయ్య కాయలు వీరయ్యకి ఇచ్చెయ్యి. మిగతావి మనకీ, ఇరుగు పొరుగులవారికి సరిపోతాయ్’’ అన్నారు.
నాకాగింజలు నాటడానికి, సరైన స్థలం వెదకడానికే ఆరు రోజులు పట్టింది. పాదిచేసి, గింజలు నాటి ఎరువువేశాను. ప్రతిరోజూ నీళ్లు పోశాను. ఒకనాడు నా కృషి ఫలిస్తుందన్నదానికి నిదర్శంగా బుజ్జి బుజ్జి మొక్కలు తలెత్తాయి. చూస్తుండగానే అవి మారాకు తొడిగాయి. మొలిచింది రెండే అయినా సరా సరా పైకి రాసాగాయి. నేను వాటికి పురికొసలు కట్టి, పైకి అల్లించాను. అవి బిరబిరా టెర్రస్‌మీదికి పాకాయి. ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించింది నేనేనన్నట్టు సంతోషించాను. చూస్తుండగానే పూతా, పిందె రావడం మొదలైంది.
ఈ సొరచెట్ల పెంపకంలో ముఖ్య సలహాదారుగా నాన్న వ్యవహరించారు.
‘‘చెట్లు పెంచడంలో ఇంత ఆనందముంటుందని నాకు తెలీదు. మరి పొలాలూ తోటలు ఉండే రైతులింకెంత ఆనందంగా ఉంటారో’’ అనుకున్నాను. అప్పట్లో నాకు దాని వెనుక ఉన్న విషాదం తెలియదు కదా!
సొరపిందెలు నిడుపాటి కాయలుగా ఎదిగాయి. ఒక రోజు నాన్న చూసి ‘‘ఇక కొయ్యొచ్చు శరత్, రేపు కోద్దాం’’ అన్నారు.
మర్నాడు పొద్దునే కాయలు కోద్దామని ఉత్సాహంగా వెళ్ళాను. చెట్టున ఒక్క కాయ కూడా లేదు. రాత్రే ఎవరో మొత్తం కోసేశారు.
నా కళ్ళనుంచి నీళ్లు టపటపమని రాలాయి.
నాన్న నా కన్నీళ్లు తుడిచి ‘‘బాధపడకు నాన్నా! మరి ఆవాళ తన చెట్టు కాయలు పోయినప్పుడు వీరయ్య ఇలాగే ఏడ్చి వుంటాడుగా! చెట్టు మళ్లీ కాస్తుందిలే’’ అన్నారు.
నాన్న నాతో సొరచెట్టు ఎందుకు వేయించారో తెలిసింది.
ఇది శిక్షణ కాదు శిక్ష!
అది మొదలు నాకు అమ్మ శిక్షలకు, నాన్న శిక్షలకు మధ్య తేడా అర్థమైంది. నేనూ నాన్న పద్ధతే కొనసాగించదలచుకున్నాను.
కాలేజీలో అందమైన ఆనందిని పరిచయమైంది. ఆమెతో నా పరిచయం కొంతమందిలో జెలసీ జ్వలింపచేసింది. ఒకరోజు కాలేజీకి వెళ్ళేసరికి గోడలమీద తాటికాయలంత అక్షరాలతో మా ఇద్దరినీ గురించి అసహ్యంగా రాశారు. ఆనందిని నిద్రమాత్రలు మింగింది. హాస్పిటల్‌ల్లో ఆమె కోలుకుంటున్న తరుణంలో ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అన్నాను. అంతకుముందు ఆమె నన్నుగాని, నేను ఆమెనిగాని ప్రేమించుకొని ఎరుగం. కానీ పెళ్లయినాక మేం ఒకర్నొకరం ప్రేమించుకోవడం మొదలుపెట్టాం. ఆనంది ఇప్పుడు ముగ్గురు బిడ్డలకు మంచి తల్లి. ‘మంచి తల్లి’ అనడం అతిశయోక్తి. కాని ఆమె మంచి కోడలు కూడా. ఎందుకంటే మంచి కోడళ్ళు మాత్రం అరుదుగా దొరుకుతారు.
నా పిల్లలు ముగ్గురు మగపిల్లలే. ఆడపిల్లలు లేని దురదృష్టవంతులం మేం. పెద్దాడు తరుణ్, చివరివాడు చరణ్ మంచి వాళ్లుగా పేరు తెచ్చుకున్నారు వాళ్ల నాయనమ్మ దగ్గర. కాని మధ్యవాడు వరుణ్ నాలాగనే అల్లరివాడు. చిలిపివాడు. అమ్మ వాళ్లని క్రమశిక్షణలో పెట్టడమేగాక వాళ్లకి వేమన, సుమతి పద్యాలు, భర్తృహరి సుభాషితాలు నేర్పుతుండేది.
మేం తిరుపతిలో ఉన్నప్పుడు మా దగ్గర ఆనందిని తమ్ముడు అశోక్ ఉండేవాడు. వాణ్ణి కాలేజీలో చేర్చి చదివిస్తున్నాను నేనే.
ఒకసారి అమ్మ పిల్లల్ని తీసుకుని మా అన్న ఇంటికి హైదరాబాద్ వెళ్లింది. ఇంట్లో నేనూ, ఆనందిని, అశోక్ మాత్రం ఉన్నాం. ఒక రోజు నా జేబులోంచి ఐదు వేల రూపాయలు పోయింది.
చేసేది ఏ.సి.టి.వో జాబ్. అయినా లంచాలకు నేను దూరం. కారణం మా నానే్న. ఆ ప్రలోభానికి లొంగకపోవడంవల్లే నేను పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలిగాను.
నేను వాడలేదు. ఆనందిని అలా తీయదు. ఇంట్లో పనిమనుషులు కూడా లేరు. ఎవరు తీసింది క్లియర్‌గా అర్థమవుతున్నా, వౌనంగా ఉండిపోయాను.
ఏమనుకున్నాడో ఏమో ఒక రోజు ‘‘బావా! ఆ పోయిన డబ్బు మళ్లీ దొరికిందా?’’ అన్నాడు.
‘‘లేదురా. ఎవరో మనింట్లో వాళ్లేగా. వాళ్లకెంత అవసరమో ఏమోలే. తీసుకోనీ’’ అన్నాను.
ఈ మాట వాణ్ణి ఎక్కడ తాకిందో ఏమో ‘‘బావా! నన్ను క్షమించండి. ఆ పని చేసింది నేనే. షూస్ వగైరా కొన్నాను’’ అని ఏడుస్తూ నా కాళ్లు పట్టుకున్నాడు.
ఆ తర్వాత వాడు డిగ్రీ, పీజీ అన్నీ చేసేసి ఇప్పుడు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మరెప్పడూ ఇంట్లో డబ్బులు పోలేదు.
‘‘మనిషికి మనసే తీరని శిక్ష
దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష...’’ ఘంటసాల మధురగీతం గుర్తుకొచ్చింది.
ఇప్పుడు మేం ‘కదిరి’లో ఉన్నాం. ఇక్కడే పిల్లలు స్కూల్‌కు వెళుతున్నారు.
నా కొడుకు వరుణ్‌కు పక్కింటి ‘రాజ్’తో స్నేహం ఎక్కువ. ఈ రాజ్ ఒక్కడే కొడుకు కావడంతో గారాబంగా పెరిగాడు. ‘స్పాయిల్డ్ ఛైల్డ్’ యొక్క లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు. పైగా వాడు ‘దొంగ’ అన్న విషయం కూడా నాకర్థమైంది. తన వయసువాడైన తరుణ్‌తో స్నేహం చెయ్యకుండా వరుణ్‌తో ఎందుకు ఎక్కువగా తిరుగుతాడో కొన్నాళ్లకు అర్థం కాలేదు.
ఒకరోజు లెక్కలు చెపుతుండగా నా పెన్ తీసి తన జేబిలో పెట్టుకున్నాడు రాజ్. అడిగితే ‘సారీ అంకుల్, మర్చిపోయి జేబులో పెట్టుకున్నాను’ అంటూ తిరిగిచ్చాడు.
ఇంగ్లీషువాడు పోతూ పోతూ ఈ ‘సారీ’, ‘్థంక్స్’ అన్న వెధవ పదాలు రెండు మన మొఖాన కొట్టిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో వస్తువులు పోసాగాయి. టార్చిలైట్, ఫ్లవర్‌వాజ్, షార్ప్‌నర్స్, పెన్స్, నోట్‌బుక్స్... ఇలా.
అమ్మ ‘‘ఆ రాజ్‌గాడితో తిరిగితే మీకందరికీ వళ్లు చీరేస్తాను’’ అంటూ తన టైప్ పనిష్మెంట్లు ఇస్తోంది. నేనేమీ మాట్లాడను. ‘అమ్మ ఇష్టం జరగనీ. ఆమె అందరికీ జగజ్జననీ’ అనుకునేవాణ్ణి.
మా సంసారం ‘అత్తెసరు’ సంసారమే. ఈ అత్తెసరు సంసారంలో కరెంటు బిల్లు, గ్రాసరీ లాంటి అవసరాల కోసం నా డెస్క్‌లో పెట్టిన వెయ్యి రూపాయల నోట్ మిస్ అయింది.
అమ్మ, ఆనందీలను అడగాల్సిన అవసరమే లేదు. రాజ్ ఆ రూములోకి రాడు. మూడు రోజులు తర్జన భర్జనలు జరిగాయి.
నాలుగోనాడు నేను వస్తుంటే, చలపతి ఆపాడు. వాడు నా క్లాస్‌మేట్. ఈ ఊరికి ఇల్లరికపుటల్లుడై వచ్చి, మా ఇంటికి నాలుగిళ్ళవతల ఫ్యాన్సీ షాపుపెట్టుకున్నాడు.
‘‘ఒరే శరత్. మీ రెండోవాడు వెయ్యి రూపాయల నోటు తెచ్చి ఒక రూపాయికి చాక్‌లెట్లివ్వండంకుల్’’ అని నా చేతికి వెయ్యి రూపాయల నోటిచ్చి వెళ్లాడు. వాడి పక్కన రాజ్ కూడా ఉన్నాడు. ఆ చిల్లర కోసం రాజ్ రోజూ తిరుగుతున్నాడు’’ అన్నాడు నాకానోటిస్తూ.
విషయం అర్థమైంది. అమ్మ ఆనందినీకు చెప్పాను. ‘‘ఉండు, బెత్తం తెస్తా, వాడి వీపు చీరెయ్యి’’ అంటూ వెళ్లింది అమ్మ. కాసేపాలోచించి ఆనందిని ఇంట్లో అందరినీ సమావేశపరిచింది.
‘‘రేపట్నించి మీ నాన్న ఉండడు’’ అంది పిల్లలతో.
‘‘ఎక్కడికెళ్తాడు’’ అడిగాడు.
‘‘మనం కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, గ్రాసరీ బిల్లూ కట్టలేదు. అందుకోసం నాన్న ఎత్తిపెట్టిన వెయ్యి రూపాయలు దొంగిలించబడినాయి. కాబట్టి పోలీసులొచ్చి బిల్లు కట్టనందుకు నాన్నని తీసుకెళ్లి జైల్లో పెడతారు’’.
ఆ మాటతో వరుణ్ గట్టిగా ఏడుస్తూ ఆనందిని కాళ్లమీద పడ్డాడు. ‘‘అమ్మా. నేనేనమ్మా ఆ దొంగని. నన్ను జైల్లో పెట్టించమ్మా. నాన్ననొద్దు’’ అంటూ హృదయవిదారకంగా ఏడుపు మొదలెట్టాడు. ఆనందిని కళ్ళల్లో నీళ్ళు. అంతా చూస్తున్న అమ్మ చేతిలో బెత్తం కింద పడ్డది.

No comments:

Post a Comment